26, సెప్టెంబర్ 2022, సోమవారం

గుఱ్ఱం జాషువా రచన గబ్బిలం

గుఱ్ఱం జాషువా గారి రచన గబ్బిలంలో ఆయన తంజాపురినే ఎందుకు ఎంచుకున్నారు? 

అన్న ప్రశ్నకు నా(గ)స్వ(రం) భావన ఈ జవాబు

 

"కాళిదాసుని మేఘసందేశము మనస్సులో నుంచుకొని నే నీ కావ్యమును రచించితిని"
అని జాషువా గారే స్వయంగా చెప్పారు.

కాన ఇది సందేశకావ్యం.
గబ్బిలం ద్వారా ఒక పేదవాడు కాశీ విశ్వేశ్వరునికి సందేశం పంపడమే కావ్యవస్తువు.

మేఘునికి
రామగిరి నుండి అలకాపురి వఱకు ఏ యే ప్రాంతాలగుండా వెళ్లాలో యక్షుడు చెప్పినట్లే 

పేదవాడు గబ్బిలానికి చెప్తాడు.


కాబట్టి
దక్షిణం (తంజావూరు) నుండి
ఉత్తరం (కాశీ) వఱకు (ఒక దిక్కు నుండి మఱొక దిక్కు)
ఉన్న ప్రాంతాల్ని తనదైన శైలిలో వివరించడం కోసమనీ,

దక్షిణం వైపు ఏదో ఒక ఊరు కాకుండా సాహిత్యపోషకుడైన
రఘునాథరాయలి రాజధాని నుండి
విశ్వేశ్వరుని రాజధాని కాశీ వఱకు
కావ్యవిస్తృతి ఉండేలా చక్కగా వర్ణించడం కోసమనీ కవి తంజావూరును ఎన్నుకోవడం జరిగింది.

తర్వాత జాషువా రచించిన పద్యాలను బట్టి రఘునాథరాయలంటే ఆయనకు ఇష్టం అని చెప్పవచ్చు.

ఎటువంటి భేదభావం చూపకుండా, ముఖ్యంగా ఎక్కువ తక్కువలు చూడకుండా వివిధ కవుల్ని సమానంగా ఆదరించిన ఆ రాజు సాహితీసేవ నచ్చడం.

అందుకే

పూపవయస్సులో వలసపోయిన చక్కని తెల్గు కైతకున్
బ్రాపక మిచ్చినట్టి రఘునాధనృపాలకుఁ డేలియున్న తం
జాపురి మండలంఁబునకుఁ జక్కగ దక్షిణభాగ భూములన్
గాపురముండె నప్పరమ గర్భదరిద్రుఁడు నీతిమంతుడై

అని కవి మొదటే పేదవాని మకాంతో పాటు రఘునాథరాయలి ప్రశంస కూడా తేవడం జరిగింది.

తెల్గుకైత చక్కనిదని గ్రహించి ప్రాపకమిచ్చిన గొప్ప కావ్యకళాపోషకు డాయన.

ఇంకా కవి పేదవాని ద్వారా గబ్బిలానికి మార్గం చెప్తూ

కొమరారు దంజనగరము
సమీపమునఁ గలదు తెలుఁగు సౌరభ్యంబుల్

గమగమ వలచిన చోటది

యమరున్ రఘునాథరాజు నాస్థానంబున్


(తెలుగు కవితా సౌరభాలు "అభినవభోజరాజు" రఘునాథరాజు ఆస్థానంలో గమగమలాడుతున్నాయి.)

అప్పటికి తెలుగు ప్రాంతంలో

కృష్ణరాయలవారి యెడఁబాట్లు చీకట్లు ముసరి దిక్కులలోన మసలువేళ

(ఆంధ్రభోజుని ఎడబాటు తెలుగు కవులను క్రుంగదీసింది)

భూరి వాజ్మయలక్ష్మి దారిబత్తెముతోడఁ దంజాపురమువంకఁ దరలు వేళఁ

(ఇక్కడ ఆదరించేవారు లేక అక్కడ రఘునాథరాయలి కళాభిరుచి తెల్సుకొని తెలుగు కవులు తంజాపురి దారి పట్టారు.)

వేంకటకవి తెల్గు పంకేరుహాక్షికి శ్లేషోక్తు లలవాటు సేయువేళఁ

(రఘునాథుని ఆస్థాన ఆంధ్ర కవులలో చేమకూర వెంకట కవి అగ్రగణ్యుడు + విజయవిలాసప్రశంస)

బచ్చ పచ్చని ముద్దుపళని ముద్దుల కైత శృంగార రసము వర్షించువేళ

(తంజాపురప్రాంత మధురకవయిత్రి)

మువ్వగోపాల దేవుని పూజసేయ ఘనుఁడు క్షేత్రయ కలమందుకొనినవేళ

(రఘునాథుని ఆస్థానాన్ని దర్శించిన మధురభక్తి వాగ్గేయకారుడు)

నపరరాయలు రఘునాథ నృపతి విభుఁడు
కట్టుకొన్నాఁడు సత్కీర్తి కుట్టిమంబు

ఇలాంటి అపరరాయలైన రఘునాథుడంటే జాషువాగారికి ఇష్టమనడంలో సందేహమేముంది?

ఇంకా ఇలా చెప్తూ,

తనువుప్పొంగ సరస్వతీమహలు సందర్శించి తంజాపురీ
మనుజాధీశుల యోలగంబును పరామర్శించి పొమ్ముత్తరం
బునకున్ ద్రావిడభూములం గడచి పోబోదోచెడిన్ వాఁడువా
ఱని శౌర్యంబుసుమించుఁ దెల్గు పొలిమేరల్నేత్రపర్వంబుగన్

అనడంవల్ల తంజాపురీమనుజాధీశుల ఓలగం సందర్శించాలన్న కవి హృదయం కనబడుతుంది.

వీటన్నిటిని పర్యాలోచించినదాన్ని బట్టి కవి తంజావూరును ఎన్నుకొని ఉండవచ్చని నా(గ)స్వ(రం) భావన.

ఈకావ్యానికి ప్రేరణ:

గుడిలో గబ్బిలా లున్నప్పుడు అస్పృశ్యులకు (ఆ రోజుల్లో)
దేవాలయప్రవేశం లేకపోవడం ఏమిటి?
గబ్బిలం పాటి చెయ్యడా అన్న జాషువా గారి ఆవేదన
గబ్బిలంగా కావ్యరూపం దాల్చింది.
🙏🙏


పాముకు పాలు అన్న పద్యంలో కవి ఆంతర్యం ఏమిటి? అన్న ప్రశ్నకు 


నా(గ)స్వ(రం) జవాబు:-

పామునకు బాలు చీమకు పంచదార
మేపుకొనుచున్న కర్మభూమిం జనించు
ప్రాక్తనంబైన ధర్మదేవతకు గూడ
నులికిపడు జబ్బుగలదు వీడున్న చోట

పవిత్రభారతదేశం కర్మభూమి. పుణ్యపాపకార్యాలకు ఆ యా ఫలితాలు వస్తాయనే విశ్వాసాలు కల ధర్మభూమి.

అందువల్లే అపకారికి కూడా ఉపకారం నెపమెన్నకుండా నేర్పరులు చెయ్యాలి, చేస్తారనే సుజనవిశ్వాసానికి కవి బద్దెన అక్షరరూప మిచ్చాడు.

ఇది దృష్టిలో పెట్టుకొనే జీవకారుణ్యభావం కల ఈ భారతదేశం,

కుట్టి బాధించేదైనా సరే, చీమకు పంచదార పెడుతుంది. 

కుడితే, ప్రాణాలకే ప్రమాదకరమైన పాముకు కూడా పాలు పోస్తుంది.

అలా చేయడం పుణ్యమని, ధర్మమని నమ్ముతుంది.

(భారతీయులు చెట్టుపుట్టలను పూజిస్తారని సూచితం. అవే కదా! చీమలకు పాములకు ఆవాసాలు.) 

(అవధూత దొంతులమ్మ శిష్యుడైన కారుమూరి కృష్ణమూర్తి అనేక అన్న సంతర్పణలు, లక్షలకొద్దీ తారకమంత్రజపాలు చేసిన భాగవతోత్తముడు. చీమలకోసం అయిదు మణుగుల పంచదారను పోసిన భూతదయాపరుడు అని "సిద్ధయోగిపుంగవుల" లో చూడవచ్చు.)

ధర్మానికి అధిదేవతను కూడా సృజించిన సంస్కృతి ఈ గడ్డ సొంతం.

అటువంటి ధర్మదేవత/సకల ధర్మశాస్త్రాలు కూడా అన్ని జీవులను కరుణతో చూడడం ధర్మమని చెప్పినపుడు మఱి సాటిమనిషిగా పుట్టిన పంచముణ్ణి మాత్రం అస్పృశ్యుడని దూరంగా పెట్టడం ఏమి ధర్మం? 

ఆతడు విషపుపురుగైన పాముకంటె అల్పప్రాణియైన చీమకంటే హీనమైనవాడా?

అని ప్రశ్నిస్తే, ఏమని జవాబివ్వాలో తెలియక ధర్మదేవతే ఉలిక్కిపడుతుంది.

ఉలికిపడు జబ్బు అనడంలో వ్యంగ్యం ఉంది.

ఆ అస్పృశ్యతను ఆరోజుల్లో కూడా కొందఱు సనాతనులు వ్యతిరేకించారు. అందువల్ల ఎటు జవాబు చెప్పాలా అని ఉలికిపాటు.

ఇది కవి ఆవేదనకు  ప్రతిరూపమైన పద్యం.

జాషువా గారు ఆనాటి సాంఘిక పరిస్థితులరథచక్రాలక్రింద మానసికంగా బాగా నలిగిపోయారు. అందుకే ఏమతాన్నీ సమర్థించలేదు. తనను తాను విశ్వనరునిగా అభివర్ణించుకొన్నారు.


మంగళం మహత్ 

కామెంట్‌లు లేవు: