16, ఏప్రిల్ 2024, మంగళవారం

వేటూరి వ్యాఖ్యానం

సాగరసంగమం సినిమాలో
 
వాగర్థావివసంపృక్తౌ
వాగర్థ ప్రతిపత్తయే 
జగతః పితరౌ వందే 
పార్వతీపరమేశ్వరౌ 

అనే కాళిదాస రఘువంశ శ్లోకాన్ని పాడిస్తూ,

పార్వతీపరమేశ్వరౌ అని కలిపి ఒకసారి
పార్వతీప రమేశ్వరౌ అని విడదీసి ఒకసారి 
పాడించామని 
పార్వతీపః అంటే శివుడని వేటూరి వారన్నారు.


నా(గ)స్వ(ర)వ్యాఖ్య :-

పార్వతీపః అంటే శివుడనే అర్థం ఎక్కడా లేదు. దీనికోసం అన్ని నిఘంటువులనూ తిరగవేయడం జరిగింది.

వేటూరి ప్రభాకర శాస్త్రి గారు చెప్పినది అనడంతో అంతటి పండితుడు ఇలా చెప్పి ఉంటారా అనే సందేహం వస్తోంది. నమ్మబుద్ధి కావడం లేదు.

రఘువంశానికి వ్యాఖ్యానం వ్రాసిన మల్లినాథుడు
(ఈ మల్లినాథుడు విద్వత్సార్వభౌముడు. ఈయన వ్యాఖ్య వ్రాశాక పూర్వ వ్యాఖ్యలు మూలపడ్డాయి. అంత గొప్పవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మల్లినాథుని వల్లనే మహాపండితులకు కూడ కాళిదాసు అర్థమయ్యాడు.) 
పితరౌ అన్నదానికి వ్యాఖ్య వ్రాస్తూ 
"మాతా చ పితా చ పితరౌ" అని స్పష్టంగా వ్రాశారు తప్ప ఇద్దరు తండ్రులు అని పేర్కొనలేదు. 

పోని ఆయనకు తెలియదనుకొందాం. 

రఘువంశానికి ప్రతిపదార్థ తాత్పర్యాలు వ్రాసిన మహామహోపాధ్యాయ, కళాప్రపూర్ణ వేదం వేంకటరాయశాస్త్రి గారు కూడా ఇటువంటి విశేషార్థం ఉంది అని చెప్పలేదు.

"కవి కేవలం పార్వతి పరమేశ్వరులకు నమస్కారం అని అంటాడా...." అని వేటూరివారనడం ఆశ్చర్యంగా ఉంది.

ఈ శ్లోకంలో (నమస్కారమే కాక) పార్వతీపరమేశ్వరులను వాగర్థాలతో పోల్చడం ముఖ్యమైన అంశం. 

ఇలా పార్వతీపరమేశ్వరులను వాగర్థాలవలె కూడి ఉన్నారని పోల్చడమే అంతవఱకూ ఎవరికీ తట్టని గొప్ప విషయం. 

వాక్ తోడనే అర్థం స్ఫురించినట్లు పార్వతి తోడనే పరమేశ్వరుడు స్ఫురిస్తాడు అన్న విషయాన్ని కాళిదాసు హైలెట్ చేసి చెప్పాడు. 

పార్వతీపరమేశ్వరుల నిరతిశయాన్యోన్య ప్రేమాతిశయం తెలుపడం కోసం వారిని వాగర్థాలతో పోల్చాడు.

తాను రఘువంశ మహాకావ్యం వ్రాయబోతున్నాడు. పైగా వ్రాయగలనా లేదా అనే సందేహం ఒకటి చింతకు గురి చేస్తోంది. అలాగే "ఆశీర్నమస్క్రియావస్తునిర్దేశాల"లో ఒకటి పాటిస్తూ, ప్రథమశ్లోకం వ్రాయాలనే సత్సంప్రదాయాన్ని పాటించాలి.

ఇక్కడే కాళిదాసు ప్రతిభ కనబడుతుంది. 
వారు తల్లిదండ్రులు. తాను పుత్త్రుడు. కావ్యరచన అనే తన ఈప్సితం నెరవేరాలి. అందుకు వారి ఆశీస్సులు కావాలి. అందుకు నమస్కారం తగినది. అందువల్ల ఆశీఃవస్తునిర్దేశాలకు పోకుండా నమస్కారాన్ని ఎంచుకొన్నాడు.
బిడ్డ కోరికను అన్యోన్యవిమనస్కులైన తల్లిదండ్రులు తీరుస్తారా? అన్యోన్యరక్తులైన వారు తీరుస్తారా అంటే జవాబు స్పష్టమే కదా! అందుకే అర్థనారీశ్వరతత్త్వం ప్రకటితమయ్యేలా, వారిని విడదీయలేని వాగర్థాలతో పోల్చి, తన భక్తిప్రపత్తులను చాటుకొంటూ నమస్కారం చేశాడు.

వాయుపురాణసంహితావచనంలో
శబ్దజాలం పార్వతి, అర్థజాలం శివుడు అని శబ్దార్థస్వరూపాలుగా చెప్పబడితే, 
కాళిదాసు శబ్దార్థాలుగా కూడి ఉన్నట్లు చెప్పి, ఈ గొప్ప ఔపమ్యంచేత పార్వతీపరమేశ్వరుల నిరతిశయాన్యోన్య ప్రేమాతిశయాన్ని హృదయంగమంగా వర్ణించాడు.

పార్వతి అనగానే పరమేశ్వరుడు స్ఫురించినట్లు పరమేశ్వరుని స్మరించినంతనే విష్ణువు స్ఫురించడు. ఆలోచిస్తే తెలుస్తుంది.

ఇంకా వేటూరి వారు
"కవి ఇంకేమన్నా సంఘప్రయోజనాన్ని ఆశించి ఏమన్నా అని ఉండచ్చునా...." అన్నారు.

అంటే వారి దృష్టిలో శైవవైష్ణవమతకలహాలై ఉంటాయనుకోవచ్చు. అందువల్ల ఈ శ్లోకంతో శివకేశవులొకటే అని కాళిదాసు చాటి ఉంటాడని వారి ఊహ.

కాళిదాసు క్రీస్తుపూర్వం వాడు.
అప్పుడేమీ శివకేశవభేదాల గొడవలు లేవు. 
 
క్రీ.శ 12వ శతాబ్ది ప్రాంతం నాటికి వీరశైవం ఉద్భవించి, శైవవైష్ణవమతకల్లోలాలు రేగాయి. అందువల్ల అటువంటి సంఘప్రయోజనం కోసం అన్నది కూడ కాళిదాసు నాటికి అవసరం ఉన్నట్లు తోచదు.

కాబట్టి వాగర్థాలకు పార్వతీపరమేశ్వరులే సరైన అపూర్వమైన అద్భుతమైన ఉపమానం.

ఇవన్నీ పర్యాలోచించి చూస్తే వాగర్థాలకు ఔపమ్యం పార్వతీపరమేశ్వరులు మాత్రమే తప్ప శివవిష్ణువులు కాదని నా(గస్వరం)భావం. పండితులు తేల్చాలి.

మంగళం మహత్