10, అక్టోబర్ 2013, గురువారం

రామసుందరం - ఎనిమిదవసర్గం



సుందరకాండ - అష్టమస్సర్గము
హనుమంతుడు పుష్పకవిమానాన్ని చూచుట


స తస్య మధ్యే భవనస్య సంస్థితం
మహద్విమానం మణివజ్రచిత్రితమ్ |
ప్రతప్తజాంబూనదజాలకృత్రిమం
దదర్శ వీర: పవనాత్మజ: కపి: || 1 ||
ఆ భవనసముదాయానికి మధ్యలో,
మణివజ్రాలతో నిర్మితమైన,
పుష్పకవిమానం స్థాపించబడి ఉంది.
దానికి మేలిమి బంగారపు కిటికీలున్నాయి.


తదప్రమేయాప్రతికారకృత్రిమం
కృతం స్వయం సాధ్వితి విశ్వకర్మణా |
దివం గతం వాయుపథప్రతిష్ఠితం
వ్యరాజతా౭౭దిత్యపథస్య లక్ష్మవత్ || 2 ||
అందఱూ ప్రశంసించే విధంగా దాన్నివిశ్వకర్మ నిర్మించాడు.
దాని నిర్మాణం సాటిలేనిది, ఊహలకందనిది.
ఆకాశమంతా తిరుగులేకుండా తిరుగగలిగేదై, అంతరిక్షంలో ఉంచబడిన ఆ విమానం సూర్యమార్గానికి సూచికలా ఉంది.


న తత్ర కించిన్న కృతం ప్రయత్నతో
న తత్ర కించిన్న మహార్హరత్నవత్ |
న తే విశేషా నియతాస్సురేష్వపి
న తత్ర కించిన్న మహావిశేషవత్ || 3 ||
దాన్ని చక్కగా నిర్మించారు.
మేలుజాతి రత్నాలు పొదిగారు.
అందులోని విచిత్రవిశేషాలు దేవతాభవనాల్లోకూడా లేవు.
ఇంతెందుకు? అందులో లేని విశేషమే లేదు.


తపస్సమాధానపరాక్రమార్జితం
మనస్సమాధానవిచారచారిణమ్ |
అనేకసంస్థానవిశేషనిర్మితం
తతస్తతస్తుల్యవిశేషదర్శనమ్ || 4 ||
ఆ విమానం మహాతపశ్చర్యచేతా, పరాక్రమంచేతా సంపాదింపబడింది.
దానిలో  ఆసీనులైనవారి ఆలోచనలను అనుసరించి అది సంచరిస్తుంది.
దాన్లోని వివిధ (సభాభవనాలు,భోజనశాలలు,వినోదమందిరాలు,గోపురాలు మొదలైన) భాగాలు ఒక్కొక్క విధంగానూ,
అన్ని ప్రదేశాలు, సమానంగానూ నిర్మింపబడ్డాయి.


మనస్సమాధాయ తు శీఘ్రగామినం
దురావరం మారుతతుల్యగామినమ్ |
మహాత్మనాం పుణ్యకృతాం మహర్ధినాం
యశస్వినామగ్ర్యముదామివాలయమ్ || 5 ||
యజమాని మనస్సును తెలుసుకొని, వాయువేగంతో సంచరిస్తుంది.
దాన్నిఎవరూ అడ్డగించలేరు.
మహాత్ముల, పుణ్యాత్ముల, తేజస్సంపన్నుల, సుప్రసిద్ధుల భవనాల్లాంటిది.  స్వర్గంలాంటిదది.


విశేషమాలంబ్య విశేషసంస్థితం
విచిత్రకూటం బహుకూటమండితమ్ |
మనో౭భిరామం శరదిందునిర్మలం
విచిత్రకూటం శిఖరం గిరేర్యథా || 6 ||
దాన్నివిశిష్టరీతిలో ఉదాత్తంగా నిర్మించారు.
చిత్రవిచిత్రశిఖరాలతో మనోభిరామంగా ఉంది.
శరత్కాలచంద్రునిలా నిర్మలంగా, ఆహ్లాదంగా ఉంది. 
గిరిశిఖరంలా ఉపశిఖరాలతో ఉంది.


వహంతి యం కుండలశోభితాననా:
మహాశనా వ్యోమచరా నిశాచరా: |
వివృత్తవిధ్వస్తవిశాలలోచనా:
మహాజనా భూతగణాస్సహస్రశ: || 7 ||
కుండలాలు, పెద్దశరీరాలు, విశాలనేత్రాలు, అతివేగసంచారాలు కల
వేలకొలది భూతగణాలు
ఆ విమానాన్ని మోస్తున్నట్లు,
దాని వెలుపలిభాగంలో శిల్పాలు చెక్కారు.


వసంతపుష్పోత్కరచారుదర్శనం
వసంతమాసాదపి కాంతదర్శనమ్ |
స పుష్పకం తత్ర విమానముత్తమం
దదర్శ తద్వానరవీరసత్తమ: || 8 ||



ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకియే  ఆదికావ్యే సుందరకాండే అష్టమస్సర్గః (8)

శుభం భూయాత్
అది వసంతర్తువులో పుష్పరాశిలా చూడముచ్చటగా ఉంది.
వసంతమాసంకంటే మనోహరంగా ఉంది.
అటువంటి శ్రేష్ఠమైన విమానాన్ని
ఆ వానరవరేణ్యుడు చూశాడు.

కామెంట్‌లు లేవు: