2, జులై 2020, గురువారం

భగవద్గీతలో భగవానుడు శ్రీకృష్ణుడు భయంగుఱించి చెప్పింది పరిశీలించండి.


ఓం నమో భగవతే వాసుదేవాయ  
బుద్ధిః జ్ఞాన మసమ్మోహః క్షమా సత్యం దమ శ్శమః
సుఖం దుఃఖం భవోఽభావో భయం చాభయ మేవ చ 10-4
అహింసా సమతా తుష్టి స్తపో దానం యశోయశః
భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః 10-5
బుద్ధి, జ్ఞానం, నిర్మోహం, ఓర్పు, సత్యం, బాహ్యేంద్రియ, అంతరింద్రియనిగ్రహం, సుఖం, దుఃఖం, పుట్టుక, నాశం, భయం, అభయం, అహిం, సమత్వం, సంతుష్టి, తపస్సు, దానం, కీర్తి, అపకీర్తి, వివిధభావాలు, ప్రాణులకు, వాటి కర్మానుసారం, నావల్లనే కలుగుతున్నాయి.

          పైన చెప్పిన 16 అనుకూల భావాలు, 4 ప్రతికూలభావాలు 10వ అధ్యాయం-విభూతియోగం-4,5 శ్లోకాల్లోవి. ఆ 4 ప్రతికూలాల్లో భయం కూడా ఒకటి. అయితే దీని భావం ఏమిటి? భగవంతుడు వాస్తవంగా ప్రతికూలభావాలను ప్రాణులకు కల్గజేయడం లేదు. జీవుల ఆయా కర్మలకు ఫలంమాత్రం ఇస్తున్నాడు. ఆయన కర్మఫలప్రదాత. భగవన్నియతివల్ల సత్కర్మకు సుఖం, దుష్కర్మకు దుఃఖం ఇలా కల్గుతుంటాయి. ఈ దృష్టితో సుఖదుఃఖాలు భగవంతునివల్ల కల్గుతున్నాయని చెప్పబడింది. పైగా ఇపుడు చెప్పబడిన ఈ వికారాలన్నీ మనసులోనే పుడుతూంటాయి. మఱి మనస్సుకు తద్గతవికారాలకు పరమాత్మే ఆధారం కాబట్టి ఈ దృష్టితో అవన్నీ పరమాత్మవల్ల కల్గుతున్నాయని చెప్పబడింది. అందువల్ల తమ పూర్వదుష్కర్మఫలితంగా భయం కల్గుతోందనే విషయం తెలుసుకొని, దాన్ని విడచిపెట్టడానికి కృషి చేయాలి. భగవానుడు కూడా భయం అంటే తనకు ఇష్టం లేదని దాన్ని వదలిపెట్టమని పదే పదే వచించాడు. అధ్యాయాలన్నీ పరిశీలించినంతవఱకు 2,4,5,6,10,12,16,18 అధ్యాయాల్లో మొత్తం 9 శ్లోకాల్లో దీని ప్రస్తావన ఉంది.
         
         
స్థితప్రజ్ఞుడు కావాలంటే ఉండాల్సిన లక్షణాల్లో భయాన్ని విడువడం ఒకటి.
దుఃఖే ష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః
వీత రాగ భయ క్రోధః స్థితధీ ర్ముని రుచ్యతే 2-56
దుఃఖాల్లో కలతపడనివాడు, సుఖాల్లో ఆసక్తిలేనివాడు, అనురాగం, యం, క్రోధం విడచినవాడైన మునీంద్రుడు, స్థితప్రజ్ఞుడని చెప్పబడుతున్నాడు.
భగవంతుని స్వరూపాన్ని(మోక్షం) పొందాలంటే ఉండాల్సిన లక్షణాల్లో భయాన్ని విడువడం ఒకటి.
వీత రాగ భయ క్రోధా మన్మయా మాముపాశ్రితాః
బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః 4-10
అనురాగం, భయం, క్రోధం విడచినవారు, నాయందే లగ్నమైన మనసు కలవారు, నన్నే ఆశ్రయించినవారైన అనేకులు, జ్ఞానతపస్సుతో పవిత్రులై, నాస్వరూపాన్ని పొందారు.
సదాముక్తుడు కావాలంటే చేసే సాధనల్లో, భయం విడువడం ఒకటి.
స్పర్శాన్‌ కృత్వా బహి ర్బాహ్యాన్‌ చక్షుశ్చైవాన్తరే భ్రువోః।
ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యన్తర చారిణౌ॥ 5-27
యతేంద్రియ మనోబుద్ధిః ముని ర్మోక్షపరాయణః
విగతేచ్ఛాభయ క్రోధో యస్సదా ముక్త ఏవ సః 5-28
శబ్దస్పర్శాది బాహ్యవిషయాల్ని బయటికే పారద్రోలి, చూపును భ్రూమధ్యాన నిలిపి, నాసికలో సంచరించే ప్రాణాపానవాయువులను సమంగా చేసి, ఇంద్రియాల్ని, మనస్సును, బుద్ధిని నిగ్రహించి, మోక్షపరాయణుడై,చ్ఛ, భయం, క్రోధం, విడిచిపెట్టిన ముని సదాముక్తుడై ఉంటాడు.
హృదయశుద్ధికోసం, అంతఃకరణయొక్క నిర్మలత్వంకోసం, తద్ద్వారా పరమాత్మసాక్షాత్కారంకోసం ధ్యానం చేయాలి. మఱి ఆ ధ్యానాభ్యాసి ఎలా ఉండాలో చెప్పిన లక్షణాల్లో భయాన్ని విడువడం ఒకటి.
ప్రశాన్తాత్మా విగతభీః బ్రహ్మచారి వ్రతే స్థితః
మన స్సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః 6-14
ప్రశాంతహృదయుడై, భయం విడచి, బ్రహ్మచర్యవ్రతనిష్ఠుడై, నస్సును నిగ్రహించి, నాయందే చిత్తం కలవాడై, నన్నే పరమగతిగా నమ్మి, ధ్యానయుక్తుడై ఉండాలి.
భగవానుడు, తాను ఏ గుణాలున్నవాడిని ఇష్టపడతాడో చెప్పాడు. ఆ గుణాల్లో భయం లేకపోవడం ఒకటి.
యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చ యః
హర్షామర్షభయోద్వేగైః ముక్తో య స్స చ మే ప్రియః 12-15
ఎవనివల్ల లోకం భయపడదో, లోకంవల్ల ఎవడు భయపడడో, ఎవడు సంతోషం, అమర్షం(=క్రోధం), భయం, ఉద్వేగం లేనివాడో వాడు నాకు ఇష్టుడు.
26 రకాల దైవసంపద(దైవికాలైన సద్గుణాల సంపత్తి)లక్షణాల్లో మొట్టమొదటిది అభయమే(భయం లేకపోవడం).
అభయం సత్త్వసంశుద్ధిః జ్ఞానయోగవ్యవస్థితిః
దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ స్తప ఆర్జవమ్‌ 16-1
అహింసా సత్య మక్రోధః త్యాగ శ్శాంతి రపైశునమ్‌
దయా భూతే ష్వలోలత్వం మార్దవం హ్రీరచాపలమ్‌ 16-2
తేజః క్షమా ధృతి శ్శౌచ మద్రోహో నాతిమానితా
భవంతి సంపదం దైవీ భిజాతస్య భారత 16-3
అర్జునా!, భయం లేకపోవడం, అంతఃకరణశుద్ధి, జ్ఞానయోగంలో ఉండటం, దానం, బాహ్యేంద్రియనిగ్రహం, యజ్ఞం, వేదాదుల అధ్యయనం, తపస్సు, ఋజుత్వం,(కపటం లేకపోవడం), అహింస, సత్యం, క్రోధం లేకపోవడం, త్యాగబుద్ధి, శాంతి, చాడీలు చెప్పకపోవడం, భూతదయ, విషయలోలత్వం లేకపోవడం, మృదుత్వం, సిగ్గు, అచంచలత్వం, తేజస్సు, ఓర్పు, ధైర్యం, శుచిత్వం, ద్రోహం చేయకపోవడం, స్వాతిశయం లేకపోవడం, అనే ఈ (ఇరవై ఆరు) సుగుణాలు దైవసంపత్తియందు పుట్టినవాడికి కలుగుతాయి.
భయంతో విధ్యుక్తకర్మల్ని విడచిపెట్టకూడదని, దానివల్ల సత్ఫలితాల్ని పొందలేరని బోధిస్తున్నాడు.
దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేభయాత్త్యజేత్‌
స కృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్‌ 18-8
శరీరప్రయాసభయంతోను, దుఃఖం కలగజేస్తాయనే తలంపుతోను, విధ్యుక్తకర్మల్ని విడచిపెడితే అది రాజసత్యాగం. లాంటి త్యాగం చేసినవాడు త్యాగఫలాన్ని పొందడు.
సత్త్వగుణసంపన్నులు తమ సాత్త్వికబుద్ధితో తెలుసుకొనేవాటిలో, భయాభయాలు కూడా ఉన్నాయి. (భయరూపసంసారం, అభయరూపపరమాత్మ).
ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే
బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధి స్సా పార్థ సాత్త్వికీ 18-30
పార్థా!, ప్రవృత్తిమార్గాన్ని(కర్మమార్గం), నివృత్తిమార్గాన్ని(సన్న్యాసమార్గం), కార్యాకార్యాలను, భయాభయాలను, బంధాన్ని, మోక్షాన్ని తెలుసుకొనే బుద్ధి సాత్త్వికబుద్ధి.
ఇక్కడ తామసధృతిగుఱించి చెప్తున్నాడు. ధృతి అంటే ధైర్యం. ధైర్యం సుగుణమే. కానీ అది దుర్విషయాల్లో వినియోగిస్తే నిష్ఫలం అయిపోతుంది. తమోగుణయుతుడు నిద్రాభయాదుల సంపాదనలో వినియోగించడంతో ధైర్యమనే సుగుణం నిరర్థకమైపోతుంది. కాబట్టి కూడని వాటిలో భయం ఒకటి.
యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ
విముంచతి దుర్మేధా ధృతి స్సా పార్థ తామసీ 18-35
పార్థా!, దుర్బుద్ధికలవాడైన మనుష్యుడు దేనిచేత నిద్రను, యాన్ని, శోకాన్ని, విషాదాన్ని, దాన్ని విడిచిపెట్టకుండా ఉంటాడో ఆ ధృతి(ధైర్యం) తామసధృతి.
 

పై శ్లోకాల్ని పరిశీలిస్తే, భగవానుడు భయం కూడదనే విషయానికి ఎంత ప్రాధాన్యం ఇచ్చాడో తెలుస్తుంది. తైత్తిరియోపనిషత్ ఇలా వివరిస్తోంది. “పరమాత్మలో ఏ కొంచెం భేదం చేసినా అనగా పరమాత్మను అద్వయునిగా అఖండునిగా అనంతునిగా తెలిసికోలేకపోతే భయం కల్గుతుంది. అంటే ఎంత పండితుడైనా సరే తానే బ్రహ్మం, తనకంటే వేరైన మఱొకటి లేనేలేదు. అని స్వానుభవంతో తెలుసుకోలేనంతవఱకు అతనికి ద్వైతం ఉంటుంది. ద్వైతం ఉన్నంతకాలం భయం ఉంటుంది. అద్వైతస్థితిమాత్రమే భయాన్ని పోగొడుతుంది. ఉపనిషత్సారమే కదా భగవద్గీత. అందుకే వివేకానందుడు కూడా నిర్భయులై ఉండండి” అని వాక్రుచ్చాడు. కాబట్టి నిర్భయంగా ఉండడానికి సాధన చేయాలి. నిర్భయుడే దేన్నైనా సాధించగలడు.

          (వాట్సాప్‍లో ఎవరో, నీ భయం నీ దగ్గరే ఉంచుకో. నీ ధైర్యాన్ని మాత్రం నలుగురికీ పంచు అని కృష్ణుడు చెప్పినట్లు సందేశం పంపారు. పైకి సూక్తిలా ఉంది కానీ బుఱ్ఱకు తట్టినవన్నీ భగవానుని పేర ప్రచారం చేయడం ఏమిటి? అసలు భయమే వద్దని భగవానుడు ఒకప్రక్క ప్రబోధిస్తూంటే, నీ భయం నీ దగ్గరే ఉంచుకో ఏంటి? అందువల్ల వాస్తవం తెలియాలని ఇది కూర్చడం జరిగింది.
          చివరగా, నిజానికి భయం ఉంటే సహృదయులైన ప్రాజ్ఞులకు చెప్పి, వారిద్వారా వాగ్రూపంలోనో(సలహాలు), క్రియారూపంలోనో రక్షణ పొందాలి. అంతేకాని తనలోనే ఉంచేసుకొని, గుండెను బరువెక్కించుకోకూడదు.)
          విజ్ఞులు తప్పులు మన్నింతురుగాక!.
          ఓం తత్సత్. 
మంగళం మహత్