26, సెప్టెంబర్ 2022, సోమవారం

గుఱ్ఱం జాషువా రచన గబ్బిలం

గుఱ్ఱం జాషువా గారి రచన గబ్బిలంలో ఆయన తంజాపురినే ఎందుకు ఎంచుకున్నారు? 

అన్న ప్రశ్నకు నా(గ)స్వ(రం) భావన ఈ జవాబు

 

"కాళిదాసుని మేఘసందేశము మనస్సులో నుంచుకొని నే నీ కావ్యమును రచించితిని"
అని జాషువా గారే స్వయంగా చెప్పారు.

కాన ఇది సందేశకావ్యం.
గబ్బిలం ద్వారా ఒక పేదవాడు కాశీ విశ్వేశ్వరునికి సందేశం పంపడమే కావ్యవస్తువు.

మేఘునికి
రామగిరి నుండి అలకాపురి వఱకు ఏ యే ప్రాంతాలగుండా వెళ్లాలో యక్షుడు చెప్పినట్లే 

పేదవాడు గబ్బిలానికి చెప్తాడు.


కాబట్టి
దక్షిణం (తంజావూరు) నుండి
ఉత్తరం (కాశీ) వఱకు (ఒక దిక్కు నుండి మఱొక దిక్కు)
ఉన్న ప్రాంతాల్ని తనదైన శైలిలో వివరించడం కోసమనీ,

దక్షిణం వైపు ఏదో ఒక ఊరు కాకుండా సాహిత్యపోషకుడైన
రఘునాథరాయలి రాజధాని నుండి
విశ్వేశ్వరుని రాజధాని కాశీ వఱకు
కావ్యవిస్తృతి ఉండేలా చక్కగా వర్ణించడం కోసమనీ కవి తంజావూరును ఎన్నుకోవడం జరిగింది.

తర్వాత జాషువా రచించిన పద్యాలను బట్టి రఘునాథరాయలంటే ఆయనకు ఇష్టం అని చెప్పవచ్చు.

ఎటువంటి భేదభావం చూపకుండా, ముఖ్యంగా ఎక్కువ తక్కువలు చూడకుండా వివిధ కవుల్ని సమానంగా ఆదరించిన ఆ రాజు సాహితీసేవ నచ్చడం.

అందుకే

పూపవయస్సులో వలసపోయిన చక్కని తెల్గు కైతకున్
బ్రాపక మిచ్చినట్టి రఘునాధనృపాలకుఁ డేలియున్న తం
జాపురి మండలంఁబునకుఁ జక్కగ దక్షిణభాగ భూములన్
గాపురముండె నప్పరమ గర్భదరిద్రుఁడు నీతిమంతుడై

అని కవి మొదటే పేదవాని మకాంతో పాటు రఘునాథరాయలి ప్రశంస కూడా తేవడం జరిగింది.

తెల్గుకైత చక్కనిదని గ్రహించి ప్రాపకమిచ్చిన గొప్ప కావ్యకళాపోషకు డాయన.

ఇంకా కవి పేదవాని ద్వారా గబ్బిలానికి మార్గం చెప్తూ

కొమరారు దంజనగరము
సమీపమునఁ గలదు తెలుఁగు సౌరభ్యంబుల్

గమగమ వలచిన చోటది

యమరున్ రఘునాథరాజు నాస్థానంబున్


(తెలుగు కవితా సౌరభాలు "అభినవభోజరాజు" రఘునాథరాజు ఆస్థానంలో గమగమలాడుతున్నాయి.)

అప్పటికి తెలుగు ప్రాంతంలో

కృష్ణరాయలవారి యెడఁబాట్లు చీకట్లు ముసరి దిక్కులలోన మసలువేళ

(ఆంధ్రభోజుని ఎడబాటు తెలుగు కవులను క్రుంగదీసింది)

భూరి వాజ్మయలక్ష్మి దారిబత్తెముతోడఁ దంజాపురమువంకఁ దరలు వేళఁ

(ఇక్కడ ఆదరించేవారు లేక అక్కడ రఘునాథరాయలి కళాభిరుచి తెల్సుకొని తెలుగు కవులు తంజాపురి దారి పట్టారు.)

వేంకటకవి తెల్గు పంకేరుహాక్షికి శ్లేషోక్తు లలవాటు సేయువేళఁ

(రఘునాథుని ఆస్థాన ఆంధ్ర కవులలో చేమకూర వెంకట కవి అగ్రగణ్యుడు + విజయవిలాసప్రశంస)

బచ్చ పచ్చని ముద్దుపళని ముద్దుల కైత శృంగార రసము వర్షించువేళ

(తంజాపురప్రాంత మధురకవయిత్రి)

మువ్వగోపాల దేవుని పూజసేయ ఘనుఁడు క్షేత్రయ కలమందుకొనినవేళ

(రఘునాథుని ఆస్థానాన్ని దర్శించిన మధురభక్తి వాగ్గేయకారుడు)

నపరరాయలు రఘునాథ నృపతి విభుఁడు
కట్టుకొన్నాఁడు సత్కీర్తి కుట్టిమంబు

ఇలాంటి అపరరాయలైన రఘునాథుడంటే జాషువాగారికి ఇష్టమనడంలో సందేహమేముంది?

ఇంకా ఇలా చెప్తూ,

తనువుప్పొంగ సరస్వతీమహలు సందర్శించి తంజాపురీ
మనుజాధీశుల యోలగంబును పరామర్శించి పొమ్ముత్తరం
బునకున్ ద్రావిడభూములం గడచి పోబోదోచెడిన్ వాఁడువా
ఱని శౌర్యంబుసుమించుఁ దెల్గు పొలిమేరల్నేత్రపర్వంబుగన్

అనడంవల్ల తంజాపురీమనుజాధీశుల ఓలగం సందర్శించాలన్న కవి హృదయం కనబడుతుంది.

వీటన్నిటిని పర్యాలోచించినదాన్ని బట్టి కవి తంజావూరును ఎన్నుకొని ఉండవచ్చని నా(గ)స్వ(రం) భావన.

ఈకావ్యానికి ప్రేరణ:

గుడిలో గబ్బిలా లున్నప్పుడు అస్పృశ్యులకు (ఆ రోజుల్లో)
దేవాలయప్రవేశం లేకపోవడం ఏమిటి?
గబ్బిలం పాటి చెయ్యడా అన్న జాషువా గారి ఆవేదన
గబ్బిలంగా కావ్యరూపం దాల్చింది.
🙏🙏


పాముకు పాలు అన్న పద్యంలో కవి ఆంతర్యం ఏమిటి? అన్న ప్రశ్నకు 


నా(గ)స్వ(రం) జవాబు:-

పామునకు బాలు చీమకు పంచదార
మేపుకొనుచున్న కర్మభూమిం జనించు
ప్రాక్తనంబైన ధర్మదేవతకు గూడ
నులికిపడు జబ్బుగలదు వీడున్న చోట

పవిత్రభారతదేశం కర్మభూమి. పుణ్యపాపకార్యాలకు ఆ యా ఫలితాలు వస్తాయనే విశ్వాసాలు కల ధర్మభూమి.

అందువల్లే అపకారికి కూడా ఉపకారం నెపమెన్నకుండా నేర్పరులు చెయ్యాలి, చేస్తారనే సుజనవిశ్వాసానికి కవి బద్దెన అక్షరరూప మిచ్చాడు.

ఇది దృష్టిలో పెట్టుకొనే జీవకారుణ్యభావం కల ఈ భారతదేశం,

కుట్టి బాధించేదైనా సరే, చీమకు పంచదార పెడుతుంది. 

కుడితే, ప్రాణాలకే ప్రమాదకరమైన పాముకు కూడా పాలు పోస్తుంది.

అలా చేయడం పుణ్యమని, ధర్మమని నమ్ముతుంది.

(భారతీయులు చెట్టుపుట్టలను పూజిస్తారని సూచితం. అవే కదా! చీమలకు పాములకు ఆవాసాలు.) 

(అవధూత దొంతులమ్మ శిష్యుడైన కారుమూరి కృష్ణమూర్తి అనేక అన్న సంతర్పణలు, లక్షలకొద్దీ తారకమంత్రజపాలు చేసిన భాగవతోత్తముడు. చీమలకోసం అయిదు మణుగుల పంచదారను పోసిన భూతదయాపరుడు అని "సిద్ధయోగిపుంగవుల" లో చూడవచ్చు.)

ధర్మానికి అధిదేవతను కూడా సృజించిన సంస్కృతి ఈ గడ్డ సొంతం.

అటువంటి ధర్మదేవత/సకల ధర్మశాస్త్రాలు కూడా అన్ని జీవులను కరుణతో చూడడం ధర్మమని చెప్పినపుడు మఱి సాటిమనిషిగా పుట్టిన పంచముణ్ణి మాత్రం అస్పృశ్యుడని దూరంగా పెట్టడం ఏమి ధర్మం? 

ఆతడు విషపుపురుగైన పాముకంటె అల్పప్రాణియైన చీమకంటే హీనమైనవాడా?

అని ప్రశ్నిస్తే, ఏమని జవాబివ్వాలో తెలియక ధర్మదేవతే ఉలిక్కిపడుతుంది.

ఉలికిపడు జబ్బు అనడంలో వ్యంగ్యం ఉంది.

ఆ అస్పృశ్యతను ఆరోజుల్లో కూడా కొందఱు సనాతనులు వ్యతిరేకించారు. అందువల్ల ఎటు జవాబు చెప్పాలా అని ఉలికిపాటు.

ఇది కవి ఆవేదనకు  ప్రతిరూపమైన పద్యం.

జాషువా గారు ఆనాటి సాంఘిక పరిస్థితులరథచక్రాలక్రింద మానసికంగా బాగా నలిగిపోయారు. అందుకే ఏమతాన్నీ సమర్థించలేదు. తనను తాను విశ్వనరునిగా అభివర్ణించుకొన్నారు.


మంగళం మహత్ 

13, సెప్టెంబర్ 2022, మంగళవారం

సత్త్వరజస్తమోగుణాలు

భగవానుడు, గీతలో సత్త్వరజస్తమోగుణాలను గుఱించి వివరించాడు.

గుణత్రయవిభాగయోగంనుండి మోక్షసన్న్యాసయోగం వఱకు వీటి ప్రసక్తి ఉంది.

సమస్తజీవులకు ప్రకృతి తల్లి, పరమాత్మ తండ్రి. 

వీటి సాధారణ లక్షణాలను పరిశీలిద్దాం.

సత్త్వగుణం - ఉత్తమం. మాయాసంబంధం, దైవసంబంధం, పరమేశ్వర సంబంధంగల చిత్తవృత్తిచే ప్రశాంతతను కల్గించేది.

రజోగుణం - మధ్యమం. అవిద్యాసంబంధం, మానవసంబంధం, ఐహికైశ్వర్య ఆధిక్యత అధికారాలచే రాజసం గల్గి ఉండేది.

తామసగుణం లేక తమోగుణం - అధమం‌. (చీఁకటియందుండే గుణమని అర్థం) ఆవరణశక్తిసంబంధం, అసురలక్షణం అని చెప్పబడుతుంది. దురహంభావం, ముక్కోపం, ఈర్ష్య, మూర్ఖత మున్నగు వాటి ప్రేరేపణ నుండి మనస్సు తప్పించుకోలేక పరవశమవడం. వికారం జెందిన అవస్థ.

వివరంగా తెలుసుకుందాం.

ప్రకృతినుండే ఈ గుణాలు పుట్టాయి. జీవుని బంధానికి అవే కారణాలు. ఆత్మను దేహమందు బంధిస్తున్నాయి. జీవుడు తన యధార్ధ స్వరూపమైన ఆత్మను విస్మరించి, తాను సత్త్వాదిగుణయుతుడని భావించి, తద్గుణాలతో తాదాత్మ్యం పొంది దేహసంసారాల్లో బంధితుడవుతున్నాడు.

మూడింటిలో ఏ ఒక్కగుణం ఉన్నా జీవుడు ప్రకృతి (మాయ) యందే ఉన్నాడనిఆత్మను ఇంకా చేరలేదని తెలుసుకోవాలి. కాబట్టి జీవుడు వాటినుండి విడుదల పొందటానికై అహర్నిశం ప్రయత్నపరుడు కావలసి ఉంది. అంటే గుణాతీతుడు కావాలి.

గుణాతీతస్ఠితిని పొందితేనే మోక్షప్రాప్తి.

ప్రతివారూ తమలో ఏ గుణంయొక్క లక్షణాలున్నాయో పరీక్షించుకొని, సాధనచేత క్రమంగా ఊర్ధ్వస్థితిని  ప్రయత్నించాలి.

ఉత్తమమని అనిపించే సత్త్వగుణం కూడా మాయయొక్క ఒక భాగమే.అయితే అది శుద్ధభాగంఅది నిర్మలమవడం చేత తక్కిన రెండింటి కంటె శ్రేష్టం. కానీ అదీ అడ్డే. 

దీపానికి నల్ల, ఎఱ్ఱ, తెల్ల గాజుచిమ్నీలు తొడిగితే ఎలా ఉంటుందో  గుణాలచేత ఆవృతమైన ఆత్మ కూడా అలాగే ఉంటుంది.

తెల్లటిచిమ్నీ నిర్మలంగా ఉన్నా, అది కూడా ఒక ఆవరణమే.

ఏ గుణం ఎలా బంధిస్తోంది.?

త్త్వగుణం సుఖాసక్తిచేతా, జ్ఞానాసక్తిచేతా ఆత్మను బంధిస్తోంది.నేను సుఖవంతుణ్ణి ` అనే క్షేత్రధర్మమైన  సుఖసంసక్తిచేతాప్రపంచవిషయ, లేక, పాండిత్య విషయ, వృత్తిరూపవిషయాల  జ్ఞానసంసక్తి చేత ఆత్మను బంధిస్తోంది. కాబట్టి దాన్ని కూడా వదలించుకొని కేవ లాత్మస్థితిని పొందాలి.

 

రజోగుణం దృశ్యవిషయాలమీద ప్రీతిని, తృష్ణను, సంగాన్ని (ఆసక్తిని) కల్గజేసేది. అది కర్మాసక్తి (కర్మములందలి ఆసక్తి) చేత ఆత్మను బంధిస్తోంది. లభించని వస్తువుమీద అభిలాషే తృష్ణ. లభించినదానిమీద అభిమానమే సంగం. అనేక బాహ్యాడంబర కర్మలచేతా, విషయాసక్తిచేతా, ఖ్యాతి పొందాలి అనే ప్రయత్నాలచేతాదృశ్యసంబంధాలైన వివిధ క్రియాకలాపాలచేతా రజోగుణం బంధిస్తోంది.

తమోగుణం అజ్ఞానంవలన కలిగేది. సమస్త ప్రాణులకూ మోహాన్ని ( అవివేకం) కల్గజేసేది. అది మఱపు (పరాకు), సోమరితనం, నిద్ర మొ||వానిచేత  దట్టమైన మేఘం సూర్యుని కప్పినట్లు జీవుని బంధిస్తోంది.

అయితే ఒకనికి తమోగుణం ఉందా అని ఎలా తెల్సుకోవాలి?

మత్తు, సోమరితనం, అతినిద్ర, అజాగ్రత, బద్ధకం మొ||నవి ఉన్నవాడికి తమోగుణం పూర్తిగా ఉందని గ్రహించాలి.

ఈ లక్షణాలు లౌకికవ్యాపారాల్ని కూడా పాడు చేస్తాయి కాబట్టి తమోగుణాన్ని అర్జంటుగా వదలించుకోవాలి.

 

సత్త్వగుణం - ప్రాపంచికసుఖమందు,

రజోగుణం - ప్రాపంచికకర్మయందు,

తమోగుణం - నిద్రా ప్రమత్తతలయందు జీవుని చేర్చుతున్నాయి.

 

సత్త్వగుణం (బలంగా/అధికంగా ఉంటే) రజోగుణ, తమోగుణాల్ని అణగద్రొక్కుతుంది.

అలాగే రజోగుణం సత్త్వగుణ, తమోగుణాల్ని,

తమోగుణం సత్త్వగుణ, రజోగుణాల్ని అణగద్రొక్కి ప్రవర్తిస్తాయి.

గుణం అధికంగా ఉందో ఎలా గుర్తించాలి?

శరీరమందు శ్రోత్రాది ఇంద్రియద్వారాలన్నిటియందూ ప్రకాశరూపమైన (బుద్ధివృత్తిరూపమైనజ్ఞానం కలుగుతూన్నప్పుడు, సత్త్వగుణం బాగా వృద్ధి పొంది ఉందని తెలిసికోవాలి.

 

ఒక్కో గుణం అధికంగా ఉన్నప్పుడు జీవుడు ఒనర్చే కర్మలు, దాని కనుగుణంగానే ఉంటాయి. ఆహారం, ఆలోచన, మాట్లాడే పద్ధతి, నడక, ఇలా సమస్తం ఆ గుణాల్ని అనుసరించే ఉంటుంది.

 

సత్త్వగుణజీవుని సమస్తచర్యలు సాత్త్వికంగా, ప్రకాశయుతంగా, జ్ఞానవంతంగా, ప్రశాంతంగా ఉంటాయి.

భుజించే ఆహారం సాత్త్వికం. ఉత్తమగ్రంథాల్ని చదవడం, చక్కని ఆలోచనలు చేయడం, మాట్లాడే పద్ధతి,

ఇలా సమస్తం సత్త్వమయం. బాగా పండిన పండు సత్త్వగుణం.  

 

రజోగుణం అభివృద్ధి పొందితే లోభత్వం, కార్యాలందు ప్రవృత్తి, ( కామ్య, నిషిద్ధ) కర్మల్ని ప్రారంభించటం,

మనశ్శాంతి లేకపోవడం (లేక ఇంద్రియనిగ్రహం లేకపోవడం), ఆశ, ఇవి పుడుతూంటాయి.

 

రజోగుణప్రవృత్తి కలవాడు ఏవేవో లేనిపోని కర్మల్ని, వ్యవహారాల్ని  పైనవేసికొంటూంటాడు.

తత్ఫలితంగా మనశ్శాంతి ఉండదు. తినే ఆహారం కూడా రాజసంగానే ఉంటుంది.

నడక, మాటలుకూడ రాజసమే. అతని హృదయంలో అనేక విషయాశలు తిరుగాడుతూంటాయి.

ఇంద్రియనిగ్రహం పూజ్యం.

పక్వం కాని పుల్లని మామిడికాయతో రజోగుణాన్ని పోల్చవచ్చు.

 

తమోగుణము, వివృద్ధి అవుతూంటే అవివేకం ( బుద్ధిమాంద్యం), సోమరితనం ( బద్ధకం),

ప్రమాదం అంటే అజాగ్రత (పరాకు, పొరపాటు), మోహం (అజ్ఞానం, మూఢత్వం, లేక విపరీతజ్ఞానం)-

ఇవి, కల్గుతున్నాయి.

వగరు మామిడికాయ ఈ తమోగుణం.

 

సత్త్వగుణంవల్ల  జ్ఞానం,

రజోగుణంవల్ల లోభం,

తమోగుణంవల్ల అజాగ్రత (మఱపు) భ్రమ, అజ్ఞానం కల్గుతున్నాయి.

 

శ్రద్ధావాన్ లభతే జ్ఞానం

అటువంటి శ్రద్ధ సాత్త్వికం, రాజసం, తామసం అని ౩ రకాలు.

 

సత్త్వగుణం కలవారు దేవతలను,

రజోగుణంవారు యక్షులను, రాక్షసులను,

తమోగుణంవారు భూత గణాల్ని పూజిస్తున్నారు.

 

అలాగే ఆహారం, యజ్ఞం, తపస్సు, దానం, త్యాగం, జ్ఞానం, కర్మ, కర్త, బుద్ధి, ధైర్యం, సుఖం కూడా

సాత్త్వికం, రాజసం, తామసం అని ౩ రకాలు.

 

సాత్త్విక

రాజసిక

తామస

ఆహారం

ఆయుస్సును, మనోదేహబలాల్ని, ఆరోగ్యాన్ని, సౌఖ్యాన్ని, ప్రీతిని బాగా వృద్ధి పొందించేవి, రసం, చమురు ఉన్నవి, దేహమందు చాలకాలం ఉండేవి, మనోహరాలైనవి అయిన ఆహారపదార్థాలు సత్త్వగుణం కలవారికి ఇష్టం

చేదు, పులుపు, ఉప్పు, కారం, చమురులేనివి, మిక్కిలి వేడి, మిగుల దాహం కలుగజేసేవి, (శరీరానికి) దుఃఖం, ( మనస్సుకు) వ్యాకులత్వం కలుగజేసేవి అయిన ఆహారపదార్థాలు రజోగుణం గలవారు ఇష్టంగా తింటారు. ఇలాంటి ఆహారపదార్థాలు తినేటప్పుడు అమృతంలా ఉండి తర్వాత విషంలా మారతాయి.

అతి యైన షడ్రుచులు, వండిన పిమ్మట ఒక జాము దాటినది ( లేక బాగా ఉడకనిది), సారం నశించింది, దుర్గంధం కలది, పాచిపోయినది (వండాక ఒక రాత్రి గడిచినది), ఎంగిలిచేసినది, అశుద్ధంగా ఉన్నది (భగవంతునకు నివేదింపబడనిది) అయిన ఆహారం తమోగుణం గలవారికి ఇష్టం

యజ్ఞం

ఫలాపేక్షలేకుండా శాస్త్ర సమ్మతంగా చేసే యజ్ఞం

(ఏ కార్యమైనా)

ఫలాన్ని కోరి, డంబంకొఱకు చేసే యజ్ఞం (ఏ కార్యమైనా)

విధ్యుక్తం కాకుండా, ఆలోచనారహితంగా, శ్రద్ధ బొత్తిగా లేకుండా చేసే యజ్ఞం (ఏ కార్యమైనా)

తపస్సు

ఫలాపేక్షలేకుండా, శారీరక, వాచిక, మానసికతపస్సులను నిశ్చలచిత్తంతో, అధికశ్రద్ధతో ఆచరించడం.

ఇతరులచే తాను సత్కరింపబడాలని, గౌరవింపబడాలని, పూజింపబడాలని డంబంతో మాత్రమే చేసేది,  అస్థిరమై, అనిశ్చితమైనట్టి ఫలం కల తపస్సు

మూర్ఖపుపట్టుదలతో తనను బాధించుకొంటూ గాని, లేక ఇతరుల్ని నాశనం చేయాలనే ఉద్దేశ్యంతోగాని చేసే తపస్సు

దానం

దేశకాలపాత్రాదుల్ని అనుసరిస్తూ నిశ్చయబుద్ధితో యోగ్యుడైనవానికి, మఱియు ప్రత్యుపకారం చేయ శక్తిలేనివానికి చేసే దానం

ప్రత్యుపకారానికానీ, లేక ఫలం ఉద్దేశించికానీ, మనఃక్లేశంతో ( అతికష్టంతో) విధిలేక ఇవ్వాల్సి వస్తోందే అనుకొంటూ చేసే దానం

దానానికి తగని దేశకాలాల్లో, పాత్రులు ( అర్హులు) కానివారికొఱకు, సత్కారశూన్యంగాను, అమర్యాదతోను చేసే దానం

త్యాగం

శాస్త్రనియతమైన కర్మను కర్తవ్యంగా భావించి, చేస్తూ వాటియందు అభిమానం, ఫలం విడిచిపెట్టబడిన త్యాగం

శరీరం ప్రయాసపడుతుందనే భయంతోను, దుఃఖాన్ని కల్గజేస్తుందనే భావనతోను విధ్యుక్తకర్మను విడిచిపెడ్తే అది రాజసత్యాగం

వేదశాస్త్రాలచేత విధింపబడిన కర్మను పరిత్యజించడం యుక్తం కాదు. అజ్ఞానంచేత అట్టి కర్మను ఎవడైన విడిచిపెడ్తే అది తామసత్యాగం

జ్ఞానం

విభజింపబడిఉన్న సమస్త చరాచరప్రాణుల్లోనూ పరమాత్మ విభజింపబడకుండా ఏకంగా ఉన్నట్లు ఎఱిగిన

జ్ఞానం

భేదభావంతో సమస్తప్రాణుల్నీ వేరువేరుగా భావించిన జ్ఞానం

ఏదైనా ఒక్కపనిని అదే  సమస్తమని, తగిన హేతువు లేకపోయినా దానియందే తగుల్కొని ఉండి, తత్త్వాన్ని (సత్యవస్తువును) తెల్సుకోని అల్ప జ్ఞానం

కర్మ

శాస్త్రంచేత నియమింపబడినది, ఫలాపేక్షగాని, ఆసక్తి (సంగం) అభిమానంగాని, రాగద్వేషాలు గాని లేకుండ చేయబడిన కర్మ

ఫలాపేక్షతోనూ, అహంకారముతోను  అధిక ప్రయాసకరంగా చేయబడే కర్మ

తానుచేసే కర్మకు మున్ముందు కలుగబోయే దుఃఖాదులను నాశనాన్ని, బాధను, తనసామర్థ్యాన్ని ఆలోచించక, అవివేకంతో ప్రారంభింపబడే కర్మ

కర్త

సంగాన్ని (ఆసక్తిని, ఫలాపేక్షను) విడచి, నేను కర్తను అనే అభిమానం, అహంభావం లేక, ధైర్యోత్సాహాలతో కూడి, కార్యం సిద్ధించినా, సిద్ధించకపోయినా వికారాన్ని పొందనివాడు

అనురాగం అభిమానం, లోభం,  హింసాస్వభావం, అశుచిత్వం కల్గి,  కర్మఫలాన్ని ఆశించి, కార్యం సిద్ధిస్తే సంతోషించి, చెడితే దుఃఖించేవాడు

మనోనిగ్రహం లేనివాడు, పామర స్వభావి, వినయం లేనివాడు, మోసగాడు, వంచకుడు, అలసుడు, విషాది, స్వల్పకాలంలో చేయాల్సినదాన్ని దీర్ఘకాలానికైన పూర్తిచేయనివాడు

బుద్ధి

ధర్మప్రవృత్తిని, అధర్మనివృత్తిని కార్యాకార్యాల్ని,భయాభయాల్ని, బంధమోక్షాల్ని తెలిసికొనే బుద్ధి

ధర్మాధర్మాల్ని, కార్యాకార్యాల్ని ఉన్నది ఉన్నట్లు కాక మఱొకవిధంగా పొరపాటున భావించే బుద్ది.

అవివేకంతో అధర్మాన్ని ధర్మంగా, సర్వార్థాల్ని విపరీతంగా భావించే బుద్ధి

ధైర్యం

ఏమాత్రం చలించక, మనఃప్రాణేంద్రియక్రియల్ని యోగసాధనచేత ఆత్మధ్యానంలో నిలబెట్టగలిగే ధైర్యం

ఫలాపేక్షతో ధర్మార్థకామాల్ని (మోక్షాన్ని వదిలేసి) మిక్కిలి ఆసక్తితో అనుష్ఠించే దైర్యం

నిద్రా భయ శోక విషాద మదాల్ని విడిచిపెట్టని దుర్బుద్ధి యొక్క దైర్యం

సుఖం

యత్తద గ్రే విషమివ

పరిణామే మృతోపమమ్| తత్సుఖం సాత్త్వికం ప్రోక్త మాత్మబుద్ధి ప్రసాదజమ్||

బుద్ధినిర్మలత్వం వల్ల

మొదట విషంలా ఉండి,

తర్వాత అమృతంలా ఉండేది

విషయేంద్రియనంయోగా

ద్యత్తదగ్రేఽమృతోపమమ్ |

పరిణామే విషమివ

తత్సుఖం రాజసం స్మృతమ్.

మొదట అమృతంలా ఉండి,

తర్వాత విషమయ్యే సుఖం

యద గ్రే చానుబన్ధే

సుఖం మోహనమాత్మనః |

నిద్రాలస్య ప్రమాదోత్థం తత్తామసముదాహృతమ్ ||

నిద్రాలస్య ప్రమాదోత్థమై ఆరంభంలోనూ అంతంలోనూ

కూడా మోహాన్ని కల్గజేసే సుఖం

గుణాతీతుడు

ప్రకాశం చ ప్రవృత్తిం చ

మోహమేవ పాండవ

ద్వేష్టి సంప్రవృత్తాని

నివృత్తాని కాంక్షతి

ఉదాసీనవదాసీనో

గుణా వర్తన్త ఇత్యేవ

యోఽవతిష్ఠతి నేంగతే

సమదుఃఖసుఖః స్వస్థ

స్సమలోష్టాశ్మ కాంచనః

తుల్య ప్రియా ప్రియో ధీర

స్తుల్యనిందాత్మసంస్తుతిః

మానావమానయోస్తుల్య

స్తుల్యో మిత్రారిపక్షయో:

సర్వారమ్భపరిత్యాగీ

గుణాతీతస్స ఉచ్యతే.

తనకు సంప్రాప్తాలైన సత్త్వగుణసంబంధ ప్రకాశాన్ని గాని, రజోగుణసంబంధ కార్య ప్రవృత్తినిగాని, తమోగుణసంబంధ మోహాన్ని గాని ద్వేషింపక, అవి తొలగిపోతే వానిని అపేక్షింపక, తటస్థునిలా ఉన్నవాడై గుణాలచేత చలింపక, గుణాలు ప్రవర్తిస్తున్నాయని మాత్రం తెలిసికొంటూ, ఏపరిస్థితుల్లోనైనా చలింపక నిశ్చలంగా, ఆత్మయందే స్థిరంగా ఉంటూ, మట్టిగడ్డ, ఱాయి, బంగారమందునూ, సుఖదుఃఖాల్లోనూ, ఇష్టానిష్టాల్లోనూ, మానావమానాల్లోనూ, నిందాసంస్తుతుల్లోనూ, శత్రుమిత్రులయందనూ సమభావం,  ధైర్యం, కల్గి ఉంటూ, సమస్తకార్యాలందు కర్తృత్వబుద్ధిని వదలేవాడు,  గుణాతీతుడు.

మఱి ఇటువంటి గుణాతీతస్థితిని ఎలా పొందాలి? లేదా ఈ గుణాల్ని ఎలా దాటాలి?

అచంచలమైన భక్తియోగంచేత భగవానుని ఎవడు సేవిస్తాడో వాడు ఈ గుణాలన్నీ లెస్సగా దాటి, బ్రహ్మం అవడానికి సమర్థుడవుతున్నాడు.

 

 మంగళం మహత్