19, డిసెంబర్ 2015, శనివారం

ఎవరి గొప్ప వారిదే


ఎవరి గొప్ప వారిదే



కవికులగురువు, కాళీవరప్రసాదుడు అయిన కాళిదాసు ,

సంస్కృతంలో కుమారసంభవమనే కావ్యాన్ని వ్రాశాడు.

అందులో పర్వతరాజపుత్రిక పార్వతి పుట్టుకను వర్ణించాక,

ఆమె విద్యాభ్యాసాన్ని వర్ణిస్తూ, ఇలా అంటాడు.

" తాం హంసమాలా శ్శరదీవగంగాం,

మహౌషధీం నక్తమివాత్మభాసః ,

స్థిరోపదేశా ముపదేశకాలే,

ప్రపేదిరే ప్రాక్తనజన్మవిద్యా: ."

అంటే,

" స్థిరమైన (పూర్వజన్మ) శిక్ష కలదైన పార్వతికి

విద్య నేర్చు కాలం రాగానే,

ఆ పూర్వజన్మవిద్యలన్నీ

శరత్కాలం రాగానే గంగానదికి హంసలబారులూ,

చీకటి పడగానే మహౌషధికి వెలుగులూ వచ్చినట్లు

స్వయంగానే వచ్చాయి."

తండ్రి హిమవంతుడు, పార్వతికి విద్యాభ్యాససమయం రాగానే గురువువద్దకు పంపించాడు.

గురువు, ప్రతి (విద్యా) విషయాన్ని ఒక్కసారే బోధించేవాడు.

ఆమెకు అవగతమయ్యేది.

అంటే, గురువు ఆమెకు ఆ విషయం తిరిగి జ్ఞాపకం చేశాడు. అంతే.

గురువుపాత్ర అంతవరకే.

ఇప్పుడు, ఇంజనీర్లు, డాక్టర్లు, టెక్నికల్ నిపుణులు, ఇత్యాదులకూ అంతే.

గొప్పవాళ్లెవరికైనా అంతే. ఒక్కసారి వినగానే ఒంటపడుతుంది కాబట్టే,

వాళ్లు గొప్పవాళ్లవుతారు.

ఒంట పట్టడమంటే అర్థం చేసుకొని, ఆచరించడం.

మీకూ అనుభవంలోకి వచ్చే ఉంటుంది.

కొన్ని టాపిక్స్ (మీరు) అధ్యయనం చెయ్యకపోయినా

ఆ సందర్భం వచ్చినప్పుడు, బాగా తెలిసిన విషయంలా అనిపించి,

బాగా చెప్పడమో , వ్రాయడమో జరుగుతూంటుంది.

కాబట్టి, ఇంజనీర్లే గొప్ప డాక్టర్లే గొప్ప అని ఏమీ లేదు.

ఎవరి ఘనత వారిది.

పైగా ప్రతీ వ్యక్తికీ ఒక ప్రత్యేకత ఉంటుంది.

దాన్ని గుర్తించగలగడమే విద్య.

స్వీయలోపంబులెఱుగుటె పెద్దవిద్య అన్నారు కదా!

అవి ఎఱిగి దిద్దుకోవడం పరమవిద్య.

ఏ వృత్తిలో ఉన్నా,

ఆ పనిని చిత్తశుద్ధితో చేస్తే చాలు. తప్పక గొప్పవారవుతారు.

ఇంజనీరో డాక్టరో అవ్వలేదని వగవనక్కరలేదు.

మీరే కనుక రైతైతే నాకు ఆరాధనీయులవుతారు.

జవానైతే పూజ్యనీయులవుతారు.

ఆఖరుకు చిన్నపాటి వృత్తివిద్యలో ఉన్నా మీరు నాకు గౌరవనీయులే.

నేనొక గొప్పకళాకారుణ్ణి మీలో చూస్తాను.

ఓ చందమామ కథలో ఒకవ్యక్తి , ఏ విద్య నేర్చుకొంటే గొప్పవాళ్లమవుతామో

అన్న విషయంలో స్పష్టత లేక అన్ని విద్యలూ సగం సగం నేర్చుకొని,

ఇక్కడ ఉంటే లాభం లేదని, రాజుగారి ప్రాపకంలో రాణించవచ్చని,

మారుమూల ఉన్న తన పల్లెటూరు వదలి, రాజధాని చేరతాడు.

కొన్నాళ్లున్నా ఆశ ఫలించదు.

ఒకసారి తండ్రి వస్తాడు. వ్యవసాయాభివృద్ధికి తాను కనుక్కొన్న కొన్ని

విశేషాలను రాజు గుర్తించి, సన్మానానికి పిలిచాడని చెప్తాడు.

అది విన్నాక కొడుక్కి జ్ఞానోదయం అవుతుంది.

ఎక్కడున్నా ప్రయత్నాన్ని బట్టి పేరు సంపాదించవచ్చని.

అయితే కొందరు బద్ధకం అంటారు.

అదే పెద్ద అవరోధం అని తెలుసుకొన్నాక విడిచిపెట్టాలి.

ఆ.వె. చదువు మట్టుపడును; సంస్కృతి చెడిపోవు;

సంపదలు తొలంగు; సౌఖ్య ముడుగు;

గౌరవంబు వోవు; గావున సోమరి

తనము కన్న హీనగుణము కలదె ?

అయితే  బద్ధకం అని తెలిసినా ఏమీ చెయ్యలేకపోతే

ప్రయత్నించాలి మఱి.

పురుషప్రయత్నం ఉండాలి కదా!.

పార్వతి, పూర్వజన్మలో బాగా చదువుకొన్నప్పటికీ,

పురుషప్రయత్నంగా హిమవంతుడు, అమెను గురువువద్దకు పంపించాడు కదా!

సంకల్పం అన్నింటికంటే గొప్పది.

అది సత్సంకల్పం అయ్యి, దాన్ని ఆచరణలో పెడితే ఇక జన్మే ధన్యం.

ఇవి నా ఆలోచనలు.

తప్పులుంటే మన్నించండి.


మంగళం మహత్