31, మే 2011, మంగళవారం

జీవన్ముక్తి

గోవిందం భజ - 10


సత్సంగత్వే నిస్సంగత్వం

నిస్సంగత్వే నిర్మోహత్వం,

నిర్మోహత్వే నిశ్చలతత్త్వం

నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః . - 9



"సత్" తో సహవాసం కలుగుతూంటే, - సత్సంగత్వం


దేనియందూ ఆసక్తి కలుగని,

ఎవరితోనూ ( పుత్త్రులు, భార్య, మిత్రులు మొదలైనవారితో )

సంబంధం ( Attachment ) కోరని / వద్దనుకొనే స్థితి ఏర్పడుతుంది.

(వారిమీద ప్రీతి వీడుతుంది.) - అదే నిస్సంగత్వం

ఆ ఆసక్తి / బంధం వీడిందా, మోహం ( అజ్ఞానం ) వదలిపోతుంది. - నిర్మోహత్వం

మోహం తొలగిపోతే, నిశ్చలమైన తత్త్వం ( శుధ్ధజ్ఞానం ) లభిస్తుంది. - నిశ్చలతత్త్వం

అది దొరకెనా, బ్రహ్మైక్యం సిద్ధిస్తుంది. - జీవన్ముక్తి



జీవన్ముక్తి అంటే - ఈ శరీరంతో ఉంటూనే బ్రహ్మతో తాదాత్మ్యం పొందటం. /

జీవించి ఉండగానే బంధాలనుండి విడివడటం.

బంధాలనుండి విడివడిన వాడికే బ్రహ్మైక్యం లభిస్తుంది.




నా(గ)స్వ(రం)వ్యాఖ్య: -



ముక్తి అంటే అన్ని బంధాలనుండి విడివడటం.

విముక్తి అన్నమాట.

మనసే అన్ని బంధాలకు కారణం. ఆ విషయాన్ని గ్రహించి, మనసును లొంగదీసి,

ఈ ముక్తిని, జీవించి ఉండగానే సాధించవచ్చంటున్నారు శంకరాచార్యులవారు.

ఎప్పుడు?

స్థిరమైన పరతత్త్వభావంతో మనసును నింపినప్పుడు.

అంటే శ్రేష్ఠమైన పరబ్రహ్మం/పరమాత్మను గురించిన స్థిరమైన చింతనలు మనసు చేస్తున్నప్పుడు.

అటువంటి స్థితి ఎప్పుడు కలుగుతుంది?

అజ్ఞానమూలమైన మోహం పోయిననాడు. ( మోక్షవిషయక బుద్ధిని జ్ఞానం అంటారు.

అది లేకపోవడమే అజ్ఞానం. ఈ అజ్ఞాన స్థితే మోహం.)

అదెప్పుడు పోతుంది?

నిస్సంగత్వం కలిగిననాడు. ( నిస్సంగత్వం అంటే భావంలో వివరించడమైనది.)

నిస్సంగత్వం ఎలా సాధ్యం.?

సత్ సంగత్వంతోనే సాధ్యం.

సత్ అంటే మంచి అని ఒక అర్థం.

మంచి అన్నది ప్రవర్తన ( క్రియాశీలకం ) ద్వారానే తెలుస్తుంది.

జంతువుల్లోనూ కూడా, క్రూరప్రవర్తనను చూపించని వాటిని మంచిజంతువులంటాం కదా!.

అందువలన

సత్+సంగత్వం అంటే " మంచి " అన్నది కలవారితో = సజ్జనులతో కూడిక, కలయిక,

స్నేహం, సహవాసం, మైత్రి వల్ల నిస్సంగత్వం ఏర్పడుతుంది.

సహవాసం చేస్తేనే నిస్సంగులైపోతారా?

ఆ ! వారు సజ్జనులు మాత్రమే కారు.

సత్ = పరబ్రహ్మం ( వేదపరంగా సత్ అంటే పరమాత్మ)తో సంగం, సహవాసం కలవాళ్ళు.

అంటే జ్ఞానులన్నమాట.

అటువంటి వారితో సాహచర్యం చేస్తే,

క్రమక్రమంగా శ్లోకంలో చెప్పబడిన స్థితులను కలుగజేసి,

జీవన్ముక్తులను చేస్తారు.

అటువంటివారిని వెతుక్కొని ఆశ్రయించమని శంకరుల వాక్కు.





ఇంగ్లీషు అనువాదం Sivananda Ashram వారి సౌజన్యంతో.


Through the company of the good, there arises non-attachment;
through non-attachment there arises freedom from delusion;
when there is freedom from delusion, there is the Immutable Reality;
on experiencing the Immutable Reality, there comes the state of ‘liberated-in-life’.




శుభం భూయాత్

28, మే 2011, శనివారం

తత్త్వం

గోవిందం భజ - 9





కా తే కాంతా క స్తే పుత్త్ర

స్సంసారో౭య మతీవ విచిత్ర:,

కస్య త్వం వా కుత ఆయాత:

తత్త్వం చింతయ త దిహ భ్రాత: ( భ్రాంత: ).



" నీకు భార్య ఎవరు? పుత్త్రుడు ఎవరు? ( వారికీ నీకు సంబంధం ఏమిటి? అని.)

నీవు, ఎవనికి చెందినవాడవు? ఎక్కడనుండి వచ్చావు?

ఈ సంసారం మిక్కిలి విచిత్రమైనది.

సోదరుడా! అందువల్ల అసలువిషయాన్ని / నిజాన్ని ( తత్త్వం )విచారించు."
                                                           



భ్రాత: - అనే పాఠం ప్రకారం సోదరుడా! అని.

భ్రాంత: - పాఠం ప్రకారం " పొరపాటు పడ్డావు, నిజం తెలుసుకో " , అని.

లేనిదాన్ని ఉన్నదనుకోవడమే భ్రాంతి.



నా(గ)స్వ(రం)వ్యాఖ్య :-


లోకంలో అత్యంత ప్రియమైన బంధాలు భార్య , పుత్త్రుడు.

అందువల్ల శంకరులు వాటిని పేర్కొన్నారు.

ఎవరు భార్యగా వచ్చేదీ ముందుగా తెలియదు.

అంటే ముందుగా ఏ సంబంధమూ లేదు.

ఇంకా పుత్త్రుని విషయంలో రక్తం పంచుకొని పుడతాడు కాబట్టి, (రక్త)సంబంధం ఉంది.

భార్య విషయంలో ఎలాంటి బంధమూ లేదు.

ఉందనుకోవడం భ్రాంతి మాత్రమే.

జాగ్రత్తగా ఆలోచిస్తే , పుత్త్రుని విషయమూ అంతే.

అయితే లోకం ఎలా నడుస్తోంది? అంటే దాన్నే మాయ అన్నారు.

దాని ముసుగులో లోకం నడుస్తోంది.

అసలు ఇది మాయ చేస్తున్న మాయ అని కూడా తెలియకుండానే,

దారి ( పరమపథం ) తెలుసుకోకుండానే ,

ప్రపంచం పరుగెడుతోంది.

ఈ మాయను గుర్తించినవారిని జ్ఞానులు అని విజ్ఞులు అంటారు.

అటువంటి జ్ఞానులు, తాము తెలుసుకొని, పాపం మనకు వివరించడానికి ప్రయత్నిస్తారు.

కానీ ఆ సమయంలో ఎందుకో వాళ్ళు మనకు పిచ్చివాళ్ళల్లా అనిపిస్తారు. కనిపిస్తారు.

దాంతో మనం పట్టించుకోం.

"నేను అంటే ఎవరు? వచ్చింది ఎక్కడి నుంచి?" అని తెలుసుకోమంటారు వాళ్ళు .

"ఈ సంసారం చిత్రాతిచిత్రమైంది. తెలుసుకో" అని కూడా అంటారు.

సంసారం మీద ఒకసారి ఇష్టం ఒకసారి రోత కలుగుతూంటే విచిత్రం కాక మరేమిటి?

ఇలాంటి మాయాసంసారంలో పడి,

నేను, నాది, నావాళ్ళు, అని అహంకార మమకారాలతో దేవులాడక,

సన్మార్గాన్ని వెతుక్కోమని సద్గురువైన శంకరుల వాణి.

మరచిపోకండి.

ఏ సంబంధమూ లేదన్నారు కదాని,

అవసరం నెఱవేఱడం కోసం , భార్యాబిడ్డలతో " ఏమిటి సంబంధం? ఎవరికి ఎవరు" అనకూడదు.

అదే అపార్థం చేసుకోవడమంటే.

మెట్టవేదాంతం అంటారు దాన్ని.

బంధం ఉంది లేకపోలేదు. అయితే ,

సంబంధం యొక్క పరిధి బాధ్యతలు నెరవేర్చడం వరకూ అని గుర్తించాలి .

పిచ్చి ప్రేమలు ఉంటే తుంచుకోవడం కోసం ఈ ఉపదేశం అని గ్రహించాలి.




ఇంగ్లీష్ అనువాదం Sivananda Ashram వారి సౌజన్యంతో.


Who is your wife? Who is your son?

Supremely wonderful indeed is this samsara.

Of whom are you? From where have you come?

O brother, think of that Truth here.



శుభం భూయాత్

27, మే 2011, శుక్రవారం

క్రీడ , తరుణి , చింత

గోవిందం భజ - 8


బాల స్తావ త్క్రీడా సక్త:

స్తరుణ స్తావ త్తరుణీసక్త:,

వృద్ధ స్తావ చ్చింతాసక్త:

పరమే బ్రహ్మణి కో౭పి న సక్త:. 7



" ( వ్యక్తి ),

బాలునిగా ఉన్నంత వరకు ఆటలందు ,

వయసులో ఉన్నప్పుడు యువతులయందు,

వయసుడిగినప్పుడు సంసారవిషయ చింతలందు (ఆ) సక్తుడై ఉంటాడు.

(కానీ) పరాత్పరమైన పరమాత్మయందు జిజ్ఞాస కలవాడు ఎవడూ లేడు".



జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనే ఆసక్తి.



నా(గ)స్వ(రం)వ్యాఖ్య :-



మనిషి ,

బాల్యంలో ఆటపాటల్లో మునిగిపోయి ఉంటాడు.

పరమాత్మను గురించిన ఆలోచనే రాదు.

వయసు వచ్చే నాటికి కొంత తెలుస్తుంది కానీ ,

కండ్లకెదురు పడిన ఆడపిల్లలు , తోచనివ్వరు తొణగనివ్వరు.

పెండ్లి మీదకు, పెండ్లాం మీదకు మనసు పోతుంది.

అయితే, ఏ వయస్సులో జరగవలసిన ముచ్చట ఆ వయసులో జరగాలంటారా !

నిజమే.

ప్రతిఒక్కరూ తమ సంతానం ద్వారా వంశాభివృద్ధి కలగాలని కోరుకుంటారు .

సహజం . తద్ద్వారా లోకానికి కూడా ఉనికి ఏర్పడుతుంది.

అయితే సంసారమనే ఊబిలోకి దిగబడిపోయాక ,

పిల్లల ఉద్యోగాలు , వివాహాలు వగైరాలతో సతమవుతారు.

మరి బాధ్యతలను నిర్వహించావద్దా? అంటారా !

సరే ,

అయితే ఆ తపన, సంతానం ప్రయోజకులయ్యేవరకే ఉండాలి.

ఆ తరవాత కూడా తాపత్రయపడడం ఎంతవరకు సబబు.?

ముసలితనం వచ్చిన తర్వాతైనా ఊరుకోక ,

మనవళ్ళ మురిపాలు ముచ్చట్లు గొడవలు గోష్ఠులు కూడా తమకే కావాలని ,

తమ సలహాలు తీసుకోవాలని , తీసుకోవటం లేదనీ, అదనీ, ఇదనీ ....

ఇదెంతవరకు సమంజసం?

ఇలాంటి చింతల్లో మునిగిపోయి, ఊపిరాడక, ఉక్కిరిబిక్కిరి అయ్యి , ఉసూరుమంటూ,

అదిలేదు ఇదిలేదు అనే బాదరబందితో బ్రతుకుతుంటారే కానీ,

బ్రహ్మ గురించిన ఆలోచనలు చేయరు. నాలుగవ పురుషార్థాన్ని గురించి ఆలోచించరు.


ధర్మ అర్థ కామ మోక్షాలు చతుర్విధ పురుషార్థాలు.

ప్రతి వ్యక్తీ తప్పనిసరిగా సంపాదించవలసినవి.

అర్థాన్నీ, కామాన్నీ ధర్మయుక్తంగా సంపాదించాలి.

మోక్షాన్నీ అంతే. ధర్మయుతంగానే పొందాలి.

కానీ అందరూ ప్రయత్నించి, పొంది , ఆగిపోయేది అర్థకామాలవరకే.

మొదటిదాన్ని, చివరిదాన్ని పట్టించుకొనేవారు అరుదు.

ప్రతిదీ ధర్మం ప్రకారం అని తెలియచేయడానికే ధర్మానికి మొదటి స్థానం ఇచ్చారు.


ధర్మం

ధర్మ అర్థం

ధర్మ కామం

ధర్మ మోక్షం

వరుసగా మనిషి సాధించాలి .


ఆయా వయస్సులయొక్క అవస్థలనుబట్టి, విషయలోలురై ఉంటారే

కానీ ఒకడైనా బ్రహ్మవిచారం చేసేవాడు లేడని శంకరుల చింత.( బాధ )


కానీ,


కనీసం ముసలితనంలోనైనా పరమాత్మచింత , మోక్షచింత ,

ఎవరూ కూడా చేయటం లేదని, నా(గ)స్వ(రం) చింత( ఆలోచన ).






ఇంగ్లీషు అనువాదం. Sivananda Ashram వారి సౌజన్యంతో.


So long as one is in one’s boyhood, one is attached to play,
so long as one is in youth, one is attached to one’s own young woman;
so long as one is in old age, one is attached to anxiety,
yet no one, alas to the Supreme Brahman, is ever seen attached.


శుభం భూయాత్

26, మే 2011, గురువారం

అర్థం, అనర్థం

గోవిందం భజ - 7




అర్థ మనర్థం భావయ నిత్యం నాస్తి తత స్సుఖ లేశ స్సత్యం ,

పుత్రాదపి ధనభాజాం భీతి స్సర్వ త్రైషా విహితా రీతి:. 6




" అర్థాన్ని అనర్థంగా నిత్యం భావించు.

ఆ ధనంవలన సుఖం కొంచెం కూడా లేదు. నిజం.

ధనం దాచుకొన్నవారికి పుత్త్రుని వలన కూడా భయమే.

లోకమంతా ఇంతే. "


అర్థం అంటే సంపద.

అనర్థం అంటే ప్రయోజనం లేనిది. కీడు అని కూడా అర్థం.


నా(గ)స్వ(రం)వ్యాఖ్య :-


సంపద లోకి

డబ్బు, నగలు, భవంతులు, పొలాలు, వాహనాలు, వస్తువులు, వస్త్రాలు, పశువులు

మొదలైనవన్నీ వస్తాయి.

ఇవన్నీ ఉంటే సుఖం అని అందరి భావన.

కానీ ఇది భ్రాంతి మాత్రమే.

వాటివల్ల బాధలు ఎక్కువ. సుఖాలు తక్కువ.

సంపూర్ణ సుఖాన్నే సుఖం అనాలి.

డబ్బుతో సుఖాన్ని అనుభవిస్తున్నా, డబ్బు కర్చు అవుతున్నదనుకొంటూ అనుభవించేది ఎలాంటి సుఖం?

సరదాగా విహారయాత్రలు చెయ్యకపోతే జీవితం బోరు కొట్టెయ్యదూ! అని

విహరించి వచ్చాక , లెక్కలు చూసుకోవడం, బాగానే ఖర్చయ్యిందే! అనుకోవడం అసంపూర్ణ సుఖం .

ఇక నగలు, బీరువాలోంచి తీసి , ధరించి, దాని ప్రయోజనం నేరవేరాక , మరల బీరువాలో పెట్టేదాకా

కొంచెమైనా టెన్షన్ ఉండదంటారా?

పొలాలు, ఇండ్ల స్థలాలు , ఎవడు ఆక్రమిస్తాడో అని , సేకరణ, విస్తరణ ల్లోకి రాదు కదా ! అని

అప్పుడప్పుడైనా అనుకోని ఆ(భూ)సామి ఉండడు కదా!

అలాగే వస్తువులు, వస్త్రాలు, వాహనాలు అన్నీ పాడవుతాయనే అనుకొంటూ వాడడం మానవ నైజం.

(వాటి ఖరీదు ఎక్కువైన కొద్దీ భయం, బాధ కూడా ఎక్కువవుతూంటుంది.)


ఇలా మిగిలినవాటిని గ్రహించాలి.


పైగా పైవాటిని సంపాదించడం , దాచడం, ఈ రెండింటిలో బాధే కాక ఏది పోయినా రెట్టింపు బాధ.

ఇక సుఖం ఏమిటి ? చెప్పండి.

భార్య , సంతానం కూడా సంపదే.

వారి వల్ల కేవలం సుఖాలు మాత్రమే ఉండవు. అని అనుభవజ్ఞులు చెప్తారు.

ఇలా సంపద వల్ల సుఖాలు సమకూరతాయి అని అనుకొంటూ ఉండడమే తప్ప

(దీన్నే ఆభాససుఖం అంటారు.)

నిజమైన సంపూర్ణ సుఖం ఉండదన్నది ఆది శంకరుల ఉపదేశం.

దీన్నే ఆయన అనర్థం అన్నారు.

ఇక, అదే సంపద వల్ల హాని కూడా కలుగుతుంది.

లోకంలో జరిగే హత్యలకు  కాంతాకనకాలే కారణాలు - ఆ తర్వాతే మిగిలినవి.

ధనం దాచినవారికి పుత్త్రుని వల్ల కూడా బాధలేనట.

ఖర్చులకు అడుగుతాడని. డబ్బు మిగల్చడని.

లోకమంతా ఈ విధంగానే ఉంది అంటారు శంకరులు .

నిజానికి చలామణిలో ఉన్న డబ్బు ముందు తండ్రి, కొడుకు, భార్య, తమ్ముడు, అన్న, అమ్మ,

మొదలైన మానవ సంబంధాలన్నీ చెల్లనివి.

అయితే సంసారికి డబ్బు అక్కరలేదా అంటే కావాలి. సంసారం నడవడానికి కావాలి.


అయితే సంపాదనలో ఋజువర్తన ఉండాలి.
 

నీరు నిలువ ఉంటే తయారైన బురదలో ఉద్భవిస్తుంది కమలం. 

అందులో కొలువై ఉంటుంది లక్ష్మి.

అందుకే ఆపెను కమలాలయ అన్నారు.

ఇది పురాణోక్తి. 

భూమిపై ఎన్నో పూలచెట్లుండగా

కమల, కమలాన్నే నివాసంగా ఎంచుకోవడంలో ఉద్దేశ్యం ఏమిటి? అని ఆలోచిస్తే

ఇది ఒక ప్రతీకాత్మకమైన విషయం అని తెలుస్తుంది.

మనచుట్టూ బురద ఉన్నా,

మనలో ఎంత కళంకం ఉన్నా,

కమలం లాంటి ఒక్క గుణం ఉంటే

మనల్ని కమల ఆశ్రయించుకొని ఉంటుంది.

అయితే ఏ అత్యుత్తమ గుణం అన్ని గుణాలను కలిగి ఉంటుంది అని పరిశోధిస్తే 
 
సత్యగుణమే సకలగుణాలకు ఆలవాలం అని తెలుస్తుంది.

ఇక్కడ సత్యాన్ని కేవలం వాక్కులో మాత్రమే కాదు

అన్నిటా అంటే దైహిక మానసికమైన అన్ని వర్తనల్లోనూ అన్వయింపజేయాలి.

ఋజువర్తన అంటారు దీన్ని.

అపుడు లక్ష్మీప్రసన్నత లభిస్తుంది.

పంకాన్ని కమలం ప్రకాశింపజేసినట్లు,

సంసారపంకాన్ని కమలానుగ్రహంతో పరిమళింపజేయొచ్చు.

అందువల్ల ఋజువర్తన ఉంటేనే ఆ ధనం యోగమవుతుంది. భోగానికి అనుకూలమవుతుంది.

అటువంటి ధనం మోహాన్ని కలిగించదు.

ఇలా లేకుండా


డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చినంత కాలం అనర్థాలు తప్పవు .

అనురాగం, ఆప్యాయత, అభిమానం , ఇవి నిజమైన అర్థాలు .

వీటితో కూడిన "ఈ" అర్థం సదర్థం (సత్ + అర్థం ) అని,

"ఆ" అర్థం, అనర్థం అని, నిత్యం, సదా,ఎల్లప్పుడూ, నిచ్చలు, సతతం భావన చేస్తూండాలి .




అని భావన చేస్తూంటే, అప్పుడు మనసు తేలిక పడుతుంది.

భగవానుని మీదకు మళ్లుతుంది.


ఇంగ్లీషు అనువాదం. Sivananda Ashram వారి సౌజన్యంతో.

‘Wealth is calamitous’, thus reflect constantly:
the truth is that there is no happiness at all to be got from it.
To the rich, there is fear even from his own son.
This is the way with wealth everywhere.


శుభం భూయాత్

19, మే 2011, గురువారం

కళ్లు తెరువరా ! .....

గోవిందం భజ - 6


యావ త్పవనో నివసతి దేహే

తావ త్పృచ్ఛతి కుశలం గేహే,

గతవతి వాయౌ దేహాపాయే

భార్యా బిభ్యతి తస్మి న్కాయే. 5



" ఎంతవరకు ప్రాణవాయువు శరీరమందుంటుందో,

అంతవరకు ఇంట్లో జనం కుశలం అడుగుతూంటారు.

ప్రాణం పోయి, దేహానికి అపాయం కలుగగానే,

ఆ శరీరం అంటే అంతకుముందు ఎంతో ప్రీతి కల పెండ్లాం కూడా భయపడుతుంది."




నా(గ)స్వ(రం)వ్యాఖ్య :-




ఎలాంటివారికైనా సరే

ఒళ్లు జలదరిస్తుంది.

ఈ శ్లోకభావం అర్థం కాగానే.



ఒంట్లో ప్రాణం ఉన్నంతవరకే

ఇంట్లో కుశలం అడిగేది.

అది కాస్తా ఎగిరిపోయాక,

కట్టుకొన్న ,

( బ్రతికి ఉండగా ) కావలసినప్పుడల్లా ఒంటికి చుట్టుకొని, ముద్దులాడిన

( ఆ వ్యక్తి )భార్యకూడా, ప్రాణం లేని తన భర్త శరీరాన్ని చూడ్డానికే భయపడుతుంది.



ఇంత భయంకరంగా ఎందుకు చెప్పారంటే,

మరి అంతే తీవ్రంగా మమకారం మరుగుతోందిగా !

రోగాన్ని బట్టి మందు డోసు పెంచి ఇవ్వాలిగా !

తీవ్రమైన పనికిమాలిన వాంఛలతో

అల్లకల్లోలమైన సంద్రంలా ఉన్న మనసును

ఇలాంటి తత్త్వబోధలే ప్రశాంతపరుస్తాయి.

మనసును అదుపులో ఉంచుతాయి. కళ్లెం వేస్తాయి. వెనక్కు లాగుతాయి.

మనసు గురించి ముందు చెప్పుకొన్నాం కోతి లాంటిదని.

కోతి, శాఖాచంక్రమణం చేసినట్లుగా మనసు కూడా పరిపరివిధాల పరుగెత్తుతూంటుంది.

పట్టపగ్గాల్లేకుండా పరుగెడుతున్నప్పుడు, ( అధర్మంగా )

ఇలాంటి వేదాంతబోధలు అడ్డుకట్టల్లా మారి, ధర్మంవైపు త్రిప్పుతాయి.

చాలు. ఇంకొద్దు. ఈ పాట వినండి.






ఇంగ్లీషు అనువాదం. Sivananda Ashram వారి సౌజన్యంతో.

As long as there dwells breath in the body,
so long they enquire of your welfare at home.
Once the breath leaves, the body decays,
even the wife fears that very same body.


శుభం భూయాత్

18, మే 2011, బుధవారం

తల్లిదండ్రులంటే భక్తి కలవారికోసం

గోవిందం భజ - 5


యావ ద్విత్తోపార్జనసక్త స్తావన్నిజపరివారో రక్తః,

పశ్చాజ్జీవతి జర్ఝరదేహే వార్తాం కో౭పి న పృచ్ఛతి గేహే. 4



( వ్యక్తి )

ఎంతవరకు ధనాన్ని సంపాదించడానికి ( ఆ ) సక్తుడై ఉంటాడో,

అంతవరకు అతని కుటుంబంలోని పరివారం, అతనిమీద ( అను ) రక్తులై ఉంటారు.

తర్వాత వయసు మీద పడి, ( ముసలివాడై, ) సంపాదించలేనినాడు,

తన ఇంట్లో ఒక్కడు కూడా కనీసం " ఎలా ఉన్నావు ? " అని అడగడు.



సక్తుడు అంటే తగులుకొన్న మనసు కలవాడు. దేనిమీద ? ధనసంపాదనమీద.

రక్తులు అంటే అనురాగం అనగా ప్రేమ కలవాళ్లు.

ధనికకుటుంబంలో సేవకులు, డ్రైవర్లు ఇత్యాదులు కూడా పరివారంలోకే వస్తారు.

పైన చెప్పిన సేవకాదులు యజమానివద్ద ధనం లేదని తెలిసిననాడు దూరమవుతారు.

కుక్క తప్ప. కుక్క విశ్వాసం గల జంతువు. దానికి యజమాని సంపాదనతో పనిలేదు.


నా(గ)స్వ(రం)వ్యాఖ్య :-



పరమసత్యం కదూ! ఆదిశంకరుల వాక్కులు.

పూర్వపు సాంఘిక పరిస్థితులనుబట్టి సంపాదించేవాడు మగవాడు.

కాబట్టి అతడి పరంగా చెప్పబడింది. స్త్రీకి ఇంట్లో చాకిరీ.

సంపాదిస్తున్నంతకాలం భర్తను, భార్య గౌరవిస్తుంది.

ఎనలేని ప్రేమ కురిపిస్తుంది.

ఆర్జించలేడని తెలిసిన తరువాత ఆ గౌరవం ఆ ప్రేమ కాగడా పెట్టి వెతికినా

ఆమె మొహంలో కానీ చేతల్లో కానీ కనిపించవు.

భర్తా అంతే. ఆమెనుండి, చాకిరీకి ఓపిక అనే సంపాదన ఉన్ననాళ్లు ప్రేమ నటిస్తాడు.

కొడుకులూ కూతుళ్లూ తండ్రినుండి సంపాదన కోరతారు.

తల్లినుండి సేవలు కోరతారు.

సంపాదించి ఇస్తేనే సంతానం తండ్రిని, గౌరవించేది.

ఇలా కుటుంబంలో పరస్పరం ఏదో ఒకటి ఆశిస్తూనే కలసి ఉంటారు కానీ

పరస్పరాప్యాయతతో కాదు. (90%) ఇది సత్యం.

చిన్నప్పటినుండి, దానిని కడిగించుకోవడంతో సహా

తల్లితో అన్ని సేవలూ చేయించుకొన్న కొడుకు,

ఆమె ముదుసలి అయ్యాక, తల్లికి తప్పక చేసినా ఋణం తీరని సేవల్ని

తాను చేయడు. పెండ్లాం చేత చేయించడు. ( చేయించలేడు ).

" అన్నంలోకి కూర వండి పెట్టలేదని ఓ ప్రబుద్ధుడు , కన్నతల్లిని కడతేర్చాడు. "

ఇది ఓ వార్తాపత్రికలో కొన్నిరోజుల క్రితం వచ్చిన ఓ వార్త .

కడతేర్చనక్కరలేదు. తల్లికి గౌరవం ఇవ్వకపోతే,

ఆ విషయం ఆమె గుర్తిస్తే, అది ఆమెకు చావులాంటిదే.

కొడుకు మానసికంగా చంపినా,

మనవళ్లు మనవరాళ్ల మీద ప్రేమ చంపుకోలేక ఏదో బ్రతుకుతుందంతే ఆ తల్లి.

రిటైరై, పెన్షన్ వస్తున్నవాళ్లు నయమేమో గాని,

వయసుడిగిపోయి, సంపాదించలేక, చాకిరీ చేయలేక,

ఇంట్లో వాళ్ల సూటిపోటి ఈటెల్లాంటి మాటలు భరించలేక,

చావురాక, చావలేక, దీనంగా, కొడుకైనప్పటికీ పరాయిపంచన బ్రతుకుతున్నట్లుగా

బ్రతికుండి బ్రతకలేక ప్రాణమున్నశవాల్లా సొంతదైనా తమది కాని తమ ఇంట్లో

స్వేచ్ఛలేక ఓ మూలన పడి ఉండే ముసలి తల్లిదండ్రులు ఎంతమందో?

నిజంగా ఆలోచిస్తే, కళ్లు చెమరిస్తాయి.

మళ్లీ, తల్లిదండ్రుల పట్ల తమలా, తమ సంతానం తమ పట్ల తయారైనప్పుడు,




అని పాడాలి. గుండె బరువెక్కిందా? రిలాక్స్ అవుతారా?

ఎలాగూ తల్లిదండ్రుల ప్రసక్తి వచ్చింది కాబట్టి వారి మీద కొన్ని చక్కని అనురాగ భక్తి గీతాలు.















కొన్ని విషయాలు.

సంధ్యావందన పూజాదులు నిర్వహించే, సాంప్రదాయికులు

మొదట తండ్రికి తల్లికి నమస్కరించి, గణేశప్రార్థన చేస్తారు.


తల్లిదండ్రులంటే భక్తి కలవారికోసం

ఆ శ్లోకాలు.

ఏతత్పార్థివదేహః ప్రాదురభూద్యేన భగవతా గురుణా,

సంతునమాంసి సహస్రం తస్మై సర్వజ్ఞ మూర్తయే పిత్రే.. 1



తనురిద మభివృద్ధిం సమవాప్యాస్తే సర్వదేవతా శక్త్యా,

దేవ్యాయయా వికలయా మాత్రే తస్యై నమో౭స్తు భగవత్యై. 2


ఇలా తల్లిదండ్రులను సేవించి, పూజించి,

ఇంతవరకు తల్లినుండి తండ్రినుండి తీసుకొన్నది చాలని

ఇక వారినుండి ఏమీ ఆశించని వాళ్లు,

వారి గొప్ప గుణాలను గ్రహించాలి తప్ప

ఇంకా ఇంకా వారిని దోచేయడం సరి కాదని గ్రహించిన వాళ్లు నిజమైన సంతానం.


మానవసంబంధాలకు విలువ ఇవ్వక,

ధనమూల మిదం జగత్ అని నమ్మినందువల్ల

డబ్బుకు లోకం దాసో౭హం అంటోంది.

శివుడే లోకం శివో౭హం అన్ననాడు మనిషి మనిషవుతాడు.

ఈ భావన ఉన్ననాడు ప్రతి వ్యక్తి తన కుటుంబాన్నే కాదు,

విశ్వాన్నే తన కుటుంబంగా ప్రేమిస్తాడు. గౌరవిస్తాడు. అని శంకరభగవత్పాదులవారి బోధ.


ఇంగ్లీషు అనువాదం. Sivananda Ashram వారి సౌజన్యంతో.


As long as there is the ability to earn and save,
so long are all your dependants attached to you.
Later on, when you come tolive with an old, infirm body,
no one at home cares to speak even a word with you!!






శుభం భూయాత్

17, మే 2011, మంగళవారం

మిమ్మల్ని బెదరగొట్టడానికి కాదు

గోవిందం భజ - 4


నళినీదళగతజల మతితరళం

తద్వ జ్జీవిత మతిశయచపలం,

విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం

లోకం శోకహతం చ సమస్తం. 3



" తామరాకుమీది కదలిపోతూండే నీరులా ( తామరాకు మీద నీరు నిశ్చలంగా ఉండదు.)

జీవితం ( ప్రాణం ) కూడా నిలుకడ లేనిది.

సమస్తమైన ఈ లోకమంతా -

రోగాలు, (దేహ) అభిమానం, శోకం వీనితో కూడినదిగా, తెలుసుకో.



నా(గ)స్వ(రం)వ్యాఖ్య :-


సిద్ధార్థుడు, తండ్రి శుద్ధోధనునివల్ల ఆనందకరలోకాన్నే చూశాడు మొదట.

తర్వాత రోగాభిమానశోకలోకం చూసి,

విరక్తుడయ్యాడు.

తపస్సు చేసి, బుద్ధుడయ్యి, శోకానికి కారణం కోరిక అన్నాడు.

ఆ కోరికే రోగాల్ని, శోకాల్ని, కలుగచేస్తుంది. అభిమానాన్నీ పెంచుతుంది.

అభిమానాన్ని విడచి,

భగవంతునికి శరణంటేనే ఆత్మసాక్షాత్కారం అంటుంది వేదాంతం.

ఎవరిని ఆశ్రయిస్తే, రోగ శోక అభిమానాలు దూరమవుతాయో,

అట్టి పరమాత్మను ఆశ్రయించమని, పై శ్లోకంలో పరోక్షబోధ.




ప్రియమైన పాఠకులారా !

వైరాగ్యం మోతాదు ఎక్కువైనట్లుంది. కానీ

మిమ్మల్ని బెదరగొట్టడానికో

జీవితంమీద విరక్తి పెంచి, జీవితమాధుర్యాన్ని పోగొట్టడానికో ఇది వ్రాయటంలేదు.

చదివినంతసేపు విన్నంతసేపు నిజమే, పాడుజీవితం ! అనిపించినా,

మళ్లీ మామూలైపొండి.

మనసు మీ అదుపులో లేనప్పుడు, అప్పుడు,

మళ్లీ గోవిందం భజ చదవండి.

మనసును కంట్రోల్ చేసుకోవడానికి భజగోవిందాన్ని ఒక సాధనంగా చేసుకోండి.


ఇంగ్లీషు అనువాదం. Sivananda Ashram వారి సౌజన్యంతో.

The water drop playing on a lotus petal has an extremely uncertain existence;
so also is life ever unstable.
Understand, the very world is consumed by disease and conceit,
and is riddled with pangs.




శుభం భూయాత్

16, మే 2011, సోమవారం

నారీ స్తన భర నాభీ దేశం

నారీస్తనభరనాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం,

ఏత న్మాంసవసాదివికారం మనసి విచింతయ వారం వారం. 2




" ఆడుదాని వక్షస్థలాన్ని, బొడ్డు ( ఉన్న ప్రదేశము ) ను, చూసి, మోహావేశాన్ని పొందకు.

దీనిని, మాంసం, క్రొవ్వు మొదలైనవాటి వికారంగా మనసులో మాటిమాటికి చింతించు.

( భావించు )".



నా(గ)స్వ(రం)వ్యాఖ్య :-




ఈ శ్లోకం, స్త్రీపురుషుల కామానికి సంబంధించినది.

( అసలు, కామం అంటే కోరిక. ఒక లడ్డు తినాలనుకోవడం కూడా కామమే.)

ఇందులో, స్త్రీలను చూసి, కామమోహావేశం తెచ్చుకోవద్దని చెప్పబడింది.

అదేమిటండి ? స్త్రీలకు కామం ఉండదా?

పైగా స్త్రీలకు కామం అధికం అన్నారుగా! అంటారా?

అన్నది నిజమే, కానీ ఈ విషయం అర్థం చేసుకోవడంలో లోపం. అంతే.

అసలు విషయం ఏమిటంటే,

మగవాడు, త్వరగా ఆవేశపడి, అంతే త్వరగా చల్లారిపోతాడు.

స్త్రీ అలా కాదు. నెమ్మదిగా తారాస్థాయికి వెళ్ళి, మళ్లీ నెమ్మదిగా నెమ్మదిస్తుంది.

అంత సేపు ఆవిడ అలా ఎంజాయ్ చేయడాన్ని చూసి,

కుళ్లుకొన్న ఏ మగాడో వ్రాసిన వ్రాత అది. అతి కామం అంటే వాడి దృష్టిలో అది.

అసలు నిజానికి అతికామం అన్నది ఒక రోగం.

వైద్య పరిభాషలో దానికి Nymphomania అని పేరు. అందువల్ల

.....,... చూడగానే ఆవేశపడేది మగవాడే.

అందువల్ల అతడికే వైరాగ్యసాధన చెప్పబడింది.

( నిజానికి ఆడువారి క్షేమం కోసమే మగాళ్లకు వైరాగ్యసాధన చెప్పబడిందేమో! )

.....,... చూస్తూ ఆవేశపడితే,

( నిజానికి ఈస్ట్రొజెన్ హార్మోన్ వల్ల వచ్చిన నునుపే ఆ ఆకర్షణకు కారణం.

దాని ప్రభావం తగ్గగానే, ఆడదానిమీద మగాడి ఆ వెంపర్లాటా తగ్గిపోతుంది.)

అప్పుడు " ఛీ, వాటిలో ఏముంది? మాంసం, క్రొవ్వు, నెత్తురు, తప్ప. అని

చూసినప్పుడల్లా పదే పదే మాటి మాటికి మనసులో భావిస్తూండాలి.

ఇదే అభ్యాసం - practice.

అప్పుడు విరక్తి కలుగుతుంది. ఇది వైరాగ్యం.

కామార్తులకు ఎవరికైనా వైరాగ్యం అవసరమే. స్త్రీపురుషభేదం లేదు.

రక్తప్రవాహపువేడి తగ్గగానే పుట్టేది వైరాగ్యమే.

అయితే అప్పుడు కాదు. ముందే సాధించాలి.


కామానికి పూర్తిగా కారణభూతమైనది మనసు. దీన్ని అరికట్టాలి.

అయితే చెప్పుకొన్నంత తేలిక కాదు మనసును లొంగదీయడం.

అందుకే అర్జునుడు, మనందరి తరఫున భగవానునితో,


" చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్దృఢం,

తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం".



" ఈ మనస్సు మిక్కిలి చంచలమైనది. బాగా మథించే స్వభావం కలది. దృఢమైనది.

మిక్కిలి బలీయమైనది. కనుక దాన్ని నిగ్రహించడం గాలిని ఆపడంలా చాల దుష్కరంగా

భావిస్తున్నాను " . అని అంటే,



జగద్గురువైన కృష్ణుడు,



" అసంశయం మహాబాహో! మనో దుర్నిగ్రహం చలం,

అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే."





" ఓ మహాబాహూ! నిస్సందేహంగా మనస్సు చంచలమైనదే.

దాన్ని వశపరచుకోవడం మహా కష్టం. కాని, అర్జునా!

1. అభ్యాసం 2. వైరాగ్యం అనే రెండింటిద్వారా దాన్ని వశం చేసుకోవడం

సాధ్యమే." అని చెప్పడం జరిగింది.



అభ్యాసం అంటే practice.

రాగం ( అంటే రక్తి, అనురాగం ) లేకపోవడమే విరాగం. దాని భావమే వైరాగ్యం.


పోతన, ప్రహ్లాదుని గుణాలు చెప్తూ,

" కన్నుదోయికి నన్యకాంతలడ్డంబైన మాతృభావన సేసి, మరలువాడు " అని వర్ణిస్తాడు.

తన భార్య కాక ఇతరులు అన్యకాంతలు.

వారి పట్ల మాతృభావన అనేది గొప్ప భావన. ఇది కేవలం భారతీయ సంస్కృతి.

దీన్ని సాధించిన వాడు నిజమైన మగవాడు.

ఆడువారి పాలిటి నిజమైన రక్షకుడు.


భక్తతుకారాం బోధ వినండి.



ఇపుడు చక్రధారి వైరాగ్యం వినండి.



ఇంగ్లీషు అనువాదం. Sivananda Ashram వారి సౌజన్యంతో.

Seeing the full bosom of young maidens and their navel,
do not fall a prey to maddening delusion.
This is but a modification of flesh and fat.
Think well thus in your mind again and again.



శుభం భూయాత్

15, మే 2011, ఆదివారం

కురు సద్బుద్ధిం

మూఢ జహీహి ధనాగమతృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం,

య ల్లభసే నిజకర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం. 1






ఓ మూఢా!, ( తెలివిలేనివాడా! ) ధనసంపాదనలోని ఆశను వదలు.

మనసులో ఆశలేని మంచి ఆలోచనను చెయ్యి.

నీవు చేసిన పనిని బట్టి, నీకు ఎంత ధనం లభిస్తుందో

అంత ధనంతోనే నీ మనసును తృప్తిపరచు.



నా(గ)స్వ(రం)వ్యాఖ్య:-



ఎక్కువ ధనం సంపాదించాలనే ఆశను వదలమని బోధ.

అంతేకాని సరిపడినంత ధనసంపాదన గురించి కాదు.

చిన్నయసూరి, నీతిచంద్రికలోని మిత్రలాభంలో,

మంథరకం అనే తాబేలు, హిరణ్యకం అనే ఎలుకతో,

" బుద్ధిమంతునకు ( సంసారికి ) సర్వదా ధనార్జన మావశ్యకకార్యమే

కాని య(అ)తి సంచయేచ్ఛ ( ఎక్కువ సంపాదించాలనే ఆశ ) తగదు." అంటుంది.

ఇది గ్రహించాలి మనం.

కనుక ఆశ ఉండాలి. అత్యాశ ( ఇదే దురాశగా పరిణమిస్తుంది. ), దురాశ తగనివి.

" ఆశ మనిషికి ఊతమిస్తుంది.
దురాశ నిలువునా పాతేస్తుంది."

ఇక్కడ డబ్బుకు సంబంధించి రెండు అంశాలు ఉన్నాయి.

కాసు కావాలి కావాలి అనేవారు ఒక రకం.

ధనం దాచాలి దాచాలి అనేవారు ఒక రకం. ( లోభత్వం )

రెండూ పనికిరానివి. ఒక కావాలి ఒక దాచాలి మాత్రమే ఉండాలి.



ధనం అన్నది " నిజకర్మోపాత్తం " అంటున్నారు శంకరులు.

దానికి అర్థం - పూర్వం సంపాదించుకొన్న కర్మ అనీ చెప్పవచ్చు.

ఇప్పటి ధనసంపాదనకర్మ అనీ చెప్పవచ్చు.

ఈ రెండింటిని బట్టే మనకు సంప్రాప్తించవలసిన ధనం దొరుకుతుంది కాని అధికం రాదు.

తృష్ణ ఉన్నా అనవసరం. అది దుఃఖానికే దారి తీస్తుంది.

ప్రాప్తిని బట్టి ధనం అన్నదానికి ఏనుగు లక్ష్మణకవి ఈ క్రింది చక్కని పద్యం చూడండి.



" వనజభవుండు, నెన్నొసట వ్రాసిన సొమ్ము ఘనంబొ కొంచెమో

విను, మరుభూమి కేగిన లభించును మేరువు జేరబోయినన్

ధనమధికంబు రాదు. కడు దైన్యము మాను, ధనాఢ్యులందున

వ్వననిధి నూత దుల్యముగ వారి గ్రహించు ఘటంబు సూడుమా!"



బ్రహ్మ, నుదుట వ్రాసినంత ధనం ఎక్కువో తక్కువో బరియల్ గ్రౌండ్ కు వెళ్లినా లభిస్తుంది.

బంగారుపర్వతమైన మేరువును చేరినా, డబ్బు ఎక్కువ రాదు.

కాబట్టి ధనవంతులను చూచి, ఏడవకు.

సముద్రంలోముంచినా నూతిలో ముంచినా, కుండ సమానంగా నీటిని గ్రహిస్తుంది.

అని పై పద్యానికి భావం.




" ఎంత విభవము కలిగె నంతయును నాపదని

చింతించినది కదా! చెడని జీవనము - అని వ్రాస్తూ అన్నమయ్య


పరివోని ఆస తను బట్టుకొను భూతమని

వెరచినది యది కదా! విజ్ఞాన మహిమ " అంటాడు.




ఇంగ్లీషు అనువాదం. Sivananda Ashram వారి సౌజన్యంతో.

O Fool! Give up the thirst to possess wealth.
Create in your mind, devoid of passions,
thoughts of the Reality.
With whatever you get, entertain your mind, be content.



శుభం భూయాత్

14, మే 2011, శనివారం

రిలాక్స్ అవ్వాలంటే ఇలా రండి

గోవిందుని భజించండి.

ప్రార్థన




సంగీతవిద్వన్మణి సుబ్బులక్ష్మిగారి గొంతు అనే తేనెపట్టునుండి తేనెలా జాలువారే

భజగోవిందం వింటూంటే మొన్న ఒకసారి భజగోవిందం గురించి, తెలుసుకోవాలనిపించి,

వివరాలు సేకరించడం జరిగింది. అవి మీతో పంచుకోవాలనిపించింది.

ఈ భజగోవింద స్తోత్రాన్ని శంకరాచార్యులువారు రచించారని లోకవిదితమే కదా!

ఆయన, పద్మపాదుడు మొదలైన శిష్యులతో కలసి, కాశీలో కొంతకాలం గడిపారు.

ఆ కాశీలో, వ్యాకరణశాస్త్రం చదివిన ఒక బ్రాహ్మణుడు, రాత్రీ పగలూ ఆ సూత్రాలను

వల్లెవేస్తూండడాన్ని కొన్ని రోజులపాటు గమనించి చూశారు.

ఒకనాడు, అరుణోదయకాలంలో ఆచార్యులవారు శిష్యులతో కలసి,

గంగాస్నానానికి వెళ్తూండగా, ఆ పండితుడు, " డుకృఞ్ కరణే "

అనే ఒక వ్యాకరణసూత్రాన్ని వల్లె వేస్తున్నాడు.

ఆచార్యులవారు, ఆ పండితుని, ( తద్ద్వారా లోకుల్ని), తరింపజేయాలనే ఉద్దేశ్యంతో,

ఆయన వద్దకు వెళ్లి, ఈ భజగోవిందస్తోత్రాన్ని చెప్పారు.

శంకరుడు చెప్పినవి మొత్తం 12 శ్లోకాలు.

దీనికి " గోవిందద్వాదశమంజరికాస్తోత్రం " అని పేరు.

ఈ శ్లోకాలు చెవుల పడగానే ఆ పండితుడు, శ్రద్ధాళువయ్యాడు.

అప్పుడు, శంకరుని శిష్యులు పద్నాలుగుమంది పద్నాలుగు శ్లోకాలు చెప్పారు.

దీనికి " చతుర్దశమంజరికాస్తోత్రం " అని పేరు.

అప్పటికి ఆ పండితుడు, తెలివి తెచ్చుకొని, శంకరునికి సాష్టాంగం చేశాడు.

అనంతరకాలం గోవిందుని భజించి, కృతార్థుడయ్యాడు.

ఈ శ్లోకాలు ఉపనిషత్సారభూతాలు.

సంస్కృతభాషలో రచింపబడ్డ వీటికి తెలుగుఅనువాదం ఇదిగో చిత్తగించండి.

ఎంతోమందికి ఉపయుక్తం కాగలదు అనే ఆశతో.....


నాగస్వరం.



భజగోవిందం భజగోవిందం భజగోవిందం మూఢమతే,

సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృఞ్ కరణే.

" ఓ మందబుద్ధీ! గోవిందుని భజించు.

( మరణ ) కాలం సన్నిహితమై, సంప్రాప్తించినపుడు,

డుకృఞ్ కరణే ( అనే సూత్రం ) నిన్ను రక్షించదు రక్షించదు.


వినండి

భజగోవిందం -1




నా(గ)స్వ(రం)వ్యాఖ్య:-


" నిత్యం సన్నిహితో మృత్యుః " - మృత్యువు నిత్యం సన్నిహితంగా ఉంటుంది. అందువల్ల

" కలౌ స్మరణాన్ముక్తిః " - ఈ కలుషనిలయ కలియుగంలో భగవన్నామస్మరణే రక్షణ.

" నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణే
రామ హరే కృష్ణహరే తవ నామ వదామి సదా నృహరే."

సంసారాన్ని తరించటానికి నామస్మరణను మించిన ఉపాయాన్ని చూడలేం.

అందువల్ల రామ కృష్ణ నృహరి అని భగవంతుని నామాన్ని సదా పలుకాలి.

" ఇహపరసాధన మిది యొకటే
సహజపు మురారి సంకీర్తనొకటే " అని,

" ఇన్నిట ఇంతట ఇరవొకటే
వెన్నుని నామమే వేదంబాయె " అని

ఇలా ఎన్నో రకాలుగా వేంకటేశుని కీర్తించిన అన్నమయ్య ఈ కీర్తనలను

వినండి.

ఇహపరసాధన




ఇన్నిట ఇంతట




ఇంగ్లీషు అనువాదం. Sivananda Ashram వారి సౌజన్యంతో.

Seek Govinda, Seek Govinda,
Seek Govinda, O Fool!
When the appointed times comes (death),
grammar rules surely will not save you.



శుభం భూయాత్

8, మే 2011, ఆదివారం

క్షీరగంగ అనే బ్లాగ్ లో.......

శ్రీధర్ గారి అనుమతితో


రిటైర్డ్ రైల్వే ప్రిన్సిపల్ అయిన శ్రీధర్ గారు,

" క్షీరగంగ " అనే బ్లాగ్ లో

డిసెంబరు, 29 , 2009 నుండి మే, 3 , 2011 వరకు

హారర్ నుండి హాస్యం దాకా

స్నేహం నుండి మోసం దాకా

ప్రేమ నుండి అనుమానం దాకా

పౌరాణికాల నుండి తాంత్రికం దాకా

ఇంకా ఆచారాలు పూజలు నాటికలు నవలికలు

ఇలా అన్ని విషయాల గురించి, వ్రాశారు.

సింహరాశి మూలాన ఓపిక ఎక్కువ.

అన్నిటి గురించి వ్రాయడం అభినందించదగ్గ విషయం.

పై వాటిని ఇష్టపడేవారు ఈయన బ్లాగ్ ను ఓసారి తెరవండి.

ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్ ( ఆత్మసాక్షాత్కారం)

లాంటి అంశాలు సరిచూసుకోవలసిఉంది. కొన్నిరచనల్లో బిగువు అవసరం అనిపిస్తుంది.

వ్రాసినవన్నీ చదువదగినవిధంగానే ఉన్నాయి. కొన్ని బహుమతులు పొందిన రచనలున్నాయి.

ఇంకా ఆయనవద్ద ఎన్నో విషయాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది.

వీలు వెంబడి వాటితో ఆయన బ్లాగ్ ఇంకా పరిపుష్టమవుతుందని ఆశించవచ్చు.

http://sridhar-ayala.blogspot.com

బ్లాగ్ మిత్రులకు విన్నపం

బ్లాగ్ మిత్రులందరికీ

వందనాల విన్నపం.

కూడలి, సంకలిని, హారం మొదలైన అగ్రిగేటర్లలో

బ్లాగ్ లన్ని చూశాను.

కొన్ని బ్లాగ్ ల పేర్లు ఇంగ్లీషులో ఉన్నాయి.

కన్ఫ్యూజింగ్ క్షమించండి తికమకగా ఉంది.

అందువల్ల బ్లాగ్ పేరును ఇంగ్లీషులో వ్రాసినవారు,

ఇంగ్లీషుపేరే పెట్టినవారు వాటిని తెలుగులో చూపించప్రార్థన.


ఉదా: gurukrupa ను గురుకృప గాను

crossroads ను క్రాస్ రోడ్స్ గాను మార్చ వేడుకోలు.

తర్వాత నేను నాగస్వరం అనే బ్లాగ్ ను కొత్తగా ప్రారంభించాను. నేనూ కొత్తే అనుకోండి.

దీనిలో కొన్ని బాగున్న బ్లాగులను చదివి, చిన్న విశ్లేషణతో నాగస్వరంలో వ్రాయదలచుకొన్నాను.

అంటే బ్లాగర్లకు ప్రచారమాధ్యమంలా నాగస్వరాన్ని ఉపయోగిద్దామని.

కాని అగ్రిగేటర్లు బ్లాగుల్లో విషయాల గురించి direct గాను indirect గాను ఏమీ వ్రాయవద్దంటున్నారు.

నేనేమీ వ్యతిరేకంగా వ్రాయను. బాగున్నవాటినే పేర్కొని బాగున్నాయంటానంతే.

మీ అందరి అనుమతి కోరుతున్నాను.

బహుశా తెలుగు బ్లాగ్ ప్రపంచంలో నా ప్రయత్నం మొదటిదా?

లేక ఎవరైనా ఇలా చేస్తున్నారా?

మీ సమాధానాలను బట్టి ప్రారంభిస్తాను.

మొదట ఇంగ్లీషు పేర్లు మాత్రం మార్చ మనవి.



మీవిధేయ
నాగస్వరం

6, మే 2011, శుక్రవారం

మల్లాది vs ఓ తెలుగు..సా..ఇంజనీరు

కౌముది.నెట్ లో మల్లాది వెంకటకృష్ణమూర్తిగారి అనుభవాల గురించి,

ఓ తెలుగు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సోదరుడు తన బ్లాగ్ లో వెలువరించిన అభిప్రాయాలు

సబబుగానే ఉన్నాయి.

అయితే ఒక పాఠకునిమీద రచయిత ప్రభావం పడుతుందా?

రచయిత సృష్టించిన పాత్రల ప్రభావం పడుతుందా?

ఏది ఎక్కువ.?

రచయితను ప్రక్కన పెడదాం.

ఒక రచనలోని పాత్రలను తీసుకొంటే ,

నవల లాంటి పెద్ద ఇతివృత్తంలో ఎక్కువ పాత్రలు ఉంటాయి.

మరి అన్ని పాత్రల ఇన్ఫ్లుయన్స్ చదివినవారిమీద ఉంటుందంటారా?

మన అభిప్రాయాలకు అభిరుచులకు స్వభావానికి సరిపోలిన పాత్రలు

మనల్ని ఆకర్షిస్తాయి. వారి ప్రభావం మనమీద పడుతుంది.

పాజిటివ్ నెగిటివ్ దృక్పథాలు కలిగిన పాత్రలుంటాయి.

పాజిటివ్ పాత్రలతో గొడవ లేదు. నెగిటివ్ కారెక్టర్స్ తోనే చిక్కు.

సగటు మనిషి మంచి కంటె చెడుకే ప్రభావితుడవుతాడు.

రచయిత అన్నవాడు ఈ రెండురకాల పాత్రలను సృష్టిస్తాడు.

లేకపోతే డ్రామా ఏముంటుంది?

వాల్మీకి రామాయణంలో రామునితో పాటు రావణుడూ ఉన్నాడు.

వ్యాసుని భారతంలో దుర్యోధనునితో పాటు ధర్మరాజూ ఉన్నాడు.

రాముని ధర్మరాజును వదిలేసి, రావణ దుర్యోధనులను అనుసరిస్తామంటే

వ్యాస వాల్మీకులు ఏమి చేయగలరు? తమ పాత్రలను వెనక్కు తీసుకొంటారా?

నిజమే. నిజానికి రావణ దుర్యోధనులే ఎక్కువ సంఘంలో.

కాని లోకాన్ని భయపెట్టిన రావణుడు రాముడంటే భయపడ్డాడు.

దుర్యోధనుని సంగతి తెలుసుగా. విలన్లు ఎంతమంది ఉన్నా వాళ్లను

తలదన్నే హీరో ఉంటాడు.

సారాంశం ఏంటంటే, రచయితలు సృజనకర్తలు. మంచి చెడూ సృష్టిస్తారు.

మనబట్టే వారి రచనలప్రభావం ఉంటుంది.

నవలలని ఏముంది?

పూర్వం కావ్యాలు సృష్టించబడ్డాయి. అప్పటి సాంఘిక పరిస్థితులను బట్టి,

అవి అన్ని ఎక్కువ భాగం శృంగారప్రధానంగా రచించబడ్డాయి.

ఆ రచనలు ఎంతవరకు వెళ్లాయంటే " కావ్యాలాపాంశ్చ వర్జ్యయేత్ "

అనేంతవరకు. అంటే కావ్యాలను వినడం విడిచిపెట్టండి. అని పై ఉక్తికి అర్థం.

మరి ఆ కవులను ఏమనాలి?

నవలల వల్ల మన చదువు

పాడయిందంటే, దానికి కారణం వారేనంటారా? మన తప్పిదం ఏమీ లేదంటారా?

మనం దేనికి ప్రాధాన్యమిచ్చినట్లు? చదువుకా? లేక???????

రచయితల రచనల్లోని ఆదర్శాలు సమాజంలో కనబడకపోతే

సంఘవిద్రోహులుగా మారతారంటారా?

ఒక ఉపాధ్యాయునే తీసుకొందాం.

ఎంతో కొంత సరియైన బోధన చేయకుండా ఉండడు కదా!

మరి ఎంతమంది స్టూడెంట్స్ ఆయన నీతిబోధనను ఒంటబట్టించుకొంటున్నారు.?

శ్రీగరికిపాటివారు మొన్న ఓ ఛానెల్లో తన తెలుగు ఉపాధ్యాయుడు చెప్పిన

ఓ పద్యం వల్ల అవధాని అయ్యానన్నారు.

ఆ పద్యాన్ని తన నలుగురు క్లాస్మేట్స్ తో పంచుకొన్నానన్నారు కూడా.

అయితే ఈయన అవధాని అయారు కానీ మిగిలినవాళ్లు అవ్వలేదు.! ఎందుకని?

ఏవో నాలుగు రాళ్లు సంపాదించుకోవాలని అందరూ చూస్తారు.

రచయితలు అంతే.

అయితే " విశ్వశ్రేయః కావ్యం " అని నన్నయ నుడివినట్లు,

రచయితలకు విశిష్టపవిత్ర జీవనం ఉండాల్సిందే.

సామాజికబాధ్యత కలిగిఉండాల్సిన రచయితలు , ఉపాధ్యాయులు

వీరిద్దరూ త్రికరణశుద్ధిగా ఉండాలి.

అప్పుడు సమాజం వారివల్ల శుద్ధమవుతుంది.

అప్పుడు ఆ రచయితల రచనలు

రామాయణ భారతాల్లా పవిత్రమై శాశ్వతమౌతాయి.

ఆంధ్రసారస్వత పరిషత్తు ఒకప్పటి రథసారథి ( సెక్రటరీ ) అయిన

శ్రీ దేవులపల్లి రామానుజరావుగారు, తమ ఉద్యోగజీవితం ఇచ్చిన

ప్రత్యేక అవకాశాన్ని ఉపయోగించుకొని, రచయితల్ని చదివిపడేశారు.

ఓ సభలో నిర్మొహమాటంగా రచయితల గురించి తన అభిప్రాయాన్ని,

ఇలా చెప్పేశారు కూడా. " రచయితల రచనలకూ వారి నిజ జీవితాలకు పెద్ద

వ్యత్యాసం ఉంది. వారు వ్రాసేదొకటి. చేసేదొకటి. ఇది తగదు." అని.

ఓ తెలుగు ..... ఇంజనీరు సోదరుని అభిప్రాయమూ ఇదే.

ఏకీభవించాల్సిందే. అయితే నేతిబీరకాయలో నెయ్యి వెతకడం అనవసరం. అలాగే

రచనల్లో నీతి మాత్రమే గ్రహించాలి.

ఆ రచనతో ఆ రచయితను పోల్చడం అనవసరం.

ఇది కేవలం నా అభిప్రాయం.

ఎవర్నీ నొప్పించడానికి కాదు. ఒకవేళ నొప్పి కలిగితే క్షంతవ్యుణ్ణి.

చిత్తగించవలెను.

నాగస్వరం.

5, మే 2011, గురువారం

అవార్డు

నేనో గుంపులోగోవిందకవిగాణ్ణి.

కలాన్ని పట్టా. ఈ కొత్త బ్లాగుకోసం.

మరి ఏదో ఒకటి వ్రాయాలిగా.

అందుకే తెగించి అవార్డు మీద ఓ కవిత వ్రాసేశా.

ధైర్యంగా చదవండి. నాది హామీ.


అవార్డు

నిజమైన గుర్తింపు ఒకప్పుడు

ఇప్పుడు...?

అవార్డు వచ్చిందంటే

ఎవరికి ఎందుకు

అని ఆసక్తి ఉండే రోజులు

మళ్లీ వస్తే బాగుండు.

సమర్థతను సరిగా చూసే

సమవర్తులేరీ?

ఒకరికి ప్రోత్సాహం

పదిమందికీ స్పూర్తీ

ఇచ్చే అవార్డు లేవీ?

అసలు

అవార్డొద్దు

అనడమే అవార్డు

వెంపర్లాడకపోవడమే

రివార్డు.


అయిపోయిందండి బాబూ!

ఎలా ఉంది? వ్రాస్తారు కదూ!

లౌక్యానికి మోసానికి తేడా

మొన్నెవరో ఓ బ్లాగుమిత్రుడు లౌక్యానికి మోసానికి తేడా గురించి అడిగారు.

చందమామలో ఒక బేతాళ కథ గుర్తొచ్చింది.

ప్రారంభం సరిగా గుర్తులేదు.

"వరహాలు అనే వ్యక్తి ఒక వడ్డీవ్యాపారికి బాకీ పడ్డాడు.

ఒకసారి ఆ వడ్డీవ్యాపారి బాకీ వసూలుకు వస్తే,

దివాణంలో పనిచేస్తున్న తన బంధువు వాసుదేవుణ్ణి కలుసుకోవడానికి వెళ్తున్నానని,

అతని దగ్గర డబ్బు తెచ్చి, బాకీ తీరుస్తానని వరహాలు అంటాడు.

అప్పుడు వడ్డీవ్యాపారి " ఆ ! వాసుదేవుడు నీకు బంధువా ? చెప్పావు కావేం ?

బాకీ సంగతి తర్వాత చూసుకోవచ్చు. మీ బంధువుకు చెప్పి ,

నా బావమరిదికి దివాణంలో ఉద్యోగం వేయించు. చాలు". అన్నాడు.

అయితే వరహాలు బంధువు వాసుదేవుడిది చిన్న ఉద్యోగం.

అతనికి ఉద్యోగాలు ఇప్పించే తాహతు లేదు.

అదేపేరుతో ఉన్నతాధికారి ఒకడు దివాణంలో ఉన్నాడు.

వడ్డీవ్యాపారి , ఆ ఉన్నతాధికారే వరహాలు బంధువనుకొన్నాడు.

వడ్డీవ్యాపారి పొరబడ్డాడని తెలియగానే వరహాలు బుర్రలో - ఆ పొరపాటును నిజం చేస్తే,

తన బాకీ రద్దు కావటమే కాక, ఊళ్లో తన పరపతి పెరుగుతుందనే ఆలోచన మెరిసింది.

"సరే రేపు కనిపించండి." అని వడ్డీవ్యాపారిని పంపేసి,

ఆ రోజే దివాణానికి వెళ్లి, తన బంధువైన వాసుదేవుణ్ణి కలుసుకొని,

దివాణంలో పనిచేసే పెద్ద పెద్ద ఉద్యోగులందరి పేర్లూ, వారి హోదాలు,

వారి జీవిత వివరాలు అన్నీ వ్రాసుకొన్నాడు.

తర్వాత ఉన్నతాధికారి వాసుదేవుడి కచేరీకి వెళ్లి, అక్కడి వాళ్లతో " నన్ను మండలాధికారి

వీరవర్మగారు పంపించారు. వారి బంధువుకు ఏదో ఉద్యోగం వేయించాలట.

నేను వాసుదేవుడుగార్ని కలుసుకోవాలి." అన్నాడు.

వాసుదేవుడి దర్శనం వెంటనే దొరికింది. ఆయన " అలాగే . ఉద్యోగం కావలసిన కుర్రవాణ్ణి,

నా వద్దకు రేపు పంపమను." అన్నాడు.

వడ్డీవ్యాపారి బావమరిదికి మర్నాడే దివాణంలో ఉద్యోగం దొరికింది.

వరహాలు నిమిషాలమీద దివాణంలో ఉద్యోగం ఇప్పించగలిగాడన్న మాట

ఊరంతా పొక్కిపోయింది. అతడికి దివాణంలో గొప్ప గొప్ప అధికారులవద్ద

పలుకుబడి ఉందని పుకారు పుట్టింది. అందరూ అతని స్నేహం కోసం ఎగబడ్డారు.

దివాణంలో ఉద్యోగాలు, పనులు కావలసినవాళ్లు కానుకలు ఇవ్వడంలో పోటీపడ్డారు.

కనకవర్షం మొదలయింది.

వరహాలుకు లౌక్యం తోడ్పడింది.

సేనాపతి , కోశాధికారి ఇలాంటి అత్యున్నతోద్యోగులందరికీ ఇతరుల మిత్రునిగా

పరిచయమై, క్రమంగా వారికే స్వయానా మిత్రుడయ్యాడు.

అందరి పనులూ చక్కపెట్టి, క్రమంగా లక్షలు ఆర్జించాడు.

రాజధానిలోనే వర్తకం ప్రారంభించి, వరహాలశ్రేష్టి అయ్యాడు.

రాజుగారి శుభకార్యాలలో వెలలేని రత్నాలు ఇచ్చి, "చిన్నకానుక" అనేవాడు.

ఇప్పుడు అతడు కాకిచేత కబురు చేయిస్తే దివాణంలో పని అవుతుంది.

ఒకసారి రాజు తన పుట్టినరోజుకి ఉన్నతాధికారులకు, కొద్దిమంది అత్యంత ధనవంతులకు

ప్రత్యేకమైన విందు ఇచ్చి, ఎవరెవరు ఎలా పైకి వచ్చింది చెప్పమన్నాడు.

అందరూ కొంత నిజం దాచారు కానీ వరహాలు ఉన్నదున్నట్లు చెప్పేశాడు.

అందరూ హర్షించి చప్పట్లు కొట్టారు.

వరహాలు లౌక్యాన్ని రాజు ప్రశంసించాడు.

ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే వరహాలది లౌక్యమా ? మోసమా ?

జవాబు :-

కొందరు ఉన్నతస్థాయిలో పుడతారు.

ఉదా: రాజు కొడుకు ప్రయత్నం లేకుండానే రాజు అవుతాడు.

కొందరు ఉన్నతస్థాయిని చేరుకొంటారు. వీరికే లౌక్యం అవసరం.

ఒకసారి ఉన్నతవర్గంలోకి చేరాక లౌక్యం అవసరం లేదు.

కాని డబ్బులేని దశనుంచి రాజధానిలో ఉన్నత వర్తకుని దశకు ఎదిగిన

వరహాలు లౌక్యం మాత్రం నిస్సందేహంగా అసాధారణమైనది.

ఒకసారి ఉన్నతి లభించాక అది ఎలా లభించిందని ఎవరూ పరీక్షించరు.

అలా పరీక్షిస్తే లౌక్యంతో పైకి వచ్చినవారందరూ దండనార్హులే అవుతారు.

ఫలించని లౌక్యం మాత్రమే శిక్షకు గురి అవుతుంది.

చిన్నప్పటినుండి నాకెంతో ఇష్టమైన
"చందమామ " సౌజన్యంతో.

బ్లాగ్ సోదర సోదరీమణులారా!

హాయ్ నేనొక క్రొత్త తెలుగు బ్లాగ్గర్ని . పరమోత్సాహంతో వచ్చాను . నాకు సంగీతమంటే ప్రాణం . అందులోను శాస్త్రీయ సంగీతం అంటే చాల ప్రియం . త్యాగయ్య , అన్నమయ కీర్తనలు ఎక్కువగా వినడానికి ప్రయత్నిస్తూ ఉంటాను . నేదునూరి గారు , సుబ్బలక్ష్మి గారు , త్యాగరాజ కృతులు పాడుతుంటే ఆనందమే వేరు. విని పరవశిస్తూ వుంటాను. ఇక అన్నమాచార్యుల కీర్తనలను గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు పాడుతుంటేనే అందం. ఆయనంత చిక్కగా చక్కగా పాడేవారు అరుదు. ఇక కన్నడంలో లక్షా నలుబదివేల కీర్తనలను రచించిన పురందర దాసు కీర్తనలను, కన్నడ గాయకులు ( పేర్లు తెలియవు) పాడినవి విన్నాను . అద్భుతం .మీకు తెలిసినవి నాతొ పంచుకోగలరు. సంగీతమే కాక ప్రాత తెలుగు పిక్చర్స్ (79 లోపువి) ఇష్టం.హిందీ పిక్చర్స్ కూడా.
ముఖ్యంగా వాటిలోని మ్యూజిక్ చాల ఇష్టం .తరువాత జ్యోతిషం కూడా చూస్తూ వుంటాను . కామెడీ ఇష్టం . వీటిని నలుగురితోను పంచు కోవాలి అనుకుంటున్నాను . సోది అనుకోవద్దు .ప్లీజ్. తోచినవి వ్రాస్తూంటాను.చదువుతారుకదా!