31, డిసెంబర్ 2022, శనివారం

రామాయణంలో ఒక విషయపరిశీలన

 భరతలక్ష్మణులలో జ్యేష్ఠుడెవరన్నదానికి


భరతుడే జ్యేష్ఠుడని 

భవభూతితో సహా అర్వాచీనులు పెక్కుమంది అభిమానించారు.


మఱి 

రామలక్ష్మణభరతశత్రుఘ్నులనే

వాడుక రావడానికి ఏమైనా కారణాలున్నాయా 

అని నేను పరిశీలించిన మీదట 

నాకు కొన్ని విషయాలు తెలిశాయి.


భాసుడు...

సంస్కృతంలో మొదటి నాటకకారుడు. 

కాళిదాసు నాటికి ప్రసిద్ధ నాటకకారుల్లో ఒకడుగా పేరు సంపాదించినవాడు. 


భాసుడు రామాయణ కథనంతా నాటకాల్లో కూర్చటానికి ప్రయత్నిస్తూ ప్రతిమా, అభిషేక నాటకాలను వ్రాశాడు. 


ఈ రెండు నాటకాల్లో ప్రతిమానాటకం నాటకకళాదృష్టితో వికసితమైన 

ప్రౌఢనాటకం. దీనిలో భాసుడు 

తన కల్పనాచాతుర్యాన్ని చూపుతూ అద్భుతమైన కథా సన్నివేశాలను  సృష్టించాడు. పాత్ర చిత్రణ కళాదృష్టితోనూ ఈ నాటకం ఉత్తమమైంది.


వాల్మీకి రామాయణానికీ, 

ఈ నాటకకథకూ 

కొన్ని భేదాలు  కనిపిస్తాయి.


అట్టి దొక్కటి : ఇందులో 

లక్ష్మణుడు పెద్దవాడుగాను, 

భరతుడు చిన్నవాడుగాను కనిపిస్తారు. లక్ష్మణుడు భరతుని ‘వత్స!' అని పిలుస్తాడు. ఆశీర్వదిస్తాడు.


భరతుడు లక్ష్మణునకు మ్రొక్కుతాడు. 'ఆర్య!' అని పిలుస్తాడు.


ఈ విషయం వాల్మీకి రామాయణంలో సంశయగ్రస్తంగా ఉంది.


బాలకాండలో: 

"పుష్యే జాతస్తు భరతః 

సార్పే జాతౌ తు సౌమిత్రీ-" అని ఉంది.


భరతుడు పుష్యమీ నక్షత్రాన, లక్ష్మణశత్రుఘ్ను లాశ్లేషా నక్షత్రాన 

జన్మించారు.


కాబట్టి భరతుడే జ్యేష్ఠుడవుతాడు. 

కాని, దీనికి విరుద్ధంగా 

లక్ష్మణుడే జ్యేష్ఠుడవుతా డనడానికి 

కూడా సాధనాలు కొన్ని 

రామాయణంలో ఉన్నాయి.


యుద్ధకాండలో:


"తతో లక్ష్మణ మాసాద్య

వైదేహీం చాభ్యవాదయత్,

అభివాద్య తతః ప్రీతో 

భరతో నామ చాఽబ్రవీత్"


అని ఉంది.

సరళరీతిని చూస్తే

ఇక్కడ భరతుడు, 

లక్ష్మణుని, సీతను 

నమస్కరించినట్లు అర్థం ఏర్పడుతుంది.

ఇలా చెప్తేనే ‘వైదేహీం చ’ అని అనడం 

సమర్థ మవుతుంది. 


జన్మకాలాన్నిబట్టి భరతజ్యైష్ఠ్యం 

వ్యక్త మవుతూండడంవల్ల

రామాయణవ్యాఖ్యాతలు ఇక్కడ చిక్కుపడ్డారు.


గోవిందరాజు 

దీని గుఱించి వ్యాఖ్యానిస్తూ, 

లక్ష్మణ మాసాద్య =  కృతనమస్కారం లక్ష్మణ మాలింగనేన సంభావ్య,

(లక్ష్మణునిచేత నమస్కరింపబడి, 

ఆతనిని ఆలింగనంతో సంభావించి,)

వైదేహికి (రామునితో సహా) నమస్కరించాడు. 

చకారం రామనమస్కారాన్ని 

సూచిస్తుంది" అని వ్రాశాడు.


ఇక్కడ చ యొక్క ఉపయోగం కనబడుతుంది. 


ఇంకా గోవిందరాజు 

అయోధ్యకాండలోని

"సీతా గచ్ఛత్వ మగ్రతో భరతాగ్రజః" అనే

వాల్మీకి రామాయణప్రయోగం 

సరళరీతిలో లక్ష్మణుడే జ్యేష్ఠుడని చెప్తున్నా, 

జన్మకాలరీతికి విరుద్ధం అవడం చేత

'భరతాగ్రజః ఇత్యత్ర బహువ్రీహి రిత్యుక్తమ్' అని క్లిష్టార్థాన్ని కల్పించాడు.


భరతునకు అగ్రజుడు అని షష్ఠి కాకుండా,

భరతుడు అగ్రజుడుగా కలవాడు అని బహువ్రీహి చేసి సరిపెట్టాడాయన.


అయితే కొంతమంది ఆధునికులు

భరతాగ్రజ బదులు

సాహసించి భరతానుజ అని శ్లోకంలోనే మార్చేసి, సులువుగా అర్థం వ్రాసేశారు.


అరణ్యకాండ వ్యాఖ్యానంలో 

'న సంఖ్యే భరతానుజః' అని భరత 

జ్యైష్ఠ్యవ్యంజక ప్రయోగమూ కలదని  గోవిందరాజు పేర్కొన్నాడు. 


తిలక వ్యాఖ్యానంలో

'తతో లక్ష్మణ మాసాద్య' అని పైన చెప్పిన శ్లోకానికి భరతుడు లక్ష్మణునకు  నమస్కరించినట్లే అర్థం చెప్పబడింది. 


కానీ దాన్ని, వేఱేలా సమర్థిస్తూ

జన్మప్రకరణం ప్రకారం 

భరతాత్కనిష్ఠ వయసాస్పష్టమ్ అయినప్పటికీ  అధికగుణాలచేత 

గురుత్వం సిద్ధించి లక్ష్మణుడు 

నమస్కరించ దగినవాడయ్యాడని వ్రాశారు.


పాయసప్రదానాన్నిబట్టి, 

వివాహక్రమాన్నిబట్టి 

(రాముని తర్వాత 

లక్ష్మణుని వివాహం జరిగింది.)

లక్ష్మణుడే జ్యేష్ఠుడైనా,

జననకాలరీతిచేత 

అది పరిహృతమైందని

గోవిందరాజు అన్నాడు.


అలాగే లక్ష్మణుని జ్యేష్ఠత్వం 

వాల్మీకి సమ్మతం కాదు 

అని కూడా స్పష్టంగా చెప్పలేమని 

వేదం వేంకట రాయశాస్త్రి గారి ఉవాచ.


అందువల్ల 

భాసుడు లక్ష్మణుడే జ్యేష్ఠుడని 

వ్రాయడం వల్ల ఆయన కాలం నాటికే

రామలక్ష్మణభరతశత్రుఘ్నులనే 

వాడుక వచ్చిందనవచ్చు. 


మంగళం మహత్ 




 

26, డిసెంబర్ 2022, సోమవారం

తు చ

 

తు చ తప్పక గుఱించి

 

తెల్సినంతవఱకు...

శ్లోకాలలో తఱచుగా ప్రయోగించే తు, చ అనేవి సంస్కృత అవ్యయాలు. 

అయితే అనే అర్థంలో "తు", మఱియు అనే అర్థంలో "చ" ఎక్కువగా వాడబడుతూంటాయి.    

విశేషమందును, నిశ్చయమందును, హేతుపాదపూరణములయందును "తు" వర్తించును.

అన్వాచయమందును, సమాహారమందును, ఇతరేతరయోగమందును, సముచ్చయమందును, పాదపూరణ పక్షాంతరహేతు నిశ్చయమందును "చ" వర్తించును

- అని వావిళ్లవారి సంస్కృత-తెలుగు నిఘంటువు. (ఇంకా వివిధ అర్థాలున్నాయి చూడండి.

వెత్సా వెంకటశేషయ్యగారి సంస్కృతాంధ్రనిఘంటులో కూడ చూడండి.)

ఇక అసలు విషయానికి వస్తే, ఇవి పాదపూరణలకోసం ఎక్కువగా వస్తాయి.

అటువంటప్పుడు వాటికి వేఱే ప్రయోజనం లేనందున వాటి అర్థాలు చెప్పక్కరలేదు కూడా.

అంటే చెప్పకపొయినా శ్లోకభావం సిద్ధిస్తుంది.

అయితే పూర్తిగా అన్నిచోట్లా అని కాదు. వాటి విలువ వాటికి ఉంది.

అయితే సంస్కృతభాషమీద గౌరావాభిమానాలున్న కవులు

అవసరం లేని చోట కూడ తు చ లను వదలకుండా అనువదించారు.

అలా అనువాదాలనుండి మొదలై మిగతా సందర్భాలకు కూడా మారిందనవచ్చు.

ఇలాంటి ఎక్కువ ఉపయోగం/ప్రయోజనం లేని అక్షరాలను కూడా వదలిపెట్టకుండా పూర్తిగా, ఉన్నది ఉన్నట్లుగా ఒక్క పొల్లుకూడా పోకుండా  అనువదించాడనో / వ్రాశాడనో / చెప్పాడనో / వివరించాడనో  చెప్పేటప్పుడు "తు చ తప్పక" అంటూంటారు.

అలాగే చెప్పింది చెప్పినట్లు ఆజ్ఞను ఉల్లంఘించకుండా చేసినప్పుడు కూడా

తు చ తప్పక చేశాడంటారు.

తు చ లు లేకుండా శ్లోకం వ్రాయడం కష్టం అనిపిస్తుంది.

వ్యాసుని భారతం నిండా తు చ లు ఉంటాయంటూ

వీటి విషయమై కాళిదాసు, వ్యాసులవారి మధ్య జరిగిన

ఆసక్తికరమైన ఈ రసవత్తర సన్నివేశాన్ని చూడండి.

http://tinyurl.com/zboawbh

volga video వారి సౌజన్యంతో                                          

23, డిసెంబర్ 2022, శుక్రవారం

 ఆదివారం ఆమలకం ని‌‌షిద్ధం అనడానికి

జ్యోతిశ్శాస్త్రపరంగా చూస్తే,


ఉసిరి పులుపు.

పులుపు శుక్రుని రుచిగా పేర్కొన్నారు.


రవి శుక్రులు పరస్పరం శత్రువులు.

అందువల్ల రవివారం 

పులుపు పుష్కలంగా ఉన్న

శుక్రసంబంధ ఉసిరి తింటే శరీరం దుష్టమౌతుంది.

(కుష్ఠు, బొల్లి వస్తాయని పెద్దలనే మాట)


తరువాత ఏవైతే నశిస్తాయని చెప్పారో 

ఆ వీర్యయశోప్రజ్ఞాదులకు లక్ష్మీప్రసన్నతకు శుక్రుడే కారకుడు.


అందువల్ల శత్రువైన భానువారం నిషేధం.


జ్ఞానం, వైరాగ్యం, యశస్సు, వీర్యం, ఐశ్వర్యాలకు భగమని పేరు.

ఇవి కలవాడు భగవంతుడు.


సూర్యుడు సాక్షాత్ నారాయణుడు.

దీన్నిబట్టి కూడా ఆదివారం నాడు ఆయన విరోధికి సంబంధించిన ధాత్రి నిషిద్ధం.


అంతేకాదు కళత్రానికీ, కళత్రసుఖానికీ 

శుక్రుడే కారకుడు.

అందువల్ల ఉసిరే కాదు, 

భార్యాసంగమం కూడా ఆదివారం నిషిద్ధం. 

ఏడు జన్మల పాపం దాని ఫలితం.


ఇవే కాదు ఇంకా ఆదివారంనాడు కొన్ని నిషేధాలున్నాయి. కొన్ని తిథుల్లో కూడా 

కొన్ని ని‌షేధాలున్నాయి.


స్వస్తి

18, డిసెంబర్ 2022, ఆదివారం

శ్రీనాథుని కవిత్వం

శ్రీనాథుని కవిత్వం ప్రాచీనాంధ్రమహాకవుల విశిష్టకవితాగుణాలకు సంగమతీర్థ మని వేమారెడ్డి కాశీఖండంలో కీర్తించాడు. శ్రీనాథుని కవితాలక్షణాల్ని చక్కగా గుర్తించాడాయన. 'వచియింతు వేములవాడ భీమన భంగి నుద్దండ లీల నొక్కొక్కమాటు భాషింతు నన్నయభట్టు మార్గంబున నుభయ వాక్ప్రౌఢి నొక్కొక్కమాటు వాక్రుత్తు తిక్కయజ్వ ప్రకారము రసాభ్యుచిత బంధముగ నొక్కొక్కమాటు పరిఢఁవింతు ప్రబంధ పరమేశ్వరుని ఠేవ, సూక్తి వైచిత్రి నొక్కొక్కమాటు' శ్రీనాథు డొక్కొకసారి వేములవాడ భీమకవి లాగా ఉద్దండంగా కవిత్వం చెపుతాడు. అంటే మిక్కుటంగా, దీర్ఘంగా చెపుతాడని. దీర్ఘ సమాసాల్లో ప్రగల్భంగా భావాన్ని చెప్పే పద్ధతి ఇది. "ఆడెం దాండవ మార్భటీ పటహ లీలాటోప విస్ఫూర్జిత క్రీడాడంబర ముల్లసిల్ల గరళ గ్రీవుండు జాటాటవీ క్రోడాఘాట కరోటి కోటర కుటీ కోటీ లుఠచ్ఛిందు వీ చీ డోలాపటలీ పరిస్ఫుటతర స్ఫీత ధ్వని ప్రౌఢిమన్." -భీమే.పురా. ఒక్కొక సారి నన్నయభట్టులాగా సంస్కృతాంధ్ర శబ్దప్రయోగ ప్రౌఢి ప్రదర్శిస్తాడు. దీనివలన గీర్వాణాంధ్రశబ్దసంఘటన సామర్థ్యం వ్యక్తమౌతుంది. శుద్ధసాంస్కృతికమూ కాదు. శుద్ధదేశీయమూ కాదు. ఉభయప్రాధాన్యం కలది. మార్గరీతి అన్నమాట. నన్నయ రాజకులైకభూషణుడు పద్యాన్ని అనుసరిస్తూ,👇 రాజశశాంక శేఖరుడు రాజ కిరీటవతంస మష్టది గ్రాజ మనోభయంకరుఁడు రాజుల దేవర రాజరాజు శ్రీ రాజమహేంద్ర భూభువన రాజ్య రమా రమణీ మనోహరుం డాజి గిరీటి కీర్తి నిధి యల్లయవీర నరేంద్రుఁ డున్నతిన్ -కాశీ.ఖం. ధూర్దండ ఘట్టన త్రుటిత గ్రహగ్రాహ ధూళిపాళీమిళద్ద్యు స్థ్సలములు ధ్వజ పట పల్ల వోద్ధత మరుత్సంపాత, పరికంపమానోడు పరివృఢములు గ్రాసాభిలాషాను గత విధుంతుదపునః ప్రాప్తచక్ర వ్యథోపద్రవములు శ్రాంతాశ్వనిబిడనిశ్శ్వాసధారోద్దుర, స్వర్ధునీ నిర్ఘర జలధరములు గగన పదలంఘనైన జంఘాలికములు, పద్మబాంధవ నిజరథ ప్రస్థితములు సాఁగెనని దక్షిణాయన సమయమగుట, దర్దురము మీఁద మలయభూధరము మీద -కాశీ.ఖం. 👆ఇందులో భీమకవి ఉద్దండలీల, నన్నయ ఉభయవాక్ప్రౌఢి రెండూ కనబడతాయి. సమాసఘటనం, శబ్దశక్తిజ్ఞానం ఉన్నప్పటికీ కవికి రసాభివ్యక్తే ముఖ్యం. రసాభివ్యంజకకావ్యబంధాన్ని సాధించిన తిక్కన వాక్పాకాన్ని పుక్కిట పడతాడు శ్రీనాథుడు ఒక్కొక్కసారి. తిక్కన 'ఉర్వీధరంబుల' పద్యాన్ని అనుసరిస్తూ, "చిఱుసానఁ బట్టించి చికిలిసేయించిన, గండ్రగొడ్డలి నిశాగహనలతకుఁ గార్కొన్న నిబిడాంధకారధారాచ్చటా, సత్ప్రవాటికి వీతిహోత్ర జిహ్వ నక్షత్ర కుముద కాననము గిల్లెడు బోటి, ప్రాచినె త్తిన హస్తపల్ల వాగ్ర మరసి మింటికి మంటి కైక్య సందేహంబుఁ, బరిహరింపంగఁ బాల్పడ్డ యవధి సృష్టి కట్టెఱ్ఱ తొలుసంజ చెలిమికాడు, కుంటు వినతా మహాదేవి కొడుకుఁ గుఱ్ఱ సవితృ సారథి కట్టెఱ్ఱ చాయఁదెలుప, నరుణుఁడుదయించెఁ బ్రాగ్దిశాభ్యంతరమున." -కాశీ.ఖం. ప్రబంధ పరమేశ్వరుడైన ఎఱ్ఱన్న రచనలో ఉక్తిని అలంకృతం చేయడంలో సహజత్వాన్ని వీడని ఒక చమత్కారాన్ని కల్పించే వైచిత్రి రాణిస్తుంది. దాన్ని శ్రీనాథుడు చేపట్టి ఒక్కొకసారి రక్తికట్టిస్తాడు. ఎఱ్ఱన రామాయణ పద్యాన్ని అనుసరిస్తూ, 'కందక గాజువాఱక వికాసము డిందక మందహాస ని ష్యందము చెక్కుటద్దముల నారక నెమ్మది నిద్రపోవు న ట్లందము నొందె ధాత్రి సిరియాల కుమారుని వక్తచంద్రుఁడా నందము నొందె నప్పు డెలనాగ మనంబును భర్తచిత్తమున్ -హర.విలా. కాలకంఠకఠోర కంఠహుంకారంబు, చెవులు సోకనినాఁటి చిత్తభవుఁడు కుపితరాఘవఘన క్రూర నారాచంబు, తనువు నాటని నాఁటి వనధిరాజు క్రుద్ధకుంభోద్భవ భ్రూలతా కౌటిల్య, వికృతిఁ గ్రుంగని నాఁటి వింధ్యశిఖరి వీరభద్రోదార ఘోర వీరావేశ, విహతిఁ గందని నాఁటి తుహినకరుఁడు చక్కఁదనమున గాంభీర్య సారమునను, బ్రకట ధైర్యకళా కలాపములయందు దండనాయక చూడా వతంస మైన, మంత్రి మామిడి వేమనామాత్యుఁ డెలమి. -శృం.నై.. 👆ఈ పద్యంలో పైన చెప్పిన ఉద్దండలీల, ఉభయ వాక్ప్రౌఢి, రసాభ్యుచితబంధం, సూక్తి వైచిత్రి అనే నాలుగు గుణాలూ కనబడతాయి. కానీ, అవన్నీ నీరక్షీరన్యాయంగా కలిసిపోయి ఒక విశిష్టసృష్టి ప్రత్యక్ష మౌతున్నది. ఎన్నో పూలతేనెలు ఈ జుంటితేనెలో ఉన్నాయి. కానీ ఈ పాకం మాత్రం శ్రీనాథుడనే తేనెటీగదే. పూర్వకవుల ప్రసిద్ధ ఫణుతులను అదనెరిగి కవితలో కదను త్రొక్కించినా తనదైన ఒక అపూర్వమార్గాన్ని దుర్గమంగా నిర్మించుకొని భావికవితరాలకు బాటలుచూపించిన ప్రతిభాశాలి శ్రీనాథుడు. పండితుల రచనల ఆధారంగా... మంగళం మహత్

20, నవంబర్ 2022, ఆదివారం

 పల్లవి. కట్టు కట్టు మామయ్య గొఱ్ఱు 

ఒడికట్టు రైతన్నబిడ్డా


||చ|| గొఱ్ఱు తోలేదే గొర్మానుకొండొల్లు

సాల్లు పాసేదే సంకలాప్రమొల్లు

విత్తనమేసేదే వీరాయి పల్లొల్లు


॥చ|| మెట్లగొట్టోదీ మెట్టుపల్లెల్లలూ

కలుపుతీసేదీ కన్నమడకలొల్లు

ఎత్తిపోసేదీ ఏల్పనూరొల్లు.


॥చ|| కోతకూసేది కోవెలకుంట్లొల్లూ

కట్టగట్టేదీ కడుమూరొల్లూ

గూళ్ళువేసేదీ గూడూరొల్లూ


కవి, ఆమళ్లదిన్నె గోపీనాథ్ గారు రాయలసీమప్రాంతంవారు.

(అప్పరాశ్చెరువు, 

బత్తలపల్లె మండలం, 

అనంతపురం జిల్లా)


కాబట్టి వారి రాయలసీమ ప్రాంత 

మెట్ట వ్యవసాయవిశేషాలను 

వారి మాండలికాలతో కలిపి

ఈ గేయం వ్రాశారు.


కట్టు కట్టు మామయ్య గొఱ్ఱు

= (మామయ్యతో అంటున్నట్లుగా)

మామయ్యా! గొఱ్ఱు కట్టు


(గొఱ్ఱు అంటే

దున్నటానికి, విత్తటానికి పనికివచ్చే పరికరం. కొద్దిగానే పదునై సులువుగా తెగేట్లు ఉంటే గొర్రుతో దున్నుతారు. 

నాగలితో ఒకచాలే దున్నటానికి వీలవుతుంది.

గొర్రుతో మూడునుంచి ఎనిమిదిదాకా చాళ్ళు పడతాయి. మెట్టనేలల్లో చేసే సేద్యం.)


ఒడికట్టు రైతన్నబిడ్డా!

= ఒడికట్టు అంటే ప్రయత్నించు

(సేద్యపు పనికి)పూనుకో!


(రైతు పదమే అన్యదేశ్యం.

ఇక రైతన్న అన్నది 

రాజకీయవాదుల ఆధునిక సృష్టి.)


గొఱ్ఱు తోలేదే గొర్మానుకొండొల్లు 


గొఱ్ఱు తోలే వాళ్లు ఎవరూ అంటే

గొర్మానుకొండొల్లు 


గోరుమానుకొండ అనే ఊరి

(నుండి వచ్చిన)వాళ్లు


(మిగిలినవి కూడా ఇలాగే)


సాల్లు పాసేదే సంకలాప్రమొల్లు


(సాల్లు అంటే చాలుకు బహువచనం.

చాలు పోయు = నాగలి/గొఱ్ఱు మొదలైన పరికరాలతో దున్నినప్పుడు నేల తెగిన పొడుగు)


చాలు పోసేది ఎవరూ అంటే సంకలాప్రమొల్లు

= శంకలాపురం ఊరివాళ్లు


విత్తనమేసేదే వీరాయి పల్లొల్లు


విత్తనాలు వేసేది

వీరే(రాయి)పల్లి ఊరివాళ్లు


మెట్లగొట్టోదీ మెట్టుపల్లెల్లలూ


మెట్టు అంటే 

దంతెనగుజ్జుకు బిగించిన ఇనప పలుగు.


(కోస్తా జిల్లాల్లో పొలాల్లా కాదు 

రాయలసీమవి గట్టినేలలు.

కలుపు మొక్కల్ని మెట్టుతో కొడతారు.

దాంతో అది వేళ్లతో వస్తుంది.)


ఈ మెట్టుగొట్టేవాళ్లు

మెట్టుపల్లె ఊరివాళ్లు.


కలుపుతీసేదీ కన్నమడకలొల్లు


వాళ్లు కొట్టిన తర్వాత 

ఆ కలుపును తీసేది 

కన్నమడకల ఊరివాళ్లు


ఎత్తిపోసేదీ ఏల్పనూరొల్లు


నీటిని ఎత్తిపోయడం అన్నమాట.

గుంటల్లో లేక దొనల్లో ఉన్న నీటిని 

మెరక పొలాలకు

ఏతాంతోనో కపిలతోనో తోడి పొయ్యడం


ఎత్తిపోసేది

వేల్పనూరు అనే ఊరివాళ్లు


కోతకూసేది కోవెలకుంట్లొల్లూ


కోత అంటే పండిన పైరు కొడవళ్ళతో కొయ్యటం


అలా కోతకూసేది

కోయి(వె)లకుంట్ల ఊరివాళ్లు


కట్టగట్టేదీ కడుమూరొల్లూ


కట్ట = పంట కోసివేసిన తర్వాత కొన్ని ‘ఓదె' లు కలిపి కట్టే మోపు


అలా కట్టగట్టేదీ

కడుమూరు వాళ్లు


గూళ్ళువేసేదీ గూడూరొల్లూ


గూడు అంటే 

అడుగున స్తూపకారంగాను, 

పైన కోసుగాను ఉండేట్టు పేర్చిన 

పెద్ద కుప్ప.

జొన్న, కొర్ర, సజ్జ మొ. పైర్లు కోసి, 

ఒక చోట ఇలా కుప్ప వేస్తారు.

కుప్పను రాయలసీమలో గూడు అంటారు.


ఈ విధంగా గూళ్ళువేసేది

గూడూరు వాళ్లు 


(ఆ యా ఊళ్లన్నీ రాయలసీమ జిల్లాల్లోనివి.)


వ్యవసాయవిశేషాలతో పాటు

తన రాయలసీమ ఊళ్లను స్మరించుకోవడం

తద్ద్వారా అందఱికీ ఉపాధి కల్పించడం,

వ్యవసాయం సమిష్టిసృష్టి అని చెప్పడం, 

కవి రచనాసంకల్పం.

(అని నేను అనుకొంటున్నాను.)


ఏమైనా అర్థమయ్యేలా వ్రాశానో లేదో చెప్పండి.


మంగళం మహత్



18, నవంబర్ 2022, శుక్రవారం

తబిసిపిట్ట

 తపస్వి వికృతే తబిసి.


పరిశీలించినంతవఱకు

గబ్బిలానికి పర్యాయపదంగా

ఈ తబిసిపిట్ట పదబంధాన్ని 

జాషువాగారే సృష్టించారు 

అని అనిపిస్తోంది.


ఈ తబిసి పదం 

ఆయనకు ఇష్టమై కూడ ఉండనోపు.


తన రచనల్లో 

సబర్మతి తబిసి,

బోసినోటి తబిసి,

తబిసి రాజులు,

తబిసి గుబ్బెతలరాణి

అని ప్రయోగించారు.


(శ్రీ చలమచర్ల రంగాచార్యులు

తమ అలంకారవసంతంలో

తబిసిఱేండ్లు అని ప్రయోగించారు.


మధురాంతకం రాజారాం గారు

తన రాయలసీమ గబ్బిలం కథలో

తబిసిపక్షి అన్నారు.)


ఇక

జాషువా గారు, గబ్బిలం కావ్యంలో గబ్బిలాన్ని "తబిసి పిట్ట " అని ప్రయోగించడానికి గల కారణం ఏమై ఉంటుంది?

అంటే


నిలబడి చేసే తపస్సు,


ఒంటికాలి మీద నిలబడి చేసే తపస్సు,


అంగుష్ఠము ధరణి మోపి 

అతి ఘోరంగా చేసే తపస్సు,

(అగస్త్యుడు గంగాయమునాతీరోత్సంగమున ప్రయాగను ఇలా తపస్సు చేశాడు),


తలక్రిందులుగా చేసే తపస్సు

(వాలఖిల్యులు చేశారు)


ఇలా తపస్సులో రకాలున్నాయి.


గబ్బిలం స్వభావసిద్ధంగా

తలక్రిందులుగా వ్రేలాడుతూంటుంది.


(శరీరాన్ని తలక్రిందులుగా వేలాడతీయడం వల్ల గాలిలోని స్పందనలను, ప్రతిధ్వనులనూ సులువుగా వినగలుగుతుంది.)


దాన్ని కవి తలక్రిందుల తపస్సుగా

ఊహించి, తబిసిపిట్ట అన్నారు.


అయితే ఆ పద్యంలో సార్థకంగా వాడినట్లు అనిపించదు. ఒక పర్యాయపదంగానే

వాడినట్లు అనిపిస్తుంది.


కానీ ఒక ప్రయోజనం సిద్ధిస్తోంది.


ముందు ముందు

తానొక సందేశాన్ని మోసుకొని వెళ్లాలని,

భారతదేశం దక్షిణప్రాంతంలోని 

తంజావూరునుండి

ఉత్తరదిశలోని కాశీవిశ్వేశ్వరుని ఒద్దకు ,

బహుదూరం ప్రయాణించాలని 

అది ఒక తపస్సని సూచించటానికై


తబిసిపిట్ట అని ప్రయోగించి,

ముందుకథను సూచించారు.


ఇంకా విశేషం ఉంటే పండితులు చెప్పగలరు.


~మంగళం మహత్~



28, అక్టోబర్ 2022, శుక్రవారం

రామాయణంలో సముద్రుడు

 వాల్మీకి, 

రామాయణంలో ఎక్కడా

ఇందువల్ల ఇలా జరిగింది.

అందువల్ల అలా జరిగింది 

అని పేర్కొంటూ

ఏ సంఘటనా వ్రాయలేదు.

ఉన్నది ఉన్నట్లు జరిగిన కథను వ్రాశాడంతే.


అందువల్ల ఆయా ఘట్టాలు జరిగిన తర్వాత వాటిని అన్వయం చేసుకొంటూ వెళ్లగల్గితే కార్యకారణసంబంధాలు తెలుస్తాయి.


రామాయణవ్యాఖ్యాతలు కొందఱు 

వాటిని వివరించారు.


సముద్రుడు మైనాకునితో

హనుమంతుడు వస్తున్న 

విషయం గుఱించి చెప్పి


"సలిలాదూర్ధ్వముత్తిష్ఠ 

తిష్టత్వేష కపిస్త్వయి, 

అస్మాకమతిథి శ్చైవ 

పూజ్యశ్చ ప్లవతాం వరః.


అతిథి అయిన ఈ హనుమంతుఁడు నీమీద నిలవడానికి వీలైనట్లు ఉదకంనుండి పైకి లే.


చామీకరమహానాభ

దేవగంధర్వ సేవిత,

హనుమాంస్త్వయి విశ్రాంత

స్తతః శేషం గమిష్యతి.


హనుమంతుడు నీపై కొంత సేపు విశ్రమించి, పిమ్మట, మిగిలిన దూరం ప్రయాణం చేయగలడు.


కాకుత్థ్సస్యానృశంస్యం చ 

మైథిల్యాశ్చ నివాసనమ్, 

శ్రమం చ ప్లవగేన్ద్రస్య 

సమీక్ష్యోత్థాతుమర్హసి.


రాముని సాధుత్వాన్ని,

సీతయొక్క (లంకా) వాసాన్ని,

హనుమంతుని శ్రమను, 

దృష్టిలో ఉంచుకొని పైకి లే " అని అన్నాడు.


(సముద్రుడు రామునిలో 

సాధుత్వాన్ని చూశాడు. 

ఇది గుర్తుపెట్టుకోండి)


అపుడు మైనాకుడు పైకి లేచి,


"తిష్ఠ త్వం హరిశార్దూల 

మయి విశ్రమ్య గమ్యతామ్.


ఓ, వానరోత్తమా! ఆగి, 

నా పై విశ్రమించి,

వెళ్ళు." అన్నాడు.


హనుమంతుడు సున్నితంగా తిరస్కరించి, ముందుకు సాగిపోయాడు.


దేవతాశ్చభవన్ హృష్టా

స్తత్రస్థాస్తస్య కర్మణా, 

కాఞ్చనస్య సునాభస్య 

సహస్రాక్షశ్చ వాసవః.


మైనాకుడుచేసిన ఈ పనికి, 

అక్కడ ఉన్న దేవతలు, దేవేంద్రుడు కూడ 

చాల సంతోషించారు.


ఇంద్రుడు సంతోషంతో గొంతు గద్గదం కాగా,


"హిరణ్యనాభ శైలేన్ద్ర

పరితుష్టోఽస్మి తే దృశమ్, 

అభయం తే ప్రయచ్ఛామి 

తిష్ఠ సౌమ్య యథాసుఖమ్.


ఓ మైనాకుడా। నీ విషయంలో చాల సంతోషించాను. నీకు అభయ మిస్తున్నాను. ఇటుపై సుఖంగా ఉండు."


అని వరం ఇచ్చాడు.


వాల్మీకి చెప్పకపోయినా, 

మైనాకుని భయం తీరడానికి 

సముద్రుడు చేసిన సాయం ఇది అని 

ఇదంతా జరిగాక మనకు తెలుస్తుంది.


మైనాకునికి ఇంద్రుని భయం పోనంత

వఱకు తనలో ఉన్న మైనాకునివల్ల

తనకు కూడా ఇబ్బందే. ఇపుడు ఇద్దరికీ ఇబ్బందులు తీరాయి.


ఇది ఒక ఘట్టం.


తర్వాత రామాదులు ససైన్యంగా 

సముద్రతీరానికి చేరారు.


తతః సాగరవేలాయాం 

దర్భానాస్తీర్య రాఘవః, 

అంజలిం ప్రాఙ్ముఖః కృత్వా 

ప్రతిశిశ్యే మహోదధేః

బాహుం భుజఙ్గభోగాభ

ముపధాయారిసూదనః.


పిమ్మట రాముడు సముద్రతీరమందు 

దర్భలు పరచుకొని సముద్రానికి నమస్కరించి, సర్పశరీరంలా ఉన్న బాహువును తలగడగా ఉంచుకొని ప్రాఙ్ముఖుడై శయనించాడు.


సత్రిరాత్రోషితస్తత్ర 

నయజ్ఞో ధర్మవత్సలః,

ఉపాసత తదా రామః 

సాగరం సరితాం పతిమ్.


నీతి, ధర్మం తెలిసిన రాముడు 

అక్కడ మూడు దినాలు శయనించి 

సముద్రుని ఉపాసించాడు.


న చ దర్శయతే రూపం 

మందో రామస్య సాగరః, 

ప్రయతేనాపి రామేణ 

యథార్హమభిపూజితః,


ఆ విధంగా రాముడు నియమవంతుడై యథావిధిగా పూజించినా 

మందుడైన సముద్రుడు దర్శనం ఇవ్వలేదు.


దాంతో రామునికి కోపం వచ్చింది.


విచిన్వన్నాభిజానాసి

పౌరుషం వాపి విక్రమమ్, 

దానవాలయ సంతానం 

మత్తో నామ గమిష్యసి.


సముద్రుడా! నీవు పరిశీలించి కూడా 

నా పౌరుషపరాక్రమాల్ని గుర్తించలేకున్నావు.

నా వలన ఇప్పుడు సంతాపం పొందగలవు.


బ్రాహ్మేణాస్త్రేణ సంయోజ్య 

బ్రహ్మదండనిభం శరమ్, 

సంయోజ్య ధనుషి శ్రేష్ఠే

విచకర్ష మహాబలః


రాముడు, బ్రహ్మదండంతో సమానమైన 

బాణాన్ని  బ్రహ్మాస్త్రంతో కూర్చి, 

ధనస్సునందు చేర్చి లాగాడు.


(భూమ్యాకాశాలు బ్రద్దలైనట్లయ్యాయి.

కొండలు కంపించాయి.)


సహసాభూత్తతో వేగా

ద్భీమవేగో మహోదధిః, 

యోజనం వ్యతిచక్రామ

వేలామన్యత్ర సంప్లవాత్.


అప్పుడు మహాసముద్రం శీఘ్రంగా భయంకరమైన వేగం పొంది, ఆ వేగంవల్ల రామాదులున్న వైపునుండి ఒక యోజనం లోపలికి పోయింది.


తం తథా సమతిక్రాంతం

నాతిచక్రామ రాఘవః, 

సముద్ధతమమిత్రఘ్న 

రామో నదనదీపతిమ్


రాముడు ఆ విధంగా దూరానికి తొలగిన (పారిపోతున్న వానిపై బాణం వేస్తే ధర్మాన్ని అతిక్రమించినట్లవుతుంది. అందువల్ల) సముద్రునిపై  బాణం వేయలేదు. 


తతో మధ్యాత్సముద్రస్య

సాగరః స్వయముత్థితః

ఉదయం హి మహాశైలా

న్మేరోరివ దివాకరః.


అప్పుడు సముద్రంమధ్యనుండి సముద్రుడు, మేరుపర్వతంనుండి సూర్యుడు ఉదయించినట్లు స్వయంగా ఆవిర్భవించాడు.


రామునితో ఇలా అన్నాడు.


'పృథివీ వాయురాకాశ

మాపో జ్యోతిశ్చ రాఘవ

స్వభావే సౌమ్య తిష్ఠంతి 

శాశ్వతం మార్గమాశ్రితాః


ఓ సౌమ్యా! రామా ! భూమి, వాయువు, ఆకాశం, జలం, అగ్ని శాశ్వతమార్గాన్ని అనుసరించి తమ స్వభావాన్ని దాటకుండా ఉంటాయి.


(ఇక్కడ సౌమ్య అనే విశేషణం గమనించండి)


తత్స్వభావో మమాప్యేష 

యదగాధో హమఫ్లవః 

వికారస్తు భవేద్గాధ 

ఏతత్తే ప్రవదామ్యహమ్.


లోతుగా దాటశక్యం కాకుండ ఉండడం అనేది  

నా స్వభావం. లోతు లేనివాడ నైతే అది నా స్వభావానికే విరుద్ధం. ఈ విషయం నీకు చెప్తున్నాను, విను.


న కామాన్న చ లోభాద్వా 

న భయాత్పార్డివాత్మజ,

రాగాన్నక్రాకులజలం 

స్తంభయేయం కథంచన. 


రాజకుమారా ! మొసళ్లతో వ్యాకులంగా ఉండే జలాన్ని నేనెన్నడూ ఏదైనా కోరికవలన గాని, లోభంవలన గాని, భయంవలన గాని, ప్రేమవలన గాని స్తంభింపచేయను.


విధాస్యే యేనగంతాసి

విషహిష్యే హ్యహం తథా,

న గ్రాహా విధమిష్యన్తి 

యావత్సేనా తరిష్యతి, 

హరీణాం తరణే రామ 

కరిష్యామి యథాస్థలమ్.


రామా! నీవు దాటటానికి వీలుగా నేను ఏర్పాటు చేస్తాను. స్థలాన్ని ఏర్పరచి సహించి ఉంటాను.

సేన దాటేవఱకు మొసళ్లు అపకారం చేయకుండా చేస్తాను."


( భయపెట్టినా సరే జలాన్ని స్తంభింపజేయనని, 

తన సహజస్వభావానికి విరుద్ధంగా 

లోతు తగ్గించడం అనేది కూడా కుదరదని

సముద్రుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. 

అన్యాపదేశంగా సేతుబంధనం కావించమని సూచిస్తున్నాడు.)


అప్పుడు రాముడు సముద్రునితో ఇలా అన్నాడు.


"అమోఘోఽయం మహాబాణః

కస్మిన్ దేశే నిపాత్యతామ్.


అమోఘమైన ఈ మహాబాణం వ్యర్థమవటానికి వీలు లేదు. దీన్ని ఎక్కడ ప్రయోగించను?"


గొప్పదైన ఆ బాణాన్ని చూసి, రామునితో

సముద్రుడు ఇలా అన్నాడు.


"ఉత్తరేణావకాశోఽస్తి

కశ్చిత్పుణ్యతరో మమ,

ద్రుమకుల్య ఇతి ఖ్యాతో 

లోకే ఖ్యాతో యథా భవాన్.


నాకు, ఉత్తరంగా, ద్రుమకుల్యం అనే 

మిక్కిలి పుణ్యతరమైన, 

నీలాగే ప్రసిద్ధి పొందిన

ఒక ప్రదేశం  ఉంది.


ఉగ్రదర్శనకర్మాణో 

బహవస్తత్ర దస్యవః

ఆభీరప్రముఖాః పాపాః 

పిబన్తి సలిలం మమ.


అక్కడ చూడ్డానికి భయంకరులు, ఉగ్రమైన పనులు చేసేవారు, పాపాత్ములైన ఆభీరులు మొదలైన దస్యువులు నా జలం త్రాగుతున్నారు.


తైర్న తత్స్పర్శనం పాపం 

సహేయం పాపకర్మభిః, 

అమోఘః క్రియతాం రామ 

తత్ర తేషు శరోత్తమః.


రామా! ఆ పాపాత్ముల స్పర్శను సహించలేకున్నాను. ఈ శ్రేష్ఠమైన బాణాన్ని

ఆ ప్రదేశంలో వాళ్ల మీద ప్రయోగించు"


అపుడు రాముడు ఆ ప్రదేశం మీద బాణాన్ని ప్రయోగించాడు.


ఆ తర్వాత సముద్రుడు రామునితో


"అయం సౌమ్య నలో నామ 

తనయో విశ్వకర్మణః, 

పిత్రా దత్తవరః శ్రీమాన్ 

ప్రతిమో విశ్వకర్మణః.


ఏష సేతుం మహోత్సాహః 

కరోతు మయి వానరః, 

తమహం ధారయిష్యామి 

యథాహ్యేష పితా తథా.


నలుడు విశ్వకర్మ కుమారుడు. 

తండ్రి విశ్వకర్మతో సమానుడు. 


మహోత్సాహవంతుడైన 

ఈ వానరుడు నామీద నిర్మించిన 

సేతువును నేను ధరిస్తాను. 

నాకు ఇతని తండ్రి ఎంతో 

ఇతడు కూడ అంతే." 


అని చెప్పి అంతర్థానమయ్యాడు.


(పై రెండు శ్లోకాలు గమనించారుగా!

ఉత్సాహవంతుడు అనే నలుని విశేషణం.

సేతువు ఉత్సాహం సముద్రునిది.

విశ్వకర్మ ప్రతిభ తెల్సిన సముద్రుడు

నలుని నైపుణ్యాన్ని కూడా తెల్సుకోగోరుతున్నాడని అర్థమవుతుంది.)


ఇక్కడ సందేహం వస్తుంది.


 — రామకార్యం అని చెప్పి భక్త్యాదరాలతో రాముని బంటునే మైనాకుని చేత సత్కరింపబూనిన సముద్రుడు మఱి మూడు రోజులు ఎందుకు ఆలసించాడు?


వివరణ — ప్ర్రార్థించినంత మాత్రానే ప్రసన్నుడై దర్శన మిచ్చి మార్గమిచ్చినట్లయితే

అందఱూ ఈ మార్గాన్నే అనుసరిస్తారు.

నీవు త్రోవ ఇత్తువా చత్తుమా అని ప్రాయోపవేశానికి దిగుతారు.

అలాంటి వ్యవహారానికి దారి చూపించినట్లవుతుంది.

ఇప్పుడో అంతటి రామచంద్రమూర్తికి సాధ్యంగానిది మన కవుతుందా అని విరమిస్తారు.


(రాముడు మానవుడని మఱచిపోరాదు.

ప్రాయోపవేశానికి దిగినంతనే సముద్రుడొస్తే తక్కిన మానవులకది ఆదర్శమవుతుందని తాత్పర్యం. అమోఘపరాక్రమంచేతనే సాధ్యమవ్వాలని సముద్రుడు లోకానికి నిరూపించడం కోసం ఆలసించాడు.)


ఇంకో కారణం.

ఈయనచేత తనకు శత్రువులైన ఆభీరులను చంపించాలి. అది రామచంద్రునకు తప్ప తక్కిన వారికి సాధ్యమయ్యేది కాదు.

కావున స్వామికార్యం స్వకార్యం రెండూ చక్కబడ్డంకోసం ఇంతవఱకు ఆలసించాడు. 

అంతేతప్ప రామచంద్రమూర్తి మహిమ ఎఱుఁగక కాదు. రామచంద్రమూర్తి ఎంత కోపించినా నమస్కరిస్తే క్షమిస్తాడని (సౌమ్యుడన్నాడందుకే)

సముద్రునికి తెలుసు.


ఇంకో విషయం.

త్వరలో రామరావణులమధ్య ఘోరయుద్ధం జరుగబోతోంది. రాముని సాధుత్వం తెలుసు. మైనాకునితో చెప్పాడు. ఇక పరాక్రమం ఎలాంటిదో స్వయంగా చూడాలనిపించింది. దానికి ఇప్పుడు అవకాశం వచ్చింది. అందుకే అడిగిన వెంటనే దర్శనం ఇవ్వక ఆలసించాడు.


సందేహం తీరి ఉంటుందని ఆశిస్తూ


స్వస్తి.


       - ఈశ్వర్

21, అక్టోబర్ 2022, శుక్రవారం

సంస్కృత వ్యాకరణం - అష్టాధ్యాయి

 

'ప్రథమేహి విద్వాంసో వైయాకరణాః, వ్యాకరణమూలత్వాత్సర్వ విద్యానామ్'

(ధ్వ. ఆ. 132) - ఆనందవర్ధనుఁడు.

 

సంస్కృతవ్యాకరణం అతిప్రాచీనం.వ్యాకరణమనగా ప్రకృతి ప్రత్యయ విభాగం. దీని ప్రారంభాన్ని కనుగొనడం కష్టసాధ్యం. ఇతర భారతీయశాస్త్రాలకువలె వ్యాకరణ శాస్త్రానికిని వేదమే మూలం. వైదిక సంహితలలో బీజరూపంలో ఉన్న వ్యాకరణం వైదిక పదపాఠాల్లో పరిపూర్ణత్వం పొందింది. ఆకాలం నాటికి ప్రకృతి ప్రత్యయాలు, ధాతూపసర్గలు, సమాసపూర్వపదోత్తరపదాలు ఇత్యాది విభాగాలు బాగా నిర్ణీతాలయ్యాయి.

 

నూనం వ్యాకరణం కృత్స్న

మనేన బహుధాశ్రుతమ్'

బహువ్యాహరతానేన

నకించి దపశబ్దితమ్' (రామా కి. 82:1)

 

అనే శ్లోకాన్నిబట్టి రామాయణ కాలంనాటికే వ్యాకరణశాస్త్రానికొక నిర్ణీతరూపం లభించినట్లు తెలుస్తోంది.

 

అలాగే అతిప్రాచీన కాలంనుండి వ్యాకరణాభ్యాసానికి అతిప్రాధాన్యం ఉండేదని

'పురాకల్ప ఏతదాసీత్, సంస్కారోత్తరకాలం

బ్రాహ్మణాః వ్యాకరణం అధీయతే స్మ' (మహాభా. 1.1.1)

అనేది సూచిస్తోంది.

 

వ్యాకరణోత్పత్తి:

 

వ్యాకరణానికి మూలకందమైన అక్షరసమామ్నాయాన్ని తొలుత

బ్రహ్మ బృహస్పతికి, బృహస్పతి ఇంద్రునకు, ఇంద్రుడు భరద్వాజునకు, భరద్వాజుడు ఋషులకు,

ఋషులు బ్రాహ్మణులకు బోధించారని ఋక్తంత్రకారవచనం చెప్తోంది.

 

క్రమంగా వ్యాకరణశాస్త్రం కూడ ఇతర బ్రహ్మోపజ్ఞశాస్త్రాల్లా అతి విస్తృతమైంది.

తదనుసారులైన వ్యాకరణాలన్నీ అనుశాసనాలు, అనుతంత్రాలు అని ప్రసిద్ధమయ్యాయి.

 

బృహస్పతివ్యాకరణం కేవలం శబ్దాల్ని ఏకరువు పెట్టడంచేత శబ్దపారాయణమనే పేరు ఏర్పడింది.

దాన్ని ఇంద్రుఁడు నేర్చుకొని,  సవరించి, తన ఇంద్రవ్యాకరణంలో ప్రకృతి ప్రత్యయవిభాగాలుగా

అభ్యసించే విధానం కనుగొన్నాడు. తదాది వాస్తవవ్యాకరణానికి నాంది ఏర్పడింది.

 

రెండు సంప్రదాయాలు:

 

వ్యాకరణంలో ఇంద్ర, మాహేశ్వరసంప్రదాయాలనే రెండు సంప్రదాయాలున్నాయి.

కాతంత్రవ్యాకరణం ఐంద్రసంప్రదాయసంబంధి, పాణినీయవ్యాకరణం మాహేశ్వర సంప్రదాయసంబంధి అని అభియుక్తోక్తి. కాతంత్రాదులు లౌకిక వ్యాకరణాలు. పాణినీయాదులు లౌకిక వైదిక వ్యాకరణాలు.

 

పాణినికి పూర్వం ఎనుబదియైదు మంది వైయాకరణుల పేళ్లు తెలియవస్తున్నాయి.

 

మహేశ్వరుడు:

పాణినీయంలో స్మరింపబడని ప్రాచీన వైయాకరణుడితడు. సారస్వతభాష్యాన్ని బట్టి మాహేశ్వరవ్యాకరణం అతివిస్తృతమైనదని తెలుస్తోంది. పాణినీయశిక్షకు చివర నున్న

యేనాక్షరసమామ్నాయ

మధిగమ్య మహేశ్వరాత్

కృత్స్నంవ్యాకరణం ప్రోక్తం

తస్మై పాణినయే నమః'

అనుశ్లోకంచేత 'అఇఉణ్'  ఇత్యాది చతుర్దశ సూత్రాలు మహేశ్వరోపజ్ఞాలని తెలుస్తోంది.

 

ఆ సూత్రాలు

 

అఇఉణ్

ఋఌక్

ఏఓఙ్

ఐఔచ్

హయవరట్

లణ్

ఞమఙణనమ్

ఝభయ్

ఘఢధష్

జబగడదశ్

ఖఫఛఠథచటతవ్

కపయ్

శషసర్

హల్

ఇతి మాహేశ్వరాణి సూత్రాణ్యణాది సంజ్ఞార్థాని.

 

'అణ్' మొదలగు సంజ్ఞల కుద్దిష్టాలైన మాహేశ్వరసూత్రాలు.

 

మహేశ్వరాత్ ఆగతాని మాహేశ్వరాణి"

 

మహేశ్వరుని ద్వారా పాణిన్యాదులకు లభించినవి అని అర్ధం.

 

నృత్తాఽవసానే నటరాజరాజః

ననాద ఢక్కాం నవ పంచవారమ్,

ఉద్ధర్తు కామః సనకాది సిద్ధా

నేతద్విమర్శే శివసూత్రజాలమ్.

 

అను నందికేశ్వరకారిక ఈ విషయాన్నే చెప్తోంది.

ఈ మాహేశ్వర సూత్రాలకు అక్షరసమామ్నాయం, వర్ణ సమామ్నాయం అనే నామాంతరాలు కూడ ఉన్నాయి.

 

సూత్రాల చివర ఉన్న పొల్లులను ఇత్సంజ్ఞ లంటారు.

ఏత ఇతి ఇత్ - పోయేది అని అర్థం.

కీలకమంతా వీటిలోనే ఉంది. వీటితో అవసరమైన ప్రత్యాహారాలు తయారు చేయవచ్చు.

 

ఈ సూత్రాలనే గాక అనేక ఇతర విషయాల్ని కూడ పాణిని మహేశ్వరునినుండి గ్రహించాడని

సూచిత మవుతోంది. ఈ మహేశ్వరవ్యాకరణ మిపుడు అలభ్యం.

 

పాణిని:- (2900-క్రీ.పూ.) విదేశీవ్యాకరణకారుల్ని సైతం అబ్బురపఱచిన అష్టాధ్యాయిని రచించిన పాణిని

సంస్కృత వైయాకరణులలోనే గాక ప్రపంచ సర్వభాషా వైయాకరణులలో అత్యున్నతగౌరవార్హస్థానం పొందాడు.

ఈతని వ్యాకరణంతో పోల్చదగిన వ్యాకరణం ప్రపంచంలోని ప్రాచీన భాషలకుగాని అర్వాచీన భాషలకు గాని

నాటినుండి నేటివఱకు రచింపబడలేదనే విషయం సర్వపండితలోకాంగీకృతం. ఈ వైయాకరణమూర్ధన్యుడు అనేక గ్రంథాల్లో పాణిన, పాణిని, దాక్షీపుత్త్ర, శాలంకి, శాలాతురీయ, ఆహిక, పాణినేయ, పణిపుత్త్ర అనే ఎనిమిది పేళ్లతో ప్రసిద్ధి పొందాడు. ఈతని గురువు ఉపవర్షుడని లోకప్రతీతి. కౌత్సుడు ఈతని ప్రధానశిష్యులలో ఒక్కడని తెలుస్తోంది. వార్తికకారుడు వరరుచి (కాత్యాయనుడు)ఈతని శిష్యుడేయని ప్రసిద్ది. త్రయోదశీతిథినాడు పరమపదించడంతో

దానిని పాణినీయ అనధ్యయనతిథిగా పరిగణిస్తారు.

 

భాష్యకారుడగు పతంజలి అభిప్రాయం ప్రకారం పాణిని సూత్రంలో ఒక్క అక్షరం కూడ వ్యర్థమవడానికి వీలులేదు.

ఈ శాస్త్రమందలి సూత్రాలన్నీ పరస్పర సంబంధాలవడంతో దీనిలో నిరర్థకమైన దొక్కటీ నాకు కానరాదన్నాడు.

 

పాణిని వ్యాకరణానికి అష్టాధ్యాయి, అష్టకం, శబ్దానుశాసనం, వృత్తి సూత్రం, అష్టికా మొదలైన పేళ్లున్నాయి.

మొదటిది అతిప్రసిద్ధమైనది.

 

అష్టాధ్యాయికి సహాయకంగా పాణిని ధాతుపాఠ, గణపాఠ, ఉణాదిసూత్ర, లింగానుశాసనాలను రచించాడు.

 

కాత్యాయనుడు:- పాణినీయ వ్యాకరణంపై వ్రాసిన వార్తికాలలో కాత్యాయన రచిత వార్తికాలు ప్రసిద్ధమైనవి. కాత్యాయనునకు కాత్యుడు, పునర్వసువు, మేధాజిత్, వరరుచి అనే నామాంతరాలున్నాయి. ఈతడు పాణిని శిష్యుడు, దాక్షిణాత్యుడు.

 

కాత్యాయనుని వార్తికాలు లేకపోతే అష్టాధ్యాయి అసంపూర్ణగ్రంథంగా  ఉండిపోయేది. అందువల్ల ఇవి పాణినీయానికి ప్రధానాంగాలు. పతంజలి కాత్యాయన వార్తికాలనే ఆధారంగా చేసికొని తన భాష్యాన్ని రచించాడు.

వార్తికపాఠం స్వతంత్ర గ్రంథరూపంలో లభ్యమవడంలేదు. ఇవన్నీ మహాభాష్యంలోఇతర వార్తికాలతో కూడ కలిపి వ్యాఖ్యానింపబడ్డాయి.

 

వార్తికమనగా 'వృత్తివ్యాఖ్యానం' అని చెప్పవచ్చు. వాక్యం, వ్యాఖ్యానసూత్రం, భాష్యసూత్రం, అనుతంత్రం, అనుస్మృతి అనే పదాలు 'వార్తిక' పర్యాయాలు. అందువల్ల వార్తికకారుని వాక్యకారుడని కూడ అంటారు.

 

పతంజలి: (క్రీ.పూ.2000)

ఈతడు పాణినీయంపై భాష్యాన్ని రచించాడు. భాష, శైలి, విషయ వివేచనం మొదలైన వాటిలో దీని కిదే సాటి. అందుకే దీనికి మహాభాష్యమని ప్రసిద్ధి. పతంజలి ఆదిశేషుని అపరావతారమంటారు. సూత్ర, వార్తికభాష్యాలలో అభిప్రాయభేదం వచ్చినపుడు పతంజలి మతమే ప్రమాణమని వైయాకరణులు  అంగీకరిస్తారు. ప్రాచీన గ్రంథాల్లో పతంజలి, నాగనాథుడు, అహిపతి, ఫణాభృత్, శేషరాజు, శేషాహి, చూర్తికారుడు, పదకారుడు మొదలైన పేళ్లతో నిర్దేశింపబడ్డాడు. పతంజలి పాణిని వ్యాకరణాన్నే గాక అనేక ఇతర ప్రాచీన వ్యాకరణాల్ని గూడ దృష్టిలో ఉంచుకొని తన భాష్యాన్ని రచించాడు. వ్యాఖ్యాన వ్యాజాన ఎన్నో విషయాలను చెప్పాడు. అందువల్ల మహాభాష్యం వ్యాకరణ శాస్త్రానికే కాక ఎన్నో ఇతర విద్యలకు కూడ ఆకరం అని చెప్పవచ్చు.

 

ఇంతటి వ్యాకరణవిజ్ఞానాన్ని మనకు అందించారు కనుకనే

 

వాక్యకారం వరరుచిం

భాష్యకారం పతంజలిమ్,

పాణినిం సూత్రకారం చ

ప్రణతోఽస్మి మునిత్రయమ్

 

అని సూత్రవాక్యభాష్యకారులైన పాణిని, వరరుచి, పతంజలి ముగ్గురికీ నతులర్పించి

వ్యాకరణాధ్యయనం ప్రారంభిస్తారు.

 

మంగళం మహత్