27, ఫిబ్రవరి 2023, సోమవారం

చందమామ రావో! జాబిల్లి రావో!

 క్షీరసాగరమథనంలో జగన్మాత లక్ష్మి ప్రభవించాక చంద్రుడు పుట్టాడు. అంటే లక్ష్మికి తమ్ముడు. ఆ వరుసలో మాత తమ్ముడు చంద్రుడు లోకానికి మామ అయ్యాడు. ఆ మామను చూపి, తెలుగుతల్లులు తమ బిడ్డలకు గోరుముద్దలు తినిపించడం అందఱెఱిగినదే.


అలాగే అన్నమయ్య కూడా వ్రేపల్లె వెళ్లాడు. తల్లి యశోదలా మారి, బాలకృష్ణునికి వెన్నపాలు తెమ్మని చందమామకు చేస్తున్న విన్నపాలివి.


'చందమామ రావో... జాబిల్లి రావో

మంచి కుందనపు పైడికోర వెన్నపాలు తేవో'


ఓ చందమామా! ఓ జాబిల్లీ! రావో

(పదాంతమందు గల 'ఓ' ప్రార్థనను తెల్పుతుంది. అంటే ప్రార్థనాపూర్వకంగా రమ్మనడం)

మంచి మేలిమి బంగారు గిన్నెలో వెన్నపాలు తేవో!


ఇంతవఱకు యశోదలా వెన్నపాలు కోరాక ఎటువంటివానికి తేవాలో చెప్పే తాదాత్మ్యంలో మళ్లీ అన్నమయ్యలా మారిపోయి ఎన్నో విశేణాలతో ఇలా వర్ణిస్తున్నాడు స్వామిని.


*"నగుమోము చక్కనయ్యకు నలువ పుట్టించిన తండ్రికి 

నిగమములందుండే అప్పకు మా నీలవర్ణునికి 

జగమెల్ల ఏలిన స్వామికి చక్కని ఇందిర మగనికి 

ముగురికి మొదలైన ఘనునికి మా ముద్దుల మురారి బాలునికి"*


నవ్వులు కురిపించే మోము గల చక్కని అయ్యకు, 

బ్రహ్మను కన్న జగత్పితకు

వేదాలలో ఉండే తండ్రికి,

నీలమేఘంవంటి వర్ణం కల మావానికి, 

జగాన్ని పరిపాలించే స్వామికి, 

చక్కనైన లచ్చి మగనికి,

ముగురయ్యలకు (త్రిమూర్తులు) మూలమైన గొప్పవానికి


(ఇది సామాన్యార్థం.

ముగురిలో ఈయన ఎలా మొదలవుతాడని ఆలోచిస్తూంటే ఒక అర్థం స్ఫురించింది. నారాయణుడు స్వయంగా ఆవిర్భవించాక నలువను పుట్టించాడు కదా! '

ఆత్మావై పుత్రనామాసి' 

కొడుకంటే తనే కదా! 

అపుడు జీవుల పుట్టుక పోషణకు 

ఈయన మొదలు. 

(మఱి చివర ఎవరు? అంటే లయకారుడు.)

ఇంకో అర్థం తనకు విష్ణువే మొదలు. అన్నిటా అంతటా ఒకటే ఇరవైన వెన్నుని నామమే వేదం అన్నమయ్యకు. )

ముర (అనే రాక్షసుని) కూల్చిన మా ముద్దుల బాలునికి,

మంచి మేలిమి బంగారు గిన్నెలో వెన్నపాలు తేవలసింది.


*"తెలిదమ్మి కన్నులమేటికి మంచి తియ్యని మాటలగుమ్మకు 

కలికిచేతల కోడెకు మా కతలకారి ఈ బిడ్డకు 

కులముద్ధరించిన పట్టెకు మంచి గుణములు కలిగిన కోడెకు

నిలువెల్ల నిండ వొయ్యారికి నవనిధుల చూపులచూసే సుగుణునకు"*


తెల్లతామరపూల లాంటి కళ్ళతో మేటియైనవానికి, 

(పుండరీకాక్షుడు, పుండరీకవరదుడు)

గుమ్మలా అంటే పాలు పితికితే వచ్చే ధారలా తియ్యగా మాట్లాడే వానికి,

(గోపికామానసచోరుడు)

మనోజ్ఞమైన చేతలు కలిగిన కోడె (కోడెప్రాయపువయసుగల) వానికి, 

(రాసలీలలు)

(మంచి) మాటకారియైన మా ఈ బిడ్డడికి,

(రాయబారాలు)

వంశాన్నుద్ధరించిన పట్టికి, 

మంచిగుణాలు కలిగిన చిన్నవానికి,

నిలువెల్ల విలాసం, అందం, సొగసు నిండిపోయినవానికి,

(మోహిన్యవతారం)

నవనిధులచూపులు చూసే సుగుణరాశికి,

(ఆయన ఒక్క చూపుతోనే వలసినవానికి నవనిధులు సంప్రాప్తిస్తాయి - కుచేలోపాఖ్యానం)

మంచి మేలిమి బంగారు గిన్నెలో వెన్నపాలు తేవలసింది.


(అన్నమయ్య కీర్తనల్లో అవసరం మేరకు మానసికంగా ఆయా ప్రాంతాల్ని, అక్కడి దేవతామూర్తులను సందర్శించాక తిరిగి వేంకటనాథుని ఒద్దకు తిరుమలకు వచ్చేస్తాడు. ఇక్కడ కూడా అలాగే వచ్చి, కృష్ణుడేగా వేంకటనాథుడు అంటూ ముక్తాయింపు పల్కుతూ...)


*"సురలగాచిన దేవరకు చుంచు గరుడునెక్కిన గబ్బికి 

నెఱవాది బుద్ధుల పెద్దకు మా నీటు చేతలపట్టికి 

విరుల వింటివాని అయ్యకు వేవేలు రూపుల స్వామికి 

సిరి మించు నెరవాది జాణకు మా శ్రీవేంకటనాథునికి..."*      


దేవతలను రక్షించిన దేవరకు,

వయస్సులో ఉన్న గరుడునిపై ఎక్కిన దిట్టకు

సమర్థమైన బుద్ధులు కల శ్రేష్ఠునికి,

మురిపెమైన (శృంగార)చేతలు కల్గిన 

మా పట్టికి, 

పూలవిల్లు కల్గిన మరుని యొక్క నాన్నకు,

వేవేలరూపాలు కలిగిన స్వామికి,

(అనేకావతారాలు)

మించిన లక్ష్మీకళలతో సమర్థుడైన జాణకు,

మా తిరుమలశ్రీవేంకటనాథునికి,

మంచి మేలిమి బంగారు గిన్నెలో వెన్నపాలు తేవలసింది.


ఇలా కీర్తిస్తూ కృష్ణునికి ఎన్నో నీటైన విశేణాలను కుప్పపోశాడు. కృష్ణగుణాలనే తియ్యని వెన్నపాలను మనకి అందించాడు అన్నమయ్య.


మంగళం మహత్ 

కామెంట్‌లు లేవు: