10, ఏప్రిల్ 2014, గురువారం

రామసుందరం - పదవసర్గం




సుందరకాండ - దశమస్సర్గము



తత్ర దివ్యోపమం ముఖ్యం
స్ఫాటికం రత్నభూషితమ్ |
అవేక్షమాణో హనుమాన్
దదర్శ శయనాసనమ్ || 1 ||
హనుమంతుడు
ఆ భవనంలో
ఒక శయనాసనాన్ని (తల్పాన్ని)
చూశాడు.
దాంతకాంచనచిత్రాంగై:
వైడూర్యైశ్చ వరాసనై: |
మహార్హాస్తరణోపేతై:
ఉపపన్నం మహాధనై: || 2 ||
మేలైన ఆసనాలు కల్గి,
దేవలోకంలోని
శయనాసనంలా
ఉందది.


తస్య చైకతమే దేశే
దివ్యమాలావిభూషితమ్ |
దదర్శ పాండురం ఛత్రం
తారాధిపతిసన్నిభమ్ || 3 ||
ఆ శయనాసనానికి
ఊర్ధ్వభాగంలో
తెల్లని ఛత్రాన్ని
చూశాడు.


జాతరూపపరిక్షిప్తం
చిత్రభానుసమప్రభమ్ |
అశోకమాలావితతం
దదర్శ పరమాసనమ్ || 4 ||


అశోకమాలలతో కూడిన
ఆ ఆసనం
సూర్యకాంతి సమానమైనది.
వాలవ్యజనహస్తాభి:
వీజ్యమానం సమంతత: |
గంధైశ్చ వివిధైర్జుష్టం
వరధూపేన ధూపితమ్ || 5 ||
అన్ని దిక్కులకూ
సుగంధభరితమైన గాలి తగిలేలా
కొందఱు స్త్రీలు
చామరాలతో విసరుతున్నారు.


పరమాస్తరణాస్తీర్ణమ్
ఆవికాజినసంవృతమ్ |
దామభిర్వరమాల్యానాం
సమంతాదుపశోభితమ్ || 6 ||
మేలైన ఆస్తరణాలు,
ఉన్నికంబళ్లు,
సుగంధపుష్పమాలికలతో
శోభిల్లుతున్న
తస్మిన్ జీమూతసంకాశం
ప్రదీప్తోత్తమకుండలమ్ |
లోహితాక్షం మహాబాహుమ్
మహారజతవాససమ్ || 7 ||
లోహితేనానులిప్తాంగం
చందనేన సుగంధినా |
సంధ్యారక్తమివాకాశే
తోయదం సతటిద్గణమ్ || 8 ||
ఆ తల్పంపై నిద్రిస్తున్న రావణుని
హనుమంతుడు చూశాడు.
ఆతడు నల్లని మేఘంలా ఉన్నాడు.
కర్ణకుండలాలు మెరుస్తున్నాయి.
శరీరంపై ఎఱ్ఱచందనం పూయబడిఉంది.
ఆభరణాలు ధగధగ మెరుస్తున్నాయి.
మెరుపులతో కూడిన
మేఘంలా ఉన్నాడు.
వృతమాభరణైర్దివ్యై:
సురూపం కామరూపిణమ్ |
సవృక్షవనగుల్మాఢ్యం
ప్రసుప్తమివ మందరమ్ || 9 ||


మందరపర్వతం
నిద్రిస్తున్నట్లు
నిశ్చలంగా
ఉన్నాడు.


క్రీడిత్వోపరతం రాత్రౌ                        
వరాభరణభూషితమ్ |
ప్రియం రాక్షసకన్యానాం
రాక్షసానాం సుఖావహమ్ || 10 ||
రాక్షసులకు
రాక్షసకన్యలకు
సుఖప్రియాలు
కల్గించే
పీత్వాప్యుపరతం చాపి
దదర్శ స మహాకపి: |
భాస్వరే శయనే వీరం
ప్రసుప్తం రాక్షసాధిపమ్ || 11 ||
ఆ రావణుడు త్రాగి,
ఉపరతుడై,
గాఢంగా
నిద్రిస్తున్నాడు.


నిశ్శ్వసంతం యథా నాగం
రావణం వానరర్షభ: |
ఆసాద్య పరమోద్విగ్న:
సోపాసర్పత్ సుభీతవత్ || 12 ||
నాగం(పాము/ఏనుగు)లా
నిశ్శ్వాసాలు విడుస్తున్న రావణుని  
హనుమంతుడు సమీపించి,
ఉద్విగ్నుడై, దూరం జరిగాడు.


అథారోహణమాసాద్య
వేదికాంతరమాశ్రిత: |
సుప్తం రాక్షసశార్దూలమ్
ప్రేక్షతే స్మ మహాకపి: || 13 ||
సోపానమార్గంలో
మఱొక వేదిక మీద కూర్చొని,
రావణుని మీదికి
దృష్టి సారించాడు.


శుశుభే రాక్షసేంద్రస్య
స్వపతశ్శయనోత్తమమ్ |
గంధహస్తిని సంవిష్టే
యథా ప్రస్రవణం మహత్ || 14 ||
ఆ మహాతల్పం సెలయేఱులా ఉంది.
నిద్రిస్తున్న రావణుడందులోకి ప్రవేశించిన 
మదగజంలా ఉన్నాడు.
( సెలయేఱులోకి మదగజం ప్రవేశించగానే,
మిగిలిన మగఏనుగులు భయపడి పారిపోతాయి.
ఏనుగులు మాత్రమే అక్క ఉంటాయి.)


కాంచనాంగదసన్నద్ధౌ
దదర్శ స మహాత్మన: |
విక్షిప్తౌ రాక్షసేంద్రస్య
భుజావింద్రధ్వజోపమౌ || 15 ||
బంగారు భుజకీర్తులతో
ఇంద్రధ్వజసమానమైన
రావణుని
చాచిన బాహువులను చూశాడు.


ఐరావతవిషాణాగ్రై:
ఆపీడనకృతవ్రణౌ |
వజ్రోల్లిఖితపీనాంసౌ
విష్ణుచక్రపరిక్షతౌ || 16 ||
ఆ బాహువులపై
ఐరావతం కోరలవల్ల, వజ్రాయుధంవల్ల,
విష్ణుచక్రంవల్ల ఏర్పడిన
గాయాల గుర్తులు కనబడుతున్నాయి.


పీనౌ సమసుజాతాంసౌ
సంగతౌ బలసంయుతౌ |
సులక్షణనఖాంగుష్ఠౌ
స్వంగుళీతలలక్షితౌ || 17 ||
అవి బలంతో బాగా బలసి,
ఇనుపగుదియల్లా,
ఏనుగుతొండాల్లా
గుండ్రంగా ఉన్నాయి.


సంహతౌ పరిఘాకారౌ
వృత్తౌ కరికరోపమౌ |
విక్షిప్తౌ శయనే శుభ్రే
పంచశీర్షావివోరగౌ || 18 ||
ఆ తల్పంపై
చాచబడిన ఆ బాహువులు
ఐదుపడగల సర్పాల్లా
ఉన్నాయి.


శశక్షతజకల్పేన
సుశీతేన సుగంధినా |
చందనేన పరార్ధ్యేన
స్వనులిప్తౌ స్వలంకృతౌ || 19 ||
ఎఱ్ఱని,
చల్లని చందనాలు
ఆ బాహువులపై
పూయబడి ఉన్నాయి.


ఉత్తమస్త్రీవిమృదితౌ
గంధోత్తమనిషేవితౌ |
యక్షకిన్నరగంధర్వ
దేవదానవరావిణౌ || 20 ||
స్త్రీలచే పిసుకబడే,
దేవదానవాదులను
బాధించే
ఆ బాహువులు
దదర్శ స కపిస్తస్య
బాహూ శయనసంస్థితౌ |
మందరస్యాంతరే సుప్తౌ
మహాహీ రుషితావివ || 21 ||
మందరగిరిగుహలో
నిద్రిస్తున్న
క్రుద్ధభుజంగాల్లా
ఉన్నాయి.

తాభ్యాం స పరిపూర్ణాభ్యాం
భుజాభ్యాం రాక్షసేశ్వర: |
శుశుభే౭చలసంకాశ:
శృంగాభ్యామివ మందర: || 22 ||
పరిపూర్ణమైన ఆ భుజాలతో 
రావణుడు
శిఖరాలతో కూడిన
మందరగిరిలా ఉన్నాడు.


చూతపున్నాగసురభి:
వకుళోత్తమసంయుత: |
మృష్టాన్నరససంయుక్త:
పానగంధపురస్సర: || 23 ||
ఆతని నిట్టూర్పులు
అన్నరసగంధాలను
( మామిడి, పున్నాగ 
మృష్టాన్నరసపానాది గంధాలు)
తస్య రాక్షససింహస్య
నిశ్చక్రామ మహాముఖాత్ |
శయానస్య వినిశ్శ్వాస:
పూరయన్నివ తద్గృహమ్ || 24 ||


మందిరాన్ని
నింపుతున్నవో 
అన్నట్లుగా
వెదజల్లుతున్నాయి.
ముక్తామణివిచిత్రేణ
కాంచనేన విరాజితమ్ |
ముకుటేనాపవృత్తేన
కుండలోజ్జ్వలితాననమ్ || 25 ||
ఆ రావణుడు,
కొంచెం ఒరిగిన
సువర్ణకిరీటం,
మనోహరమైన ముఖం
రక్తచందనదిగ్ధేన
తథా హారేణ శోభినా |
పీనాయతవిశాలేన
వక్షసా౭భివిరాజితమ్ || 26 ||
విశాల
వక్షఃస్థలం
పాండురేణాపవిద్ధేన
క్షౌమేణ క్షతజేక్షణమ్ |
మహార్హేణ సుసంవీతం
పీతేనోత్తమవాససా || 27 ||
పీతవస్త్రాలు
కల్గి
మాషరాశిప్రతీకాశం
నిశ్శ్వసంతం భుజంగవత్ |
గాంగే మహతి తోయాంతే
ప్రసుప్తమివ కుంజరమ్ || 28 ||
మినుములరాశిలాగున్నాడు.
మహాసర్పంలా నిట్టూర్పులు విడుస్తున్నాడు.
గంగాజలాలమధ్య
నిద్రిస్తున్న ఏనుగులా ఉన్నాడు.


చతుర్భి: కాంచనైర్దీపై:
దీప్యమానచతుర్దిశమ్ |
ప్రకాశీకృతసర్వాంగం
మేఘం విద్యుద్గణైరివ || 29 ||
కాంచనదీపపుకాంతులమధ్య
ఆతడు
విద్యుద్గణాలమధ్య
మేఘంలా ఉన్నాడు.


పాదమూలగతాశ్చాపి
దదర్శ సుమహాత్మన: |
పత్నీ స్స ప్రియభార్యస్య
తస్య రక్ష:పతేర్గృహే || 30 ||
అలాంటి రావణుని,
ఆతని పాదాలచెంత ఉన్న
ఆతని భార్యలందఱ్నీ
హనుమంతుడు చూశాడు.


శశిప్రకాశవదనా:
చారుకుండలభూషితా: |
అమ్లానమాల్యాభరణా
దదర్శ హరియూథప: || 31 ||
ఆ రావణపత్నులందఱూ
సహజంగానూ,
అలంకరణలతోనూ
అందంగా ఉన్నారు.

నృత్తవాదిత్రకుశలా
రాక్షసేంద్రభుజాంకగా: |
వరాభరణధారిణ్యో
నిషణ్ణా దదృశే హరి: || 32 ||
నృత్యవాద్యకళావిశారదులు వారు.
రావణుని భుజాలపైన
ఒడిలోను
నిద్రిస్తున్నారు.


వజ్రవైడూర్యగర్భాణి
శ్రవణాంతేషు యోషితామ్ |
దదర్శ తాపనీయాని
కుండలాన్యంగదాని చ || 33 ||
వారి
కుండలాలు,
దండకడియాలు
చూశాడు.


తాసాం చంద్రోపమైర్వక్త్రై:
శుభైర్లలితకుండలై: |
విరరాజ విమానం తత్
నభస్తారాగణైరివ || 34 ||
వారికాంతులతో
ఆ విమానం
నక్షత్రాలకాంతితో
వెలిగే ఆకాశంలా ఉంది.


మదవ్యాయామఖిన్నాస్తా
రాక్షసేంద్రస్య యోషిత: |
తేషు తేష్వవకాశేషు
ప్రసుప్తా: తనుమధ్యమా: || 35 ||
మదవ్యాయామంలో
అలసి,
గాఢనిద్రలో
మునిగిపోయారు.

అంగహారైస్తథైవాన్యా
కోమలైర్నృత్తశాలినీ |
విన్యస్తశుభసర్వాంగీ
ప్రసుప్తా వరవర్ణినీ || 36 ||
నృత్యనేర్పరి అయిన
ఒక శుభాంగి
నృత్యభంగిమలతోనే
నిద్రిస్తోంది.


కాచిద్వీణాం పరిష్వజ్య
ప్రసుప్తా సంప్రకాశతే |
మహానదీప్రకీర్ణేవ
నళినీ పోతమాశ్రితా || 37 ||
మహానదీప్రవాహంలో
నావను ఆశ్రయించిన పద్మలతలా
ఒక లతాంగి
వీణను కౌగిలించుకొని నిద్రిస్తోంది.


అన్యా కక్షగతేనైవ
మడ్డుకేనాసితేక్షణా |
ప్రసుప్తా భామినీ భాతి
బాలపుత్రేవ వత్సలా || 38 ||
మడ్డుకం అనే ఒక చర్మవాద్యాన్ని
చంకలో ఉంచుకొని నిద్రిస్తున్న
ఒక తరుణి
చంకలో పిల్లాడు కలిగిన ఇంతిలా ఉంది.


పటహం చారుసర్వాంగీ
పీడ్య శేతే శుభస్తనీ |
చిరస్య రమణం లబ్ధ్వా
పరిష్వజ్యేవ భామినీ || 39 ||
ప్రియుని కౌగిలించుకొన్న పడతిలా
ఒక సుందరి
పటహం అనే చర్మవాద్యాన్ని
వక్షఃస్థలానికి అదుముకొని నిద్రిస్తోంది.


కాచిద్వంశం పరిష్వజ్య
సుప్తా కమలలోచనా |
రహ: ప్రియతమం గృహ్య
సకామేవ చ కామినీ || 40 ||
తమకంతో ప్రియుని కౌగిలించుకొన్న
కామినిలా ఒక భామిని
వేణువును
హృదయానికి హత్తుకొని నిద్రిస్తోంది.


విపంచీం పరిగృహ్యాన్యా
నియతా నృత్తశాలినీ |
నిద్రావశమనుప్రాప్తా
సహకాంతేవ భామినీ || 41 ||
ఒక రమణి
విపంచిని
ఎదపై చేర్చుకొని,
నిద్రిస్తోంది.


అన్యా కనకసంకాశై:
మృదుపీనైర్మనోరమై: |
మృదంగం పరిపీడ్యాంగై:
ప్రసుప్తా మత్తలోచనా || 42 ||
మృదంగాన్ని
కౌగిలించుకొని
ఒక ముదిత,
నిద్రిస్తోంది.


భుజపార్శ్వాంతరస్థేన
కక్షగేణ కృశోదరీ |
పణవేన సహానింద్యా
సుప్తా మదకృతశ్రమా || 43 ||
చంకలో
పణవంతో
ఒక జాణ
నిద్రిస్తోంది.


డిండిమం పరిగృహ్యాన్యా
తథైవాసక్తడిండిమా |
ప్రసుప్తా తరుణం వత్సమ్
ఉపగుహ్యేన భామినీ || 44 ||
డిండిమ వాద్యాన్ని
గ్రహించి
ఒక నెలత,
నిద్రిస్తోంది.


కాచిదాడంబరం నారీ
భుజసంయోగపీడితమ్ |
కృత్వా కమలపత్రాక్షీ
ప్రసుప్తా మదమోహితా || 45 ||
ఆడంబరం అనే తూర్యవాద్యాన్ని
హత్తుకొని
ఒక అతివ
నిద్రిస్తోంది.


కలశీమపవిధ్యాన్యా
ప్రసుప్తా భాతి భామినీ |
వసంతే పుష్పశబలా
మాలేవ పరిమార్జితా || 46 ||
గాఢనిద్రలో తెలియక
ఒక కలకంఠి కలశాన్ని తోసింది.
దాంతో అందులోని గంధోదకంతో ఆవిడ తడిసిపోయింది.
అపుడామె వాడిపోకుండా నీటితో తడిపిన
విచిత్రవర్ణపుష్పలతలా ఉంది.


పాణిభ్యాం చ కుచౌ కాచిత్
సువర్ణకలశోపమౌ |
ఉపగుహ్యాబలా సుప్తా
నిద్రాబలపరాజితా || 47 ||
ఒక అబల
తన బంగారుకలశాలను
చేతులతో కప్పుకొని
నిద్రిస్తోంది.

అన్యా కమలపత్రాక్షీ
పూర్ణేందుసదృశాననా |
అన్యామాలింగ్య సుశ్రోణీం
ప్రసుప్తా మదవిహ్వలా || 48 ||
ఒక రమణి
మఱొక రామను
మదవిహ్వలయై
కౌగిలించుకొని నిద్రిస్తోంది.

ఆతోద్యాని విచిత్రాణి
పరిష్వజ్య వరస్త్రియ: |
నిపీడ్య చ కుచైస్సుప్తా:
కామిన్య: కాముకానివ || 49 ||
అక్కడి స్త్రీలు
చిత్రవిచిత్రచతుర్విధవాద్యాలను
హృదయాలకు హత్తుకొని
నిద్రిస్తున్నారు.


తాసామేకాంతవిన్యస్తే
శయానాం శయనే శుభే |
దదర్శ రూపసంపన్నామ్
అపరాం స కపి: స్త్రియమ్ || 50 ||
ఆ కాంతల్లో
మిక్కిలి అందమైన ఒక స్త్రీ
ప్రత్యేకశయ్యపై నిద్రిస్తుండడం
మారుతి చూశాడు.


ముక్తామణిసమాయుక్తై:
భూషణైస్సువిభూషితామ్ |
విభూషయంతీమివ తత్
స్వశ్రియా భవనోత్తమమ్ || 51 ||
ఆమె
తన శరీర, ఆభరణాలకాంతితో
ఆ మహాభవనాన్ని
ప్రకాశింపచేస్తున్నట్లుంది.


గౌరీం కనకవర్ణాభామ్
ఇష్టామంత:పురేశ్వరీమ్ |
కపిర్మందోదరీం తత్ర
శయనాం చారురూపిణీమ్ || 52 ||
కనకవర్ణాంగి,
రావణుని పట్టమహిషి అయిన
ఆ మందోదరి రూపం
మనోహరంగా ఉంది.


స తాం దృష్ట్వా మహాబాహు:
భూషితాం మారుతాత్మజ: |
తర్కయామాస సీతేతి
రూపయౌవనసంపదా |
హర్షేణ మహతా యుక్తో
ననంద హరియూథప: || 53 ||


రూప
యౌవన
సౌభాగ్యాలను బట్టి
ఆమె సీతయై ఉండవచ్చుననుకొని,
మిక్కిలి హర్షోల్లసితుడయ్యాడు.
ఆస్ఫోటయామాస చుచుంబ పుచ్ఛం
ననంద చిక్రీడ జగౌ జగామ |
స్తంభానరోహన్నిపపాత భూమౌ
నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనామ్ || 54 ||
ఆనందంతో భుజాస్ఫాలనం కావించాడు.
తోకను ముద్దాడాడు.
అటూ ఇటూ గంతులు వేశాడు.
స్తంభాలమీదకు ప్రాకాడు. క్రిందికి జారాడు.
కపిస్వభావాన్ని ప్రదర్శించాడు.
 






ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే దశమస్సర్గః (10)

శుభం భూయాత్ 

2 కామెంట్‌లు:

మనోహర్ చెనికల చెప్పారు...

ఈ సర్గ తర్వాత మళ్ళీ రాయలేదు మీరు. మీ బ్లాగుకి చాలాసార్లు వచ్చి చూస్తూ ఉన్నాను. మొదలుపెట్టారు కదా ఆపకండి.

సలిలసహిత సింధువుని లీలగా ఉల్లంఘించిన స్వామి సహాయం, ఆశీర్వాదం ఉంది.

నాగస్వరం చెప్పారు...

ధన్యవాదాలు మనోహర్ గారూ!
స్వామి ఆశీర్వాదంతోనూ,
మీవంటి శ్రేయోభిలాషుల ప్రోత్సాహంతోనూ,
మరల సాహసించి, ప్రారంభించాను.
మీ వాక్కులే నాకు బలం.

చిత్తగించవలెను,
భవదీయుడు,
నాగస్వరం.