11, సెప్టెంబర్ 2022, ఆదివారం

శివతాండవం-2

శివతాండవకావ్యాన్ని స్థూలంగా పరిచయం చేసే ముందు

మొదట నర్తనం గుఱించి తెల్సుకొందాం

నర్తనంలో మూడు విభాగాలున్నాయి.

నృత్తం :- ఏ భావాన్ని వ్యక్తం చేయని కేవల ఆంగికచాలనం. ఇది లయాత్మకమైన శుద్ధగతి. కాళ్లు, చేతులు, శరీరం లయాత్మకంగా ఇందులో కదిలింపబడతాయి. ఇదొక దృశ్యానందం. కాని ఇందులో ఒక గాథకాని, విషయంకాని, భావంకాని మాటకాని, పాటకాని వ్యక్తం కాదు. అందువల్ల చూసేవారికి విసుగురాకుండా జాగ్రత్తగా క్రొత్తక్రొత్తపోకడలతో నర్తకుడు నిర్వహించాలి. ఒక ప్రత్యేకసంస్కారం ఉన్న ప్రేక్షకుడే ఆనందించగలడు.  

నృత్యం :- భావాభివ్యక్తి కల్గిన నర్తనరీతి. విచారాన్నో, సంతోషాన్నో, ఆశ్చర్యాన్నో తదితర ఏ రసాన్నోవ్యక్తపరచడమే దీని లక్ష్యం. నృత్తాన్ని చూచి, ఆనందించలేనివారు దీన్ని చూసి, ఆనందించగలరు. దీనికి ముఖ్యకారణం ప్రేక్షకులలో ఉత్పన్నాలయ్యే నవరసాలకు గతిమూలకమైన దృశ్యరూపాల్ని ప్రదర్శించటమే.

నాట్యం :- ఇతివృత్తప్రదర్శనావిదగ్ధత నాట్యంలో కనిపిస్తుంది. భావంతో పాటుగా ఇతివృత్తాన్ని కూడా ప్రదర్శించడంవల్ల నాట్యం పరిధి విస్తృతం. రూపకప్రయోగం. చతుర్విధాభినయాలు ఉంటాయి. ఎక్కువమంది (నాట్యాభిరుచి కలవారైనా పెద్దగా అభిరుచి లేనివారైనా) చూసి ఆనందించగలిగేది.

 

మఱి తాండవం అంటే

పరమశివుడు చేసే నాట్యానికి తాండవం అని పేరు.

పార్వతి నాట్యానికి లాస్యం అని పేరు.

నాట్యానికి ప్రథమాచార్యుడు శివుడే. తండువను మునికి శివుడు నాట్యాన్ని నేర్పగా ఆ తండువు దానిని లోకంలో ప్రవర్తింపజేయడంవల్ల అట్టి నృత్తానికి తాండవమనే పేరు వచ్చింది. శివుడు నృత్యం చేసేటపుడు అందె జారి క్రిందపడి తకిటత, ధరికిట, దధిగిణ. ఝణ ఝుంత అను పదునారు అక్షరాలుగా శబ్దించగా, అవే మృదంగ ప్రత్యయాలయ్యాయి. చిదంబరంలో చిత్సభలో శివుడు చేసిన నాట్యాన్ని తన ప్రజ్ఞా చక్షువుచే వీక్షించి, ఆ దృశ్యం అంతటిని ముత్తుస్వామి దీక్షితులు తాను కేదార రాగంలో చాపు తాళంలో రచించిన 'ఆనంద నటన ప్రకాశం చిత్సభేశం ఆశ్రయామి శివకామ వల్లీశం ' అను కీర్తనలో సాక్షాత్కరింపజేయగలిగాడు.

 

నాట్యశాస్త్రవేత్తలు భారతీయ నృత్యాన్ని రెండు విధాలుగా పేర్కొంటూ 

పురుషులు మాత్రమే చేయడానికి అనువైనది తాండవం అని,

స్త్రీలకు ఉచితమైనది లాస్యమని అంటారు.

అంగహారాలు, కరణాలు ప్రధానంగా కల్గి, ఉద్ధత ప్రయోగమైనది తాండవం అని,

సుకుమార అభినయలయమై  శృంగారపోషకమైనది లాస్యం అని సంగీత రత్నాకరం పేర్కొంటుంది.

ఆరభటీ వృత్తి సమ్మిళితమైన తాండవం వటవృక్షంలా గంభీరం, బలీయం,

ఝంఝామారుతంలా వేగవంతం.

కైశికీ సమ్మతమైన లాలిత్య శోభలతో నిండిన లాస్యం మాలతీకుంజం లాగ లలితం, మార్దవం,

నిర్వాత దీపంలా ప్రశాంతం.

తొలుతటిది శక్తికి ప్రతీకం; రెండవది ప్రేమకు లాంఛనం.

తాండవం గ్రీష్మదినపు గాడ్పు టెండ; లాస్యం స్వచ్ఛశరద్రాత్రినాటి వెన్నెల.

తాండవం నభోంతరాళాన ధ్వనించే ఉరుము.

లాస్యం వేణువున ధ్వనించే మోహనరాగం.

ఉత్తరకు బృహన్నల నేర్పినది లాస్యమని తిక్కన పేర్కొన్నాడు.

సుప్రసిద్ధ కళావిమర్శకుడు శ్రీ అనందకుమారస్వామి 1914లో శివతాండవం అనే పేరుతో ఆంగ్లంలో 

ఒక వ్యాస సంపుటి ప్రచురించాడు. అందొక వ్యాస ఖండంలో తాండవతత్త్వం వర్ణించబడింది.

 

పుట్టపర్తివారి కావ్యంలో

శివతాండవం(ప్రస్తావన), నంది నాంది, శివతాండవం, విజయా ప్రార్ఠన, శివాలాస్యము అనే విభాగాలున్నాయి.

 

“ఏమానందము

భూమీతలమున!

శివతాండవమట!

శివలాస్యంబట!

 

అలలై, బంగరు

కలలై , పగడపుఁ

బులుగులవలె

బ్బులు విరిసినయవి

శివతాండవమట!

శివలాస్యంబట!

 

వచ్చిరొయేమొ! వి

యచ్చర కాంతలు

జలదాంగనలై

విలోకించుటకు

శివతాండవమట!

శివలాస్యంబట!

 

అని మొదలవుతుంది.

ఈ ప్రస్తావన మొత్తం 127 పాదాల గేయం.

తర్వాత నంది నాంది పేరుతో

18 శ్లోకపద్యాలున్నాయి.

తర్వాత శివతాండవం మొదలవుతుంది.

ఇలా...

“తలపైని చదలేటి యలలు దాండవమాడ

నలలత్రోపుడుల క్రొన్నెల పూవు గదలాడఁ

మొనసి ఫాలముపైన ముంగురులు చెఱలాడ

కనుబొమ్మలో మధుర గమనములు నడయాడ

కనుపాపలో గౌరి కసినవ్వు బింబింప  

కనుచూపులను తరుణకౌతుకము చుంబింప

కడఁగి మూడవకంటఁ గటికనిప్పులు రాల

కడుఁబేర్చి పెదవిపైఁ గటికనవ్వులు వ్రేల

ధిమిధిమిధ్వని సరిద్గిరిగర్భములు తూగ

అమిత సంరంభ హాహాకారములు రేగ

 

ఆడెనమ్మా! శివుఁడు

పాడెనమ్మా! భవుఁడు”

 

మీరు ఇది చదవగానే దీనిపై ప్రేమలో పడిపోతారు.

ఇలా 60 STANZAS ఉన్నాయి.

 

తర్వాత 6 శ్లోకాల్లో విజయా ప్రార్థన ఉంది.

తర్వాత శివాలాస్యము ఉంది.

 

దీంతో కావ్యం సంపూర్ణం.

 

శివతాండవంలో 10,11,12, 13 స్టాంజాలు 9వ తరగతికి పాఠ్యాంశంగా పెట్టారు.

ఇందులో సత్త్వరజస్తమోగుణప్రశంస ఉంది.

దీనిగుఱించి తర్వాత వివరిస్తాను.

శివతాండవాన్ని పుట్టపర్తివారి గళంలోనే వినండి.

https://www.youtube.com/watch?v=8QhvtlqFOTY

 

మంగళం మహత్

 

 

కామెంట్‌లు లేవు: