28, అక్టోబర్ 2022, శుక్రవారం

రామాయణంలో సముద్రుడు

 వాల్మీకి, 

రామాయణంలో ఎక్కడా

ఇందువల్ల ఇలా జరిగింది.

అందువల్ల అలా జరిగింది 

అని పేర్కొంటూ

ఏ సంఘటనా వ్రాయలేదు.

ఉన్నది ఉన్నట్లు జరిగిన కథను వ్రాశాడంతే.


అందువల్ల ఆయా ఘట్టాలు జరిగిన తర్వాత వాటిని అన్వయం చేసుకొంటూ వెళ్లగల్గితే కార్యకారణసంబంధాలు తెలుస్తాయి.


రామాయణవ్యాఖ్యాతలు కొందఱు 

వాటిని వివరించారు.


సముద్రుడు మైనాకునితో

హనుమంతుడు వస్తున్న 

విషయం గుఱించి చెప్పి


"సలిలాదూర్ధ్వముత్తిష్ఠ 

తిష్టత్వేష కపిస్త్వయి, 

అస్మాకమతిథి శ్చైవ 

పూజ్యశ్చ ప్లవతాం వరః.


అతిథి అయిన ఈ హనుమంతుఁడు నీమీద నిలవడానికి వీలైనట్లు ఉదకంనుండి పైకి లే.


చామీకరమహానాభ

దేవగంధర్వ సేవిత,

హనుమాంస్త్వయి విశ్రాంత

స్తతః శేషం గమిష్యతి.


హనుమంతుడు నీపై కొంత సేపు విశ్రమించి, పిమ్మట, మిగిలిన దూరం ప్రయాణం చేయగలడు.


కాకుత్థ్సస్యానృశంస్యం చ 

మైథిల్యాశ్చ నివాసనమ్, 

శ్రమం చ ప్లవగేన్ద్రస్య 

సమీక్ష్యోత్థాతుమర్హసి.


రాముని సాధుత్వాన్ని,

సీతయొక్క (లంకా) వాసాన్ని,

హనుమంతుని శ్రమను, 

దృష్టిలో ఉంచుకొని పైకి లే " అని అన్నాడు.


(సముద్రుడు రామునిలో 

సాధుత్వాన్ని చూశాడు. 

ఇది గుర్తుపెట్టుకోండి)


అపుడు మైనాకుడు పైకి లేచి,


"తిష్ఠ త్వం హరిశార్దూల 

మయి విశ్రమ్య గమ్యతామ్.


ఓ, వానరోత్తమా! ఆగి, 

నా పై విశ్రమించి,

వెళ్ళు." అన్నాడు.


హనుమంతుడు సున్నితంగా తిరస్కరించి, ముందుకు సాగిపోయాడు.


దేవతాశ్చభవన్ హృష్టా

స్తత్రస్థాస్తస్య కర్మణా, 

కాఞ్చనస్య సునాభస్య 

సహస్రాక్షశ్చ వాసవః.


మైనాకుడుచేసిన ఈ పనికి, 

అక్కడ ఉన్న దేవతలు, దేవేంద్రుడు కూడ 

చాల సంతోషించారు.


ఇంద్రుడు సంతోషంతో గొంతు గద్గదం కాగా,


"హిరణ్యనాభ శైలేన్ద్ర

పరితుష్టోఽస్మి తే దృశమ్, 

అభయం తే ప్రయచ్ఛామి 

తిష్ఠ సౌమ్య యథాసుఖమ్.


ఓ మైనాకుడా। నీ విషయంలో చాల సంతోషించాను. నీకు అభయ మిస్తున్నాను. ఇటుపై సుఖంగా ఉండు."


అని వరం ఇచ్చాడు.


వాల్మీకి చెప్పకపోయినా, 

మైనాకుని భయం తీరడానికి 

సముద్రుడు చేసిన సాయం ఇది అని 

ఇదంతా జరిగాక మనకు తెలుస్తుంది.


మైనాకునికి ఇంద్రుని భయం పోనంత

వఱకు తనలో ఉన్న మైనాకునివల్ల

తనకు కూడా ఇబ్బందే. ఇపుడు ఇద్దరికీ ఇబ్బందులు తీరాయి.


ఇది ఒక ఘట్టం.


తర్వాత రామాదులు ససైన్యంగా 

సముద్రతీరానికి చేరారు.


తతః సాగరవేలాయాం 

దర్భానాస్తీర్య రాఘవః, 

అంజలిం ప్రాఙ్ముఖః కృత్వా 

ప్రతిశిశ్యే మహోదధేః

బాహుం భుజఙ్గభోగాభ

ముపధాయారిసూదనః.


పిమ్మట రాముడు సముద్రతీరమందు 

దర్భలు పరచుకొని సముద్రానికి నమస్కరించి, సర్పశరీరంలా ఉన్న బాహువును తలగడగా ఉంచుకొని ప్రాఙ్ముఖుడై శయనించాడు.


సత్రిరాత్రోషితస్తత్ర 

నయజ్ఞో ధర్మవత్సలః,

ఉపాసత తదా రామః 

సాగరం సరితాం పతిమ్.


నీతి, ధర్మం తెలిసిన రాముడు 

అక్కడ మూడు దినాలు శయనించి 

సముద్రుని ఉపాసించాడు.


న చ దర్శయతే రూపం 

మందో రామస్య సాగరః, 

ప్రయతేనాపి రామేణ 

యథార్హమభిపూజితః,


ఆ విధంగా రాముడు నియమవంతుడై యథావిధిగా పూజించినా 

మందుడైన సముద్రుడు దర్శనం ఇవ్వలేదు.


దాంతో రామునికి కోపం వచ్చింది.


విచిన్వన్నాభిజానాసి

పౌరుషం వాపి విక్రమమ్, 

దానవాలయ సంతానం 

మత్తో నామ గమిష్యసి.


సముద్రుడా! నీవు పరిశీలించి కూడా 

నా పౌరుషపరాక్రమాల్ని గుర్తించలేకున్నావు.

నా వలన ఇప్పుడు సంతాపం పొందగలవు.


బ్రాహ్మేణాస్త్రేణ సంయోజ్య 

బ్రహ్మదండనిభం శరమ్, 

సంయోజ్య ధనుషి శ్రేష్ఠే

విచకర్ష మహాబలః


రాముడు, బ్రహ్మదండంతో సమానమైన 

బాణాన్ని  బ్రహ్మాస్త్రంతో కూర్చి, 

ధనస్సునందు చేర్చి లాగాడు.


(భూమ్యాకాశాలు బ్రద్దలైనట్లయ్యాయి.

కొండలు కంపించాయి.)


సహసాభూత్తతో వేగా

ద్భీమవేగో మహోదధిః, 

యోజనం వ్యతిచక్రామ

వేలామన్యత్ర సంప్లవాత్.


అప్పుడు మహాసముద్రం శీఘ్రంగా భయంకరమైన వేగం పొంది, ఆ వేగంవల్ల రామాదులున్న వైపునుండి ఒక యోజనం లోపలికి పోయింది.


తం తథా సమతిక్రాంతం

నాతిచక్రామ రాఘవః, 

సముద్ధతమమిత్రఘ్న 

రామో నదనదీపతిమ్


రాముడు ఆ విధంగా దూరానికి తొలగిన (పారిపోతున్న వానిపై బాణం వేస్తే ధర్మాన్ని అతిక్రమించినట్లవుతుంది. అందువల్ల) సముద్రునిపై  బాణం వేయలేదు. 


తతో మధ్యాత్సముద్రస్య

సాగరః స్వయముత్థితః

ఉదయం హి మహాశైలా

న్మేరోరివ దివాకరః.


అప్పుడు సముద్రంమధ్యనుండి సముద్రుడు, మేరుపర్వతంనుండి సూర్యుడు ఉదయించినట్లు స్వయంగా ఆవిర్భవించాడు.


రామునితో ఇలా అన్నాడు.


'పృథివీ వాయురాకాశ

మాపో జ్యోతిశ్చ రాఘవ

స్వభావే సౌమ్య తిష్ఠంతి 

శాశ్వతం మార్గమాశ్రితాః


ఓ సౌమ్యా! రామా ! భూమి, వాయువు, ఆకాశం, జలం, అగ్ని శాశ్వతమార్గాన్ని అనుసరించి తమ స్వభావాన్ని దాటకుండా ఉంటాయి.


(ఇక్కడ సౌమ్య అనే విశేషణం గమనించండి)


తత్స్వభావో మమాప్యేష 

యదగాధో హమఫ్లవః 

వికారస్తు భవేద్గాధ 

ఏతత్తే ప్రవదామ్యహమ్.


లోతుగా దాటశక్యం కాకుండ ఉండడం అనేది  

నా స్వభావం. లోతు లేనివాడ నైతే అది నా స్వభావానికే విరుద్ధం. ఈ విషయం నీకు చెప్తున్నాను, విను.


న కామాన్న చ లోభాద్వా 

న భయాత్పార్డివాత్మజ,

రాగాన్నక్రాకులజలం 

స్తంభయేయం కథంచన. 


రాజకుమారా ! మొసళ్లతో వ్యాకులంగా ఉండే జలాన్ని నేనెన్నడూ ఏదైనా కోరికవలన గాని, లోభంవలన గాని, భయంవలన గాని, ప్రేమవలన గాని స్తంభింపచేయను.


విధాస్యే యేనగంతాసి

విషహిష్యే హ్యహం తథా,

న గ్రాహా విధమిష్యన్తి 

యావత్సేనా తరిష్యతి, 

హరీణాం తరణే రామ 

కరిష్యామి యథాస్థలమ్.


రామా! నీవు దాటటానికి వీలుగా నేను ఏర్పాటు చేస్తాను. స్థలాన్ని ఏర్పరచి సహించి ఉంటాను.

సేన దాటేవఱకు మొసళ్లు అపకారం చేయకుండా చేస్తాను."


( భయపెట్టినా సరే జలాన్ని స్తంభింపజేయనని, 

తన సహజస్వభావానికి విరుద్ధంగా 

లోతు తగ్గించడం అనేది కూడా కుదరదని

సముద్రుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. 

అన్యాపదేశంగా సేతుబంధనం కావించమని సూచిస్తున్నాడు.)


అప్పుడు రాముడు సముద్రునితో ఇలా అన్నాడు.


"అమోఘోఽయం మహాబాణః

కస్మిన్ దేశే నిపాత్యతామ్.


అమోఘమైన ఈ మహాబాణం వ్యర్థమవటానికి వీలు లేదు. దీన్ని ఎక్కడ ప్రయోగించను?"


గొప్పదైన ఆ బాణాన్ని చూసి, రామునితో

సముద్రుడు ఇలా అన్నాడు.


"ఉత్తరేణావకాశోఽస్తి

కశ్చిత్పుణ్యతరో మమ,

ద్రుమకుల్య ఇతి ఖ్యాతో 

లోకే ఖ్యాతో యథా భవాన్.


నాకు, ఉత్తరంగా, ద్రుమకుల్యం అనే 

మిక్కిలి పుణ్యతరమైన, 

నీలాగే ప్రసిద్ధి పొందిన

ఒక ప్రదేశం  ఉంది.


ఉగ్రదర్శనకర్మాణో 

బహవస్తత్ర దస్యవః

ఆభీరప్రముఖాః పాపాః 

పిబన్తి సలిలం మమ.


అక్కడ చూడ్డానికి భయంకరులు, ఉగ్రమైన పనులు చేసేవారు, పాపాత్ములైన ఆభీరులు మొదలైన దస్యువులు నా జలం త్రాగుతున్నారు.


తైర్న తత్స్పర్శనం పాపం 

సహేయం పాపకర్మభిః, 

అమోఘః క్రియతాం రామ 

తత్ర తేషు శరోత్తమః.


రామా! ఆ పాపాత్ముల స్పర్శను సహించలేకున్నాను. ఈ శ్రేష్ఠమైన బాణాన్ని

ఆ ప్రదేశంలో వాళ్ల మీద ప్రయోగించు"


అపుడు రాముడు ఆ ప్రదేశం మీద బాణాన్ని ప్రయోగించాడు.


ఆ తర్వాత సముద్రుడు రామునితో


"అయం సౌమ్య నలో నామ 

తనయో విశ్వకర్మణః, 

పిత్రా దత్తవరః శ్రీమాన్ 

ప్రతిమో విశ్వకర్మణః.


ఏష సేతుం మహోత్సాహః 

కరోతు మయి వానరః, 

తమహం ధారయిష్యామి 

యథాహ్యేష పితా తథా.


నలుడు విశ్వకర్మ కుమారుడు. 

తండ్రి విశ్వకర్మతో సమానుడు. 


మహోత్సాహవంతుడైన 

ఈ వానరుడు నామీద నిర్మించిన 

సేతువును నేను ధరిస్తాను. 

నాకు ఇతని తండ్రి ఎంతో 

ఇతడు కూడ అంతే." 


అని చెప్పి అంతర్థానమయ్యాడు.


(పై రెండు శ్లోకాలు గమనించారుగా!

ఉత్సాహవంతుడు అనే నలుని విశేషణం.

సేతువు ఉత్సాహం సముద్రునిది.

విశ్వకర్మ ప్రతిభ తెల్సిన సముద్రుడు

నలుని నైపుణ్యాన్ని కూడా తెల్సుకోగోరుతున్నాడని అర్థమవుతుంది.)


ఇక్కడ సందేహం వస్తుంది.


 — రామకార్యం అని చెప్పి భక్త్యాదరాలతో రాముని బంటునే మైనాకుని చేత సత్కరింపబూనిన సముద్రుడు మఱి మూడు రోజులు ఎందుకు ఆలసించాడు?


వివరణ — ప్ర్రార్థించినంత మాత్రానే ప్రసన్నుడై దర్శన మిచ్చి మార్గమిచ్చినట్లయితే

అందఱూ ఈ మార్గాన్నే అనుసరిస్తారు.

నీవు త్రోవ ఇత్తువా చత్తుమా అని ప్రాయోపవేశానికి దిగుతారు.

అలాంటి వ్యవహారానికి దారి చూపించినట్లవుతుంది.

ఇప్పుడో అంతటి రామచంద్రమూర్తికి సాధ్యంగానిది మన కవుతుందా అని విరమిస్తారు.


(రాముడు మానవుడని మఱచిపోరాదు.

ప్రాయోపవేశానికి దిగినంతనే సముద్రుడొస్తే తక్కిన మానవులకది ఆదర్శమవుతుందని తాత్పర్యం. అమోఘపరాక్రమంచేతనే సాధ్యమవ్వాలని సముద్రుడు లోకానికి నిరూపించడం కోసం ఆలసించాడు.)


ఇంకో కారణం.

ఈయనచేత తనకు శత్రువులైన ఆభీరులను చంపించాలి. అది రామచంద్రునకు తప్ప తక్కిన వారికి సాధ్యమయ్యేది కాదు.

కావున స్వామికార్యం స్వకార్యం రెండూ చక్కబడ్డంకోసం ఇంతవఱకు ఆలసించాడు. 

అంతేతప్ప రామచంద్రమూర్తి మహిమ ఎఱుఁగక కాదు. రామచంద్రమూర్తి ఎంత కోపించినా నమస్కరిస్తే క్షమిస్తాడని (సౌమ్యుడన్నాడందుకే)

సముద్రునికి తెలుసు.


ఇంకో విషయం.

త్వరలో రామరావణులమధ్య ఘోరయుద్ధం జరుగబోతోంది. రాముని సాధుత్వం తెలుసు. మైనాకునితో చెప్పాడు. ఇక పరాక్రమం ఎలాంటిదో స్వయంగా చూడాలనిపించింది. దానికి ఇప్పుడు అవకాశం వచ్చింది. అందుకే అడిగిన వెంటనే దర్శనం ఇవ్వక ఆలసించాడు.


సందేహం తీరి ఉంటుందని ఆశిస్తూ


స్వస్తి.


       - ఈశ్వర్

21, అక్టోబర్ 2022, శుక్రవారం

సంస్కృత వ్యాకరణం - అష్టాధ్యాయి

 

'ప్రథమేహి విద్వాంసో వైయాకరణాః, వ్యాకరణమూలత్వాత్సర్వ విద్యానామ్'

(ధ్వ. ఆ. 132) - ఆనందవర్ధనుఁడు.

 

సంస్కృతవ్యాకరణం అతిప్రాచీనం.వ్యాకరణమనగా ప్రకృతి ప్రత్యయ విభాగం. దీని ప్రారంభాన్ని కనుగొనడం కష్టసాధ్యం. ఇతర భారతీయశాస్త్రాలకువలె వ్యాకరణ శాస్త్రానికిని వేదమే మూలం. వైదిక సంహితలలో బీజరూపంలో ఉన్న వ్యాకరణం వైదిక పదపాఠాల్లో పరిపూర్ణత్వం పొందింది. ఆకాలం నాటికి ప్రకృతి ప్రత్యయాలు, ధాతూపసర్గలు, సమాసపూర్వపదోత్తరపదాలు ఇత్యాది విభాగాలు బాగా నిర్ణీతాలయ్యాయి.

 

నూనం వ్యాకరణం కృత్స్న

మనేన బహుధాశ్రుతమ్'

బహువ్యాహరతానేన

నకించి దపశబ్దితమ్' (రామా కి. 82:1)

 

అనే శ్లోకాన్నిబట్టి రామాయణ కాలంనాటికే వ్యాకరణశాస్త్రానికొక నిర్ణీతరూపం లభించినట్లు తెలుస్తోంది.

 

అలాగే అతిప్రాచీన కాలంనుండి వ్యాకరణాభ్యాసానికి అతిప్రాధాన్యం ఉండేదని

'పురాకల్ప ఏతదాసీత్, సంస్కారోత్తరకాలం

బ్రాహ్మణాః వ్యాకరణం అధీయతే స్మ' (మహాభా. 1.1.1)

అనేది సూచిస్తోంది.

