19, ఏప్రిల్ 2013, శుక్రవారం

రామసుందరం - రెండవ సర్గము - 1


                                             బ్లాగ్ మిత్రులందఱికీ  "శ్రీరామనవమి" శుభాకాంక్షలు


సుందరకాండము - రెండవ సర్గము

లంకానగరవర్ణనం - అందు ప్రవేశించే విషయంలో హనుమంతుని ఆలోచన - లఘురూపంలో ఆయన నగరంలో ప్రవేశించడం -  చంద్రోదయం

              
స సాగరమనాధృష్యమ్
అతిక్రమ్య మహాబల:|
త్రికూట శిఖరే లంకాం
స్థితాం స్వస్థో దదర్శ హ|| 1
ఆ మహాబలుడు,
సముద్రాన్ని అవలీలగా దాటి,
స్వస్థచిత్తుడై,
త్రికూటశిఖరాన ఉన్న లంకను చూశాడు.


తత: పాదపముక్తేన
పుష్ప వర్షేణ వీర్యవాన్|
అభివృష్ట: స్థితస్తత్ర
బభౌ పుష్పమయో యథా|| 2
ఆ పర్వతం మీద వృక్షాలు
వర్షంలా కురిపించే పూలతో ,
ఆయన శరీరం,
పుష్పమయమైంది.


యోజనానాం శతం శ్రీమాన్
తీర్త్వా౭ప్యుత్తమవిక్రమ:|
అనిశ్శ్వసన్ కపిస్తత్ర
న గ్లాని మధిగచ్ఛతి|| 3


నూఱు యోజనాల సముద్రాన్ని దాటి కూడా
ఆయన ఏమాత్రం అలసట పొందలేదు.
పైగా 
ఒక్క నిట్టూర్పు నైనా విడవలేదు.
శతాన్యహం యోజనానాం
క్రమేయం సుబహూన్యపి|
కిం పున స్సాగర స్యాంతం
సంఖ్యాతం శతయోజనమ్|| 4
"వందల యోజనాలనైనా దాటగలను.
ఒక్క నూఱు యోజనాల సముద్రాన్ని
దాటడంలో ఆశ్చర్యమేముంది"
అనుకొన్నాడు.


స తు వీర్యవతాం శ్రేష్ఠ:
ప్లవతామపి చోత్తమ:|
జగామ వేగవాన్ లంకాం
లంఘయిత్వా మహోధధిమ్|| 5


వీరులలో శ్రేష్ఠుడు,
ఎగిరేవారిలో ఉత్తముడు కాబట్టి
ఆయన మహసముద్రాన్ని దాటి,
లంకను చేరగలిగాడు.
శాద్వలాని చ నీలాని
గంధవంతి వనాని చ|
గండవంతి చ మధ్యేన
జగామ నగవంతి చ|| 6


ఆయన, నల్లని పచ్చిక నేలలు, గండశిలలు,
నగాలు, (వృక్షాలు, కొండలు)
సువాసనలు కలిగిన అడవులను
మధ్యమార్గాన చూస్తూ వెళ్లాడు.
శైలాంశ్చ తరుసంఛన్నాన్
వనరాజీశ్చ పుష్పితా:|
అభిచక్రామ తేజస్వీ
హనుమాన్ ప్లవగర్షభ:|| 7


దట్టంగా వృక్షాలున్న
పర్వత శిఖరాలను,
పుష్పించిన వనాలను
దాటాడు.
స తస్మిన్నచలే తిష్ఠన్
వనాన్యుపవనాని చ|
స నగాగ్రే చ తాం లంకాం
దదర్శ పవనాత్మజ:|| 8


ఆయన, లంబపర్వతంపై ఉండి,
అక్కడి వనాలను, ఉపవనాలను, (తోటలను)
త్రికూట పర్వత శిఖరంపై ఉన్న
లంకను చూశాడు.
సరళాన్ కర్ణికారాంశ్చ
ఖర్జూరాంశ్చ సుపుష్పితాన్|
ప్రియాళాన్ ముచుళిందాంశ్చ
కుటజాన్ కేతకానపి|| 9


అక్కడి
సరళ (దేవదారు), కొండగోగు,
ఖర్జూరం, మోరటి, నిమ్మ చెట్లను,
కొండమల్లె, మొగలి పొదలను,
ప్రియంగూన్ గంధపూర్ణాంశ్చ
నీపాన్ సప్తచ్ఛదాం స్తథా|
అసనాన్ కోవిదారాంశ్చ
కరవీరాంశ్చ పుష్పితాన్|| 10


సువాసనల పిప్పలి,
కడిమి, ఏడాకుల అరటి,
వేగిస, కాంచన,
పుష్పించిన గన్నేరు చెట్లను,
పుష్పభారనిబద్ధాంశ్చ
తథాముకుళితానపి|
పాదపాన్ విహగాకీర్ణాన్
పవనాధూతమస్తకాన్|| 11


పూలభారంతో వంగిన,
మొగ్గ తొడిగిన,
వివిధ పక్షులతో నిండిన,
గాలికి తలలూపే ఇతర చెట్లను,
హంసకారండవాకీర్ణా
వాపీ: పద్మోత్పలాయుతా:|
ఆక్రీడాన్ వివిధాన్ రమ్యాన్
వివిధాంశ్చ జలాశయాన్|| 12


హంసలు, కారండపక్షులు,
పద్మాలు, కలువలు కల దిగుడుబావులు,
సుందర విహారస్ఠలాలు,
జలాశయాలు,
సంతతాన్ వివిధైర్వృక్షై:
సర్వర్తుఫలపుష్పితై:|
ఉద్యానాని చ రమ్యాణి
దదర్శ కపికుంజర:|| 13


అన్ని ఋతువుల్లోనూ
పుష్పించే, ఫలించే వృక్షాలను,
అందమైన ఉద్యానవనాలను,
ఆయన, చూశాడు.
సమాసాద్య చ లక్ష్మీవాన్
లంకాం రావణపాలితామ్|
పరిఖాభి: సపద్మాభి:
సోత్పలాభి రలంకృతామ్|| 14


లంకను సమీపించాడు.
ఆ లంక
పద్మాలు, కలువలు కల అగడ్తలతో,
సీతాపహరణార్థేన
రావణేన సురక్షితామ్|
సమంతాద్విచరద్భిశ్చ
రాక్షసైరుగ్రధన్విభి:|| 15


సీతను అపహరించిన
రావణుని రక్షణలో ఉంది.
ఉగ్రధనస్సులను ధరించిన
రాక్షసులు కావలి కాస్తున్నారు.
కాంచనేనావృతాం రమ్యాం
ప్రాకారేన మహాపురీమ్|
గృహైశ్చ గ్రహసంకాశై:
శారదాంబుదసన్నిభై:|| 16


బంగారు ప్రాకారాలతో,
తెల్లని,
గ్రహ సదృశ (సమాన) గృహాలతో,
పాండురాభి: ప్రతోళీభి:
ఉచ్చాభి రభిసంవృతామ్|
అట్టాలకశతాకీర్ణాం
పతాకాధ్వజశోభితామ్|| 17


స్వచ్ఛాలై,
విశాలమైన ప్రధాన వీథులతో,
లెక్కలేనన్ని కోట బురుజులతో,
పతాక ధ్వజాలతో,
తోరణై: కాంచనైర్దివ్యై:
లతాపంక్తివిచిత్రితై:|
దదర్శ హనుమాన్ లంకాం
దివి దేవపురీం యథా|| 18


బంగారు తోరణాలతో,
విచిత్ర లతా పంక్తులతో,
అమరావతిలా
వెలిగిపోతోంది.
గిరిమూర్ధ్ని స్థితాం లంకాం
పాండురైర్భవనై: శ్శుభై:|
దదర్శ స కపిశ్రేష్ఠ:
పురమాకాశగం యథా|| 19


తెల్లని, అందమైన భవనాలతో ఆ లంక,
త్రికూట శిఖరాన ఉండడంతో,
హనుమంతుడు,
దాన్ని, 'ఆకాశపురం'గా భావించాడు.
పాలితాం రాక్షసేంద్రేణ
నిర్మితాం విశ్వకర్మణా|
ప్లవమానామివాకాశే
దదర్శ హనుమాన్ పురీమ్|| 20


రావణ పాలితమై,
విశ్వకర్మ నిర్మితమైన ఆ పురం,
'ఆకాశంలో తేలియాడుతోందా'
అన్నట్లుంది.
వప్రప్రాకారజఘనాం
విపులాంబునవాంబరామ్|
శతఘ్నీశూలకేశాంతామ్
అట్టాలకవతంసకామ్|| 21


కోట ప్రాకారమే జఘనంగా,
విపులమైన సముద్ర / అగడ్తలలోని జలాలే
నూత్నవస్త్రాలుగా,
శతఘ్నులు, శూలాలే కేశపాశాలుగా,
కోట బురుజులే కర్ణాభరణాలుగా భాసిల్లే, సుందరిలా,


మనసేవ కృతాం లంకాం
నిర్మితాం విశ్వకర్మణా|
ద్వార ముత్తర మాసాద్య
చింతయామాస వానర:|| 22


విశ్వకర్మ,
మనసు పెట్టి నిర్మించిన,
ఆ లంక ఉత్తరద్వారం దగ్గరకు చేరి,
మారుతి, ఆలోచన మొదలుపెట్టాడు.
కైలాసశిఖరప్రఖ్యామ్
ఆలిఖంతీ మివాంబరమ్|
డీయమానా మివాకాశమ్
ఉచ్ఛ్రితై ర్భవనోత్తమై:|| 23


"ఈ నగరం,
కైలాస శిఖర సమానమై,
అంబరాన్నంటే మహాభవనాలతో,
ఆకాశంలో ఎగురుతోందా? అన్నట్లుంది.

సంపూర్ణాం రాక్షసైర్ఘోరై:
నాగైర్భోగవతీమివ|
అచింత్యాం సుకృతాం స్పష్టాం
కుబేరాధ్యుషితాం పురా|| 24
పూర్వం కుబేరుని అధీనంలో ఉండి,
స్పష్టంగా, చక్కగా నిర్మింపబడిన ఈ పురం
నాగజాతులుండే
భోగవతి (పాతాళం) లా
భయంకరమైన రాక్షసులతో నిండి ఉంది.


దంష్ట్రిభిర్బహుభిశ్శూరైః
శూలపట్టిసపాణిభి:|
రక్షితాం రాక్షసైర్ఘోరై:
గుహామాశీవిషైరివ|| 25


సర్పాలు కావలి కాచే గుహలా, ఈ లంక,
కోఱలు, శూలాలు, పట్టిసాలు, ధరించిన
ఎంతోమంది శూరులైన రాక్షసులచే
రక్షింపబడుతోంది".
తస్యాశ్చ మహతీం గుప్తిం
సాగరం చ నిరీక్ష్య స:|
రావణం చ రిపుం ఘోరం
చింతయామాస వానర:|| 26
లంక రక్షణ విధానాన్ని,
దాని చుట్టూ ఉన్న సముద్రాన్ని చూచి,
మారుతి,
రావణుని భయంకరమైన శత్రువుగా
భావించి, ఇలా ఆలోచించాడు.

ఆగత్యాపీహ హరయో
భవిష్యంతి నిరర్థకా:|
న హి యుద్ధేన వై లంకా
శక్యా జేతుం సురైరపి|| 27


"వానరులు ఇక్కడికి వచ్చినా
ఏం ప్రయోజనం లేదు.
ఈ లంకను జయించడం
దేవతలవల్ల కూడా కాదు.
ఇమాం తు విషమాం దుర్గాం
లంకాం రావణపాలితామ్|
ప్రాప్యాపి స మహాబహు:
కిం కరిష్యతి రాఘవ:|| 28
ఎంతటివారికైనా
ప్రవేశించ శక్యం కానిది ఇది.
రాముడు, మహాబాహువైనా
లంకను చేరి, ఏం చేయగలడు?

   




శుభం భూయాత్                                                                                                                     

కామెంట్‌లు లేవు: