15, మే 2023, సోమవారం

ప్రహ్లాదుని తల్లి ఎవరు?

లీలావతా?

ప్రహ్లాదుని తల్లి లీలావతి అని భాగవతంలో లేదు. 

తెలుగు ప్రహ్లాదచరిత్రలో ఒకే ఒక్క చోట లీలావతి అని కనబడుతుంది.

లీలోద్యాన లతానివాసములలో 

లీలావతీయుక్తుఁడై

హాలాపానవివర్ధమాన

మదలోలావృత్తతా  

మ్రాక్షుడై........ ఆంధ్ర.మహా.భాగ.7.స్కం.102 ప.


సంస్కృత ప్రహ్లాదచరిత్రలో ఆ వివరమూ లేదు.

ఇక్కడ లీలావతి శబ్దాన్ని పోతన, విలాసవతి/ అందమైన స్త్రీ/ స్త్రీ అనే అర్థాల్లోనే ప్రయోగించినట్లు చెప్పవచ్చు.

అలా ఎందుకనుకోవాలి? భార్య అవ్వచ్చుగా అని మీరనవచ్చు.

దానికి సమాధానం ఉంది. 

సంస్కృత భాగవతంలో

"హిరణ్యకశిపోర్భార్యా 

కయాధుర్నామ దానవీ ।

జంభస్య తనయా దత్తా 

సుషువే చతురస్సుతాన్ || వ్యాస.భాగ.6 స్కంధం

దనువు వంశానకు చెందినదీ, జంభుని కూతురైనదీ, హిరణ్యకశిపువునకు భార్యగా ఈయబడిన "కయాధువు" అను పేరు కలది,

అయితే కయాధువే తల్లి అని ఎలా చెప్పవచ్చు?. లీలావతి ఇంకో భార్య అవ్వవచ్చుగా! ఆమె పుత్త్రుడు ప్రహ్లాదుడేమో! అంటారా?

పై శ్లోక భావం ఇంకా పూర్తి కాలేదు.

నలుగురు పుత్త్రులను కన్నది.

సంహ్రాదం ప్రాగనుహ్రాదం 

హ్రాదం ప్రహ్లాద మేవ చ ॥

వారు సంహ్రాదుడు, అనుహ్రాదుడు, హ్రాదుడు, ప్రహ్లాదుడు "

మఱి లీలావతి అని పోతన ఎందుకంటాడూ?

తెలిసిందిగా


మంగళం మహత్ 

8, మే 2023, సోమవారం

పద్యం పఠించాలా? పాడాలా?

పద్యపఠనమా? పద్యగానమా?

ఈ వివాదం ఎప్పట్నుంచో ఉంది.

ఈ విషయంలో రెండు వర్గాలు.

ప్రౌఢరాగకాంత వెళ్లి, పద్యపురుషుని కావలించుకోగానే ఆతడు గతిచెడి మూర్ఛ(నలు)పోక తప్పదు కాబట్టి భావానుగుణంగా అర్థమయ్యేలా పఠించాలని అపుడే రసోత్పత్తి అని కొంతమంది.

పద్యం రాగమిళితమైతేనే దానికో జన్మ ఉన్నట్టు. రాగించని పద్యం రాణించదు. ఏడిసినట్టుంటుంది. అందువల్ల పద్యాన్ని పాడాలి. అని ఎక్కువమంది. 

రాగతాళం లేకపోతే పద్యపేటిక తెరవలేం అనే నమ్మకం ప్రబలిపోయింది.

ఇదెంతదాకా వెళ్లిందంటే పద్యం పాడకుండా బోధిస్తే తెలుగు మాస్టరే కాదన్నంతవఱకు.

సరే, పద్యానికి రాగాన్ని జోడించడం వల్ల ఏమవుతుంది?

పద్యానికో సహజగమనం ఉంటుందనే సంగతే విస్మరించబడుతుంది. రాగానికి ప్రాధాన్యత ఎక్కువౌతుంది.

ఉదా.కు భక్తయోఓఓఓఓగ పదన్యాఆఆఆఆసి ఇలా పాడి పద్యంలోని వృత్తాంతం బోధపడిందా అంటే బోధ ఏమో గానీ రాగం మాత్రం బాగుందంటారు. 

పద్యం పదప్రధానం. రాగం స్వరప్రధానం. అందువల్ల స్వరం అర్థవిశేషాల్ని ఉల్లంఘిస్తుంది. కాబట్టి ఈ రెంటికీ విరోధమే తప్ప సంబంధం లేదు.

రాగం వల్ల ఒక ఉపయోగం ఏంటంటే పద్యంలో పదమేదైనా మర్చిపోతే అది గుర్తు వచ్చేదాకా రాగం తీయవచ్చు.

పద్యం అర్థం తెలిస్తేనే ఆనందం కల్గేది. దీనికి కొంచెం బుఱ్ఱ పెట్టాలి. శ్రమపడాలి.

అయితే రాగస్వరాల అర్థం తెలియకపోయినా దాని భావం ఏదైనా వెంటనే ఆనందం కల్గుతుంది. శ్రమ అక్కఱలేదు. అంటే పద్యభావం కంటే ముందు రాగమే ఆనందాన్నిస్తుంది.

భావం బోధపడాలంటే శబ్దప్రమేయమైన పద్యాన్ని స్పష్టతను పాటిస్తూ భావానుగుణంగా పఠించాలనేది కొందఱు పెద్ద గురువులమాట.

అయితే రాగాలకు వ్యతిరేకం అని కాదు దీని సారాంశం.

సంగీతం తెల్సినవారు రాగాన్ని అనుసంధించి పాడవచ్చు. అయితే వారు కూడా తగినంతగానూ భావానుగుణంగానూ స్వరాలు కూర్చాలి. (ఘంటసాల మొదలైన వారిలాగ) వారి దగ్గర నేర్చుకొని స్వరం తప్పకుండా పాడాలి. ఎందుకంటే సామగానజన్యమైన సంగీతంలో స్వరాలు తప్పితే వేదస్వరాలు తప్పినంత దోషం.

ఇతరభాషల్లోనైతే గద్యాన్ని చెబుతారు. గేయాన్ని పాడతారు. పద్యాన్ని పఠిస్తారు. తెలుగు వారే పద్యాన్ని పాడాలంటారు. 

అందువల్ల పద్యాన్ని పాడలేకపోయామే అనే న్యూనత అవసరంలేదు. విన్నవారికి (కొంతైనా) అర్థమయ్యేలా పఠించవచ్చు.

మంగళం మహత్