26, జనవరి 2023, గురువారం

శృంగారదమయంతీనైషధసమాలాపము

నలుడు తిరస్కరిణీవిద్యమహిమతో దమయంతి అంతఃపురంలోకి ప్రవేశించి, ఇంద్రాగ్నియమవరుణుల సందేశాన్ని వినిపించటానికై ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యాడు. 

ఆమె గౌరవించి, వంశనామాదులు అడిగింది.

అపుడు నలుడు దిక్పతుల పంపున దూతగా వచ్చానని చెప్పి వారి(లో నొకరి)ని వరించమని కొన్ని మాటలు చెప్పాక దమయంతి,

"ప్రశ్న మొక్కటి యొక్కటి ప్రతివచనము

యుక్తి యనుకూలమై యుండ దుభయ మునకు 

నేను నీవంశనామంబు లెవ్వి యనిన 

నెవ్వరినో ప్రస్తుతించితి వింతతడవు


అడిగిన ప్రశ్న ఒకటి. నీ సమాధానం మరొకటి. అడిగింది చెప్పలేదు.నేను నీ వంశనామాలేవి అంటే అది వదిలేసి ఇంతసేపూ ఎవరినో ప్రస్తుతిస్తున్నావు.

(దిక్పాలురని తెలిసి కూడా "ఎవరినో" అని అనడంలో వారి పట్ల ఆమె అనాదరభావం తెలుస్తోంది.)


ఒక చోటఁ బ్రకాశించియు

నొక చోట నిగూఢ యగుచు నొదవించెం గౌ 

తుకలక్ష్మి నీసరస్వతి

ప్రకటయు గూఢయును నగు సరస్వతి వోలెన్ 

ఒకచోట కనిపిస్తూ, ఒకచోట అదృశ్యమయ్యే సరస్వతినదిలా నీ సరస్వతి (వాక్కు) ప్రశ్నకు సంబంధించినదానిలా స్పష్టమవుతూ ఒకసారి, సంబంధించనిదానిలా (అంతర్వాహిని అవడంచేత) అస్పష్టమవుతూ మరోసారి వేడుకను పుట్టిస్తోంది.


అధికతరు లైనఁగాని దిశాధిపతులు

కౌతుకము నాకు నీవంశకథలయందు

దప్పిగొన్నట్టివారి కాదప్పి దీఱ 

సలిలపూరంబు హితవొ యాజ్యంబు హితవొ

దిక్పాలురు అధికతరులైతే అవ్వచ్చు. కానీ నాకు నీవంశకథలు తెలుసుకోవడంలోనే వేడుక. నేయి అధికమైనదైనా, దప్పిక తీరడానికి నీరే కదా! హితవైనది. ఆలోచించు.

నా ప్రశ్నకు నీ ఉత్తరం అప్పులా మిగిలిపోయింది. ఇప్పుడైనా ఋణం తీర్చుకో. ఏ వంశం(వెదురు) నీలాంటి నాయకమణిని(ముత్తెం) భరించింది? ఏ వర్ణాలు నీ పుణ్యనామానికి ప్రకాశకాలవుతున్నాయి?"

(వెదురులో ముత్తెం పుడుతుంది. బృ.సం.)

అని పలికి ఊరకుంది.

అపుడు నలుడు, 

"వంశకథ అలా ఉండనీ. చెప్పకూడదు. ఎందుకంటే నీచకులమైతే చెప్పుకోదగదు. అవమానం. గొప్పకులమైనా చెప్పుకోలేను. ఎందుకంటే ఇలా సేవకత్వం/దూతత్వం వహించి, రావడంచేత చెప్పడం ఉచితం కాదు.

రాజవదనా! నీవు రాచకన్యవు. మానవీయవు. మన మైత్రికి అఱ (కొఱత/సగం/కపటం) చేయకూడదు. కొంచెం చెప్తా. నేను మనుజవిభుణ్ణి. రాజ(చంద్ర)వంశ(వెదురు)మొలకని.


పేరడుగం దలంచెదవు భీమతనూభవ! యావిచారముం

దూరము సేయు మెవ్వరికి దోసము తాఁదన పేరు సెప్పు టా 

చార పరంపరాస్థితికి శాస్త్రము మూలము శాస్త్ర చోదితా 

చార వివేకహీనుఁ డగు జాల్ముని మెత్తురె? పండితోత్తముల్


తన పేరు తాను చెప్పుకోవడం దోషం. శాస్త్రాచారాన్ని తప్పను.

(ఆత్మనామ గురోర్నామ నామాతికృపణస్యచ

శ్రేయస్కామీ నగృహ్ణీయాత్ జ్యేష్ఠా పత్య కళత్రయోః'

అనే స్మృతివచనం తన పేరు తాను చెప్పుకోకూడదని శాసిస్తోంది.)

అదీ గాక,

కువలయనేత్ర! సమక్ష

వ్యవహారంబునకు యుష్మదస్మత్పదముల్

శ్రవణశ్రావణ యోగ్యము

లవుచుండఁగఁ బేరు సెప్ప నడుగఁగ నేలా?

ఎదురెదురు వ్యవహారాల్లో నీవు నేను అనే పదాలు వినడానికి, వినిపించడానికి హాయిగా ఉండగా, ఇక పేరుతో పనేమిటి?

(నాదీ ఇదే వ్యవహారం-స్వగతం-క్షమించాలి.)

అని నలుడు శారదంబైన అడవినెమలిలా పలికాడు. (నెమలి వర్షాకాలంలో కూసి, శరత్కాలంలో మౌనం వహిస్తుంది. అందుకని ఆ పోలిక. పోలికనుబట్టి మౌనం దాల్చాడని ఊహ్యం.)

ఆ పల్కులలోని ప్రతి పదం అనురాగం కల్గించగా ఆ దమయంతి, రాజహంసిలా (శరత్కాలంలో నెమలి ధ్వని చేయదు కానీ, రాజహంస ధ్వని చేస్తుంది.)

........బలి కె నిట్లని మహీపాలుతోడ 

నన్వయం బెఱిఁగించి యభిధాన మెఱిఁగింప కునికి మ మ్మాదరించిన తెఱంగె ?


యనఘ! మము నీవు వంచింప నభిలషించె 

దేము నేరమె వంచింప నిపుడు నిన్నుఁ 

బేరు సెప్పిన నీ కనాచార మేని

మాకు నాయంబె నీతోడ మాటలాడ.


అన్వయం చెప్పి, అభిధానం చెప్పకపోవడం ఏవిధంగా మామీద ఆదరం చూపినట్లు?

మమ్మల్ని నీవు వంచింప తలస్తే మేము నిన్ను వంచింపలేమా!? నీ పేరు చెప్పడం నీకు అనాచారమైతే, (పరపురుషుడవు, క్రొత్తవాడవైన) నీతో మాట్లాడడం మాకు న్యాయమా!?


అన్య పురుషులతోడ నెయ్యంపుగోష్ఠి 

యధిప ! మముబోఁటిరాజకన్యకల కగునె 

యది కులాబలాచారసహాసనాస

హాతిసాహసకౌతూహలావసథము

మాలాంటి రాజకన్యలకు పరపురుషులతో ఇష్టాగోష్ఠి కులకాంతల ఆచారానికి ఎంతమాత్రం పొసగని అతిసాహసపు వేడుక కాదా!

అతిసౌందర్యవంతులైన మగవారితో అంతఃపురంలో ఇంతసేపు మాట్లాడడం కులకన్యలకు తగదు." అంది.

దాంతో సమాధానం ఏం చెప్పాలా అని ఆలోచించి, ఏమీ తోచక, నలుడు, ఆమె వచోనైపుణ్యానికి మనసులో అభినందిస్తూ, చిఱునవ్వుతో ఇలా అన్నాడు.

"చేతులు జోడించి అడుగుతున్నాను. దేవతల(లో ఒకరిని) వరించి నా సమధికాయాసాన్ని సఫలం చెయ్యి. నా కార్యం నెఱవేర్చు.

ఇంద్రాదులు నారాకకై ఎదురుచూస్తూంటారు. కాలయాపన చేయకు."  అన్నాడు.


సశేషం

మంగళం మహత్ 


కామెంట్‌లు లేవు: