21, అక్టోబర్ 2022, శుక్రవారం

సంస్కృత వ్యాకరణం - అష్టాధ్యాయి

 

'ప్రథమేహి విద్వాంసో వైయాకరణాః, వ్యాకరణమూలత్వాత్సర్వ విద్యానామ్'

(ధ్వ. ఆ. 132) - ఆనందవర్ధనుఁడు.

 

సంస్కృతవ్యాకరణం అతిప్రాచీనం.వ్యాకరణమనగా ప్రకృతి ప్రత్యయ విభాగం. దీని ప్రారంభాన్ని కనుగొనడం కష్టసాధ్యం. ఇతర భారతీయశాస్త్రాలకువలె వ్యాకరణ శాస్త్రానికిని వేదమే మూలం. వైదిక సంహితలలో బీజరూపంలో ఉన్న వ్యాకరణం వైదిక పదపాఠాల్లో పరిపూర్ణత్వం పొందింది. ఆకాలం నాటికి ప్రకృతి ప్రత్యయాలు, ధాతూపసర్గలు, సమాసపూర్వపదోత్తరపదాలు ఇత్యాది విభాగాలు బాగా నిర్ణీతాలయ్యాయి.

 

నూనం వ్యాకరణం కృత్స్న

మనేన బహుధాశ్రుతమ్'

బహువ్యాహరతానేన

నకించి దపశబ్దితమ్' (రామా కి. 82:1)

 

అనే శ్లోకాన్నిబట్టి రామాయణ కాలంనాటికే వ్యాకరణశాస్త్రానికొక నిర్ణీతరూపం లభించినట్లు తెలుస్తోంది.

 

అలాగే అతిప్రాచీన కాలంనుండి వ్యాకరణాభ్యాసానికి అతిప్రాధాన్యం ఉండేదని

'పురాకల్ప ఏతదాసీత్, సంస్కారోత్తరకాలం

బ్రాహ్మణాః వ్యాకరణం అధీయతే స్మ' (మహాభా. 1.1.1)

అనేది సూచిస్తోంది.

 

వ్యాకరణోత్పత్తి:

 

వ్యాకరణానికి మూలకందమైన అక్షరసమామ్నాయాన్ని తొలుత

బ్రహ్మ బృహస్పతికి, బృహస్పతి ఇంద్రునకు, ఇంద్రుడు భరద్వాజునకు, భరద్వాజుడు ఋషులకు,

ఋషులు బ్రాహ్మణులకు బోధించారని ఋక్తంత్రకారవచనం చెప్తోంది.

 

క్రమంగా వ్యాకరణశాస్త్రం కూడ ఇతర బ్రహ్మోపజ్ఞశాస్త్రాల్లా అతి విస్తృతమైంది.

తదనుసారులైన వ్యాకరణాలన్నీ అనుశాసనాలు, అనుతంత్రాలు అని ప్రసిద్ధమయ్యాయి.

 

బృహస్పతివ్యాకరణం కేవలం శబ్దాల్ని ఏకరువు పెట్టడంచేత శబ్దపారాయణమనే పేరు ఏర్పడింది.

దాన్ని ఇంద్రుఁడు నేర్చుకొని,  సవరించి, తన ఇంద్రవ్యాకరణంలో ప్రకృతి ప్రత్యయవిభాగాలుగా

అభ్యసించే విధానం కనుగొన్నాడు. తదాది వాస్తవవ్యాకరణానికి నాంది ఏర్పడింది.

 

రెండు సంప్రదాయాలు:

 

వ్యాకరణంలో ఇంద్ర, మాహేశ్వరసంప్రదాయాలనే రెండు సంప్రదాయాలున్నాయి.

కాతంత్రవ్యాకరణం ఐంద్రసంప్రదాయసంబంధి, పాణినీయవ్యాకరణం మాహేశ్వర సంప్రదాయసంబంధి అని అభియుక్తోక్తి. కాతంత్రాదులు లౌకిక వ్యాకరణాలు. పాణినీయాదులు లౌకిక వైదిక వ్యాకరణాలు.

 

పాణినికి పూర్వం ఎనుబదియైదు మంది వైయాకరణుల పేళ్లు తెలియవస్తున్నాయి.

 

మహేశ్వరుడు:

పాణినీయంలో స్మరింపబడని ప్రాచీన వైయాకరణుడితడు. సారస్వతభాష్యాన్ని బట్టి మాహేశ్వరవ్యాకరణం అతివిస్తృతమైనదని తెలుస్తోంది. పాణినీయశిక్షకు చివర నున్న

యేనాక్షరసమామ్నాయ

మధిగమ్య మహేశ్వరాత్

కృత్స్నంవ్యాకరణం ప్రోక్తం

తస్మై పాణినయే నమః'

అనుశ్లోకంచేత 'అఇఉణ్'  ఇత్యాది చతుర్దశ సూత్రాలు మహేశ్వరోపజ్ఞాలని తెలుస్తోంది.

 

ఆ సూత్రాలు

 

అఇఉణ్

ఋఌక్

ఏఓఙ్

ఐఔచ్

హయవరట్

లణ్

ఞమఙణనమ్

ఝభయ్

ఘఢధష్

జబగడదశ్

ఖఫఛఠథచటతవ్

కపయ్

శషసర్

హల్

ఇతి మాహేశ్వరాణి సూత్రాణ్యణాది సంజ్ఞార్థాని.

 

'అణ్' మొదలగు సంజ్ఞల కుద్దిష్టాలైన మాహేశ్వరసూత్రాలు.

 

మహేశ్వరాత్ ఆగతాని మాహేశ్వరాణి"

 

మహేశ్వరుని ద్వారా పాణిన్యాదులకు లభించినవి అని అర్ధం.

 

నృత్తాఽవసానే నటరాజరాజః

ననాద ఢక్కాం నవ పంచవారమ్,

ఉద్ధర్తు కామః సనకాది సిద్ధా

నేతద్విమర్శే శివసూత్రజాలమ్.

 

అను నందికేశ్వరకారిక ఈ విషయాన్నే చెప్తోంది.

ఈ మాహేశ్వర సూత్రాలకు అక్షరసమామ్నాయం, వర్ణ సమామ్నాయం అనే నామాంతరాలు కూడ ఉన్నాయి.

 

సూత్రాల చివర ఉన్న పొల్లులను ఇత్సంజ్ఞ లంటారు.

ఏత ఇతి ఇత్ - పోయేది అని అర్థం.

కీలకమంతా వీటిలోనే ఉంది. వీటితో అవసరమైన ప్రత్యాహారాలు తయారు చేయవచ్చు.

 

ఈ సూత్రాలనే గాక అనేక ఇతర విషయాల్ని కూడ పాణిని మహేశ్వరునినుండి గ్రహించాడని

సూచిత మవుతోంది. ఈ మహేశ్వరవ్యాకరణ మిపుడు అలభ్యం.

 

పాణిని:- (2900-క్రీ.పూ.) విదేశీవ్యాకరణకారుల్ని సైతం అబ్బురపఱచిన అష్టాధ్యాయిని రచించిన పాణిని

సంస్కృత వైయాకరణులలోనే గాక ప్రపంచ సర్వభాషా వైయాకరణులలో అత్యున్నతగౌరవార్హస్థానం పొందాడు.

ఈతని వ్యాకరణంతో పోల్చదగిన వ్యాకరణం ప్రపంచంలోని ప్రాచీన భాషలకుగాని అర్వాచీన భాషలకు గాని

నాటినుండి నేటివఱకు రచింపబడలేదనే విషయం సర్వపండితలోకాంగీకృతం. ఈ వైయాకరణమూర్ధన్యుడు అనేక గ్రంథాల్లో పాణిన, పాణిని, దాక్షీపుత్త్ర, శాలంకి, శాలాతురీయ, ఆహిక, పాణినేయ, పణిపుత్త్ర అనే ఎనిమిది పేళ్లతో ప్రసిద్ధి పొందాడు. ఈతని గురువు ఉపవర్షుడని లోకప్రతీతి. కౌత్సుడు ఈతని ప్రధానశిష్యులలో ఒక్కడని తెలుస్తోంది. వార్తికకారుడు వరరుచి (కాత్యాయనుడు)ఈతని శిష్యుడేయని ప్రసిద్ది. త్రయోదశీతిథినాడు పరమపదించడంతో

దానిని పాణినీయ అనధ్యయనతిథిగా పరిగణిస్తారు.

 

భాష్యకారుడగు పతంజలి అభిప్రాయం ప్రకారం పాణిని సూత్రంలో ఒక్క అక్షరం కూడ వ్యర్థమవడానికి వీలులేదు.

ఈ శాస్త్రమందలి సూత్రాలన్నీ పరస్పర సంబంధాలవడంతో దీనిలో నిరర్థకమైన దొక్కటీ నాకు కానరాదన్నాడు.

 

పాణిని వ్యాకరణానికి అష్టాధ్యాయి, అష్టకం, శబ్దానుశాసనం, వృత్తి సూత్రం, అష్టికా మొదలైన పేళ్లున్నాయి.

మొదటిది అతిప్రసిద్ధమైనది.

 

అష్టాధ్యాయికి సహాయకంగా పాణిని ధాతుపాఠ, గణపాఠ, ఉణాదిసూత్ర, లింగానుశాసనాలను రచించాడు.

 

కాత్యాయనుడు:- పాణినీయ వ్యాకరణంపై వ్రాసిన వార్తికాలలో కాత్యాయన రచిత వార్తికాలు ప్రసిద్ధమైనవి. కాత్యాయనునకు కాత్యుడు, పునర్వసువు, మేధాజిత్, వరరుచి అనే నామాంతరాలున్నాయి. ఈతడు పాణిని శిష్యుడు, దాక్షిణాత్యుడు.

 

కాత్యాయనుని వార్తికాలు లేకపోతే అష్టాధ్యాయి అసంపూర్ణగ్రంథంగా  ఉండిపోయేది. అందువల్ల ఇవి పాణినీయానికి ప్రధానాంగాలు. పతంజలి కాత్యాయన వార్తికాలనే ఆధారంగా చేసికొని తన భాష్యాన్ని రచించాడు.

వార్తికపాఠం స్వతంత్ర గ్రంథరూపంలో లభ్యమవడంలేదు. ఇవన్నీ మహాభాష్యంలోఇతర వార్తికాలతో కూడ కలిపి వ్యాఖ్యానింపబడ్డాయి.

 

వార్తికమనగా 'వృత్తివ్యాఖ్యానం' అని చెప్పవచ్చు. వాక్యం, వ్యాఖ్యానసూత్రం, భాష్యసూత్రం, అనుతంత్రం, అనుస్మృతి అనే పదాలు 'వార్తిక' పర్యాయాలు. అందువల్ల వార్తికకారుని వాక్యకారుడని కూడ అంటారు.

 

పతంజలి: (క్రీ.పూ.2000)

ఈతడు పాణినీయంపై భాష్యాన్ని రచించాడు. భాష, శైలి, విషయ వివేచనం మొదలైన వాటిలో దీని కిదే సాటి. అందుకే దీనికి మహాభాష్యమని ప్రసిద్ధి. పతంజలి ఆదిశేషుని అపరావతారమంటారు. సూత్ర, వార్తికభాష్యాలలో అభిప్రాయభేదం వచ్చినపుడు పతంజలి మతమే ప్రమాణమని వైయాకరణులు  అంగీకరిస్తారు. ప్రాచీన గ్రంథాల్లో పతంజలి, నాగనాథుడు, అహిపతి, ఫణాభృత్, శేషరాజు, శేషాహి, చూర్తికారుడు, పదకారుడు మొదలైన పేళ్లతో నిర్దేశింపబడ్డాడు. పతంజలి పాణిని వ్యాకరణాన్నే గాక అనేక ఇతర ప్రాచీన వ్యాకరణాల్ని గూడ దృష్టిలో ఉంచుకొని తన భాష్యాన్ని రచించాడు. వ్యాఖ్యాన వ్యాజాన ఎన్నో విషయాలను చెప్పాడు. అందువల్ల మహాభాష్యం వ్యాకరణ శాస్త్రానికే కాక ఎన్నో ఇతర విద్యలకు కూడ ఆకరం అని చెప్పవచ్చు.

 

ఇంతటి వ్యాకరణవిజ్ఞానాన్ని మనకు అందించారు కనుకనే

 

వాక్యకారం వరరుచిం

భాష్యకారం పతంజలిమ్,

పాణినిం సూత్రకారం చ

ప్రణతోఽస్మి మునిత్రయమ్

 

అని సూత్రవాక్యభాష్యకారులైన పాణిని, వరరుచి, పతంజలి ముగ్గురికీ నతులర్పించి

వ్యాకరణాధ్యయనం ప్రారంభిస్తారు.

 

మంగళం మహత్

కామెంట్‌లు లేవు: