16, మే 2012, బుధవారం

రామసుందరం - 2



దుష్కరం నిష్ప్రతిద్వంద్వం            | దుష్కరమైన ఎవరూ చేయలేని పనిని చేయగోరి,
చికీర్షన్ కర్మ వానరః |                   | తన మెడను, శిరస్సును నిటారుగా నిలిపి,
సముదగ్రశిరోగ్రీవో                         | వృషభరాజులా ప్రకాశించాడు.
గవాంపతి రివాబభౌ || 2 ||

అథ వైడూర్యవర్ణేషు                     | వైడూర్యపు* రంగు కలిగి,
శాద్వలేషు మహాబలః |                | చల్లగా ఉన్నపచ్చికభూములందు
ధీరస్సలిలకల్పేషు                      | అటూ ఇటూ సుఖంగా సంచరించాడు.
విచచార యథాసుఖమ్ || 3 ||

ద్విజా న్విత్రాసయన్ ధీమా            | ఆ ధీమంతుడు* మహాసింహంలా
నురసా పాదపాన్ హరన్ |             | తిరుగుతూంటే ఆయన వక్షస్థలం తాకిడికి అక్కడి
మృగాంశ్చ సుబహూన్నిఘ్నన్     | వృక్షాలు కూలిపోయాయి. పక్షులు భయపడ్డాయి.
ప్రవృద్ధ ఇవ కేసరీ         || 4 ||         | ఎన్నోమృగాలు అసువులు కోల్పోయాయి.*

నీలలోహితమాంజిష్ఠ                    | నీలం,ఎఱుపు, పసుపు, ఆకుపచ్చ, తెలుపు, నలుపు మొదలైన
పత్రవర్ణైస్సితాసితైః |                      | చిత్ర విచిత్ర వర్ణాలు కల ధాతువు*లతోనూ,
స్వభావవిహితైశ్చిత్రైః                 
ధాతుభిస్సమలంకృతమ్ || 5 ||
      
కామరూపిభిరావిష్ట                      | కామరూపులైన (కోరినరూపాన్ని ధరించగల)
మభీక్ష్ణం సపరిచ్ఛదైః |                   | యక్ష* కిన్నర* గంధర్వ* పన్నగా*లతోనూ,
యక్షకిన్నరగంధర్వైః
దేవకల్పైశ్చ పన్నగైః || 6 || 

స తస్య గిరివర్యస్య                        | అసంఖ్యాకములైన ఏనుగులతోనూ
తలే నాగవరాయుతే |                    | కూడుకొన్న ఆ మహేంద్రపర్వత తలము (క్రింది భాగం) నందుండి,
తిష్ఠన్ కపివరస్తత్ర                         | కొలనులోని ఏనుగులా భాసించాడు.
హ్రదే నాగ ఇవాబభౌ || 7 ||

స సూర్యాయ మహేంద్రాయ           | సూర్యు*నకు, ఇంద్రు*నకు, పవను*నకు, బ్రహ్మ*కు,
పవనాయ స్వయంభువే |               | ఇతర భూతా*లకు నమస్కరించాడు.
భూతేభ్యశ్చాంజలిం కృత్వా           
చకార గమనే మతిమ్ || 8 ||

అంజలిం ప్రాఙ్ము(ఖః)ఖం కృత్వా         | తూర్పుకు తిరిగి,
పవనాయాత్మయోనయే |                | తన తండ్రి వాయువునకు నమస్కరించి*,
తతో హి వవృధే గంతుం                  | ఆ దక్షిణుడు (నేర్పరి) దక్షిణదిశగా వెళ్లదలచి,
దక్షిణో దక్షిణాం దిశమ్ || 9 ||            | దేహాన్ని పెంచాడు.

ప్లవంగప్రవరై ర్దృష్టః                          | సముద్రాన్ని దాట కృతనిశ్చయుడై,
ప్లవనే కృతనిశ్చయః |                     | రామాభ్యుదయం కోసం
వవృధే రామవృద్ధ్యర్థం                     | పర్వదినాల్లో* సముద్రంలా పెరిగాడు.
సముద్ర ఇవ పర్వసు || 10 ||


-------------------------------------------------------------------------------------------------------


* వైడూర్యం - నవరత్నాల్లో ఒకటి.
విడూరదేశమందు పుట్టిన రత్నం.
దీన్నే పిల్లికన్రతనం అంటారు.
ముత్యం, పద్మరాగం, వజ్రం, ప్రవాళం, మరకతం,
నీలం, గోమేధికం, పుష్యరాగం, వైడూర్యం. ఇవి నవరత్నాలు.

* ధీమంతుడు - ధీ అంటే బుద్ధి. బుద్ధి కలవాడు అని అర్థం.
బుద్ధి మూడురకాలు. స్మృతి, మతి, ప్రజ్ఞ.
స్మృతి అంటే జరిగిన విషయాలను గుర్తుకు తెచ్చుకోగలిగిన శక్తి.
మతి అంటే జరుగుతున్న విషయాలను ఆకళింపు చేసుకోగలిగిన శక్తి.
ప్రజ్ఞ అంటే రాబోయే విషయాలను ముందుగానే గ్రహించగలిగిన శక్తి.
ఈ మూడు శక్తులూ కలిగినవానినే బుద్ధిమంతుడనాలి.
హనుమంతుడటువంటివాడు.

* ఇక్కడ అనుమానం రావచ్చు. అనవసరంగా ఆయనవల్ల చెట్లకు, పక్షులకు
జంతువులకు ప్రమాదం ఎందుకు ఏర్పడిందని.?
కాదు. అవి కీడు కలిగించే చెట్లును, పక్షులును, జంతువులును.
తనవారంతా తాను వచ్చేవరకు అక్కడే మకాం ఉండి, ఎదురు చూస్తూంటారు.
వారి రక్షణకోసం కీడుగల్గించే వాటిని తొలగించాడనుకోవచ్చు.
హనుమ బుద్ధిమంతుడు కాన ఆ పని చేశాడు.

* ధాతువులు - పూర్వపు కావ్యాలు చదివేవారికి పర్వతవర్ణనల్లో ఈ శబ్దం పరిచితమే.
ధాతువంటే మణిశిల. అంటే పైన చెప్పుకొన్న రకరకాల రంగులు కలిగిన రాళ్లే ధాతువులు.

* యక్షులు - పూజింపబడేవారు అని వ్యుత్పత్తి.
ఒక దేవజాతి.
కుబేరాదులు యక్షులు.
కుబేరుడు యక్షులకు రాజు.

* కిన్నరులు - (కింనరులు) ఒక దేవజాతి.
వీరి మొహం గుఱ్ఱపుమొహం. మానవశరీరం.
పాపం చూడ్డానికి ఏవగించుకోనేటట్లుంటారు.

* గంధర్వులు - ఒక దేవజాతి.
సువాసనను పొందువారు అని వ్యుత్పత్తి.
వీరున్న తావున మంచి తావి ఉంటుంది.

* పన్నగాలు - పాములు.
పాదాలచేత పోనివి. పడినట్టుగా పోయేవి.
అనే అర్థాల్లో పన్నగం అనే శబ్దం ఏర్పడింది.

* సూర్యుడు - ప్రాణులను వారి వారి వ్యాపారములందు ప్రేరేపించువాడు. అని వ్యుత్పత్తి.
ఆంజనేయునకు గురువు.
అదితి కశ్యపుల కుమారుడు.
గ్రహాలకు రాజు.
దినకరుడు.
సూర్యుని భార్య సంజ్ఞ.

* ఇంద్రుడు - అంటే పరమైశ్వర్యయుక్తుడు అని.
దేవతలకు రాజు.
తూర్పుదిక్కుకు అధిపతి.
ఇతడును అదితి కుమారుడే.
శచీదేవి ఈయన భార్య.
ఇంద్ర శబ్దం ఒక పదవి అని అంటారు. ఇంద్రులు మారుతూంటారు.

* పవనుడు - పవిత్రము చేయువాడు అని వ్యుత్పత్తి. వాయుదేవుడు.
అష్టదిక్పాలురలో నొకడు.
వాయువ్యదిక్కునకు అధిపతి. ఆంజనేయుని జన్మకారకుడు.
కశ్యపప్రజాపతికి దాయాది అని కాశీఖండంలో పేర్కొనబడింది.

* బ్రహ్మ - నారాయణుని నాభికమలాన జనించినవాడు. సృష్టికర్త. ఈయనకు మొదట ఐదు శిరస్సులు.
శివుడు ఒక శిరస్సును ఖండించి, చతుర్ముఖుని చేశాడు. సరస్వతి ఈయన భార్య.
ఇంద్రత్వం వలెనే బ్రహ్మత్వం కూడా ఒక పదవి. బ్రహ్మలు మారుతూంటారు.

* భూతాలు - పంచభూతాలని దేవతలని అర్థం.
పంచభూతాలు ఐదు. ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి

* వాయువునకు మరల నమస్కారం ఎందుకంటే మొదటిది వాయుదేవునిగా భావించి చేసినది.
ఇపుడిది తండ్రిగా తలచి ఒనరించినది.

* పర్వదినాలు - తిథుల్లో 8,11,14,15, తిథులు పర్వదినాలు.
అనగా అష్టమి, ఏకాదశి, చతుర్దశి, పౌర్ణిమ, అమావాస్యలు.
-------------------------------------------------------------------------------------------------------


చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం |
ఏకైక మక్షరం పుంసాం మహాపాతక నాశనం || 1 ||



శుభం భూయాత్

15, మే 2012, మంగళవారం

రామసుందరం - 7



ఇతి కృత్వా మతిం సాధ్వీం                                     ఈవిధంగా సముద్రుడు,
సముద్రశ్ఛన్నమంభసి |                                        సాధుమతితో (మంచి మనస్సుతో) ఆలోచించి,
హిరణ్యనాభం మైనాక                                            తనలో (నీటిలో) దాగి ఉన్న
మువాచ గిరిసత్తమమ్ || 91 ||                                 మైనాకునితో ఇలా అన్నాడు.


త్వమిహాసురసంఘానాం                                        "ఓ మైనాకా!* ఇంద్రుని కారణంగా*
పాతాళతలవాసినాం |                                             పాతాళ*వాసులైన రక్కసిమూకలకు
దేవరాజ్ఞా గిరిశ్రేష్ఠ                                                    అడ్డుగా
పరిఘ స్సన్నివేశితః || 92 ||                                     పరిఘ (గడియమ్రాను,పెనుశిల) లా నిలిచావు.



త్వమేషాం జాతవీర్యాణాం                                        వారు తిరిగి లేచి రాకుండా,
పునరేవోత్పతిష్యతాం |                                            పాతాళద్వారాన్ని పూర్తిగా మూసేశావు.
పాతళస్యాప్రమేయస్య
ద్వారమావృత్య తిష్ఠసి || 93 ||


తిర్యగూర్ధ్వమధశ్చైవ                                               పైకి క్రిందకి అన్నివైపులకూ
శక్తిస్తే శైల వర్ధితుం |                                                 పెరిగే సామర్థ్యం కలవాడవు.
తస్మా త్సంచోదయామి త్వా                                     కాబట్టి లే.
ముత్తిష్ఠ గిరిసత్తమ || 94 ||


స ఏష కపిశార్దూలః                                                   హనుమంతుడు,
త్వాముపర్యేతి వీర్యవాన్ |                                         రామకార్యార్థమై
హనూమాన్ రామకార్యార్థం                                      ఇదిగో, వస్తున్నాడు.
భీమకర్మా ఖమాప్లుతః || 95 ||


అస్య సాహ్యం మయా కార్య                                        ఇక్ష్వాకులు* నాకు పూజ్యులు.
మిక్ష్వాకుకులవర్తినః |                                     (నన్ను ఆశ్రయించి ఉన్నందున) నీకు మిక్కిలి పూజ్యులు.
మమ హీక్ష్వాకవః పూజ్యాః                                         అందువల్ల ఇక్ష్వాకువంశజుడైన రాముని సచివునికి
పరం పూజ్యతమాస్తవ || 96 ||                                     సహాయపడడం మన కర్తవ్యం.


కురు సాచివ్య మస్మాకం                                           కాబట్టి మాకు సహాయపడు.
న నః కార్యమతిక్రమేత్ |                                            మా పనిని విధిగా ఆచరించు.
కర్తవ్య మకృతం కార్యం                                             సకాలంలో కర్తవ్యాన్ని (చేయవలసినది) చేయకపోతే
సతాం మన్యుముదీరయేత్ || 97 ||                           పెద్దలకు (ఇంద్రాది దేవతలకు) కోపం వస్తుంది.


సలిలాదూర్ధ్వముత్తిష్ఠ                                               ఈ కపివరుడు మనకు అతిథి. పూజ్యుడు.
తిష్ఠత్వేష కపి స్త్వయి |                                              పైకి రా.
అస్మాకమతిథిశ్చైవ                                                  నీపై అతడు విశ్రాంతి తీసుకొంటాడు.
పూజ్యశ్చ ప్లవతాం వరః || 98 ||


చామీకరమహానాభ                                                  విశ్రాంతి తర్వాత ప్రయాణాన్ని కొనసాగిస్తాడు.
దేవగంధర్వసేవిత |                                                   ఇదిగో, రానే వచ్చాడు.
హనుమాంస్త్వయి విశ్రాంతః
తత శ్శేషం గమిష్యతి || 99 ||
(స ఏష కపిశార్దూలః
త్వాముపర్యేతి వీర్యవాన్)


కాకుత్థ్సస్యానృశంస్యం చ                                           కాకుత్థ్సుని* (రాముని) మంచితనాన్ని,
మైథిల్యాశ్చ వివాసనం |                                        మైథిలి* దుఃస్థితిని,
శ్రమం చ ప్లవగేంద్రస్య                                                హనుమంతుని శ్రమను గుర్తించి,
సమీక్ష్యోత్థాతుమర్హసి || 100 ||                                     బయటకు రా!"


హిరణ్యనాభో మైనాకో                                                మైనాకుడు,
నిశమ్య లవణాంభసః |                                               సముద్రుని మాటలను విని,
ఉత్పపాత జలాత్తూర్ణం                                              లతలతో కూడిన మహావృక్షాలతో సహా        
మహాద్రుమలతాయుతః || 101 ||                                వేగంగా


స సాగరజలం భిత్త్వా                                                మేఘపటలాన్ని చీల్చుకొని,
బభూవాభ్యుత్థిత స్తదా |                                            ప్రకాశించే కిరణాలతో వచ్చే దివాకరునిలా,
యథా జలధరం భిత్త్వా                                             సాగరజలాన్ని భేదించుకొని,
దీప్తరశ్మిర్దివాకరః || 102 ||                                          బయటకు వచ్చాడు.


స మహాత్మా ముహూర్తేన                                         సముద్రజలాలచేత ఆవృతుడై,
పర్వతస్సలిలావృతః |                                               ఒక్కసారిగా తటాలున
దర్శయామాస శృంగాణి                                           తన శృంగాలను దర్శింపజేశాడు.
సాగరేణ నియోజితః || 103 ||


శాతకుంభమయైః శృంగైః                                   కిన్నరులను, మహాసర్పాలను కలిగిన మైనాకునిశిఖరాలు
సకిన్నరమహోరగైః |                                               బంగరుకాంతులను ప్రసరిస్తున్నాయి.            
ఆదిత్యోదయసంకాశైః                                                అవి, ఆకాశాన ఆలిఖిస్తూ,
ఆలిఖద్భిరివాంబరమ్ || 104 ||                                   ఉదయిస్తున్న సూర్యకిరణాల్లా భాసిస్తున్నాయి.


తప్తజాంబూనదైః శృంగైః                                            సముద్రజలాలనుండి ఉవ్వెత్తుగా పైకి లేచిన
పర్వతస్య సముత్థితైః |                                              ఆ శిఖరాల పుటంపెట్టిన బంగారుకాంతులతో
ఆకాశం శస్త్రసంకాశ                                                 లోహవర్ణంగల ఆకాశం
మభవత్కాంచనప్రభమ్ || 105 ||                               కాంచనప్రభలను పొందింది.


జాతరూపమయైః శృంగైః                                         స్వర్ణమయములై, స్వయంప్రభలతో వెలిగే శిఖరాలతో
భ్రాజమానైస్స్వయంప్రభైః |                                       ఆ మైనాకుడు
ఆదిత్యశతసంకాశః                                                 నూఱుగురు సూర్యుల్లా ప్రకాశించాడు.
సో౭భవ ద్గిరిసత్తమః || 106 ||      
                     

తముత్థితమసంగేన                                              అకారణంగా సముద్రం మధ్యనుంచి లేచి,
హనూమానగ్రతః స్థితం |                                        ఎదురుగా నిలిచిన మైనాకపర్వతాన్ని చూచి,
మధ్యే లవణతోయస్య                                            హనుమంతుడు,
విఘ్నో౭యమితి నిశ్చితః || 107 ||                          "ఇదొక ఆటంకం" అనుకొన్నాడు.


స తముచ్ఛ్రితమత్యర్థం                                        మేఘాన్ని వాయువులా,
మహావేగో మహాకపిః |                                          ఉన్నతమైన ఆ పర్వతాన్ని
ఉరసా పాతమాయాస                                         తన వక్షఃస్థలంతో పడద్రోశాడు.
జీమూతమివ మారుతః || 108 ||


స తథా పాతితస్తేన                                              తనను పడద్రోసిన
కపినా పర్వతోత్తమః |                                          ఆయన వేగాన్ని తెలుసుకుని,
బుద్ధ్వా తస్య కపేర్వేగం                                        మైనాకుడు, ఆనందంతో పులకించాడు.
జహర్ష చ ననంద చ || 109 ||


తమాకాశగతం వీర                                              ప్రేమతో, ప్రసన్నమైనమదితో
మాకాశే సముపస్థితః |                                        మానవరూపం ధరించి,
ప్రీతో హృష్టమనా వాక్య                                        తన శిఖరం పైన నిలిచి,
మబ్రవీత్పర్వతః కపిం |                                        హనుమంతునితో ఇలా అన్నాడు.
మానుషం ధారయన్ రూప 
మాత్మనశ్శిఖరే స్థితః || 110 ||

-----------------------------------------------------------------------------------------------------


* మైనాకుడు - మేనకా హిమవంతుల కుమారుడు.
పర్వతరూపుడు.
ఇంద్రుడు పర్వతాల ఱెక్కలను విఱిచేటప్పుడు, ఇతడు భయపడి, దక్షిణసముద్రంలో దాగాడు.

* ఒకసారి బలి, ఇంద్రుని జయించి, స్వర్గాన్ని ఆక్రమించుకొన్నాడు.
అప్పుడు విష్ణువు వామనుడై బలిని పాతాళానికి పంపాడు.
అతనితో రాక్షసులు పాతాళానికి చేరారు.
సముద్రంలోనే పాతాళద్వారం ఉంది.
వారు తిరిగి రాకుండా ఇంద్రుడు,
సముద్రంలోనే ఉన్న మైనాకుని ఆ ద్వారానికి అడ్డుగా ఉండమన్నాడు.

* పాతాళం - అధోలోకం.
బలినివాసం.
పాపాలు చేస్తే దీంట్లో పడతారు.
ముల్లోకాల్లో ఒకటి.
స్వర్గలోకం, మర్త్యలోకం (భూలోకం), పాతాళం అనేవి ముల్లోకాలు.


* ఇక్ష్వాకులు - ఇక్ష్వాకువంశపు రాజులు.
ఇక్ష్వాకువు గుఱించి మునుపు చెప్పడం జరిగింది.

* కాకుత్థ్సుడు - కకుత్థ్సునివంశానికి చెందినవాడు.
కకుత్థ్సుడు సూర్యవంశపు రాజు.
వికుక్షి కుమారుడు.
అసలు పేరు పురంజయుడు.
ఈయనకు కకుత్థ్సుడనే పేరు రావడం వెనుక ఒక కథ ఉంది.
రాక్షసబాధను సహించలేక దేవతలు బ్రహ్మకు, విష్ణువుకు చెప్పుకొన్నారు.
వారు పురంజయుని ఆశ్రయించమన్నారు.
అపుడు దేవతలు పురంజయుని వేడగా, ఆయన ఎద్దుపైకి ఎక్కి వస్తానన్నాడు.
అంత ఇంద్రుడు వృషభమయ్యాడు.
పురంజయుడు కకుత్ పై కూర్చొని, రాక్షసులతో యుద్ధం చేసి, ఓడించి, తఱిమాడు.
కకుత్ అంటే ఎద్దుమూపురం. దానిపై స్థ అంటే ఉన్నవాడు కాబట్టి కకుత్థ్సుడనే పేరు వచ్చింది.
ఇంద్రవాహనుడనే పేరు కూడా వచ్చింది.
కకుత్థ్సునివంశంవారు కాకుత్థ్సులు.

* మైథిలి - సీత.
నిమిని మథించగా జనకుడు పుట్టాడు.
అందువల్ల జనకుని మిథి అన్నారు.
మిథి పాలించిన దేశమే మిథిల.
మిథిలరాజకుమార్తె కాన సీత మైథిలి అయ్యింది.

------------------------------------------------------------------------------------------------------



జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరతవందితం |
స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః || 6 ||


వైశాఖ బహుళ దశమి - హనుమజ్జయంతి శుభాకాంక్షలు.

శుభం భూయాత్

11, మే 2012, శుక్రవారం

రామసుందరం - 6



వికర్షన్నూర్మిజాలాని                                   పై కెగురుతున్న పెద్ద పెద్ద అలలను కకావికలు చేస్తూ,
బృహంతి లవణాంభసి |                                 ఒక విభజన రేఖలా
పుప్లువే కపిశార్దూలో                                   భూమ్యాకాశాలను వేరుచేస్తున్నట్లుగానూ,
వికిరన్నివ రోదసీ || 71 ||                               ( వారధి కట్టబోతున్నాడని సూచన.)
                                                                       


మేరుమందరసంకాశా                                  మేరు*మందర* పర్వతాలంత
నుద్ధతాన్ స మహార్ణవే |                                ఎత్తుకు ఎగురుతున్న
అతిక్రామ న్మహావేగః                                    ఆ తరంగాలను లెక్కపెడుతున్నవాడిలాగానూ
తరంగాన్ గణయన్నివ || 72 ||                        ముందుకు పయనించాడు.
                                                           ( లంకలో సైన్యం మొదలైన వాటిని లెక్కపెట్టబోతున్నాడు.)


తస్య వేగసముద్ధూతం                                  ఆ సముద్రజలం
జలం సజలదం తదా |                                  ఆకాశమంతా వ్యాపించి,
అంబరస్థం విబభ్రాజ                                     తెల్లని శరత్కాలమేఘంలా
శారదాభ్రమివాతతమ్ || 73 ||                         విరాజిల్లింది.


తిమినక్రఝషాః కూర్మా                                 సముద్రజలాలన్నీ అటూ ఇటూ తొలగిపోవడంవల్ల
దృశ్యంతే వివృతా స్తదా |                                తిమి* నక్ర* ఝష* కూర్మాలు,
వస్త్రాపకర్షణేనేవ                                           వస్త్రాలు తొలగిన మానవ శరీరాల్లా కనబడ్డాయి.
శరీరాణి శరీరిణామ్ || 74 ||                            ( లంకలో వివస్త్రలను దర్శించబోతున్నాడు.) 
                                                                        


ప్లవమానం సమీక్ష్యాథ                                   సముద్రసర్పాలు
భుజంగాస్సాగరాలయాః |                                గరుత్మంతుడనుకొని, భయపడ్డాయి.
వ్యోమ్ని తం కపిశార్దూలం                               ( రాక్షసులు హనుమంతుడెవరో తెలియక ,
సుపర్ణ ఇతి మేనిరే || 75 ||                               రకరకాలుగా తలపోసి, భయపడబోతున్నారు.)



దశయోజనవిస్తీర్ణా                                         ఆయన నీడ పది యోజనాల* పొడవు,    
త్రింశద్యోజనమాయతా |                                  ముప్పై యోజనాల వెడల్పుతో
ఛాయా వానరసింహస్య                                  నీటిపై అందంగా ఉంది.
జలే చారుతరా౭భవత్ || 76 ||

శ్వేతాభ్రఘనరాజీవ                                        ఆ నీడ ఆయనను అనుసరిస్తూ,
వాయుపుత్రానుగామినీ |                                సముద్రజలంలో
తస్య సా శుశుభే ఛాయా                                నిర్మలమైన, దట్టమైన
వితతా లవణాంభసి || 77 ||                              మేఘమండలంలా ప్రకాశించింది.


శుశుభే స మహాతేజా                                   ఆ మహాతేజుడు,
మహాకాయో మహాకపిః |                               నిరాధారమైన ఆకాశంలో పోతూ,
వాయుమార్గే నిరాలంబే                                 ఱెక్కల పర్వతంలా
పక్షవానివ పర్వతః || 78 ||                              భాసించాడు.


యేనాసౌ యాతి బలవాన్                               ఆయన వేగంగా పోయిన మార్గంలోని
వేగేన కపికుంజరః |                                       సముద్రం ముందుకు ఉబ్బి,
తేన మార్గేణ సహసా                                     విశాలమైన తొట్టిలా కనబడింది.
ద్రోణీకృత ఇవార్ణవః || 79 ||


ఆపాతే పక్షిసంఘానాం                                  గరుత్మంతునిలా,                              
పక్షిరాజ ఇవ వ్రజన్ |                                    మేఘాలను ఆకర్షిస్తూ, వేళ్లే వాయువులా
హనుమాన్ మేఘజాలాని                              సాగిపోతున్నాడు.
ప్రకర్షన్ మారుతో యథా || 80 ||


పాండురారుణవర్ణాని                                     ఆయనచే ఆకర్షింపబడుతున్న
నీలమాంజిష్ఠకాని చ |                                    ఆ మేఘాలు
కపినాకృష్యమాణాని                                     తెలుపు, ఎఱుపు,
మహాభ్రాణి చ కాశిరే || 81 ||                             నలుపు పసుపు వన్నెలున్నవి.

 
ప్రవిశన్నభ్రజాలాని                                       పదే పదే మేఘాల్లో ప్రవేశిస్తూ, బయటకు వస్తూ,                      
నిష్పతంశ్చ పునః పునః |                               పురోగమిస్తున్న హనుమ,
ప్రచ్ఛన్నశ్చ ప్రకాశశ్చ                                   మేఘాలచే మూయబడి, మరల బయటపడుతూండే
చంద్రమా ఇవ లక్ష్యతే || 82 ||                           చంద్రునిలా గోచరించాడు.


ప్లవమానం తు తం దృష్ట్వా                             అప్పుడు, హనుమంతుని చూసి,
ప్లవంగం త్వరితం తదా |                                దేవతలు, గంధర్వులు, దానవులు*
వవర్షుః పుష్పవర్షాణి                                    ఆయనపై పూలవానలు కురిపించారు.
దేవగంధర్వదానవాః || 83 ||



తతాప న హి తం సూర్యః                               రామకార్యార్థసిద్ధికై వెళ్తున్న ఆయనకు,                         
ప్లవంతం వానరోత్తమం |                                 సూర్యుడు, తాపాన్ని కలిగించలేదు.
సిషేవే చ తదా వాయూ                                 వాయువు కూడా చల్లగా వీస్తూ,
రామకార్యార్థసిద్ధయే || 84 ||                             ఆయనను సేవించాడు.


ఋషయస్తుష్టువుశ్చైనం                                ఆ మహాతేజుని
ప్లవమానం విహాయసా |                                మహర్షులు స్తుతించారు.
జగుశ్చ దేవగంధర్వాః                                   దేవతలు, గంధర్వులు
ప్రశంసంతో మహౌజసమ్ || 85 ||                     ప్రశంసిస్తూ, కీర్తించారు.


నాగాశ్చ తుష్టువుర్యక్షా                                 నాగులు, యక్షులు,
రక్షాంసి విబుధాః ఖగాః |                                 దిక్పాలురు*, దేవతాదులు ప్రస్తుతించారు.
ప్రేక్ష్య సర్వే కపివరం                                      ఖగాలు* ( పక్షులు ) నుతించాయి.
సహసా విగతక్లమమ్ || 86 ||



తస్మిన్ ప్లవగశార్దూలే                                    అంత సముద్రుడు,
ప్లవమానే హనూమతి |                                  ఇక్ష్వాకువంశం సమ్మానాన్ని పొందాలని కోరి,
ఇక్ష్వాకుకులమానార్థీ                                    ఇలా ఆలోచించాడు.
చింతయామాస సాగరః || 87 ||


సాహాయ్యం వానరేంద్రస్య                                "నేను ఇప్పుడు                   
యది నాహం హనూమతః |                             హనుమంతునకు దోహదపడకపోతే,
కరిష్యామి భవిష్యామి                                      అందఱూ నన్ను
సర్వవాచ్యో వివక్షతామ్ || 88 ||                         అన్నివిధాలా నిందిస్తారు.


అహమిక్ష్వాకునాథేన                                     ఇక్ష్వాకు*ప్రభుడైన సగరునిచే వృద్ధిపొందాను.
సగరేణ వివర్ధితః |                                          ఈ హనుమ,
ఇక్ష్వాకుసచివశ్చాయం                                  ఇక్ష్వాకులకు సచివుడు.(స్నేహితుడు, సహాయుడు)   
నావసీదితుమర్హతి || 89 ||                              అటువంటి ఇతడు శ్రమపడకూడదు.



తథా మయా విధాతవ్యం                                 కాబట్టి ఇతనికి                
విశ్రమేత యథా కపిః |                                     విశ్రాంతిని సమకూర్చాలి.
శేషం చ మయి విశ్రాంతః                                 విశ్రాంతి తర్వాత
సుఖేనాతితరిష్యతి || 90 ||                             సుఖంగా (నన్ను) దాటగలడు."


----------------------------------------------------------------------------------------------------


* మేరువు - ఇది ఒక పర్వతం. బంగారు పర్వతం.
అసురలను హింసించేది, తన శిఖరాలచేత నక్షత్రాలను వహించేది,
అనే అర్థాల్లో మేరు అనే పేరు వచ్చింది.
ఇది భూమి చుట్టు మేఖలలా (వడ్డాణం) ఉంటుంది.
దీని చుట్టూ సూర్యచంద్రులు తిరుగుతూంటారు.
దీని శిఖరాలపై దేవతలు విహరిస్తూంటారు.

* మందరం - ఒక పర్వతం.
క్షీరసాగరమథనంలో కవ్వంగా ఉపయోగపడింది.
ఈ రెండు పర్వతాలూ ఎత్తైనవి అని వేరే చెప్పనక్కరలేదుగా!

* తిమి - ఆర్ద్రం గానూ, నూఱు యోజనాల పొడవూ ఉన్న చేప.
ప్రామాణిక నిఘంటువుల్లో నూఱు యోజనాల చేప అని అర్థం ఉన్నా,
ఆ రోజుల్లో ఎక్కువ పొడవును సూచించడానికి శతయోజనం అనేవారనిపిస్తుంది.
బాగా పెద్ద చేప అని చెప్పవచ్చు.
ఈ తిమిని మింగే చేపలనే తిమింగలాలంటారు.

* నక్రం - భూమియందు పాదవిక్షేపం చేయనిది = మొసలి.

* ఝషం - పిల్ల చేపలను చంపి తినే చేప.

* కూర్మం - కుత్సితమైన వేగం కలది, జలాన్ని పాడుచేసేది = తాబేలు.

* యోజనం - ఆమడ. ఇది దూరాన్ని సూచించే ప్రమాణం.
ఒక యోజనం అంటే నాలుగు క్రోసుల దూరం. ( క్రోసు = రెండు మైళ్లు.) / ఎనిమిది మైళ్లు.

* దానవులు - దనువుకు పుట్టినవారు. ఈ దనువు కశ్యపుని భార్య.

* దిక్పాలురు - దిక్కులకు అధిపతులు.
వరుసగా తూర్పు - ఇంద్రుడు
ఆగ్నేయం - అగ్ని
దక్షిణం - యముడు
నిరృతి - నిరృతి
పశ్చిమం - వరుణుడు
వాయవ్యం - వాయువు
ఉత్తరం - కుబేరుడు
ఈశాన్యం - ఈశానుడు.

* ఖగాలు - ఆకాశమందు తిరిగేవి = పక్షులు.

* ఇక్ష్వాకువు - వైవస్వతమనువు కుమారుడు.
రాముని వంశానికి మూలపురుషుడు.
రాముని వంశానికి వరుసగా
సూర్యవంశం, ఇక్ష్వాకువంశం, కాకుత్థ్సవంశం, రఘువంశం అనే పేళ్లున్నాయి.
ఇక్ష్వాకువంశంవారిని ఇక్ష్వాకులు అంటారు.



-------------------------------------------------------------------------------------------




కౌసల్యేయో దృశౌ పాతు విశ్వామిత్రప్రియః శ్రుతీ |
ఘ్రాణాం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రివత్సలః || 5 ||





శుభం భూయాత్

6, మే 2012, ఆదివారం

రామసుందరం - 5




స నానాకుసుమైః కీర్ణః                                         అనేక రకాల కుసుమా*లతో, మొలకలతో, మొగ్గలతో
కపిస్సాంకురకోరకైః |                                            కప్పబడిన హనుమంతుడు,
శుశుభే మేఘసంకాశః                                        (రాత్రులందు) మిణుగుఱుపురుగులతో
ఖద్యోతైరివ పర్వతః || 51 ||                                    కూడిన పర్వతంలా దీపించాడు.


విముక్తాస్తస్య వేగేన                                            ఆయన నుండి విడివడి, పూలను విడచి,                 
ముక్త్వా పుష్పాణి తే ద్రుమాః |                              ఆత్మీయులను కొంతదూరం* అనుసరించి,
అవశీర్యంత సలిలే                                               వెనుతిరిగిన మిత్రుల్లా,
నివృత్తాస్సుహృదో యథా || 52 ||                           ఆ చెట్లన్నీ నీటిలో పడ్డాయి.


లఘుత్వేనోపపన్నం తత్                                     తేలిక కాబట్టి, పూలు                  
విచిత్రం సాగరే౭పతత్ |                                        ఆయన వేగానికి మఱికొంత దూరం అనుసరించి,
ద్రుమాణాం వివిధం పుష్పం                                 విచిత్రంగా సాగరం*లో పడ్డాయి.
కపీవాయుసమీరితం |                                        అపుడా అర్ణవం (సముద్రం)
తారాశతమివాకాశం                                           అసంఖ్యాకతార*లతో కూడిన
ప్రబభౌ స మహార్ణవః || 53 ||                                  ఆకాశం అయ్యింది.


పుష్పౌఘేణానుబద్ధేన                                         తన శరీరాన్ని అంటుకొని ఉన్న 
నానావర్ణేన వానరః |                                            రంగురంగుల పూలతో 
బభౌ మేఘ ఇవాకాశే                                          అతడు, ఆకాశంలో
విద్యుద్గణవిభూషితః || 54 ||                                 మెఱపుతీగెలతో కూడిన మేఘంలా మెఱశాడు.


తస్య వేగసమాధూతైః                                         ఆయన వేగానికి                  
పుష్పైస్తోయ మదృశ్యత |                                     చెల్లాచెదరై పడిన పువ్వులతో సముద్రజలం,
తారాభిరభిరామాభిః                                           ఉదయిస్తున్న, అందమైన తారలతో
ఉదితాభి రివాంబరమ్ || 55 ||                              అలరారే అంబరంలా కనబడింది.


తస్యాంబరగతౌ బాహూ                                      బాగా చాపబడిన         
దదృశాతే ప్రసారితౌ |                                           (గొప్ప వ్రేళ్ళు గల) ఆయన బాహువులు,  
పర్వతాగ్రా ద్వినిష్క్రాంతౌ                                     పర్వతశిఖరంనుండి వెలువడిన
పంచాస్యావివ పన్నగౌ || 56 ||                              అయిదుతలల పాముల్లా కనబడ్డాయి.


పిబన్నివ బభౌ చాపి                                           (సముద్రానికి దగ్గరగా పోతున్నప్పుడు)          
సోర్మిమాలం మహార్ణవం |                                    సముద్రాన్ని త్రాగుతున్నవాడిలా
పిసాసురివ చాకాశం                                            (దూరంగా పోతున్నప్పుడు)
దదృశే స మహాకపిః || 57 ||                                  ఆకాశాన్ని పానం చేసేవాడిలా అనిపించాడు.


తస్య విద్యుత్ప్రభాకారే                                          మెఱపుల్లా మెఱసే
వాయుమార్గానుసారిణః |                                     ఆయన నయనాలు రెండూ
నయనే విప్రకాశేతే                                               పర్వతంపై ఉన్న రెండు అగ్నుల్లా ఉన్నాయి.
పర్వతస్థావివానలౌ || 58 ||                                    (పర్వతంపై రెండగ్నులుంటే ఎలా ఉంటుందో అలా)
                                                         


పింగే పింగాక్షముఖ్యస్య                                       పింగళవర్ణం*తో (గోరోచనం)                                  
బృహతీ పరిమండలే |                                          గుండ్రంగా విశాలంగా ఉన్న
చక్షుషీ సంప్రకాశేతే                                             ఆయన నేత్రాలు
చంద్రసూర్యావివోదితౌ || 59 ||                               ఉదయిస్తున్న సూర్యచంద్రు*ల్లా భాసిల్లాయి.


ముఖం నాసికయా తస్య                                    ఎఱ్ఱని నాసిక గల ఎఱ్ఱని ముఖం
తామ్రయా తామ్రమాబభౌ |                                  సంధ్యా*రాగసంశోభితమైన
సంధ్యయా సమభిస్పృష్టం                                  సూర్యమండలంలా ప్రకాశించింది.
యథా తత్సూర్యమండలమ్ || 60 ||


లాంగూలం చ సమావిద్ధం                                   ఎగిరిపోతున్న ఆయన వాలం,
ప్లవమానస్య శోభతే |                                          మహోన్నతంగా నిలచి,
అంబరే వాయుపుత్రస్య                                       పైకెత్తబడిన
శక్రధ్వజ ఇవోచ్ఛ్రితః || 61 ||                                  శక్ర*ధ్వజం (ఇంద్రధ్వజం)* లా శోభించింది.


లాంగూలచక్రేణ మహాన్                                     మహాత్ముడు, తెల్లనిపలువరుస గలవాడు,
శుక్లదంష్ట్రో౭నిలాత్మజః |                                     మహాప్రాజ్ఞుడు* అయిన ఆ అనిలాత్మజుడు,
వ్యరోచత మహాప్రాజ్ఞః                                         చక్రాకృతిలో ఉన్న తోకతో కూడి,
పరివేషీన భాస్కరః || 62 ||                                  పరివేషం*తో ఉన్న భాస్కరునిలా తేజరిల్లాడు.

స్ఫిగ్దేశేనాభితామ్రేణ                                           తోక యొక్క ప్రారంభప్రదేశం ( కటిప్రదేశం)
రరాజ స మహాకపిః |                                         ఎఱ్ఱగా ఉండడంతో
మహతా దారితేనేవ                                          రెండు బద్దలుగా చేయబడిన
గిరిర్గైరికధాతునా || 63 ||                                     ధాతుశిల కల్గి ఉన్న పర్వతంలా విరాజిల్లాడు.


తస్య వానరసింహస్య                                         ఆయన బాహుమూలాల ద్వారా
ప్లవమానస్య సాగరం |                                        ప్రసరిస్తున్న వాయువు
కక్షాంతరగతో వాయుః                                        మేఘగర్జనలా ధ్వనిస్తోంది.
జీమూత ఇవ గర్జతి || 64 ||


ఖే యథా నిపతంత్యుల్కా                                   పొడవైన తోకతో ఉత్తరంనుండి దక్షిణానికి (లంకకు)
హ్యుత్తరాంతాద్వినిస్సృతా |                                 సాగిపోతున్న ఆయన
దృశ్యతే సానుబంధా చ                                       ఆకాశంలో ఉత్తరాన పొడమి, దక్షిణదిశగా రాలే
తథా స కపికుంజరః || 65 ||                                 (లంకలో వ్రాలే) తోకచుక్క*లా కనిపించాడు.


పతత్పతంగసంకాశో                                          సూర్యునితో సమానంగా             
వ్యాయతశ్శుశుభే కపిః |                                    ఆకాశంలో సాగిపోతున్న ఆ విశాలదేహుడు
ప్రవృద్ధ ఇవ మాతంగః                                         కక్ష్య*యందు బంధింపబడిన
కక్ష్యయా బద్ధ్యమానయా || 66 ||                         దీర్ఘమాతంగం (పెద్ద ఏనుగు) లా ఉన్నాడు.


ఉపరిష్టాచ్ఛరీరేణ                                               ఆయన దేహం - ఆకాశంలో,
ఛాయయా చావగాఢయా |                                 నీడ - సముద్రంలో ఉండడంతో,
సాగరే మారుతావిష్టా                                         క్రింది కొంత భాగం నీటిలో మునిగి, పైభాగం తేలుతూ,
నౌరివాసీ త్తదా కపిః || 67 ||                                 పవనప్రభావాన పోతున్న ఓడలా కనిపించాడు.


యం యం దేశం సముద్రస్య                               ఆతడు దాటిపోతున్న సముద్రప్రాంతాలన్నీ,        
జగామ స మహాకపిః |                                       ఆ ప్రబలవేగానికి అల్లకల్లోలాలై,
స స తస్యోరువేగేన                                           (తిరుగుడు పడి, నురుగు విడుస్తూ
సోన్మాద ఇవ లక్ష్యతే || 68 ||                               పైకెగురుతున్న జలంతో) 
                                                                       ఉన్మాదభరితాలయ్యాయి.
                                                                      (చిత్తభ్రమను పొందినట్లయ్యాయి.)
 
                                                                      అలాగే లంకలోని ప్రదేశాలు,
                                                                       వాటిలోని జనం,
                                                                       రావణాదులు,
                                                                       హనుమంతుని చేష్టలకు ఉన్మాదులవుతారని చెప్పవచ్చు.

సాగరస్యోర్మిజాలానా                                          కొండంత ఎత్తుకు ఎగురుతున్న
మురసా శైలవర్ష్మణాం |                                       సముద్రతరంగాల్ని తన ఱొమ్ముతో నెట్టుతూ,
అభిఘ్నంస్తు మహావేగః                                     వాటిని ఛిన్నాభిన్నం చేస్తూ,
పుప్లువే స మహాకపిః || 69 ||                               మిక్కిలి వేగంగా ఆకాశంలో తేలి,పోతున్నాడు.


కపివాతశ్చ బలవాన్                                         బలమైన ఆయన గమనవేగవాయువు,
మేఘవాతశ్చ నిస్సృతః |                                    మేఘాలగాలి రెండూ కలసి,
సాగరం భీమనిర్ఘోషం                                          భయంకరఘోషలతో ఘూర్ణిల్లుతూన్న సాగరాన్ని
కంపయామాసతుర్భృశమ్ || 70 ||                      ఇంకా కంపింపజేశాయి.


------------------------------------------------------------------------------------------------------



* కుసుమం - భ్రమరాలతో కూడిన పుష్పాన్ని కుసుమం అనాలి.

* బంధువులు ఇంటికి వచ్చి, తిరిగి పయనమైనప్పుడు వారిని నీటి సమీపం వఱకు దిగబెట్టాలి.
  అనగా చెఱువు వఱకు. తరువాత ఇక పోగూడదు. ఇంటికి వచ్చేయాలి.

* సాగరం - "సగరపుత్రైః ఖాతస్సాగరః" - అనగా సగరపుత్రులచే త్రవ్వబడినది.
  సగరుడు షట్చక్రవర్తులలో ఒకడు. ఈయనది సూర్యవంశం.
  కేశిని, సుమతి అనువారలు ఇతని భార్యలు.
  కేశిని యందు అసమంజసుడు అనే ఒక కుమారుని,
  సుమతియందు అరవైవేలమంది పుత్రులను ఇతడు కన్నాడు.
  ఒకసారి అశ్వమేధయాగం చేస్తూ యాగాశ్వం వెంట పుత్రులను పంపాడు.
  ఇంద్రుడు ఆ అశ్వాన్ని రసాతలాన తపస్సు చేస్తున్న కపిలముని ఆశ్రమాన కట్టించాడు.
  సగరుని పుత్రులు అంతా వెతికి,
  సముద్రంలో అశ్వమున్నదేమో అని దాన్ని వేయి యోజనాలు త్రవ్వారు.
  సగరపుత్రులచేత త్రవ్వబడి, విశాలం చేయబడినది గాన అప్పటి నుండి,
  సాగరం అని జలధి పిలువబడింది.

* తారలు - దీనియందు నావికులు తరింతురు.
   అంటే తారలసహాయంతో నావికులు సాగరాన్ని దాటతారు.

* పింగళవర్ణం - నలుపు పసుపు వన్నెలు కలసిన రంగు.

* చంద్రుడు - అత్రి మహర్షికి, అనసూయకు  బ్రహ్మంశను జన్మించినవాడు.
  అని మార్కండేయపురాణం. దత్తాత్రేయచరిత్రలు చెప్తాయి.
  క్షీరసాగరమథనంలో జన్మించాడని భారతం.
  దక్షుని కుమార్తెలు ఇరవైఏడుమంది (అశ్విన్యాది నక్షత్రాలు) ఇతని భార్యలు.
  వారిలో రోహిణియందు ఎక్కువ అనురాగం చూపించడంతో,
  దక్షుని శాపానికి గురయ్యాడు. దానిప్రకారం వృద్ధిక్షయాలు పొందుతూంటాడు.
  తిథులకు, మనస్సుకు, ఔషధులకు, సస్యాలకు కారకుడు.
  నవగ్రహాల్లో ఒకడు.
  భూమికి ఉపగ్రహం అని సైన్స్.

* సంధ్య - అహోరాత్రాలచే సంధింపబడేదాన్ని
  దేనియందు లెస్సగా ధ్యానం చేస్తారో దాన్ని సంధ్య అంటారు.
  అహోరాత్రాలు అంటే పగలూ రాత్రీ.
  ప్రొద్దు (సూర్యుడు) పొడుచుటకు ముందు ఐదు గడియల వఱకును - ప్రాతస్సంధ్య.
  ప్రొద్దు క్రుంకిన పిదప మూడు గడియల వఱకును గల కాలం - సాయంసంధ్య.
  పగటియొక్క మధ్యభాగం - మధ్యాహ్నస్సంధ్య.
 
* శక్రుడు - దుష్టుల్ని జయించడంలో శక్తి కలవాడు. ఇంద్రుడు.

* శక్రధ్వజం - ఇంద్రధ్వజం. వైజయంతం అని పేరు.
   ధ్వజం అంటే టెక్కెం / జెండా.

* మహాప్రాజ్ఞుడు - ప్రాజ్ఞుడు అంటేనే మిక్కిలి తెలిసినవాడు.
  ఇక మహా అంటే మీరే ఆలోచించండి.

* పరివేషం - చుట్టూ కాంతి వలయం ఉంటే దాన్ని పరివేషం అంటారు.

* తోకచుక్క - అరిష్టసూచకం అని పెద్దలంటారు.

* కక్ష్య - ఏనుగు నడుమున కట్టే మోకు.
  మోకు = లావుత్రాడు.

-------------------------------------------------------------------------------------------------



రామరక్షాం పఠేత్ ప్రాజ్ఞః పాపఘ్నీం సర్వకామదాం |
శిరో మే రాఘవః పాతు ఫాలం దశరథాత్మజః || 4 ||




శుభం భూయాత్

2, మే 2012, బుధవారం

రామసుందరం - 4




ఇతి విద్యాధరాశ్శ్రుత్వా                                     ఆ మహాత్ముల మాటలను విని,
వచస్తేషాం మహాత్మనాం |                                  విద్యాధరులు, అప్రమేయుడైన
తమప్రమేయం దదృశుః                                   ఆ వానరోత్తముని చూశారు.
పర్వతే వానరర్షభమ్ || 31 ||

   
దుధువే చ స రోమాణి                                      కొండంతటి హనుమంతుడు
చకంపే చాచలోపమ: |                                      వెండ్రుకలను విదిల్చాడు.
ననాద సుమహానాదం                                     అటూ ఇటూ కదిలాడు.
సుమహానివ తోయద: || 32 ||                           గొప్ప మేఘంలా మహానాదం చేశాడు.


ఆనుపూర్వ్యేణ వృత్తం చ                                  ఎగరడానికి సన్నద్ధుడై, ఆఁదోక*గా ఉండి,           
లాంగూలం లోమభిశ్చితం |                             వెండ్రుకలతో నిండిన తన వాలాన్ని(తోకను)
ఉత్పతిష్యన్ విచిక్షేప                                        గరుత్మంతుడు వ్యాళాన్ని(పామును)
పక్షిరాజ ఇవోరగమ్ || 33 ||                               విదలించినట్లు విదిలించాడు.


తస్య లాంగూల మావిద్ధ                                  ఆ మహావేగవంతుని వెనుక       
మాత్తవేగస్య పృష్ఠతః |                                      వంకరగా వ్రేలాడే ఆ లాంగూలం(తోక)    
దదృశే గరుడేనేవ                                           గరుత్మంతునిచే తీసుకొనిపోయే
హ్రియమాణో మహోరగః || 34 ||                      మహాసర్పంలా కనబడింది.


బాహూ సంస్తంభయామాస                            గొప్ప పరిఘ*ల్లాంటి తన బాహువుల్ని స్తంభింపజేసి,
మహాపరిఘసన్నిభౌ |                                    ఊపిరిని ఊర్ధ్వముఖంగా బిగపట్టి,
ససాద చ కపిః కట్యాం                                     నడుమును సన్నగా చేసి,
చరణౌ సంచుకోచ చ || 35 ||                            పాదాలను ముడుచుకొని,


సంహృత్య చ భుజౌ శ్రీమాన్                            భుజాలను, మెడను బిగపట్టి,
తథైవ చ శిరోధరాం |                                      తనకున్న తేజం, బలం, వీర్యం
తేజస్సత్త్వం తథా వీర్య                                   అంతటినీ పూని,
మావివేశ స వీర్యవాన్ || 36 ||                         (సకల శక్తుల్నీ కేంద్రీకరించి)


మార్గమాలోకయన్ దూరా                               దూరంగా వెళ్లాల్సిన మార్గాన్ని చూస్తూ,
దూర్ధ్వం ప్రణిహితేక్షణః |                                   ఊర్ధ్వంగా దృష్టిని ఉంచి,
రురోధ హృదయే ప్రాణా                                    ఆకాశాన్ని చూస్తూ,
నాకాశ మవలోకయన్ || 37 ||                          హృదయాన ఉచ్ఛ్వాసనిశ్శ్వాసాలను బిగపట్టి,


పద్భ్యాం దృఢమవస్థానం                                పాదాల్ని నేలపై దృఢంగా మోపి,
కృత్వా స కపికుంజరః |                                    చెవుల్ని రిక్కించి,
నికుంచ్య కర్ణౌ హనుమా                                  పై కెగరడానికి సన్నద్ధుడై,
నుత్పతిష్య న్మహాబలః || 38 ||


వానరా న్వానరశ్రేష్ఠ                                        ఆ వానర శ్రేష్ఠుడు, వానరులతో,
ఇదం వచనమబ్రవీత్ |                                    " రాముడు విడచిన బాణం
యథా రాఘవనిర్ముక్తః                                    వాయువేగంతో వెళ్లినట్లు,
శరః శ్వసనవిక్రమః || 39 ||                                మిక్కిలి వేగంతో


గచ్ఛేత్ తద్వద్గమిష్యామి                                  నేను, రావణపాలిత లంక*కు వెళ్తాను.
లంకాం రావణపాలితాం |                                  అక్కడ జానకిని చూడనేని,
నహి ద్రక్ష్యామి యది తాం                
లంకాయాం జనకాత్మజామ్ || 40 ||


అనేనైవ హి వేగేన                                            అదే వేగంతో స్వర్గానికి వెళ్తాను.
గమిష్యామి సురాలయం |                                 అక్కడ కూడా సీతను చూడనిచో,
యది వా త్రిదివే సీతాం
న ద్రక్ష్యా మ్యకృతశ్రమ: || 41 ||


బద్ద్వా రాక్షసరాజాన                                         రావణుని బంధించి, తీసుకొని వస్తాను.
మానయిష్యామి రావణం |                                 ఏదేమైనా, ఏవిధంగానైనా కృతకృత్యుడనై,
సర్వథా కృతకార్యో౭హ                                      సీతతో సహా తిరిగి వస్తాను.
మేష్యామి సహ సీతయా || 42 ||


ఆనయిష్యామి వా లంకాం                                  లేకపోతే, రావణునితో సహా
సముత్పాట్య సరావణాం |                                  లంకను పెల్లగించి, తీసుకొని వస్తాను".
ఏవముక్త్వా తు హనుమాన్                              అని, పలికి,
వానరాన్ వానరోత్తమః || 43 ||


ఉత్పపాతాథ వేగేన                                            ఎట్టి విచారం లేకుండా,
వేగవానవిచారయన్ |                                        వేగంగా ఆకాశానికి ఎగిరాడు.
సుపర్ణమివ చాత్మానం                                       అపుడు ఆయన తనను
మే న స కపికుంజరః || 44 ||                                సుపర్ణుని*లా భావించుకొన్నాడు.


సముత్పతతి తస్మిం స్తు                                    ఆయన ఎగరగానే,
వేగాత్తే నగరోహిణః |                                           ఆ వేగానికి పర్వతంపై గల వృక్షాలన్నీ
సంహృత్య విటపాన్ సర్వాన్                               తమ కొమ్మలతో సహా
సముత్పేతుస్సమంతతః || 45 ||                          ఆకాశానికి ఎగిరాయి.


స మత్తకోయష్టిబకాన్                                        మదించిన కొక్కెరలు, పుష్పాలు
పాదపాన్ పుష్పశాలినః |                                     కలిగిన ఆ వృక్షాల్ని                 
ఉద్వహన్నూరువేగేన                                        తన తొడలవేగంతో వెంట తీసుకొనిపోతూ,
జగామ విమలే(అ)ంబరే || 46 ||                        నిర్మలాకాశంలో పురోగమించాడు.


ఊరువేగోద్ధతా వృక్షా                                         సుదీర్ఘయాత్రకు బయలుదేరిన బంధువును వీడ్కొల్పటానికి
ముహూర్తం కపిమన్వయుః |                            మిగిలినవారు కొంతదూరం అనుసరించినట్లు,
ప్రస్థితం దీర్ఘమధ్వానం                                      వృక్షాలన్నీ ముహూర్తకాలం
స్వబంధుమివ బాంధవాః || 47 ||                        ఆయనను వెంబడించాయి.


తమూరువేగోన్మథితా                                       ఆయన ఊరువేగధాటికి పెల్లగించబడిన
స్సాలాశ్చాన్యే నగోత్తమాః |                                 సాలవృక్షాలు మొదలైన మహావృక్షాలు
అనుజగ్ముర్హనూమంతం                                   సైన్యాలు మహారాజునులా
సైన్యా ఇవ మహీపతిమ్ || 48 ||                         హనుమంతుని అనుసరించాయి.


సుపుష్పితాగ్రైర్బహుభిః                                    బాగా పుష్పించిన
పాదపైరన్వితః కపిః |                                         బహు వృక్షాలనడుమ ఉండి,
హనుమాన్ పర్వతాకారో                                   ఆ హనుమంతుడు
బభూవాద్భుతదర్శనః || 49 ||                            చూసేవారికి ఆశ్చర్యం కలిగించాడు.


సారవంతో౭థ యే వృక్షా                                    దేవేంద్రునికి భయపడి,
న్యమజ్జన్  లవణాంభసి |                                   పర్వతాలు, సముద్రంలో దాక్కొన్నట్లు*,
భయాదివ మహేంద్రస్య                                     (ముందుగా) బరువుగల చెట్లన్నీ
పర్వతా వరుణాలయే || 50 ||                             సముద్రంలో పడి, మునిగిపోయాయి.



-----------------------------------------------------------------------------------------------------




* ఆఁదోక - ఆవుతోక. మొదట లావుగా, వర్తులాకారంగా నుండి, క్రమక్రమంగా సన్నబడిన ఆకృతి.

* పరిఘ - ఇనుప గుదియ.
నాలుగుమూరల నిడివి గల దండం.

* లంక - విశ్వకర్మ అనే దేవశిల్పి,
మాల్యవదాదుల కోరిక మీద పసిడిభవనాలతో
నిర్మించిన సుందరనగరం.
పిదప కుబేరుని స్వాధీనమైంది.
ఆ తరువాత రావణుడు దాన్ని ఆక్రమించుకొన్నాడు.

* సుపర్ణుడు - మంచిఱెక్కలు గలవాడు అని వ్యుత్పత్తి.
గరుత్మంతుడు.
వినత కశ్యపులకు జన్మించిన వాడు.
పుట్టగానే ఆకాశాని కెగిరి, తిరిగి వచ్చినవాడు.
మాతృభక్తి కలవాడు.
అనూరుడు ఇతని సోదరుడు
ఇతనికి విష్ణువే స్వయంగా తనకు వాహనమయ్యేలా వరం ఇచ్చాడు.

* వివరణ - పర్వతాలు ప్రజాపతి సంతానం.
వాటికి మొదట ఱెక్కలు ఉండేవి.
అవి తమ ఇచ్ఛవచ్చినచోటుకు ఎగిరిపోయి,
వ్రాలుతూండటంతో ప్రజలకు, భూమికి బాధలు కలుగుతూండేవి.
దాంతో ఇంద్రుడు వాటి ఱెక్కలు తెగగొట్టాడు.
ఈ ఱెక్కలే మేఘాలయ్యాయి.

---------------------------------------------------------------------------------------------------



సాసితూణధనుర్బాణ పాణిం నక్తంచరాంతకం |
స్వలీలయా జగత్త్రాతు మావిర్భూత మజం విభుం || 3 ||







శుభం భూయాత్