15, జనవరి 2023, ఆదివారం

ఉద్భటారాధ్యచరిత్ర

 తన ఉద్భటారాధ్యచరిత్రమనే ప్రబంధంలో శివపార్వతుల విహారాన్ని వర్ణించే సందర్భంలో 

రామకృష్ణకవి ఈ పద్యాన్ని వెలయించాడు.


సీ. తరుణశశాంకశేఖర మరాళమునకు 

సారగంభీర కాసార మగుచుఁ

గైలాసగిరినాథ కలకంఠభర్తకుఁ 

గొమరారు లేమావికొమ్మ యగుచు

సురలోకవాహినీధర షట్పదమునకుఁ 

బ్రాతురుద్బుద్ధ కంజాత మగుచు

రాజరాజప్రియ రాజకీరమునకు

మానితపంజర స్థానమగుచు

గీ. నురగవల్లభహార మయూరమునకుఁ 

జెన్ను మీఱిన భూధరశిఖర మగుచు 

లలితసౌభాగ్యలక్షణలక్షితాంగి 

యద్రినందన వొల్చె విహారవేళ.


అర్థనారీశ్వరతత్త్వాన్ని ఇలా అభేదంగా వర్ణించడంలో రామకృష్ణుని నేర్పు వ్యక్తమౌతోంది.


అద్రినందన తన భర్తకెపుడూ అనుకూలమే.

అందుకే ఆ పెద్దముత్తైదువ, ఆ సర్వమంగళ, 

లలితసౌభాగ్యలక్షణలక్షితాంగి.

లలితమైన సౌభాగ్య లక్షణాలకు ఆశ్రితమైన

అంగములు కలది./అటువంటి లక్షణాలకు ముఖ్యంగా చెప్పదగినది. అంటే లక్ష్యమైనది.


అటువంటి జగన్మాత కైలాసపర్వతోద్యానవనంలో

శివునితో కలసి విహరిస్తోంది.

అందువల్ల వర్ణితాంశాలన్నీ తోటల్లో ఉండేవే తీసుకోబడ్డాయి.


ఆ బాలచంద్రుని శిఖయందు ధరించిన శివుడు మరాళమైతే

ఆయన సానుకూలవతి సతి సార గంభీర సరోవరమయ్యింది.


నెలతాల్పు అంచకు 

కొండచూలి కొలను.


కైలాసగిరినాథుడైన ఆ మగకోకిలకు

అపర్ణ అందమైన లేత మావిడి కొమ్మ అయింది.


(లేత మావి చిగుళ్లే కోకిల కచేరీలకు సత్తువ నిచ్చేవి.)


పినాకి పికానికి 

వలిగట్టుదొరపట్టి లేమావికొమ్మ.


దేవలోకంలో ప్రవహించే గంగను ధరించిన

(షట్పదము=ఆరుపాదాలు కలది, తుమ్మెద.

షడంగాలు కల వేదరూపమే విశ్వనాథుడనే ధ్వని) 

ఆ భ్రమరానికి

భ్రమరాంబ ఉదయాన్నే ఉదయించిన ఉదజం అయింది.


మిన్నేటితాల్పు జంటముక్కాలికి

చలిమలపట్టి నీటిపుట్టువు.


కుబేరుని చెలికాడైన శ్రేష్ఠమైన చిలుకకు

కాత్యాయని కొనియాడబడే/చక్కనైన పంజర (ములో చిలుక ఉండే) స్థానం అయ్యింది


పైడిఱేనిచెలికాడు పచ్చఱెక్కలపక్కికి

పురుహూతి పంజరస్థానం.


సర్పరాజును హారంగా ధరించిన ఆ నెమలికి

అంబ అందం, విలాసం అతిశయించిన గిరిశిఖరం అయింది.


(నెమళ్లు పర్వతశిఖరాలమీదే ఎక్కువ చరిస్తూ/నర్తిస్తూంటాయి)


పాపఱేనితాల్పు పురిపులుగుకు

గుబ్బలిపట్టి కొండకొన.


ఇలా అద్రితనయ విశ్వనాథునితో విహరిస్తూ విరాజిల్లింది.

పతికి ప్రాధాన్యమిచ్చిన ఆ సతి

ఆయన ఎలా విహరిస్తున్నాడో దానికి తగ్గట్టు మార్పులు పొందుతోందని వర్ణన.

ఈ మార్పులే సృష్టి లీలలు.


అమ్మవారి సహకారంతోనే అయ్యవారు విహరించేది.

పరస్పరసహకారమే అర్థనారీశ్వరతత్త్వం.

 

వర్ణితాంశాలు గమనిస్తే
ఆమె అచలమైన ప్రకృతి,
ఆయన చలించే పురుషునిగా దర్శనమిస్తారు.


సౌందర్యలహరిలో శంకరులు అమ్మవారిని


శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం

న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి


అని వర్ణించారు 


శక్త్యా = శక్తితో

యుక్త = కూడి ఉండగా

శివః = శివుడు

ప్రభవితుం = సృష్టిచేయ

శక్తః = సమర్ధత కలవాడు (అవుతున్నాడు)

ఏవం = ఇలా

నచేత్ = కాకున్నట్లయితే

దేవః = ఆ శివుడు 

స్పందితుం అపి = చలించడానికైనా

నకుశలః = సామర్థ్యంగలవాడు కాడు.


దీన్ని మదిలో ఉంచుకొని

పై పద్యంలో రామకృష్ణకవి

జగత్తుకు ఆధారాధేయమగు శివశక్తిస్వరూపాన్ని 

(వారు అభేదమని తెల్పుతూ), 


ఆధారాధేయాలుగా


కాసారం - మరాళం

మావికొమ్మ - కలకంఠం

కంజాతం - షట్పదం

పంజరస్థానం - కీరం

భూధరశిఖరం - మయూరం


వీటిని గ్రహించి 

ఆధ్యాత్మిక దృష్టితోనూ,

( గంభీరమైన అంటే లోతైన వేదాంతాన్ని (కాసారం) మరాళరూపంలో.శివుడు పార్వతికి బోధించాడు. 

హంస తెల్లనిది, స్వచ్ఛమైనది. శుద్ధసత్త్వం. ఆ శుద్ధసత్త్వస్వరూపుడు పరమశివుడు. 

అలాగే వేదాంతశిఖరంపై శివమయూరం విహరించినట్లుగాను వర్ణన. )


ప్రబంధవర్ణనానుగుణంగానూ,

 (కోకిల - మావిచిగుళ్లు
షట్పదం - భ్రమరం)

ప్రబంధముఖ్యరసపరంగానూ,

అతిమనోజ్ఞంగా వర్ణించాడు.



-------------------------------------------


శివుడు

నెలతాల్పు = చంద్రుని ధరించినవాడు

పినాకి = పినాకము శివుని విల్లు 

మిన్నేటితాల్పు = గంగను ధరించినవాడు

పైడిఱేనిచెలికాడు = కుబేరుని స్నేహితుడు 

పాపఱేనితాల్పు = సర్పరాజును ధరించినవాడు


పార్వతి

అద్రినందన = కొండకూతురు

కొండచూలి = హిమవంతుని సంతానం/బిడ్డ 

అపర్ణ = పర్ణములు కూడా ఆహారంగా తీసుకోవడం మాని తపస్సు చేసినది.

వలిగట్టుదొరపట్టి = హిమవంతుని కుమార్తె.

చలిమలపట్టి = హిమవంతుని పుత్త్రి

పురుహూతి = అష్టాదశశక్తిపీఠాల్లో పిఠాపురంలో గుప్తంగా ఉన్న స్వరూపం.

గుబ్బలిపట్టి = గిరితనయ


హంస

మరాళం = తెల్లగా, స్వచ్ఛంగా ఉండేది.

అంచ


కోకిల

పికం = శబ్దం చేసేది

ఆధారాధేయాలు.
ఆధారం = ఆదరువు, ఆశ్రయం, ఆలంబం
ఆధేయం = ఉంచదగినది.
(ఘటం ఆధారం అయితే అందులో జలం ఆధేయం.)

 


మంగళం మహత్ 

కామెంట్‌లు లేవు: