29, ఆగస్టు 2022, సోమవారం

దేశభాషలందుఁ దెలుఁగు లెస్స

 

ఆంధ్రవిష్ణువు, కృష్ణరాయలకు స్వప్నంలో సాక్షాత్కరించి, ఆముక్తమాల్యద, చూడికుడుత్తనాంచారు (గోదాదేవి) వివాహాన్ని కావ్యంగా తెలుఁగులో వ్రాయమనే సందర్భంలో  ఇలా అన్నాడు.

 

ఆ.వె. తెలుఁగ దేల యన్న*? దేశంబు దెలుఁ గేను

దెలుఁగు వల్లభుండఁ, దెలుఁగొ కండ

యెల్ల నృపులు గొలువ నెఱుఁగవే బాసాడి,

దేశభాషలందుఁ దెలుఁగు లెస్స (ఆముక్త 1-15)    


*నన్న (పాఠాంతరం)

 

తెలుఁగు అది ఏల అన్నన్ = తెలుఁగు అది ఎందుకు అంటే (తెలుగులోనే కృతి చేయమని ఎందుకంటున్నానంటే)

దేశంబు తెలుఁగు = (మాతృ) దేశం తెలుఁగు/ ఇది తెలుఁగుదేశం

ఏను =నేను

తెలుఁగు వల్లభుండన్ = ఆంధ్రపతిని/తెలుఁగురాజును/తెనుఁగువల్లభరాయనామం కలవాడను

తెలుఁగొ = ఇక తెలుఁగు భాష అన్ననో (అంటావా)?

కండ = కండ కల (పుష్టిగల సమర్థవంతమైన) (లేదా)

         పుల/కలకండ (లాగ తియ్యగా ఉండే) భాష,

ఎల్ల నృపులు కొలువన్ = సకల రాజన్యులు సేవిస్తూండగా (భువనవిజయంలో)

బాస ఆడి = సంభాషించి (బాస అంటే దేశభాష)

దేశభాషలందు = సంస్కృతేతర దేశ్యభాషలలో (అంటే ఔత్తరాహ, దాక్షిణాత్యరాష్ట్రభాషల్లో)

తెలుఁగు లెస్స = తెలుఁగు ఉత్కృష్టం (గొప్పది)(అని)

ఎఱుఁగవే = ఎఱుఁగుదువు కదా! (కాక్వర్థంవల్ల సకలదేశభాషల్ని ఎఱుఁగుదు వనుట)

 

(కృష్ణదేవరాయల ఆస్థానంలో దేశభాషాకవులందఱూ ఉండేవారు. వారందఱి భాషలు విన్నాడు) 

కనుకనే దేశభాషలందుఁ దెలుఁగు లెస్స అని తెలిసి ఉండాలి. అని ఆంధ్రమహావిష్ణువు అన్నాడు.

కృష్ణరాయల మనోభావమూ ఇదేయై ఉండనోపు.

 

 

“కన్నడ రాయఁడ వైన నిన్ను కన్నడం కాని మఱే భాషలో కాని చెప్పుమనక

తెనుఁగులోనే  చెప్పమనడానికి కారణాలున్నాయి

ఒకటి - ఇది తెలుఁగు దేశం

రెండు - నేను తెలుఁగుదేశాన్ని అభిమానించిన వల్లభ రాయఁడను

మూడు – తెలుఁగు బాస పులకండం కదా! నానాభాషలాడు రాజులు నిన్ను కొలిచేటప్పుడు వారితో ఆయా బాస లాడి దేశభాష  లన్నిటిలో తెలుఁగుయొక్క  ఆ ఉత్కర్షను నీవు కనిపట్టి ఉండలేదా!” అని వేదంవారి వ్యాఖ్య.

ఇంకా ఆయన

“కృష్ణరాయలు, తెనుఁగును రాజులతో "ఆడి" నేర్చెనే కాని "చదివి" నేర్చినవాడు కాదు. తెనుఁగు అతని ఇంటిభాష గాదు” అన్నారు. 

వారి దృష్టిలో  కృష్ణరాయలు కన్నడరాజు అని తెలుస్తుంది.

కానీ కృష్ణరాయల మాతృభాష తుళు అని చాలమంది అభిప్రాయం. 

తెలుఁగొ కండ అన్న వాక్యాన్ని కొందరు (వావిళ్ల రామస్వామిశాస్త్రి)

తెలుఁగు ఒకండ = తెలుఁగు ఒక్కటే అని విడదీశారు.

వేదం వారి వ్యాఖ్యను బట్టి ఇది కూడా చెప్పుకోవచ్చు.

తెలుఁగు ఒక్కటే నీవు బాసాడి (అలవోకగా) ఎఱిఁగిన బాష. మిగిలినవి అభ్యసించి నేర్చుకొన్నావు. అనీ చెప్పవచ్చు.

 

`దేశం తెలుగుదేశం; నేను తెలుగు వల్లభుణ్ణి: తెలుగు కలకండలాగా తియ్యగా ఉంటుంది. దేశదేశాల రాజులు కొలుచుకుంటూ ఉంటే వివిధ భాషలు మాట్లాడే నీకు దేశభాషలందు తెలుగు లెస్స అని తెలియదా!”

అని  ఆరుద్ర తాత్పర్యం.

 

వేదం వారు కండకు కలకండ అన్న అర్థం వ్రాశారు. 

అచార్య తుమ్మపూడి కోటేశ్వరరావు కండకు కండ కల (పుష్టిగల సమర్థవంతమైన) అన్న అర్థం చెప్పారు.

 

అందువల్ల నన్నెచోడుఁడు, జానుతెనుఁగు అన్నట్లు

కృష్ణరాయలు తెలుఁగును “కండతెలుఁగు” అని 

ఆంధ్రమహావిష్ణువు ద్వారా అనిపించాడని భావించవచ్చు.

 

మంగళం మహత్

కామెంట్‌లు లేవు: