8, జనవరి 2023, ఆదివారం

కూచిమంచి తిమ్మకవి తాళి

 “చిన్నివెన్నెలఱేఁడు చెన్నైన సికపువ్వు, పసమించు పులితోలు పట్టుసాలు, 


చిలువలయెకిమీఁడు బలుమానికపుఁదాళి, వాటంపుఁదెలిగిబ్బ వారువంబు,


గఱికిపూజల మెచ్చు గారాబుకొమరుండు, వలిగొండ కూతురు వలపుటింతి, 


జేజేతుటుములెల్లఁ జేరి కొల్చెడు బంట్లు, నునువెండి గుబ్బలి యునికిపట్టు, 


నగుచుఁ జెలువొంద, భువనంబు లనుదినంబు 


రమణఁ బాలించు నిన్ను నేఁ బ్రస్తుతింతు


బుధనుతవిలాస, పీఠికాపురనివాస


కుముదహితకోటిసంకాశ, కుక్కుటేశ!"


కూచిమంచి తిమ్మకవి

రుక్మిణీ పరియణకావ్యం లోని

అవతారికలోనిదీ పద్యం.


పీఠికాపురకుక్కుటేశుని వర్ణన.


చిలువలయెకిమీడు ఆయన తాళి 

అన్నది సొగసైన ఊహ.


ఇక్కడ తాళి పదాన్ని 

హారం అనే అర్థంలో ప్రయోగించినా 

హారం అనకుండా 

తాళి అనడంలో 

ఒక చమత్కారం ఉంది.


తాళి (పెళ్లైన) ఆడువారిని ఎల్లప్పుడూ

అంటి పెట్టుకొనే ఉంటుంది కదా! విడువకుండా.


అందువల్ల మంగళసూత్రం అని స్ఫురింపజేయడమే తాళి పద ప్రయోగంలో

కవియొక్క ఉద్దేశం అని నా భావన.


ఈ సందర్భంలో తాళి గుఱించి కొన్ని విశేషాలు.


మంగళసూత్రానికి

ఐదువత్రాడు, కంటె, తాళి/లి, పుస్తె,

బొట్టు, త్రాడు, పసుపుత్రాడు, బొట్టుదారం, కంఠసూత్రం అనే పదాలు వాడుకలో ఉన్నాయి.


అయితే 

కేవల తాళి పదానికి

హారం, పతకం అనే అర్థాల్లో తప్ప

మంగళసూత్రం అనే అర్థంలో

నిఘంటుకారులు ప్రామాణికంగా 

భావించే కావ్యాదుల్లో

ప్రయోగాలు లేవు.


"తాలి" కి మాత్రం 

(శబ్దరత్నాకరంలో ఈ పదానికే మంగళసూత్రం అర్థం ఇచ్చారు.)

"తాలి విభుండు గట్టిన మొదల్‌." అని

పాండురంగ మహాత్మ్యంలో

కనబడుతోంది.


సదరు అర్థంలో 

ఐదువత్రాడు, కంటె, తాలి, పుస్తె, బొట్టు 

అనే పదాలే కవులు వాడారు.

 

"యామవతీ విలాసినికి నైదువత్రాడు"


"నలుదవనమాల కంటెయు 

మలినతనువు."


"పుస్తెగట్టిన యదిమొదల్‌ పొంతరావు." 


"గొట్టుపడితివే మెడను బొట్టుగట్టిన విభుఁడు."


ఐదువత్రాడు 15 వ శతాబ్దం నాటి పదం.


తాళి కట్టడమే వివాహముహూర్తమని చాలామంది అనుకొనే ఇంత ప్రాధాన్యమున్న ఈ పుస్తెల సంగతే వివాహమంత్రాలలో ఎక్కడా లేదన్నది ఈ సందర్భంలో గమనార్హం.


పైగా ఈ తాళిబొట్లు ఉత్తరాదివారికి లేనేలేవు. తలబ్రాలు కూడా లేవు.

దక్షిణాదివారిలోనే ఈ ఆచారాలు.


అంతేకాక ఈ పుస్తె గుండ్రంగా ఉండాలా 

లేక రావాకు ఆకారంలో ఉండాలా 

అని కొన్ని కుటుంబాలలో గుద్దులాటలు కూడా జరుగుతూ ఉంటాయి. 

అరవవారికి ఈ ఆకారం కనపడదు.


మన తెలుగు కవుల కావ్యాల్లోనే 

మంగళసూత్రవ్యవహారం కనబడుతుంది.


"గాంగేయగాత్రి గళమున, మంగళసూత్రంబుఁ గట్టె మాధవసుతుఁ డా"


ఇక పద్యానికి సంబంధించి

ఒకట్రెండు విశేషాలు చెప్తాను.


హాకిమ్ అనే హిందీ పదంనుండి 

ఎకిమీడు పుట్టింది.

యజమాని దాని అర్థం.


ఎకిమీడుని రాజు, శ్రేష్ఠుడు అనే అర్థాల్లో మనవారు ముగ్గురు కవులు వాడారు.


జేజేతుటుములు అనేది 

బహుబాగైన నూతనపదబంధంగా చెప్పవచ్చు.


జేజే అంటే దేవత.

దేవతాసమూహాలు అని అర్థం.


వారు శివుని చేరి కొలిచే బంట్లు 

అని కవి వర్ణన.


తరువాత పద్యాంతచరణద్వయం

"బుధనుతవిలాస! పీఠికాపురనివాస! కుముదహితకోటిసంకాశ! కుక్కుటేశ!"


తిమ్మకవి 

"బుధనుత" ను భూనుత చేసి,


"భూనుతవిలాస! పీఠికాపురనివాస! కుముదహితకోటిసంకాశ! కుక్కుటేశ!"

అని మకుటంగా మార్చుకొని,

కుక్కుటేశ్వరశతకం వ్రాశాడు.


చక్కని తెలుగుతేనెసోన 

లొలుకుతున్న పద్యం.


మంగళం మహత్





కామెంట్‌లు లేవు: