13, అక్టోబర్ 2013, ఆదివారం

రామసుందరం – తొమ్మిదవసర్గం - 1



అందఱకూ విజయదశమి శుభాకాంక్షలు



సుందరకాండ నవమస్సర్గము -1
హనుమంతుడు రావణాంతఃపురాన్ని పరిశీలించుట


తస్యాలయవరిష్ఠస్య
మధ్యే విపులమాయతమ్ |
దదర్శ భవనశ్రేష్ఠం
హనుమాన్ మారుతాత్మజ: || 1 ||


హనుమంతుడు,
ఉత్తమమైన రావణుని భవనం మధ్యలో  
శ్రేష్ఠమైన పుష్పకవిమానాన్ని చూశాడు.
అర్ధయోజనవిస్తీర్ణ
మాయతం యోజనం మహత్ |
భవనం రాక్షసేంద్రస్య
బహుప్రాసాదసంకులమ్ || 2 ||
రావణుని ఆ మహాభవనం చుట్టూ
అనేకప్రాసాదా లున్నాయి.
ఆ భవనం అర్థయోజనం (4 మైళ్లు) వెడల్పు,
ఒకయోజనం (8 మైళ్లు) పొడవున విస్తరించి  ఉంది.


మార్గమాణస్తు వైదేహీం
సీతామాయతలోచనామ్ |
సర్వత: పరిచక్రామ
హనూమానరిసూదన: || 3 ||
హనుమంతుడు,
సీతాదేవిని వెదకుతూ,
ఆ భవనమంతా
కలయతిరిగాడు.


ఉత్తమం రాక్షసావాసం
హనుమానవలోకయన్ |
ఆససాదాథ లక్ష్మీవాన్
రాక్షసేంద్రనివేశనమ్ || 4 ||
రాక్షసుల నిలయాలను
పరికిస్తూ,
రావణునిప్రాసాదాన్ని
చేరాడు.


చతుర్విషాణై ర్ద్విరదై:
త్రివిషాణై స్తథైవ చ |
పరిక్షిప్తమసంబాధం
రక్ష్యమాణముదాయుధైః || 5 ||
ఆ భవనం, -
రెండేసి, మూడేసి, నాల్గేసి దంతాలున్న మత్తగజాలచేతా, ఆయుధాలు ధరించి, సర్వసన్నద్ధులై ఉన్న రాక్షసులచేతా పరివేష్టింపబడి,  సురక్షితంగా ఉంది.


రాక్షసీభిశ్చ పత్నీభీ
రావణస్య నివేశనమ్ |
ఆహృతాభిశ్చ విక్రమ్య
రాజకన్యాభిరావృతమ్ || 6 ||
రావణుని
భార్యలతోనూ,
అతడు బలవంతంగా ఎత్తుకువచ్చిన
రాజకన్యలతోనూ ఆ భవనం నిండి ఉంది.


తన్నక్రమకరాకీర్ణం
తిమింగిలఝషాకులమ్ |
వాయువేగసమాధూతం
పన్నగైరివ సాగరమ్ || 7 ||
మొసళ్లు, మహామత్స్యాలు,  తిమింగిలాలు,
చేపలు, విషసర్పాలు, పెనుగాలులు కల్గి,
ఆకాశాన్నంటుతున్న తరంగాలతో వ్యాప్తమైన
మహాసాగరంలా ఉందా భవనం.


యా హి వైశ్రవణే లక్ష్మీ:
యా చేంద్రే హరివాహనే |
సా రావణగృహే సర్వా
నిత్యమేవానపాయినీ || 8 ||
కుబేరుని సంపద్వైభవాలు, 
ఇంద్రుని ఐశ్వర్యశోభలు,
రావణుని ఇంట
చిరస్థిరంగా ప్రకాశిస్తున్నాయి.


యా చ రాజ్ఞ: కుబేరస్య
యమస్య వరుణస్య చ |
తాదృశీ తద్విశిష్టా వా
ఋద్ధీ రక్షోగృహేష్విహ || 9 ||
ఆ రాక్షసగృహాల్లోని
సంపద్వైభవాలు, 
కుబేర, యమ, వరుణ సంపదలకంటె, 
గొప్పవి.


తస్య హర్మస్య మధ్యస్థం
వేశ్మ చాన్యత్ సునిర్మితమ్ |
బహునిర్యూహసంకీర్ణం
దదర్శ పవనాత్మజ: || 10 ||
ఆ మహాప్రాసాదమధ్యభాగంలో
ఉంది
అద్భుతమైన
పుష్పకవిమానం.


బ్రహ్మణో౭ర్థే కృతం దివ్యం
దివి యద్విశ్వకర్మణా |
విమానం పుష్పకం నామ
సర్వరత్నవిభూషితమ్ || 11 ||
విశ్వకర్మ బ్రహ్మదేవునికోసం
ఆ పుష్పకవిమానాన్ని
సర్వవిధ రత్నాలతో
"దివి"యందు స్వయంగా నిర్మించి, ఇచ్చాడు.


పరేణ తపసా లేభే
యత్ కుబేర: పితామహాత్ |
కుబేరమోజసా జిత్వా
లేభే తద్రాక్షసేశ్వర: || 12 ||
కుబేరుడు తీవ్రమైన తపస్సొనర్చి,
బ్రహ్మదేవుని అనుగ్రహంతో దాన్ని కానుకగా పొందాడు. రావణుడు తనపరాక్రమంతో కుబేరుని జయించి,
ఆ పుష్పకాన్ని తనవశం చేసికొన్నాడు.


ఈహామృగసమాయుక్తై:
కార్తస్వరహిరణ్మయై: |
సుకృతైరాచితం స్తంభై:
ప్రదీప్తమివ చ శ్రియా || 13 ||
వెండి బంగారాల
స్తంభాలు,
వాటిపై వెలుగులు విరజిమ్మే
క్రీడామృగాలబొమ్మలు,


మేరుమందరసంకాశై:
ఉల్లిఖద్భిరివాంబరమ్ |
కూటాగారైశ్శుభాకారై:
సర్వతస్సమలంకృతమ్ || 14 ||
ఆకాశాన్ని తాకే
శిఖరాలు,
నేత్రపర్వంచేసే
గుప్తగృహాలు,


జ్వలనార్కప్రతీకాశం
సుకృతం విశ్వకర్మణా |
హేమసోపానసంయుక్తం
చారుప్రవరవేదికమ్ || 15 ||
అగ్ని,సూర్యసమాన
కాంతులు,
బంగారుమెట్లు,
చూడముచ్చటైన వేదికలు,


జాలవాతాయనైర్యుక్తం
కాంచనైస్స్ఫాటికైరపి |
ఇంద్రనీలమహానీల
మణిప్రవరవేదికమ్ || 16 ||
బంగారుస్ఫటిక
కిటికీలు, గవాక్షాలు,
ఇంద్రనీల, సింహళ మహానీల
వేదికలు,


విద్రుమేణ విచిత్రేణ
మణిభిశ్చ మహాధనై: |
నిస్తులాభిశ్చ ముక్తాభి:
తలేనాభివిరాజితమ్ || 17 ||
పగడాలు,
మణులు,
ముత్యాలు పొదగబడిన 
భూతలం (నేల), కలిగి,


చందనేన చ రక్తేన
తపనీయనిభేన చ |
సుపుణ్యగంధినా యుక్తమ్
ఆదిత్యతరుణోపమమ్ || 18 ||
గుబాళిస్తున్న
ఎర్రచందనసువాసనలతో
మధ్యాహ్న సూర్యునిలా
తేజరిల్లుతోందా పుష్పకం.


కూటాగారైర్వరాకారై:
వివిధైస్సమలంకృతమ్ |
విమానం పుష్పకం దివ్యమ్
ఆరురోహ మహాకపి: || 19 ||
వివిధ మధురాకృతుల కూటాగారాలు కల
ఆ దివ్యవిమానాన్ని
ఆ కపివరుడు
అధిరోహించాడు.


తత్రస్థస్స తదా గంధం
పానభక్ష్యాన్నసంభవమ్ |
దివ్యం సమ్మూర్ఛితం జిఘ్రత్
రూపవంతమివానిలమ్ || 20 ||
అప్పుడు పానీయాలు, తినుబండారాలు, అన్నాలనుండి పుట్టిన దివ్యగంధం సర్వత్ర వ్యాపించింది.
ఆ వాసన నాసాపుటాలకు తాకగానే,
వాయుదేవుడే ఆకృతిదాల్చి,  
ఆ పరిమళరూపంలో వచ్చాడా
అని హనుమంతుడు భావించాడు.


స గంధస్తం మహాసత్త్వం
బంధుర్బంధుమివోత్తమమ్ |
ఇత ఏహీత్యువాచేవ
తత్ర యత్ర స రావణ: || 21 ||
ఒక బంధువు తన ఆప్తబంధువును పిలిచినట్టుగా
ఆ సువాసన (వాయువు) 
హనుమంతుని "ఇలా రా, ఇలా రా" అని
రావణుడున్న స్థలానికి పిలుస్తున్నట్లుంది.


తతస్తాం ప్రస్థితశ్శాలాం
దదర్శ మహతీం శుభామ్ |
రావణస్య మన:కాంతాం
కాంతామివ వరస్త్రియమ్ || 22 ||
హనుమంతుడు
ముందుకు సాగి,
శుభాకృతిగల ఒక విశాలమైన శాలను చూశాడు.
అది రావణునకు అత్యంత ప్రియమైనది.


మణిసోపానవికృతాం
హేమజాలవిభూషితామ్ |
స్ఫాటికైరావృతతలాం
దంతాంతరితరూపికామ్ || 23 ||
ఆ శాల,
మణిసోపానాలు,
బంగారుకిటికీలు,
స్ఫటిక, దంత భూతలం,


ముక్తాభిశ్చ ప్రవాళైశ్చ
రూప్యచామీకరైరపి |
విభూషితాం మణిస్తంభై:
సుబహుస్తంభభూషితామ్ || 24 ||
రజత,
స్వర్ణ,
ముక్త,
ప్రవాళ సమంచిత మణిస్తంభాలు,


సమై: ఋజుభిరత్యుచ్చై:
సమంతాత్ సువిభూషితై: |
స్తంభై: పక్షైరివాత్యుచ్చై:
దివం సంప్రస్థితామివ || 25 ||
సమానంగా నిర్మించబడి,  
ఆకాశానికి ఎగురుతున్నట్లున్న
పక్షాల్లాంటి
అలంకృతమైన అత్యున్నత స్తంభాలు, 


మహత్యా కుథయాస్తీర్ణాం
పృథివీలక్షణాంకయా |
పృథివీమివ విస్తీర్ణాం
సరాష్ట్రగృహమాలినీమ్ || 26 ||
పఱచబడిన,
పృథివీ (నదులు,సముద్రాలు, గిరులు, వనాది) లక్షణాలు  గల విశాల, చిత్ర,
రత్నకంబళం


నాదితాం మత్తవిహగై:
దివ్యగంధాధివాసితామ్ |
పరార్థ్యాస్తరణోపేతాం
రక్షో౭ధిపనిషేవితామ్ || 27 ||
మిక్కిలిమత్తిల్లిన
పక్షుల కలకలాలు,
దివ్యపరిమళాలు,
సర్వోత్తమ ఆస్తరణాలు,


ధూమ్రామగరుధూపేన
విమలాం హంసపాండురామ్ |
చిత్రాం పుష్పోపహారేణ
కల్మాషీమివ సుప్రభామ్ || 28 ||
శ్వేతకాంతులు,
అగరుధూపాలు,
పుష్పహారాలు, చిత్రవర్ణాలు కలది.
కామధేనువులా అన్ని కోరికలు తీర్చగలది.


మనస్సంహ్లాదజననీం
వర్ణస్యాపి ప్రసాదినీమ్ |
తాం శోకనాశినీం దివ్యాం
శ్రియస్సంజననీమివ || 29 ||
చక్కని ఆహ్లాదాన్ని గూర్చే
శోకనాశిని.
వన్నెచిన్నెలు,
దివ్యసంపదలు కలది.


ఇంద్రియాణీంద్రియార్థైస్తు
పంచ పంచభిరుత్తమై: |
తర్పయామాస మాతేవ
తదా రావణపాలితా || 30 ||
శబ్ద (గానాలు), స్పర్శ (వాయువులు),
రూప (అందాలు), రస (మధురభక్ష్యాలు),
గంధా (సువాసనలు) ది విశేషాలతో
కన్నతల్లి పుత్రునికి తృప్తి కల్గించినట్లుగా
ఆ శాల హనుమంతునికి తృప్తి కల్గించింది.


స్వర్గో౭యం దేవలోకో౭యమ్
ఇంద్రస్యేయం పురీ భవేత్ |
సిద్ధిర్వేయం పరా హి స్యాత్
ఇత్యమన్యత మారుతి: || 31 ||
ఆ శాలను చూసి, హనుమంతుడు,
"ఇది స్వర్గమా? అందులో దేవతలుండే చోటా?
అందులోనూ ఇంద్రుడుండే అమరావతా?
దివ్య తపశ్చర్య ఫలరూప పరాసిద్ధా?"  
అని అనుకొన్నాడు.


ప్రధ్యాయత ఇవాపశ్యత్
ప్రదీప్తాం స్తత్ర కాంచనాన్ |
ధూర్తానివ మహాధూర్తై:
దేవనేన పరాజితాన్ || 32 ||
మహాజూదరులచేత ఓడింపబడి,
దీర్ఘాలోచనలో పడిన జూదరుల్లా,
బంగారుకాంతులతో నిశ్చలంగా ఉన్న
మణిస్తంభదీపాల్ని అక్కడ మారుతి చూశాడు.


దీపానాం చ ప్రకాశేన
తేజసా రావణస్య చ |
అర్చిర్భిర్భూషణానాం చ
ప్రదీప్తేత్యభ్యమన్యత || 33 ||
ఆ శాల దేదీప్యానికి
దీపజ్వాలలు,
రావణుని తేజస్సు,
ఆభరణప్రకాశాలు కారణాలనుకొన్నాడు.


శుభం భూయాత్