 

వ్యాకరణోత్పత్తి:

 

వ్యాకరణానికి మూలకందమైన అక్షరసమామ్నాయాన్ని తొలుత

బ్రహ్మ బృహస్పతికి, బృహస్పతి ఇంద్రునకు, ఇంద్రుడు భరద్వాజునకు, భరద్వాజుడు ఋషులకు,

ఋషులు బ్రాహ్మణులకు బోధించారని ఋక్తంత్రకారవచనం చెప్తోంది.

 

క్రమంగా వ్యాకరణశాస్త్రం కూడ ఇతర బ్రహ్మోపజ్ఞశాస్త్రాల్లా అతి విస్తృతమైంది.

తదనుసారులైన వ్యాకరణాలన్నీ అనుశాసనాలు, అనుతంత్రాలు అని ప్రసిద్ధమయ్యాయి.

 

బృహస్పతివ్యాకరణం కేవలం శబ్దాల్ని ఏకరువు పెట్టడంచేత శబ్దపారాయణమనే పేరు ఏర్పడింది.

దాన్ని ఇంద్రుఁడు నేర్చుకొని,  సవరించి, తన ఇంద్రవ్యాకరణంలో ప్రకృతి ప్రత్యయవిభాగాలుగా

అభ్యసించే విధానం కనుగొన్నాడు. తదాది వాస్తవవ్యాకరణానికి నాంది ఏర్పడింది.

 

రెండు సంప్రదాయాలు:

 

వ్యాకరణంలో ఇంద్ర, మాహేశ్వరసంప్రదాయాలనే రెండు సంప్రదాయాలున్నాయి.

కాతంత్రవ్యాకరణం ఐంద్రసంప్రదాయసంబంధి, పాణినీయవ్యాకరణం మాహేశ్వర సంప్రదాయసంబంధి అని అభియుక్తోక్తి. కాతంత్రాదులు లౌకిక వ్యాకరణాలు. పాణినీయాదులు లౌకిక వైదిక వ్యాకరణాలు.

 

పాణినికి పూర్వం ఎనుబదియైదు మంది వైయాకరణుల పేళ్లు తెలియవస్తున్నాయి.

 

మహేశ్వరుడు:

పాణినీయంలో స్మరింపబడని ప్రాచీన వైయాకరణుడితడు. సారస్వతభాష్యాన్ని బట్టి మాహేశ్వరవ్యాకరణం అతివిస్తృతమైనదని తెలుస్తోంది. పాణినీయశిక్షకు చివర నున్న

యేనాక్షరసమామ్నాయ

మధిగమ్య మహేశ్వరాత్

కృత్స్నంవ్యాకరణం ప్రోక్తం

తస్మై పాణినయే నమః'

అనుశ్లోకంచేత 'అఇఉణ్'  ఇత్యాది చతుర్దశ సూత్రాలు మహేశ్వరోపజ్ఞాలని తెలుస్తోంది.

 

ఆ సూత్రాలు

 

అఇఉణ్

ఋఌక్

ఏఓఙ్

ఐఔచ్

హయవరట్

లణ్

ఞమఙణనమ్

ఝభయ్

ఘఢధష్

జబగడదశ్

ఖఫఛఠథచటతవ్

కపయ్

శషసర్

హల్

ఇతి మాహేశ్వరాణి సూత్రాణ్యణాది సంజ్ఞార్థాని.

 

'అణ్' మొదలగు సంజ్ఞల కుద్దిష్టాలైన మాహేశ్వరసూత్రాలు.

 

మహేశ్వరాత్ ఆగతాని మాహేశ్వరాణి"

 

మహేశ్వరుని ద్వారా పాణిన్యాదులకు లభించినవి అని అర్ధం.

 

నృత్తాఽవసానే నటరాజరాజః

ననాద ఢక్కాం నవ పంచవారమ్,

ఉద్ధర్తు కామః సనకాది సిద్ధా

నేతద్విమర్శే శివసూత్రజాలమ్.

 

అను నందికేశ్వరకారిక ఈ విషయాన్నే చెప్తోంది.

ఈ మాహేశ్వర సూత్రాలకు అక్షరసమామ్నాయం, వర్ణ సమామ్నాయం అనే నామాంతరాలు కూడ ఉన్నాయి.

 

సూత్రాల చివర ఉన్న పొల్లులను ఇత్సంజ్ఞ లంటారు.

ఏత ఇతి ఇత్ - పోయేది అని అర్థం.

కీలకమంతా వీటిలోనే ఉంది. వీటితో అవసరమైన ప్రత్యాహారాలు తయారు చేయవచ్చు.

 

ఈ సూత్రాలనే గాక అనేక ఇతర విషయాల్ని కూడ పాణిని మహేశ్వరునినుండి గ్రహించాడని

సూచిత మవుతోంది. ఈ మహేశ్వరవ్యాకరణ మిపుడు అలభ్యం.

 

పాణిని:- (2900-క్రీ.పూ.) విదేశీవ్యాకరణకారుల్ని సైతం అబ్బురపఱచిన అష్టాధ్యాయిని రచించిన పాణిని

సంస్కృత వైయాకరణులలోనే గాక ప్రపంచ సర్వభాషా వైయాకరణులలో అత్యున్నతగౌరవార్హస్థానం పొందాడు.

ఈతని వ్యాకరణంతో పోల్చదగిన వ్యాకరణం ప్రపంచంలోని ప్రాచీన భాషలకుగాని అర్వాచీన భాషలకు గాని

నాటినుండి నేటివఱకు రచింపబడలేదనే విషయం సర్వపండితలోకాంగీకృతం. ఈ వైయాకరణమూర్ధన్యుడు అనేక గ్రంథాల్లో పాణిన, పాణిని, దాక్షీపుత్త్ర, శాలంకి, శాలాతురీయ, ఆహిక, పాణినేయ, పణిపుత్త్ర అనే ఎనిమిది పేళ్లతో ప్రసిద్ధి పొందాడు. ఈతని గురువు ఉపవర్షుడని లోకప్రతీతి. కౌత్సుడు ఈతని ప్రధానశిష్యులలో ఒక్కడని తెలుస్తోంది. వార్తికకారుడు వరరుచి (కాత్యాయనుడు)ఈతని శిష్యుడేయని ప్రసిద్ది. త్రయోదశీతిథినాడు పరమపదించడంతో

దానిని పాణినీయ అనధ్యయనతిథిగా పరిగణిస్తారు.

 

భాష్యకారుడగు పతంజలి అభిప్రాయం ప్రకారం పాణిని సూత్రంలో ఒక్క అక్షరం కూడ వ్యర్థమవడానికి వీలులేదు.

ఈ శాస్త్రమందలి సూత్రాలన్నీ పరస్పర సంబంధాలవడంతో దీనిలో నిరర్థకమైన దొక్కటీ నాకు కానరాదన్నాడు.

 

పాణిని వ్యాకరణానికి అష్టాధ్యాయి, అష్టకం, శబ్దానుశాసనం, వృత్తి సూత్రం, అష్టికా మొదలైన పేళ్లున్నాయి.

మొదటిది అతిప్రసిద్ధమైనది.

 

అష్టాధ్యాయికి సహాయకంగా పాణిని ధాతుపాఠ, గణపాఠ, ఉణాదిసూత్ర, లింగానుశాసనాలను రచించాడు.

 

కాత్యాయనుడు:- పాణినీయ వ్యాకరణంపై వ్రాసిన వార్తికాలలో కాత్యాయన రచిత వార్తికాలు ప్రసిద్ధమైనవి. కాత్యాయనునకు కాత్యుడు, పునర్వసువు, మేధాజిత్, వరరుచి అనే నామాంతరాలున్నాయి. ఈతడు పాణిని శిష్యుడు, దాక్షిణాత్యుడు.

 

కాత్యాయనుని వార్తికాలు లేకపోతే అష్టాధ్యాయి అసంపూర్ణగ్రంథంగా  ఉండిపోయేది. అందువల్ల ఇవి పాణినీయానికి ప్రధానాంగాలు. పతంజలి కాత్యాయన వార్తికాలనే ఆధారంగా చేసికొని తన భాష్యాన్ని రచించాడు.

వార్తికపాఠం స్వతంత్ర గ్రంథరూపంలో లభ్యమవడంలేదు. ఇవన్నీ మహాభాష్యంలోఇతర వార్తికాలతో కూడ కలిపి వ్యాఖ్యానింపబడ్డాయి.

 

వార్తికమనగా 'వృత్తివ్యాఖ్యానం' అని చెప్పవచ్చు. వాక్యం, వ్యాఖ్యానసూత్రం, భాష్యసూత్రం, అనుతంత్రం, అనుస్మృతి అనే పదాలు 'వార్తిక' పర్యాయాలు. అందువల్ల వార్తికకారుని వాక్యకారుడని కూడ అంటారు.

 

పతంజలి: (క్రీ.పూ.2000)

ఈతడు పాణినీయంపై భాష్యాన్ని రచించాడు. భాష, శైలి, విషయ వివేచనం మొదలైన వాటిలో దీని కిదే సాటి. అందుకే దీనికి మహాభాష్యమని ప్రసిద్ధి. పతంజలి ఆదిశేషుని అపరావతారమంటారు. సూత్ర, వార్తికభాష్యాలలో అభిప్రాయభేదం వచ్చినపుడు పతంజలి మతమే ప్రమాణమని వైయాకరణులు  అంగీకరిస్తారు. ప్రాచీన గ్రంథాల్లో పతంజలి, నాగనాథుడు, అహిపతి, ఫణాభృత్, శేషరాజు, శేషాహి, చూర్తికారుడు, పదకారుడు మొదలైన పేళ్లతో నిర్దేశింపబడ్డాడు. పతంజలి పాణిని వ్యాకరణాన్నే గాక అనేక ఇతర ప్రాచీన వ్యాకరణాల్ని గూడ దృష్టిలో ఉంచుకొని తన భాష్యాన్ని రచించాడు. వ్యాఖ్యాన వ్యాజాన ఎన్నో విషయాలను చెప్పాడు. అందువల్ల మహాభాష్యం వ్యాకరణ శాస్త్రానికే కాక ఎన్నో ఇతర విద్యలకు కూడ ఆకరం అని చెప్పవచ్చు.

 

ఇంతటి వ్యాకరణవిజ్ఞానాన్ని మనకు అందించారు కనుకనే

 

వాక్యకారం వరరుచిం

భాష్యకారం పతంజలిమ్,

పాణినిం సూత్రకారం చ

ప్రణతోఽస్మి మునిత్రయమ్

 

అని సూత్రవాక్యభాష్యకారులైన పాణిని, వరరుచి, పతంజలి ముగ్గురికీ నతులర్పించి

వ్యాకరణాధ్యయనం ప్రారంభిస్తారు.

 

మంగళం మహత్

17, అక్టోబర్ 2022, సోమవారం

ఒక విజేత ఆత్మకథ ఆధారంగా...

తే.గీ. గురువులవచనంబులయందు గుఱిని నిల్పి
        కోర్కెనమ్మకమాశలకూటమందు
        పట్టు సాధించి, విద్యల పారమంది
        వెలిగె యబ్దుల్కలాముడు విశ్వమందు

6, అక్టోబర్ 2022, గురువారం

రఘుమహారాజు ఔదార్యం-కౌత్సుని ఉపాఖ్యానం

  

ఈ మధ్య whatsapp లో విజయదశమిని పురస్కరించుకొని,

జమ్మిచెట్టు గొప్పతనాన్ని చెప్తూ, జమ్మిచెట్లున్న తావున రఘువుకు భయపడి కుబేరుడు బంగారం కురిపించాడని ఒక వార్త చక్కర్లు కొట్టింది.

 

ఈ కథ

జమ్మిచెట్లున్న తావున కుబేరుడు బంగారం కురిపించడమనే కథ ఎందులోది? అని అడిగితే

రఘువంశంలో వరతంతుడు, కౌత్సకుడు కథ లోది అన్నారు.

 

మఱి రఘువంశంలో ఏముందో తెల్సుకొందాం.

అద్భుతమైనది ఈ ఉపాఖ్యానం.

 

త మధ్వరే విశ్వజితి క్షితీశం

నిశ్శేష విశ్రాణిత కోశజాతమ్,

ఉపాత్తవిద్యో గురుదక్షిణార్థీ

కౌత్సః ప్రపేదే వరతన్తుశిష్యః.

 

ఉన్న ధనమంతా ఆ విశ్వజిద్యాగంలో దానం చేసి రిక్తుఁడై ఉన్న ఆ రఘుమహారాజుదగ్గరకు

వరతంతుముని శిష్యుఁడు కౌత్సుఁడనేవాడు గురువుకోసం దక్షిణ యాచించడానికై వచ్చాడు.

 

సమృణ్మ యే వీతహిరణ్మయత్వాత్

పాత్రే నిధా యార్ఘ్య మనర్ఘశీలః,

శ్రుతప్రకాశం యశసా ప్రకాశః

ప్రత్యుజ్జగా మాతిథి మాతిథేయః.

 

అప్పుడు ఆ రఘుమహారాజు బంగారుపాత్రములన్నీ దానం చేసేసినందున

మృణ్మయ(మట్టి)పాత్రంలో పూజాద్రవ్యాలుంచుకొని, ఆ కౌత్సునికి ఎదురుగా వెళ్లాడు.

 

త మర్చయిత్వా విధివ ద్విధిజ్ఞ

స్తపోధనం మానధనా గ్రయాయీ,

విశాంపతి ర్విష్టరభాజ మారాత్

కృతాంజలిః కృత్యవి ది త్యువాచ.

 

ఆ రఘుమహారాజు, ఆ కౌత్సమునిని పీఁటపై కూర్చుండఁబెట్టి శాస్త్రోక్తంగా పూజించి,

చెంతను చేతులు జోడించుకొని, ఇలా అన్నాడు.

 

అపి ప్రసన్నేన మహర్షిణా త్వం

సమ్య గ్వినీ యానుమతో గృహాయ,

కాలో హ్యయం సంక్రమితం ద్వితీయం

సర్వోపకారక్షమ మాశ్రమం తే.

 

“నీకు వరతంతుమహాముని, సకలవిద్యలను చక్కఁ గా నేర్పి గృహస్థాశ్రమస్వీకారానికి అనుమతి ఇచ్చెనా?

ఎందుకు అడుగుతున్నానంటే, మిగతా ఆశ్రమాలకు ఉపకారక మైన గృహస్థాశ్రమంలో ప్రవేశించటానికి

నీకిది తగిన కాలం గదా!

         

త వార్హతో నాభిగమేన తృప్తం

మనో నియోగ క్రియ యోత్సుకం మే,

అప్యాజ్ఞయా శాసితు రాత్మనా వా

ప్రాప్తోఽసి సంభావయితుం వనాన్మామ్.

 

నీవు వచ్చినంత మాత్రాన నాకు తృప్తి లేదు. నీవు గురునాజ్ఞచే వచ్చావా? లేక, స్వకార్యార్థివై వచ్చావా?

నీవు వచ్చిన కార్యాన్ని నెఱవేర్చి కృతార్థుఁడను కాఁగోరుతున్నాను.”

 

త్యర్ఘ్యపాత్రానుమితవ్యయస్య

రఘో రుదారా మపి గాం నిశమ్య,

స్వార్థోపపత్తింప్రతి దుర్బలాశ

స్త మి త్యవోచ ద్వరతన్తుశిష్యః.

 

’నీ ఆజ్ఞను నెఱవేర్చడానికి కుతూహలపడుతున్నాను  అని ఔదార్యపూర్వకంగానే రఘుమహారాజు అన్నప్పటికీ, తనకు అర్ఘ్యమిచ్చిన మట్టిపాత్రంవల్ల రాజు సర్వస్వత్యాగంచేత రిక్తుఁడై ఉన్నాఁడని ఊహించి,

తనకార్యం నెఱవేఱుతుందనే ఆశ ఉడిగి, కౌత్సముని రాజుతో ఇలా అన్నాడు.  

 

భక్తిః ప్రతీక్ష్యేషు కులోచితా తే

పూర్వా న్మహాభాగ తయాఽతిశేషే,

వ్యతీతకాల స్త్వహ మభ్యుపేత

స్త్వా మర్థిభావా దితి మే విషాదః.

 

“ఓ మహాభాగా!, పూజ్యులయెడ నీ భక్తి మీ పూర్వులను మించి ఉంది.

కాని, నేను సమయం మించిపోయాక నిన్ను యాచించడానికి వచ్చానని చింతిస్తున్నాను.

 

త దన్యత స్తావ దనన్య కార్యో

గుర్వర్థ మాహర్తు మహం యతిష్యే,

స్వ స్త్యస్తు తే; నిర్గళితామ్బుగర్భం

శరద్ఘనం నార్దతి చాతకోఽపి.

 

కాన గురుధనం ఆర్జించడం కంటె  వేఱే ప్రయోజనం లేని నేను మఱొక దాతను యాచిస్తాను. నీకు మేలగునుగాక!. నీరు పూర్తిగా కురిసి, వట్టిగా ఉన్న శరత్కాల మేఘాన్ని చాతకం సైతం యాచింపదు గదా!”

 

ఏతావ దుక్త్వా ప్రతియాతు కామం

శిష్యం మహర్షే ర్నృపతి ర్నిషిధ్య,

కిం వస్తు విద్వన్ గురవే ప్రదేయం

త్వయా కియ ద్వేతి త మన్వయుఙ్త్క.

 

ఇంతమాత్రం చెప్పి వెళ్లిపోతున్న ఆ కౌత్సమునిని రఘుమహారాజు ఆఁపి,

ఓ విద్వాంసుఁడా!, నీవు గురువునకు ఈవలసిన ద్రవ్యం ఏమిటి? అది ఏపాటి? అని అడిగాడు.

 

తతో యథావ ద్విహితాధ్వరాయ

తస్మై స్మయావేశ వివర్జితాయ,

వర్ణాశ్రమాణాం గురవే స వర్ణీ

విచక్షణః ప్రస్తుత మాచచక్షే.

 

అప్పుడు వర్ణాశ్రమధర్మపరిపాలకుడైన ఆ రఘుమహారాజుతో బ్రహ్మచారైన ఆ కౌత్సముని ఇలా అన్నాడు.

 

సమాప్తవిద్యేన మయా మహర్షి

ర్విజ్ఞాపితోఽభూ ద్గురుదక్షిణాయై,

సమే చిరా యాస్ఖలితోపచారాం

తాం భక్తి మే వాగణయత్ పురస్తాత్.

 

“విద్యాబ్యాసం సమాప్తమయ్యాక, నేను ఆయనను నావలన ఏదైనా గురుదక్షిణ స్వీకరించమని వేఁడుకొన్నాను. ఆయన, చిరకాలం నేను చేసిన అస్ఖలితోపచారాలే గురుదక్షిణ అనీ, వేఱు గురుదక్షిణ ఈ నక్కఱలేదనీ చెప్పాడు.

 

నిర్బంధసంజాతరుషార్థ కార్శ్య

మచిన్తయిత్వా గురుణాహఽ ముక్తః,

విత్తస్య విద్యాపరిసంఖ్యయా మే

కోటీ శ్చతస్రో దశ చాహ రేతి.

 

నేను తనమాటను వినక బలవంత పెట్టఁగా, గురువు కోపగించి నాకు ధనంలేదని ఆలోచించక,

తాను నేర్పిన విద్యల లెక్కకు సరిగా పదునాలుగుకోట్లధనాన్ని తనకు తెచ్చి ఈవలసినదని ఆజ్ఞాపించాడు.

 

(గురువు కోపించకుండా విద్యార్థి ప్రవర్తించాలి. లేకపోతే ఎవరూ తీర్చలేని చిక్కుల్లో పడాల్సివస్తుంది.

కౌత్సుని అదృష్టం వల్ల రఘువు లభించాడు. లేకపోతే!!?)

 

సోఽహం సపర్యావిధిభాజనేన

మత్వా భవన్తం ప్రభుశబ్ద శేషమ్,

అభ్యుత్సహే సంప్రతినోపరోద్ధు

మల్పేతరత్వాచ్ఛ్రుతనిష్క్రయస్య.

 

అలా వచ్చిన నేను, నీవు అర్ఘ్యమిచ్చిన మట్టిపాత్రంచేతనే నీ విపుడు పేరుకు మాత్రం ప్రభువని తెలిసికొన్నాను. విద్యామూల్యం (గురుదక్షిణ) చాల గొప్ప మొత్తం కావడం వల్ల ఇపుడు నిన్ను ఇబ్బంది పెట్టదలచుకోలేదు.”

 

ఇత్థం ద్విజేన ద్విజరాజకాంతి

రావేదితో వేదవిదాం వరేణ,

ఏనోనివృత్తేంద్రియవృత్తి రేవం

జగాద భూయో జగదేకనాథః.

 

ఈ ప్రకారం వేదవిదుడైన ఆ కౌత్సముని నివేదించగా, జగదేకనాథుడైన రఘుమహారాజు ఇంకా ఇలా అన్నాడు.

 

గుర్వర్థ మర్థీ శ్రుతపారదృశ్వా

రఘోః సకాశా దనవాప్య శామం,

గతో వదాన్యాంతర మి త్యయం మే

మాభూ త్పరీవాదనవావతారః.

 

“సకలశాస్త్రపారగుఁడు, గురువుకోసం దక్షిణ యాచించడానికి వచ్చినవాఁడు, రఘువువలన తన కోరిక తీరక,

వేఱొక దాతకడకు పోయాడనే ఇంతకుముం దెన్నఁడూ లేని పరీవాదం (నింద) నాకు కలుగకుండుఁగాక!.

 

సత్వం ప్రశస్తే మహితే మదీయే

వసం శ్చతుర్థోఽగ్ని రి వాగ్న్యగారే,

ద్విత్రా ణ్యహా న్యర్హసి సోఢు మర్హ

యావ ద్యతే సాధయితుం త్వదర్థమ్.

 

పూజ్యుడా! నీవు, పూజితం, ప్రశస్తం అయిన నా త్రేతాగ్ని(గార్హపత్య, ఆహవనీయ, దక్షిణాగ్నులు)శాలలో

నాలుగవ అగ్నిగా వసిస్తూ, రెండు మూఁడు దినాలు ఓర్చుకొని ఉండు.

ఈ లోపు నీ ప్రయోజనాన్ని సాధించడానికి ప్రయత్నిస్తాను.

 

త థేతి త స్యావితథం ప్రతీతః

ప్రత్యగ్రహీత్ సంగర మగ్రజన్మా,

గా మాత్తసారాం రఘు ర ప్యవేక్ష్య

నిష్క్రష్టు మర్థం చకమే కుబేరాత్.

 

రఘుమహారాజుయొక్క వమ్ముగాని ఆ ప్రతిజ్ఞకు ఆ బ్రాహ్మణుఁడు సరే అని ఒప్పుకొన్నాడు.

భూమిలో ఉన్న ధనాన్నంతా తాను అప్పటికే గ్రహించి ఉన్నందున, రఘువు, కుబేరునినుండి తెద్దామనుకొన్నాడు.

 

అ థాధిశిశ్యే ప్రయతః ప్రదోషే

రథం రఘుః కల్పిత మస్త్రగర్భం,

సామ స్తసంభావన యైవ ధీరః

కైలాసనాథం తరసా జిగీషుః.

 

తర్వాత రఘుమహారాజు కుబేరుని ఒక సామంతునిగా భావించి, బలంచేత జయింపఁగోరి, మునిమాపున (శుభకరమైన గోధూళిలగ్నంలో) అస్త్రాలతో సన్నద్ధమైన రథంలో,  శయనించాడు.

 

(యుద్ధానికి రథం సిద్ధం చేయించి, అందులోనే పండుకొన్నాడు.)

 

ప్రాతః ప్రయాణాభిముఖాయ తస్మై

సవిస్మయాః కోశగృహే నియుక్తాః,

హిరణ్మయీం కోశగృహస్య మధ్యే

వృష్టిం శశంసుః పతీతాం నభ స్తః.

 

వేకువను ప్రయాణానికి సిద్ధపడుతున్న రఘుమహారాజు దగ్గఱకు విస్మయంతో కోశగృహనియుక్తులు వచ్చి, ధనగృహం మధ్యలో ఆకాశంనుండి బంగారు వాన కురిసిందని ఆయనతో చెప్పారు.

 

(రఘువుయొక్క కోశగృహస్య మధ్యే = కోశాగారం మధ్యలో బంగారు వాన కురిసిందని కాళిదాసు వ్రాశాడు.

మఱి జమ్మిచెట్ల తావులో కురిసిందని google అంటోంది.)

 

తం భూపతి ర్భాసుర హేమరాశిం

లబ్ధం కుబేరా దభియాస్యమానాత్,

దిదేశ కౌత్సాయ సమస్త మేవ

శృఙ్గం సుమేరో రివ వజ్రభిన్నమ్. 

 

తాను యుద్ధానికి పోదలచిన కుబేరునివలన ఈయబడిన,

వజ్రాయుధపు వ్రేటుకు చీలి కూలిన మహామేరుశృంగమో అన్నట్టున్న,

ప్రకాశిస్తున్న, ఆ హేమరాశిసమస్తాన్ని, రఘుమహారాజు, కౌత్సమునికి ఇచ్చివేశాడు.

(అడిగినదానికంటె ఎక్కువ)

 

జనస్య సాకేతనివాసిన స్తౌ

ద్వా వ ప్యభూతా మభినన్ద్య సత్త్వౌ,

గురుప్రదేయాధిక నిస్స్పృహోర్థీ

నృపోఽర్థి కామా దధిక ప్రద శ్చ.

 

గురువునకు ఈవలసిన దానికంటె ఎక్కువ తీసుకోననే కౌత్సమునియొక్క,

అర్థి అడిగిన దానికంటె ఎక్కువ ఇస్తాననే ఆ రఘుమహారాజుయొక్క సత్త్వానికి (వ్యవసాయానికి) సాకేతపురవాసులైన జనులు అభినందించారు.

(పదునాలుగుకోట్లకంటె ఎక్కువ వలదని కౌత్సుఁడు,

నీకోసం అని అనుకొన్నది కాబట్టి మొత్తం నీకే అని రఘువు వాదించుకొన్నారు.)

 

అ థోష్ట్ర వామీ శతవాహితార్థం

ప్రజేశ్వరం ప్రీతమనా మహర్షిః,

స్పృశన్ కరే ణానతపూర్వకాయం

సంప్రస్థితో వాచ మువాచ కౌత్సః.

 

సంప్రీతితో తరలినవాడై, ఆ కౌత్సమహర్షి, వందల లొట్టియలమీఁద, గుఱ్ఱాలమీఁద ఆ ధనాన్ని ఎక్కించి,

భక్తి చేత వంగి, నిలిచి ఉన్న రఘుమహారాజును చేతితో తడవుతూ ఇలా అన్నాడు.

 

ఆశాస్య మన్యత్ పునరుక్తభూతం

శ్రేయాంసి సర్వా ణ్యధిజగ్ముష స్తే,

పుత్త్రం లభ స్వాత్మగుణానురూపం

భవన్త మీడ్యం భవతః పి తేవ.

 

“సర్వశ్రేయస్సుల్నీ పొంది (కరితురగరాజ్యాదిమంగళాలన్నీ) ఉన్న నీకు

మళ్లీ అవే కలగాలని ఆశీర్వదించడం చెప్పినమాటనే చెప్పడంలా నిష్ప్రయోజనం.

మఱేమంటే నీయొక్క తండ్రిలా (సుగుణాలు కల నిన్ను నీ తండ్రి పడసినట్లు)

నీ గుణాలకు తగినట్టి పుత్త్రుని పొందు.”

 

ఇత్థం ప్రయు జ్యాశిష మగ్రజన్మా

రాజ్ఞే ప్రతీయాయ గురోః సకాశమ్;

రాజాఽపి లేభే సుత మాశు తస్మా

దాలోక మర్కా దివ జీవలోకః.

 

ఈ ప్రకారం రఘువును ఆశీర్వదించి, కౌత్సముని తనగురువుదగ్గఱకు వెళ్లిపోయాడు.

రఘుమహీపతి కూడా సూర్యునివలన ప్రాణికోటి వెలుతురుఁ బొందినట్లు

ఆ ఆశీర్వాదంవలన శీఘ్రంగా పుత్రుని (కుమారకల్పుఁడైన కుమారుని అజుని) పొందాడు.

 

ఈ ఉపాఖ్యానం వల్ల మూడు ప్రయోజనాలు సిద్ధించబడుతున్నాయి.

1 రఘుమహారాజు ఔదార్యం తెల్పడం.

2 కుబేరుఁడే భయపడి కనకవర్షం కురిపించడం వల్ల రఘువు పరాక్రమప్రశస్తిని వెల్లడిచేయడం.

3 పెద్దల ఆశీర్వాదం ఉంటేనే కాని సంతానం కలుగదనే లోకధర్మాన్ని వెల్లడింఛడం.

రఘువుతండ్రి దిలీపుఁడు కూడా గోసేవావ్రతాన్ని చేసి, నందిని ఆశీర్వాదం పొంది, రఘువును కన్నాడు.

అలాగే కౌత్సుని సంతోషింపచేసి, ఆయన ఆశీస్సులతో రఘువు అజుని కన్నాడు.

 

ఇంత ప్రసిద్ధిగలవాడు కాబట్టే వారి వంశానికి రఘువంశం అనే పేరు, ఆ పేరుతో ఒక కావ్యం ఉద్భవించాయి.

 

 

మంగళం మహత్