28, మే 2011, శనివారం

తత్త్వం

గోవిందం భజ - 9





కా తే కాంతా క స్తే పుత్త్ర

స్సంసారో౭య మతీవ విచిత్ర:,

కస్య త్వం వా కుత ఆయాత:

తత్త్వం చింతయ త దిహ భ్రాత: ( భ్రాంత: ).



" నీకు భార్య ఎవరు? పుత్త్రుడు ఎవరు? ( వారికీ నీకు సంబంధం ఏమిటి? అని.)

నీవు, ఎవనికి చెందినవాడవు? ఎక్కడనుండి వచ్చావు?

ఈ సంసారం మిక్కిలి విచిత్రమైనది.

సోదరుడా! అందువల్ల అసలువిషయాన్ని / నిజాన్ని ( తత్త్వం )విచారించు."
                                                           



భ్రాత: - అనే పాఠం ప్రకారం సోదరుడా! అని.

భ్రాంత: - పాఠం ప్రకారం " పొరపాటు పడ్డావు, నిజం తెలుసుకో " , అని.

లేనిదాన్ని ఉన్నదనుకోవడమే భ్రాంతి.



నా(గ)స్వ(రం)వ్యాఖ్య :-


లోకంలో అత్యంత ప్రియమైన బంధాలు భార్య , పుత్త్రుడు.

అందువల్ల శంకరులు వాటిని పేర్కొన్నారు.

ఎవరు భార్యగా వచ్చేదీ ముందుగా తెలియదు.

అంటే ముందుగా ఏ సంబంధమూ లేదు.

ఇంకా పుత్త్రుని విషయంలో రక్తం పంచుకొని పుడతాడు కాబట్టి, (రక్త)సంబంధం ఉంది.

భార్య విషయంలో ఎలాంటి బంధమూ లేదు.

ఉందనుకోవడం భ్రాంతి మాత్రమే.

జాగ్రత్తగా ఆలోచిస్తే , పుత్త్రుని విషయమూ అంతే.

అయితే లోకం ఎలా నడుస్తోంది? అంటే దాన్నే మాయ అన్నారు.

దాని ముసుగులో లోకం నడుస్తోంది.

అసలు ఇది మాయ చేస్తున్న మాయ అని కూడా తెలియకుండానే,

దారి ( పరమపథం ) తెలుసుకోకుండానే ,

ప్రపంచం పరుగెడుతోంది.

ఈ మాయను గుర్తించినవారిని జ్ఞానులు అని విజ్ఞులు అంటారు.

అటువంటి జ్ఞానులు, తాము తెలుసుకొని, పాపం మనకు వివరించడానికి ప్రయత్నిస్తారు.

కానీ ఆ సమయంలో ఎందుకో వాళ్ళు మనకు పిచ్చివాళ్ళల్లా అనిపిస్తారు. కనిపిస్తారు.

దాంతో మనం పట్టించుకోం.

"నేను అంటే ఎవరు? వచ్చింది ఎక్కడి నుంచి?" అని తెలుసుకోమంటారు వాళ్ళు .

"ఈ సంసారం చిత్రాతిచిత్రమైంది. తెలుసుకో" అని కూడా అంటారు.

సంసారం మీద ఒకసారి ఇష్టం ఒకసారి రోత కలుగుతూంటే విచిత్రం కాక మరేమిటి?

ఇలాంటి మాయాసంసారంలో పడి,

నేను, నాది, నావాళ్ళు, అని అహంకార మమకారాలతో దేవులాడక,

సన్మార్గాన్ని వెతుక్కోమని సద్గురువైన శంకరుల వాణి.

మరచిపోకండి.

ఏ సంబంధమూ లేదన్నారు కదాని,

అవసరం నెఱవేఱడం కోసం , భార్యాబిడ్డలతో " ఏమిటి సంబంధం? ఎవరికి ఎవరు" అనకూడదు.

అదే అపార్థం చేసుకోవడమంటే.

మెట్టవేదాంతం అంటారు దాన్ని.

బంధం ఉంది లేకపోలేదు. అయితే ,

సంబంధం యొక్క పరిధి బాధ్యతలు నెరవేర్చడం వరకూ అని గుర్తించాలి .

పిచ్చి ప్రేమలు ఉంటే తుంచుకోవడం కోసం ఈ ఉపదేశం అని గ్రహించాలి.




ఇంగ్లీష్ అనువాదం Sivananda Ashram వారి సౌజన్యంతో.


Who is your wife? Who is your son?

Supremely wonderful indeed is this samsara.

Of whom are you? From where have you come?

O brother, think of that Truth here.



శుభం భూయాత్

కామెంట్‌లు లేవు: