26, జులై 2022, మంగళవారం

మహాభారతంలో ధర్మరాజు అడిగిన అయిదు ఊళ్ల గుఱించి వివరణ

సంజయునితో ధర్మరాజు

ఉద్యోగపర్వం ప్రథమాశ్వాసంలో

 

……”బెద్ద యీ నోపఁడయ్యెనేనిఁ గుశస్థలంబును; వృకస్థలంబును; వాసంతియు; వారణావతంబును జాలుఁ;  

గాదేని మఱియు నెందేనియు నొక్కటి యగునట్లుగాఁ దన తోడఁబుట్టువు లేవురకు నిలువఠవు లయి దిచ్చిన సర్వశాంతి యగు;

 

భావం : “అంత ఎక్కువగా ఇవ్వలేకపోతే, కుశస్థలమూ, వృకస్థలమూ, వాసంతీ, వారణావతమూ సరిపోతాయి. లేకపోతే మరి ఎక్కడైనా ఏదో ఒకటి తన సోదరులకు అయిదుగురికీ నిలవడానికి చోట్లు అయిదిస్తే సంపూర్ణశాంతి అవుతుంది.

అన్నాడు.

 

విశేషం: కుశస్థలంబును, వృకస్థలంబును, వాసంతియు, వారణావతంబును,

ఇంకొకటి ఏదయినా ఇట్లా ఏవో అయిదూళ్ళు మాత్రమే ధర్మరాజు కోరినట్లు కనిపించినా,

అవి కౌరవ సామ్రాజ్యానికి ఆయువుపట్టులైన ఊళ్ళు.

 

 

మూలంలో 'వాసంతి' లేదు. దానికి బదులు 'అవంతి' ఉన్నది.

 'కుశస్థల వృకస్థలం అవన్తీం వారణావతమ్.”

 

అని ఆంధ్రమహాభారతానికి వ్యాఖ్యానం వ్రాసినవారు ప్రథమాశ్వాసంలో వ్రాశారు.

 

కానీ మూలంలో

 

అవిస్థలం వృకస్థలం మాకందీం వారణావతమ్,

అవసానం భవత్వత్ర కించిదేకం పఞ్చమమ్.

అని (సంజయునితో చెప్పినట్లు) ఉంది.

 

భావం : అవిస్థలము, వృకస్థలము, మాకంది, వారాణావతము,

అయిదవదిగా నేదో యొక్కటిగా మాకు నెలవులు రాజ్యమం దేర్పడుగాక!

 

తర్వాత కృష్ణుని రాయబారిగా పంపుతూ, ధర్మరాజు

తృతీయాశ్వాసంలో

 

కృష్ణా! ఇక్కడున్న చుట్టాలూ, నీవు విస్మయంతో వింటుండగా-

'సక్రమంగా మాకు అర్ధరాజ్యం పంచియివ్వటానికి మా తండ్రికి మనసొప్పకపోతే

ఇంద్రప్రస్థం, కుశస్థలం, వృకస్థలం, వాసంతి, వారణావతం చాలు.

(ఉభయభారతాలలోనూ ధర్మరాజు అడగని ఇంద్రప్రస్థం ఎందుకు వచ్చింది మధ్యలో)

అందుకూ అతడిష్టపడకపోతే ఎక్కడైనా మేము తలదాచుకొనటానికి ఐదూళ్ళిచ్చినా చాలు' నని సంజయుడితో ఇంతవరకూ నే చెప్పిన మాటలలో కపటం లేదు. అంతా యథార్థం సుమా! అన్నాడు.

 

(అని ఆంధ్రమహాభారతానికి వ్యాఖ్యానం వ్రాసినవారే అన్నారు.)

 

విశేషం: ధర్మరాజడిగిన అయిదూళ్ళ పేర్లు మూలంలో ఇట్లా ఉన్నాయి.

అవిస్థలం, వృకస్థలం, మాకంది, వారణావతం మరింకేదైనా ఒక ఊరు.

తెలుగులో అవిస్థలం, మాకంది పట్టణాలకు బదులు కుశస్థలం, వాసంతి పేర్కొనబడ్డాయి.

 

9th పాఠ్యపుస్తకంలో శాంతికాంక్షలో

పై తాత్పర్యాన్ని బట్టి ఇంద్రప్రస్థం కూడా 5 ఊళ్లల్లో చేర్చేశారు.

 

ఇప్పుడు ఈ ఊళ్లు ఎక్కడ ఉన్నాయి అంటే

వృకస్థలం కురుసామ్రాజ్యానికి దక్షిణభాగంలో

ప్రస్తుతం హర్యానాలో GURGAON జిల్లాలో ఉంది.

అవిస్థలం లేక కుశస్థలం ఉత్తరప్రదేశ్ లో కనౌజ్ (కన్యాకుబ్జం)

మాకంది ఉత్తరప్రదేశ్ ఫతేపుర్ జిల్లాలో ఉంది.

వారణావతం ఉత్తరప్రదేశ్ అలహాబాద్ ప్రాంతం

 

ఎక్కడ ఉన్నాయి అన్న విషయంలో తెల్సుకొన్నంతవఱకు వ్రాయడం జరిగింది.

తప్పొప్పులు సహృదయులు సవరించగలరు.