27, ఫిబ్రవరి 2023, సోమవారం

చందమామ రావో! జాబిల్లి రావో!

 క్షీరసాగరమథనంలో జగన్మాత లక్ష్మి ప్రభవించాక చంద్రుడు పుట్టాడు. అంటే లక్ష్మికి తమ్ముడు. ఆ వరుసలో మాత తమ్ముడు చంద్రుడు లోకానికి మామ అయ్యాడు. ఆ మామను చూపి, తెలుగుతల్లులు తమ బిడ్డలకు గోరుముద్దలు తినిపించడం అందఱెఱిగినదే.


అలాగే అన్నమయ్య కూడా వ్రేపల్లె వెళ్లాడు. తల్లి యశోదలా మారి, బాలకృష్ణునికి వెన్నపాలు తెమ్మని చందమామకు చేస్తున్న విన్నపాలివి.


'చందమామ రావో... జాబిల్లి రావో

మంచి కుందనపు పైడికోర వెన్నపాలు తేవో'


ఓ చందమామా! ఓ జాబిల్లీ! రావో

(పదాంతమందు గల 'ఓ' ప్రార్థనను తెల్పుతుంది. అంటే ప్రార్థనాపూర్వకంగా రమ్మనడం)

మంచి మేలిమి బంగారు గిన్నెలో వెన్నపాలు తేవో!


ఇంతవఱకు యశోదలా వెన్నపాలు కోరాక ఎటువంటివానికి తేవాలో చెప్పే తాదాత్మ్యంలో మళ్లీ అన్నమయ్యలా మారిపోయి ఎన్నో విశేణాలతో ఇలా వర్ణిస్తున్నాడు స్వామిని.


*"నగుమోము చక్కనయ్యకు నలువ పుట్టించిన తండ్రికి 

నిగమములందుండే అప్పకు మా నీలవర్ణునికి 

జగమెల్ల ఏలిన స్వామికి చక్కని ఇందిర మగనికి 

ముగురికి మొదలైన ఘనునికి మా ముద్దుల మురారి బాలునికి"*


నవ్వులు కురిపించే మోము గల చక్కని అయ్యకు, 

బ్రహ్మను కన్న జగత్పితకు

వేదాలలో ఉండే తండ్రికి,

నీలమేఘంవంటి వర్ణం కల మావానికి, 

జగాన్ని పరిపాలించే స్వామికి, 

చక్కనైన లచ్చి మగనికి,

ముగురయ్యలకు (త్రిమూర్తులు) మూలమైన గొప్పవానికి


(ఇది సామాన్యార్థం.

ముగురిలో ఈయన ఎలా మొదలవుతాడని ఆలోచిస్తూంటే ఒక అర్థం స్ఫురించింది. నారాయణుడు స్వయంగా ఆవిర్భవించాక నలువను పుట్టించాడు కదా! '

ఆత్మావై పుత్రనామాసి' 

కొడుకంటే తనే కదా! 

అపుడు జీవుల పుట్టుక పోషణకు 

ఈయన మొదలు. 

(మఱి చివర ఎవరు? అంటే లయకారుడు.)

ఇంకో అర్థం తనకు విష్ణువే మొదలు. అన్నిటా అంతటా ఒకటే ఇరవైన వెన్నుని నామమే వేదం అన్నమయ్యకు. )

ముర (అనే రాక్షసుని) కూల్చిన మా ముద్దుల బాలునికి,

మంచి మేలిమి బంగారు గిన్నెలో వెన్నపాలు తేవలసింది.


*"తెలిదమ్మి కన్నులమేటికి మంచి తియ్యని మాటలగుమ్మకు 

కలికిచేతల కోడెకు మా కతలకారి ఈ బిడ్డకు 

కులముద్ధరించిన పట్టెకు మంచి గుణములు కలిగిన కోడెకు

నిలువెల్ల నిండ వొయ్యారికి నవనిధుల చూపులచూసే సుగుణునకు"*


తెల్లతామరపూల లాంటి కళ్ళతో మేటియైనవానికి, 

(పుండరీకాక్షుడు, పుండరీకవరదుడు)

గుమ్మలా అంటే పాలు పితికితే వచ్చే ధారలా తియ్యగా మాట్లాడే వానికి,

(గోపికామానసచోరుడు)

మనోజ్ఞమైన చేతలు కలిగిన కోడె (కోడెప్రాయపువయసుగల) వానికి, 

(రాసలీలలు)

(మంచి) మాటకారియైన మా ఈ బిడ్డడికి,

(రాయబారాలు)

వంశాన్నుద్ధరించిన పట్టికి, 

మంచిగుణాలు కలిగిన చిన్నవానికి,

నిలువెల్ల విలాసం, అందం, సొగసు నిండిపోయినవానికి,

(మోహిన్యవతారం)

నవనిధులచూపులు చూసే సుగుణరాశికి,

(ఆయన ఒక్క చూపుతోనే వలసినవానికి నవనిధులు సంప్రాప్తిస్తాయి - కుచేలోపాఖ్యానం)

మంచి మేలిమి బంగారు గిన్నెలో వెన్నపాలు తేవలసింది.


(అన్నమయ్య కీర్తనల్లో అవసరం మేరకు మానసికంగా ఆయా ప్రాంతాల్ని, అక్కడి దేవతామూర్తులను సందర్శించాక తిరిగి వేంకటనాథుని ఒద్దకు తిరుమలకు వచ్చేస్తాడు. ఇక్కడ కూడా అలాగే వచ్చి, కృష్ణుడేగా వేంకటనాథుడు అంటూ ముక్తాయింపు పల్కుతూ...)


*"సురలగాచిన దేవరకు చుంచు గరుడునెక్కిన గబ్బికి 

నెఱవాది బుద్ధుల పెద్దకు మా నీటు చేతలపట్టికి 

విరుల వింటివాని అయ్యకు వేవేలు రూపుల స్వామికి 

సిరి మించు నెరవాది జాణకు మా శ్రీవేంకటనాథునికి..."*      


దేవతలను రక్షించిన దేవరకు,

వయస్సులో ఉన్న గరుడునిపై ఎక్కిన దిట్టకు

సమర్థమైన బుద్ధులు కల శ్రేష్ఠునికి,

మురిపెమైన (శృంగార)చేతలు కల్గిన 

మా పట్టికి, 

పూలవిల్లు కల్గిన మరుని యొక్క నాన్నకు,

వేవేలరూపాలు కలిగిన స్వామికి,

(అనేకావతారాలు)

మించిన లక్ష్మీకళలతో సమర్థుడైన జాణకు,

మా తిరుమలశ్రీవేంకటనాథునికి,

మంచి మేలిమి బంగారు గిన్నెలో వెన్నపాలు తేవలసింది.


ఇలా కీర్తిస్తూ కృష్ణునికి ఎన్నో నీటైన విశేణాలను కుప్పపోశాడు. కృష్ణగుణాలనే తియ్యని వెన్నపాలను మనకి అందించాడు అన్నమయ్య.


మంగళం మహత్ 

18, ఫిబ్రవరి 2023, శనివారం

ధర్మం చేయడం అంటే

 ధర్మం క్రియారూపంలోనే ఉంటుందండి.

అందుకే దానికి సాధ్యం అని పేరు.

సాధింపబడేది, చేయబడేది ధర్మం అని తెలుసుకోవాలి.

అది క్రియాధారమూ, క్రియాఫలితమూను.


సర్వాగమానా మాచారః 

ప్రథమం పరికల్పితః

ఆచార ప్రభవో ధర్మః 

ధర్మస్య ప్రభు రచ్యుతః


సర్వాగమాలనుండి మొదట ఆచారం పరికల్పించబడింది. ఆచారం నుండి ధర్మం ప్రభవించింది. అటువంటి ధర్మానికి అచ్యుతుడు ప్రభువు.


అందువల్ల క్రియారూపంలోనే ధర్మం ప్రవర్తిలుతుంది.


ధర్మశబ్దానికి - “ధరతి విశ్వం ధర్మః 

ధృఞ్ ధరణే” -  విశ్వాన్ని ధరించేది అని నిర్వచనం.


తాని ధర్మాణి ప్రథమాన్యాస న్నితి వేదే.

ఏష ధర్మస్సనాతనః ఇతి లోకే.


ధరతి లోకానితి ధర్మః - లోకాల్ని ధరించేది.

ధ్రియతే వా జనైరితి ధర్మః - జనులచేత పూనబడేది.


"ధారణాత్ ధర్మమిత్యాహుః" 

మనం దానిని ధరించుట చేతనూ 

(అనగా ఆచరించడం చేత) 

దాని చేత ధరింపబడుట చేతనూ 

(అనగా మనల్ని రక్షించుట చేతను) 

ఆ అర్థం సార్ధకం.

అందుకే “ధర్మో రక్షతి రక్షితః" మనచేత రక్షింపబడిననాడు ధర్మం మనలను రక్షిస్తుం దని చెప్పబడింది. అంటే - ధర్మమార్గంలో నడచిన వానిని సుఖశాంతులు, శాశ్వతకీర్తి, ఆముష్మికలోకాలు కలుగుతాయి.  


పురుషార్థాల్లో ధర్మానిదే కదా! మొదటిస్థానం.

ధర్మయుతంగానే అర్థకామమోక్షాల్ని సాధించాలి.


"ధర్మశ్చ జానాతి నరస్యవృత్తమ్”  -

మానవు లేపని చేసినా, ఎవరు చూడలేదని చాటునా మాటునా చేసినా, వాటి సుకృత - దుష్కృతాలను తెలిసికొని యమునికి సాక్ష్యమిస్తుంది ధర్మం. అందుకే ఈ ధర్మ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 

కళ్లు తెరచుకొని ఉండాలి. కనుకే


'“ధర్మంచర” - “ధర్మం ఆచరించు." 

"ధర్మాన్న ప్రమదితవ్యం" - ధర్మ విషయంలో పొరపాటు పనికిరాదు మొదలైన ఉపదేశ (శాసన) వాక్యాలెన్నో వేదశాస్త్రాలు వివరించాయి. 


ధర్మవిరుద్ధమైన ఏపనీ శ్రేయస్సు నివ్వదని గీతోపదేశం.


ధర్మోనామ 'శ్లో॥ విద్వద్భిస్సేవితం సద్భిర్నిత్య మద్వేషరాగిభిః హృదయే -నాభ్యనుజ్ఞాతో యో ధర్మస్తం నిబోధ'తేతి మనువచనాత్ శిష్టాచారానుమిత శ్రుతి స్మృతి ప్రమాణక శ్రేయస్సాధన భూతో జ్యోతిప్టోమాదిః। చోదనాలక్షణార్థో ధర్మ ఇతి జైమిని వచనాచ్చ యజేతేత్యాది విధిబోధితో వేదప్రమాణకం శ్రేయస్సాధనం జ్యోతిప్టోమాది రేవ ధర్మః.


ధర్మమనగా:- 'రాగద్వేషాల్ని పారద్రోలిన మహాత్ములు నిత్యం దేన్ని సేవిస్తారో,

వారు దేన్ని అనుమతిస్తారో అది ధర్మం'.


ఈ స్మృతివాక్యాన్నిబట్టి మోక్షసాధనమైన జ్యోతిష్టోమం మున్నగు సత్కర్మలే ధర్మమని గుర్తించాలి. ఈ కర్మలు వేదాలవల్ల, ధర్మశాస్త్రాలవల్ల, సదాచార సంపన్నులైన మహాత్ముల ఆచరణాలవల్ల గ్రహించాలి. 


అదీగాక 'చోదనాలక్షణోఽర్థోధర్మః' అనే జైమినిసూత్రం వల్ల కూడా జ్యోతిష్టోమాది యాగాలే ధర్మమని తెలుస్తోంది.


(చోదనాలక్షణః =వేదములో 'చేయవలెను' అనే అర్థం వచ్చే ప్రత్యయం కలిగినట్టి, 

అర్థః = శ్రేయస్సాధనమైనట్టి కర్మ, 

ధర్మః= ధర్మం అని సదరు జైమినివాక్యానికి అర్థం.


పైవన్నీ పరిశీలించి చూస్తే ధర్మం చేయబడేది అని తెలుస్తుంది. 


అయితే 

"శ్రుతిశ్చ భిన్నా స్మృతయశ్చ భిన్నా మహామునీనాం మతయశ్చ భిన్నాఃధర్మస్య తత్త్వం నిహితం గుహాయాం మహాజనో యేన గతస్స పంథా"


ఒకే విషయంలో భిన్నమార్గాల్ని ఆదేశించే రెండు వేదవాక్యాలు, అలాగే రెండు స్మృతివాక్యాలు కనిపించి తికమకపరిస్తే  అలాంటప్పుడు పెద్దల ఆచార మెలా ఉంటుందో తెలుసుకొని దాన్ని ప్రమాణంగా గ్రహించాలి.


అలాగే 

పరధర్మాన్ని అనుష్ఠించరాదు.

స్వధర్మే నిధనం శ్రేయః

పరధర్మో భయావహః.


