10, సెప్టెంబర్ 2022, శనివారం

శివతాండవకావ్యపరిచయం

 

“మహాకవి”,”సరస్వతీపుత్ర”,”పద్మశ్రీ” పుట్టపర్తి నారాయణాచార్య, కృష్ణరాయల రాజగురువు, విజయనగరాస్థానవిద్వాంసులు అయిన తాతాచార్యుల వంశంలోనివారు. హృషీకేశ్ లో స్వామిశివానందసరస్వతి ఈయన పాండిత్యాన్ని పరీక్షించి, ”సరస్వతీపుత్ర” బిరుదు ఇచ్చారు. ఈయన ఈకావ్యాన్ని ప్రొద్దుటూరులో పనిచేస్తు

న్నప్పుడు వ్రాశారు.

 

ఈకావ్యం గుఱించి పుట్టపర్తివారి మాటల్లో...

 

          “ఇప్పటికి శివతాండవం పదిసార్లైనా ప్రింటు అయివుంటుంది. నా పుస్తకాలలో నాకు ఎక్కువ ఖ్యాతి తెచ్చింది శివతాండవమేనని చెప్పవచ్చు. అనేక సంవత్సరాలుగా, అనేక సభల్లో విన్పించడం జరిగింది. విన్పించిన చోటంతా దాన్ని గూర్చిన పొగడ్తలే తప్ప మరేమీ వినలేదు. ఇతర భాషలవారుకూడా తెనుగురానివారుకూడా దీన్ని విని ఎంతో మెచ్చుకొనేవారు. తిరువాన్కూరులో వున్నప్పుడు మళయాళపండితులు దీనిని చదివించుకొని విన్నారు. ఢిల్లీలో వున్నప్పుడుకూడా దీన్నిగూర్చిన పొగడ్తలే. ఢిల్లీలో రష్యన్ ఎంబసీవారుకూడా `శివతాండవాన్ని` చదివించుకొని విన్నారు. కావ్యంలో అనుభూతంగావచ్చే `లయ` వాళ్ళ నంతగా ఆకర్షించి వుంటుందనుకున్నాను.                                                   

          దీనిని వ్రాసేటప్పుడు-ప్రొద్దుటూరులో అగస్త్యేశ్వరస్వామికి చాలా నియమంగా ప్రదక్షిణాలు చేసేవాడిని.

రోజూ 108 ప్రదక్షిణాలు. కోవెల చాలా పెద్దది. అప్పుడు వ్రాసినదీ కావ్యం. కావ్యం చాలా చిన్నగా వుందని, కొద్దిగా పెంచుదామని ప్రయత్నించినాను. కానీ నాకు సాధ్యం కాలేదు. భగవదిచ్ఛ యింతేనేమో అనుకున్నాను.

          కావ్యంలో సంగీత, నాట్య సాహిత్య సంకేతాలు పెనవేసుకొనివున్నాయి. ఈ మూడింటియొక్క సాంప్రదాయాలు కొంతకుకొంత తెలిస్తేగానీ, కావ్యం అర్థంగాదు. దీనిఫైన చిన్న వ్యాఖ్యానం వ్రాస్తే బాగుంటుందని చాలమంది నాకు సూచించినారు. కానీ కొన్ని విషయాల్లో ఎందుకో నేను చాలా ఉదాసీనం. పని ఎప్పుడూ చేయలేదు.

         నేను సుమారు నూటికి పైగా గ్రంథాలు వ్రాసినాను. గద్యమూ, పద్యమూ రెండూ వున్నాయి. మరి యెందుకో నా పేరూ,శివతాండవ గ్రంథమూ పెనవేసుకొని పోయినవి. ఇదికూడా ఒక భగవత్చిత్రమే. గ్రంథం ఇతర భాషల్లో కూడా పరివర్తితమయింది. జర్మన్లోకి ఎవ్వరో చేసినారు. హిందీలోకి ఇద్దరు ముగ్గురు పరివర్తించినారు. నేను వానిని చూచినానుకూడా. ఇటువంటి గ్రంథాలు పరివర్తించడం చాల కష్టం. ఇటువంటి కార్యాల గౌరవం ముఖ్యంగా శబ్దంపైన ఆధారపడుతుంది. ఇంగ్లీషులోకి తెద్దామని నేనే ఎన్నోసార్లు ప్రయత్నించినాను. కానీ భాషాంతరీకరణం ఎప్పుడూ నాకు తృప్తినిచ్చింది లేదు.”

          పరమశివుని తాండవ భాగమంతయు ఉద్ధతశైలిలో నడచినది. లాస్యము లలితమైనది. అక్కడి శైలినిగూడ లలితముగనే నడపితిని. పరమశివుని తాండవమునకు ముందు నంది యొనర్చిన నాంది గలదు. అట్లే పార్వతి యొనర్చిన లాస్యమునకును తొలుత విజయ యను చెలికత్తె చేసిన ప్రార్థనమున్నది. ఇవి రెండును సంస్కృత రచనలు.

          దీనిలోని గుణదోషములకు రసికులు ప్రమాణము.

 

పుట్టపర్తి నారాయణాచార్య

నవంబరు_1985

 

ఇందులో శివతాండవం(ప్రస్తావన), నంది నాంది, శివతాండవం, విజయా ప్రార్ఠన, శివాలాస్యము అనే విభాగాలున్నాయి.

కామెంట్‌లు లేవు: