28, ఏప్రిల్ 2012, శనివారం

రామాయణం-సుందరకాండ

" రామస్య అయనం రామాయణం ".
రాముని చరిత్ర అనీ, రాముని ప్రవర్తన అనీ అర్థం.
అనగా దీనిని పఠించిన వారు రామునిలా ధర్మశీలురై నడుస్తారని అర్థం.
అసలు వాల్మీకి రామాయణాన్ని రచించిందే దాన్ని చదివినవారు
రామునిలా ప్రవర్తిస్తారని,  ప్రవర్తించాలని.
దీనికి " సీతాయాశ్చరితం " అని పేరుంచినా రామాయణం అన్న పేరే ప్రసిద్ధమైంది.
రాక్షసుడైన మారీచుని చేతనే
 " రామో విగ్రహవాన్ ధర్మః "  అనిపించుకొన్న రాముని చరిత్ర తెలుసుకోవడానికి రామాయాణాన్ని పఠించాలి.
అయితే అది సాధ్యం కాని వారికి తగుమాత్రంగా ఉన్నదున్నట్లుగా
రామాయణాన్నిఅందిద్దామనిపించింది.
అయితే దీనికో పద్ధతి ఉంది.
మహాభారతాన్ని చదవాలంటే మొదట విరాట పర్వం చదవాలి.
తర్వాత ఆదిపర్వంతో ప్రారంభించి, ఆ క్రమంలో విరాటపర్వాన్ని మరల చదివి, కొనసాగించి,
పద్దెనిమిదవదైన చివరిపర్వం పూర్తయ్యాక, మరల విరాటపర్వం చదివి ముగించాలి.
అంటే విరాటపర్వాన్ని మొదట మధ్య చివర చదవాలన్నమాట.
అలాగే భాగవతాన్ని దశమస్కంధంతో ప్రారంభించి, పన్నెండు స్కంధాలూ పూర్తి చేయాలి.
ఇక రామాయణాన్ని సుందరకాండతో మొదలుపెట్టాలి.
ఇది పెద్దలు ఏర్పరచిన ఆచారం.
అందువల్ల మొదట సుందరకాండను మీకు అందివ్వడం జరుగుతోంది.
నాది సాహసమని తెలుసు. రామాయణాన్ని మొత్తం అందించలేకపోయినా
కనీసం సుందరకాండను వివరించగలిగితే చాలు.
హనుమంతుని దయ.

                                            సుందరకాండ

" సుతరాం ఆద్రియత ఇతి సుందరం ".
సుందరం అంటే మిక్కిలి ఆదరింపబడునది , మిక్కిలి సంతోషపెట్టునది అని .
ఈ భాగానికి సుందరకాండ అని పేరు ఉంచడంలో వాల్మీకి ఆంతర్యం.......
మొదట ఆంజనేయుని నోట రాముని గుఱించి విని సీత,
పిమ్మట సీత గుఱించి విని రాముడు మిక్కిలి సంతోషిస్తారని,
ఆంజనేయుని మీదుమిక్కిలి ఆదరిస్తారని అయి ఉంటుందని నా ఆలోచన.
ఇటువంటి సుందరకాండను మీకు క్రింది ప్రణాళిక ప్రకారం అందించదలచుకొన్నాను.
పారాయణకోసం ప్రతీ శ్లోకం.
భావం మాత్రం అవసరమైనంతవరకే.
విజ్ఞానం కోసం కొన్ని పదాల వివరణ.
భావంలో ఆ పదాల వద్ద  చుక్క (*) గుర్తు ఉంటుంది.
రామసుందరం

                                సుందరకాండము - ప్రథమ సర్గ

తతో రావణనీతాయాః           తరువాత (జాంబవంతుని* ప్రేరణతో) శత్రువులను  రూపుమాపగల
సీతాయాశ్శత్రుకర్శనః |         హనుమంతుడు*, రావణుని*చేత అపహరించబడిన సీత* ఉన్న
ఇయేష పదమన్వేష్టుం         తావును వెదకడానికి చారణులు* చరించే మార్గాన (ఆకాశమార్గాన)
చారణాచరితే పథి     ||1*         వెళ్లటానికి నిశ్చయించుకొన్నాడు.

దుష్కరం నిష్ప్రతిద్వంద్వం            | దుష్కరమైన ఎవరూ చేయలేని పనిని చేయగోరి,
చికీర్షన్ కర్మ వానరః |                   | తన మెడను, శిరస్సును నిటారుగా నిలిపి,
సముదగ్రశిరోగ్రీవో                         | వృషభరాజులా ప్రకాశించాడు.
గవాంపతి రివాబభౌ || 2 ||

అథ వైడూర్యవర్ణేషు                     | వైడూర్యపు* రంగు కలిగి,
శాద్వలేషు మహాబలః |                | చల్లగా ఉన్నపచ్చికభూములందు
ధీరస్సలిలకల్పేషు                      | అటూ ఇటూ సుఖంగా సంచరించాడు.
విచచార యథాసుఖమ్ || 3 ||

ద్విజా న్విత్రాసయన్ ధీమా            | ఆ ధీమంతుడు* మహాసింహంలా
నురసా పాదపాన్ హరన్ |             | తిరుగుతూంటే ఆయన వక్షస్థలం తాకిడికి అక్కడి
మృగాంశ్చ సుబహూన్నిఘ్నన్     | వృక్షాలు కూలిపోయాయి. పక్షులు భయపడ్డాయి.
ప్రవృద్ధ ఇవ కేసరీ         || 4 ||         | ఎన్నోమృగాలు అసువులు కోల్పోయాయి.*

నీలలోహితమాంజిష్ఠ                    | నీలం,ఎఱుపు, పసుపు, ఆకుపచ్చ, తెలుపు, నలుపు మొదలైన
పత్రవర్ణైస్సితాసితైః |                      | చిత్ర విచిత్ర వర్ణాలు కల ధాతువు*లతోనూ,
స్వభావవిహితైశ్చిత్రైః                 
ధాతుభిస్సమలంకృతమ్ || 5 ||
      
కామరూపిభిరావిష్ట                      | కామరూపులైన (కోరినరూపాన్ని ధరించగల)
మభీక్ష్ణం సపరిచ్ఛదైః |                   | యక్ష* కిన్నర* గంధర్వ* పన్నగా*లతోనూ,
యక్షకిన్నరగంధర్వైః
దేవకల్పైశ్చ పన్నగైః || 6 || 

స తస్య గిరివర్యస్య                        | అసంఖ్యాకములైన ఏనుగులతోనూ
తలే నాగవరాయుతే |                    | కూడుకొన్న ఆ మహేంద్రపర్వత తలము (క్రింది భాగం) నందుండి,
తిష్ఠన్ కపివరస్తత్ర                         | కొలనులోని ఏనుగులా భాసించాడు.
హ్రదే నాగ ఇవాబభౌ || 7 ||

స సూర్యాయ మహేంద్రాయ           | సూర్యు*నకు, ఇంద్రు*నకు, పవను*నకు, బ్రహ్మ*కు,
పవనాయ స్వయంభువే |               | ఇతర భూతా*లకు నమస్కరించాడు.
భూతేభ్యశ్చాంజలిం కృత్వా           
చకార గమనే మతిమ్ || 8 ||

అంజలిం ప్రాఙ్ము(ఖః)ఖం కృత్వా         | తూర్పుకు తిరిగి,
పవనాయాత్మయోనయే |                | తన తండ్రి వాయువునకు నమస్కరించి*,
తతో హి వవృధే గంతుం                  | ఆ దక్షిణుడు (నేర్పరి) దక్షిణదిశగా వెళ్లదలచి,
దక్షిణో దక్షిణాం దిశమ్ || 9 ||            | దేహాన్ని పెంచాడు.

ప్లవంగప్రవరై ర్దృష్టః                          | సముద్రాన్ని దాట కృతనిశ్చయుడై,
ప్లవనే కృతనిశ్చయః |                     | రామాభ్యుదయం కోసం
వవృధే రామవృద్ధ్యర్థం                     | పర్వదినాల్లో* సముద్రంలా పెరిగాడు.
సముద్ర ఇవ పర్వసు || 10 ||

                                                                                                               -------------------------------------------------------------------------------------------------------


ఇది మొదటి సర్గలో మొదటి శ్లోకం.
శత్రుకర్శనుడు అని ఆంజనేయునికి వాడిన విశేషణం ద్వారా వాల్మీకి,
ఆతడు లంకలో యుద్ధాన్ని చేయబోతున్నాడని సూచిస్తున్నాడు.
రచనలో ముఖ్యమైన విషయాలను మొదటే సూచించడం ఆదికవి ప్రారంభించిన సంప్రదాయం.
అలాగే రావణునిచేత అపహరించబడిన సీత అని అనడంలో కూడా......
 ఆంజనేయుడు రావణుని కలుస్తాడని,
రావణునినుండి తానూ ఏదో అపహరించబోతున్నాడని సూచిస్తున్నాడు.

ఆంజనేయుడు అపహరించినది (చంపినది) రావణుని ఒకవంతు సైన్యాన్ని.
80 వేలమంది రాక్షసులు + వందలకొలది చైత్రప్రాసాద రక్షకులు + ప్రహస్తపుత్రుడు జంబుమాలి +
ఏడుగురు మంత్రిపుత్రులు + వారి సైన్యం + ఐదుగురు సేనాపతులు + వారి మహాసైన్యం +
అక్షకుమారుడు (రావణుని కొడుకు.ఇతడు ఒక్కడే ఒక సైన్యం పెట్టు.)

* జాంబవంతుడు - బ్రహ్మ ఒకసారి ఆవులిస్తే, పుట్టినవాడు. భల్లూకాలకు రాజు. సముద్రాన్ని
తొంభై యోజనాలు మాత్రమే దాటగలనన్నాడు. సీతను చూసి, రాకపోతే సుగ్రీవుడు దండిస్తాడని,
దానికంటే ఇక్కడే ప్రాయోపవేశం చేస్తే మేలని అంగదుడనగా సముద్రాన్ని దాటి రాగలవాడు హనుమంతుడున్నాడని వానిని హెచ్చరించి, హనుమంతుని ప్రేరేపించిన వాడు.

హనుమంతుడు - అంజనాదేవి తనయుడు. అంజన భర్త కేసరి అను వానరుడు. భర్త అనుజ్ఞతో
అంజన వాయుదేవుని సేవించింది. వాయువు ప్రసన్నుడై తన గర్భమందున్న శివుని వీర్యాన్ని
ఆమెకు ఇచ్చాడు. అంతట ఆమె గర్భవతియై కుమారుని కన్నది. ఆయనే ఆంజనేయుడు.

* రావణుడు - విశ్రవసుబ్రహ్మ, కైకసిల పెద్దకొడుకు. అసలు పేరు దశకంఠుడు.
ఒకసారి నందితో వాదులాడి, అహంకరించి, కైలాసపర్వతాన్ని ఎత్తాడు.
శివుడది చూచి, బొటనవ్రేలితో పర్వతాన్ని క్రిందకి అదిమాడు.
దానిక్రింద రావణునిచేతులు పడి నలిగిపోయాయి. ఆ బాధతో లోకాలన్నీ భయపడేటట్లు
పెద్ద రావం (ధ్వని) చేశాడు. అప్పటినుంచి రావణుడనే పేరు వచ్చింది.

* సీత - అంటే నాగటిచాలు. (చాలు=రేఖ)
జనకమహారాజుకు సంతానం లేదు. ఒకసారి భార్య రత్నమాలతో కలసి, పుత్రేష్టి చేయదలచి,
భూమిని దున్నుతూండగా, నాగటిచాలునందు ఒక బంగారపుపెట్టె దొరికింది.
అందులో ఒకబాలిక కనిపించింది. నాగటిచాలునందు దొరకడంవల్ల ఆమెకు సీత అని పేరు పెట్టాడు.

* చారణులు - ఒక దేవజాతి. ఆకాశాన సంచరించేవారు. దేవగాయకులని కొందఱంటారు.

* వైడూర్యం - నవరత్నాల్లో ఒకటి.
విడూరదేశమందు పుట్టిన రత్నం.
దీన్నే పిల్లికన్రతనం అంటారు.
ముత్యం, పద్మరాగం, వజ్రం, ప్రవాళం, మరకతం,
నీలం, గోమేధికం, పుష్యరాగం, వైడూర్యం. ఇవి నవరత్నాలు.

* ధీమంతుడు - ధీ అంటే బుద్ధి. బుద్ధి కలవాడు అని అర్థం.
బుద్ధి మూడురకాలు. స్మృతి, మతి, ప్రజ్ఞ.
స్మృతి అంటే జరిగిన విషయాలను గుర్తుకు తెచ్చుకోగలిగిన శక్తి.
మతి అంటే జరుగుతున్న విషయాలను ఆకళింపు చేసుకోగలిగిన శక్తి.
ప్రజ్ఞ అంటే రాబోయే విషయాలను ముందుగానే గ్రహించగలిగిన శక్తి.
ఈ మూడు శక్తులూ కలిగినవానినే బుద్ధిమంతుడనాలి.
హనుమంతుడటువంటివాడు.

* ఇక్కడ అనుమానం రావచ్చు. అనవసరంగా ఆయనవల్ల చెట్లకు, పక్షులకు
జంతువులకు ప్రమాదం ఎందుకు ఏర్పడిందని.?
కాదు. అవి కీడు కలిగించే చెట్లును, పక్షులును, జంతువులును.
తనవారంతా తాను వచ్చేవరకు అక్కడే మకాం ఉండి, ఎదురు చూస్తూంటారు.
వారి రక్షణకోసం కీడుగల్గించే వాటిని తొలగించాడనుకోవచ్చు.
హనుమ బుద్ధిమంతుడు కాన ఆ పని చేశాడు.

* ధాతువులు - పూర్వపు కావ్యాలు చదివేవారికి పర్వతవర్ణనల్లో ఈ శబ్దం పరిచితమే.
ధాతువంటే మణిశిల. అంటే పైన చెప్పుకొన్న రకరకాల రంగులు కలిగిన రాళ్లే ధాతువులు.

* యక్షులు - పూజింపబడేవారు అని వ్యుత్పత్తి.
ఒక దేవజాతి.
కుబేరాదులు యక్షులు.
కుబేరుడు యక్షులకు రాజు.

* కిన్నరులు - (కింనరులు) ఒక దేవజాతి.
వీరి మొహం గుఱ్ఱపుమొహం. మానవశరీరం.
పాపం చూడ్డానికి ఏవగించుకోనేటట్లుంటారు.

* గంధర్వులు - ఒక దేవజాతి.
సువాసనను పొందువారు అని వ్యుత్పత్తి.
వీరున్న తావున మంచి తావి ఉంటుంది.

* పన్నగాలు - పాములు.
పాదాలచేత పోనివి. పడినట్టుగా పోయేవి.
అనే అర్థాల్లో పన్నగం అనే శబ్దం ఏర్పడింది.

* సూర్యుడు - ప్రాణులను వారి వారి వ్యాపారములందు ప్రేరేపించువాడు. అని వ్యుత్పత్తి.
ఆంజనేయునకు గురువు.
అదితి కశ్యపుల కుమారుడు.
గ్రహాలకు రాజు.
దినకరుడు.
సూర్యుని భార్య సంజ్ఞ.

* ఇంద్రుడు - అంటే పరమైశ్వర్యయుక్తుడు అని.
దేవతలకు రాజు.
తూర్పుదిక్కుకు అధిపతి.
ఇతడును అదితి కుమారుడే.
శచీదేవి ఈయన భార్య.
ఇంద్ర శబ్దం ఒక పదవి అని అంటారు. ఇంద్రులు మారుతూంటారు.

* పవనుడు - పవిత్రము చేయువాడు అని వ్యుత్పత్తి. వాయుదేవుడు.
అష్టదిక్పాలురలో నొకడు.
వాయువ్యదిక్కునకు అధిపతి. ఆంజనేయుని జన్మకారకుడు.
కశ్యపప్రజాపతికి దాయాది అని కాశీఖండంలో పేర్కొనబడింది.

* బ్రహ్మ - నారాయణుని నాభికమలాన జనించినవాడు. సృష్టికర్త. ఈయనకు మొదట ఐదు శిరస్సులు.
శివుడు ఒక శిరస్సును ఖండించి, చతుర్ముఖుని చేశాడు. సరస్వతి ఈయన భార్య.
ఇంద్రత్వం వలెనే బ్రహ్మత్వం కూడా ఒక పదవి. బ్రహ్మలు మారుతూంటారు.

* భూతాలు - పంచభూతాలని దేవతలని అర్థం.
పంచభూతాలు ఐదు. ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి

* వాయువునకు మరల నమస్కారం ఎందుకంటే మొదటిది వాయుదేవునిగా భావించి చేసినది.
ఇపుడిది తండ్రిగా తలచి ఒనరించినది.

* పర్వదినాలు - తిథుల్లో 8,11,14,15, తిథులు పర్వదినాలు.
అనగా అష్టమి, ఏకాదశి, చతుర్దశి, పౌర్ణిమ, అమావాస్యలు.
* ముహూర్తం - 12 క్షణాల కాలం అనీ,  రెండు గడియల కాలం అనీ అర్థాలు.
గడియ అంటే 24 నిమిషాలు. రెండు గడియలు అంటే 48 నిమిషాలు.


* మదజలం - ఏనుగు శరీరం నుండి ద్రవరూపంలో కారే క్రొవ్వు.
ఏనుగుకు ఈ మదం ఎనిమిది చోట్ల పుడుతుంది. వీటికి వేర్వేఱు పేళ్లున్నాయి.
చెక్కిళ్ల పుట్టేది దానం. కన్నుల పుట్టేది సీధువు. చెవుల పుట్టేది సాగరం.
తొండము చివర పుట్టేది శీకరం. చనుమొనల పుట్టేది శిక్యం.
మేహనమున పుట్టేది మదం. హృదయాన పుట్టేది ఘర్మం. చరణాల పుట్టేది మేఘం.


* సప్తజ్వాలలు - ఏడు జ్వాలలు.
అగ్నిదేవుని నాలుకలు.
వాటి పేళ్లు వరుసగా
కాళి, కరాళి, విస్ఫులింగిని, ధూమ్రవర్ణ, విశ్వరుచి, లోహిత, మనోజవ.
వీటిలోమధ్యదైన ధూమ్రవర్ణ నుండి ధూమం బయలుదేరుతుంది.


*  నిప్పు - అగ్ని.
శుచిష్మతి విశ్వానరుల తనయుడు. వైశ్వానరుడు అసలు పేరు.
తపమున శివుని మెప్పించి, ఆయన వరంతో అగ్నిలోకానికి అధిపతి అయ్యాడు.
ఆగ్నేయదిక్కుకు అధిపతి.
అన్ని యజ్ఞాల్లోనూ హవిస్సులను దేవతలకు కొనిపోయేది ఈయనే.
(భృగుశాపంతో) సర్వభక్షకుడైనా, (విష్ణువరంతో) అత్యంత శుచి అయినవాడు.
స్వాహాదేవి ఈయన భార్య.


* దిశలు - దిక్కులు.
వరుసగా తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నిరృతి, పశ్చిమం, వాయవ్యం, ఉత్తరం, ఈశాన్యం.
ఇవి ఎనిమిది. భూమ్యాకాశాలతో కలిపి పది దిక్కులు.


* సర్పాలు - చరించేవి అని వ్యుత్పత్తి. పాములు.


* విద్యాధరులు - ఒక దేవజాతి.
గుటికాంజనాది విద్యలను ధరించినవారు అని వ్యుత్పత్తి.
జీమూతవాహనుడు మొదలైనవారు విద్యాధరులు.


* లేహ్యాలు - నాకి భుజింపదగిన వ్యంజన విశేషాలు.


* భక్ష్యాలు - తినదగినవి.
పంచభక్ష్యాలు అంటారు. అవి భక్ష్యం, భోజ్యం, లేహ్యం, చోష్యం, పానీయం.


*  ఋషులు - జ్ఞానం యొక్క ఆవలిఒడ్డుకు చేరినవారు.


* సిద్ధులు - అణిమాది సిద్ధులు కలవారు.
"అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా,
ప్రాప్తిః ప్రాకామ్య మీశత్వం వశిత్వం చాష్ట భూతయః."
ఈ ఎనిమిదింటినే అష్టైశ్వర్యములని కూడా అంటారు.


----------------------------------------------------------------------------------------------------

చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం |
ఏకైక మక్షరం పుంసాం మహాపాతక నాశనం || 1 ||
ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం |
జానకీ లక్ష్మణోపేతం జటామకుట మండితం || 2 ||

--------------------------------------------------------------------------------------------

శ్రీరామరక్షాస్తోత్రం
వినియోగః

ఓం అస్య శ్రీరామరక్షాస్తోత్రమంత్రస్య బుధకౌశిక ఋషిః శ్రీ సీతారామచంద్రో దేవతా అనుష్టుప్ ఛందః
సీతా శక్తిః శ్రీమాన్ హనుమాన్ కీలకం శ్రీరామచంద్ర ప్రీత్యర్థే శ్రీరామరక్షాస్తోత్ర జపే వినియోగః

ధ్యానం

ధ్యాయేదాజానుబాహుం ధృతశరధనుషం బద్ధపద్మాసనస్థం
పీతం వాసో వసానం నవకమలదళస్పర్థి నేత్రం ప్రసన్నం,
వామాంకారూఢసీతాముఖకమలమిళల్లోచనం నీరదాభం
నానాలంకారదీప్తం దధత మురుజటామండలం రామచంద్రం.

విన్నపం:
దయచేసి తప్పులు తెలియజెప్పిన దిద్దుకోగలవాడను.
అలాగే మీ వెలలేని అభిప్రాయాలు కూడా.


శుభం భూయాత్