10, ఫిబ్రవరి 2023, శుక్రవారం

తెనుఁగు నుడికారం

తోటనిండా ఆనపపాదులు. పచ్చటి పువ్వులు. వెన్నెల పరిచినట్లు దొడ్డి అంతా అలుముకుని ఉన్నాయి. ఒకవారగా మాలతీలత విరియబూచిఉంది. తెల్లటిపువ్వులు ఆకులను కూడా మూసేస్తున్నాయి. వాటి గుబాళింపుకి చరాచరవిశ్వమంతా పులకరించిపోతోంది. ఒక గండుతుమ్మెద ఝుమ్ముమంటూ తోటంతా అలంగం తిరిగేస్తోంది. సొరపువ్వులమీద వాలి తేనె జుర్రుకుంటోంది. ఆ తుమ్మెద తన దగ్గరకి కూడా వస్తుందని ఆశపడింది మాలతి. తేటి దానిదగ్గరకు వచ్చినట్లే వచ్చి, చటుక్కున మలుపు తిరిగి, మాలతిని చూడనైనా చూడకుండా మరో ఆనప పువ్వుమీద వాలింది. దాని తరవాత మరో పువ్వు. తరువాత మరోటి. అంతేకాని మాలతికేసి కన్నెత్తి చూడలేదు. మాలతికి ఉడుకుబోతుతనం వచ్చేసింది. నా పువ్వులు సొరపువ్వులపాటి చెయ్యక పోయాయా అని గుడ్లనీరు కుక్కుకుంది. రాత్రి కురిసిన మంచుబిందువులు మాలతీగుచ్ఛముల మీదినుంచి కన్నీళ్లలా రాలి నేలని పడ్డాయి. 


దానిమూగవేదన గ్రహించాడు, జగన్నాథ పండితరాయలు. దగ్గరగావచ్చి మాలతి శిరస్సున చెయ్యివేసి ప్రేమగా బుజ్జగింపుగా దువ్వేడు. అంత వరకూ ఆపుకుంటున్న దుఃఖం ఒక్కసారిగా పెల్లుబికి వచ్చేసింది. మాలతి బావురుమంది. మంచు జలజలా రాలింది.


'నేను ఆనపపువ్వులకన్న తీసిపోయానా?'


'అని ఎవరు అన్నారు?'


'అదిగో ఆ తుమ్మెద. ఇందాకటినుంచి చూస్తు న్నాను. ఎంతసేపూ ఆ పచ్చపువ్వులని పట్టుకుని దేవుళ్లాడుతుందే కాని నా వైపు ఒక్కసారి అంటే ఒక్కసారి అయినా చూసిందా ? '


'ఎంత పిచ్చిదానివి మాలతీ! ఈ పాటి దానికి కళ్లనీళ్లు పెట్టుకుంటున్నావా?'


'ఇది తక్కువ అవమానమా?'


'అవునుగానీ ఆ పొగరుతుమ్మెదకి ఎన్నికాళ్లూ?' 


'దాని కాళ్ల సంగతి ఎందుకు ఇప్పుడూ?' 


'ఎందుకో చెప్తాగా.'


'ఆరు కాబోలు. అవును ఆరే. షట్పది అని పేరు కూడా పెట్టేరుగా.'


'పశువుకి ఎన్నికాళ్లు?'


'నాలుగు కదా!'


'అవునా మరి. నాలుగు కాళ్లు ఉంటే పశువు అంటారు. ఆరుకాళ్లు ఉన్న ఈ తుమ్మెద ఆ లెక్కని పశువున్నరకాదూ? దానికి బుద్ధి ఎక్కడఉంటుందీ? బుద్ధి లేని పశువున్నర నీదగ్గరకు రావడంకన్న రాకపోతేనే నీకు మర్యాదకాదూ?'  



కిం మాలతి! మ్లాయసి మాం విహాయ 

చుచుంబ తుంబీకుసుమం షడంఘ్రిః

లోకే చతుర్భిశ్చరణైః పశు స్యాత్ 

సషడ్భి రత్యర్థ పశు ర్నకింస్యాత్ ? 


మాలతి పకపకా నవ్వింది. 


'మీరు తెలుగువారా?'


పండితరాయలు తెల్లబోయాడు. 

'ఏమి అలా అడిగేవు ?


'పశువున్నర అనేది వెధవన్నరలాగ అచ్చంగా తెనుగు నుడికారం, దానిని తమరు అత్యర్ధ పశువు అని సంస్కృతీకరించారు. తెలుగురాని కేవల సంస్కృత కవి ఇటువంటి ప్రయోగం చెయ్యడు'


'తెలుగు నుడికారాన్ని ప్రయోగిస్తున్నానని నాకు తట్టనే లేదు సుమా! గడుసుదానివి' అని జగన్నాథుడు మాలతి నీపు తట్టేడు.


మాలతి పువ్వులు, నవ్వులు కలయబోసి విరచిమ్మింది.


డా. మహీధర నళినీమోహన్..


మంగళం మహత్ 

కామెంట్‌లు లేవు: