15, నవంబర్ 2013, శుక్రవారం

రామసుందరం - తొమ్మిదవసర్గం - 2





సుందరకాండ - నవమస్సర్గము - 2

తతో౭పశ్యత్ కుథాసీనం
నానావర్ణాంబరస్రజమ్ |
సహస్రం వరనారీణాం
నానావేషవిభూషితమ్ || 34 ||
నానావిధవర్ణవస్తాలు, పూలమాలలు,
వివిధవేషభూషణాలు కలిగి
కంబళాలపై నిద్రించిన
వేలకొలది అందగత్తెలను హనుమంతుడు చూశాడు.


పరివృత్తే౭ర్ధరాత్రే తు
పాననిద్రావశంగతమ్ |
క్రీడిత్వోపరతం రాత్రౌ
సుష్వాప బలవత్తదా|| 35 ||
వారు అర్ధరాత్రి దాకా క్రీడావినోదాలతో అలసిపోయి,
తృప్తి లేనివారయినా,
మద్యపానమత్తుకు లోబడి,
బలవంతంగా నిద్రించారు


తత్ప్రసుప్తం విరురుచే
నిశ్శబ్దాంతరభూషణమ్ |
నిశ్శబ్దహంసభ్రమరం
యథా పద్మవనం మహత్ || 36 ||
వారితో పాటు వారి ఆభరణాలు
కూడా నిశ్చలమై, అంతా నిశ్శబ్దం ఆవరించింది.
ఆ దృశ్యం, - కదలని హంసలు, భ్రమరాలు కల
పద్మవనంలా అందంగా ఉంది.


తాసాం సంవృతదంతాని
మీలితాక్షీణి మారుతి: |
అపశ్యత్పద్మగంధీని
వదనాని సుయోషితామ్ || 37 ||
కండ్లు, పెదాలు మూసుకొని, నిద్రిస్తున్నారు వారు.
పద్మాల్లా సుగంధాలు వెదజల్లే
వారి ముఖాలను
హనుమంతుడు చూశాడు


ప్రబుద్ధానీవ పద్మాని
తాసాం భూత్వా క్షపాక్షయే |
పునస్సంవృతపత్రాణి
రాత్రావివ బభుస్తదా || 38 ||
వారి ముఖాలు
ఉదయం వికసించి,
రాత్రి ముకుళించిన
కమలాల్లా ఉన్నాయి.


ఇమాని ముఖపద్మాని
నియతం మత్తషట్పదా: |
అంబుజానీవ ఫుల్లాని
ప్రార్థయంతి పున: పున: || 39 ||
నిజంగానే పద్మాలనుకొని,
తుమ్మెదలు
వారి ముఖాలను
మాటిమాటికి కోరుతున్నాయి.


ఇతి చామన్యత శ్రీమాన్
ఉపపత్త్యా మహాకపి: |
మేనే హి గుణతస్తాని
సమాని సలిలోద్భవై: || 40 ||
సుగంధాది గుణాలవల్ల
ఆ ముఖాలను
పద్మాలతో పోల్చవచ్చని
హనుమంతుడనుకొన్నాడు.


సా తస్య శుశుభే శాలా
తాభిఃస్త్రీభిర్విరాజితా |
శారదీవ ప్రసన్నా ద్యౌ:
తారాభిరభిశోభితా || 41 ||
అలాంటి తరుణీమణులతో
ఆ గృహం
తారకలతో కూడిన
శరత్కాలపు ఆకాశంలా ఉంది.


స చ తాభి: పరివృత:
శుశుభే రాక్షసాధిప: |
యథా హ్యుడుపతిశ్శ్రీమాన్
తారాభిరభిసంవృత: || 42 ||
ఆ రమణులతో చుట్టబడి ఉన్న
రావణుడు
తారాపరివృతుడైన
కళానిధిలా ఉన్నాడు.


యాశ్చ్యవంతే౭Oబరాత్తారా:
పుణ్యశేషసమావృతా: |
ఇమాస్తాస్సంగతా: కృత్స్నా
ఇతి మేనే హరిస్తదా || 43 || 
"అనుభవించినా కూడా
ఇంకా పుణ్యం మిగిలిఉండటంతో
భూమిపై రాలిన తారలే ఈ వనితలు"
అని హనుమంతుడు భావించాడు.


తారాణామివ సువ్యక్తం
మహతీనాం శుభార్చిషామ్ |
ప్రభావర్ణప్రసాదాశ్చ
విరేజుస్తత్ర యోషితామ్ || 44 ||
ఆ స్త్రీలందఱూ
నక్షత్రాల కాంతిని,
రంగును,
నిర్మలత్వాన్ని కలిగి ఉన్నారు.


వ్యావృత్తగురుపీనస్ర
క్ప్రకీర్ణవరభూషణా: |
పానవ్యాయామకాలేషు
నిద్రాపహృతచేతస: || 45 ||
పానవ్యాయామకాలాల్లో
ఆ యువతుల పెద్ద లావు పూలమాలలు తారుమారయ్యాయి.
ఆభరణాలన్నీ అటూ ఇటూ చెదిరాయి.
నిద్రలో మునగడంతో మనోవ్యాపారాలన్నీ ఆగాయి.


వ్యావృత్తతిలకా: కాశ్చిత్
కాశ్చిదుద్భ్రాంతనూపురా: |
పార్శ్వే గళితహారాశ్చ
కాశ్చిత్ పరమయోషిత: || 46 ||


కొందఱి తిలకాలు చెదిరాయి.
కొందఱి అందెలు స్థానాలు తప్పాయి.
కొందఱి కంఠహారాలు ప్రక్కకు జారాయి.
ముక్తాహారా౭౭వృతాశ్చాన్యా:
కాశ్చిద్విస్రస్తవాసస: |
వ్యావిద్ధరశనాదామా:
కిశోర్య ఇవ వాహితా: || 47 ||
కొందఱి ముత్యాలహారాలు తెగి, వారి మీదే పడి ఉన్నాయి.
కొందఱి వస్త్రాలు జారిపోయాయి.
కొందఱి మొలనూలు తెగి, వదులవడంతో, వారు, వదులైన కట్టు కలిగి,
భూమిపై అటూ ఇటూ పొర్లాడే ఆడుగుఱ్ఱపుపిల్లల్లా ఉన్నారు.


సుకుండలధరాశ్చాన్యా
విచ్ఛిన్నమృదితస్రజ: |
గజేంద్రమృదితా: ఫుల్లా
లతా ఇవ మహావనే || 48 ||
కొందఱి పూలమాలలు తెగి,
నలిగిపోయి ఉన్నాయి.
దాంతో వారు
అడవిలో గజరాజు తాకిడితో నలగిన లతల్లా ఉన్నారు.


చంద్రాంశుకిరణాభాశ్చ
హారా: కాసాంచిదుత్కటా: |
హంసా ఇవ బభుస్సుప్తా:
స్తనమధ్యేషు యోషితామ్ || 49 ||
కొందఱు వక్షాలపై ధరించిన హారాలు
తెల్లగా పెద్దగా ఉండటంతో
అవి,
నిద్రిస్తున్న హంసల్లా ఉన్నాయి.


అపరాసాం చ వైడూర్యా:
కాదంబా ఇవ పక్షిణ: |
హేమసూత్రాణి చాన్యాసాం
చక్రవాకా ఇవాభవన్ || 50 ||
కొందఱి వైడూర్యమణిహారాలు
కాదంబాల్లా (ధూమ్రవర్ణపు ముక్కు, కాళ్లు, ఱెక్కలు కల హంసలు),
కొందఱి హేమసూత్రహారాలు
జక్కవల్లా ఉన్నాయి.


హంసకారండవాకీర్ణా:
చక్రవాకోపశోభితా: |
ఆపగా ఇవ తా రేజు:
జఘనై: పులినైరివ || 51 ||
పెద్ద ఇసుకతిన్నెల్లాంటి జఘనాలున్న
ఆ జవ్వనులు,
హంసలు, కన్నెలేడి పిట్టలు, చక్రవాకాలతో కూడిన
నదుల్లా ఉన్నారు.


కింకిణీజాలసంకోశా:
తా హైమవిపులాంబుజా: |
భావగ్రాహా యశస్తీరా:
సుప్తా నద్య ఇవా౭౭బభు: || 52 ||
చిఱుగజ్జెలు - మొగ్గలు,
బంగారు ఆభరణాలు - పెద్ద కమలాలు,
మనోభావాలు - మొసళ్లు,
యశస్సులు - తీరాలు,
వారు నదుల్లా ఉన్నారు.


మృదుష్వంగేషు కాసాంచిత్
కుచాగ్రేషు చ సంస్థితా: |
బభూవుర్భూషణానీవ
శుభా భూషణరాజయ: || 53 ||
(నిద్రకు ముందు నగలు తీసివేసిన)
కొందఱి అతివల మెత్తని అవయవాల్లోనూ వక్షాలపైనా ఉన్న
(ఎడతెగక ధరించడంతో ఏర్పడిన) నగల చక్కని ఆనవాళ్లు,
భూషణాలుగానే శోభిస్తున్నాయి.


అంశుకాంతాశ్చ కాసాంచిత్
ముఖమారుతకంపితా: |
ఉపర్యుపరి వక్త్రాణాం
వ్యాధూయంతే పున: పున: || 54 ||
కొందఱు ముఖాలపై కప్పుకొన్న
అంశుకాంతాలు ,
వారి ఉచ్ఛ్వాసనిశ్శ్వాసాలకు
మాటిమాటికీ రెపరెపలాడుతున్నాయి.


తా: పతాకా ఇవోద్ధూతా:
పత్నీనాం రుచిరప్రభా: |
నానావర్ణసువర్ణానాం
వక్త్రమూలేషు రేజిరే || 55 ||
నానావిధవన్నెచిన్నెలతో శోభిల్లే
ఆ మగువల ముఖాలపై
మనోజ్ఞప్రభలు కల చీరెల చెఱగులు
ఎగురవేసిన పతాకాల్లా ఉన్నాయి.


వవల్గుశ్చాత్ర కాసాంచిత్
కుండలాని శుభార్చిషామ్ |
ముఖమారుతసంసర్గాత్
మందం మందం సుయోషితామ్ || 56 ||

కొందఱి కుండలాలు
వారి ముఖవాయుస్పర్శల ప్రభావంతో
తిన్నతిన్నగా
కదులుతున్నాయి.

శర్కరాసవగంధైశ్చ
ప్రకృత్యా సురభిస్సుఖ: |
తాసాం వదననిశ్శ్వాస:
సిషేవే రావణం తదా || 57 ||
సహజంగానే సువాసనభరితాలై,
సుఖాన్నిచ్చే వారి నిశ్శ్వాసాలు
మధురాలైన మద్యాల గుబాళింపులతో
రావణుని సేవించాయి.


రావణాననశంకాశ్చ
కాశ్చిద్రావణయోషిత: |
ముఖాని స్మ సపత్నీనామ్
ఉపాజిఘ్రన్ పున: పున: || 58 ||
రావణపత్నులు కొందఱు
రావణుని ముఖమనుకొని,
సవతుల ముఖాలను
మళ్లీ మళ్లీ ముద్దాడారు.


అత్యర్థం సక్తమనసో
రావణే తా వరస్త్రియ: |
అస్వతంత్రాస్సపత్నీనాం
ప్రియమేవా౭౭చరంస్తదా || 59 ||
రావణసక్తమనస్కులైన ఆ సవతులు కూడా,
మధుపానపరవశంతో
(రావణుడే ముద్దాడినట్లు భావించి)
సపత్నులకు ప్రియం కలిగిస్తున్నారు.


బాహూనుపనిధాయాన్యా:
పారిహార్యవిభూషితాన్ |
అంశుకాని చ రమ్యాణి
ప్రమదాస్తత్ర శిశ్యిరే || 60 ||
కొందఱు కంకణాలంకృతాలైన బాహువుల్ని,
కొందఱు వస్త్రాల్ని
తలగడలుగా చేసుకొని,
శయనించారు.


అన్యా వక్షసి చాన్యస్యా:
తస్యా:కాశ్చిత్ పునర్భుజమ్ |
అపరా త్వంకమన్యస్యా:
తస్యా శ్చాప్యపరా భుజౌ || 61 ||
ఒక పడతి మఱొక యువతి వక్షంపై తల ఉంచితే,
ఆమె భుజాన్నిమఱో భామిని తలగడగా చేసుకొంది.
ఒక వనిత మఱొక ముదిత ఒడిని ఆశ్రయిస్తే,
ఒక తన్వి మఱొక ఇంతి భుజాలపై తలపెట్టి నిద్రలో మునిగింది.


ఊరుపార్శ్వకటీపృష్ఠమ్
అన్యో౭న్యస్య సమాశ్రితా: |
పరస్పరనివిష్టాంగ్యో
మదస్నేహవశానుగా: || 62 ||
ఆ స్త్రీలందఱూ పరస్పరం
తొడలను, పార్శ్వాలను, కటిప్రదేశాలను, వీపులను
ఆధారంగా చేసుకొని,
అన్యోన్యం అవయవాలను పడవేసి, నిద్రించారు.


అన్యోన్యభుజసూత్రేణ
స్త్రీమాలా గ్రథితా హి సా |
మాలేవ గ్రథితా సూత్రే
శుశుభే మత్తషట్పదా || 63 ||
కొందఱు వరుసగా భుజాలు చాచి, పండుకొన్నారు.
అందువల్ల అది స్త్రీమాల గా కనిపిస్తోంది.
మాలలా ఉన్నభుజాలపై వారి తలవెండ్రుకలు
పూలదండపై తుమ్మెదల్లా నిగనిగలాడుతున్నాయి.


లతానాం మాధవే మాసి
ఫుల్లానాం వాయుసేవనాత్ |
అన్యోన్యమాలాగ్రథితం
సంసక్తకుసుమోచ్చయమ్ || 64 ||
వ్యతివేష్టిత సుస్కంధమ్
అన్యోన్యభ్రమరాకులమ్ |
ఆసీద్వనమివోద్ధూతం
స్త్రీవనం రావణస్య తత్ || 65 ||
మాలికలా ఏర్పడి,
పుష్పాలు ధరించి,
ఒకరినొకరు చుట్టుకొని (చెట్టుబోదెలమీద అల్లుకొని)
చెదరిన ముంగురులు (తుమ్మెదలు)
ముఖమారుతం (వాయువు) వల్ల
కదలే కొంగులు కల
ఆ రావణస్త్రీవనం
వసంతవైశాఖంలోని లతావనంలా ఉంది.


ఉచితేష్వసి సువ్యక్తం
న తాసాం ఓషితాం తదా |
వివేకశ్శక్య ఆధాతుం
భూషణాంగాంబరస్రజామ్ || 66 ||
ఆ సమయంలో
ఆ అతివల ఆభరణాలు, అవయవాలు, వస్త్రాలు, పూలమాలలు
ఉండవలసినచోటే ఉన్నా,
అందఱూ కలసి పండుకోవటంవల్ల 
ఏవి ఎవరివో తెలియటం లేదు.


రావణే సుఖసంవిష్టే
తా: స్త్రియో వివిధప్రభా: |
జ్వలంత: కాంచనా దీపా:
ప్రైక్షంతా౭నిమిషా ఇవ || 67 ||
రావణుడు మేల్కొని ఉండగా చూడ్డం అసాధ్యం కాబట్టి,
అక్కడి స్వర్ణస్తంభదీపాలు,
రావణుడు నిద్రపోయాక, ఆ ముదితలను ఱెప్పపాటు లేకుండా చూస్తున్నట్లున్నాయి. (నిశ్చలమయ్యాయి)


రాజర్షిపితృదైత్యానాం
గంధర్వాణాం చ యోషిత: |
రాక్షసానాం చ యా: కన్యా:
తస్య కామవశం గతా: || 68 ||
రాజర్షుల, పితృదేవతల, దైత్యుల, గంధర్వుల కాంతలు,
రాక్షసకన్నెలు
ఆ రావణుని
వలచి వచ్చారు.


యుద్ధకామేన తాస్సర్వా
రావణేన హృతాస్త్ర్సియ: |
సమదా మదనేనైవ
మోహితా: కాశ్చిదాగతా: || 69 ||
ఆ ఆడువారందఱూ
యుద్ధకాముడైన రావణునిచేత
అపహరింపబడినవారే.
కొందఱు మాత్రం రావణుని మోహించి వచ్చారు.


న తత్ర కాచిత్ ప్రమదా ప్రసహ్య
వీర్యోపపన్నేన గుణేన లబ్ధా |
న చాన్యకామాపి న చాన్యపూర్వా
వినా వరార్హాం జనకాత్మజాం తామ్ || 70 ||
సీత తప్ప
తక్కిన ప్రతి వనితా
రావణుని పరాక్రమాది గుణాలకు మోహించి వచ్చిందే కానీ
బలాత్కారంగా తేబడినది కాదు.
ఆ స్త్రీలలో మఱొకరి ప్రియురాలూ లేదు. మఱొకరి భార్యా లేదు.


న చాకులీనా న చ హీనరూపా
నాదక్షిణా నానుపచారయుక్తా |
భార్యా౭భవత్ తస్య న హీనసత్త్వా
న చాపి కాంతస్య న కామనీయా || 71 ||

ఆ కాంతలందఱూ
మంచివంశంలో పుట్టినవారు, అందగత్తెలు, జాణలు,
ఉపచారయుక్తలు, బుద్ధిమంతులు,
భర్తకు మరులు గొల్పేవారు.

బభూవ బుద్ధిస్తు హరీశ్వరస్య
యదీదృశీ రాఘవధర్మపత్నీ |
ఇమా యథా రాక్షసరాజభార్యా:
సుజాతమస్యేతి హి సాధుబుద్ధే: || 72 ||
"రావణుని చేరి, అతడి భార్యలు సుఖంగా ఉన్నట్లే,
సీత కూడా రాముని చేరి, హాయిగా ఉంటే
ఈ రావణునికి శుభం కల్గుతుంది. (సీతను అపహరించకున్నా / ఆమెను రామునికి అప్పగించినా రావణునికి మేలే జరుగుతుంది)


పునశ్చ సో౭చింతయదార్తరూపో
ధ్రువం విశిష్టా గుణతో హి సీతా |
అథాయమస్యాం కృతవాన్ మహాత్మా
లంకేశ్వర: కష్టమనార్యకర్మ || 73 ||
సద్గుణాల్లో ఈ కాంతలకన్నా
సీత ఎంతో అధికురాలు.
అటువంటి సీతను అపహరించి, ఆమె విషయంలో
రావణుడెంతో అనుచితమైన పని చేశాడు".
అని హనుమంతుడు చింతించాడు.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే నవమస్సర్గః (9)