28, ఆగస్టు 2023, సోమవారం

గబ్బిలంలో పేదవాడున్నది ఏ ప్రాంతం?

జాషువా, గబ్బిలంలో పేదవాడున్నది  తంజావూరుకు దక్షిణభాగ భూముల్లో అని అనడమే తప్ప ఊరిపేరు వ్రాయలేదు. 

దక్షిణభాగంలో ఏ ప్రాంతం? ఆ ఊరి పేరు ఎందుకు వ్రాయలేదు? అని ప్రశ్న.

ఊరిపేరుతో అవసరం ఏముంది? లేదు. 

దక్షిణం నుండి ఉత్తరానికి (సందేశాన్ని తీసుకొని వెళ్లడం కోసం చేసే) యాత్ర. అంతే.

పైగా ఊరిపేరు వ్రాస్తే అదే ఎందుకు వ్రాశారని మళ్లీ ప్రశ్న తయారవుతుంది. ఆ ప్రాంతపు గొప్పతనం ఏముంది? మా ప్రాంతం గొప్ప, అది వ్రాయాల్సిందనే వాదోపవాదాలు బయలుదేరతాయి. దీన్ని అశోకవనికాన్యాయం అంటారు.

కులమతాలపేరుతో పుట్టే గొడవల్ని  ఆపుదామనే మహదాశయంతో వ్రాసిన కావ్యమది. ఆ గొడవలకి తోడుగా ప్రాంతీయభేదాల్ని కూడా రేపే ఊళ్లపేళ్లు పేర్కొనడం అవసరమా? అని ఊరిపేరు వ్రాసి ఉండరు జాషువా అని నా(గ)స్వ(రం) అభిప్రాయం. 

పైగా పేదవాడు చెప్పులు కుట్టి జీవించేవాడు. ఊరికి దూరంగా నివాసం. అటువంటప్పుడు ఏ ఊరయితేనేం.?

తంజావూరునుండి డైరక్ట్‌గా దక్షిణంగా సముద్రతీరం వఱకు సుమారు 120 కి.మీ. క్రాస్‌గా కన్యాకుమారి వఱకు సుమారు 420 కి.మీ. 

ఈ దక్షిణంవైపు ఏ ప్రాంతం అంటే పేరు తెలియకపోయినా కొంతవఱకు తంజావూరునుండి పేదవాడి ప్రాంతం ఎక్కువ దూరం ఉండి ఉండదని ఊహించి చెప్పవచ్చు. 

ఎందుకంటే ఆయన మొదట సందర్శించమని చెప్పింది తంజావూరును. ఈ లోపు ఏదైనా ప్రసిద్ధప్రాంతం ఉండి ఉంటే అది, కవిచేత  పేర్కొనబడేదిగా!  

అయితే తంజావూరులోనే ఉన్నట్టు చెప్పవచ్చుగా అంటే అక్కడే ఉన్నవాడికి తంజావూరును వర్ణించి చెప్పడం అసంగతం. 

కవి, రఘునాథుడేలిన తంజావూరును యాత్రలో  ప్రారంభ ప్రదేశంగా ఎంచుకొన్నారు. దానికి కారణం ఇంతకు ముందు వివరించడం జరిగింది.

కాబట్టి ఒక రచనాప్రణాళిక ప్రకారం కవి "తంజావూరుకు దక్షిణ భాగభూములన్ గాపురముండె" అని చెప్పేసి, అసలు విషయంలోకి వెళ్లిపోయినట్లుగా భావించవచ్చు.

మంగళం మహత్

30, జులై 2023, ఆదివారం

ఎఱ్ఱన సూక్తివైచిత్రి

 ఎఱ్ఱన "చతురోక్తిపదంబుల" అని తన కావ్యలక్షణంగా చెప్పుకొన్నదాన్నే శ్రీనాధుడు  సూక్తివైచిత్రి అన్నాడు.


ఇక్కడ సూక్తి అంటే మనం చెప్పుకొనే సూక్తులు అన్న అర్థం కాదు. అంటే ఒక నీతినో ధర్మాన్నో లేక న్యాయాన్నో సూత్రప్రాయంగా చెప్పబడేవి సూక్తులు. ఇక్కడ ఆ అర్థం కాదని భావం.


కవిత్వంలో సూక్తి పదానికి ఎన్నో అర్థాలున్నాయి. సుష్ఠు ఉక్తం సూక్తం మనోజ్ఞంగా చెప్పబడిన మాట సూక్తి. రుచిరమై చమత్కార యుక్తమైన కూర్పు కూడా సూక్తే. అర్థబోధనకు తోడ్పడి సంభాషణకి పుష్టి చేకూర్చేవి సూక్తులు.

చతురోక్తులని పిండితార్థం. 


నన్నెచోడుని చతురోక్తుల అన్న ప్రయోగాన్నే ఎఱ్ఱన అలాగే స్వీకరించాడు. 

(నన్నెచోడుడే నిజమైన ప్రబంధపరమేశ్వరుడనే వాదం ఉంది)


శ్రీనాథుడన్న  సూక్తి వైచిత్రికి 

"భావనాశక్తిచేత మనోహరంగా మధురచతురోక్తులతో లోకోత్తరచమత్కారాన్ని ‌సాధించి, మనోవికాసాన్ని కల్గించడం" అన్నది అర్థమని ఎఱ్ఱన కవిత్వం ఆధారంగా చెప్పవచ్చు.


ఎఱ్ఱన చతురోక్తులనే జక్కన్న శబ్ద వైచిత్రి అని, 

చింతలపూడి ఎల్లనార్యుడు "......మృదుమధురవచస్సంపద అని ఎఱ్ఱన పట్ల గౌరవాన్ని ప్రకటించారు.


ఎఱ్ఱన ఉక్తి వైచిత్రిని శ్రీనాథుడు అనుకరించడం విశేషం.

29, జులై 2023, శనివారం

తెలుగు

 తెలుగు ఇపుడు కొత్తగా పాడైంది ఏం లేదు. తెలుగు వైభవం అర్థమవడానికి సంస్కృత శ్లోకాల అభ్యసన అవసరం అంటే దీనికి కారణం ఎవరు? అచ్చతెనుగు కావ్యాదులు ప్రాచీనులవి సుమారు పది పదిహేనుకి మించి లేవు. మిగిలినవన్నీ మణిప్రవాళశైలి పేరుతో తత్సమపదాలు నిండిపోయిన కావ్యాలే. దీనికి ఎవరు కారణం? తత్సమపదాలుగా తెలుగులోకి తెచ్చి తెలుగును మర్చిపోయేలా చేసిందెవరు?  భాషాప్రవీణ, తెలుగు ఎమ్.ఏ లో సంస్కృతం ఒక పేపర్‌గా ఉందంటే ఎందుకు? 


సగానికి పైగా ఆంగ్ల పదాలను ఉపయోగిస్తే ఎలా అన్నారు .? 

మఱి 90% సంస్కృత పదాలు వాడుతున్నాం మనం. ఇంకో 9% అన్యభాషాపదాలు. తెలుగు కున్న "ఆదాన" దీనత్వం ఇతరభాషలకున్న "ప్రదాన" జులుం తెలుగు కళ తప్పడానికి కారణం. 11వ శతాబ్దం నుండే తెలుగు నాశనానికి బీజం పడింది. శివకవులు, అన్నమయ్య, తిక్కన, తదితర నలుగురైదుగురు తెలుగులో రచనలు చేశారు. నిజానికి తెలుగును బ్రతికించింది వారే. కానీ బలం చాలలేదు. 


కంప్యూటర్ ‌కు సంబంధించిన పదాలన్నీ ఇంగ్లీషే. వాటిని అలాగే వాడడం ఉత్తమం పోని ఇతరభాషాపదాలను తెలుగులో మార్చడం అన్న పేరుతో చేసింది ఏమిటి? అవేమీ తెలుగు పదాలే కావు. సంస్కృత పదాలే . ఇంటర్నెట్ కి తెలుగు అంతర్జాలమా ? ఈ పదంలో తెలుగు ఏది? తెలుగు లిపిలో వ్రాస్తే తెలుగయిపోతుందా.? 

మీ వ్యాసంలో 20 సంస్కృత పదాలే ఉన్నాయి. ఆంగ్లమూ ఉంది. 


నా ఈ మెసేజ్ లోనూ ఉన్నాయి. తప్పదు. మార్పులు లేకపోతే చచ్చిన భాష అని సిద్దాంతం చేసేశారు మఱి.


36 తెలుగు అక్షరాలకు 19 అక్షరాలు కలిపి, సూరి వ్యాకరణం వ్రాయవలసివచ్చింది అంటేనే తెలుగుకు ఎన్ని పదాలు వచ్చి కలసిపోయాయో గ్రహించగలరు. దానికి తోడు వ్యవహారభాషోద్యమం కలిసింది. వ్రాసేది కాస్తా రాసేదైంది. దాని మీద జోక్ కూడా కొత్త 9 ఉపవాచకంలో ఉంది. 


సూర్యారాయాంధ్రనిఘంటువును మహాపండితులు కూర్చారు. వారు పీఠికలో చెప్పిన విషయాలు పరిశీలనార్హం.

"తెలుఁగుశబ్దముల రూపములు నర్థములు నిర్ణయించుటకుఁ గొంతవఱకు వ్యావహారిక భాషయుఁ జాలవఱకు వాఙ్మయమును(కొంతమందైనా తెలుగులో రచనలు చెయ్యడం వల్ల) నాధారములు. ఇందునకై వాఙ్మయమంతయుఁ క్రొత్తగాఁజదివి యర్థసహితముగా నొక్కొక్కశబ్ద మొక్కొక్క కాగితపుముక్క మీఁద నెత్తి వ్రాసి పిదప నీముక్కల నన్నింటిని గలిపి యక్షరక్రమముగా విభజనముచేసి యర్థాదులను రెండుమూఁడుతడవలు పరిశీలించి నిర్ణయించుటయైనది. ఈవిషయములో సాధ్యమయినంత వఱకుఁ బ్రమాదములు లేకుండఁ జేయవలయు నను నూహతో నీవిషయములో నధిక శ్రమము పడవలసివచ్చినది." అన్నారు. అప్పటి తెలుగుపండితులైన వారికే తెలుగు విషయంలో అంత కష్టపడవలసిన అవసరం వచ్చిందంటే అచ్చతెనుగును తెలుగు కవులు నిరాదరణ చేయడమే కారణం అని చెప్పాలి.  దీనికి బాధపడాలి.


అటజని కాంచె వఱకే తెలుగు. మిగిలినదంతా సంస్కృతమే. దీన్ని బట్టీ పడితే సంస్కృతం బాగా వస్తుందంతే.


అందువల్ల పద్యాల్లోనూ పాఠాల్లోనూ తెలుగు అక్కడక్కడా ఉంది. దానికి బాధపడాలి మనం.


అచ్చతెనుగు రచనలు ఎక్కువగా లేనందుకు ఉన్నవైనా పాఠ్యాంశాలుగా రానందుకు చింతించాలి మనం. 


అలాగని ప్రస్తుతవిషయానికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు.

తెలుగు పరిస్థితి చెప్పా. విజ్ఞులు విజ్ఞప్తులు పంపారు కదా! సానుకూల నిర్ణయం వస్తుందనే ఆశిద్దాం.


స్వస్తి

15, జులై 2023, శనివారం

ఏకాశ్వాసప్రబంధం

ఓకే ఒక ఆశ్వాసం ఉన్న ప్రబంధాన్ని ఏకాశ్వాసప్రబంధం అంటారు.

మొదట ఆశ్వాసం అంటే ఏమిటో తెలుసుకోవాలి.

కథాంశానాం వ్యవచ్ఛేద ఆశ్వాస ఇతి కథ్య తే"

కథాంశాలయొక్క విభాగాన్ని ఆశ్వాసం అంటారు.

ఇంకా ఆశ్వాసమంటే ఊపిరి పుచ్చుకోవడం/తీసుకోవడం.

"ఒకేసారి సునాయాసంగా చదువదగినభాగం " అని కూడా చెప్పవచ్చు.

సాధారణంగా కావ్యాలు ఆశ్వాసాలుగా విభక్తాలై ఉంటాయి. అలా విభజించి వ్రాస్తే పఠితలకు కొంత గ్రుక్క త్రిప్పుకోవటానికి అనుకూలంగా ఉంటుంది.

ఓకే ఆశ్వాసంగా వ్రాయడంలో ఉద్దేశం ఏమిటంటే దీన్ని నాటికగా కూడా ప్రదర్శించే సౌలభ్యం కొఱకే అనుకోవచ్చు.

అందువల్ల ఏకాశ్వాసప్రబంధాన్ని ఒకే అంకం ఉన్న నాటిక అనవచ్చు.

మంగళం మహత్ 

19, జూన్ 2023, సోమవారం

తుని తగవు

 తుని తగవు: 

తూర్పుగోదావరి జిల్లాకు ఉత్తర సరిహద్దులోని ఊరు తుని.

 

తగవంటే న్యాయం, ధర్మం.

పోట్లాట కాదు.


వాడుకలో మాటలు కలిపి 'తుత్తగవు' అని కూడా పలుకుతారు.


ఇద్దరు వ్యక్తులు అప్పుసప్పుల గురించి, లావాదేవీల గురించి ఘర్షణ పడితే సంధి చేసే విధానాల్లో ఇదొకటి.


మాట వరుసకు ఒకరు పది రూపాయలు బాకీ వుందంటే, మరొకరు అయిదే తీసుకొన్నానంటే - సగటున ఏడున్నర రూపాయలిచ్చి తగాదా చంపుకొమ్మనటం తుత్తగవు. 


ఉభయపక్షాలకూ సమానంగా బాధ కలిగించటమే ఇందులోని పరమార్థం.


తగాదాను కొనసాగించకుండా చంపటం రెండో లక్ష్యం.


ఇలాంటి భావంతోనే "రామాయపట్నం మధ్యస్థం" లాంటి జాతీయాలు పుట్టాయి.


ఇలా ఎన్ని ఊళ్ల పేర్ల మీద ఇదే భావం చెప్పే జాతీయాలు పుట్టాయో లెక్కగట్టడం కష్టం.


~బూదరాజు రాధాకృష్ణ గారు 


“తూర్పుగోదావరిజిల్లాకున్ను విశాఖపట్నం జిల్లాకున్ను మధ్యస్థంగా తుని ఉంది. 

దాన్ని గోదావరి జిల్లాలో చేర్చడమా? విశాఖపట్నం జిల్లాలో చేర్చడమా? అనే తగవు ఒకటి సంభవించింది. చాలా కష్టమైన సమస్య అయింది. 

అటువంటి విభజనకు కష్టసాధ్యమైన  క్లిష్టసమస్యలకు తునితగవు సామ్యం అయింది."

~కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు 

8-7-1953 ఆంధ్రసచిత్రవారపత్రిక   

9, జూన్ 2023, శుక్రవారం

కావ్యం

"కావ్యం యశసేఽర్థకృతే వ్యవహారవిదే శివేతరక్షతయే 

సద్యః పరనిర్వృతయే కాంతాసమ్మితతయోపదేశయుజే"


ముమ్మటుడు తన కావ్యప్రకాశంలో పైవిధంగా కావ్యప్రయోజనాలు చెప్పాడు.


కావ్యం యశస్సును కలిగిస్తుంది.

అర్థాన్ని(సంపద) సంపాదిస్తుంది. (సంపాదించి పెడుతుంది.)

వ్యవహారపరిజ్ఞానాన్ని కలిగిస్తుంది.

శివం(శుభం)కంటె ఇతరమైనది శివేతరం. ఆ శివేతరాన్ని క్షయింప చేస్తుంది.

విన్న వెంటనే పరమైన ఆనందాన్ని, కలిగిస్తుంది.

కాంతాసమ్మితమై అంటే కాంత (భార్య) చేసినట్లుగా లలితంగా, తీయగా ధర్మోపదేశం చేస్తుంది.


ప్రభుసమ్మితాలు-వేదాదిశాస్త్రాలు. 

రాజుతో సమానమైనవి. ప్రభువులా శాసిస్తాయి. ధర్మాలు విని, ఆచరించి తీరాలి.


మిత్రసమ్మితాలు-పురాణేతిహాసాలు. 

మిత్రునిలా బోధిస్తాయి. 'ఇలా చేస్తే ఈ ఫలితం. అలా చేస్తే ఆ ఫలితం' అని మిత్రునిలా చెప్తాయి. వింటే మేలు. 


కాంతాసమ్మితాలు-కావ్యాలు.

భర్తను స్వాధీనం చేసుకొన్న అనంతరం ఉపదేశం చేసే కాంతలాంటివి. సరసంగా ధర్మబోధ ఉంటుంది.


మంగళం మహత్ 

7, జూన్ 2023, బుధవారం

రాముని వంశక్రమం

 ప్రశ్న : రఘువంశం 2 వ సర్గలో కాళిదాసు దిలీపునికి నందిని వరం వలన రఘువు జన్మించినట్లుగా చెప్పాడు.

రామాయణం లో రాముని వివాహం సందర్బంగా Vashishtudu పైన చూపిన విధంగా చెప్పాడు. 

బుధులు ఇందులో ఏది సరి అయినదో వివరణ ఈయగలరు.

💐💐💐


దీని గుఱించి కొంత పరిశోధన చేయడం జరిగింది. అందువల్ల తేలినదేమంటే దీనికి సమాధానం ఊహించి చెప్పవలసిందే తప్ప వ్యాఖ్యాతలెవరూ వివరించినట్లు (నాగస్వరానికి అన్పించ)లేదు.

కవికులగురువు కాళిదాసు మీద భాసుని ప్రభావం ఎంతో ఉంది.

"ప్రథితయశసాం భాస సౌమిల్ల కవి పుత్రాదీనాం ప్రబంధానతిక్రమ్య వర్తమానకవేః కాళిదాసస్య    క్రియాయాం కథం బహుమానః”?"

అని కాళిదాసు మాళవికాగ్నిమిత్రంలో అన్నప్పటికీ యథార్థమైన విశేషణం వాడి మొదట భాసుని పేర్కొనడంవల్ల అతని మీద కాళిదాసుకు ఎంత అభిమానం ఉందో తెలియడమే కాక,  పై మాటలనుబట్టి భాసుడు చాల ప్రముఖకవిగా పరిగణింపబడినట్టు కూడా తెలుస్తున్నది. 

భాసుడు రామాయణకథను నాటకాలుగా వ్రాశాడు.

కాళిదాసు భాసుని ఆదర్శంగా తీసుకొని అనుకరించిన సందర్భాలున్నాయి.

ముఖ్యంగా భాసుని నాటక సన్నివేశాలను ఎన్నోచోట్ల అనుకరించాడు. 

ఇక రఘువంశకావ్యాన్ని కాళిదాసు ఒక ప్రణాళిక ప్రకారం రచించాడు.

రఘువంశంలో 19 సర్గలున్నాయి. రఘువంశ రాజుల్లో ప్రముఖమైనవారి చరిత్రను విశదంగాను, మిగతావారి చరిత్రను సంగ్రహంగాను వర్ణించి, మరీ అప్రధానమైన వారిని నామమాత్రంగా పేర్కొన్నాడు.

మొదటి 9 సర్గల్లో దిలీప, రఘు, అజ, దశరథుల చరిత్రలు, తర్వాత శ్రీరాముని చరిత్ర, చివరి నాలుగు సర్గల్లో కుశుడు మొదలు అగ్నివర్ణుని వఱకు గల 24 రాజుల చరిత్రలు వర్ణింపబడ్డాయి.

రఘువంశ రాజుల్లో దిలీప, రఘు, అజ, శ్రీరాముల చరిత్రలనే కాళిదాసు విశదంగా, ఉత్తమంగా చిత్రించాడు. 

వాల్మీకాదుల రచనలచేత ప్రేరేపితుడై కాళిదాసు రఘువంశాన్ని రచించాడని


"అథవా కృతవాగ్ద్వారే 

వంశేఽ స్మి న్పూర్వ సూరిభిః 

మణౌ వజ్రసముత్కీర్ణే

సూత్ర స్వే వాస్తి మేగతిః"


అనే శ్లోకం ద్వారా తెలుస్తోంది.


అయితే ఎందుకో వాల్మీకిని పేరుతో ప్రస్తావించలేదు. 

(ప్రస్తావిస్తే దాని ప్రకారం వ్రాయాల్సి వస్తుందనేమో!)


అలాగే వాల్మీకి చెప్పిన ప్రకారం రాముని వంశక్రమాన్ని తీసుకోలేదు.

మఱి ఏమిటి ఆధారం? అని పరిశీలిస్తే 

భాసుని ప్రతిమా నాటకంలో ఆయన పేర్కొన్న రాముని వంశక్రమాన్ని కాళిదాసు అనుసరించాడని (నాగస్వరానికి) తెల్సింది.

దిలీపుడు, ఆయన కొడుకు రఘువు, రఘువునకు అజుడు, అజునకు దశరథుడు, ఆయనకు రామాదులు అని భాసుడు పేర్కొన్నాడు. దాన్నే కాళిదాసు స్వీకరించాడు. 

ఎందుకు అంటే కవులు నిరంకుశులు. స్వేచ్ఛాప్రియులు. కల్పనాచతురులు. కాళిదాసుని వీరి చరిత్రలు ఆకర్షించాయి. 

దిలీపుని సేవాపరాయణత, రఘుమహారాజు దాన నిరతి, అజుని కోమల స్వభావం, శ్రీరాముని ఆదర్శజీవితం కవికి  సర్వోత్తమంగా అ/కన్పించాయి. ఒక అద్భుత చమత్కారాన్ని సాధించడంకోసం కూడా మార్పు చేశాడనవచ్చు. అలాగే జరిగి అఖండఖ్యాతి నార్జించింది రఘువంశకావ్యం.

అందువల్ల తనకు ఆదర్శమైన భాసుడెలాగా ఒక క్రమాన్ని ఏర్పాటు చేసిపెట్టాడు కదా!

అందువల్ల దాన్ని అనుసరించాడని (నాగస్వరానికి)  అన్పించింది. పైగా ఒకరకంగా వంశక్రమాన్ని అనుసరించాడుగా! అంటే రామాయణం ప్రకారం దిలీపునకు రఘువు కొడుకు కాకపోయినా, వరుసను బట్టి చూస్తే, ఆయన తర్వాత రఘువే వస్తాడు.

ఇక ఏది సరైనది అని అడిగారు.

శకుంతల కథను నాటకంగా రచించిన కాళిదాసు దాన్ని మహాభారతం నుండి స్వీకరించాడు.

మహాభారతంలో దుష్యంతుడు కావాలనే శకుంతలను అవాయిడ్ చేశాడు.

హీరో ఉదాత్తుడై ఉండాలని కాళిదాసు అంగుళీయకాన్ని అభిజ్ఞానంగా కల్పించాడు.

ఇపుడు మహాభారతం కథ సరైనదా?

అభిజ్ఞాన శాకుంతలం కథ సరైనదా?

అంటే, మహాభారతంలోని శకుంతల కథే సరైనది.


అలాగే వాల్మీకి రామాయణమే రాముని వంశక్రమానికి ప్రమాణం.


మంగళం మహత్ 


2, జూన్ 2023, శుక్రవారం

గిరిక సంగీతనైపుణ్యం

పద మెత్తం గలహంసలీల యధర స్పందంబు సేయన్ శుభా 

స్పద మౌ రాగకదంబకంబు శ్రుతి చూపన్ శ్రీవిలాసంబు కే

ల్గదలింపన్ సుకుమారపల్లవనవైలాలక్ష్మి వీక్షింప ష

ట్పదియుం బొల్చుఁ దరంబె కన్నెఁ గొనియాడన్ గేయవాక్ఫ్రౌఢిమన్. వసు.చ.3.59


గిరిక పదం (అడుగు) ఎత్తగానే రాజహంసనడక

పదం (మాతు=సంగీతంతో కూడిన సాహిత్యం) ఎత్తగానే కలహంసరాగం

(కలహంస అంటే హంసధ్వని కాదు.)

కలహంస ఒక రాగం. 31వ మేళకర్త యాగప్రియరాగజన్యం.

కలహంసప్రబంధమనే పేరుతో ఒక గీతికాభేదం ఉంది.( ఒకరకమైన పాట.) కాబట్టి అది కూడా చెప్పవచ్చు.


అధరస్పందం చేయగానే (పలుకగానే) మంగళాశ్రయమైన అరుణకాంతిసమూహం. 

(అధరం కదపగానే ఎఱుపు కన్పిస్తుందని.)

అధరస్పందం చేయగానే రాగకదంబకంబనే ప్రబంధం. ఇది మఱొక గీతికాభేదం.

లేదా రాగమాలికలు బయలుదేరుతాయి.

(కదంబకం అంటే గుంపు. దీన్ని కదంబంగా పొరపాటు పడి, కడిమిపూల యెఱ్ఱదనం అని భావించరాదు.)


శ్రుతి (చెవి) చూపగానే శ్రీకార(శ్రీవర్ణలిపి)విలాసం.

శ్రుతి సవరింపగానే శ్రీరాగం.

శ్రీరాగం చాల ప్రాచీన రాగం. ఘనరాగాల్లో ఒకటి. లేదా గీతికావిశేషమైన శ్రీవిలాస ప్రబంధం.


చేయి కదపగానే సుకుమార పల్లవయుత ఏలకి తీగల శోభ.

చేయి కదపగానే సుకుమార పల్లవహస్తంతో కూడిన ఏలా అనే పేరుగల గీతప్రబంధం.


చూడగానే ఆడుతుమ్మెద స్ఫురిస్తుంది. 

చూడగానే షట్పది అనే గీతవిశేషం.


ఆమెను కొనియాడడం శక్యం కాదని అవయవచాలనాదులవల్లనే గిరిక గానసమృద్ధి కన్పిస్తోందని వర్ణించాడు సంగీతకవి రామరాజభూషణుడు. 


మంగళం మహత్ 

15, మే 2023, సోమవారం

ప్రహ్లాదుని తల్లి ఎవరు?

లీలావతా?

ప్రహ్లాదుని తల్లి లీలావతి అని భాగవతంలో లేదు. 

తెలుగు ప్రహ్లాదచరిత్రలో ఒకే ఒక్క చోట లీలావతి అని కనబడుతుంది.

లీలోద్యాన లతానివాసములలో 

లీలావతీయుక్తుఁడై

హాలాపానవివర్ధమాన

మదలోలావృత్తతా  

మ్రాక్షుడై........ ఆంధ్ర.మహా.భాగ.7.స్కం.102 ప.


సంస్కృత ప్రహ్లాదచరిత్రలో ఆ వివరమూ లేదు.

ఇక్కడ లీలావతి శబ్దాన్ని పోతన, విలాసవతి/ అందమైన స్త్రీ/ స్త్రీ అనే అర్థాల్లోనే ప్రయోగించినట్లు చెప్పవచ్చు.

అలా ఎందుకనుకోవాలి? భార్య అవ్వచ్చుగా అని మీరనవచ్చు.

దానికి సమాధానం ఉంది. 

సంస్కృత భాగవతంలో

"హిరణ్యకశిపోర్భార్యా 

కయాధుర్నామ దానవీ ।

జంభస్య తనయా దత్తా 

సుషువే చతురస్సుతాన్ || వ్యాస.భాగ.6 స్కంధం

దనువు వంశానకు చెందినదీ, జంభుని కూతురైనదీ, హిరణ్యకశిపువునకు భార్యగా ఈయబడిన "కయాధువు" అను పేరు కలది,

అయితే కయాధువే తల్లి అని ఎలా చెప్పవచ్చు?. లీలావతి ఇంకో భార్య అవ్వవచ్చుగా! ఆమె పుత్త్రుడు ప్రహ్లాదుడేమో! అంటారా?

పై శ్లోక భావం ఇంకా పూర్తి కాలేదు.

నలుగురు పుత్త్రులను కన్నది.

సంహ్రాదం ప్రాగనుహ్రాదం 

హ్రాదం ప్రహ్లాద మేవ చ ॥

వారు సంహ్రాదుడు, అనుహ్రాదుడు, హ్రాదుడు, ప్రహ్లాదుడు "

మఱి లీలావతి అని పోతన ఎందుకంటాడూ?

తెలిసిందిగా


మంగళం మహత్ 

8, మే 2023, సోమవారం

పద్యం పఠించాలా? పాడాలా?

పద్యపఠనమా? పద్యగానమా?

ఈ వివాదం ఎప్పట్నుంచో ఉంది.

ఈ విషయంలో రెండు వర్గాలు.

ప్రౌఢరాగకాంత వెళ్లి, పద్యపురుషుని కావలించుకోగానే ఆతడు గతిచెడి మూర్ఛ(నలు)పోక తప్పదు కాబట్టి భావానుగుణంగా అర్థమయ్యేలా పఠించాలని అపుడే రసోత్పత్తి అని కొంతమంది.

పద్యం రాగమిళితమైతేనే దానికో జన్మ ఉన్నట్టు. రాగించని పద్యం రాణించదు. ఏడిసినట్టుంటుంది. అందువల్ల పద్యాన్ని పాడాలి. అని ఎక్కువమంది. 

రాగతాళం లేకపోతే పద్యపేటిక తెరవలేం అనే నమ్మకం ప్రబలిపోయింది.

ఇదెంతదాకా వెళ్లిందంటే పద్యం పాడకుండా బోధిస్తే తెలుగు మాస్టరే కాదన్నంతవఱకు.

సరే, పద్యానికి రాగాన్ని జోడించడం వల్ల ఏమవుతుంది?

పద్యానికో సహజగమనం ఉంటుందనే సంగతే విస్మరించబడుతుంది. రాగానికి ప్రాధాన్యత ఎక్కువౌతుంది.

ఉదా.కు భక్తయోఓఓఓఓగ పదన్యాఆఆఆఆసి ఇలా పాడి పద్యంలోని వృత్తాంతం బోధపడిందా అంటే బోధ ఏమో గానీ రాగం మాత్రం బాగుందంటారు. 

పద్యం పదప్రధానం. రాగం స్వరప్రధానం. అందువల్ల స్వరం అర్థవిశేషాల్ని ఉల్లంఘిస్తుంది. కాబట్టి ఈ రెంటికీ విరోధమే తప్ప సంబంధం లేదు.

రాగం వల్ల ఒక ఉపయోగం ఏంటంటే పద్యంలో పదమేదైనా మర్చిపోతే అది గుర్తు వచ్చేదాకా రాగం తీయవచ్చు.

పద్యం అర్థం తెలిస్తేనే ఆనందం కల్గేది. దీనికి కొంచెం బుఱ్ఱ పెట్టాలి. శ్రమపడాలి.

అయితే రాగస్వరాల అర్థం తెలియకపోయినా దాని భావం ఏదైనా వెంటనే ఆనందం కల్గుతుంది. శ్రమ అక్కఱలేదు. అంటే పద్యభావం కంటే ముందు రాగమే ఆనందాన్నిస్తుంది.

భావం బోధపడాలంటే శబ్దప్రమేయమైన పద్యాన్ని స్పష్టతను పాటిస్తూ భావానుగుణంగా పఠించాలనేది కొందఱు పెద్ద గురువులమాట.

అయితే రాగాలకు వ్యతిరేకం అని కాదు దీని సారాంశం.

సంగీతం తెల్సినవారు రాగాన్ని అనుసంధించి పాడవచ్చు. అయితే వారు కూడా తగినంతగానూ భావానుగుణంగానూ స్వరాలు కూర్చాలి. (ఘంటసాల మొదలైన వారిలాగ) వారి దగ్గర నేర్చుకొని స్వరం తప్పకుండా పాడాలి. ఎందుకంటే సామగానజన్యమైన సంగీతంలో స్వరాలు తప్పితే వేదస్వరాలు తప్పినంత దోషం.

ఇతరభాషల్లోనైతే గద్యాన్ని చెబుతారు. గేయాన్ని పాడతారు. పద్యాన్ని పఠిస్తారు. తెలుగు వారే పద్యాన్ని పాడాలంటారు. 

అందువల్ల పద్యాన్ని పాడలేకపోయామే అనే న్యూనత అవసరంలేదు. విన్నవారికి (కొంతైనా) అర్థమయ్యేలా పఠించవచ్చు.

మంగళం మహత్ 

16, ఏప్రిల్ 2023, ఆదివారం

భారతదేశానికి ఆ పేరు ఎలా వచ్చింది

 భరతునికి ముందు ఈ దేశం పేరు అజనాభం.


దీన్ని పరిపాలించిన రాజులలో 

నాభి ఒకడు.


నాభికి నారాయణుడు కొడుకుగా పుట్టాడు.


ఆతడే ఋషభుడు. 


నాభి తర్వాత రాజైన 

ఋషభునికి నూర్గురు కొడుకులు.


వారిలో పెద్దవాడు భరతుడు.

ఋషభుడు భరతునికి పట్టం కట్టాడు.


భరతుని వల్ల అజనాభం

మహాభారతమనే పేరు గలదయింది.


భారతవర్షమని పేరు పొందిన భూమండలంలోని అయా భూభాగాలకు తన కొడుకులలో కుశావర్తుడు, ఇలావర్తుడు, బ్రహ్మావర్తుడు,  ఆర్యావర్తుడు, మలయకేతువు,  భద్రసేనుడు, ఇంద్రస్పృక్కు, విదర్భుడు, కీకటుడు అనే తొమ్మిదిమందిని ప్రధానులుగా నియమించాడు. 


వారి కప్పగించిన భూభాగాలు వారి పేళ్లతో ప్రసిద్ధి పొందాయి.


కవి మొదలైన మరో తొమ్మిది మంది భాగవతధర్మాన్ని ప్రకాశింపజేశారు.


మిగిలిన ఎనుబదియొక్కమంది వేదధర్మాన్ని అనుష్ఠిస్తూ, బ్రాహ్మణోత్తములుగా పేరుపొందారు.


13, ఏప్రిల్ 2023, గురువారం

పోతన కవితావేశం

"విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణు కృష్ణు" 

అర్థం చెప్పగలరు.


పై పాదం పోతన రచించిన 

ఆంధ్ర మహాభాగవతం 

దశమ స్కంధం 

కుచేలోపాఖ్యానంలోనిది.


ఇందీవరశ్యాము, వందితసుత్రాముఁ

  గరుణాలవాలు, భాసుర కపోలుఁ,

గౌస్తుభాలంకారుఁ, గామితమందారు

  సురుచిరలావణ్యు, సుర శరణ్యు

హర్యక్షనిభమధ్యు, నఖిలలోకారాధ్యు

  ఘనచక్రహస్తు, జగత్ప్రశస్తు,

ఖగకులాధిపయానుఁ, గౌశేయపరిధానుఁ

  బన్నగశయను, నబ్జాతనయను,


మకరకుండల సద్భూషు, మంజుభాషు

నిరుపమాకారు, దుగ్ధసాగరవిహారు,

భూరిగుణసాంద్రు, యదుకులాంభోధి చంద్రు,

విష్ణు, రోచిష్ణు, జిష్ణు, సహిష్ణుఁ, గృష్ణు.


ని (ఒక పట్టమహిషి మందిరంలో)

కుచేలుడు చూసినట్లు పోతన గారి వర్ణన.


మూలంలో ఇదేమీ లేదు.


తం విలోక్యాచ్యుతో దూరా

త్రియాపర్యంకమాస్థితః | 

సహసోత్థాయ చాభ్యేత్య 

దోర్భ్యాం పర్యగ్రహీన్ముదా॥


సఖ్యుః ప్రియస్య విప్రర్షే 

రంగసంగాతినిర్వృతః | 

ప్రీతో వ్యముంచదద్బిందూ

న్నేత్రాభ్యాం పుష్కరేక్షణః II


కృష్ణుడే దూరంనుండి కుచేలుని చూసి, 

వెంటనే వచ్చి కౌగలించుకొని, 

పారవశ్యాన్ని పొందాడు.

ఆయన పద్మనేత్రాలు 

ఆనందబాష్పాలు స్రవించాయి.


ఇది పోతనకు పారవశ్యాన్ని కల్గించింది.

సహజభక్త్యావేశం కల్గినవాడు కావడంతో 

ఒడలు మఱచి, శబ్దాలంకారాలు అందులోనూ అంత్యానుప్రాస అంటే మక్కువ ఎక్కువైన పోతన కృష్ణుని పైవిధంగా వర్ణించి తరించాడు.

(భాగవతంనిండా అంత్యానుప్రాసపద్యాలు వందలకొద్దీ ఉన్నాయి.)


ఇక ప్రస్తుతానికి వస్తే


తనకు విష్ణువనే పేరెలా వచ్చిందో స్వయంగా భగవానుడే చెప్పినట్లుగా భారతంలో ఉంది.


వ్యాప్య మే రోదసీ పార్థ!

కాన్తి రభ్యధికా స్థితా, 

క్రమణా ద్వా ప్యహం పార్ధ! 

విష్ణు రి త్యభిసంజ్ఞితః ” | '


నా కాంతి భూమ్యాకాశాలను  

వ్యాపించి ఉండడం చేతా,

నేను సర్వత్రా వ్యాపించి ఉండడం చేతా, ‘విష్ణు' సంజ్ఞకలవాడనయ్యాను.


పై వచనం వలన పరమాత్మ, 

'విష్ణు' శబ్దవ్యపదేశ్యు డని తెలుస్తోంది.


కాంతికలవాడు (స్వయంప్రభుడు) - రోచిష్ణుః


జయమే స్వభావంగా కలవాడు - జిష్ణుః


(శీతోష్ణాది) ద్వంద్వాలను సహించేవాడు కాబట్టి - సహిష్ణుః


వ్యాసుడు చెప్పిన ప్రకారం

కృష్ సత్తావాచకం.

ణ ఆనందవాచకం.

సచ్చిదానంద స్వరూపుడు కాబట్టి - కృష్ణః.


మహాభారతంలో కృష్ణవర్ణం కలవాడను కాన కృష్ణుడ నయ్యానని పరమాత్మ స్వయంగా చెప్పాడు.


అటువంటి కృష్ణుని కుచేలుడు చూశాడు.


స్వస్తి


మంగళం మహత్ 



7, మార్చి 2023, మంగళవారం

శృంగారదమయంతీనైషధసమాలాపము- పూర్ణభాగం

ప్రవిమలాక్షి నభోనభస్యాంబుదములకు ననవృష్టిధారలై యవతరిల్లి 

యాకర్ణ దీర్ఘ నేత్రాంభోరుహములకుఁ గమనీయనాళభావము భజించి 

కలితకజ్జలత ముక్తాహార లతలలో హరినీలరత్న నాయకతఁ దాల్చి 

లలితవక్షోజకుట్మలచుంబనంబున మధుపదంపతుల సామ్యంబు వడసి


వేఁడియశ్రులు నిగుడంగ వెక్కి వెక్కి 

యేడ్వఁ దొడఁగె లతాంగి పృథ్వీశుమోల

మృదులపరివేదనాక్షరోన్మిశ్రమధుర 

కంఠ కాకు వికారకా కలిక యలర.


నలుఁడు చెప్పిన మాటలకు హృదయం కలగి, తగిన సమాధానం చెప్పలేక అవ్యక్త మధుర ధ్వనులతో దమయంతి, వేఁడికన్నీరు ధారలయి ప్రవహించగా, వెక్కి వెక్కి ఏడ్వడం మొదలుపెట్టింది. 

అప్పుడు ఆ కన్నీరు కాటుకచే నల్లదనం కల్గి, దమయంతి నేత్రాలనే శ్రావణ భాద్రపదమాసమేఘాలకు నూతనవర్షధారల్లా, 

ఆమె నేత్రపద్మాలకు నాళాల్లా,

కజ్జలకాంతిచే ముక్తాహారలతలలో పడినప్పుడు నాయకరత్నమైన ఇంద్రనీలంలా, 

ఆమె ఉరోజాలను తాకినప్పుడు తామర మొగ్గలపై పడిన తుమ్మెదదంపతుల్లా అలరారాయి.


ఇలా గద్గదస్వరంచేత కట్టఁబడినకంఠంతో ఆ దమయంతి అశ్రుకణాల్ని కొనగోళ్ల మీటుతూ తలవాల్చి ఏడుస్తూండడం చూసి, 

నలుడు తల్లడిల్లి, సమస్తం మర్చిపోయి, ఇలా అన్నాడు.


"తరుణీ! ఎందుకు ఏడుస్తున్నావు? 

నీ ముఖపద్మాన్ని ఎత్తి, కోమలకటాక్షవీక్షణాలనే దామకంతో వీరసేనుని తనయుడనైన నలుని నన్ను చూడు.


కాంత! యశ్రుబిందుచ్యుతికైతవమునఁ 

దివిరి బిందుచ్యుతక కేలిఁ దవిలె దీవు 

సారెసారెకు నాదుసంసారమును స

సారముగఁ జేయుచు మసారసారనయన!


ఓదమయంతీ ! మనోహరంగా అశ్రుబిందుచ్యుతిచేస్తూ (కన్నీటిబిందువులను రాలుస్తూ,) ఆ మిషచేత నా సంసారంలోని బిందువును కూడా చ్యుతి చేసి ససారంగా చే‌స్తూ బిందుచ్యుతకకేలి సల్పుతున్నావు. 


ఎందుకు చింతిస్తావు? ఏమైనా తప్పుంటే చెప్పు. నీ పాదాలకు మ్రొక్కుతాను. అనుగ్రహించు. కడకన్నులనే నాలుగిళ్లనుండి తొలకాడుతున్న నీ కలికి చూపులను నాపై ప్రసరింపజేయి. కాస్త నవ్వు. మధురంగా ఏదైనా మాట్లాడు. కౌగిలి దయచేయి." 


అని వెఱ్ఱిగా పల్కి, కాసేపటికి తెలివి తెచ్చుకొని, దేవకార్యం తనవల్ల చెడిందే అని విచారించాడు.


నలుడలా విచారిస్తూంటే, 

దమయంతి ఆతడు నలుడని ఎఱిగి, తెరచాటున దాగింది. ఎంతో ఆనందించింది.

సిగ్గుతో మాట్లాడలేక చెలికత్తెతో ఇలా చెప్పించింది.


"సామాన్యయాచకులకే, అభయం ఇస్తావు. మన్మథబాణాలనుండి నా కభయం ఇవ్వలేవా?"


దమయంతి  ప్రతినిధిగా, చెలికత్తె మిక్కిలి మధురంగా ఇలా మాట్లాడుతూంటే నలుడు ఆనందించినా, దేవేంద్రుని పనికి విఘ్నం కలగడంతో ఆమె మాటలు వినలేదు.


చెలి తిరిగి దమయంతి ఒద్దకు వచ్చింది.


దూతయై వచ్చిన నలునితో ఏమి వికటపు మాటలాడానో అని దమయంతి,

దేవతలకార్యం ఆఱడైందని నలుడు విచారంలో మునిగారు.


అపుడు వెనుకటి బంగారు హంస భయవిచారాలతో నిండిన వారి ఒద్దకు వచ్చి, నలునితో ఇలా అంది.


"నీయంతఃకరణంబు నిర్మలము వర్ణింపంగ శక్యంబె నీ

భూయస్త్వంబు జగత్ప్రసిద్ధములు నీ పుణ్య ప్రభావంబు లే

లాయీలాగునఁజింతనొందెదవు కార్యావాప్తియౌఁగాదటే 

యాయింద్రాదులు నీనిజం బెఱుఁగ రే  యబ్జారివంశాగ్రణీ!"


అని, వైదర్భిని చూసి,


"అమ్మ! దమయంతి! యంతరంగమ్ములోన

మాను సందియ మీతండు మగఁడు నీకు

నాఁడె దా నానతిచ్చినవాఁడు బ్రహ్మ 

తద్వచనమున కన్యథాత్వంబు గలదె."


అని, ఆ ఇద్దఱినీ ఉద్దేశించి, "మీ దంపతులకు మేలు కావలయు! పోయి వస్తా" అని వెళ్లిపోయింది.


దాంతో వారి విచారాలు తొలగిపోయాయి.


అపుడు నలుడు ఎట్టకేలకు చేవ తెచ్చుకొని, దిక్పాలురను తలచి, నమస్కరించి,


"దేవతలారా! కపటం లేని నాభక్తికి సంతోషిస్తే సంతోషించండి. లేదా  శిక్ష విధిస్తే విధించండి. దమయంతీవిరహాన్ని భరించలేను." అన్నాడు.


అపుడు తెరచాటున ఉన్న దమయంతి నలునితో,


"నేను పతివ్రతను. అట్టి పతివ్రత తన కిష్టుడైనవాని వరిస్తే తక్కినవారు ఎగ్గుగా తలపరాదు. ఱేపు దేవతలు రాజులు తక్కినవారు చూస్తూండగా నిన్ను వరిస్తాను. విచారించకు.


ఎల్లలోకధర్మంబులు నెఱిఁగియుండి 

యేల సేయుదు రమరేంద్రు లీరసంబు

నాది వారికి వందనం బాచరించి

తదనుమతి నిన్ను వరియింతుఁ దథ్య మిదియ." 


అని నిశ్చయంగా పల్కి, ఆ రీతిగానే తా వలచిన నలుని వరించింది.


మిగుల పుణ్యప్రదమైన ఈ నలదమయంతుల కథ విన్నవారికి కలిభయం ఉండదు. శుభాలు కల్గుతాయి.

సంపూర్ణం

మంగళం మహత్

27, ఫిబ్రవరి 2023, సోమవారం

చందమామ రావో! జాబిల్లి రావో!

 క్షీరసాగరమథనంలో జగన్మాత లక్ష్మి ప్రభవించాక చంద్రుడు పుట్టాడు. అంటే లక్ష్మికి తమ్ముడు. ఆ వరుసలో మాత తమ్ముడు చంద్రుడు లోకానికి మామ అయ్యాడు. ఆ మామను చూపి, తెలుగుతల్లులు తమ బిడ్డలకు గోరుముద్దలు తినిపించడం అందఱెఱిగినదే.


అలాగే అన్నమయ్య కూడా వ్రేపల్లె వెళ్లాడు. తల్లి యశోదలా మారి, బాలకృష్ణునికి వెన్నపాలు తెమ్మని చందమామకు చేస్తున్న విన్నపాలివి.


'చందమామ రావో... జాబిల్లి రావో

మంచి కుందనపు పైడికోర వెన్నపాలు తేవో'


ఓ చందమామా! ఓ జాబిల్లీ! రావో

(పదాంతమందు గల 'ఓ' ప్రార్థనను తెల్పుతుంది. అంటే ప్రార్థనాపూర్వకంగా రమ్మనడం)

మంచి మేలిమి బంగారు గిన్నెలో వెన్నపాలు తేవో!


ఇంతవఱకు యశోదలా వెన్నపాలు కోరాక ఎటువంటివానికి తేవాలో చెప్పే తాదాత్మ్యంలో మళ్లీ అన్నమయ్యలా మారిపోయి ఎన్నో విశేణాలతో ఇలా వర్ణిస్తున్నాడు స్వామిని.


*"నగుమోము చక్కనయ్యకు నలువ పుట్టించిన తండ్రికి 

నిగమములందుండే అప్పకు మా నీలవర్ణునికి 

జగమెల్ల ఏలిన స్వామికి చక్కని ఇందిర మగనికి 

ముగురికి మొదలైన ఘనునికి మా ముద్దుల మురారి బాలునికి"*


నవ్వులు కురిపించే మోము గల చక్కని అయ్యకు, 

బ్రహ్మను కన్న జగత్పితకు

వేదాలలో ఉండే తండ్రికి,

నీలమేఘంవంటి వర్ణం కల మావానికి, 

జగాన్ని పరిపాలించే స్వామికి, 

చక్కనైన లచ్చి మగనికి,

ముగురయ్యలకు (త్రిమూర్తులు) మూలమైన గొప్పవానికి


(ఇది సామాన్యార్థం.

ముగురిలో ఈయన ఎలా మొదలవుతాడని ఆలోచిస్తూంటే ఒక అర్థం స్ఫురించింది. నారాయణుడు స్వయంగా ఆవిర్భవించాక నలువను పుట్టించాడు కదా! '

ఆత్మావై పుత్రనామాసి' 

కొడుకంటే తనే కదా! 

అపుడు జీవుల పుట్టుక పోషణకు 

ఈయన మొదలు. 

(మఱి చివర ఎవరు? అంటే లయకారుడు.)

ఇంకో అర్థం తనకు విష్ణువే మొదలు. అన్నిటా అంతటా ఒకటే ఇరవైన వెన్నుని నామమే వేదం అన్నమయ్యకు. )

ముర (అనే రాక్షసుని) కూల్చిన మా ముద్దుల బాలునికి,

మంచి మేలిమి బంగారు గిన్నెలో వెన్నపాలు తేవలసింది.


*"తెలిదమ్మి కన్నులమేటికి మంచి తియ్యని మాటలగుమ్మకు 

కలికిచేతల కోడెకు మా కతలకారి ఈ బిడ్డకు 

కులముద్ధరించిన పట్టెకు మంచి గుణములు కలిగిన కోడెకు

నిలువెల్ల నిండ వొయ్యారికి నవనిధుల చూపులచూసే సుగుణునకు"*


తెల్లతామరపూల లాంటి కళ్ళతో మేటియైనవానికి, 

(పుండరీకాక్షుడు, పుండరీకవరదుడు)

గుమ్మలా అంటే పాలు పితికితే వచ్చే ధారలా తియ్యగా మాట్లాడే వానికి,

(గోపికామానసచోరుడు)

మనోజ్ఞమైన చేతలు కలిగిన కోడె (కోడెప్రాయపువయసుగల) వానికి, 

(రాసలీలలు)

(మంచి) మాటకారియైన మా ఈ బిడ్డడికి,

(రాయబారాలు)

వంశాన్నుద్ధరించిన పట్టికి, 

మంచిగుణాలు కలిగిన చిన్నవానికి,

నిలువెల్ల విలాసం, అందం, సొగసు నిండిపోయినవానికి,

(మోహిన్యవతారం)

నవనిధులచూపులు చూసే సుగుణరాశికి,

(ఆయన ఒక్క చూపుతోనే వలసినవానికి నవనిధులు సంప్రాప్తిస్తాయి - కుచేలోపాఖ్యానం)

మంచి మేలిమి బంగారు గిన్నెలో వెన్నపాలు తేవలసింది.


(అన్నమయ్య కీర్తనల్లో అవసరం మేరకు మానసికంగా ఆయా ప్రాంతాల్ని, అక్కడి దేవతామూర్తులను సందర్శించాక తిరిగి వేంకటనాథుని ఒద్దకు తిరుమలకు వచ్చేస్తాడు. ఇక్కడ కూడా అలాగే వచ్చి, కృష్ణుడేగా వేంకటనాథుడు అంటూ ముక్తాయింపు పల్కుతూ...)


*"సురలగాచిన దేవరకు చుంచు గరుడునెక్కిన గబ్బికి 

నెఱవాది బుద్ధుల పెద్దకు మా నీటు చేతలపట్టికి 

విరుల వింటివాని అయ్యకు వేవేలు రూపుల స్వామికి 

సిరి మించు నెరవాది జాణకు మా శ్రీవేంకటనాథునికి..."*      


దేవతలను రక్షించిన దేవరకు,

వయస్సులో ఉన్న గరుడునిపై ఎక్కిన దిట్టకు

సమర్థమైన బుద్ధులు కల శ్రేష్ఠునికి,

మురిపెమైన (శృంగార)చేతలు కల్గిన 

మా పట్టికి, 

పూలవిల్లు కల్గిన మరుని యొక్క నాన్నకు,

వేవేలరూపాలు కలిగిన స్వామికి,

(అనేకావతారాలు)

మించిన లక్ష్మీకళలతో సమర్థుడైన జాణకు,

మా తిరుమలశ్రీవేంకటనాథునికి,

మంచి మేలిమి బంగారు గిన్నెలో వెన్నపాలు తేవలసింది.


ఇలా కీర్తిస్తూ కృష్ణునికి ఎన్నో నీటైన విశేణాలను కుప్పపోశాడు. కృష్ణగుణాలనే తియ్యని వెన్నపాలను మనకి అందించాడు అన్నమయ్య.


మంగళం మహత్ 

18, ఫిబ్రవరి 2023, శనివారం

ధర్మం చేయడం అంటే

 ధర్మం క్రియారూపంలోనే ఉంటుందండి.

అందుకే దానికి సాధ్యం అని పేరు.

సాధింపబడేది, చేయబడేది ధర్మం అని తెలుసుకోవాలి.

అది క్రియాధారమూ, క్రియాఫలితమూను.


సర్వాగమానా మాచారః 

ప్రథమం పరికల్పితః

ఆచార ప్రభవో ధర్మః 

ధర్మస్య ప్రభు రచ్యుతః


సర్వాగమాలనుండి మొదట ఆచారం పరికల్పించబడింది. ఆచారం నుండి ధర్మం ప్రభవించింది. అటువంటి ధర్మానికి అచ్యుతుడు ప్రభువు.


అందువల్ల క్రియారూపంలోనే ధర్మం ప్రవర్తిలుతుంది.


ధర్మశబ్దానికి - “ధరతి విశ్వం ధర్మః 

ధృఞ్ ధరణే” -  విశ్వాన్ని ధరించేది అని నిర్వచనం.


తాని ధర్మాణి ప్రథమాన్యాస న్నితి వేదే.

ఏష ధర్మస్సనాతనః ఇతి లోకే.


ధరతి లోకానితి ధర్మః - లోకాల్ని ధరించేది.

ధ్రియతే వా జనైరితి ధర్మః - జనులచేత పూనబడేది.


"ధారణాత్ ధర్మమిత్యాహుః" 

మనం దానిని ధరించుట చేతనూ 

(అనగా ఆచరించడం చేత) 

దాని చేత ధరింపబడుట చేతనూ 

(అనగా మనల్ని రక్షించుట చేతను) 

ఆ అర్థం సార్ధకం.

అందుకే “ధర్మో రక్షతి రక్షితః" మనచేత రక్షింపబడిననాడు ధర్మం మనలను రక్షిస్తుం దని చెప్పబడింది. అంటే - ధర్మమార్గంలో నడచిన వానిని సుఖశాంతులు, శాశ్వతకీర్తి, ఆముష్మికలోకాలు కలుగుతాయి.  


పురుషార్థాల్లో ధర్మానిదే కదా! మొదటిస్థానం.

ధర్మయుతంగానే అర్థకామమోక్షాల్ని సాధించాలి.


"ధర్మశ్చ జానాతి నరస్యవృత్తమ్”  -

మానవు లేపని చేసినా, ఎవరు చూడలేదని చాటునా మాటునా చేసినా, వాటి సుకృత - దుష్కృతాలను తెలిసికొని యమునికి సాక్ష్యమిస్తుంది ధర్మం. అందుకే ఈ ధర్మ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 

కళ్లు తెరచుకొని ఉండాలి. కనుకే


'“ధర్మంచర” - “ధర్మం ఆచరించు." 

"ధర్మాన్న ప్రమదితవ్యం" - ధర్మ విషయంలో పొరపాటు పనికిరాదు మొదలైన ఉపదేశ (శాసన) వాక్యాలెన్నో వేదశాస్త్రాలు వివరించాయి. 


ధర్మవిరుద్ధమైన ఏపనీ శ్రేయస్సు నివ్వదని గీతోపదేశం.


ధర్మోనామ 'శ్లో॥ విద్వద్భిస్సేవితం సద్భిర్నిత్య మద్వేషరాగిభిః హృదయే -నాభ్యనుజ్ఞాతో యో ధర్మస్తం నిబోధ'తేతి మనువచనాత్ శిష్టాచారానుమిత శ్రుతి స్మృతి ప్రమాణక శ్రేయస్సాధన భూతో జ్యోతిప్టోమాదిః। చోదనాలక్షణార్థో ధర్మ ఇతి జైమిని వచనాచ్చ యజేతేత్యాది విధిబోధితో వేదప్రమాణకం శ్రేయస్సాధనం జ్యోతిప్టోమాది రేవ ధర్మః.


ధర్మమనగా:- 'రాగద్వేషాల్ని పారద్రోలిన మహాత్ములు నిత్యం దేన్ని సేవిస్తారో,

వారు దేన్ని అనుమతిస్తారో అది ధర్మం'.


ఈ స్మృతివాక్యాన్నిబట్టి మోక్షసాధనమైన జ్యోతిష్టోమం మున్నగు సత్కర్మలే ధర్మమని గుర్తించాలి. ఈ కర్మలు వేదాలవల్ల, ధర్మశాస్త్రాలవల్ల, సదాచార సంపన్నులైన మహాత్ముల ఆచరణాలవల్ల గ్రహించాలి. 


అదీగాక 'చోదనాలక్షణోఽర్థోధర్మః' అనే జైమినిసూత్రం వల్ల కూడా జ్యోతిష్టోమాది యాగాలే ధర్మమని తెలుస్తోంది.


(చోదనాలక్షణః =వేదములో 'చేయవలెను' అనే అర్థం వచ్చే ప్రత్యయం కలిగినట్టి, 

అర్థః = శ్రేయస్సాధనమైనట్టి కర్మ, 

ధర్మః= ధర్మం అని సదరు జైమినివాక్యానికి అర్థం.


పైవన్నీ పరిశీలించి చూస్తే ధర్మం చేయబడేది అని తెలుస్తుంది. 


అయితే 

"శ్రుతిశ్చ భిన్నా స్మృతయశ్చ భిన్నా మహామునీనాం మతయశ్చ భిన్నాఃధర్మస్య తత్త్వం నిహితం గుహాయాం మహాజనో యేన గతస్స పంథా"


ఒకే విషయంలో భిన్నమార్గాల్ని ఆదేశించే రెండు వేదవాక్యాలు, అలాగే రెండు స్మృతివాక్యాలు కనిపించి తికమకపరిస్తే  అలాంటప్పుడు పెద్దల ఆచార మెలా ఉంటుందో తెలుసుకొని దాన్ని ప్రమాణంగా గ్రహించాలి.


అలాగే 

పరధర్మాన్ని అనుష్ఠించరాదు.

స్వధర్మే నిధనం శ్రేయః

పరధర్మో భయావహః.


తల్లి తండ్రుల సేవ చేయడం ధర్మం.

మీ వృత్తిని సరిగా చేయడం ధర్మం.

ఆశ్రితుల్ని పోషించడం ధర్మం.

ఇలా ప్రతిపని ధర్మం తప్పకుండా చేయాలి.


మంగళం మహత్ 

14, ఫిబ్రవరి 2023, మంగళవారం

శృంగారదమయంతీనైషధసమాలాపము

 నలుడలా అన్నాక ఒక రీతి విని, ఒకభంగి వినని ఆ దమయంతి కొంచెం సేపు, తల వంచుకొని, విచారించి, తరువాత నిట్టూర్పు విడచి ఇలా అంది.


"నీప్రవర్తన, క్రూరంగా ఉంది. మాటిమాటికీ, నా చెవుల్లో దిక్పాలుర దుష్టసందేశవాక్యాలనే సూదికొనల్ని చొప్పిస్తున్నావు. తగదిది. ఒద్దన్నాను కదా! అయినా యమదూతకు బాధకలిగించడం నైజమే. 


ఎల్లి (నేటి వ్యవహారంలో రేపు) కల్యాణం (స్వయంవరం) వస్తోంది. ఈ అవాచిక వార్తలు మానెయ్యి. 


ఓపిక ఉంటే నలుని వర్ణించు. నీ పాపం అంతా పోతుంది. నేడు, ఎల్లి సురలకేం తొందర వచ్చింది? విశ్రాంతి తీసుకో. హంస చూపిన చిత్రపటాన్ని గూర్చి ఆలోచిస్తే నీయందు నలుని రూపం కనిపిస్తోంది. (సరే) నీకు దణ్ణం పెడతాను. 'దేవతల్ని వరించు' అనే ప్రార్థన మానెయ్యి."


స్నేహం, ప్రేమ, మచ్చిక కలగలిపి దమయంతి పలికింది విని, నలుడు,


""నీవు వరించకపోయినా ఇంద్రుడు కల్పవృక్షాన్ని ప్రార్థించి, నిన్ను దివికి రప్పించుకొంటే నీకు దిక్కేది?


యాగం నిర్వహించి, దాని సహాయంతో అగ్ని నిన్ను పొందితే ఏం చేయగలవు? (సర్వకామనలను తీర్చే యాగాలతో అగ్నికి నిత్యసంబంధం కాబట్టి సులభమే. )


అలాగే తన దగ్గరున్న అగస్త్యుని ప్రార్థించి, యముడు, (అగస్త్యుడు యముని దగ్గర ఉండడం ఏమంటే ఆయన వింధ్యపర్వతాన్ని నియంత్రించి దక్షిణదిక్కున ఉండిపోయాడు కాబట్టి యమునికి దగ్గరని )


కామధేనువును యాచించి అంబుపతి (వరుణుడు) నిన్ను చేపడితే ఎలా మఱి?


(వరుణుడు చేసే యాగాలకు హవిస్సులకోసం కామధేనువు తల్లోకానికి పోయి ఉందని రఘువంశంలో ఉందికదా!సముద్రం ఆమెకు పుట్టిల్లు. వరుణునికి సులభురాలు అని.)


కాబట్టి ఎవరో ఒకరిని వరించు. భక్తితో దేవతల చిత్తాన్ని పట్టకపోతే పనులకు అంతరాయం కలుగుతుంది.(స్వయంవరం చెడుతుంది)" అన్నాడు.


సశేషం 


మంగళం మహత్ 

10, ఫిబ్రవరి 2023, శుక్రవారం

తెనుఁగు నుడికారం

తోటనిండా ఆనపపాదులు. పచ్చటి పువ్వులు. వెన్నెల పరిచినట్లు దొడ్డి అంతా అలుముకుని ఉన్నాయి. ఒకవారగా మాలతీలత విరియబూచిఉంది. తెల్లటిపువ్వులు ఆకులను కూడా మూసేస్తున్నాయి. వాటి గుబాళింపుకి చరాచరవిశ్వమంతా పులకరించిపోతోంది. ఒక గండుతుమ్మెద ఝుమ్ముమంటూ తోటంతా అలంగం తిరిగేస్తోంది. సొరపువ్వులమీద వాలి తేనె జుర్రుకుంటోంది. ఆ తుమ్మెద తన దగ్గరకి కూడా వస్తుందని ఆశపడింది మాలతి. తేటి దానిదగ్గరకు వచ్చినట్లే వచ్చి, చటుక్కున మలుపు తిరిగి, మాలతిని చూడనైనా చూడకుండా మరో ఆనప పువ్వుమీద వాలింది. దాని తరవాత మరో పువ్వు. తరువాత మరోటి. అంతేకాని మాలతికేసి కన్నెత్తి చూడలేదు. మాలతికి ఉడుకుబోతుతనం వచ్చేసింది. నా పువ్వులు సొరపువ్వులపాటి చెయ్యక పోయాయా అని గుడ్లనీరు కుక్కుకుంది. రాత్రి కురిసిన మంచుబిందువులు మాలతీగుచ్ఛముల మీదినుంచి కన్నీళ్లలా రాలి నేలని పడ్డాయి. 


దానిమూగవేదన గ్రహించాడు, జగన్నాథ పండితరాయలు. దగ్గరగావచ్చి మాలతి శిరస్సున చెయ్యివేసి ప్రేమగా బుజ్జగింపుగా దువ్వేడు. అంత వరకూ ఆపుకుంటున్న దుఃఖం ఒక్కసారిగా పెల్లుబికి వచ్చేసింది. మాలతి బావురుమంది. మంచు జలజలా రాలింది.


'నేను ఆనపపువ్వులకన్న తీసిపోయానా?'


'అని ఎవరు అన్నారు?'


'అదిగో ఆ తుమ్మెద. ఇందాకటినుంచి చూస్తు న్నాను. ఎంతసేపూ ఆ పచ్చపువ్వులని పట్టుకుని దేవుళ్లాడుతుందే కాని నా వైపు ఒక్కసారి అంటే ఒక్కసారి అయినా చూసిందా ? '


'ఎంత పిచ్చిదానివి మాలతీ! ఈ పాటి దానికి కళ్లనీళ్లు పెట్టుకుంటున్నావా?'


'ఇది తక్కువ అవమానమా?'


'అవునుగానీ ఆ పొగరుతుమ్మెదకి ఎన్నికాళ్లూ?' 


'దాని కాళ్ల సంగతి ఎందుకు ఇప్పుడూ?' 


'ఎందుకో చెప్తాగా.'


'ఆరు కాబోలు. అవును ఆరే. షట్పది అని పేరు కూడా పెట్టేరుగా.'


'పశువుకి ఎన్నికాళ్లు?'


'నాలుగు కదా!'


'అవునా మరి. నాలుగు కాళ్లు ఉంటే పశువు అంటారు. ఆరుకాళ్లు ఉన్న ఈ తుమ్మెద ఆ లెక్కని పశువున్నరకాదూ? దానికి బుద్ధి ఎక్కడఉంటుందీ? బుద్ధి లేని పశువున్నర నీదగ్గరకు రావడంకన్న రాకపోతేనే నీకు మర్యాదకాదూ?'  



కిం మాలతి! మ్లాయసి మాం విహాయ 

చుచుంబ తుంబీకుసుమం షడంఘ్రిః

లోకే చతుర్భిశ్చరణైః పశు స్యాత్ 

సషడ్భి రత్యర్థ పశు ర్నకింస్యాత్ ? 


మాలతి పకపకా నవ్వింది. 


'మీరు తెలుగువారా?'


పండితరాయలు తెల్లబోయాడు. 

'ఏమి అలా అడిగేవు ?


'పశువున్నర అనేది వెధవన్నరలాగ అచ్చంగా తెనుగు నుడికారం, దానిని తమరు అత్యర్ధ పశువు అని సంస్కృతీకరించారు. తెలుగురాని కేవల సంస్కృత కవి ఇటువంటి ప్రయోగం చెయ్యడు'


'తెలుగు నుడికారాన్ని ప్రయోగిస్తున్నానని నాకు తట్టనే లేదు సుమా! గడుసుదానివి' అని జగన్నాథుడు మాలతి నీపు తట్టేడు.


మాలతి పువ్వులు, నవ్వులు కలయబోసి విరచిమ్మింది.


డా. మహీధర నళినీమోహన్..


మంగళం మహత్ 

9, ఫిబ్రవరి 2023, గురువారం

సుభాషితం

చెలువౌ రత్నఘటంబునం దతఁడు సుశ్రీఖండఖండంబులం

దిలపిణ్యాకము వండె నారుగల కర్థిన్ సప్తపర్ణావృతుల్ 

నిలిపెన్ జిల్లెడుదూదికై పుడమి దున్నెన్ బైఁడినాఁగేళ్ల ని

మ్ములఁ గర్మక్షితిఁ బుట్టి యెవ్వఁడు దపంబుల్ సేయఁ డప్రాజ్ఞతన్


అన్వయం: 

కర్మక్షితిన్ పుట్టి అప్రాజ్ఞతన్ తపంబుల్ ఎవ్వడు చేయడు అతడు

సుశ్రీఖండఖండంబులన్ చెలువౌ రత్నఘటంబునందు తిలపిణ్యాకము వండెన్

అర్థిన్ ఆరుగలకు సప్తపర్ణ ఆవృతుల్ నిలిపెన్

జిల్లెడుదూదికై పైడినాగేళ్లన్ పుడమి దున్నెన్


పైపద్యంలో 

ఇమ్ములన్, చెలువౌ, అర్థిన్ అనేవి పూరణార్థపదాలు.


ఇమ్ములన్=అనుకూలమైన/యుక్తమైన 

ఈ కర్మభూమిలో పుట్టి కూడా అప్రాజ్ఞతతో ఎవడు తపస్సులను చేయడో వాడు,


రత్న(ఖచిత)ఘటమందు(కుండనందు) మంచిగంధపుకట్టెలతో

తెలికపిండిని (గానుగ పిండి) వండే వానితోను,

(మట్టిపాత్ర చాలుగా!)


కప్పురపుటరంటులను కోరి నఱకి, 

ఆరుగలకు (ఒకరకమైన సస్యం/ఆహారధాన్యం, ఆళ్లు, ఆరికెలు అంటారు) కంచె వేసేవాడితోను,

(ముళ్లకొమ్మలు కదా! కావలసినది)


జిల్లేడు(వేఱు అని మూలం) దూది (ఇది పాఠాంతరం)కోసం బంగారునాగళ్లతో భూమిని దున్నేవాడితోను సమానం అవుతాడు.


నా(గ)స్వ(ర)వ్యాఖ్య: 

ఇమ్ములన్ అనే పదాన్ని కవి చక్కగా ప్రయోగించాడు.


చాంద్రాయణాది అన్ని రకాల తపస్సులకు అనుకూలమైన, యోగ్యమైన కర్మభూమి మన భారతదేశం.


అటువంటి భూమిలో పుట్టి ఏది పరమార్థమో తెలుసుకోక, ఆత్మసాక్షాత్కారానికి ప్రయత్నించకుండా అప్రాజ్ఞతతో ప్రవర్తిస్తున్న వారికి ఉపదేశమిది.


అయితే తపస్సు అంటే ముక్కు మూసుకొని చేసేదే కాదు. గీతలో శారీరక వాచిక మానసికాలనే త్రివిధ తపస్సులను పేర్కొన్నారు.


పైన చెప్పినట్లు పనికిమాలిన పనులను చేయకుండా సత్కర్మలు చేయడం కూడా తపస్సే. 


కాన శ్రేయస్సు కోరేవారు సర్వవిధాల సత్కర్మలను అనుష్ఠించాలని, పుణ్యకర్మమే సఫలం కాని అన్యం కాదని భావం. 

మంగళం మహత్ 



కల్యాణమా? కళ్యాణమా?

 కల్యాణం అనే పదమే సరియైనది.


దీనికి శుభం అని, 

స్వచ్ఛమైన బంగారు అని అర్థాలు.


శ్వ శ్శ్రేయసం శివం భద్రం కల్యాణం మఙ్గళం శుభమ్ - ఇవి పర్యాయపదాలు.


కల్యం సుఖం అణయతి ప్రాపయతి ఇతి కల్యాణం.

సుఖాన్ని పొందించేది అని.


ఇంకో వ్యుత్పత్తి కూడా ఉంది.


కల్యే ప్రాతః అణ్యతే శబ్ద్యతే. 

ప్రాతఃకాలంలో

(ప్రొద్దున) ఉచ్చరింపబడేది. 

మంగళాచరణం అన్నమాట.


విష్ణుపురాణంలో కనిపిస్తుంది ఇది.

దేవాలయాల్లో ఉదయమే మంగళాచరణాలతో స్వామిని మేల్కొల్పుతారు.

అలాగే పూర్వం రాజులు ప్రాతఃకాలంలో 

కల్యాణ శబ్దాలు వింటూ నిద్ర లేచేవారు.

దానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉండేవి.


ఇక కళ్యాణం అన్నది లేదు.

ల ళ లకు భేదం లేకపోవడంతో 

ఎవరో పుట్టించారు.


అలాగే కల్యాణానికి పెండ్లి అనే అర్థం లేదు.


మానవ జీవితంలో అతి పెద్ద శుభకార్యం 

పెండ్లే కాబట్టి కల్యాణం అనే పేరు వివాహానికి సమానపదంగా వచ్చి చేరింది.


కవిత్రయభారతంవారు పెండ్లి అనే అర్థం కాదు కదా! శుభం అనే అర్థంలో కూడా ప్రయోగించినట్లు కనిపించదు.


పోతన కాలానికి వివాహార్థం వచ్చింది

అని అనిపిస్తుంది.


తెనాలి రామకృష్ణకవి వివాహార్థంలో కల్యాణ శబ్దాన్ని వాడాడు.


స్వస్తి


మంగళం మహత్ 






8, ఫిబ్రవరి 2023, బుధవారం

సప్తాక్షరమంత్రం

  ఏ స్వల్ప ప్రయత్నంచేత 

విష్ణుసహస్రనామస్తోత్రపఠనఫలితం లభిస్తుంది?

దీనికి విష్ణుసహస్రనామస్తోత్రం ఉత్తరపీఠికలో సమాధానముంది.


పార్వత్యువాచ


కేనోపాయేన లఘునా 

విష్ణోర్నామ సహస్రకమ్

పఠ్యతే పండితైర్నిత్యం

శ్రోతు మిచ్ఛామ్యహం ప్రభో


"ప్రభూ! ఏ ఉపాయంచేత విష్ణుసహస్రనామం తేలిక/చిన్నగా నిత్యం పండితులచేత పఠింపబడుతుందో దాన్ని నేను వినగోరుతున్నాను. (చెప్పు)."


(సహస్రనామాలు చదివే ఓపిక లేదా వీలు లేనప్పుడు సులువుగా దేన్ని పఠిస్తే విష్ణుసహస్రనామస్తోత్రపఠనఫలితం లభిస్తుంది?)

అని ఒకనాడు పార్వతి పరమశివుని ప్రశ్నించింది.


అపుడు ఈశ్వరుడు,


"శ్రీరామ రామ రామేతి

రమే రామే మనోరమే

సహస్ర నామ తత్తుల్యం

రామ నామ వరాననే


మనస్సును రంజింపజేసే ఓ పార్వతీ!

(నేను) శ్రీరామ రామ రామ అని (జపిస్తూ)

రాముని యందు రమిస్తూంటాను.

(ఆనందిస్తూంటాను.)


శ్రేష్ఠ/అందమైన ముఖం కలదానా!/సుముఖీ!

ఆ రామనామం సహస్రనామాలతో సమానమైనది.


(సహస్రనామాలు పఠించలేనివారు ముమ్మారు (త్రికరణశుద్ధిగా) శ్రీరామ రామ రామ అంటే సహస్రనామపారాయణంతో సమానమైన ఫలితం లభిస్తుంది.)"


అని ఉపదేశించాడు.



నా(గ)స్వ(ర)వ్యాఖ్య: 


మనోరమే, వరాననే అన్నవి పార్వతిని ఉద్దేశించిన సంబోధనలు.


మఱి మనం మంత్రంగా పఠించేటప్పుడు అనవచ్చా ? అంటే 


"అవి స్త్రీలింగపదాలైనప్పుడు పార్వతికి సంబంధించిన సంబోధనలే.


పుంలింగాలైతే 

మనోరముడైన 

వరాననుడైన రామునియందు 

రమిస్తున్నాను" అని మంత్రవేత్తలు వివరణ ఇచ్చారు.



గుణాలు మనస్సుని ఆకర్షిస్తాయి.

అందువల్ల రాముడు తన శ్రేష్ఠమైన గుణాలతో మనోరముడు,

తన సౌందర్యాతిశయంతో వరాననుడు అయ్యాడు.


అందువల్ల ఈశ్వరుడే రామతత్త్వమందు రమిస్తూ స్వయంగా రామనామం సహస్రనామతుల్యం అని ఉపదేశించాడు 

శ్రీరామ రామ రామలో 

శకార రకార ఇకార బీజమయమైన

"శ్రీ"ని ప్రథమంగా చేర్చి,

మహామంత్రాలకు మూలమైన 

ఈశ్వరుడే చెప్పినందువల్ల

ఇది మహామంత్రమైంది.

కాన సర్వులూ శ్రీరామ రామ రామ అని జపిస్తూ సహస్రనామజపఫలితాన్ని పొంది, తరించెదరు గాక!



మంగళం మహత్ 






7, ఫిబ్రవరి 2023, మంగళవారం

శృంగారదమయంతీనైషధసమాలాపము

 అపుడు దమయంతి,

"(పరి) హసించి ఊరుకుంటే కొంటెతనం. కాదు కాదనడం నింద. మాఱు మాట్లాడకపోవడం తిరస్కారం. కాబట్టి ప్రత్యుత్తరం ఇస్తున్నాను.

.......నఖిలలోకాధీశుఁ డమరేంద్రుఁ డెక్కడ 

నేనెక్కడ వరాటి నెన్ని చూడ 

నలపతివ్రత యైన యేఁ దలఁప నొరునిఁ 

దివిరి నిందించియేఁ బ్రస్తుతించి యేని 

నలినబిససూత్రమును బురంధ్రుల తలంపు 

సమము త్రెయ్యును లవ చాపలముననైన.


ఆడులేడి ఏనుగుకూ, ఇత్తడి సొమ్ము ధనవంతునకూ తగనట్లు, ముదుకబట్టలాంటి నేను ఇంద్రునకు తగను. అతడెక్కడ? నేనెక్కడ? 

నలుడు పతి అని వ్రతం పూనాను. (నన్ను) నిందించినా, ప్రస్తుతించినా (లేదా తెగడి కానీ పొగడి కానీ) పరుని తలపను. తామరతూటిదారమూ, కుటుంబినుల తలపూ ఒకటే. కొంచెపు చాపలం చేతనే త్రెగిపోతుంది..

బహురత్నభూషణాలతో విభూషితులయ్యే రాచవారికి ఒకప్పటికైనా ఇత్తడి కడియం ఇష్టం కానట్టు ఎల్ల అచ్చరపడతుల విటకాడు మనుష్యస్త్రీని వేడుకచేయతగునా?

నా ప్రతిజ్ఞ తత్పరత విను. నలుని పెండ్లాడతాను. ఆయన అంగీకరించకపోతే ఆయనకు (ఏదో ఒక మరణప్రయత్నం ద్వారా) ప్రాణాలిస్తాను." అని తీక్ష్ణంగా అన్నది.

కోకిలవంటి ఆమె కంఠధ్వనిని ఇంకా వినాలనే కోరికతో నలుడిలా అన్నాడు.

"నిరుపేద ఇంటికి నిధి రానే రాదు. ఒకవేళ వచ్చినా తన అభాగ్యతవల్ల తలుపు వేసుకొంటాడు కానీ లోపలకు రానివ్వడు.

ఇనుము రససంబంధంవల్ల స్వర్ణంగా మారినట్లు ఇంద్రసంబంధంచేత వచ్చే దేవత్వాన్ని ఎందుకు ఒద్దంటావ్?

నీవు ఏవిధంగా దేహత్యాగం చేసినా (ఉరి/జలం/అగ్ని) ఘట్టకుటికాప్రభాతన్యాయంలా మళ్లీ వారిలో ఒకరిని చేరాలి.

ఒల్లననుమాట కర్థ మో యుత్పలాక్షి!

వలతుననుమాట గాదుగా వక్రరీతి

విధి నిషేధరూపంబు భావించియున్న

విధియ యగు వ్యంగ్య వాసనా విలసనమున

ఒల్లననే మాటకు వక్రరీతిని వలతును అని కాదుగా!? ఎందుకంటే విధి నిషేధరూపంలో ఉన్నా వ్యంగ్యార్థం భాసిస్తే విధే అవుతుంది.

వైభవం బిచ్చగించి పావనతఁ గోరి

ధర్మశీలత యర్థించి నిర్మలత్వ 

మాసపడి వీరి నలువురయందు నొకని 

వేఁడుమా చూచెదము నీవివేకశక్తి

వైభవం (ఇంద్రుని) ఇచ్చగిస్తావో!? 

శుచిత్వం (అగ్నిని) కోరతావో!?

ధర్మస్వభావం (యముని) అర్థిస్తావో!? 

నిర్మలత్వం (వరుణుని) ఆసపడతావో!?

వీనిలో ఒకరిని వరించు. నీ వివేకశక్తిని చూద్దాం."

సశేషం


మంగళం మహత్ 

26, జనవరి 2023, గురువారం

శృంగారదమయంతీనైషధసమాలాపము

నలుడు తిరస్కరిణీవిద్యమహిమతో దమయంతి అంతఃపురంలోకి ప్రవేశించి, ఇంద్రాగ్నియమవరుణుల సందేశాన్ని వినిపించటానికై ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యాడు. 

ఆమె గౌరవించి, వంశనామాదులు అడిగింది.

అపుడు నలుడు దిక్పతుల పంపున దూతగా వచ్చానని చెప్పి వారి(లో నొకరి)ని వరించమని కొన్ని మాటలు చెప్పాక దమయంతి,

"ప్రశ్న మొక్కటి యొక్కటి ప్రతివచనము

యుక్తి యనుకూలమై యుండ దుభయ మునకు 

నేను నీవంశనామంబు లెవ్వి యనిన 

నెవ్వరినో ప్రస్తుతించితి వింతతడవు


అడిగిన ప్రశ్న ఒకటి. నీ సమాధానం మరొకటి. అడిగింది చెప్పలేదు.నేను నీ వంశనామాలేవి అంటే అది వదిలేసి ఇంతసేపూ ఎవరినో ప్రస్తుతిస్తున్నావు.

(దిక్పాలురని తెలిసి కూడా "ఎవరినో" అని అనడంలో వారి పట్ల ఆమె అనాదరభావం తెలుస్తోంది.)


ఒక చోటఁ బ్రకాశించియు

నొక చోట నిగూఢ యగుచు నొదవించెం గౌ 

తుకలక్ష్మి నీసరస్వతి

ప్రకటయు గూఢయును నగు సరస్వతి వోలెన్ 

ఒకచోట కనిపిస్తూ, ఒకచోట అదృశ్యమయ్యే సరస్వతినదిలా నీ సరస్వతి (వాక్కు) ప్రశ్నకు సంబంధించినదానిలా స్పష్టమవుతూ ఒకసారి, సంబంధించనిదానిలా (అంతర్వాహిని అవడంచేత) అస్పష్టమవుతూ మరోసారి వేడుకను పుట్టిస్తోంది.


అధికతరు లైనఁగాని దిశాధిపతులు

కౌతుకము నాకు నీవంశకథలయందు

దప్పిగొన్నట్టివారి కాదప్పి దీఱ 

సలిలపూరంబు హితవొ యాజ్యంబు హితవొ

దిక్పాలురు అధికతరులైతే అవ్వచ్చు. కానీ నాకు నీవంశకథలు తెలుసుకోవడంలోనే వేడుక. నేయి అధికమైనదైనా, దప్పిక తీరడానికి నీరే కదా! హితవైనది. ఆలోచించు.

నా ప్రశ్నకు నీ ఉత్తరం అప్పులా మిగిలిపోయింది. ఇప్పుడైనా ఋణం తీర్చుకో. ఏ వంశం(వెదురు) నీలాంటి నాయకమణిని(ముత్తెం) భరించింది? ఏ వర్ణాలు నీ పుణ్యనామానికి ప్రకాశకాలవుతున్నాయి?"

(వెదురులో ముత్తెం పుడుతుంది. బృ.సం.)

అని పలికి ఊరకుంది.

అపుడు నలుడు, 

"వంశకథ అలా ఉండనీ. చెప్పకూడదు. ఎందుకంటే నీచకులమైతే చెప్పుకోదగదు. అవమానం. గొప్పకులమైనా చెప్పుకోలేను. ఎందుకంటే ఇలా సేవకత్వం/దూతత్వం వహించి, రావడంచేత చెప్పడం ఉచితం కాదు.

రాజవదనా! నీవు రాచకన్యవు. మానవీయవు. మన మైత్రికి అఱ (కొఱత/సగం/కపటం) చేయకూడదు. కొంచెం చెప్తా. నేను మనుజవిభుణ్ణి. రాజ(చంద్ర)వంశ(వెదురు)మొలకని.


పేరడుగం దలంచెదవు భీమతనూభవ! యావిచారముం

దూరము సేయు మెవ్వరికి దోసము తాఁదన పేరు సెప్పు టా 

చార పరంపరాస్థితికి శాస్త్రము మూలము శాస్త్ర చోదితా 

చార వివేకహీనుఁ డగు జాల్ముని మెత్తురె? పండితోత్తముల్


తన పేరు తాను చెప్పుకోవడం దోషం. శాస్త్రాచారాన్ని తప్పను.

(ఆత్మనామ గురోర్నామ నామాతికృపణస్యచ

శ్రేయస్కామీ నగృహ్ణీయాత్ జ్యేష్ఠా పత్య కళత్రయోః'

అనే స్మృతివచనం తన పేరు తాను చెప్పుకోకూడదని శాసిస్తోంది.)

అదీ గాక,

కువలయనేత్ర! సమక్ష

వ్యవహారంబునకు యుష్మదస్మత్పదముల్

శ్రవణశ్రావణ యోగ్యము

లవుచుండఁగఁ బేరు సెప్ప నడుగఁగ నేలా?

ఎదురెదురు వ్యవహారాల్లో నీవు నేను అనే పదాలు వినడానికి, వినిపించడానికి హాయిగా ఉండగా, ఇక పేరుతో పనేమిటి?

(నాదీ ఇదే వ్యవహారం-స్వగతం-క్షమించాలి.)

అని నలుడు శారదంబైన అడవినెమలిలా పలికాడు. (నెమలి వర్షాకాలంలో కూసి, శరత్కాలంలో మౌనం వహిస్తుంది. అందుకని ఆ పోలిక. పోలికనుబట్టి మౌనం దాల్చాడని ఊహ్యం.)

ఆ పల్కులలోని ప్రతి పదం అనురాగం కల్గించగా ఆ దమయంతి, రాజహంసిలా (శరత్కాలంలో నెమలి ధ్వని చేయదు కానీ, రాజహంస ధ్వని చేస్తుంది.)

........బలి కె నిట్లని మహీపాలుతోడ 

నన్వయం బెఱిఁగించి యభిధాన మెఱిఁగింప కునికి మ మ్మాదరించిన తెఱంగె ?


యనఘ! మము నీవు వంచింప నభిలషించె 

దేము నేరమె వంచింప నిపుడు నిన్నుఁ 

బేరు సెప్పిన నీ కనాచార మేని

మాకు నాయంబె నీతోడ మాటలాడ.


అన్వయం చెప్పి, అభిధానం చెప్పకపోవడం ఏవిధంగా మామీద ఆదరం చూపినట్లు?

మమ్మల్ని నీవు వంచింప తలస్తే మేము నిన్ను వంచింపలేమా!? నీ పేరు చెప్పడం నీకు అనాచారమైతే, (పరపురుషుడవు, క్రొత్తవాడవైన) నీతో మాట్లాడడం మాకు న్యాయమా!?


అన్య పురుషులతోడ నెయ్యంపుగోష్ఠి 

యధిప ! మముబోఁటిరాజకన్యకల కగునె 

యది కులాబలాచారసహాసనాస

హాతిసాహసకౌతూహలావసథము

మాలాంటి రాజకన్యలకు పరపురుషులతో ఇష్టాగోష్ఠి కులకాంతల ఆచారానికి ఎంతమాత్రం పొసగని అతిసాహసపు వేడుక కాదా!

అతిసౌందర్యవంతులైన మగవారితో అంతఃపురంలో ఇంతసేపు మాట్లాడడం కులకన్యలకు తగదు." అంది.

దాంతో సమాధానం ఏం చెప్పాలా అని ఆలోచించి, ఏమీ తోచక, నలుడు, ఆమె వచోనైపుణ్యానికి మనసులో అభినందిస్తూ, చిఱునవ్వుతో ఇలా అన్నాడు.

"చేతులు జోడించి అడుగుతున్నాను. దేవతల(లో ఒకరిని) వరించి నా సమధికాయాసాన్ని సఫలం చెయ్యి. నా కార్యం నెఱవేర్చు.

ఇంద్రాదులు నారాకకై ఎదురుచూస్తూంటారు. కాలయాపన చేయకు."  అన్నాడు.


సశేషం

మంగళం మహత్ 


25, జనవరి 2023, బుధవారం

భీమఖండ కాశీఖండాల్లో వ్యాసఘట్టం

 కాశీఖండం భీమఖండం 

రెండూ శ్రీనాథుడే వ్రాసినా

వ్యాసుడు కాశిని బాసిన 

వృత్తాంతం రెండు గ్రంథాల్లోనూ

వేర్వేరుగా ఉంది.


భీమఖండ వ్యాసఘట్టం


అగస్త్యుడు వ్యాసుని కాశిని బాసిన

కారణాన్ని అడిగాడు.


ఇద్దరూ (పిఠాపురసమీప)తుల్యభాగాతీర బిల్వతరువనాంతరంలో కలిశారు.


వ్యాసుడు సమాధానమిస్తూ,


"జైమిని పైలసుమంతులాది శిష్యులతో 

తీర్థయాత్రకు కాశీ వచ్చాను.


ఏ శకునంలో వచ్చామో

అహోరాత్రాలు ఏడు రోజులు భిక్ష దొరక్క ఉపవాసం ఉన్నాం.


ఒక పతివ్రతైనా ఆహారం పెట్టలేదు ఆ రోజుల్లో.


ఎనిమిదో రోజునకూడా 

భిక్షకోసం తిరిగాం.


నెత్తిన ఎండ మండిస్తూంటే

లేదు, నడవండి, పొండి, కూడదు 

ఇలాంటి నిషేధ వాక్యాలతో చెవులు నిండగా


విప్రవాటంబులఁ బ్రతిగేహంబును బరిభ్రమించి విసికి విసిమాలి వేనరి యలసి యారటఁబొంది సొలసి జూఁకించి తూలి దూఁపటిలి యుల్లంబునఁ గ్రోధం బుద్భవించిన.


భిక్షాపాత్రల్ని ఱాతిమీద వంద ముక్కలయ్యేలా వేశాను.


ఏం చెప్పేది? ప్రజ్ఞావిభవం ఏమో అయిపోయి 

చెడిపోగా కూడు లేని కారణాన కాశీని శపించాలనుకొన్నాను. 


కోపాన్ని సంహరించమని శిష్యబృందం చెప్తున్నా వినకుండా 


మాభూత్రై పూరుషీ విద్యా 

మాభూత్రై పూరుషమ్ ధనమ్,

మాభూత్రై పూరుషీ భక్తిః

కాశ్యామ్ నివసతామ్ సదా.


అని శపించాలనుకొని

శాపజలాన్ని అందుకొందామనుకొంటే ఎందుకో కేలు సాగలేదు.


ఆ సమయంలో ఒక వృద్ధసీమంతిని 

భిక్షకు రమ్మని ఇలా అంది.


క్రొన్నెలపువ్వుదాల్పునకుఁ గూరిమిభోగ పురంధ్రి కక్కటా 

యిన్నగరీలలామమున కీపరిపాటికి నిట్టికోపమే 

లన్న ! ఘటించె దో మునికులాగ్రణి నిక్కమువో బుభుక్షితం 

కిన్నకరోతిపాపమను కేవలనీతిఁ దలంచిచూడఁగన్.


ఆ తర్వాత మూడువందలమంది శిష్యులకు నాకు భోజనాలు పెట్టింది.


తిన్నాక, శివుడు కోపసంరంభంతో శిష్యులతో సహా కాశీని విడచిపొమ్మన్నాడు.


పార్వతి అనుగ్రహించి మఱెక్కడికీ వెళ్లకుండా దక్షిణకాశి దక్షవాటిక వెళ్లమని 

అభ్యుదయాలవుతాయని వచించింది.


ఎప్పుడెప్పుడు ఆ భీమేశ్వరుని దర్శిస్తానో అని ఉవ్వళ్లూరుతూ వస్తూ నిన్ను కలిశాను."


అని ముగించాడు.


ఈ వ్యాసఘట్టాన్ని ప్రధానంగా తీసుకొని, శ్రీనాథుడు దక్షారామాన్ని భీమేశ్వరుని వైభవాన్ని వర్ణిస్తూ భీమఖండం రచించాడు.


కాశీఖండంలో ఉన్నదేమిటో చూద్దాం.


వ్యాసుడు పదివేల మంది శిష్యులతో పెద్దకాలం కాశీలో నివసించాడు. 


ఆయన స్థైర్యాన్ని శివుడు పరీక్షించాలనుకొన్నాడు.


రెండవరోజుకే కోపం వచ్చేసింది.


శివుడు కాశీని విడచిపొమ్మన్నాడు కానీ వ్యాసుడు గడగడ వణకుతూ కాళ్లమీద పడ్డాక ఇలా అనుగ్రహించాడు.


కాశికాపురిఁ దొంటికట్టడ నుండక పుణ్యకాలమునందు భూతతిథుల వచ్చువాఁడవు శిష్యవర్గంబు నీవును నైదుకోశములకు నవలినేల నుండువాఁడవు పైఁడికుండలు ప్రాకార వలయంబుఁ బొడగానవచ్చుచోటఁ ద క్కన్యతిథులఁ దీర్థముల నిందింపకు బుద్ధిమంతుఁడవు గాఁ బొమ్ము బ్రదుకు 


తే, మంచు నంత ర్హితుం డయ్యె నగజతోడ 

విశ్వనాథుండు మునియును విశ్వభర్త 

యాన తిచ్చిన చోటనే యధివసించెం 

గాశికాపురి కెడదవ్వు కలుగునడవి.



మంగళం మహత్


24, జనవరి 2023, మంగళవారం

సరసమైన చిన్న కథ

 అది రోహిణీకార్తె. మిట్టమధ్యాహ్నం వడ గాడుపు గూబ పగలేస్తోంది. తాటాకు గొడుగు వేసుకుని నడిచివెడుతున్న జగన్నాథపండితునికి దారిలో ఒక మామిడి చెట్ల గుబురు కనిపించింది. అక్కడే ఒక గిలక నుయ్యి. పక్కనే తాటాకు చేద. జగన్నాథుడికి ప్రాణం లేచివచ్చింది. గబగబా ఓ చేదెడునీళ్లు తోడుకుని ముఖం కడుక్కున్నాడు. చల్లగా మంచులా ఉన్నాయి నీళ్లు. నాలుగు పుడిసెళ్లు గొంతుకలో పోసుకున్నాడు. గంగా బొండంనీళ్లల్లా మధురంగా ఉన్నాయి. 


అక్కడి మట్టితిన్నెమీద కూర్చుని అలసట తీర్చుకుంటూ 'ఎంతమంచినుయ్యి ! ఏపుణ్యాత్ముడు తవ్వించాడో!' అనుకున్నాడు.


అంతలో హఠాత్తుగా ఆ నూతిలోనుంచి 'నేను చాలా నీచమైనదాన్ని' అని దిగులుగా అంటున్నట్లు వినిపించింది. 


జగన్నాథుడు ఉలిక్కిపడి నూతిలోకి తొంగిచూశాడు. అందులో ఎవరూ లేరు. అంతా తన భ్రమ. అంతలో 'నేను చాలా నీచమైనదాన్ని' అని మళ్లీ స్పష్టంగా వినిపించింది.


ఆ మాట్లాడు తున్నది నుయ్యే అని స్పష్టం అయింది అతడికి.


నీచశబ్దానికి క్రిందుగా ఉండేదీ, క్షుద్రమైనదీ అనే అర్థాలున్నాయి.


'ఓహో! నుయ్యి ఎంత తెలివిగా మాట్లాడు తోందీ?' అని మెచ్చుకున్నాడు.


'క్రిందుగా ఉండేదానివి అనడం బాగానే ఉంది కానీ అల్పమైనదానివీ క్షుద్రమైనదానివి మాత్రంకావు బావీ ! నీది అత్యంత సరసమైన హృదయం' అన్నాడు.


'ఏమిటీ? నా హృదయం అత్యంత సరస మైనదా? వేళాకోళం చేస్తున్నారా ?' 


'లేదు లేదు. నీతో వేళాకోళం ఆడతానా?

నిజంగా నీది సరస హృదయమే. ' 


'అదెల్లాగ?'


'రసం అంటే నీరు. నీ హృదయంనిండా నీళ్లు లేవూ? అందులోనూ ఎలాంటినీళ్లు. '


 'మీ ద్వ్యర్థి చల్లగుండా. ఇంకా ఏమిటో అనుకున్నాను.'


'పైగా నువ్వు పరగుణ గ్రహీతవు.'


'ఇదోటా? సరసహృదయంతోబాటు పరగుణ గ్రహణ శక్తి కూడా అంటగడుతున్నారే. ఇది బాగుంది.


'అవును. నేను అన్నది అక్షరాలా నిజం'


'నాది అసలే మందబుద్ధి. మరి కాస్త వివ రించండి దయచేసి.'


'గుణం అంటే తాడుకాదుటమ్మా! చేదకి తాడుకట్టి నీలోకి విడవరూ? అంటే ఇతరుల గుణాన్ని అదే చేంతాడుని—నువ్వు గ్రహించడం లేదూ?'



నితరాం నీచోఽస్మీతి 

త్వం ఖేదం కూప! మా కదాపి కృధాః

అత్యంత సరస హృదయో 

యతః పరేషాం గుణగ్రహీతాసి.



అతి నీచంబను నేనని

మతిగుందకు మెపుడు కూపమా! నీహృదయం 

బతిసరసము — నీవెప్పుడు 

నితరుల గుణముల గ్రహించు నేర్పరివికదా!


'హోహ్హోహ్హో! నాకు నవ్వు ఆగడంలేదు. ఇంతమంది బాటసారులు నాలో నీళ్లు తాగిపోయారు గానీ మీలాగ నన్ను ఆకాశానికి ఎత్తేసినవాళ్లు లేరు.

ఇంతకీ మీ పేరు ఏమన్నారూ?'


ఆత్మనామ గురోర్నామ 

నామాతికృపణస్యచ

శ్రేయస్కామీ నగృహ్ణీయాత్ 

జ్యేష్ఠా పత్య కళత్రయోః'


'నా పేరుకేంగానీ నాలుగు కాలాల పాటు పరగుణ గ్రహీతవుగా వర్థిల్లు'అని ఆశీర్వదించి ముందుకి సాగిపోయాడు జగన్నాథ పండితరాయలు.


~ డా. మహీధర నళినీమోహన్ 

15, జనవరి 2023, ఆదివారం

ఉద్భటారాధ్యచరిత్ర

 తన ఉద్భటారాధ్యచరిత్రమనే ప్రబంధంలో శివపార్వతుల విహారాన్ని వర్ణించే సందర్భంలో 

రామకృష్ణకవి ఈ పద్యాన్ని వెలయించాడు.


సీ. తరుణశశాంకశేఖర మరాళమునకు 

సారగంభీర కాసార మగుచుఁ

గైలాసగిరినాథ కలకంఠభర్తకుఁ 

గొమరారు లేమావికొమ్మ యగుచు

సురలోకవాహినీధర షట్పదమునకుఁ 

బ్రాతురుద్బుద్ధ కంజాత మగుచు

రాజరాజప్రియ రాజకీరమునకు

మానితపంజర స్థానమగుచు

గీ. నురగవల్లభహార మయూరమునకుఁ 

జెన్ను మీఱిన భూధరశిఖర మగుచు 

లలితసౌభాగ్యలక్షణలక్షితాంగి 

యద్రినందన వొల్చె విహారవేళ.


అర్థనారీశ్వరతత్త్వాన్ని ఇలా అభేదంగా వర్ణించడంలో రామకృష్ణుని నేర్పు వ్యక్తమౌతోంది.


అద్రినందన తన భర్తకెపుడూ అనుకూలమే.

అందుకే ఆ పెద్దముత్తైదువ, ఆ సర్వమంగళ, 

లలితసౌభాగ్యలక్షణలక్షితాంగి.

లలితమైన సౌభాగ్య లక్షణాలకు ఆశ్రితమైన

అంగములు కలది./అటువంటి లక్షణాలకు ముఖ్యంగా చెప్పదగినది. అంటే లక్ష్యమైనది.


అటువంటి జగన్మాత కైలాసపర్వతోద్యానవనంలో

శివునితో కలసి విహరిస్తోంది.

అందువల్ల వర్ణితాంశాలన్నీ తోటల్లో ఉండేవే తీసుకోబడ్డాయి.


ఆ బాలచంద్రుని శిఖయందు ధరించిన శివుడు మరాళమైతే

ఆయన సానుకూలవతి సతి సార గంభీర సరోవరమయ్యింది.


నెలతాల్పు అంచకు 

కొండచూలి కొలను.


కైలాసగిరినాథుడైన ఆ మగకోకిలకు

అపర్ణ అందమైన లేత మావిడి కొమ్మ అయింది.


(లేత మావి చిగుళ్లే కోకిల కచేరీలకు సత్తువ నిచ్చేవి.)


పినాకి పికానికి 

వలిగట్టుదొరపట్టి లేమావికొమ్మ.


దేవలోకంలో ప్రవహించే గంగను ధరించిన

(షట్పదము=ఆరుపాదాలు కలది, తుమ్మెద.

షడంగాలు కల వేదరూపమే విశ్వనాథుడనే ధ్వని) 

ఆ భ్రమరానికి

భ్రమరాంబ ఉదయాన్నే ఉదయించిన ఉదజం అయింది.


మిన్నేటితాల్పు జంటముక్కాలికి

చలిమలపట్టి నీటిపుట్టువు.


కుబేరుని చెలికాడైన శ్రేష్ఠమైన చిలుకకు

కాత్యాయని కొనియాడబడే/చక్కనైన పంజర (ములో చిలుక ఉండే) స్థానం అయ్యింది


పైడిఱేనిచెలికాడు పచ్చఱెక్కలపక్కికి

పురుహూతి పంజరస్థానం.


సర్పరాజును హారంగా ధరించిన ఆ నెమలికి

అంబ అందం, విలాసం అతిశయించిన గిరిశిఖరం అయింది.


(నెమళ్లు పర్వతశిఖరాలమీదే ఎక్కువ చరిస్తూ/నర్తిస్తూంటాయి)


పాపఱేనితాల్పు పురిపులుగుకు

గుబ్బలిపట్టి కొండకొన.


ఇలా అద్రితనయ విశ్వనాథునితో విహరిస్తూ విరాజిల్లింది.

పతికి ప్రాధాన్యమిచ్చిన ఆ సతి

ఆయన ఎలా విహరిస్తున్నాడో దానికి తగ్గట్టు మార్పులు పొందుతోందని వర్ణన.

ఈ మార్పులే సృష్టి లీలలు.


అమ్మవారి సహకారంతోనే అయ్యవారు విహరించేది.

పరస్పరసహకారమే అర్థనారీశ్వరతత్త్వం.

 

వర్ణితాంశాలు గమనిస్తే
ఆమె అచలమైన ప్రకృతి,
ఆయన చలించే పురుషునిగా దర్శనమిస్తారు.


సౌందర్యలహరిలో శంకరులు అమ్మవారిని


శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం

న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి


అని వర్ణించారు 


శక్త్యా = శక్తితో

యుక్త = కూడి ఉండగా

శివః = శివుడు

ప్రభవితుం = సృష్టిచేయ

శక్తః = సమర్ధత కలవాడు (అవుతున్నాడు)

ఏవం = ఇలా

నచేత్ = కాకున్నట్లయితే

దేవః = ఆ శివుడు 

స్పందితుం అపి = చలించడానికైనా

నకుశలః = సామర్థ్యంగలవాడు కాడు.


దీన్ని మదిలో ఉంచుకొని

పై పద్యంలో రామకృష్ణకవి

జగత్తుకు ఆధారాధేయమగు శివశక్తిస్వరూపాన్ని 

(వారు అభేదమని తెల్పుతూ), 


ఆధారాధేయాలుగా


కాసారం - మరాళం

మావికొమ్మ - కలకంఠం

కంజాతం - షట్పదం

పంజరస్థానం - కీరం

భూధరశిఖరం - మయూరం


వీటిని గ్రహించి 

ఆధ్యాత్మిక దృష్టితోనూ,

( గంభీరమైన అంటే లోతైన వేదాంతాన్ని (కాసారం) మరాళరూపంలో.శివుడు పార్వతికి బోధించాడు. 

హంస తెల్లనిది, స్వచ్ఛమైనది. శుద్ధసత్త్వం. ఆ శుద్ధసత్త్వస్వరూపుడు పరమశివుడు. 

అలాగే వేదాంతశిఖరంపై శివమయూరం విహరించినట్లుగాను వర్ణన. )


ప్రబంధవర్ణనానుగుణంగానూ,

 (కోకిల - మావిచిగుళ్లు
షట్పదం - భ్రమరం)

ప్రబంధముఖ్యరసపరంగానూ,

అతిమనోజ్ఞంగా వర్ణించాడు.



-------------------------------------------


శివుడు

నెలతాల్పు = చంద్రుని ధరించినవాడు

పినాకి = పినాకము శివుని విల్లు 

మిన్నేటితాల్పు = గంగను ధరించినవాడు

పైడిఱేనిచెలికాడు = కుబేరుని స్నేహితుడు 

పాపఱేనితాల్పు = సర్పరాజును ధరించినవాడు


పార్వతి

అద్రినందన = కొండకూతురు

కొండచూలి = హిమవంతుని సంతానం/బిడ్డ 

అపర్ణ = పర్ణములు కూడా ఆహారంగా తీసుకోవడం మాని తపస్సు చేసినది.

వలిగట్టుదొరపట్టి = హిమవంతుని కుమార్తె.

చలిమలపట్టి = హిమవంతుని పుత్త్రి

పురుహూతి = అష్టాదశశక్తిపీఠాల్లో పిఠాపురంలో గుప్తంగా ఉన్న స్వరూపం.

గుబ్బలిపట్టి = గిరితనయ


హంస

మరాళం = తెల్లగా, స్వచ్ఛంగా ఉండేది.

అంచ


కోకిల

పికం = శబ్దం చేసేది

ఆధారాధేయాలు.
ఆధారం = ఆదరువు, ఆశ్రయం, ఆలంబం
ఆధేయం = ఉంచదగినది.
(ఘటం ఆధారం అయితే అందులో జలం ఆధేయం.)

 


మంగళం మహత్ 

8, జనవరి 2023, ఆదివారం

కూచిమంచి తిమ్మకవి తాళి

 “చిన్నివెన్నెలఱేఁడు చెన్నైన సికపువ్వు, పసమించు పులితోలు పట్టుసాలు, 


చిలువలయెకిమీఁడు బలుమానికపుఁదాళి, వాటంపుఁదెలిగిబ్బ వారువంబు,


గఱికిపూజల మెచ్చు గారాబుకొమరుండు, వలిగొండ కూతురు వలపుటింతి, 


జేజేతుటుములెల్లఁ జేరి కొల్చెడు బంట్లు, నునువెండి గుబ్బలి యునికిపట్టు, 


నగుచుఁ జెలువొంద, భువనంబు లనుదినంబు 


రమణఁ బాలించు నిన్ను నేఁ బ్రస్తుతింతు


బుధనుతవిలాస, పీఠికాపురనివాస


కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!"


కూచిమంచి తిమ్మకవి

రుక్మిణీ పరియణకావ్యం లోని

అవతారికలోనిదీ పద్యం.


పీఠికాపురకుక్కుటేశుని వర్ణన.


చిలువలయెకిమీడు ఆయన తాళి 

అన్నది సొగసైన ఊహ.


ఇక్కడ తాళి పదాన్ని 

హారం అనే అర్థంలో ప్రయోగించినా 

హారం అనకుండా 

తాళి అనడంలో 

ఒక చమత్కారం ఉంది.


తాళి (పెళ్లైన) ఆడువారిని ఎల్లప్పుడూ

అంటి పెట్టుకొనే ఉంటుంది కదా! విడువకుండా.


అందువల్ల మంగళసూత్రం అని స్ఫురింపజేయడమే తాళి పద ప్రయోగంలో

కవియొక్క ఉద్దేశం అని నా భావన.


ఈ సందర్భంలో తాళి గుఱించి కొన్ని విశేషాలు.


మంగళసూత్రానికి

ఐదువత్రాడు, కంటె, తాళి/లి, పుస్తె,

బొట్టు, త్రాడు, పసుపుత్రాడు, బొట్టుదారం, కంఠసూత్రం అనే పదాలు వాడుకలో ఉన్నాయి.


అయితే 

కేవల తాళి పదానికి

హారం, పతకం అనే అర్థాల్లో తప్ప

మంగళసూత్రం అనే అర్థంలో

నిఘంటుకారులు ప్రామాణికంగా 

భావించే కావ్యాదుల్లో

ప్రయోగాలు లేవు.


"తాలి" కి మాత్రం 

(శబ్దరత్నాకరంలో ఈ పదానికే మంగళసూత్రం అర్థం ఇచ్చారు.)

"తాలి విభుండు గట్టిన మొదల్‌." అని

పాండురంగ మహాత్మ్యంలో

కనబడుతోంది.


సదరు అర్థంలో 

ఐదువత్రాడు, కంటె, తాలి, పుస్తె, బొట్టు 

అనే పదాలే కవులు వాడారు.

 

"యామవతీ విలాసినికి నైదువత్రాడు"


"నలుదవనమాల కంటెయు 

మలినతనువు."


"పుస్తెగట్టిన యదిమొదల్‌ పొంతరావు." 


"గొట్టుపడితివే మెడను బొట్టుగట్టిన విభుఁడు."


ఐదువత్రాడు 15 వ శతాబ్దం నాటి పదం.


తాళి కట్టడమే వివాహముహూర్తమని చాలామంది అనుకొనే ఇంత ప్రాధాన్యమున్న ఈ పుస్తెల సంగతే వివాహమంత్రాలలో ఎక్కడా లేదన్నది ఈ సందర్భంలో గమనార్హం.


పైగా ఈ తాళిబొట్లు ఉత్తరాదివారికి లేనేలేవు. తలబ్రాలు కూడా లేవు.

దక్షిణాదివారిలోనే ఈ ఆచారాలు.


అంతేకాక ఈ పుస్తె గుండ్రంగా ఉండాలా 

లేక రావాకు ఆకారంలో ఉండాలా 

అని కొన్ని కుటుంబాలలో గుద్దులాటలు కూడా జరుగుతూ ఉంటాయి. 

అరవవారికి ఈ ఆకారం కనపడదు.


మన తెలుగు కవుల కావ్యాల్లోనే 

మంగళసూత్రవ్యవహారం కనబడుతుంది.


"గాంగేయగాత్రి గళమున, మంగళసూత్రంబుఁ గట్టె మాధవసుతుఁ డా"


ఇక పద్యానికి సంబంధించి

ఒకట్రెండు విశేషాలు చెప్తాను.


హాకిమ్ అనే హిందీ పదంనుండి 

ఎకిమీడు పుట్టింది.

యజమాని దాని అర్థం.


ఎకిమీడుని రాజు, శ్రేష్ఠుడు అనే అర్థాల్లో మనవారు ముగ్గురు కవులు వాడారు.


జేజేతుటుములు అనేది 

బహుబాగైన నూతనపదబంధంగా చెప్పవచ్చు.


జేజే అంటే దేవత.

దేవతాసమూహాలు అని అర్థం.


వారు శివుని చేరి కొలిచే బంట్లు 

అని కవి వర్ణన.


తరువాత పద్యాంతచరణద్వయం

"బుధనుతవిలాస! పీఠికాపురనివాస! కుముదహితకోటిసంకాశ! కుక్కుటేశ!"


తిమ్మకవి 

"బుధనుత" ను భూనుత చేసి,


"భూనుతవిలాస! పీఠికాపురనివాస! కుముదహితకోటిసంకాశ! కుక్కుటేశ!"

అని మకుటంగా మార్చుకొని,

కుక్కుటేశ్వరశతకం వ్రాశాడు.


చక్కని తెలుగుతేనెసోన 

లొలుకుతున్న పద్యం.


మంగళం మహత్