7, మార్చి 2023, మంగళవారం

శృంగారదమయంతీనైషధసమాలాపము- పూర్ణభాగం

ప్రవిమలాక్షి నభోనభస్యాంబుదములకు ననవృష్టిధారలై యవతరిల్లి 

యాకర్ణ దీర్ఘ నేత్రాంభోరుహములకుఁ గమనీయనాళభావము భజించి 

కలితకజ్జలత ముక్తాహార లతలలో హరినీలరత్న నాయకతఁ దాల్చి 

లలితవక్షోజకుట్మలచుంబనంబున మధుపదంపతుల సామ్యంబు వడసి


వేఁడియశ్రులు నిగుడంగ వెక్కి వెక్కి 

యేడ్వఁ దొడఁగె లతాంగి పృథ్వీశుమోల

మృదులపరివేదనాక్షరోన్మిశ్రమధుర 

కంఠ కాకు వికారకా కలిక యలర.


నలుఁడు చెప్పిన మాటలకు హృదయం కలగి, తగిన సమాధానం చెప్పలేక అవ్యక్త మధుర ధ్వనులతో దమయంతి, వేఁడికన్నీరు ధారలయి ప్రవహించగా, వెక్కి వెక్కి ఏడ్వడం మొదలుపెట్టింది. 

అప్పుడు ఆ కన్నీరు కాటుకచే నల్లదనం కల్గి, దమయంతి నేత్రాలనే శ్రావణ భాద్రపదమాసమేఘాలకు నూతనవర్షధారల్లా, 

ఆమె నేత్రపద్మాలకు నాళాల్లా,

కజ్జలకాంతిచే ముక్తాహారలతలలో పడినప్పుడు నాయకరత్నమైన ఇంద్రనీలంలా, 

ఆమె ఉరోజాలను తాకినప్పుడు తామర మొగ్గలపై పడిన తుమ్మెదదంపతుల్లా అలరారాయి.


ఇలా గద్గదస్వరంచేత కట్టఁబడినకంఠంతో ఆ దమయంతి అశ్రుకణాల్ని కొనగోళ్ల మీటుతూ తలవాల్చి ఏడుస్తూండడం చూసి, 

నలుడు తల్లడిల్లి, సమస్తం మర్చిపోయి, ఇలా అన్నాడు.


"తరుణీ! ఎందుకు ఏడుస్తున్నావు? 

నీ ముఖపద్మాన్ని ఎత్తి, కోమలకటాక్షవీక్షణాలనే దామకంతో వీరసేనుని తనయుడనైన నలుని నన్ను చూడు.


కాంత! యశ్రుబిందుచ్యుతికైతవమునఁ 

దివిరి బిందుచ్యుతక కేలిఁ దవిలె దీవు 

సారెసారెకు నాదుసంసారమును స

సారముగఁ జేయుచు మసారసారనయన!


ఓదమయంతీ ! మనోహరంగా అశ్రుబిందుచ్యుతిచేస్తూ (కన్నీటిబిందువులను రాలుస్తూ,) ఆ మిషచేత నా సంసారంలోని బిందువును కూడా చ్యుతి చేసి ససారంగా చే‌స్తూ బిందుచ్యుతకకేలి సల్పుతున్నావు. 


ఎందుకు చింతిస్తావు? ఏమైనా తప్పుంటే చెప్పు. నీ పాదాలకు మ్రొక్కుతాను. అనుగ్రహించు. కడకన్నులనే నాలుగిళ్లనుండి తొలకాడుతున్న నీ కలికి చూపులను నాపై ప్రసరింపజేయి. కాస్త నవ్వు. మధురంగా ఏదైనా మాట్లాడు. కౌగిలి దయచేయి." 


అని వెఱ్ఱిగా పల్కి, కాసేపటికి తెలివి తెచ్చుకొని, దేవకార్యం తనవల్ల చెడిందే అని విచారించాడు.


నలుడలా విచారిస్తూంటే, 

దమయంతి ఆతడు నలుడని ఎఱిగి, తెరచాటున దాగింది. ఎంతో ఆనందించింది.

సిగ్గుతో మాట్లాడలేక చెలికత్తెతో ఇలా చెప్పించింది.


"సామాన్యయాచకులకే, అభయం ఇస్తావు. మన్మథబాణాలనుండి నా కభయం ఇవ్వలేవా?"


దమయంతి  ప్రతినిధిగా, చెలికత్తె మిక్కిలి మధురంగా ఇలా మాట్లాడుతూంటే నలుడు ఆనందించినా, దేవేంద్రుని పనికి విఘ్నం కలగడంతో ఆమె మాటలు వినలేదు.


చెలి తిరిగి దమయంతి ఒద్దకు వచ్చింది.


దూతయై వచ్చిన నలునితో ఏమి వికటపు మాటలాడానో అని దమయంతి,

దేవతలకార్యం ఆఱడైందని నలుడు విచారంలో మునిగారు.


అపుడు వెనుకటి బంగారు హంస భయవిచారాలతో నిండిన వారి ఒద్దకు వచ్చి, నలునితో ఇలా అంది.


"నీయంతఃకరణంబు నిర్మలము వర్ణింపంగ శక్యంబె నీ

భూయస్త్వంబు జగత్ప్రసిద్ధములు నీ పుణ్య ప్రభావంబు లే

లాయీలాగునఁజింతనొందెదవు కార్యావాప్తియౌఁగాదటే 

యాయింద్రాదులు నీనిజం బెఱుఁగ రే  యబ్జారివంశాగ్రణీ!"


అని, వైదర్భిని చూసి,


"అమ్మ! దమయంతి! యంతరంగమ్ములోన

మాను సందియ మీతండు మగఁడు నీకు

నాఁడె దా నానతిచ్చినవాఁడు బ్రహ్మ 

తద్వచనమున కన్యథాత్వంబు గలదె."


అని, ఆ ఇద్దఱినీ ఉద్దేశించి, "మీ దంపతులకు మేలు కావలయు! పోయి వస్తా" అని వెళ్లిపోయింది.


దాంతో వారి విచారాలు తొలగిపోయాయి.


అపుడు నలుడు ఎట్టకేలకు చేవ తెచ్చుకొని, దిక్పాలురను తలచి, నమస్కరించి,


"దేవతలారా! కపటం లేని నాభక్తికి సంతోషిస్తే సంతోషించండి. లేదా  శిక్ష విధిస్తే విధించండి. దమయంతీవిరహాన్ని భరించలేను." అన్నాడు.


అపుడు తెరచాటున ఉన్న దమయంతి నలునితో,


"నేను పతివ్రతను. అట్టి పతివ్రత తన కిష్టుడైనవాని వరిస్తే తక్కినవారు ఎగ్గుగా తలపరాదు. ఱేపు దేవతలు రాజులు తక్కినవారు చూస్తూండగా నిన్ను వరిస్తాను. విచారించకు.


ఎల్లలోకధర్మంబులు నెఱిఁగియుండి 

యేల సేయుదు రమరేంద్రు లీరసంబు

నాది వారికి వందనం బాచరించి

తదనుమతి నిన్ను వరియింతుఁ దథ్య మిదియ." 


అని నిశ్చయంగా పల్కి, ఆ రీతిగానే తా వలచిన నలుని వరించింది.


మిగుల పుణ్యప్రదమైన ఈ నలదమయంతుల కథ విన్నవారికి కలిభయం ఉండదు. శుభాలు కల్గుతాయి.

సంపూర్ణం

మంగళం మహత్

కామెంట్‌లు లేవు: