6, అక్టోబర్ 2022, గురువారం

రఘుమహారాజు ఔదార్యం-కౌత్సుని ఉపాఖ్యానం

  

ఈ మధ్య whatsapp లో విజయదశమిని పురస్కరించుకొని,

జమ్మిచెట్టు గొప్పతనాన్ని చెప్తూ, జమ్మిచెట్లున్న తావున రఘువుకు భయపడి కుబేరుడు బంగారం కురిపించాడని ఒక వార్త చక్కర్లు కొట్టింది.

 

ఈ కథ

జమ్మిచెట్లున్న తావున కుబేరుడు బంగారం కురిపించడమనే కథ ఎందులోది? అని అడిగితే

రఘువంశంలో వరతంతుడు, కౌత్సకుడు కథ లోది అన్నారు.

 

మఱి రఘువంశంలో ఏముందో తెల్సుకొందాం.

అద్భుతమైనది ఈ ఉపాఖ్యానం.

 

త మధ్వరే విశ్వజితి క్షితీశం

నిశ్శేష విశ్రాణిత కోశజాతమ్,

ఉపాత్తవిద్యో గురుదక్షిణార్థీ

కౌత్సః ప్రపేదే వరతన్తుశిష్యః.

 

ఉన్న ధనమంతా ఆ విశ్వజిద్యాగంలో దానం చేసి రిక్తుఁడై ఉన్న ఆ రఘుమహారాజుదగ్గరకు

వరతంతుముని శిష్యుఁడు కౌత్సుఁడనేవాడు గురువుకోసం దక్షిణ యాచించడానికై వచ్చాడు.

 

సమృణ్మ యే వీతహిరణ్మయత్వాత్

పాత్రే నిధా యార్ఘ్య మనర్ఘశీలః,

శ్రుతప్రకాశం యశసా ప్రకాశః

ప్రత్యుజ్జగా మాతిథి మాతిథేయః.

 

అప్పుడు ఆ రఘుమహారాజు బంగారుపాత్రములన్నీ దానం చేసేసినందున

మృణ్మయ(మట్టి)పాత్రంలో పూజాద్రవ్యాలుంచుకొని, ఆ కౌత్సునికి ఎదురుగా వెళ్లాడు.

 

త మర్చయిత్వా విధివ ద్విధిజ్ఞ

స్తపోధనం మానధనా గ్రయాయీ,

విశాంపతి ర్విష్టరభాజ మారాత్

కృతాంజలిః కృత్యవి ది త్యువాచ.

 

ఆ రఘుమహారాజు, ఆ కౌత్సమునిని పీఁటపై కూర్చుండఁబెట్టి శాస్త్రోక్తంగా పూజించి,

చెంతను చేతులు జోడించుకొని, ఇలా అన్నాడు.

 

అపి ప్రసన్నేన మహర్షిణా త్వం

సమ్య గ్వినీ యానుమతో గృహాయ,

కాలో హ్యయం సంక్రమితం ద్వితీయం

సర్వోపకారక్షమ మాశ్రమం తే.

 

“నీకు వరతంతుమహాముని, సకలవిద్యలను చక్కఁ గా నేర్పి గృహస్థాశ్రమస్వీకారానికి అనుమతి ఇచ్చెనా?

ఎందుకు అడుగుతున్నానంటే, మిగతా ఆశ్రమాలకు ఉపకారక మైన గృహస్థాశ్రమంలో ప్రవేశించటానికి

నీకిది తగిన కాలం గదా!

         

త వార్హతో నాభిగమేన తృప్తం

మనో నియోగ క్రియ యోత్సుకం మే,

అప్యాజ్ఞయా శాసితు రాత్మనా వా

ప్రాప్తోఽసి సంభావయితుం వనాన్మామ్.

 

నీవు వచ్చినంత మాత్రాన నాకు తృప్తి లేదు. నీవు గురునాజ్ఞచే వచ్చావా? లేక, స్వకార్యార్థివై వచ్చావా?

నీవు వచ్చిన కార్యాన్ని నెఱవేర్చి కృతార్థుఁడను కాఁగోరుతున్నాను.”

 

త్యర్ఘ్యపాత్రానుమితవ్యయస్య

రఘో రుదారా మపి గాం నిశమ్య,

స్వార్థోపపత్తింప్రతి దుర్బలాశ

స్త మి త్యవోచ ద్వరతన్తుశిష్యః.

 

’నీ ఆజ్ఞను నెఱవేర్చడానికి కుతూహలపడుతున్నాను  అని ఔదార్యపూర్వకంగానే రఘుమహారాజు అన్నప్పటికీ, తనకు అర్ఘ్యమిచ్చిన మట్టిపాత్రంవల్ల రాజు సర్వస్వత్యాగంచేత రిక్తుఁడై ఉన్నాఁడని ఊహించి,

తనకార్యం నెఱవేఱుతుందనే ఆశ ఉడిగి, కౌత్సముని రాజుతో ఇలా అన్నాడు.  

 

భక్తిః ప్రతీక్ష్యేషు కులోచితా తే

పూర్వా న్మహాభాగ తయాఽతిశేషే,

వ్యతీతకాల స్త్వహ మభ్యుపేత

స్త్వా మర్థిభావా దితి మే విషాదః.

 

“ఓ మహాభాగా!, పూజ్యులయెడ నీ భక్తి మీ పూర్వులను మించి ఉంది.

కాని, నేను సమయం మించిపోయాక నిన్ను యాచించడానికి వచ్చానని చింతిస్తున్నాను.

 

త దన్యత స్తావ దనన్య కార్యో

గుర్వర్థ మాహర్తు మహం యతిష్యే,

స్వ స్త్యస్తు తే; నిర్గళితామ్బుగర్భం

శరద్ఘనం నార్దతి చాతకోఽపి.

 

కాన గురుధనం ఆర్జించడం కంటె  వేఱే ప్రయోజనం లేని నేను మఱొక దాతను యాచిస్తాను. నీకు మేలగునుగాక!. నీరు పూర్తిగా కురిసి, వట్టిగా ఉన్న శరత్కాల మేఘాన్ని చాతకం సైతం యాచింపదు గదా!”

 

ఏతావ దుక్త్వా ప్రతియాతు కామం

శిష్యం మహర్షే ర్నృపతి ర్నిషిధ్య,

కిం వస్తు విద్వన్ గురవే ప్రదేయం

త్వయా కియ ద్వేతి త మన్వయుఙ్త్క.

 

ఇంతమాత్రం చెప్పి వెళ్లిపోతున్న ఆ కౌత్సమునిని రఘుమహారాజు ఆఁపి,

ఓ విద్వాంసుఁడా!, నీవు గురువునకు ఈవలసిన ద్రవ్యం ఏమిటి? అది ఏపాటి? అని అడిగాడు.

 

తతో యథావ ద్విహితాధ్వరాయ

తస్మై స్మయావేశ వివర్జితాయ,

వర్ణాశ్రమాణాం గురవే స వర్ణీ

విచక్షణః ప్రస్తుత మాచచక్షే.

 

అప్పుడు వర్ణాశ్రమధర్మపరిపాలకుడైన ఆ రఘుమహారాజుతో బ్రహ్మచారైన ఆ కౌత్సముని ఇలా అన్నాడు.

 

సమాప్తవిద్యేన మయా మహర్షి

ర్విజ్ఞాపితోఽభూ ద్గురుదక్షిణాయై,

సమే చిరా యాస్ఖలితోపచారాం

తాం భక్తి మే వాగణయత్ పురస్తాత్.

 

“విద్యాబ్యాసం సమాప్తమయ్యాక, నేను ఆయనను నావలన ఏదైనా గురుదక్షిణ స్వీకరించమని వేఁడుకొన్నాను. ఆయన, చిరకాలం నేను చేసిన అస్ఖలితోపచారాలే గురుదక్షిణ అనీ, వేఱు గురుదక్షిణ ఈ నక్కఱలేదనీ చెప్పాడు.

 

నిర్బంధసంజాతరుషార్థ కార్శ్య

మచిన్తయిత్వా గురుణాహఽ ముక్తః,

విత్తస్య విద్యాపరిసంఖ్యయా మే

కోటీ శ్చతస్రో దశ చాహ రేతి.

 

నేను తనమాటను వినక బలవంత పెట్టఁగా, గురువు కోపగించి నాకు ధనంలేదని ఆలోచించక,

తాను నేర్పిన విద్యల లెక్కకు సరిగా పదునాలుగుకోట్లధనాన్ని తనకు తెచ్చి ఈవలసినదని ఆజ్ఞాపించాడు.

 

(గురువు కోపించకుండా విద్యార్థి ప్రవర్తించాలి. లేకపోతే ఎవరూ తీర్చలేని చిక్కుల్లో పడాల్సివస్తుంది.

కౌత్సుని అదృష్టం వల్ల రఘువు లభించాడు. లేకపోతే!!?)

 

సోఽహం సపర్యావిధిభాజనేన

మత్వా భవన్తం ప్రభుశబ్ద శేషమ్,

అభ్యుత్సహే సంప్రతినోపరోద్ధు

మల్పేతరత్వాచ్ఛ్రుతనిష్క్రయస్య.

 

అలా వచ్చిన నేను, నీవు అర్ఘ్యమిచ్చిన మట్టిపాత్రంచేతనే నీ విపుడు పేరుకు మాత్రం ప్రభువని తెలిసికొన్నాను. విద్యామూల్యం (గురుదక్షిణ) చాల గొప్ప మొత్తం కావడం వల్ల ఇపుడు నిన్ను ఇబ్బంది పెట్టదలచుకోలేదు.”

 

ఇత్థం ద్విజేన ద్విజరాజకాంతి

రావేదితో వేదవిదాం వరేణ,

ఏనోనివృత్తేంద్రియవృత్తి రేవం

జగాద భూయో జగదేకనాథః.

 

ఈ ప్రకారం వేదవిదుడైన ఆ కౌత్సముని నివేదించగా, జగదేకనాథుడైన రఘుమహారాజు ఇంకా ఇలా అన్నాడు.

 

గుర్వర్థ మర్థీ శ్రుతపారదృశ్వా

రఘోః సకాశా దనవాప్య శామం,

గతో వదాన్యాంతర మి త్యయం మే

మాభూ త్పరీవాదనవావతారః.

 

“సకలశాస్త్రపారగుఁడు, గురువుకోసం దక్షిణ యాచించడానికి వచ్చినవాఁడు, రఘువువలన తన కోరిక తీరక,

వేఱొక దాతకడకు పోయాడనే ఇంతకుముం దెన్నఁడూ లేని పరీవాదం (నింద) నాకు కలుగకుండుఁగాక!.

 

సత్వం ప్రశస్తే మహితే మదీయే

వసం శ్చతుర్థోఽగ్ని రి వాగ్న్యగారే,

ద్విత్రా ణ్యహా న్యర్హసి సోఢు మర్హ

యావ ద్యతే సాధయితుం త్వదర్థమ్.

 

పూజ్యుడా! నీవు, పూజితం, ప్రశస్తం అయిన నా త్రేతాగ్ని(గార్హపత్య, ఆహవనీయ, దక్షిణాగ్నులు)శాలలో

నాలుగవ అగ్నిగా వసిస్తూ, రెండు మూఁడు దినాలు ఓర్చుకొని ఉండు.

ఈ లోపు నీ ప్రయోజనాన్ని సాధించడానికి ప్రయత్నిస్తాను.

 

త థేతి త స్యావితథం ప్రతీతః

ప్రత్యగ్రహీత్ సంగర మగ్రజన్మా,

గా మాత్తసారాం రఘు ర ప్యవేక్ష్య

నిష్క్రష్టు మర్థం చకమే కుబేరాత్.

 

రఘుమహారాజుయొక్క వమ్ముగాని ఆ ప్రతిజ్ఞకు ఆ బ్రాహ్మణుఁడు సరే అని ఒప్పుకొన్నాడు.

భూమిలో ఉన్న ధనాన్నంతా తాను అప్పటికే గ్రహించి ఉన్నందున, రఘువు, కుబేరునినుండి తెద్దామనుకొన్నాడు.

 

అ థాధిశిశ్యే ప్రయతః ప్రదోషే

రథం రఘుః కల్పిత మస్త్రగర్భం,

సామ స్తసంభావన యైవ ధీరః

కైలాసనాథం తరసా జిగీషుః.

 

తర్వాత రఘుమహారాజు కుబేరుని ఒక సామంతునిగా భావించి, బలంచేత జయింపఁగోరి, మునిమాపున (శుభకరమైన గోధూళిలగ్నంలో) అస్త్రాలతో సన్నద్ధమైన రథంలో,  శయనించాడు.

 

(యుద్ధానికి రథం సిద్ధం చేయించి, అందులోనే పండుకొన్నాడు.)

 

ప్రాతః ప్రయాణాభిముఖాయ తస్మై

సవిస్మయాః కోశగృహే నియుక్తాః,

హిరణ్మయీం కోశగృహస్య మధ్యే

వృష్టిం శశంసుః పతీతాం నభ స్తః.

 

వేకువను ప్రయాణానికి సిద్ధపడుతున్న రఘుమహారాజు దగ్గఱకు విస్మయంతో కోశగృహనియుక్తులు వచ్చి, ధనగృహం మధ్యలో ఆకాశంనుండి బంగారు వాన కురిసిందని ఆయనతో చెప్పారు.

 

(రఘువుయొక్క కోశగృహస్య మధ్యే = కోశాగారం మధ్యలో బంగారు వాన కురిసిందని కాళిదాసు వ్రాశాడు.

మఱి జమ్మిచెట్ల తావులో కురిసిందని google అంటోంది.)

 

తం భూపతి ర్భాసుర హేమరాశిం

లబ్ధం కుబేరా దభియాస్యమానాత్,

దిదేశ కౌత్సాయ సమస్త మేవ

శృఙ్గం సుమేరో రివ వజ్రభిన్నమ్. 

 

తాను యుద్ధానికి పోదలచిన కుబేరునివలన ఈయబడిన,

వజ్రాయుధపు వ్రేటుకు చీలి కూలిన మహామేరుశృంగమో అన్నట్టున్న,

ప్రకాశిస్తున్న, ఆ హేమరాశిసమస్తాన్ని, రఘుమహారాజు, కౌత్సమునికి ఇచ్చివేశాడు.

(అడిగినదానికంటె ఎక్కువ)

 

జనస్య సాకేతనివాసిన స్తౌ

ద్వా వ ప్యభూతా మభినన్ద్య సత్త్వౌ,

గురుప్రదేయాధిక నిస్స్పృహోర్థీ

నృపోఽర్థి కామా దధిక ప్రద శ్చ.

 

గురువునకు ఈవలసిన దానికంటె ఎక్కువ తీసుకోననే కౌత్సమునియొక్క,

అర్థి అడిగిన దానికంటె ఎక్కువ ఇస్తాననే ఆ రఘుమహారాజుయొక్క సత్త్వానికి (వ్యవసాయానికి) సాకేతపురవాసులైన జనులు అభినందించారు.

(పదునాలుగుకోట్లకంటె ఎక్కువ వలదని కౌత్సుఁడు,

నీకోసం అని అనుకొన్నది కాబట్టి మొత్తం నీకే అని రఘువు వాదించుకొన్నారు.)

 

అ థోష్ట్ర వామీ శతవాహితార్థం

ప్రజేశ్వరం ప్రీతమనా మహర్షిః,

స్పృశన్ కరే ణానతపూర్వకాయం

సంప్రస్థితో వాచ మువాచ కౌత్సః.

 

సంప్రీతితో తరలినవాడై, ఆ కౌత్సమహర్షి, వందల లొట్టియలమీఁద, గుఱ్ఱాలమీఁద ఆ ధనాన్ని ఎక్కించి,

భక్తి చేత వంగి, నిలిచి ఉన్న రఘుమహారాజును చేతితో తడవుతూ ఇలా అన్నాడు.

 

ఆశాస్య మన్యత్ పునరుక్తభూతం

శ్రేయాంసి సర్వా ణ్యధిజగ్ముష స్తే,

పుత్త్రం లభ స్వాత్మగుణానురూపం

భవన్త మీడ్యం భవతః పి తేవ.

 

“సర్వశ్రేయస్సుల్నీ పొంది (కరితురగరాజ్యాదిమంగళాలన్నీ) ఉన్న నీకు

మళ్లీ అవే కలగాలని ఆశీర్వదించడం చెప్పినమాటనే చెప్పడంలా నిష్ప్రయోజనం.

మఱేమంటే నీయొక్క తండ్రిలా (సుగుణాలు కల నిన్ను నీ తండ్రి పడసినట్లు)

నీ గుణాలకు తగినట్టి పుత్త్రుని పొందు.”

 

ఇత్థం ప్రయు జ్యాశిష మగ్రజన్మా

రాజ్ఞే ప్రతీయాయ గురోః సకాశమ్;

రాజాఽపి లేభే సుత మాశు తస్మా

దాలోక మర్కా దివ జీవలోకః.

 

ఈ ప్రకారం రఘువును ఆశీర్వదించి, కౌత్సముని తనగురువుదగ్గఱకు వెళ్లిపోయాడు.

రఘుమహీపతి కూడా సూర్యునివలన ప్రాణికోటి వెలుతురుఁ బొందినట్లు

ఆ ఆశీర్వాదంవలన శీఘ్రంగా పుత్రుని (కుమారకల్పుఁడైన కుమారుని అజుని) పొందాడు.

 

ఈ ఉపాఖ్యానం వల్ల మూడు ప్రయోజనాలు సిద్ధించబడుతున్నాయి.

1 రఘుమహారాజు ఔదార్యం తెల్పడం.

2 కుబేరుఁడే భయపడి కనకవర్షం కురిపించడం వల్ల రఘువు పరాక్రమప్రశస్తిని వెల్లడిచేయడం.

3 పెద్దల ఆశీర్వాదం ఉంటేనే కాని సంతానం కలుగదనే లోకధర్మాన్ని వెల్లడింఛడం.

రఘువుతండ్రి దిలీపుఁడు కూడా గోసేవావ్రతాన్ని చేసి, నందిని ఆశీర్వాదం పొంది, రఘువును కన్నాడు.

అలాగే కౌత్సుని సంతోషింపచేసి, ఆయన ఆశీస్సులతో రఘువు అజుని కన్నాడు.

 

ఇంత ప్రసిద్ధిగలవాడు కాబట్టే వారి వంశానికి రఘువంశం అనే పేరు, ఆ పేరుతో ఒక కావ్యం ఉద్భవించాయి.

 

 

మంగళం మహత్

 

 

కామెంట్‌లు లేవు: