31, జనవరి 2022, సోమవారం

సర్వవిభక్తులతో కృష్ణస్తుతి



మొత్తం ఎనిమిది విభక్తులతోనూ చేసిన కృష్ణస్తుతి

 

కృష్ణో రక్షతు నో జగత్త్రయ గురు:

("కృష్ణః" జగత్త్రయ గురు: నః రక్షతు )

ముల్లోకాలకు గురువైన కృష్ణుడు మమ్ము రక్షించుగాక!

 

కృష్ణం నమస్యామ్యహం

("కృష్ణమ్" అహం నమస్యామి)

కృష్ణుని (గుఱించి) నేను నమస్కరిస్తున్నాను.

 

కృష్ణేనామరశత్రవో వినిహతా:

("కృష్ణేన" అమరశత్రవః వినిహతాః)

కృష్ణునిచేత రాక్షసులు చంపబడ్డారు.

 

కృష్ణాయ తస్మై నమ:

("కృష్ణాయ" తస్మై నమః)

కృష్ణునికొఱకు నమస్కరిస్తున్నాను.

 

కృష్ణాదేవ సముత్థితం జగదిదం

("కృష్ణాత్" ఏవ ఇదం జగత్ సముత్థితం)

కృష్ణునినుండి జగత్తు ఉద్ధరింపబడింది/బయటపడింది.

 

కృష్ణస్య దాసోఽస్మ్యహం

("కృష్ణస్య" అహం దాసః అస్మి)

కృష్ణునకు నేను దాసుణ్ణి.

 

కృష్ణే తిష్ఠతి సర్వమేతదఖిలం

("కృష్ణే" ఏతత్ అఖిలం సర్వం తిష్ఠతి)

కృష్ణునియందే సర్వజగత్తు నిలిచి ఉంది.

 

హే కృష్ణ రక్షస్వ మాం

("హే కృష్ణ" మాం రక్షస్వ)

కృష్ణా! నన్ను రక్షించు.

 

- ముకుందమాల స్తోత్రం 32 శ్లో.

- కులశేఖర ఆళ్వార్

మంగళం మహత్

29, జనవరి 2022, శనివారం

నగవులు నిజమని నమ్మేదా - అన్నమాచార్య కీర్తన

 

నగవులు నిజమని నమ్మేదా

ఒగి నడియాసలు ఒద్దనవే

(ఓ మనసా! నీ) నగవులు (నవ్వులు/అలరింతలు)

లేక  ప్రపంచపు నవ్వులు నిజమని నమ్మచ్చా? (నమ్మరాదు. నమ్మితే ప్రమాదం)

ఒగిని (క్రమంగా/చక్కఁగా/శ్రద్ధతో/లెస్సగా)

అడియాసలు (వట్టి ఆశలు/వ్యర్థ/పేరాసలు) ఇక ఒద్దు అను.

 

తొల్లిటి కర్మము దొంతుల నుండగ

చెల్లబోయిక జేసేదా

యెల్ల లోకములు యేలేటి దేవుడ

ఒల్ల నొల్లనిక నొద్దనవే 1

పూర్వకర్మలు దొంతులు

(దొంతరలు)గా ఉన్నాయి.

అవి చెల్లేటట్లు చేయాలి కదా! = తీరాలిగా!/కర్మ పరిపక్వమవ్వాలి కదా!

ఇంకా పోగుచేసుకోవడం ఎందుకు?

అన్ని లోకాల్ని పరిపాలించే దేవా! (అని వేంకటేశునితో చెప్తున్నట్లుగా)

నా మనసు చేసే పనులను ఒల్లను ( లేదా)

ఇక (ఓ మనసా! నిన్ను/నీ పనులను) ఒల్లను (అంగీకరించను/ఇష్టపడను)

భగవదర్పితం కాని కర్మలు చేయడాన్ని/తుంటరి తలపులను ఇక ఒద్దు అను

పోయిన జన్మము పొరుగులనుండగ

చీయనక యిందు జెలగేదా

వేయినామముల వెన్నుడమాయలు

ఓ యయ్య యింక నొద్దనవే 2

పోయిన (తనువు చాలించాక)

వెంటనే మరోజన్మ పొరుగుల

(ప్రక్కనే సిద్ధంగా) ఉండగా,

ఛీ అనకుండా

(మరో) జన్మను అంగీకరించి,

ఇక్కడే భూలోకంలో అలరారేదా? (=ఒప్పేదా?, ఒప్పదు/సరికాదు)

వేయినామాల వెన్నుని (విష్ణుని)

మాయలు (ఎఱుగరానివి)

(అందువల్ల ఓ మనసా! ఆయనతో)

ఓ అయ్యా!

ఇక నీ మాయలు

ఒద్దయ్యాఅను.

(“ఈ మాయామోహప్రపంచంలో

ఇక జన్మ ఒద్దను)

(“పరమపదం కావాలిఅను)

 

నలి నీనామము నాలికనుండగ

తలకొని యితరము దడవేదా

బలు శ్రీ వేంకటపతి నిన్నుగొలిచి

వొలుకు చంచలము లొద్దనవే 3

బలు (గొప్పవాడవైన/బలవంతుడవైన) శ్రీవేంకటపతీ! నిన్ను కొలిచి (పూజిస్తూ)

నలిని (యోగ్యంగా)

నీనామం

నాలుకపై ఉండగా,

తలకొని (ప్రయత్నించి/పూని)

ఇతరాలను = విషయవాంఛలను

తడవడం(వెదకడం/విచారించడం) ఎందుకు?

(మనసా!)

నీలో ఒలికే ఎన్నో చంచలాలనొద్దను

(అస్థిరమైన మనసును ఒద్దు అనడం)

(వేంకటపతి పట్ల స్థిరంగా ఉండమనడం)

 

 

 

*భగవద్గీత 6 వ అ. 34, 35 శ్లో. పరిశీలనార్హం

(నాకు అర్థమైనంతవఱకు వ్రాసిన భావమిది)

మంగళం మహత్