9, ఫిబ్రవరి 2023, గురువారం

సుభాషితం

చెలువౌ రత్నఘటంబునం దతఁడు సుశ్రీఖండఖండంబులం

దిలపిణ్యాకము వండె నారుగల కర్థిన్ సప్తపర్ణావృతుల్ 

నిలిపెన్ జిల్లెడుదూదికై పుడమి దున్నెన్ బైఁడినాఁగేళ్ల ని

మ్ములఁ గర్మక్షితిఁ బుట్టి యెవ్వఁడు దపంబుల్ సేయఁ డప్రాజ్ఞతన్


అన్వయం: 

కర్మక్షితిన్ పుట్టి అప్రాజ్ఞతన్ తపంబుల్ ఎవ్వడు చేయడు అతడు

సుశ్రీఖండఖండంబులన్ చెలువౌ రత్నఘటంబునందు తిలపిణ్యాకము వండెన్

అర్థిన్ ఆరుగలకు సప్తపర్ణ ఆవృతుల్ నిలిపెన్

జిల్లెడుదూదికై పైడినాగేళ్లన్ పుడమి దున్నెన్


పైపద్యంలో 

ఇమ్ములన్, చెలువౌ, అర్థిన్ అనేవి పూరణార్థపదాలు.


ఇమ్ములన్=అనుకూలమైన/యుక్తమైన 

ఈ కర్మభూమిలో పుట్టి కూడా అప్రాజ్ఞతతో ఎవడు తపస్సులను చేయడో వాడు,


రత్న(ఖచిత)ఘటమందు(కుండనందు) మంచిగంధపుకట్టెలతో

తెలికపిండిని (గానుగ పిండి) వండే వానితోను,

(మట్టిపాత్ర చాలుగా!)


కప్పురపుటరంటులను కోరి నఱకి, 

ఆరుగలకు (ఒకరకమైన సస్యం/ఆహారధాన్యం, ఆళ్లు, ఆరికెలు అంటారు) కంచె వేసేవాడితోను,

(ముళ్లకొమ్మలు కదా! కావలసినది)


జిల్లేడు(వేఱు అని మూలం) దూది (ఇది పాఠాంతరం)కోసం బంగారునాగళ్లతో భూమిని దున్నేవాడితోను సమానం అవుతాడు.


నా(గ)స్వ(ర)వ్యాఖ్య: 

ఇమ్ములన్ అనే పదాన్ని కవి చక్కగా ప్రయోగించాడు.


చాంద్రాయణాది అన్ని రకాల తపస్సులకు అనుకూలమైన, యోగ్యమైన కర్మభూమి మన భారతదేశం.


అటువంటి భూమిలో పుట్టి ఏది పరమార్థమో తెలుసుకోక, ఆత్మసాక్షాత్కారానికి ప్రయత్నించకుండా అప్రాజ్ఞతతో ప్రవర్తిస్తున్న వారికి ఉపదేశమిది.


అయితే తపస్సు అంటే ముక్కు మూసుకొని చేసేదే కాదు. గీతలో శారీరక వాచిక మానసికాలనే త్రివిధ తపస్సులను పేర్కొన్నారు.


పైన చెప్పినట్లు పనికిమాలిన పనులను చేయకుండా సత్కర్మలు చేయడం కూడా తపస్సే. 


కాన శ్రేయస్సు కోరేవారు సర్వవిధాల సత్కర్మలను అనుష్ఠించాలని, పుణ్యకర్మమే సఫలం కాని అన్యం కాదని భావం. 

మంగళం మహత్ 



కామెంట్‌లు లేవు: