24, జనవరి 2023, మంగళవారం

సరసమైన చిన్న కథ

 అది రోహిణీకార్తె. మిట్టమధ్యాహ్నం వడ గాడుపు గూబ పగలేస్తోంది. తాటాకు గొడుగు వేసుకుని నడిచివెడుతున్న జగన్నాథపండితునికి దారిలో ఒక మామిడి చెట్ల గుబురు కనిపించింది. అక్కడే ఒక గిలక నుయ్యి. పక్కనే తాటాకు చేద. జగన్నాథుడికి ప్రాణం లేచివచ్చింది. గబగబా ఓ చేదెడునీళ్లు తోడుకుని ముఖం కడుక్కున్నాడు. చల్లగా మంచులా ఉన్నాయి నీళ్లు. నాలుగు పుడిసెళ్లు గొంతుకలో పోసుకున్నాడు. గంగా బొండంనీళ్లల్లా మధురంగా ఉన్నాయి. 


అక్కడి మట్టితిన్నెమీద కూర్చుని అలసట తీర్చుకుంటూ 'ఎంతమంచినుయ్యి ! ఏపుణ్యాత్ముడు తవ్వించాడో!' అనుకున్నాడు.


అంతలో హఠాత్తుగా ఆ నూతిలోనుంచి 'నేను చాలా నీచమైనదాన్ని' అని దిగులుగా అంటున్నట్లు వినిపించింది. 


జగన్నాథుడు ఉలిక్కిపడి నూతిలోకి తొంగిచూశాడు. అందులో ఎవరూ లేరు. అంతా తన భ్రమ. అంతలో 'నేను చాలా నీచమైనదాన్ని' అని మళ్లీ స్పష్టంగా వినిపించింది.


ఆ మాట్లాడు తున్నది నుయ్యే అని స్పష్టం అయింది అతడికి.


నీచశబ్దానికి క్రిందుగా ఉండేదీ, క్షుద్రమైనదీ అనే అర్థాలున్నాయి.


'ఓహో! నుయ్యి ఎంత తెలివిగా మాట్లాడు తోందీ?' అని మెచ్చుకున్నాడు.


'క్రిందుగా ఉండేదానివి అనడం బాగానే ఉంది కానీ అల్పమైనదానివీ క్షుద్రమైనదానివి మాత్రంకావు బావీ ! నీది అత్యంత సరసమైన హృదయం' అన్నాడు.


'ఏమిటీ? నా హృదయం అత్యంత సరస మైనదా? వేళాకోళం చేస్తున్నారా ?' 


'లేదు లేదు. నీతో వేళాకోళం ఆడతానా?

నిజంగా నీది సరస హృదయమే. ' 


'అదెల్లాగ?'


'రసం అంటే నీరు. నీ హృదయంనిండా నీళ్లు లేవూ? అందులోనూ ఎలాంటినీళ్లు. '


 'మీ ద్వ్యర్థి చల్లగుండా. ఇంకా ఏమిటో అనుకున్నాను.'


'పైగా నువ్వు పరగుణ గ్రహీతవు.'


'ఇదోటా? సరసహృదయంతోబాటు పరగుణ గ్రహణ శక్తి కూడా అంటగడుతున్నారే. ఇది బాగుంది.


'అవును. నేను అన్నది అక్షరాలా నిజం'


'నాది అసలే మందబుద్ధి. మరి కాస్త వివ రించండి దయచేసి.'


'గుణం అంటే తాడుకాదుటమ్మా! చేదకి తాడుకట్టి నీలోకి విడవరూ? అంటే ఇతరుల గుణాన్ని అదే చేంతాడుని—నువ్వు గ్రహించడం లేదూ?'నితరాం నీచోఽస్మీతి 

త్వం ఖేదం కూప! మా కదాపి కృధాః

అత్యంత సరస హృదయో 

యతః పరేషాం గుణగ్రహీతాసి.అతి నీచంబను నేనని

మతిగుందకు మెపుడు కూపమా! నీహృదయం 

బతిసరసము — నీవెప్పుడు 

నితరుల గుణముల గ్రహించు నేర్పరివికదా!


'హోహ్హోహ్హో! నాకు నవ్వు ఆగడంలేదు. ఇంతమంది బాటసారులు నాలో నీళ్లు తాగిపోయారు గానీ మీలాగ నన్ను ఆకాశానికి ఎత్తేసినవాళ్లు లేరు.

ఇంతకీ మీ పేరు ఏమన్నారూ?'


ఆత్మనామ గురోర్నామ 

నామాతికృపణస్యచ

శ్రేయస్కామీ నగృహ్ణీయాత్ 

జ్యేష్ఠా పత్య కళత్రయోః'


'నా పేరుకేంగానీ నాలుగు కాలాల పాటు పరగుణ గ్రహీతవుగా వర్థిల్లు'అని ఆశీర్వదించి ముందుకి సాగిపోయాడు జగన్నాథ పండితరాయలు.


~ డా. మహీధర నళినీమోహన్ 

కామెంట్‌లు లేవు: