31, డిసెంబర్ 2022, శనివారం

రామాయణంలో ఒక విషయపరిశీలన

 భరతలక్ష్మణులలో జ్యేష్ఠుడెవరన్నదానికి


భరతుడే జ్యేష్ఠుడని 

భవభూతితో సహా అర్వాచీనులు పెక్కుమంది అభిమానించారు.


మఱి 

రామలక్ష్మణభరతశత్రుఘ్నులనే

వాడుక రావడానికి ఏమైనా కారణాలున్నాయా 

అని నేను పరిశీలించిన మీదట 

నాకు కొన్ని విషయాలు తెలిశాయి.


భాసుడు...

సంస్కృతంలో మొదటి నాటకకారుడు. 

కాళిదాసు నాటికి ప్రసిద్ధ నాటకకారుల్లో ఒకడుగా పేరు సంపాదించినవాడు. 


భాసుడు రామాయణ కథనంతా నాటకాల్లో కూర్చటానికి ప్రయత్నిస్తూ ప్రతిమా, అభిషేక నాటకాలను వ్రాశాడు. 


ఈ రెండు నాటకాల్లో ప్రతిమానాటకం నాటకకళాదృష్టితో వికసితమైన 

ప్రౌఢనాటకం. దీనిలో భాసుడు 

తన కల్పనాచాతుర్యాన్ని చూపుతూ అద్భుతమైన కథా సన్నివేశాలను  సృష్టించాడు. పాత్ర చిత్రణ కళాదృష్టితోనూ ఈ నాటకం ఉత్తమమైంది.


వాల్మీకి రామాయణానికీ, 

ఈ నాటకకథకూ 

కొన్ని భేదాలు  కనిపిస్తాయి.


అట్టి దొక్కటి : ఇందులో 

లక్ష్మణుడు పెద్దవాడుగాను, 

భరతుడు చిన్నవాడుగాను కనిపిస్తారు. లక్ష్మణుడు భరతుని ‘వత్స!' అని పిలుస్తాడు. ఆశీర్వదిస్తాడు.


భరతుడు లక్ష్మణునకు మ్రొక్కుతాడు. 'ఆర్య!' అని పిలుస్తాడు.


ఈ విషయం వాల్మీకి రామాయణంలో సంశయగ్రస్తంగా ఉంది.


బాలకాండలో: 

"పుష్యే జాతస్తు భరతః 

సార్పే జాతౌ తు సౌమిత్రీ-" అని ఉంది.


భరతుడు పుష్యమీ నక్షత్రాన, లక్ష్మణశత్రుఘ్ను లాశ్లేషా నక్షత్రాన 

జన్మించారు.


కాబట్టి భరతుడే జ్యేష్ఠుడవుతాడు. 

కాని, దీనికి విరుద్ధంగా 

లక్ష్మణుడే జ్యేష్ఠుడవుతా డనడానికి 

కూడా సాధనాలు కొన్ని 

రామాయణంలో ఉన్నాయి.


యుద్ధకాండలో:


"తతో లక్ష్మణ మాసాద్య

వైదేహీం చాభ్యవాదయత్,

అభివాద్య తతః ప్రీతో 

భరతో నామ చాఽబ్రవీత్"


అని ఉంది.

సరళరీతిని చూస్తే

ఇక్కడ భరతుడు, 

లక్ష్మణుని, సీతను 

నమస్కరించినట్లు అర్థం ఏర్పడుతుంది.

ఇలా చెప్తేనే ‘వైదేహీం చ’ అని అనడం 

సమర్థ మవుతుంది. 


జన్మకాలాన్నిబట్టి భరతజ్యైష్ఠ్యం 

వ్యక్త మవుతూండడంవల్ల

రామాయణవ్యాఖ్యాతలు ఇక్కడ చిక్కుపడ్డారు.


గోవిందరాజు 

దీని గుఱించి వ్యాఖ్యానిస్తూ, 

లక్ష్మణ మాసాద్య =  కృతనమస్కారం లక్ష్మణ మాలింగనేన సంభావ్య,

(లక్ష్మణునిచేత నమస్కరింపబడి, 

ఆతనిని ఆలింగనంతో సంభావించి,)

వైదేహికి (రామునితో సహా) నమస్కరించాడు. 

చకారం రామనమస్కారాన్ని 

సూచిస్తుంది" అని వ్రాశాడు.


ఇక్కడ చ యొక్క ఉపయోగం కనబడుతుంది. 


ఇంకా గోవిందరాజు 

అయోధ్యకాండలోని

"సీతా గచ్ఛత్వ మగ్రతో భరతాగ్రజః" అనే

వాల్మీకి రామాయణప్రయోగం 

సరళరీతిలో లక్ష్మణుడే జ్యేష్ఠుడని చెప్తున్నా, 

జన్మకాలరీతికి విరుద్ధం అవడం చేత

'భరతాగ్రజః ఇత్యత్ర బహువ్రీహి రిత్యుక్తమ్' అని క్లిష్టార్థాన్ని కల్పించాడు.


భరతునకు అగ్రజుడు అని షష్ఠి కాకుండా,

భరతుడు అగ్రజుడుగా కలవాడు అని బహువ్రీహి చేసి సరిపెట్టాడాయన.


అయితే కొంతమంది ఆధునికులు

భరతాగ్రజ బదులు

సాహసించి భరతానుజ అని శ్లోకంలోనే మార్చేసి, సులువుగా అర్థం వ్రాసేశారు.


అరణ్యకాండ వ్యాఖ్యానంలో 

'న సంఖ్యే భరతానుజః' అని భరత 

జ్యైష్ఠ్యవ్యంజక ప్రయోగమూ కలదని  గోవిందరాజు పేర్కొన్నాడు. 


తిలక వ్యాఖ్యానంలో

'తతో లక్ష్మణ మాసాద్య' అని పైన చెప్పిన శ్లోకానికి భరతుడు లక్ష్మణునకు  నమస్కరించినట్లే అర్థం చెప్పబడింది. 


కానీ దాన్ని, వేఱేలా సమర్థిస్తూ

జన్మప్రకరణం ప్రకారం 

భరతాత్కనిష్ఠ వయసాస్పష్టమ్ అయినప్పటికీ  అధికగుణాలచేత 

గురుత్వం సిద్ధించి లక్ష్మణుడు 

నమస్కరించ దగినవాడయ్యాడని వ్రాశారు.


పాయసప్రదానాన్నిబట్టి, 

వివాహక్రమాన్నిబట్టి 

(రాముని తర్వాత 

లక్ష్మణుని వివాహం జరిగింది.)

లక్ష్మణుడే జ్యేష్ఠుడైనా,

జననకాలరీతిచేత 

అది పరిహృతమైందని

గోవిందరాజు అన్నాడు.


అలాగే లక్ష్మణుని జ్యేష్ఠత్వం 

వాల్మీకి సమ్మతం కాదు 

అని కూడా స్పష్టంగా చెప్పలేమని 

వేదం వేంకట రాయశాస్త్రి గారి ఉవాచ.


అందువల్ల 

భాసుడు లక్ష్మణుడే జ్యేష్ఠుడని 

వ్రాయడం వల్ల ఆయన కాలం నాటికే

రామలక్ష్మణభరతశత్రుఘ్నులనే 

వాడుక వచ్చిందనవచ్చు. 


మంగళం మహత్ 




 

26, డిసెంబర్ 2022, సోమవారం

తు చ

 

తు చ తప్పక గుఱించి

 

తెల్సినంతవఱకు...

శ్లోకాలలో తఱచుగా ప్రయోగించే తు, చ అనేవి సంస్కృత అవ్యయాలు. 

అయితే అనే అర్థంలో "తు", మఱియు అనే అర్థంలో "చ" ఎక్కువగా వాడబడుతూంటాయి.    

విశేషమందును, నిశ్చయమందును, హేతుపాదపూరణములయందును "తు" వర్తించును.

అన్వాచయమందును, సమాహారమందును, ఇతరేతరయోగమందును, సముచ్చయమందును, పాదపూరణ పక్షాంతరహేతు నిశ్చయమందును "చ" వర్తించును

- అని వావిళ్లవారి సంస్కృత-తెలుగు నిఘంటువు. (ఇంకా వివిధ అర్థాలున్నాయి చూడండి.

వెత్సా వెంకటశేషయ్యగారి సంస్కృతాంధ్రనిఘంటులో కూడ చూడండి.)

ఇక అసలు విషయానికి వస్తే, ఇవి పాదపూరణలకోసం ఎక్కువగా వస్తాయి.

అటువంటప్పుడు వాటికి వేఱే ప్రయోజనం లేనందున వాటి అర్థాలు చెప్పక్కరలేదు కూడా.

అంటే చెప్పకపొయినా శ్లోకభావం సిద్ధిస్తుంది.

అయితే పూర్తిగా అన్నిచోట్లా అని కాదు. వాటి విలువ వాటికి ఉంది.

అయితే సంస్కృతభాషమీద గౌరావాభిమానాలున్న కవులు

అవసరం లేని చోట కూడ తు చ లను వదలకుండా అనువదించారు.

అలా అనువాదాలనుండి మొదలై మిగతా సందర్భాలకు కూడా మారిందనవచ్చు.

ఇలాంటి ఎక్కువ ఉపయోగం/ప్రయోజనం లేని అక్షరాలను కూడా వదలిపెట్టకుండా పూర్తిగా, ఉన్నది ఉన్నట్లుగా ఒక్క పొల్లుకూడా పోకుండా  అనువదించాడనో / వ్రాశాడనో / చెప్పాడనో / వివరించాడనో  చెప్పేటప్పుడు "తు చ తప్పక" అంటూంటారు.

అలాగే చెప్పింది చెప్పినట్లు ఆజ్ఞను ఉల్లంఘించకుండా చేసినప్పుడు కూడా

తు చ తప్పక చేశాడంటారు.

తు చ లు లేకుండా శ్లోకం వ్రాయడం కష్టం అనిపిస్తుంది.

వ్యాసుని భారతం నిండా తు చ లు ఉంటాయంటూ

వీటి విషయమై కాళిదాసు, వ్యాసులవారి మధ్య జరిగిన

ఆసక్తికరమైన ఈ రసవత్తర సన్నివేశాన్ని చూడండి.

http://tinyurl.com/zboawbh

volga video వారి సౌజన్యంతో                                          

23, డిసెంబర్ 2022, శుక్రవారం

 ఆదివారం ఆమలకం ని‌‌షిద్ధం అనడానికి

జ్యోతిశ్శాస్త్రపరంగా చూస్తే,


ఉసిరి పులుపు.

పులుపు శుక్రుని రుచిగా పేర్కొన్నారు.


రవి శుక్రులు పరస్పరం శత్రువులు.

అందువల్ల రవివారం 

పులుపు పుష్కలంగా ఉన్న

శుక్రసంబంధ ఉసిరి తింటే శరీరం దుష్టమౌతుంది.

(కుష్ఠు, బొల్లి వస్తాయని పెద్దలనే మాట)


తరువాత ఏవైతే నశిస్తాయని చెప్పారో 

ఆ వీర్యయశోప్రజ్ఞాదులకు లక్ష్మీప్రసన్నతకు శుక్రుడే కారకుడు.


అందువల్ల శత్రువైన భానువారం నిషేధం.


జ్ఞానం, వైరాగ్యం, యశస్సు, వీర్యం, ఐశ్వర్యాలకు భగమని పేరు.

ఇవి కలవాడు భగవంతుడు.


సూర్యుడు సాక్షాత్ నారాయణుడు.

దీన్నిబట్టి కూడా ఆదివారం నాడు ఆయన విరోధికి సంబంధించిన ధాత్రి నిషిద్ధం.


అంతేకాదు కళత్రానికీ, కళత్రసుఖానికీ 

శుక్రుడే కారకుడు.

అందువల్ల ఉసిరే కాదు, 

భార్యాసంగమం కూడా ఆదివారం నిషిద్ధం. 

ఏడు జన్మల పాపం దాని ఫలితం.


ఇవే కాదు ఇంకా ఆదివారంనాడు కొన్ని నిషేధాలున్నాయి. కొన్ని తిథుల్లో కూడా 

కొన్ని ని‌షేధాలున్నాయి.


స్వస్తి

18, డిసెంబర్ 2022, ఆదివారం

శ్రీనాథుని కవిత్వం

శ్రీనాథుని కవిత్వం ప్రాచీనాంధ్రమహాకవుల విశిష్టకవితాగుణాలకు సంగమతీర్థ మని వేమారెడ్డి కాశీఖండంలో కీర్తించాడు. శ్రీనాథుని కవితాలక్షణాల్ని చక్కగా గుర్తించాడాయన. 'వచియింతు వేములవాడ భీమన భంగి నుద్దండ లీల నొక్కొక్కమాటు భాషింతు నన్నయభట్టు మార్గంబున నుభయ వాక్ప్రౌఢి నొక్కొక్కమాటు వాక్రుత్తు తిక్కయజ్వ ప్రకారము రసాభ్యుచిత బంధముగ నొక్కొక్కమాటు పరిఢఁవింతు ప్రబంధ పరమేశ్వరుని ఠేవ, సూక్తి వైచిత్రి నొక్కొక్కమాటు' శ్రీనాథు డొక్కొకసారి వేములవాడ భీమకవి లాగా ఉద్దండంగా కవిత్వం చెపుతాడు. అంటే మిక్కుటంగా, దీర్ఘంగా చెపుతాడని. దీర్ఘ సమాసాల్లో ప్రగల్భంగా భావాన్ని చెప్పే పద్ధతి ఇది. "ఆడెం దాండవ మార్భటీ పటహ లీలాటోప విస్ఫూర్జిత క్రీడాడంబర ముల్లసిల్ల గరళ గ్రీవుండు జాటాటవీ క్రోడాఘాట కరోటి కోటర కుటీ కోటీ లుఠచ్ఛిందు వీ చీ డోలాపటలీ పరిస్ఫుటతర స్ఫీత ధ్వని ప్రౌఢిమన్." -భీమే.పురా. ఒక్కొక సారి నన్నయభట్టులాగా సంస్కృతాంధ్ర శబ్దప్రయోగ ప్రౌఢి ప్రదర్శిస్తాడు. దీనివలన గీర్వాణాంధ్రశబ్దసంఘటన సామర్థ్యం వ్యక్తమౌతుంది. శుద్ధసాంస్కృతికమూ కాదు. శుద్ధదేశీయమూ కాదు. ఉభయప్రాధాన్యం కలది. మార్గరీతి అన్నమాట. నన్నయ రాజకులైకభూషణుడు పద్యాన్ని అనుసరిస్తూ,👇 రాజశశాంక శేఖరుడు రాజ కిరీటవతంస మష్టది గ్రాజ మనోభయంకరుఁడు రాజుల దేవర రాజరాజు శ్రీ రాజమహేంద్ర భూభువన రాజ్య రమా రమణీ మనోహరుం డాజి గిరీటి కీర్తి నిధి యల్లయవీర నరేంద్రుఁ డున్నతిన్ -కాశీ.ఖం. ధూర్దండ ఘట్టన త్రుటిత గ్రహగ్రాహ ధూళిపాళీమిళద్ద్యు స్థ్సలములు ధ్వజ పట పల్ల వోద్ధత మరుత్సంపాత, పరికంపమానోడు పరివృఢములు గ్రాసాభిలాషాను గత విధుంతుదపునః ప్రాప్తచక్ర వ్యథోపద్రవములు శ్రాంతాశ్వనిబిడనిశ్శ్వాసధారోద్దుర, స్వర్ధునీ నిర్ఘర జలధరములు గగన పదలంఘనైన జంఘాలికములు, పద్మబాంధవ నిజరథ ప్రస్థితములు సాఁగెనని దక్షిణాయన సమయమగుట, దర్దురము మీఁద మలయభూధరము మీద -కాశీ.ఖం. 👆ఇందులో భీమకవి ఉద్దండలీల, నన్నయ ఉభయవాక్ప్రౌఢి రెండూ కనబడతాయి. సమాసఘటనం, శబ్దశక్తిజ్ఞానం ఉన్నప్పటికీ కవికి రసాభివ్యక్తే ముఖ్యం. రసాభివ్యంజకకావ్యబంధాన్ని సాధించిన తిక్కన వాక్పాకాన్ని పుక్కిట పడతాడు శ్రీనాథుడు ఒక్కొక్కసారి. తిక్కన 'ఉర్వీధరంబుల' పద్యాన్ని అనుసరిస్తూ, "చిఱుసానఁ బట్టించి చికిలిసేయించిన, గండ్రగొడ్డలి నిశాగహనలతకుఁ గార్కొన్న నిబిడాంధకారధారాచ్చటా, సత్ప్రవాటికి వీతిహోత్ర జిహ్వ నక్షత్ర కుముద కాననము గిల్లెడు బోటి, ప్రాచినె త్తిన హస్తపల్ల వాగ్ర మరసి మింటికి మంటి కైక్య సందేహంబుఁ, బరిహరింపంగఁ బాల్పడ్డ యవధి సృష్టి కట్టెఱ్ఱ తొలుసంజ చెలిమికాడు, కుంటు వినతా మహాదేవి కొడుకుఁ గుఱ్ఱ సవితృ సారథి కట్టెఱ్ఱ చాయఁదెలుప, నరుణుఁడుదయించెఁ బ్రాగ్దిశాభ్యంతరమున." -కాశీ.ఖం. ప్రబంధ పరమేశ్వరుడైన ఎఱ్ఱన్న రచనలో ఉక్తిని అలంకృతం చేయడంలో సహజత్వాన్ని వీడని ఒక చమత్కారాన్ని కల్పించే వైచిత్రి రాణిస్తుంది. దాన్ని శ్రీనాథుడు చేపట్టి ఒక్కొకసారి రక్తికట్టిస్తాడు. ఎఱ్ఱన రామాయణ పద్యాన్ని అనుసరిస్తూ, 'కందక గాజువాఱక వికాసము డిందక మందహాస ని ష్యందము చెక్కుటద్దముల నారక నెమ్మది నిద్రపోవు న ట్లందము నొందె ధాత్రి సిరియాల కుమారుని వక్తచంద్రుఁడా నందము నొందె నప్పు డెలనాగ మనంబును భర్తచిత్తమున్ -హర.విలా. కాలకంఠకఠోర కంఠహుంకారంబు, చెవులు సోకనినాఁటి చిత్తభవుఁడు కుపితరాఘవఘన క్రూర నారాచంబు, తనువు నాటని నాఁటి వనధిరాజు క్రుద్ధకుంభోద్భవ భ్రూలతా కౌటిల్య, వికృతిఁ గ్రుంగని నాఁటి వింధ్యశిఖరి వీరభద్రోదార ఘోర వీరావేశ, విహతిఁ గందని నాఁటి తుహినకరుఁడు చక్కఁదనమున గాంభీర్య సారమునను, బ్రకట ధైర్యకళా కలాపములయందు దండనాయక చూడా వతంస మైన, మంత్రి మామిడి వేమనామాత్యుఁ డెలమి. -శృం.నై.. 👆ఈ పద్యంలో పైన చెప్పిన ఉద్దండలీల, ఉభయ వాక్ప్రౌఢి, రసాభ్యుచితబంధం, సూక్తి వైచిత్రి అనే నాలుగు గుణాలూ కనబడతాయి. కానీ, అవన్నీ నీరక్షీరన్యాయంగా కలిసిపోయి ఒక విశిష్టసృష్టి ప్రత్యక్ష మౌతున్నది. ఎన్నో పూలతేనెలు ఈ జుంటితేనెలో ఉన్నాయి. కానీ ఈ పాకం మాత్రం శ్రీనాథుడనే తేనెటీగదే. పూర్వకవుల ప్రసిద్ధ ఫణుతులను అదనెరిగి కవితలో కదను త్రొక్కించినా తనదైన ఒక అపూర్వమార్గాన్ని దుర్గమంగా నిర్మించుకొని భావికవితరాలకు బాటలుచూపించిన ప్రతిభాశాలి శ్రీనాథుడు. పండితుల రచనల ఆధారంగా... మంగళం మహత్