9, ఏప్రిల్ 2013, మంగళవారం

రామసుందరం - 12




వ్యవర్ధత మహాకాయ:
ప్రావృషీవ బలాహక:|
తస్య సా కాయముద్వీక్ష్య
వర్ధమానం మహాకపే:|| 191
ఆ మహాకపి,
వర్షాకాలమేఘంలా శరీరాన్ని పెంచాడు.
పెఱుగుతున్న
ఆ మహాకాయాన్ని చూచి,



వక్త్రం ప్రసారయామాస
పాతాళాంతరసన్నిభమ్|
ఘనరాజీవ గర్జంతీ
వానరం సమభిద్రవత్|| 192



సింహిక పాతాళకుహరం లాంటి
తన నోటిని తెఱచింది.
మేఘమండలంలా గర్జిస్తూ,
హనుమంతుని పట్టుకోబోయింది.


స దదర్శ తత స్తస్యా
వివృతం సుమహన్ముఖమ్|
కాయమాత్రం చ మేధావీ
మర్మాణి చ మహాకపి:|| 193



ఆయన,
తెఱవబడిన ఆ నోటిని చూచి,
దాని జీవస్థానాల్ని కనిపెట్టాడు.
స తస్యా వివృతే వక్త్రే
వజ్రసంహనన: కపి:|
సంక్షిప్య ముహురాత్మానం
నిష్పపాత మహాబల:|| 194



వజ్రదేహుడైన ఆ మహాబలుడు,
తన దేహాన్ని సంక్షిప్తంగా చేసికొని,
సింహిక నోటిలోకి ప్రవేశించాడు.
ఆస్యే తస్యా నిమజ్జంతం
దదృశు: సిద్ధచారణా:|
గ్రస్యమానం యథాచంద్రం
పూర్ణం పర్వణి రాహుణా|| 195



అలా ప్రవేశిస్తున్నప్పుడు ఆ హనుమంతుడు,
పున్నమినాడు  రాహువుచే మ్రింగబడుతున్న నిండు చంద్రునిలా సిద్ధచారణులకు కనిపించాడు.


తతస్తస్యా నఖైస్తీక్ష్ణై:
మర్మాణ్యుత్కృత్య వానర:|
ఉత్పపాతాథ వేగేన
మనస్సంపాతవిక్రమ: || 196



వాడియైన గోళ్లతో
సింహిక మర్మస్థానాలను చీల్చి,
మనోవేగంతో
ఆకాశంలోకి ఎగిరాడు.


తాం తు దృష్ట్వా చ ధృత్యా చ
దాక్షిణ్యేన నిపాత్య చ|
స కపిప్రవరో వేగాత్
వవృధే పునరాత్మవాన్|| 197 



ధైర్యంతోనూ, సామర్థ్యంతోనూ
ఆ సింహికను పడద్రోసి,
వేగంగా మళ్లీ దేహాన్ని పెంచాడు.

హృతహృత్ సా హనుమతా
పపాత విధురా౭Oభసి|
స్వయంభువైవ హనుమాన్
సృష్టస్తస్యా నిపాతనే|| 198
అలా హనుమంతుడు
సింహిక గుండెల్ని చీల్చేయగా,
అది, స్మృతి తప్పి, నీటిలో పడింది.
హనుమంతుడు సింహికను హతమార్చడం
బ్రహ్మసంకల్పం / దైవనిర్ణయం.



తాం హతాం వానరేణాశు
పతితాం వీక్ష్య  సింహికామ్| భూతాన్యాకాశచారీణి
తమూచు: ప్లవగోత్తమమ్|
భీమమద్య కృతం కర్మ
మహత్ సత్త్వం త్వయా హతమ్|| 199
సింహికను చూసి,
ఆకాశసంచారులైన భూతాలు
సంతోషంతో హనుమంతునితో,
ఇలా అన్నాయి.
"భయం కలిగించేలా
ఈ మహాప్రాణిని హతమార్చావు.



సాధయార్థ మభిప్రేతమ్
అరిష్టం ప్లవతాం వర|
యస్య త్వేతాని చత్వారి
వానరేంద్ర యథా తవ|
ధృతి ర్దృష్టి ర్మతిర్దాక్ష్యం
స్వకర్మసు న సీదతి || 200
ఇక నీవనుకొన్నది సాధించు.
నీకులా
ధృతి, (ధైర్యం)
దృష్టి, (దూర, సూక్ష్మ దృష్టులు)
మతి, (ఆలోచన, తత్త్వనిశ్చయశక్తి, సమయస్పూర్తి)
దాక్ష్యం (దక్షత / పటుత్వం / సామర్థ్యం)
ఈ నాలుగు లక్షణాలు కలవాడు
తన పనులను నెరవేర్చుకోవడంలో
శ్రమ పొందడు".



స తైస్సంభావిత: పూజ్య:
ప్రతిపన్నప్రయోజన:|
జగామాకాశమావిశ్య
పన్నగాశనవత్ కపి:|| 201
అని వారిచేత పూజింపబడి,
ఆకాశమార్గాన
గరుత్మంతునిలా
సాగిపోయాడు.



ప్రాప్తభూయిష్ఠపారస్తు
సర్వత: ప్రతిలోకయన్|
యోజనానాం శతస్యాంతే
వనరాజిం దదర్శ స:|| 202
నూఱామడలు అంతమయ్యాక
ఆవలి తీరాన్ని చేరి,
నలువైపుల చూస్తూండగా,
అడవుల గుంపొకటి కనిపించింది.


దదర్శ చ పతన్నేవ
వివిధద్రుమభూషితమ్|
ద్వీపం శాఖామృగశ్రేష్ఠో
మలయోపవనాని చ|| 203
భూమిపైకి దిగుతూనే,
వివిధ వృక్షాలతో విభూషితమైన,
లంకాద్వీపాన్ని,
మలయపర్వతమందలి ఉపవనాల్నిచూశాడు.


సాగరం సాగరానూపం
సాగరానూపజాన్ ద్రుమాన్|
సాగరస్య చ పత్నీనాం
ముఖాన్యపి విలోకయన్|
స మహామేఘసంకాశం
సమీక్ష్యాత్మానమాత్మవాన్|| 204



సాగరాన్ని,
సాగరతీరాన్ని.
సాగరతీరమందలి వృక్షాల్ని,
సాగరంలో కలిసే నదీముఖాలను చూస్తూ,
తన దేహం మహామేఘంలా

నిరుంధంత మివాకాశం
చకార మతిమాన్ మతిమ్|
కాయవృద్ధిం ప్రవేగం చ
మమ దృష్ట్వైవ రాక్షసా:|| 205
ఆకాశాన్ని అడ్డగిస్తున్నట్లుండడం చూసి,
ఇలా ఆలోచించాడు.
"నా మహాకాయాన్ని, అమితవేగాన్ని,
రాక్షసులు చూస్తే,


మయి కౌతుహలం కుర్యు:
ఇతి మేనే మహాకపి:|
తత శ్శరీరం సంక్షిప్య
తన్మహీధరసన్నిభమ్|
పున: ప్రకృతిమాపేదే
వీతమోహ ఇవాత్మవాన్|| 206
ఆశ్చర్యచకితులవుతారు".
అని అనుకొని,
తన పర్వతాకారదేహాన్ని,
చిన్నదిగా చేసి,
ప్రకృతిచేత కప్పబడినవాడు (మాయామోహితుడు)
మోహాన్ని వీడిన తర్వాత మళ్లీ
స్వరూపాన్ని పొందినట్లు
హనుమంతుడు,
తన సహజరూపాన్ని ధరించాడు.


త ద్రూప మతిసంక్షిప్య
హనుమాన్ ప్రకృతౌ స్థిత:|
త్రీన్ క్రమానివ విక్రమ్య
బలివీర్యహరో హరి:|| 207
వామనరూపంలో వచ్చి, మూడడుగులుంచి, త్రివిక్రముడై
బలి విక్రమాన్ని హరించిన హరి,
తిరిగి వామనరూపాన్ని పొందినట్లు
హనుమంతుడు,
తన రూపాన్ని అతిచిన్నదిగా చేసుకొన్నాడు.




స చారు నానావిధరూపధారీ
పరం సమాసాద్య సముద్రతీరమ్|
పరై రశక్య: ప్రతిపన్నరూప:
సమీక్షితాత్మా సమవేక్షితార్థ:|| 208
మనోహరమైన వివిధరూపాలను ధరించేవాడు,
శత్రువులకు అశక్యుడు అయిన మారుతి,
సముద్రపు అవ్వలితీరానికి చేరాడు.
తర్వాత తన దేహాన్ని చూసి,
కర్తవ్యాన్ని నిర్ణయించుకొని,
తన సహజరూపాన్ని ధరించాడు.



తతస్స లంబస్య గిరేస్సమృద్ధే
విచిత్రకూటే నిపపాత కూటే|
సకేతకోద్దాలకనాళికేరే
మహాద్రికూటప్రతిమో మహాత్మా|| 209
ఆ మహాపర్వతశిఖరసమానుడు,
సర్వవస్తుసమృద్ధం, విచిత్రశిఖరాలు,
మొగలిపొదలు, విరిగిచెట్లు,
కొబ్బరిచెట్లు ఉన్న
లంబపర్వతశిఖరంపై దిగాడు.


తతస్తు సంప్రాప్య సముద్రతీరం
సమీక్ష్య లంకాం గిరివర్యమూర్థ్ని|
కపిస్తు తస్మిన్ నిపపాత పర్వతే
విధూయ రూపం వ్యథయన్ మృగద్విజాన్|| 210
అంత 
ఆ హనుమంతుడు,
సముద్రతీరానికి పోయి,
త్రికూటపర్వతశిఖరాన ఉన్నలంకను చూస్తూ,
తన దేహాన్న విదిల్చికొని,
జంతువులు, పక్షులు భయపడేటట్లు
ఆ గిరిపై వ్రాలాడు.



స సాగరం దానవపన్నగాయుతం
బలేన విక్రమ్య మహోర్మిమాలినమ్|
నిపత్య తీరే చ మహోదధే స్తదా
దదర్శ లంకామ్ అమరావతీమివ|| 211









 ఇత్యార్షే శ్రీమద్రామాయణే

సుందరకాండే 






శుభం భూయాత్
పెద్ద పెద్ద అలలు గలిగి,
దానవులకు పన్నగాలకు నెలవైన, సముద్రాన్ని
హనుమంతుడు తన పరాక్రమంతో దాటి,
తీరాన దిగి,
అమరావతి లాంటి
లంకాపురిని చూశాడు.



వాల్మీకియే ఆదికావ్యే

ప్రథమస్సర్గః (1)




2 కామెంట్‌లు:

మనోహర్ చెనికల చెప్పారు...

శుభం, సముద్ర లంఘనం పూర్తి చేసారు.
అదృష్టవంతులు. సరిగ్గా వసంత నవరాత్రులకు ముందురోజే సముద్రం దాటడం ఆయన సంకల్పమెమో.
ఈ రోజు మీరు రాసిన దానిలో ఒక విశేషం ఉంది. హనుమని మింగబోయే సింహిక చంద్రున్ని మింగే రాహువులా ఉంది అని చెప్పారు మహర్షి. రాహువు ఎంత చంద్రున్ని మింగాలని చూసినా మళ్ళీ గ్రహణాన్ని ఛేధించుకుని చంద్రుడు మళ్ళి బయటికి వస్తాడు. అలాగే స్వామి బయటకు వచ్చారు/వస్తారు అని చెప్పడం అన్నమాట.

ఇక చివరిలో మహర్షి అన్న మాట "ధృతి దృష్టిమతిర్దాక్ష్యం స్వకర్మసు నసీదతి" లోకానికి మహర్షి ఇచ్చే సందేశం ఇది. ఇది అర్ధంకావాలంటే ఏకబిగిన సముద్రలంఘనం చదవాలి.
కొన్ని కోట్ల కోతులు ఏమీ చెయ్యలేక నిలబడిపోయిన సమయంలో నేను వెళతాను అని సంకల్పం చేసారు-ఇది ధృతి. మనంకూడా కలిమాయలో పడిపోకుండా, ఆత్మసందర్శనంవైపు అడుగువెయ్యాలని సంకల్పించుకోవాలి

ఎంతో రమణీయంగా కోతులకు ఇష్టమైన తేనెపట్లతో, పళ్ళచెట్లతో నిండిన మైనాకపర్వతం స్వామికి విఘ్నంగానే కానవచ్చింది.-ఇది ఆయన దృష్టి. మనం కూడా ఉపాసనలో వచ్చే పురస్కార తిరస్కారాలను, గౌరవాదులను విఘ్నంగానే భావించి వదిలివెయ్యాలి.

ఆయన ఎంత పెరిగితే నాగమాత సురస అంతలా నోటిని తెరిచి మింగబోయింది. ఇలా పోతే ఎక్కడికి అంతు అని స్వామి చిన్నవాడై నోటిలోకి వెళ్ళి వచ్చి కార్యాన్ని సాధించాడు.- ఇది ఆయన మతి(తెలివితేటలు). మనం కూడా కామ్యాలు తీరడానికి కొన్ని పనులు చేస్తూ ఉంటాం. తీరిక దొరికితే భగవంతుని గురించి ఆలోచిద్దాం అనుకుంటాం. కానీ ఆ కామ్యాలకు అంతే ఉండదు. ఇక అవి పూర్తై భవంతుని గురించి ఆలోచించేదెప్పుడు? ఎక్కడో ఒకచోట మనలని మనం తగ్గించుకుంటే తప్ప ఉపాసన ముందుకు సాగదు.

చివరిది సింహికా భంజనం, కొన్ని వ్యసనాలను, నీడలా వెంటాడే గతాన్ని తన బలంతో నిర్జించగలగాలి. ఇది దాక్ష్యం. బుద్ధిద్వారా నిర్ణయించుకుని ఫలానాది వదిలెయ్యాలి లేకుంటే నా ఉపాసనకి ఆటంకం అని ఆ అలవాటుని వదిలెయ్యాలి.

ఇది తెలుసుకోమని చెప్పడమే మహర్షి ఆంతర్యము, రామకధ అంతరార్ధము అనిపిస్తూ ఉంటుంది.

జై శ్రీరాం.



నాగస్వరం చెప్పారు...

శ్రీ మనోహర్ గారూ!
మీ బ్లాగ్ లు చూశాను.
న్యూజింగ్స్ , హిందూధర్మసర్వస్వం
ఈ రెండు బ్లాగ్ లే నిర్వహిస్తున్నట్లున్నారు.
మీ బ్లాగ్ లు చదివాను.
మీరు రామభక్తులు అని అర్థమైంది.
మీ ప్రోత్సాహంతోనే ధైర్యం తెచ్చుకొని,
సుందరకాండను వ్రాస్తున్నాను.
కాదు., నేనెవర్ని వ్రాయటానికి?
సుందరకాండను నాకు తోచిన రీతిలో
అంతర్జాలానికి అందిస్తున్నాను అంతే.
మీరు మొదటి సర్గములోని అంతరార్థాలను
చాల బాగ వివరించారు.
సంతోషం. కృతజ్ఞతలు.
నిరంతరం మీరు బ్లాగ్ ల్లో రచనలు చేస్తూ,
బ్లాగ్ లోకాన్ని సాహిత్యసంపన్నం చేస్తారని,
చేయమని కోరుతూ,

నాగస్వరం.