తల్లి తండ్రుల సేవ చేయడం ధర్మం.

మీ వృత్తిని సరిగా చేయడం ధర్మం.

ఆశ్రితుల్ని పోషించడం ధర్మం.

ఇలా ప్రతిపని ధర్మం తప్పకుండా చేయాలి.


మంగళం మహత్ 

14, ఫిబ్రవరి 2023, మంగళవారం

శృంగారదమయంతీనైషధసమాలాపము

 నలుడలా అన్నాక ఒక రీతి విని, ఒకభంగి వినని ఆ దమయంతి కొంచెం సేపు, తల వంచుకొని, విచారించి, తరువాత నిట్టూర్పు విడచి ఇలా అంది.


"నీప్రవర్తన, క్రూరంగా ఉంది. మాటిమాటికీ, నా చెవుల్లో దిక్పాలుర దుష్టసందేశవాక్యాలనే సూదికొనల్ని చొప్పిస్తున్నావు. తగదిది. ఒద్దన్నాను కదా! అయినా యమదూతకు బాధకలిగించడం నైజమే. 


ఎల్లి (నేటి వ్యవహారంలో రేపు) కల్యాణం (స్వయంవరం) వస్తోంది. ఈ అవాచిక వార్తలు మానెయ్యి. 


ఓపిక ఉంటే నలుని వర్ణించు. నీ పాపం అంతా పోతుంది. నేడు, ఎల్లి సురలకేం తొందర వచ్చింది? విశ్రాంతి తీసుకో. హంస చూపిన చిత్రపటాన్ని గూర్చి ఆలోచిస్తే నీయందు నలుని రూపం కనిపిస్తోంది. (సరే) నీకు దణ్ణం పెడతాను. 'దేవతల్ని వరించు' అనే ప్రార్థన మానెయ్యి."


స్నేహం, ప్రేమ, మచ్చిక కలగలిపి దమయంతి పలికింది విని, నలుడు,


""నీవు వరించకపోయినా ఇంద్రుడు కల్పవృక్షాన్ని ప్రార్థించి, నిన్ను దివికి రప్పించుకొంటే నీకు దిక్కేది?


యాగం నిర్వహించి, దాని సహాయంతో అగ్ని నిన్ను పొందితే ఏం చేయగలవు? (సర్వకామనలను తీర్చే యాగాలతో అగ్నికి నిత్యసంబంధం కాబట్టి సులభమే. )


అలాగే తన దగ్గరున్న అగస్త్యుని ప్రార్థించి, యముడు, (అగస్త్యుడు యముని దగ్గర ఉండడం ఏమంటే ఆయన వింధ్యపర్వతాన్ని నియంత్రించి దక్షిణదిక్కున ఉండిపోయాడు కాబట్టి యమునికి దగ్గరని )


కామధేనువును యాచించి అంబుపతి (వరుణుడు) నిన్ను చేపడితే ఎలా మఱి?


(వరుణుడు చేసే యాగాలకు హవిస్సులకోసం కామధేనువు తల్లోకానికి పోయి ఉందని రఘువంశంలో ఉందికదా!సముద్రం ఆమెకు పుట్టిల్లు. వరుణునికి సులభురాలు అని.)


కాబట్టి ఎవరో ఒకరిని వరించు. భక్తితో దేవతల చిత్తాన్ని పట్టకపోతే పనులకు అంతరాయం కలుగుతుంది.(స్వయంవరం చెడుతుంది)" అన్నాడు.


సశేషం 


మంగళం మహత్ 

10, ఫిబ్రవరి 2023, శుక్రవారం

తెనుఁగు నుడికారం

తోటనిండా ఆనపపాదులు. పచ్చటి పువ్వులు. వెన్నెల పరిచినట్లు దొడ్డి అంతా అలుముకుని ఉన్నాయి. ఒకవారగా మాలతీలత విరియబూచిఉంది. తెల్లటిపువ్వులు ఆకులను కూడా మూసేస్తున్నాయి. వాటి గుబాళింపుకి చరాచరవిశ్వమంతా పులకరించిపోతోంది. ఒక గండుతుమ్మెద ఝుమ్ముమంటూ తోటంతా అలంగం తిరిగేస్తోంది. సొరపువ్వులమీద వాలి తేనె జుర్రుకుంటోంది. ఆ తుమ్మెద తన దగ్గరకి కూడా వస్తుందని ఆశపడింది మాలతి. తేటి దానిదగ్గరకు వచ్చినట్లే వచ్చి, చటుక్కున మలుపు తిరిగి, మాలతిని చూడనైనా చూడకుండా మరో ఆనప పువ్వుమీద వాలింది. దాని తరవాత మరో పువ్వు. తరువాత మరోటి. అంతేకాని మాలతికేసి కన్నెత్తి చూడలేదు. మాలతికి ఉడుకుబోతుతనం వచ్చేసింది. నా పువ్వులు సొరపువ్వులపాటి చెయ్యక పోయాయా అని గుడ్లనీరు కుక్కుకుంది. రాత్రి కురిసిన మంచుబిందువులు మాలతీగుచ్ఛముల మీదినుంచి కన్నీళ్లలా రాలి నేలని పడ్డాయి. 


దానిమూగవేదన గ్రహించాడు, జగన్నాథ పండితరాయలు. దగ్గరగావచ్చి మాలతి శిరస్సున చెయ్యివేసి ప్రేమగా బుజ్జగింపుగా దువ్వేడు. అంత వరకూ ఆపుకుంటున్న దుఃఖం ఒక్కసారిగా పెల్లుబికి వచ్చేసింది. మాలతి బావురుమంది. మంచు జలజలా రాలింది.


'నేను ఆనపపువ్వులకన్న తీసిపోయానా?'


'అని ఎవరు అన్నారు?'


'అదిగో ఆ తుమ్మెద. ఇందాకటినుంచి చూస్తు న్నాను. ఎంతసేపూ ఆ పచ్చపువ్వులని పట్టుకుని దేవుళ్లాడుతుందే కాని నా వైపు ఒక్కసారి అంటే ఒక్కసారి అయినా చూసిందా ? '


'ఎంత పిచ్చిదానివి మాలతీ! ఈ పాటి దానికి కళ్లనీళ్లు పెట్టుకుంటున్నావా?'


'ఇది తక్కువ అవమానమా?'


'అవునుగానీ ఆ పొగరుతుమ్మెదకి ఎన్నికాళ్లూ?' 


'దాని కాళ్ల సంగతి ఎందుకు ఇప్పుడూ?' 


'ఎందుకో చెప్తాగా.'


'ఆరు కాబోలు. అవును ఆరే. షట్పది అని పేరు కూడా పెట్టేరుగా.'


'పశువుకి ఎన్నికాళ్లు?'


'నాలుగు కదా!'


'అవునా మరి. నాలుగు కాళ్లు ఉంటే పశువు అంటారు. ఆరుకాళ్లు ఉన్న ఈ తుమ్మెద ఆ లెక్కని పశువున్నరకాదూ? దానికి బుద్ధి ఎక్కడఉంటుందీ? బుద్ధి లేని పశువున్నర నీదగ్గరకు రావడంకన్న రాకపోతేనే నీకు మర్యాదకాదూ?'  



కిం మాలతి! మ్లాయసి మాం విహాయ 

చుచుంబ తుంబీకుసుమం షడంఘ్రిః

లోకే చతుర్భిశ్చరణైః పశు స్యాత్ 

సషడ్భి రత్యర్థ పశు ర్నకింస్యాత్ ? 


మాలతి పకపకా నవ్వింది. 


'మీరు తెలుగువారా?'


పండితరాయలు తెల్లబోయాడు. 

'ఏమి అలా అడిగేవు ?


'పశువున్నర అనేది వెధవన్నరలాగ అచ్చంగా తెనుగు నుడికారం, దానిని తమరు అత్యర్ధ పశువు అని సంస్కృతీకరించారు. తెలుగురాని కేవల సంస్కృత కవి ఇటువంటి ప్రయోగం చెయ్యడు'


'తెలుగు నుడికారాన్ని ప్రయోగిస్తున్నానని నాకు తట్టనే లేదు సుమా! గడుసుదానివి' అని జగన్నాథుడు మాలతి నీపు తట్టేడు.


మాలతి పువ్వులు, నవ్వులు కలయబోసి విరచిమ్మింది.


డా. మహీధర నళినీమోహన్..


మంగళం మహత్ 

9, ఫిబ్రవరి 2023, గురువారం

సుభాషితం

చెలువౌ రత్నఘటంబునం దతఁడు సుశ్రీఖండఖండంబులం

దిలపిణ్యాకము వండె నారుగల కర్థిన్ సప్తపర్ణావృతుల్ 

నిలిపెన్ జిల్లెడుదూదికై పుడమి దున్నెన్ బైఁడినాఁగేళ్ల ని

మ్ములఁ గర్మక్షితిఁ బుట్టి యెవ్వఁడు దపంబుల్ సేయఁ డప్రాజ్ఞతన్


అన్వయం: 

కర్మక్షితిన్ పుట్టి అప్రాజ్ఞతన్ తపంబుల్ ఎవ్వడు చేయడు అతడు

సుశ్రీఖండఖండంబులన్ చెలువౌ రత్నఘటంబునందు తిలపిణ్యాకము వండెన్

అర్థిన్ ఆరుగలకు సప్తపర్ణ ఆవృతుల్ నిలిపెన్

జిల్లెడుదూదికై పైడినాగేళ్లన్ పుడమి దున్నెన్


పైపద్యంలో 

ఇమ్ములన్, చెలువౌ, అర్థిన్ అనేవి పూరణార్థపదాలు.


ఇమ్ములన్=అనుకూలమైన/యుక్తమైన 

ఈ కర్మభూమిలో పుట్టి కూడా అప్రాజ్ఞతతో ఎవడు తపస్సులను చేయడో వాడు,


రత్న(ఖచిత)ఘటమందు(కుండనందు) మంచిగంధపుకట్టెలతో

తెలికపిండిని (గానుగ పిండి) వండే వానితోను,

(మట్టిపాత్ర చాలుగా!)


కప్పురపుటరంటులను కోరి నఱకి, 

ఆరుగలకు (ఒకరకమైన సస్యం/ఆహారధాన్యం, ఆళ్లు, ఆరికెలు అంటారు) కంచె వేసేవాడితోను,

(ముళ్లకొమ్మలు కదా! కావలసినది)


జిల్లేడు(వేఱు అని మూలం) దూది (ఇది పాఠాంతరం)కోసం బంగారునాగళ్లతో భూమిని దున్నేవాడితోను సమానం అవుతాడు.


నా(గ)స్వ(ర)వ్యాఖ్య: 

ఇమ్ములన్ అనే పదాన్ని కవి చక్కగా ప్రయోగించాడు.


చాంద్రాయణాది అన్ని రకాల తపస్సులకు అనుకూలమైన, యోగ్యమైన కర్మభూమి మన భారతదేశం.


అటువంటి భూమిలో పుట్టి ఏది పరమార్థమో తెలుసుకోక, ఆత్మసాక్షాత్కారానికి ప్రయత్నించకుండా అప్రాజ్ఞతతో ప్రవర్తిస్తున్న వారికి ఉపదేశమిది.


అయితే తపస్సు అంటే ముక్కు మూసుకొని చేసేదే కాదు. గీతలో శారీరక వాచిక మానసికాలనే త్రివిధ తపస్సులను పేర్కొన్నారు.


పైన చెప్పినట్లు పనికిమాలిన పనులను చేయకుండా సత్కర్మలు చేయడం కూడా తపస్సే. 


కాన శ్రేయస్సు కోరేవారు సర్వవిధాల సత్కర్మలను అనుష్ఠించాలని, పుణ్యకర్మమే సఫలం కాని అన్యం కాదని భావం. 

మంగళం మహత్ 



కల్యాణమా? కళ్యాణమా?

 కల్యాణం అనే పదమే సరియైనది.


దీనికి శుభం అని, 

స్వచ్ఛమైన బంగారు అని అర్థాలు.


శ్వ శ్శ్రేయసం శివం భద్రం కల్యాణం మఙ్గళం శుభమ్ - ఇవి పర్యాయపదాలు.


కల్యం సుఖం అణయతి ప్రాపయతి ఇతి కల్యాణం.

సుఖాన్ని పొందించేది అని.


ఇంకో వ్యుత్పత్తి కూడా ఉంది.


కల్యే ప్రాతః అణ్యతే శబ్ద్యతే. 

ప్రాతఃకాలంలో

(ప్రొద్దున) ఉచ్చరింపబడేది. 

మంగళాచరణం అన్నమాట.


విష్ణుపురాణంలో కనిపిస్తుంది ఇది.

దేవాలయాల్లో ఉదయమే మంగళాచరణాలతో స్వామిని మేల్కొల్పుతారు.

అలాగే పూర్వం రాజులు ప్రాతఃకాలంలో 

కల్యాణ శబ్దాలు వింటూ నిద్ర లేచేవారు.

దానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉండేవి.


ఇక కళ్యాణం అన్నది లేదు.

ల ళ లకు భేదం లేకపోవడంతో 

ఎవరో పుట్టించారు.


అలాగే కల్యాణానికి పెండ్లి అనే అర్థం లేదు.


మానవ జీవితంలో అతి పెద్ద శుభకార్యం 

పెండ్లే కాబట్టి కల్యాణం అనే పేరు వివాహానికి సమానపదంగా వచ్చి చేరింది.


కవిత్రయభారతంవారు పెండ్లి అనే అర్థం కాదు కదా! శుభం అనే అర్థంలో కూడా ప్రయోగించినట్లు కనిపించదు.


పోతన కాలానికి వివాహార్థం వచ్చింది

అని అనిపిస్తుంది.


తెనాలి రామకృష్ణకవి వివాహార్థంలో కల్యాణ శబ్దాన్ని వాడాడు.


స్వస్తి


మంగళం మహత్ 






8, ఫిబ్రవరి 2023, బుధవారం

సప్తాక్షరమంత్రం

  ఏ స్వల్ప ప్రయత్నంచేత 

విష్ణుసహస్రనామస్తోత్రపఠనఫలితం లభిస్తుంది?

దీనికి విష్ణుసహస్రనామస్తోత్రం ఉత్తరపీఠికలో సమాధానముంది.


పార్వత్యువాచ


కేనోపాయేన లఘునా 

విష్ణోర్నామ సహస్రకమ్

పఠ్యతే పండితైర్నిత్యం

శ్రోతు మిచ్ఛామ్యహం ప్రభో


"ప్రభూ! ఏ ఉపాయంచేత విష్ణుసహస్రనామం తేలిక/చిన్నగా నిత్యం పండితులచేత పఠింపబడుతుందో దాన్ని నేను వినగోరుతున్నాను. (చెప్పు)."


(సహస్రనామాలు చదివే ఓపిక లేదా వీలు లేనప్పుడు సులువుగా దేన్ని పఠిస్తే విష్ణుసహస్రనామస్తోత్రపఠనఫలితం లభిస్తుంది?)

అని ఒకనాడు పార్వతి పరమశివుని ప్రశ్నించింది.


అపుడు ఈశ్వరుడు,


"శ్రీరామ రామ రామేతి

రమే రామే మనోరమే

సహస్ర నామ తత్తుల్యం

రామ నామ వరాననే


మనస్సును రంజింపజేసే ఓ పార్వతీ!

(నేను) శ్రీరామ రామ రామ అని (జపిస్తూ)

రాముని యందు రమిస్తూంటాను.

(ఆనందిస్తూంటాను.)


శ్రేష్ఠ/అందమైన ముఖం కలదానా!/సుముఖీ!

ఆ రామనామం సహస్రనామాలతో సమానమైనది.


(సహస్రనామాలు పఠించలేనివారు ముమ్మారు (త్రికరణశుద్ధిగా) శ్రీరామ రామ రామ అంటే సహస్రనామపారాయణంతో సమానమైన ఫలితం లభిస్తుంది.)"


అని ఉపదేశించాడు.



నా(గ)స్వ(ర)వ్యాఖ్య: 


మనోరమే, వరాననే అన్నవి పార్వతిని ఉద్దేశించిన సంబోధనలు.


మఱి మనం మంత్రంగా పఠించేటప్పుడు అనవచ్చా ? అంటే 


"అవి స్త్రీలింగపదాలైనప్పుడు పార్వతికి సంబంధించిన సంబోధనలే.


పుంలింగాలైతే 

మనోరముడైన 

వరాననుడైన రామునియందు 

రమిస్తున్నాను" అని మంత్రవేత్తలు వివరణ ఇచ్చారు.



గుణాలు మనస్సుని ఆకర్షిస్తాయి.

అందువల్ల రాముడు తన శ్రేష్ఠమైన గుణాలతో మనోరముడు,

తన సౌందర్యాతిశయంతో వరాననుడు అయ్యాడు.


అందువల్ల ఈశ్వరుడే రామతత్త్వమందు రమిస్తూ స్వయంగా రామనామం సహస్రనామతుల్యం అని ఉపదేశించాడు 

శ్రీరామ రామ రామలో 

శకార రకార ఇకార బీజమయమైన

"శ్రీ"ని ప్రథమంగా చేర్చి,

మహామంత్రాలకు మూలమైన 

ఈశ్వరుడే చెప్పినందువల్ల

ఇది మహామంత్రమైంది.

కాన సర్వులూ శ్రీరామ రామ రామ అని జపిస్తూ సహస్రనామజపఫలితాన్ని పొంది, తరించెదరు గాక!



మంగళం మహత్ 






7, ఫిబ్రవరి 2023, మంగళవారం

శృంగారదమయంతీనైషధసమాలాపము

 అపుడు దమయంతి,

"(పరి) హసించి ఊరుకుంటే కొంటెతనం. కాదు కాదనడం నింద. మాఱు మాట్లాడకపోవడం తిరస్కారం. కాబట్టి ప్రత్యుత్తరం ఇస్తున్నాను.

.......నఖిలలోకాధీశుఁ డమరేంద్రుఁ డెక్కడ 

నేనెక్కడ వరాటి నెన్ని చూడ 

నలపతివ్రత యైన యేఁ దలఁప నొరునిఁ 

దివిరి నిందించియేఁ బ్రస్తుతించి యేని 

నలినబిససూత్రమును బురంధ్రుల తలంపు 

సమము త్రెయ్యును లవ చాపలముననైన.


ఆడులేడి ఏనుగుకూ, ఇత్తడి సొమ్ము ధనవంతునకూ తగనట్లు, ముదుకబట్టలాంటి నేను ఇంద్రునకు తగను. అతడెక్కడ? నేనెక్కడ? 

నలుడు పతి అని వ్రతం పూనాను. (నన్ను) నిందించినా, ప్రస్తుతించినా (లేదా తెగడి కానీ పొగడి కానీ) పరుని తలపను. తామరతూటిదారమూ, కుటుంబినుల తలపూ ఒకటే. కొంచెపు చాపలం చేతనే త్రెగిపోతుంది..

బహురత్నభూషణాలతో విభూషితులయ్యే రాచవారికి ఒకప్పటికైనా ఇత్తడి కడియం ఇష్టం కానట్టు ఎల్ల అచ్చరపడతుల విటకాడు మనుష్యస్త్రీని వేడుకచేయతగునా?

నా ప్రతిజ్ఞ తత్పరత విను. నలుని పెండ్లాడతాను. ఆయన అంగీకరించకపోతే ఆయనకు (ఏదో ఒక మరణప్రయత్నం ద్వారా) ప్రాణాలిస్తాను." అని తీక్ష్ణంగా అన్నది.

కోకిలవంటి ఆమె కంఠధ్వనిని ఇంకా వినాలనే కోరికతో నలుడిలా అన్నాడు.

"నిరుపేద ఇంటికి నిధి రానే రాదు. ఒకవేళ వచ్చినా తన అభాగ్యతవల్ల తలుపు వేసుకొంటాడు కానీ లోపలకు రానివ్వడు.

ఇనుము రససంబంధంవల్ల స్వర్ణంగా మారినట్లు ఇంద్రసంబంధంచేత వచ్చే దేవత్వాన్ని ఎందుకు ఒద్దంటావ్?

నీవు ఏవిధంగా దేహత్యాగం చేసినా (ఉరి/జలం/అగ్ని) ఘట్టకుటికాప్రభాతన్యాయంలా మళ్లీ వారిలో ఒకరిని చేరాలి.

ఒల్లననుమాట కర్థ మో యుత్పలాక్షి!

వలతుననుమాట గాదుగా వక్రరీతి

విధి నిషేధరూపంబు భావించియున్న

విధియ యగు వ్యంగ్య వాసనా విలసనమున

ఒల్లననే మాటకు వక్రరీతిని వలతును అని కాదుగా!? ఎందుకంటే విధి నిషేధరూపంలో ఉన్నా వ్యంగ్యార్థం భాసిస్తే విధే అవుతుంది.

వైభవం బిచ్చగించి పావనతఁ గోరి

ధర్మశీలత యర్థించి నిర్మలత్వ 

మాసపడి వీరి నలువురయందు నొకని 

వేఁడుమా చూచెదము నీవివేకశక్తి

వైభవం (ఇంద్రుని) ఇచ్చగిస్తావో!? 

శుచిత్వం (అగ్నిని) కోరతావో!?

ధర్మస్వభావం (యముని) అర్థిస్తావో!? 

నిర్మలత్వం (వరుణుని) ఆసపడతావో!?

వీనిలో ఒకరిని వరించు. నీ వివేకశక్తిని చూద్దాం."

సశేషం


మంగళం మహత్