26, జూన్ 2011, ఆదివారం

అకారాది తెలుగు సినిమా పాటలు

తెలుగు సినిమా పాటలను

అకారాదిగా (నిఘంటువును అనుసరించి) కూర్చి,

మీకు వినిపించే క్రమంలో

రెండు వర్గాలుగా విభజించడం,

దాని ప్రకారం మొదట భక్తిగీతాలను నాగస్వరంలో పొందుపరచడం జరిగింది.

ఇప్పుడు మిగిలిన రస గీతాలను వినిపించడానికి

మరొక ప్రయత్నం.

మీ ఆనందం కోసం.






శుభం భూయాత్

20, జూన్ 2011, సోమవారం

సినీ భక్తి గీతాలు - చివరిభాగం.

సినీ భక్తి గీతాలు - చివరి అంకంలోకి స్వాగతం. నమస్కృతులు.

య ర ల వ లు పూర్తి అయ్యాయి.

'శ' 'ష' 'స' 'హ' లలో పాటలు వినడానికి ముందు ఒక మాట.

ష అక్కరానికి సంబంధించి, ఒక్క పాట కూడా లభ్యం కాలేదు.

మిగిలిన అక్షరాలకు సంబంధించి లభించిన పాటలలో

ఎక్కువమందికి నచ్చేవనుకొన్నవాటిని కూర్చాను.


ఇక వినండి.






శుభం భూయాత్

19, జూన్ 2011, ఆదివారం

సినీ భక్తి గీతాలు - 7

స్వాగతం , సుస్వాగతం. నమస్కారం.

'ప' వర్గు పూర్తి అయ్యింది కదా!

"య - ర - ల - వ" లతో మొదలయ్యే పాటలు సిద్ధమయ్యాయి.

ఆలస్యమెందుకు? వినెయ్యండి.





అసలు ఈ కాన్సెప్ట్ మీకు నచ్చిందా?

మీ అభిప్రాయం తెలియజేయండి.


శుభం భూయాత్

18, జూన్ 2011, శనివారం

సినీ భక్తి శ్లోక గీతాలు - 6

రండి రండి, స్వాగతం. ఉభయకుశలోపరి.

'ప' వర్గులోకి వచ్చాం. ( ప ఫ బ భ మ )

ఉన్నంతలో ఎక్కువ పాటలు లభ్యమయ్యాయి.

ఇక మీరు విని, ఆనందించడమే తరువాయి.











శుభం భూయాత్

15, జూన్ 2011, బుధవారం

సినీ భక్తి గీతాలు - 5

నమస్తే, పునః స్వాగతం.

'క' , 'చ' , వర్గులు పూర్తయ్యాయి.

'ట' వర్గులో ఒక పాటే లభించింది.

వినండి.



'త'వర్గులో ( త థ ద ధ న )

పాటలు ఇవే. ఇక వినండి.





శుభం భూయాత్

13, జూన్ 2011, సోమవారం

సినీ భక్తి గీతాలు - 4

నమస్తే , స్వాగతం.

క వర్గం పూర్తయ్యింది. ( క ఖ గ ఘ ఙ్ )

చ వర్గంలోకి వచ్చాం. ( చ ఛ జ ఝ ఞ్ )

కొన్ని గీతాలే దొరికాయి.

ఇదిగో, విని ఆనందించండి.









శుభం భూయాత్

12, జూన్ 2011, ఆదివారం

సినీ భక్తి గీతాలు - 3

స్వాగతం, నమస్తే.

'గ' గుణింతంతో తక్కువ పాటలు లభ్యమయ్యాయి.

చిత్తగించండి.




శుభం భూయాత్

11, జూన్ 2011, శనివారం

సినీ భక్తి పద్య గీతాలు - 2

వచ్చారా!

రండి, నమస్తే.

ఇప్పుడు, 'క' గుణింతంతో మొదలయ్యే పద్యాలను, గీతాలను వినిపిస్తున్నాను.

'క' నుండి 'కౌ' వరకు కొన్నే లభ్యమయ్యాయి.

మిగిలిన పాటలు సూచించ వేడుకోలు.



ఇక వినండి, ఆనందించండి.























విన్నారా, బాగున్నాయా ?

వెళ్లొస్తానంటారా? వెళ్లి రండి. మీ అమూల్య అభిప్రాయం తరువాత తెలియజేయండి.

నమస్తే.

శుభం భూయాత్

10, జూన్ 2011, శుక్రవారం

అకారాది తెలుగు సినీ భక్తి గీతాలు - 1

తెలుగు నిఘంటువు ప్రకారం

అకారాది క్రమంగా పాటలను ( అక్షరానికి ఒకటి )

సేకరించి, అందరికీ వినిపిస్తే బాగుంటుందనిపించింది.

మొదట భక్తిగీతాలతో మొదలుపెడుతున్నాను.

అయితే,

అం, అ, ఆం, ఆ, ఇం, ఇ, ఈం, ఈ, ఉం, ఉ, ఊ, ఋ,

ఎం, ఎ, ఏ, ఐం, ఐ, ఒం, ఒ, ఓం, ఓ, ఔ - ఈ అచ్చులలో

అం, అ, ఆం, ఆ, ఇం, ఇ, ఈ, ఎం, ఎ, ఏ, ఐ, ఒ, ఓం, ఓ, లతో

మొదలయ్యే పాటలే దొరికాయి.

మిగిలినవి ఎవరైనా దయామతులైన సంగీతప్రియులు సూచిస్తే,

కళ్లకద్దుకొని చేరుస్తానని మనవి చేస్తున్నాను.


దొరికిన వాటిలోంచి, ఏరి, (నాకు నచ్చినవి) గుది గుచ్చి, ఒక దండగా తయారుచేశాను.

ఈ పాటలను విన్న ఔత్సాహికులు, (ఉత్సాహవంతులు)

ఆనందించిన మీదట, సూచనలు చెయ్యమని మనవి.










పాటలన్నీ పూర్తిగా వినడానికి మీకు సమయం ఉండచ్చు ఉండకపోవచ్చని ,

కేవలం పల్లవులను మాత్రమే ఉంచి, వినిపిస్తున్నాను.




శుభం భూయాత్

3, జూన్ 2011, శుక్రవారం

కాలచక్రం

గోవిందం భజ - 13


దినయామిన్యౌ సాయంప్రాత

శ్శిశిరవసంతౌ పున రాయాతః ,

కాలః క్రీడతి గచ్ఛ త్యాయు

స్తదపి న ముంచ త్యాశావాయుః . 12


" రేయింబవళ్లు, మాపువేకువలు, శిశిరవసంతర్తువులు, మళ్లీ మళ్లీ వస్తున్నవి.

(ఈ రీతిగా) కాల( చక్ర )o పరిభ్రమిస్తున్నది. ఆయుస్సు గతిస్తున్నది.

అయినప్పటికీ, ( ఇట్లు ఎన్ని గతిస్తున్నా ),

ఆశ అనే వాయువు మాత్రం విడువలేదు.

( కొంచెం కూడా చలించక ( నిన్ను) ఆశ్రయించుకొనే ఉంది.) "


నా(గ)స్వ(రం)వ్యాఖ్య: -


కాలం పరుగెడుతోంది.

రాత్రి వస్తోంది. పగలవుతోంది.

సాయంకాలం వస్తోంది. ప్రభాతమౌతోంది.

శిశిరం వస్తోంది. వసంతాన్నిచ్చి వెళ్తోంది.

బండిచక్రంలా ఒకదానివెంట ఒకటి వస్తున్నాయి. పోతున్నాయి.

రెప్పపాటుకాలం (నిమిషం) నుంచి,

కాష్ఠ ( 18 రెప్పపాట్లకాలం ) కల ( 30 కాష్ఠలు )

రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, ఋతువులు, సంవత్సరాల దాకా ,

ఇంకా, తెలియనంత అనంతకాలం, చక్రంలా తిరుగుతూంటుంది.

ఈ సందట్లో ఆయువు తగ్గిపోతూంటుంది.

కానీ

నిజమే.

ఆయువు క్షణం క్షణం తరిగిపోతూ, వీడిపోతున్నా,

ఆశ / తృష్ణ అనే వాయువు వదలక, అంటిపెట్టుకొనే ఉంటుంది.

ఈ ఆశ అనేది చాల చెడ్డది.

ఏ విషయం గురించి, ఆశ పట్టుపడుతుందో తెలియదు.

అంటే ఎప్పుడు ఏ విషయం మీద ఆశ జనిస్తుందో తెలియదు.

మోక్షమార్గాభిముఖుడైనవాడిని,

దాట శక్యం కాని ఘోరమైన సంసారం అనే అరణ్యం యొక్క మధ్యభాగంలోకి

త్రోసివెయ్యగల శక్తి ఆశావాయువుకు ఉంది.

అలాంటి ఆశను కోసే శక్తి గోవిందునికి ఉంది.

గోవిందునికే ఉంది.

కాన గోవిందుని భజించు.

అని జగద్గురు శ్రీపరమహంసపరివ్రాజకాచార్య శ్రీమచ్ఛంకరభగవత్పాదులవారి

దివ్యోపదేశం.


ఇంగ్లీషు అనువాదం Sivananda Ashram వారి సౌజన్యంతో.

Day and night, dawn and dusk, winter and spring,
again and again come and depart.
Time sports and life ebbs away.
And yet, one leaves not the gusts of desires.


ద్వాదశమంజరికాభిరశేషః కథితో వైయాకరణస్యైషః,

ఉపదేశో౭భూద్విద్యానిపుణైః శ్రీమచ్ఛంకరభగవచ్చరణైః .


" విద్యానిపుణులైన శ్రీశంకరాచార్యులవారు,

వ్యాకరణశాస్త్రం వల్లె వేస్తున్న వైయాకరణునికి,

ద్వాదశశ్లోకాలనే పూగుత్తులతో ఈ ఉపదేశం చేశారు."


ఇతి శ్రీగురుశంకరవిజయే శ్రీమచ్ఛంకరభగవత్పాద వైయాకరణసంవాదే పరమహంసపరివ్రాజకాచార్యవర్యశ్రీమచ్ఛంకరాచార్యోపదిష్టద్వాదశమంజరికాస్తోత్రం.


మొత్తం 12 శ్లోకాలతో మానవాళిని తరింపజేసిన,

శంకరుల ద్వాదశమంజరికాస్తోత్రం ఇంతటితో సంపూర్ణం.


మీకు గుర్తుందా!

ఆశను వదలమంటూ మొదటిశ్లోకం మొదలుపెట్టిన శంకరులు,

ఆశ వదలదు కాన జాగ్రత్త. గోవింద స్మరణతో ఆశను జయించు. అంటూ ముగించారు.



కేవలం శంకరుల వారి శ్లోకాలు కొన్ని సుబ్బులక్ష్మిగారి మధురగళంలో వినండి.



సర్వేశ్వరుడు ఇతడు. ఒకడే. అన్న అన్నమయ్యసంకీర్తనను విని, సర్వేశ్వరుని భజించండి.

భక్తిసుధారసంలో ఈదులాడండి.




శుభం భూయాత్

2, జూన్ 2011, గురువారం

బ్రహ్మపదం

గోవిందం భజ - 12


మా కురు ధనజనయౌవనగర్వం

హరతి నిమేషా త్కాల స్సర్వం,

మాయామయ మిద మఖిలం హిత్వా

బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. 11




" ధనం, పరిజనం, యౌవనం ( వీనివల్ల ఐన గర్వాన్ని చేయకు.) ఉన్నాయని గర్వించకు.

కాలం, రెప్పపాటులో సర్వాన్నీ హరిస్తుంది.

మాయతో నిండిన ఈ సమస్తాన్ని ( సర్వ విషయ సమూహాన్ని ) పరిత్యజించి,

పరమాత్మపదాన్ని ( స్థానాన్ని ) తెలిసి, ఆ బ్రహ్మంతో ఐక్యమొందు. "




నా(గ)స్వ(రం)వ్యాఖ్య: -



శంకరులు, ధనం జనం యౌవనం - ఈ మూడింటిలో గర్వం వద్దంటున్నారు.

అనగా ధనగర్వం, జనగర్వం, యౌవనగర్వం కూడదంటున్నారు.

గర్వం అంటే అహంకారం, అహంభావం, అహం, ఉద్ధతి, ఉబ్బు, ఔద్ధత్యం, కండకావరం,

క్రొవ్వు, గబ్బు, గీర, టెక్కు, దర్పం, పొంగు, పొగరు, బిరుసు, మదం, మిడిసిపాటు.

ఇన్ని పర్యాయపదాలు చెప్పడం ఎందుకు అంటే,

దాని ఔద్ధత్యం బాగా అర్థం అవుతుందని.

విచిత్రం ఏమిటంటే, గర్వానికి కౌరవసంతతి లాగ 101 సమానార్థక పదాలున్నాయి.

గర్వంతో విర్రవీగితే, దుర్యోధనాదుల్లా అవుతారని పై సంఖ్య సూచిస్తోంది కదా!

సరే, విషయంలోకి వస్తే,

" నేను అందరికంటే ఉత్కృష్టుణ్ణి,/,గొప్పవాడిని. తక్కినవారు నాకంటె తక్కువ."

అని తన్ను తాను పూజించుకొని, ఇతరులను అవహేళన చేసే,

చిత్తౌద్ధత్యానికే గర్వం అని పేరు.

పుష్కలంగా ధనం ఉందనో,

( అందువల్లే చేరారని తెలుసుకోలేక ) తన చుట్టూ నిత్యం మూగే జనాన్ని చూసి,

తనకు జనబలం ఉందనో,

( యుక్తాయుక్తవిచక్షణాజ్ఞానం, అనుభవజ్ఞానం తక్కువగా ఉండే వయసని తెలియక )

గొప్పయౌవనం/మంచి ప్రాయం తనకుందనో,

ఇక తిరుగేమిటని విర్రవీగితే, భంగపడక తప్పదు. తర్వాత పతనమవ్వక తప్పదు.

అలాగే కులగర్వం, రూపగర్వం, విద్యాగర్వం, బలగర్వం, మొదలైన గర్వాలు కూడా పనికిరానివని గ్రహించాలి.

ఈ ధనజనయౌవనకులరూపవిద్యాబలాదుల్ని, వాటితో ఏర్పడిన గర్వాల్ని,

చరాల్ని, అచరాల్ని, సర్వప్రపంచాన్ని,

కాలం, నిమిషంలో హరిస్తుంది. మింగేస్తుంది. నాశనం చేస్తుంది.

కాలం కడుపులోకి అన్నీ చేరవలసిందే. ఆపగలిగేవారెవరూ లేరు.

ఈ ప్రపంచం మాయతో నిండినది.

మాయ అంటే, అవిద్య , మోసం, అసత్యం, ఇంద్రజాలం.

విద్య లేకపోవడం అవిద్య. విద్య అంటే జ్ఞానం. అవిద్య = అజ్ఞానం. / తెలియకపోవడం.

ప్రకృతిలో కనబడేదంతా సత్యం, శాశ్వతం అనుకోవడమే మాయ.

ఈ ప్రపంచమంతా మాయగా గుర్తించి, విషయసమూహాన్నివిడిచిపెట్టాలి.

విషయాలు అంటే, పదకొండు ఇంద్రియాలచేత పొందబడేవి.

చర్మం, కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు, - ( 5 జ్ఞానేంద్రియాలు )

వాక్కు, పాణి, ( మనికట్టు మొదలుకొని వ్రేళ్లతో కూడిన చెయ్యి. ) పాదం,

పాయువు, ఉపస్థం ( జననవిసర్జకావయవాలు ) - ( 5 కర్మేంద్రియాలు ) + మనస్సు.

మనస్సు, జ్ఞానేంద్రియాలు కలసి, శబ్ద స్పర్శ రూప రస గంధాలనే విషయాలను,

కర్మేంద్రియాలు ఆయా కర్మలద్వారా ( పేర్లను బట్టి ) ఏర్పడిన విషయాలను

జీవునకు అందిస్తూంటాయి.

ఈ విషయాలే అనేక వాంఛలకు కారణమౌతూంటాయి.

ప్రపంచమంతా ఈ విషయాలతోనే నిండి ఉంది.

ఇంద్రియాలు గుఱ్ఱాలైతే , మనసు వాటిని నడిపించే సారథి. ( డ్రైవర్. )

ప్రయాణం అన్నది డ్రైవర్ ఇష్టమా ? యజమాని ఇష్టమా ?

కాని ఇక్కడ డ్రైవర్ ఇష్టం ప్రకారం జరుగుతోంది.

వినాలంటుంది. చూడాలంటుంది. తాకాలంటుంది. రకరకాల రుచులు కావాలంటుంది.

(సు)వాసనలు ఆఘ్రాణించాలంటుంది. ఇంకా ఏవేవో కావాలి కావాలి అంటుంది మనసు.

మరి ఇది ఎంత విచిత్రం.? దాని మాట వింటే అంతే.

ఇదే తెలుసుకోవాలి.

అందువల్ల అనంతమైన కాలగర్భంలో కలసిపోయే

మాయామయమైన ఈ సమస్త విషయజాలాన్నంతా విడిచిపెట్టి,

శాశ్వతమైన పరబ్రహ్మస్థానమేదో తెలుసుకొని, దాన్ని చేరమని, గురూపదేశం.




ఎంతో రసికుడు దేవుడు అంటూ లోకంలో ప్రతి వస్తువులోనూ,

ప్రియురాల్ని చూసిన రాజారమేశ్, చివరికి,




అన్నాడంటే అదంతా కాలమహిమ.


ఇంగ్లీషు అనువాదం Sivananda Ashram వారి సౌజన్యంతో.

Take no pride in your possession, in the people at your command, in the youthfulness that you have.
Time loots away all these in a moment.
Leaving aside all these, after knowing their illusory nature,
realize the state of Brahman and enter into it.


శుభం భూయాత్

1, జూన్ 2011, బుధవారం

" సం " సారం

గోవిందం భజ - 11


వయసి గతే కః కామవికార

శ్శుష్కే నీరే కః కాసారః,

క్షీణే విత్తే కః పరివారో,

జ్ఞాతే తత్త్వే క స్సంసారః . 10



" వయసు గతించిపోగా, కామవికారం ఎక్కడిది ?

నీళ్లు ఎండిపోగా, కొలను ఎక్కడిది ?

ధనం తగ్గిపోగా, పరివారం ఎక్కడిది ?

తత్త్వం ( అసలు విషయం, నిజం, సత్యం = పరమాత్మ) తెలియబడుతూండగా,

(ఇక) సంసారం ఎక్కడిది ?"




నా(గ)స్వ(రం)వ్యాఖ్య: -



" తరుణ స్తావ త్తరుణీసక్తః " అని, ఇంతకుముందు చెప్పినట్లు,

వయసు/యౌవనం ఉన్నంతవరకే కామవికారం ఉంటుంది.

ముసలితనంలో ఉండదు.

అంటే యౌవనం పోగానే స్త్రీలంటే ఆసక్తి కూడా పోతుంది.

అయితే సూర్యుడు అస్తమించగానే చీకటి రానట్లు,

యౌవనం పోయిన వెంటనే కామాసక్తి పోదు.

అందువల్ల ఇక్కడ యౌవనం అంటే శరీర పటుత్వం అని చెప్పాలి.

శరీర పటుత్వం పోయినప్పుడే మదనవికారం మాయమౌతుంది.

అప్పుడు కూడా శారీరకంగానే పోతుందనాలి.

మానసికంగా ఉరకలెత్తుతూనే ఉంటుంది.

కాబట్టి, కంట్రోల్ చేయాల్సింది దేన్నో, నియంత్రించాల్సిందేదో ఇక వేరే చెప్పనక్కరలేదు.

అధికస్య అధికం ఫలం అన్నట్లు,

మానసిక దోషం, శారీరక దోషం కంటే అధికం.

దానికే అధిక ఫలితం.

కాబట్టి మనసును పరిశుద్ధంగా ఉంచుకోవాలి.

శరీరాన్ని అక్కరలేదా అంటే, అదీ అవసరమే. మానసికశుద్ధికి అదీ తోడ్పడుతుంది.

శరీరం చెరువు అయితే, వయసు అందులోని నీరు.

నీరు ఎండిన చెరువుకు ఉనికి లేదు. ఉనికి ఉందనుకొన్నా ఉపయోగం లేదు.

అయితే ఎండిన చెరువులోకి నీరు, మళ్లీ వచ్చే అవకాశం ఉంది.

కానీ ఒకసారి శరీరం నుండి యౌవనం గతించాక, తిరిగి వచ్చే అవకాశమే లేదు.

ఒకవేళ వస్తే, అన్నవాళ్లకు సమాధానం యయాతి చరిత్ర.

యయాతి చంద్రవంశపు రాజు.

ఒకసారి, మాట తప్పి ప్రవర్తించినందుకు, మామగారైన శుక్రుడు,

వనితాజనహేయంబైన ముసలితనాన్ని పొందమని, యయాతికి శాపమిచ్చాడు.

పోనీలే, రామ, కృష్ణ అనుకొంటాను అనలేదు యయాతి.

ఇంకా కామవాంఛలు తీరలేదు. అన్నాడు.

తెలివైనవాడు కాబట్టి, "మీ కూతురియందు తీరలేదు "అన్నాడు.

అని, ఆయన అనుజ్ఞపొంది, కుమారుల్ని పిలిచి,

నా ముదిమి తీసుకొని, మీలో ఎవరైన మీ యౌవనం నాకు ఇస్తారా? అని అడిగాడు.

పెద్దకుమారులెవరూ అంగీకరించలేదు.

చివరి కుమారుడు, పూరుడు మాత్రం పిత్రాజ్ఞగా అంగీకరించాడు.

ఇద్దరూ, పరస్పరం వయసులు మార్చుకొన్నారు.

యయాతి కొన్ని వేల సంవత్సరాలు, ఇంద్రియభోగాల్లో మునిగి,

ఒకరోజు, ఆయనంతట ఆయనకే ఆత్మజ్ఞానం కలిగి, తేలాడు.

కామవాంఛ ఎలాంటి పనైనా చేయిస్తుందని,

ఎంత అనుభవించినా తృష్ణ తీరటంలేదని, వాపోయాడు.

తాను చేసిన పనికి రోసి, పూరునకు యౌవనం తిరిగి ఇచ్చేసి,

కుమారులకు రాజ్యాన్ని పంచి, తపస్సున తరించాడు.

కామవాంఛలు తీర్చినకొద్దీ విజృంభిస్తూంటాయని, దీనివల్ల తెలుస్తుంది.

ఇంకా వయసుంటే బాగుండనిపించే వారికోసం యయాతి చరిత్రను చెప్పారు.

ఇక ధనం.

ధనం ఉన్నంతవరకే సేవకాదులు ఉంటారు.

అది కోల్పోయాక , వాళ్లూ ఉండరు. దూరమవుతారు.

( అంతే కానీ పోరు. ధనమున్నదని తెలిశాక మళ్లీ ఎలాగోలా దగ్గరవుతారు.)

ఈ విధంగానే, ఏది నిత్యం ? (పరమాత్మ )

ఏది అనిత్యం ? ( పరమాత్మ కంటె ఇతరమైనవన్నీ )

అనే వివేకం కలిగి, ( ఇదే తత్త్వం )

భగవంతుడే నిజం అని తెలుసుకొన్నాక, ఇక సంసారబంధం ఉండదు.

ఉండదంటే ఉండకుండా పోదు.

దానివల్ల కలిగే బాధలు ఉండవు. ఉన్నా, బాధల్లా ఉండవు.

కర్తవ్యాన్ని గుర్తు చేసే ఆజ్ఞల్లా కనిపిస్తాయి. అనిపిస్తాయి.

ఆ ఆజ్ఞలు, నిత్యుడు, శాశ్వతుడూ అయిన పరమాత్మవి అని జ్ఞాపకం చేస్తూంటాయి.

ఆయనను చేరే దారి గురించి తెలుసుకోమంటాయి.

కాలం / ఋతువులు తెచ్చే మార్పులు అంగీకరించవలసిందే అని,

ఆ కాలం పరమాత్మ అధీనం అని కూడా తెలుసుకొన్నదే తత్త్వం.

పుట్టుక వచ్చినట్లే బాల్యం వస్తుంది. కాలగతిలో యౌవనం వస్తుంది.

అంతే సహజంగా వృద్ధాప్యమూ వస్తుంది. ఒప్పుకోకపోయినా తప్పదు.

ఎండాకాలం వస్తే చెరువు ఎండుతుంది. ఉనికిని పోగొట్టుకొంటుంది.

నారికేళ సలిలంలా వచ్చిన ధనం, కరి మ్రింగిన వెలగపండులా పోయి,

పరివారాన్నీ దూరం చేస్తుంది.

కాబట్టి సర్వమూ భగవంతుడే. యౌవనమూ ఆయనే. కామవికారమూ ఆయనే.

నీరూ, కాసారమూ, ధనమూ, పరివారమూ, సంసారమూ, తత్త్వమూ, తీసుకొనేదీ, ఇచ్చేదీ

ఇలా అన్నీ ఆయన స్వరూపంగానే భావించి,

సర్వేశ్వరునిగా ఆయనను ధ్యానిస్తే, భవభయం పోతుంది.

ఇదీ తత్త్వం తెలుసుకో, అని శంకర భగవత్పాదులవారి సదుపదేశం.



ఈ తత్త్వం గురించే " ఎన్నడు విజ్ఞానమిక నాకు " అన్నాడు అన్నమయ్య ఒక దశలో.

వినండి.



ఇంగ్లీషు అనువాదం Sivananda Ashram వారి సౌజన్యంతో.

When youthfulness has passed, where is lust and its play?
When water is evaporated, where is the lake?
When the wealth is reduced, where is the retinue?
When the Truth is realised, where is samsara?



శుభం భూయాత్