26, జనవరి 2023, గురువారం

శృంగారదమయంతీనైషధసమాలాపము

నలుడు తిరస్కరిణీవిద్యమహిమతో దమయంతి అంతఃపురంలోకి ప్రవేశించి, ఇంద్రాగ్నియమవరుణుల సందేశాన్ని వినిపించటానికై ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యాడు. 

ఆమె గౌరవించి, వంశనామాదులు అడిగింది.

అపుడు నలుడు దిక్పతుల పంపున దూతగా వచ్చానని చెప్పి వారి(లో నొకరి)ని వరించమని కొన్ని మాటలు చెప్పాక దమయంతి,

"ప్రశ్న మొక్కటి యొక్కటి ప్రతివచనము

యుక్తి యనుకూలమై యుండ దుభయ మునకు 

నేను నీవంశనామంబు లెవ్వి యనిన 

నెవ్వరినో ప్రస్తుతించితి వింతతడవు


అడిగిన ప్రశ్న ఒకటి. నీ సమాధానం మరొకటి. అడిగింది చెప్పలేదు.నేను నీ వంశనామాలేవి అంటే అది వదిలేసి ఇంతసేపూ ఎవరినో ప్రస్తుతిస్తున్నావు.

(దిక్పాలురని తెలిసి కూడా "ఎవరినో" అని అనడంలో వారి పట్ల ఆమె అనాదరభావం తెలుస్తోంది.)


ఒక చోటఁ బ్రకాశించియు

నొక చోట నిగూఢ యగుచు నొదవించెం గౌ 

తుకలక్ష్మి నీసరస్వతి

ప్రకటయు గూఢయును నగు సరస్వతి వోలెన్ 

ఒకచోట కనిపిస్తూ, ఒకచోట అదృశ్యమయ్యే సరస్వతినదిలా నీ సరస్వతి (వాక్కు) ప్రశ్నకు సంబంధించినదానిలా స్పష్టమవుతూ ఒకసారి, సంబంధించనిదానిలా (అంతర్వాహిని అవడంచేత) అస్పష్టమవుతూ మరోసారి వేడుకను పుట్టిస్తోంది.


అధికతరు లైనఁగాని దిశాధిపతులు

కౌతుకము నాకు నీవంశకథలయందు

దప్పిగొన్నట్టివారి కాదప్పి దీఱ 

సలిలపూరంబు హితవొ యాజ్యంబు హితవొ

దిక్పాలురు అధికతరులైతే అవ్వచ్చు. కానీ నాకు నీవంశకథలు తెలుసుకోవడంలోనే వేడుక. నేయి అధికమైనదైనా, దప్పిక తీరడానికి నీరే కదా! హితవైనది. ఆలోచించు.

నా ప్రశ్నకు నీ ఉత్తరం అప్పులా మిగిలిపోయింది. ఇప్పుడైనా ఋణం తీర్చుకో. ఏ వంశం(వెదురు) నీలాంటి నాయకమణిని(ముత్తెం) భరించింది? ఏ వర్ణాలు నీ పుణ్యనామానికి ప్రకాశకాలవుతున్నాయి?"

(వెదురులో ముత్తెం పుడుతుంది. బృ.సం.)

అని పలికి ఊరకుంది.

అపుడు నలుడు, 

"వంశకథ అలా ఉండనీ. చెప్పకూడదు. ఎందుకంటే నీచకులమైతే చెప్పుకోదగదు. అవమానం. గొప్పకులమైనా చెప్పుకోలేను. ఎందుకంటే ఇలా సేవకత్వం/దూతత్వం వహించి, రావడంచేత చెప్పడం ఉచితం కాదు.

రాజవదనా! నీవు రాచకన్యవు. మానవీయవు. మన మైత్రికి అఱ (కొఱత/సగం/కపటం) చేయకూడదు. కొంచెం చెప్తా. నేను మనుజవిభుణ్ణి. రాజ(చంద్ర)వంశ(వెదురు)మొలకని.


పేరడుగం దలంచెదవు భీమతనూభవ! యావిచారముం

దూరము సేయు మెవ్వరికి దోసము తాఁదన పేరు సెప్పు టా 

చార పరంపరాస్థితికి శాస్త్రము మూలము శాస్త్ర చోదితా 

చార వివేకహీనుఁ డగు జాల్ముని మెత్తురె? పండితోత్తముల్


తన పేరు తాను చెప్పుకోవడం దోషం. శాస్త్రాచారాన్ని తప్పను.

(ఆత్మనామ గురోర్నామ నామాతికృపణస్యచ

శ్రేయస్కామీ నగృహ్ణీయాత్ జ్యేష్ఠా పత్య కళత్రయోః'

అనే స్మృతివచనం తన పేరు తాను చెప్పుకోకూడదని శాసిస్తోంది.)

అదీ గాక,

కువలయనేత్ర! సమక్ష

వ్యవహారంబునకు యుష్మదస్మత్పదముల్

శ్రవణశ్రావణ యోగ్యము

లవుచుండఁగఁ బేరు సెప్ప నడుగఁగ నేలా?

ఎదురెదురు వ్యవహారాల్లో నీవు నేను అనే పదాలు వినడానికి, వినిపించడానికి హాయిగా ఉండగా, ఇక పేరుతో పనేమిటి?

(నాదీ ఇదే వ్యవహారం-స్వగతం-క్షమించాలి.)

అని నలుడు శారదంబైన అడవినెమలిలా పలికాడు. (నెమలి వర్షాకాలంలో కూసి, శరత్కాలంలో మౌనం వహిస్తుంది. అందుకని ఆ పోలిక. పోలికనుబట్టి మౌనం దాల్చాడని ఊహ్యం.)

ఆ పల్కులలోని ప్రతి పదం అనురాగం కల్గించగా ఆ దమయంతి, రాజహంసిలా (శరత్కాలంలో నెమలి ధ్వని చేయదు కానీ, రాజహంస ధ్వని చేస్తుంది.)

........బలి కె నిట్లని మహీపాలుతోడ 

నన్వయం బెఱిఁగించి యభిధాన మెఱిఁగింప కునికి మ మ్మాదరించిన తెఱంగె ?


యనఘ! మము నీవు వంచింప నభిలషించె 

దేము నేరమె వంచింప నిపుడు నిన్నుఁ 

బేరు సెప్పిన నీ కనాచార మేని

మాకు నాయంబె నీతోడ మాటలాడ.


అన్వయం చెప్పి, అభిధానం చెప్పకపోవడం ఏవిధంగా మామీద ఆదరం చూపినట్లు?

మమ్మల్ని నీవు వంచింప తలస్తే మేము నిన్ను వంచింపలేమా!? నీ పేరు చెప్పడం నీకు అనాచారమైతే, (పరపురుషుడవు, క్రొత్తవాడవైన) నీతో మాట్లాడడం మాకు న్యాయమా!?


అన్య పురుషులతోడ నెయ్యంపుగోష్ఠి 

యధిప ! మముబోఁటిరాజకన్యకల కగునె 

యది కులాబలాచారసహాసనాస

హాతిసాహసకౌతూహలావసథము

మాలాంటి రాజకన్యలకు పరపురుషులతో ఇష్టాగోష్ఠి కులకాంతల ఆచారానికి ఎంతమాత్రం పొసగని అతిసాహసపు వేడుక కాదా!

అతిసౌందర్యవంతులైన మగవారితో అంతఃపురంలో ఇంతసేపు మాట్లాడడం కులకన్యలకు తగదు." అంది.

దాంతో సమాధానం ఏం చెప్పాలా అని ఆలోచించి, ఏమీ తోచక, నలుడు, ఆమె వచోనైపుణ్యానికి మనసులో అభినందిస్తూ, చిఱునవ్వుతో ఇలా అన్నాడు.

"చేతులు జోడించి అడుగుతున్నాను. దేవతల(లో ఒకరిని) వరించి నా సమధికాయాసాన్ని సఫలం చెయ్యి. నా కార్యం నెఱవేర్చు.

ఇంద్రాదులు నారాకకై ఎదురుచూస్తూంటారు. కాలయాపన చేయకు."  అన్నాడు.


సశేషం

మంగళం మహత్ 


25, జనవరి 2023, బుధవారం

భీమఖండ కాశీఖండాల్లో వ్యాసఘట్టం

 కాశీఖండం భీమఖండం 

రెండూ శ్రీనాథుడే వ్రాసినా

వ్యాసుడు కాశిని బాసిన 

వృత్తాంతం రెండు గ్రంథాల్లోనూ

వేర్వేరుగా ఉంది.


భీమఖండ వ్యాసఘట్టం


అగస్త్యుడు వ్యాసుని కాశిని బాసిన

కారణాన్ని అడిగాడు.


ఇద్దరూ (పిఠాపురసమీప)తుల్యభాగాతీర బిల్వతరువనాంతరంలో కలిశారు.


వ్యాసుడు సమాధానమిస్తూ,


"జైమిని పైలసుమంతులాది శిష్యులతో 

తీర్థయాత్రకు కాశీ వచ్చాను.


ఏ శకునంలో వచ్చామో

అహోరాత్రాలు ఏడు రోజులు భిక్ష దొరక్క ఉపవాసం ఉన్నాం.


ఒక పతివ్రతైనా ఆహారం పెట్టలేదు ఆ రోజుల్లో.


ఎనిమిదో రోజునకూడా 

భిక్షకోసం తిరిగాం.


నెత్తిన ఎండ మండిస్తూంటే

లేదు, నడవండి, పొండి, కూడదు 

ఇలాంటి నిషేధ వాక్యాలతో చెవులు నిండగా


విప్రవాటంబులఁ బ్రతిగేహంబును బరిభ్రమించి విసికి విసిమాలి వేనరి యలసి యారటఁబొంది సొలసి జూఁకించి తూలి దూఁపటిలి యుల్లంబునఁ గ్రోధం బుద్భవించిన.


భిక్షాపాత్రల్ని ఱాతిమీద వంద ముక్కలయ్యేలా వేశాను.


ఏం చెప్పేది? ప్రజ్ఞావిభవం ఏమో అయిపోయి 

చెడిపోగా కూడు లేని కారణాన కాశీని శపించాలనుకొన్నాను. 


కోపాన్ని సంహరించమని శిష్యబృందం చెప్తున్నా వినకుండా 


మాభూత్రై పూరుషీ విద్యా 

మాభూత్రై పూరుషమ్ ధనమ్,

మాభూత్రై పూరుషీ భక్తిః

కాశ్యామ్ నివసతామ్ సదా.


అని శపించాలనుకొని

శాపజలాన్ని అందుకొందామనుకొంటే ఎందుకో కేలు సాగలేదు.


ఆ సమయంలో ఒక వృద్ధసీమంతిని 

భిక్షకు రమ్మని ఇలా అంది.


క్రొన్నెలపువ్వుదాల్పునకుఁ గూరిమిభోగ పురంధ్రి కక్కటా 

యిన్నగరీలలామమున కీపరిపాటికి నిట్టికోపమే 

లన్న ! ఘటించె దో మునికులాగ్రణి నిక్కమువో బుభుక్షితం 

కిన్నకరోతిపాపమను కేవలనీతిఁ దలంచిచూడఁగన్.


ఆ తర్వాత మూడువందలమంది శిష్యులకు నాకు భోజనాలు పెట్టింది.


తిన్నాక, శివుడు కోపసంరంభంతో శిష్యులతో సహా కాశీని విడచిపొమ్మన్నాడు.


పార్వతి అనుగ్రహించి మఱెక్కడికీ వెళ్లకుండా దక్షిణకాశి దక్షవాటిక వెళ్లమని 

అభ్యుదయాలవుతాయని వచించింది.


ఎప్పుడెప్పుడు ఆ భీమేశ్వరుని దర్శిస్తానో అని ఉవ్వళ్లూరుతూ వస్తూ నిన్ను కలిశాను."


అని ముగించాడు.


ఈ వ్యాసఘట్టాన్ని ప్రధానంగా తీసుకొని, శ్రీనాథుడు దక్షారామాన్ని భీమేశ్వరుని వైభవాన్ని వర్ణిస్తూ భీమఖండం రచించాడు.


కాశీఖండంలో ఉన్నదేమిటో చూద్దాం.


వ్యాసుడు పదివేల మంది శిష్యులతో పెద్దకాలం కాశీలో నివసించాడు. 


ఆయన స్థైర్యాన్ని శివుడు పరీక్షించాలనుకొన్నాడు.


రెండవరోజుకే కోపం వచ్చేసింది.


శివుడు కాశీని విడచిపొమ్మన్నాడు కానీ వ్యాసుడు గడగడ వణకుతూ కాళ్లమీద పడ్డాక ఇలా అనుగ్రహించాడు.


కాశికాపురిఁ దొంటికట్టడ నుండక పుణ్యకాలమునందు భూతతిథుల వచ్చువాఁడవు శిష్యవర్గంబు నీవును నైదుకోశములకు నవలినేల నుండువాఁడవు పైఁడికుండలు ప్రాకార వలయంబుఁ బొడగానవచ్చుచోటఁ ద క్కన్యతిథులఁ దీర్థముల నిందింపకు బుద్ధిమంతుఁడవు గాఁ బొమ్ము బ్రదుకు 


తే, మంచు నంత ర్హితుం డయ్యె నగజతోడ 

విశ్వనాథుండు మునియును విశ్వభర్త 

యాన తిచ్చిన చోటనే యధివసించెం 

గాశికాపురి కెడదవ్వు కలుగునడవి.



మంగళం మహత్


24, జనవరి 2023, మంగళవారం

సరసమైన చిన్న కథ

 అది రోహిణీకార్తె. మిట్టమధ్యాహ్నం వడ గాడుపు గూబ పగలేస్తోంది. తాటాకు గొడుగు వేసుకుని నడిచివెడుతున్న జగన్నాథపండితునికి దారిలో ఒక మామిడి చెట్ల గుబురు కనిపించింది. అక్కడే ఒక గిలక నుయ్యి. పక్కనే తాటాకు చేద. జగన్నాథుడికి ప్రాణం లేచివచ్చింది. గబగబా ఓ చేదెడునీళ్లు తోడుకుని ముఖం కడుక్కున్నాడు. చల్లగా మంచులా ఉన్నాయి నీళ్లు. నాలుగు పుడిసెళ్లు గొంతుకలో పోసుకున్నాడు. గంగా బొండంనీళ్లల్లా మధురంగా ఉన్నాయి. 


అక్కడి మట్టితిన్నెమీద కూర్చుని అలసట తీర్చుకుంటూ 'ఎంతమంచినుయ్యి ! ఏపుణ్యాత్ముడు తవ్వించాడో!' అనుకున్నాడు.


అంతలో హఠాత్తుగా ఆ నూతిలోనుంచి 'నేను చాలా నీచమైనదాన్ని' అని దిగులుగా అంటున్నట్లు వినిపించింది. 


జగన్నాథుడు ఉలిక్కిపడి నూతిలోకి తొంగిచూశాడు. అందులో ఎవరూ లేరు. అంతా తన భ్రమ. అంతలో 'నేను చాలా నీచమైనదాన్ని' అని మళ్లీ స్పష్టంగా వినిపించింది.


ఆ మాట్లాడు తున్నది నుయ్యే అని స్పష్టం అయింది అతడికి.


నీచశబ్దానికి క్రిందుగా ఉండేదీ, క్షుద్రమైనదీ అనే అర్థాలున్నాయి.


'ఓహో! నుయ్యి ఎంత తెలివిగా మాట్లాడు తోందీ?' అని మెచ్చుకున్నాడు.


'క్రిందుగా ఉండేదానివి అనడం బాగానే ఉంది కానీ అల్పమైనదానివీ క్షుద్రమైనదానివి మాత్రంకావు బావీ ! నీది అత్యంత సరసమైన హృదయం' అన్నాడు.


'ఏమిటీ? నా హృదయం అత్యంత సరస మైనదా? వేళాకోళం చేస్తున్నారా ?' 


'లేదు లేదు. నీతో వేళాకోళం ఆడతానా?

నిజంగా నీది సరస హృదయమే. ' 


'అదెల్లాగ?'


'రసం అంటే నీరు. నీ హృదయంనిండా నీళ్లు లేవూ? అందులోనూ ఎలాంటినీళ్లు. '


 'మీ ద్వ్యర్థి చల్లగుండా. ఇంకా ఏమిటో అనుకున్నాను.'


'పైగా నువ్వు పరగుణ గ్రహీతవు.'


'ఇదోటా? సరసహృదయంతోబాటు పరగుణ గ్రహణ శక్తి కూడా అంటగడుతున్నారే. ఇది బాగుంది.


'అవును. నేను అన్నది అక్షరాలా నిజం'


'నాది అసలే మందబుద్ధి. మరి కాస్త వివ రించండి దయచేసి.'


'గుణం అంటే తాడుకాదుటమ్మా! చేదకి తాడుకట్టి నీలోకి విడవరూ? అంటే ఇతరుల గుణాన్ని అదే చేంతాడుని—నువ్వు గ్రహించడం లేదూ?'



నితరాం నీచోఽస్మీతి 

త్వం ఖేదం కూప! మా కదాపి కృధాః

అత్యంత సరస హృదయో 

యతః పరేషాం గుణగ్రహీతాసి.



అతి నీచంబను నేనని

మతిగుందకు మెపుడు కూపమా! నీహృదయం 

బతిసరసము — నీవెప్పుడు 

నితరుల గుణముల గ్రహించు నేర్పరివికదా!


'హోహ్హోహ్హో! నాకు నవ్వు ఆగడంలేదు. ఇంతమంది బాటసారులు నాలో నీళ్లు తాగిపోయారు గానీ మీలాగ నన్ను ఆకాశానికి ఎత్తేసినవాళ్లు లేరు.

ఇంతకీ మీ పేరు ఏమన్నారూ?'


ఆత్మనామ గురోర్నామ 

నామాతికృపణస్యచ

శ్రేయస్కామీ నగృహ్ణీయాత్ 

జ్యేష్ఠా పత్య కళత్రయోః'


'నా పేరుకేంగానీ నాలుగు కాలాల పాటు పరగుణ గ్రహీతవుగా వర్థిల్లు'అని ఆశీర్వదించి ముందుకి సాగిపోయాడు జగన్నాథ పండితరాయలు.


~ డా. మహీధర నళినీమోహన్ 

15, జనవరి 2023, ఆదివారం

ఉద్భటారాధ్యచరిత్ర

 తన ఉద్భటారాధ్యచరిత్రమనే ప్రబంధంలో శివపార్వతుల విహారాన్ని వర్ణించే సందర్భంలో 

రామకృష్ణకవి ఈ పద్యాన్ని వెలయించాడు.


సీ. తరుణశశాంకశేఖర మరాళమునకు 

సారగంభీర కాసార మగుచుఁ

గైలాసగిరినాథ కలకంఠభర్తకుఁ 

గొమరారు లేమావికొమ్మ యగుచు

సురలోకవాహినీధర షట్పదమునకుఁ 

బ్రాతురుద్బుద్ధ కంజాత మగుచు

రాజరాజప్రియ రాజకీరమునకు

మానితపంజర స్థానమగుచు

గీ. నురగవల్లభహార మయూరమునకుఁ 

జెన్ను మీఱిన భూధరశిఖర మగుచు 

లలితసౌభాగ్యలక్షణలక్షితాంగి 

యద్రినందన వొల్చె విహారవేళ.


అర్థనారీశ్వరతత్త్వాన్ని ఇలా అభేదంగా వర్ణించడంలో రామకృష్ణుని నేర్పు వ్యక్తమౌతోంది.


అద్రినందన తన భర్తకెపుడూ అనుకూలమే.

అందుకే ఆ పెద్దముత్తైదువ, ఆ సర్వమంగళ, 

లలితసౌభాగ్యలక్షణలక్షితాంగి.

లలితమైన సౌభాగ్య లక్షణాలకు ఆశ్రితమైన

అంగములు కలది./అటువంటి లక్షణాలకు ముఖ్యంగా చెప్పదగినది. అంటే లక్ష్యమైనది.


అటువంటి జగన్మాత కైలాసపర్వతోద్యానవనంలో

శివునితో కలసి విహరిస్తోంది.

అందువల్ల వర్ణితాంశాలన్నీ తోటల్లో ఉండేవే తీసుకోబడ్డాయి.


ఆ బాలచంద్రుని శిఖయందు ధరించిన శివుడు మరాళమైతే

ఆయన సానుకూలవతి సతి సార గంభీర సరోవరమయ్యింది.


నెలతాల్పు అంచకు 

కొండచూలి కొలను.


కైలాసగిరినాథుడైన ఆ మగకోకిలకు

అపర్ణ అందమైన లేత మావిడి కొమ్మ అయింది.


(లేత మావి చిగుళ్లే కోకిల కచేరీలకు సత్తువ నిచ్చేవి.)


పినాకి పికానికి 

వలిగట్టుదొరపట్టి లేమావికొమ్మ.


దేవలోకంలో ప్రవహించే గంగను ధరించిన

(షట్పదము=ఆరుపాదాలు కలది, తుమ్మెద.

షడంగాలు కల వేదరూపమే విశ్వనాథుడనే ధ్వని) 

ఆ భ్రమరానికి

భ్రమరాంబ ఉదయాన్నే ఉదయించిన ఉదజం అయింది.


మిన్నేటితాల్పు జంటముక్కాలికి

చలిమలపట్టి నీటిపుట్టువు.


కుబేరుని చెలికాడైన శ్రేష్ఠమైన చిలుకకు

కాత్యాయని కొనియాడబడే/చక్కనైన పంజర (ములో చిలుక ఉండే) స్థానం అయ్యింది


పైడిఱేనిచెలికాడు పచ్చఱెక్కలపక్కికి

పురుహూతి పంజరస్థానం.


సర్పరాజును హారంగా ధరించిన ఆ నెమలికి

అంబ అందం, విలాసం అతిశయించిన గిరిశిఖరం అయింది.


(నెమళ్లు పర్వతశిఖరాలమీదే ఎక్కువ చరిస్తూ/నర్తిస్తూంటాయి)


పాపఱేనితాల్పు పురిపులుగుకు

గుబ్బలిపట్టి కొండకొన.


ఇలా అద్రితనయ విశ్వనాథునితో విహరిస్తూ విరాజిల్లింది.

పతికి ప్రాధాన్యమిచ్చిన ఆ సతి

ఆయన ఎలా విహరిస్తున్నాడో దానికి తగ్గట్టు మార్పులు పొందుతోందని వర్ణన.

ఈ మార్పులే సృష్టి లీలలు.


అమ్మవారి సహకారంతోనే అయ్యవారు విహరించేది.

పరస్పరసహకారమే అర్థనారీశ్వరతత్త్వం.

 

వర్ణితాంశాలు గమనిస్తే
ఆమె అచలమైన ప్రకృతి,
ఆయన చలించే పురుషునిగా దర్శనమిస్తారు.


సౌందర్యలహరిలో శంకరులు అమ్మవారిని


శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం

న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి


అని వర్ణించారు 


శక్త్యా = శక్తితో

యుక్త = కూడి ఉండగా

శివః = శివుడు

ప్రభవితుం = సృష్టిచేయ

శక్తః = సమర్ధత కలవాడు (అవుతున్నాడు)

ఏవం = ఇలా

నచేత్ = కాకున్నట్లయితే

దేవః = ఆ శివుడు 

స్పందితుం అపి = చలించడానికైనా

నకుశలః = సామర్థ్యంగలవాడు కాడు.


దీన్ని మదిలో ఉంచుకొని

పై పద్యంలో రామకృష్ణకవి

జగత్తుకు ఆధారాధేయమగు శివశక్తిస్వరూపాన్ని 

(వారు అభేదమని తెల్పుతూ), 


ఆధారాధేయాలుగా


కాసారం - మరాళం

మావికొమ్మ - కలకంఠం

కంజాతం - షట్పదం

పంజరస్థానం - కీరం

భూధరశిఖరం - మయూరం


వీటిని గ్రహించి 

ఆధ్యాత్మిక దృష్టితోనూ,

( గంభీరమైన అంటే లోతైన వేదాంతాన్ని (కాసారం) మరాళరూపంలో.శివుడు పార్వతికి బోధించాడు. 

హంస తెల్లనిది, స్వచ్ఛమైనది. శుద్ధసత్త్వం. ఆ శుద్ధసత్త్వస్వరూపుడు పరమశివుడు. 

అలాగే వేదాంతశిఖరంపై శివమయూరం విహరించినట్లుగాను వర్ణన. )


ప్రబంధవర్ణనానుగుణంగానూ,

 (కోకిల - మావిచిగుళ్లు
షట్పదం - భ్రమరం)

ప్రబంధముఖ్యరసపరంగానూ,

అతిమనోజ్ఞంగా వర్ణించాడు.



-------------------------------------------


శివుడు

నెలతాల్పు = చంద్రుని ధరించినవాడు

పినాకి = పినాకము శివుని విల్లు 

మిన్నేటితాల్పు = గంగను ధరించినవాడు

పైడిఱేనిచెలికాడు = కుబేరుని స్నేహితుడు 

పాపఱేనితాల్పు = సర్పరాజును ధరించినవాడు


పార్వతి

అద్రినందన = కొండకూతురు

కొండచూలి = హిమవంతుని సంతానం/బిడ్డ 

అపర్ణ = పర్ణములు కూడా ఆహారంగా తీసుకోవడం మాని తపస్సు చేసినది.

వలిగట్టుదొరపట్టి = హిమవంతుని కుమార్తె.

చలిమలపట్టి = హిమవంతుని పుత్త్రి

పురుహూతి = అష్టాదశశక్తిపీఠాల్లో పిఠాపురంలో గుప్తంగా ఉన్న స్వరూపం.

గుబ్బలిపట్టి = గిరితనయ


హంస

మరాళం = తెల్లగా, స్వచ్ఛంగా ఉండేది.

అంచ


కోకిల

పికం = శబ్దం చేసేది

ఆధారాధేయాలు.
ఆధారం = ఆదరువు, ఆశ్రయం, ఆలంబం
ఆధేయం = ఉంచదగినది.
(ఘటం ఆధారం అయితే అందులో జలం ఆధేయం.)

 


మంగళం మహత్ 

8, జనవరి 2023, ఆదివారం

కూచిమంచి తిమ్మకవి తాళి

 “చిన్నివెన్నెలఱేఁడు చెన్నైన సికపువ్వు, పసమించు పులితోలు పట్టుసాలు, 


చిలువలయెకిమీఁడు బలుమానికపుఁదాళి, వాటంపుఁదెలిగిబ్బ వారువంబు,


గఱికిపూజల మెచ్చు గారాబుకొమరుండు, వలిగొండ కూతురు వలపుటింతి, 


జేజేతుటుములెల్లఁ జేరి కొల్చెడు బంట్లు, నునువెండి గుబ్బలి యునికిపట్టు, 


నగుచుఁ జెలువొంద, భువనంబు లనుదినంబు 


రమణఁ బాలించు నిన్ను నేఁ బ్రస్తుతింతు


బుధనుతవిలాస, పీఠికాపురనివాస


కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!"


కూచిమంచి తిమ్మకవి

రుక్మిణీ పరియణకావ్యం లోని

అవతారికలోనిదీ పద్యం.


పీఠికాపురకుక్కుటేశుని వర్ణన.


చిలువలయెకిమీడు ఆయన తాళి 

అన్నది సొగసైన ఊహ.


ఇక్కడ తాళి పదాన్ని 

హారం అనే అర్థంలో ప్రయోగించినా 

హారం అనకుండా 

తాళి అనడంలో 

ఒక చమత్కారం ఉంది.


తాళి (పెళ్లైన) ఆడువారిని ఎల్లప్పుడూ

అంటి పెట్టుకొనే ఉంటుంది కదా! విడువకుండా.


అందువల్ల మంగళసూత్రం అని స్ఫురింపజేయడమే తాళి పద ప్రయోగంలో

కవియొక్క ఉద్దేశం అని నా భావన.


ఈ సందర్భంలో తాళి గుఱించి కొన్ని విశేషాలు.


మంగళసూత్రానికి

ఐదువత్రాడు, కంటె, తాళి/లి, పుస్తె,

బొట్టు, త్రాడు, పసుపుత్రాడు, బొట్టుదారం, కంఠసూత్రం అనే పదాలు వాడుకలో ఉన్నాయి.


అయితే 

కేవల తాళి పదానికి

హారం, పతకం అనే అర్థాల్లో తప్ప

మంగళసూత్రం అనే అర్థంలో

నిఘంటుకారులు ప్రామాణికంగా 

భావించే కావ్యాదుల్లో

ప్రయోగాలు లేవు.


"తాలి" కి మాత్రం 

(శబ్దరత్నాకరంలో ఈ పదానికే మంగళసూత్రం అర్థం ఇచ్చారు.)

"తాలి విభుండు గట్టిన మొదల్‌." అని

పాండురంగ మహాత్మ్యంలో

కనబడుతోంది.


సదరు అర్థంలో 

ఐదువత్రాడు, కంటె, తాలి, పుస్తె, బొట్టు 

అనే పదాలే కవులు వాడారు.

 

"యామవతీ విలాసినికి నైదువత్రాడు"


"నలుదవనమాల కంటెయు 

మలినతనువు."


"పుస్తెగట్టిన యదిమొదల్‌ పొంతరావు." 


"గొట్టుపడితివే మెడను బొట్టుగట్టిన విభుఁడు."


ఐదువత్రాడు 15 వ శతాబ్దం నాటి పదం.


తాళి కట్టడమే వివాహముహూర్తమని చాలామంది అనుకొనే ఇంత ప్రాధాన్యమున్న ఈ పుస్తెల సంగతే వివాహమంత్రాలలో ఎక్కడా లేదన్నది ఈ సందర్భంలో గమనార్హం.


పైగా ఈ తాళిబొట్లు ఉత్తరాదివారికి లేనేలేవు. తలబ్రాలు కూడా లేవు.

దక్షిణాదివారిలోనే ఈ ఆచారాలు.


అంతేకాక ఈ పుస్తె గుండ్రంగా ఉండాలా 

లేక రావాకు ఆకారంలో ఉండాలా 

అని కొన్ని కుటుంబాలలో గుద్దులాటలు కూడా జరుగుతూ ఉంటాయి. 

అరవవారికి ఈ ఆకారం కనపడదు.


మన తెలుగు కవుల కావ్యాల్లోనే 

మంగళసూత్రవ్యవహారం కనబడుతుంది.


"గాంగేయగాత్రి గళమున, మంగళసూత్రంబుఁ గట్టె మాధవసుతుఁ డా"


ఇక పద్యానికి సంబంధించి

ఒకట్రెండు విశేషాలు చెప్తాను.


హాకిమ్ అనే హిందీ పదంనుండి 

ఎకిమీడు పుట్టింది.

యజమాని దాని అర్థం.


ఎకిమీడుని రాజు, శ్రేష్ఠుడు అనే అర్థాల్లో మనవారు ముగ్గురు కవులు వాడారు.


జేజేతుటుములు అనేది 

బహుబాగైన నూతనపదబంధంగా చెప్పవచ్చు.


జేజే అంటే దేవత.

దేవతాసమూహాలు అని అర్థం.


వారు శివుని చేరి కొలిచే బంట్లు 

అని కవి వర్ణన.


తరువాత పద్యాంతచరణద్వయం

"బుధనుతవిలాస! పీఠికాపురనివాస! కుముదహితకోటిసంకాశ! కుక్కుటేశ!"


తిమ్మకవి 

"బుధనుత" ను భూనుత చేసి,


"భూనుతవిలాస! పీఠికాపురనివాస! కుముదహితకోటిసంకాశ! కుక్కుటేశ!"

అని మకుటంగా మార్చుకొని,

కుక్కుటేశ్వరశతకం వ్రాశాడు.


చక్కని తెలుగుతేనెసోన 

లొలుకుతున్న పద్యం.


మంగళం మహత్