11, మే 2013, శనివారం

రామసుందరం - నాల్గవసర్గము









సుందరకాండ - చతుర్థసర్గము

స నిర్జీత్య పురీం శ్రేష్ఠాం
లంకాం తాం కామరూపిణీమ్ |
విక్రమేణ మహాతేజా
హనూమాన్ కపిసత్తమః || 1

హనుమంతుడు,
ఉత్తమపట్టణస్వరూపమైన
లంకాధిదేవతను జయించాడు.

అద్వారేణ మహాబాహుః
ప్రాకారమభిపుప్లువే |
ప్రవిశ్య నగరీం లంకాం
కపిరాజహితంకరః || 2

ముఖ్యద్వారంనుండి కాక
ప్రాకారంపైనుండి దుమికి,
లంకలోకి అడుగు పెట్టాడు.

చక్రే౭థ పాదం సవ్యం చ
శత్రూణాం స తు మూర్ధని |
ప్రవిష్ట స్సత్త్వసంపన్నో
నిశాయాం మారుతాత్మజః || 3
ఆ నిశివేళ,
శత్రు శి(బి)రాన
మొదట
ఎడమపాదం మోపి,
ప్రవేశించాడు.


స మహాపథమాస్థాయ
ముక్తాపుష్పవిరాజితమ్ |
తతస్తు తాం పురీం లంకాం
రమ్యామభియయౌకపిః || 4
ముక్తాపుష్పాలతో విరాజిల్లే
రాజమార్గాన,
పురంలోకి
వెళ్లాడు.


హసితోత్కృష్టనినదైః
తూర్యఘోషపురస్సరైః |
వజ్రాంకుశనికాశైశ్చ
వజ్రజాలవిభూషితైః || 5
చక్కని నవ్వులతో,
వాద్యఘోషలతో,
వజ్రాంకుశంలా
వజ్రఖచితగృహాలతో


గృహమేఘైః పురీ రమ్యా
బభాసే ద్యౌరివాంబుదైః |
ప్రజజ్వాల తదా లంకా
రక్షోగణగృహైశ్శుభైః || 6
ఆ లంక,
మేఘాలతో నిండిన
ఆకాశంలా ఉంది.
ఆ రాక్షసుల శుభగృహాలతో
వెలుగుతోంది.


సితాభ్రసదృశైశ్చిత్రైః
పద్మస్వస్తికసంస్థితైః |
వర్ధమానగృహైశ్చాపి
సర్వతస్సువిభూషితైః || 7
అంతటా,
పద్మం, స్వస్తికం, వర్ధమానం
అనే నిర్మాణవిశేషాలతో కట్టిన
తెల్లని మేఘాల్లాంటి గృహాలతో
విభూషితమై ఉంది.


తాం చిత్రమాల్యాభరణాం
కపిరాజహితంకరః |
రాఘవార్థం చరన్ శ్రీమాన్
దదర్శ చ ననంద చ || 8
చిత్రమాల్యాభరణాలతో
అలంకృతమైన ఆ లంకను చూచి,
హనుమంతుడు,
(సీతను చూడబోతున్నానని) ఆనందించాడు.


భవనాద్భవనం గచ్ఛన్
దదర్శ పవనాత్మజః |
వివిధాకృతిరూపాణి
భవనాని తతస్తతః || 9
ఆ పవనాత్మజుడు, ప్రతి ఇంటిని చూస్తూ,
ముందుకు వెళ్తున్నాడు.
ఆ భవనాలు
ఒకదానిమించి మఱొకటి
వివిధాకృతులలో ఉన్నాయి.


శుశ్రాన మధురం గీతం
త్రిస్థానస్వరభూషితమ్ |
స్త్రీణాం మదసమృద్ధానాం
దివి చాప్సరసామివ || 10
మదవతులైన స్త్రీలు,
మూడుస్థాయిల్లోనూ,
అప్సరసల్లా చేస్తున్న మధుర గానాన్ని
మారుతి విన్నాడు.


శుశ్రాన కాంచీనినదం
నూపురాణాం చ నిస్వనమ్ |
సోపాననినదాంశ్చైవ
భవనేషు మహాత్మనామ్ || 11
స్త్రీల ఒడ్డాణపు సవ్వడులను,
వారి కాలి అందెల ధ్వనులను,
మెట్లపై నడిచేటప్పుడు కలిగే
రవాలను విన్నాడు.


ఆస్ఫోటితనినాదాంశ్చ
క్ష్వేళితాంశ్చ తతస్తతః |
శుశ్రాన జపతాం తత్ర
మంత్రాన్ రక్షోగృహేషు వై || 12
అక్కడక్కడ
జబ్బలు / చేతులు
చఱచు ధ్వనులు,
వేదమంత్రధ్వనులు విన్నాడు.


స్వాధ్యాయనిరతాంశ్చైవ
యాతుధానాన్ దదర్శ స: |
రావణస్తవసంయుక్తాన్
గర్జతో రాక్షసానపి || 13
వేదాధ్యాయరతులను,
సంయుక్తంగా
రావణుని స్తుతిస్తున్నవారిని,
గర్జిస్తున్నవారిని చూశాడు.


రాజమార్గం సమావృత్య
స్థితం రక్షోబలం మహత్|
దదర్శ మధ్యమే గుల్మే
రావణస్య చరాన్ బహూన్ || 14
రాజమార్గం చుట్టూ చేరిన
రాక్షససైన్యాన్ని,
వారిమధ్యలో
పెక్కు గూఢచారుల్ని చూశాడు.


దీక్షితాన్ జటిలాన్ ముండాన్
గో౭జినాంబరవాసస: |
దర్భముష్టిప్రహరణాన్
అగ్నికుండాయుధాంస్తథా || 15
హనుమంతుడి చూసినవారిలో, (యజ్ఞ) దీక్షితులు, జడధారులు,
శిరోముండనం చేయించుకొన్నవారు,
ఎద్దుతోలు కట్టుకొన్నవారు,
పిడికిలిలో ధరించిన దర్భలతో
అనిష్టం నివారించేవారు,
హోమం చేసి, పొందిన కృత్యాదిశక్తులను
శత్రువులపైకి ప్రయోగించేవారు,


కూటముద్గరపాణీంశ్చ
దండాయుధధరానపి |
ఏకాక్షానేకకర్ణాంశ్చ
లంబోదరపయోధరాన్ || 16

కూట ముద్గర దండాయుధధరులు,
ఏకకర్ణులు,
లంబోదరపయోధరులు,


కరాళాన్ భుగ్నవక్త్రాంశ్చ
వికటాన్ వామనాంస్తథా |
ధన్విన: ఖడ్గినశ్చైవ
శతఘ్నీముసలాయుధాన్ || 17

వికృతశరీరులు, భుగ్నవక్త్రులు,
వికటులు, వామనులు,
ధనుః ఖడ్గ శతఘ్నీ ముసలాయుధధారులు,

పరిఘోత్తమహస్తాంశ్చ
విచిత్రకవచోజ్జ్వలాన్ |
నా౭తిస్థూలాన్ నాతికృశాన్
నా౭తిదీర్ఘాతిహ్రస్వకాన్ || 18
పరిఘహస్తులు,
విచిత్రకవచులు,
నాతిస్థూలురు,  నాతికృశులు,
నాతిదీర్ఘులు, నాతిహ్రస్వులు,


నా౭తిగౌరాన్ నాతికృష్ణాన్
నా౭తికుబ్జాన్ న వామనాన్|
విరూపాన్ బహురూపాంశ్చ
సురూపాంశ్చ సువర్చసః || 19

నాతిగౌరులు, నాతికృష్ణులు,
నాతికుబ్జులు, అవామనులు,
విరూపులు, బహురూపులు,
సురూపులు, సువర్చులు,
ఉన్నారు.


ధ్వజీన్ పతాకినశ్చైవ
దదర్శ వివిధాయుధాన్ |
శక్తివృక్షాయుధాంశ్చైవ
పట్టిశాశనిధారిణః |
క్షేపణీపాశహస్తాంశ్చ
దదర్శ స మహాకపిః || 20

ధ్వజాలు, పతాకాలు,
వివిధాయుధాలను చూశాడు.
ఈటెలు, వృక్షాలు, పట్టిసాలు,
వజ్రాయుధాలు, తెడ్లు, పాశాలు
ధరించినవారిని చూశాడు.

స్రగ్విణస్త్యనులిప్తాంశ్చ
వరాభరణభూషితాన్ || 21
పూలమాలలు, సుగంధద్రవ్యాలు,
ఆభరణాలు ధరించినవారిని,


నానావేషసమాయుక్తాన్
యథా స్వైరగతాన్ బహూన్ |
తీక్ష్ణశూలధరాంశ్చైవ
వజ్రిణశ్చ మహాబలాన్ || 22

నానావిధవేషధారుల్ని,
పదునైన శూలాలు, వజ్రాయుధాలు ధరించిన,
మహాబలుల్ని చూశాడు.

శతసాహస్రమవ్యగ్రమ్
ఆరక్షం మధ్యమం కపిః |
రక్షో౭ధిపతినిర్దిష్టం
దదర్శాంతఃపురాగ్రతః || 23

రావణుని ఆదేశానుసారం
పట్టణం లోపలిభాగంలో
కావలి ఉన్న
వేలమంది సైనికులను చూశాడు.

స తదా తద్గృహం దృష్ట్వా
మహాహాటకతోరణమ్ |
రాక్షసేంద్రస్య విఖ్యాతమ్
అద్రిమూర్ధ్ని ప్రతిష్టితమ్ || 24

విశాలమైన బంగారుసింహద్వారంతో,
త్రికూటపర్వతశిఖరాన
ప్రతిష్టితమై,

పుండరీకావతంసాభిః
పరిఖాభిరలంకృతమ్ |
ప్రాకారావృతమత్యంతం
దదర్శ స మహాకపిః || 25

తామరపూవులున్న అగడ్తలు,
చుట్టూ ప్రాకారం ఉన్న
రావణుని గృహాన్ని చూశాడు.


త్రివిష్టపనిభం దివ్యం
దివ్యనాదనినాదితమ్ |
వాజిహేషితసంఘుష్టం
నాదితం భూషణైస్తదా || 26
స్వర్గంతో సమానమై,
దివ్యమై, దివ్యనాదాలతో ప్రతిధ్వనిస్తూ,
గుఱ్ఱాల సకిలింపులతో,
ఆభరణాలతో ధ్వనిస్తూ,


రథైర్యానైర్విమానైశ్చ
తథా హయగజైశ్శుభైః |
వారణైశ్చ చతుర్దంతైః
శ్వేతాభ్రనిచయోపమైః || 27
రథాలు, పల్లకీలు, విమానాలతో,
శుభలక్షణాలుకల గుఱ్ఱాలు, ఏనుగులు,
తెల్లనిమేఘాల్లాంటి
నాలుగుదంతాల భద్రగజాలతో,


భూషితం రుచిరద్వారం
మత్తైశ్చ మృగపక్షిభిః |
రక్షితం సుమహావీరైః
యాతుధానైస్సహస్రశః |
రాక్షసాధిపతేర్గుప్తమ్
ఆవివేశ గృహం కపిః || 28
మత్తిల్లిన మృగపక్షులతో
భూషితమైన మనోహరద్వారంతో,
మహావీరులైన రాక్షసులతో
రక్షింపబడుతున్న
రావణుని గృహంలోకి
ఆంజనేయుడు ప్రవేశించాడు.


స హేమజాంబూనదచక్రవాళం
మహార్హముక్తామణిభూషితాంతమ్ |
పరార్ధ్యకాలాగరుచందనాక్తం
స రావణాంతఃపురమావివేశ || 29
తప్తకాంచనప్రాకారాలతో విలసిల్లుతూ,
ముత్యాలు, మణులతో అలంకృతమైన లోపలిభాగాలలో,
కాలాగరుచందనపరిమళాలు వెదజల్లే,
రావణాంతఃపురంలోకి,
ఆంజనేయుడు అడుగుపెట్టాడు.








ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే చతుర్థస్సర్గః (4)


శుభం భూయాత్


కామెంట్‌లు లేవు: