29, ఆగస్టు 2022, సోమవారం

దేశభాషలందుఁ దెలుఁగు లెస్స

 

ఆంధ్రవిష్ణువు, కృష్ణరాయలకు స్వప్నంలో సాక్షాత్కరించి, ఆముక్తమాల్యద, చూడికుడుత్తనాంచారు (గోదాదేవి) వివాహాన్ని కావ్యంగా తెలుఁగులో వ్రాయమనే సందర్భంలో  ఇలా అన్నాడు.

 

ఆ.వె. తెలుఁగ దేల యన్న*? దేశంబు దెలుఁ గేను

దెలుఁగు వల్లభుండఁ, దెలుఁగొ కండ

యెల్ల నృపులు గొలువ నెఱుఁగవే బాసాడి,

దేశభాషలందుఁ దెలుఁగు లెస్స (ఆముక్త 1-15)    


*నన్న (పాఠాంతరం)

 

తెలుఁగు అది ఏల అన్నన్ = తెలుఁగు అది ఎందుకు అంటే (తెలుగులోనే కృతి చేయమని ఎందుకంటున్నానంటే)

దేశంబు తెలుఁగు = (మాతృ) దేశం తెలుఁగు/ ఇది తెలుఁగుదేశం

ఏను =నేను

తెలుఁగు వల్లభుండన్ = ఆంధ్రపతిని/తెలుఁగురాజును/తెనుఁగువల్లభరాయనామం కలవాడను

తెలుఁగొ = ఇక తెలుఁగు భాష అన్ననో (అంటావా)?

కండ = కండ కల (పుష్టిగల సమర్థవంతమైన) (లేదా)

         పుల/కలకండ (లాగ తియ్యగా ఉండే) భాష,

ఎల్ల నృపులు కొలువన్ = సకల రాజన్యులు సేవిస్తూండగా (భువనవిజయంలో)

బాస ఆడి = సంభాషించి (బాస అంటే దేశభాష)

దేశభాషలందు = సంస్కృతేతర దేశ్యభాషలలో (అంటే ఔత్తరాహ, దాక్షిణాత్యరాష్ట్రభాషల్లో)

తెలుఁగు లెస్స = తెలుఁగు ఉత్కృష్టం (గొప్పది)(అని)

ఎఱుఁగవే = ఎఱుఁగుదువు కదా! (కాక్వర్థంవల్ల సకలదేశభాషల్ని ఎఱుఁగుదు వనుట)

 

(కృష్ణదేవరాయల ఆస్థానంలో దేశభాషాకవులందఱూ ఉండేవారు. వారందఱి భాషలు విన్నాడు) 

కనుకనే దేశభాషలందుఁ దెలుఁగు లెస్స అని తెలిసి ఉండాలి. అని ఆంధ్రమహావిష్ణువు అన్నాడు.

కృష్ణరాయల మనోభావమూ ఇదేయై ఉండనోపు.

 

 

“కన్నడ రాయఁడ వైన నిన్ను కన్నడం కాని మఱే భాషలో కాని చెప్పుమనక

తెనుఁగులోనే  చెప్పమనడానికి కారణాలున్నాయి

ఒకటి - ఇది తెలుఁగు దేశం

రెండు - నేను తెలుఁగుదేశాన్ని అభిమానించిన వల్లభ రాయఁడను

మూడు – తెలుఁగు బాస పులకండం కదా! నానాభాషలాడు రాజులు నిన్ను కొలిచేటప్పుడు వారితో ఆయా బాస లాడి దేశభాష  లన్నిటిలో తెలుఁగుయొక్క  ఆ ఉత్కర్షను నీవు కనిపట్టి ఉండలేదా!” అని వేదంవారి వ్యాఖ్య.

ఇంకా ఆయన

“కృష్ణరాయలు, తెనుఁగును రాజులతో "ఆడి" నేర్చెనే కాని "చదివి" నేర్చినవాడు కాదు. తెనుఁగు అతని ఇంటిభాష గాదు” అన్నారు. 

వారి దృష్టిలో  కృష్ణరాయలు కన్నడరాజు అని తెలుస్తుంది.

కానీ కృష్ణరాయల మాతృభాష తుళు అని చాలమంది అభిప్రాయం. 

తెలుఁగొ కండ అన్న వాక్యాన్ని కొందరు (వావిళ్ల రామస్వామిశాస్త్రి)

తెలుఁగు ఒకండ = తెలుఁగు ఒక్కటే అని విడదీశారు.

వేదం వారి వ్యాఖ్యను బట్టి ఇది కూడా చెప్పుకోవచ్చు.

తెలుఁగు ఒక్కటే నీవు బాసాడి (అలవోకగా) ఎఱిఁగిన బాష. మిగిలినవి అభ్యసించి నేర్చుకొన్నావు. అనీ చెప్పవచ్చు.

 

`దేశం తెలుగుదేశం; నేను తెలుగు వల్లభుణ్ణి: తెలుగు కలకండలాగా తియ్యగా ఉంటుంది. దేశదేశాల రాజులు కొలుచుకుంటూ ఉంటే వివిధ భాషలు మాట్లాడే నీకు దేశభాషలందు తెలుగు లెస్స అని తెలియదా!”

అని  ఆరుద్ర తాత్పర్యం.

 

వేదం వారు కండకు కలకండ అన్న అర్థం వ్రాశారు. 

అచార్య తుమ్మపూడి కోటేశ్వరరావు కండకు కండ కల (పుష్టిగల సమర్థవంతమైన) అన్న అర్థం చెప్పారు.

 

అందువల్ల నన్నెచోడుఁడు, జానుతెనుఁగు అన్నట్లు

కృష్ణరాయలు తెలుఁగును “కండతెలుఁగు” అని 

ఆంధ్రమహావిష్ణువు ద్వారా అనిపించాడని భావించవచ్చు.

 

మంగళం మహత్

20, ఆగస్టు 2022, శనివారం

అనుస్వారస్య యయి పరసవర్ణః "

*ఉచ్ఛారణ విషయంలో సూచనలు*


వ్యాకరణ శాస్త్రం ప్రకారం *వేఙ్కట, చఞ్చల,* *పణ్డిత, సన్తాన, సమ్పద* వంటి పదాలను ఈ రకంగా రాయడమే సముచితం. కానీ ఈ రోజుల్లో విద్యార్థులకు వీటిని చదవడమే చేతకావడం లేదు. కనుక మేము ఈ గ్రంథంలో ఇలాంటి పదాలు వచ్చినప్పుడు *వేంకట, చంచల, పండిత, సంతాన* *సంపద* వంటి రూపాలనే ముద్రించాము.


ఈ పద్ధతి వ్యాకరణానికి విరుద్ధమైనా సరే విద్యార్థుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలా చేయవలసి వచ్చింది.


అయితే ఇలాంటి సందర్భాల్లో *సున్నాను "N" గా పలికారా? "M" అని ఈనాటి విద్యార్థులు అడుగుతున్నారు. అలాంటి వారికోసం కొన్ని సూచనలను అందించవలసి వచ్చింది.


1 సున్నాకు స్వతంత్రంగా ఉచ్చారణ శక్తి లేదు. దానికి కుడి పక్క ఉండే హల్లుని బట్టి దాని ఉచ్చారణ మారుతూ ఉంటుంది. సున్నాకు కుడిపక్కన అచ్చులు రావు. 


2 సున్నాకు కుడి పక్కన కవర్గ అక్షరాలు (క, ఖ,గ, ఘ, ఙ) వస్తే, ఆ సున్నాను *ఙ్* గా పలకాలి.


*ఉదా:* *సంఘటన = సఙ్ఘటన*


3 సున్నాకు కుడిపక్కన చవర్గ అక్షరాలు (చ, ఛ, జ, ఝ, ఞ) వస్తే దాన్ని *ఙ్* గా పలకాలి.


*ఉదా:* *సంజయ = సఙ్ జయ.


4 సున్నాకు కుడిపక్కన టవర్గ అక్షరాలు వస్తే (ట, ఠ, డ, ఢ, ణ) వస్తే దాన్ని *ణ్* గా పలకాలి.


*ఉదా:* *పాండవ = పాణ్ డవ*


5 సున్నాకు కుడిపక్కన తవర్గ అక్షరాలు (త, థ, ద, ధ, న) వస్తే దాన్ని *న్* గా పలకాలి.


*ఉదా:* *సంధాన = సన్ ధాన*


6 సున్నాకు కుడిపక్కన పవర్గ అక్షరాలు వస్తే (ప, ఫ, బ, భ, మ) వస్తే దాన్ని *మ్* గా పలకాలి.


*ఉదా:* *సంభావితస్య = సమ్భావితస్య*


7 సున్నాకు కుడిపక్కన వత్తు అక్షరాలు వస్తే వాటిలో మొదటి అక్షరం ఏ వర్గకు సంబంధించిందో,   

ఆ వర్గ పంచమాక్షరాన్ని ఉచ్చరించాలి.


ఉదా: *సంక్షోభ = సఙ్ క్షోభ*


8 సున్నాకు కుడిపక్కన వర్గపంచమాక్షరాలు వస్తే

గూడా పై నియమాలే వర్తిస్తాయి.


ఉదా: *సంన్యాస = సన్యాస* 


 *సంమార్జన = సమ్మార్జన*

సున్నాకు కుడి పక్కన *ఙ, ఞ, ణ* అనే అక్షరాలు సాధారణంగా రావు.


9 సున్నాకు కుడిపక్కన *య* నుండి *హ* వరకు గల అక్షరాలు వస్తే, దాన్ని *మ్* గానే పలకాలి. కానీ ఇక్కడ ఉన్న ఉచ్చారణ విధానాన్ని గురుముఖంగా నేర్చుకోవలసిందే.


ఉదా: *సంయత* (వ్రాత) = సమ్ యత (ముక్కుతో ఉచ్చారణ) *సంహార* = సమ్ హార (ముక్కుతో ఉచ్చారణ)


10 ఇక 'హ' కారం క్రింద "ణ, న, మ" వచ్చినప్పుడు

ఉచ్ఛారణ విషయంలో కొన్ని జాగ్రత్తలు వ్యాకరణ పరంగా తీసుకోవాలి.


ఉదా: *ప్రాహ్ణ* (వ్రాత) = *ప్రాణ్ హ* ఉచ్చారణ


*వహ్ని* (వ్రాత) = *వన్ హి* ఉచ్చారణ

       

*బ్రహ్మ* (వ్రాత) = *బ్రమ్ హ* 

('హ'కారంతో *ఙ, ఞ* లు కలిసిన పదాలు లేవు)


11 'ఫ'కారాన్ని 'F' లాగా పలుకరాదు. 


*ఙ, ఞ, జ్ఞాన* - వంటి వాటి ఉచ్చారణలను సంప్రదాయం తెలిసిన వారి దగ్గర నేర్చుకోవాలి.


12 వత్తు అక్షరాలను (సంయుక్తాక్షరాలను) 

వ్రాసేటప్పుడు దేన్ని ముందు వుచ్చరించాలో దాన్ని ముందు రాస్తారు. దాన్ని సగమే పలకాలి.


ఉదా: *పద్మ* (వ్రాత) = పద్ మ (ఉచ్చారణ)


*నిస్త్రైగుణ్య* (వ్రాత) = నిస్ + త్ + రైగుణ్య (ఉచ్చారణ).

 

నా(గ)స్వ(ర)వ్యాఖ్య 

ఉచ్చారణ విషయంలో 

చక్కని సూచనలు చేశారు 

శ్రావణిగారూ!


అయితే ఇంతా చేసి హెడ్డింగ్ లోనే

ఉ"చ్ఛా"రణ అన్నారు.


టైపింగ్ తప్పయి ఉండవచ్చు.


"3   సున్నాకు కుడిపక్కన చవర్గ అక్షరాలు 

 (చ, ఛ, జ, ఝ, ఞ)  వస్తే దాన్ని *ఙ్* గా పలకాలి.

"*ఉదా:*  *సంజయ = సఙ్ జయ."


అన్నారు


ఙ కాదు

ఞ వస్తుంది


సఞ్జయ అవుతుంది 


(టైపింగ్ తప్పయి ఉండవచ్చు )


"ఉదా:  *సంన్యాస = సన్యాస* "

అన్నారు"


కాదు


సన్న్యాస అనాలి


సమ్ + న్యాస లను కలిపినపుడు

పరసవర్ణాదేశం వచ్చి

సమ్ లోని మ్ > న్ అవుతుంది 

= సన్ + న్యాస = సన్న్యాస అవుతుంది. 

అందువల్ల ఆదేశ నకారం, 

న్యాసలోని నకారం రెండూ 

సన్న్యాసలో ఉంటాయి. 

కాన సన్యాస శబ్దం వ్యాకరణవిరుద్ధం.


అయితే శబ్ద.ర.లో సన్యాసం అని ఉంటుంది.

తర్వాత దీన్ని సూ.రా.ని. వాళ్లు సరిదిద్దారు.


"ఉదా: ప్రాహ్ణ = ప్రాణ్ హ"


అన్నారు


ప్రాహ్ ణ


(టైపింగ్ తప్పయి ఉండవచ్చు )


"('హ'కారంతో *ఙ, ఞ* లు 

కలిసిన పదాలు లేవు)

అన్నారు"


ఉన్నాయి


హంజి - హఞ్జి

హంజికా - హఞ్జికా


హింగులీ - హిఙ్గులీ

హింగులమ్ - హిఙ్గులమ్


అయితే 

ఇవన్నీ సంస్కృతపదాలు

ఙ, ఞ లు

సంస్కృతంలోనుండి

తెలుగులోకి వచ్చాయి.

అది కూడా బిందువు ప్రక్క 

వర్గాక్షరాలు వస్తే మాత్రమే

అయా అనునాసికాలుంచాలి.


సంస్కృతంలో దీని 

రూపసాధన చూద్దాం 


ఉదాహరణకు

అఙ్కితః, శాన్తః పదాలు తీసుకొంటే


'అన్ + కితః ' 

'శామ్ + తః ' 

 "నశ్చాపదాన్తస్య ఝులి " సూత్రంచేత 

నకార మకారాలు సున్నలుగ మారి 

‘ అంకిత ’  'శాంత' అవుతాయి. అపుడు 

" అనుస్వారస్య యయి పరసవర్ణః " సూత్రంచే పరసవర్ణం వచ్చి 'అజ్కితః' 'శాన్తః' 

ఈలాగున సంస్కృతంలో

రూపాలేర్పడతాయి.


అయితే అనునాసికాక్షరసంయోగం 

ఉన్నచోటల్లా సున్ననే పాటించి

అంకితం, శాంత ఇలా వ్రాయడం

మన తెలుగువారి సంప్రదాయం.

దీనికి మళ్లీ

యయితద్వర్గాన్తః అనే

వైకల్పిక సూత్రం ఆధారం అంటారు.


సారాంశం ఏమిటంటే 

ఈ సంస్కృతపదాల్ని 

తెలుగులో వ్రాసేటప్పుడు 

ఇంత కష్టపడనవసరంలేదు అని.


(నా టైపింగ్ లో కూడా తప్పులుండొచ్చు)


స్వస్తి.

19, ఆగస్టు 2022, శుక్రవారం

టుగాగమం గుఱించి

కృష్ణమ్ వన్దే జగద్గురుమ్

కృష్ణాష్టమి శుభాకాంక్షలు

వాగ్విదాంవరులకు వందనాలు

 

సందేహం:

 

సూ. కర్మధారయంబులం దుత్తున కచ్చు పరంబగునపుడు టుగాగమంబగు. 

పల్లె  + ఊరు

మొదటి పదం లో హ్రస్వ ఉకారం ఉందా? తెలియజేయగలరు . 

తేనె + ఈగ కూడా...

 

వివరణ:

 

నిజమే. ఉత్తు లేదు. కానీ టుగాగమం వచ్చింది.

 

పాఠశాల,కళాశాలలకోసం రచింపబడిన అన్ని ఆధునిక వ్యాకరణాల్లోనూ

ఇదే సూత్రాన్ని పేర్కొంటున్నారు.

 

టుగాగమము సాధారణముగా ఉకారాంతపదములకు విధింపబడినదైనను 

దుక్కిటెద్దు,మిద్దెటిల్లు ఇత్యాదులయందును ప్రవర్తిల్లుచున్నది (..)

 

ఆలాగునే

పల్లెటూరు,తేనెటీఁగ,పడుకటిల్లు ఇత్యాది ఉకారాంత వ్యతిరిక్త స్థలాల్లోనూ కనబడుతోంది.

 

అలాగే వేల్పుటావు వంటి కర్మధారయేతర సమాసాల్లోనూ కనబడుతోంది.

అందువల్లే ’కర్మధారయంబులందు" అని సూరి బహువచనప్రయోగం చేశాడని వ్యాకరణవ్యాఖ్యాతలంటారు.

 

తేనెటీఁగ - తేనెయీఁగ - తేనీఁగ

ఇది ఎదంత శబ్దమైనా ఉదంతాలకులాగ దీనికీటుగాగమం వచ్చింది...

కాని తేనెటీఁగ అనేదాన్నిఆంధ్రభాషార్ణవం సైతం పేర్కొనలేదు.

 

దుక్కిటెద్దు అన్నది నీలాసుందరీపరియణంలో, వేంకటనాథుని పంచతంత్రంలో కనబడుతోంది.

 

వజ్ఝల మొదలైన ప్రామాణిక వైయాకరణులు మాత్రం 

’ఇవి వ్యావహారిక శబ్దాలు.

ఇలాంటివాటికి నిరాధారంగా కోశకర్తలు గ్రాంథికతను అంగీకరించడం యుక్తం అని తోచదు.

ప్రామాణిక ప్రయోగం గాని,ప్రామాణిక వైయాకరణవచనప్రామాణ్యంగాని లేనపుడు

వ్యావహారికశబ్దాలకు గ్రాంధికతను అంగీకరించడం సంప్రదాయవిరుద్ధం" అని అంటారు.

 

అందుకే ప్రయోగశరణం వ్యాకరణం అని ఉన్నా పల్లెటూరిత్యాదుల్నిసూరి పేర్కొనలేదు.

 

అంతేకాదు.

"ప్రాతాది" సూత్రాలకు కూడా సాధ్యం కావని ఎంచి సూరి

"నిక్కలాదులు యథాప్రయోగంబుగ గ్రాహ్యంబులు"

అనే సందర్భంలో చెప్పిన ఉదాహరణలు సైతం భారతంలోని ప్రామాణిక ప్రయోగాలే.

 

పోనీ అని

పల్లెటూరిత్యాదుల్ని లక్షణబద్ధం చేయాలంటే

ప్రామాణిక ప్రయోగాలు లేవాయె. అరుదుగా కనిపించేవి ఇవి.

(వంతరాం రామకృష్ణారావు గారు తన ముక్తలక్షణ కౌముదిలో శ్రీనాథుని చాటువుగా చెప్పే
పల్లెనాటి సీమ పల్లెటూళ్లు అని ఉదాహరించి,
"ఉదంతేతరంబుల కచ్చు పరంబగునపుడు టుగాగమంబు గొండొకచోఁ జూపట్టెడి"
అని సూత్రం వ్రాశారు.
దుక్కిటెద్దు ఇంకో ఉదాహరణ.
కానీ కర్మధారయంబుల అని లేదు.
తర్వాత చాటువులు ప్రమాణాలు కావు.
దుక్కియెద్దు , తేనెయీగ అని వ్రాసినా యతిప్రాసలకు భంగం రాదు అని వజ్ఝలవారన్నారు.
తేనెటీగ వేమన వాడాడు.)

 

దీని తర్వాత సూరి చెప్పిన

కర్మధారయంబునందుఁ బేర్వాదిశబ్దముల కచ్చు పరంబగునపుడు టుగాగమంబు విభాష నగు”. 

అనే సూత్రం లోని విభాషను వ్యవస్థ చేసి, పల్లెటూరిత్యాదుల సాధించుట ఉచితమని తోచెడి.

అని దూసివారు అంటారు.

 

ఏతావాతా తేల్చేది ఏమిటంటే

ప్రస్తుతానికి యథాతథం గ్రాహ్యం.

 

మంగళం మహత్