10, సెప్టెంబర్ 2016, శనివారం

రామసుందరం - పదునొకండవసర్గం - ప్రథమభాగం



సుందరకాండ - ఏకాదశస్సర్గము



అవధూయ చ తాం బుద్ధిం
బభూ వావస్థిత స్తదా |
జగామ చాపరాం చింతాం
సీతాంప్రతి మహాకపి: || 1||
వానరశ్రేష్ఠుడైన ఆ హనుమ అప్పుడు
(మండోదరే సీత అనే) 
ఆ ఊహను తొలగించుకొని,  
స్వస్థచిత్తుడై
సీతను గూర్చి వేఱు ఆలోచన చేశాడు.

న రామేణ వియుక్తా సా
స్వప్తుమర్హతి భామినీ |
న భోక్తుం నాప్యలంకర్తుం
న పాన ముపసేవితుమ్ || 2||
రాముని ఎడబాటు పొందిన
సీత నిద్రించగలదా?
ఈ పరిస్థితిలో ఆమె 
అన్నపానాదులు స్వీకరించదు.
ఆభరణాల విషయమే పట్టదు.

నాన్యం నర ముపస్థాతుం
సురాణామపి చేశ్వరమ్ |
న హి రామసమ: కశ్చిత్
విద్యతే త్రిదశేష్వపి || 3||
సీతాసాధ్వి పరపురుషు నెవ్వరిని 
చేర నంగీకరించదు. 
త్రిలోకాధిపతిని గూడ కన్నెత్తి చూడదు.
దేవతలందరిలో గూడ
శ్రీరామునితో సమానమైనవాడు లేడు.

అన్యేయమితి నిశ్చిత్య
భూయస్తత్ర చచార స: |
పానభూమౌ హరిశ్రేష్ఠ:
సీతాసందర్శనోత్సుక: || 4||
ఇక్కడ నేను చూస్తున్నఈమె
వేఱెవ్వతెయో అయి ఉండును.
అని నిశ్చయించుకొని, హనుమ తిరిగి
ఆ పానమందిరంలో తిరుగాడ దొడగెను.

క్రీడితేనాపరా: క్లాంతా
గీతేన చ తథా౭పరా: |
నృత్తేన చాపరా: క్లాంతా:
పానవిప్రహతాస్తథా || 5||
ఆ పానభూమియందు,  
ఆడి అలసినవారు కొందఱు,
పాడి ఒడలెరుగక నిద్రించినవారు మరికొందఱు,
నృత్యాన్ని ప్రదర్శించి అలసినవారు మరికొందఱు,
త్రాగి, ఒడలెఱుగక పడి ఉన్నవారు మరికొందఱు ఉన్నారు.

మురజేషు మృదంగేషు
పీఠికాసు చ సంస్థితా: |
తథా౭౭స్తరణముఖ్యేషు
సంవిష్టాశ్చాపరా: స్త్రియ: || 6||
కొందఱు స్త్రీలు ఆ పానమందిరమునందు
మురజాలను, మృదంగాలను, పీఠాలను
ఆనుకొని నిద్రిస్తున్నారు.
కొందఱు ఉత్తమమైన తివాచీలు మున్నగు
వానియందు విశ్రమించి ఉన్నారు.

అంగనానాం సహస్రేణ
భూషితేన విభూషణై: |
రూపసల్లాపశీలేన
యుక్తగీతార్థభాషిణా || 7||

వివిధాలంకార భూషితలు,
రూపసల్లాపశీలురు,
యుక్తగీతార్థభాషిణులు,
దేశకాలాభియుక్తేన
యుక్తవాక్యాభిధాయినా |
రతాభిరతసంసుప్తం
దదర్శ హరియూథప: || 8||
దేశకాలానుగుణవర్తనులు
సందర్భోచితసంభాషణాచతురులు,
అయిన పెక్కురు అంగనలతో భోగేచ్ఛ తీరాక,
నిద్రిస్తున్న రావణుని హనుమ చూశాడు.

అన్యత్రాపి వరస్త్రీణాం
రూపసంలాపశాలినామ్ |
సహస్రం యువతీనాం
తు ప్రసుప్తం స దదర్శ హ || 9||
మరొకచోట రూపసల్లాపశాలినులైన
శ్రేష్ఠులైన
పెక్కుమంది స్త్రీలు నిద్రిస్తూండగా
హనుమంతుడు చూశాడు.

తాసాం మధ్యే మహాబాహు:
శుశుభే రాక్షసేశ్వర: |
గోష్ఠే మహతి ముఖ్యానాం
గవాం మధ్యే యథా వృష: || 10||
విశాల
గోశాలలో
ఉత్తమజాతి ఆవులమధ్య
ఆంబోతులా

స రాక్షసేంద్రశ్శుభే తాభి:
పరివృత: స్వయమ్ |
కరేణుభిర్యథారణ్యే
పరికీర్ణో మహాద్విప: || 11||
అరణ్యంలో ఆడఏనుగులతో
పరివృతమైన
మదపుటేనుగులా
మహాబాహువైన రావణుడు 
శోభిల్లుతున్నాడు.

సర్వకామైరుపేతాం చ
పానభూమిం మహాత్మన: |
దదర్శ హరిశార్దూల:
తస్య రక్ష:పతేర్గృహే || 12||
ఆ రావణుని గృహంలో
సర్వభోగ్యవస్తువులతో కూడిన
పానభూమిని,
ఆ కపివరుడు తిలకించాడు.

మృగాణాం మహిషాణాం చ
వరాహాణాం చ భాగశ: |
తత్ర న్యస్తాని మాంసాని
పానభూమౌ దదర్శ స: || 13||
ఆ పానభూమిలో
వేర్వేఱుగా ఉంచిన
లేళ్ళ, దున్నల, అడవిపందుల
మాంసాలను,

రౌక్మేషు చ విశాలేషు
భాజనేష్వర్ధభక్షితాన్ |
దదర్శ హరిశార్దూలో
మయూరాన్ కుక్కుటాం స్తథా || 14||
సగం తిని వదలివేసిన
నెమళ్ల
కోళ్ళ
మాంసాలను

వరాహవార్ధ్రాణసకాన్
దధిసౌవర్చలాయుతాన్ |
శల్యాన్ మృగమయూరాంశ్చ
హనుమా నన్వవైక్షత || 15||
పెరుఁగుతో, సౌవర్చలం అనే లవణంతో
వండిన అడవిపందుల, వార్ధ్రాణసాల 
(ఒకజాతిపక్షి.
మేకపోతని కొందఱు, 
ఖడ్గమృగమని కొందఱు.
వార్ధ్రాణసం అంటే 
నోరు, చెవులు, ముక్కు, మూడింటితో త్రాగేది,  
ఇంద్రియాలు క్షీణించి ఉండేది,  
తెల్లనిది, ముసలిది,  
ఆడుమేకలకు పెనిమిటి అయిన మేక. 
 (పరమార్థచంద్రిక)),
ముళ్ళపందుల, లేళ్ల, నెమళ్ల, మాంసాలను,

క్రకరాన్ వివిధాన్ సిద్ధాన్
చకోరానర్ధభక్షితాన్ |
మహి షానేకశల్యాంశ్చ
ఛాగాంశ్చ కృతనిష్ఠితాన్ || 16||
కొక్కెరల, చకోరాల,
మహిషాల, చేపల, మేకల
మాంసాలను
సగం తిని వదలివేసిన వాటిని, హనుమ చూశాడు.

లేహ్యానుచ్చావచాన్ పేయాన్
భోజ్యాని వివిధాని చ |
తథా౭౭మ్లలవణోత్తంసై:
వివిధైరాగషాడబై: || 17||
వివిధ పచ్చళ్లను, పానీయాలను, 
భోజ్యపదార్థాలను,
పులుపు ఉప్పు మొదలైనవాటితో చేసినవి,
వివిధ రాగ(పలుచని) షాడవ/బ(చిక్కని)
ఫలరసాలను,

హారనూపురకేయూరై:
అపవిద్ధైర్మహాధనై: |
పానభాజనవిక్షిప్తై:
ఫలైశ్చ వివిధైరపి || 18||
ధరించి విడచిన
అమూల్యహారాలను, నూపురాలను, 
కేయూరాలను,
ఫలాలతో నిండిన పానపాత్రలను,
హనుమ చూశాడు.

కృతపుష్పోప హారా భూ:
అధికం పుష్యతి శ్రియమ్ |
తత్ర తత్ర చ విన్యస్తై:
సుశ్లిష్టై: శ్శయనాసనై: || 19||
అక్కడక్కడ బాగా అమర్చిన
శయ్యాసనాలతో,
అలంకరించబడి ఉన్న
పువ్వులతో,

పానభూమిర్వినా వహ్నిం
ప్రదీప్తేవోపలక్ష్యతే |
బహుప్రకారై ర్వివిధై:
వరసంస్కారసంస్కృతై: || 20||
ఆ పానభూమి, శోభిల్లుతూ,
అగ్ని లేకుండగానే ప్రజ్వరిల్లుతోందా
అన్నట్లుంది.
శ్రేష్ఠమైన రీతులలో

మాంసై: కుశలసంపృక్తై:
పానభూమిగతై: పృథక్ |
దివ్యా: ప్రసన్నా వివిధా:
సురా: కృతసురా అపి || 21||
నిపుణులైన వంటవారితో వండిన
బహువిధ మాంసాహారాలు,
ఆ పానభూమియందు ఉన్నాయి.
సహజ మద్యాలు

శర్కరా౭౭సవమాధ్వీక
పుష్పాసవఫలాసవా: |
వాసచూర్ణైశ్చ వివిధై:
దృష్టాస్తైస్తై: పృథక్ పృథక్ || 22||
శర్కరతో, తేనెతో, బహువిధ
పుష్పాలతో నిర్మింపబడినవి,
వివిధ పరిమళచూర్ణాలతో కలుపబడినవైన
కృత్రిమ మద్యాలను,
మారుతి చూశాడు.

సంతతా శుశుభే భూమి:
మాల్యైశ్చ బహుసంస్థితై: |
హిరణ్మయైశ్చ వివిధై:
భాజనై: స్ఫాటికైరపి  |
జాంబూనదమయైశ్చాన్యై:
కరకైరభిసంవృతా || 23||


మంగళం మహత్
అనేకవిధపూలమాలలతో,
బంగారుపాత్రలతో,
స్ఫటికపాత్రలతో, నిండిన
ఆ పానభూమి ఎంతో శోభిస్తోంది.

ఇంకా బంగారు గిండిచెంబులతో,
ఆ పానభూమి
ఎంతో ప్రకాశిస్తోంది.


కామెంట్‌లు లేవు: