15, మే 2011, ఆదివారం

కురు సద్బుద్ధిం

మూఢ జహీహి ధనాగమతృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం,

య ల్లభసే నిజకర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం. 1






ఓ మూఢా!, ( తెలివిలేనివాడా! ) ధనసంపాదనలోని ఆశను వదలు.

మనసులో ఆశలేని మంచి ఆలోచనను చెయ్యి.

నీవు చేసిన పనిని బట్టి, నీకు ఎంత ధనం లభిస్తుందో

అంత ధనంతోనే నీ మనసును తృప్తిపరచు.



నా(గ)స్వ(రం)వ్యాఖ్య:-



ఎక్కువ ధనం సంపాదించాలనే ఆశను వదలమని బోధ.

అంతేకాని సరిపడినంత ధనసంపాదన గురించి కాదు.

చిన్నయసూరి, నీతిచంద్రికలోని మిత్రలాభంలో,

మంథరకం అనే తాబేలు, హిరణ్యకం అనే ఎలుకతో,

" బుద్ధిమంతునకు ( సంసారికి ) సర్వదా ధనార్జన మావశ్యకకార్యమే

కాని య(అ)తి సంచయేచ్ఛ ( ఎక్కువ సంపాదించాలనే ఆశ ) తగదు." అంటుంది.

ఇది గ్రహించాలి మనం.

కనుక ఆశ ఉండాలి. అత్యాశ ( ఇదే దురాశగా పరిణమిస్తుంది. ), దురాశ తగనివి.

" ఆశ మనిషికి ఊతమిస్తుంది.
దురాశ నిలువునా పాతేస్తుంది."

ఇక్కడ డబ్బుకు సంబంధించి రెండు అంశాలు ఉన్నాయి.

కాసు కావాలి కావాలి అనేవారు ఒక రకం.

ధనం దాచాలి దాచాలి అనేవారు ఒక రకం. ( లోభత్వం )

రెండూ పనికిరానివి. ఒక కావాలి ఒక దాచాలి మాత్రమే ఉండాలి.



ధనం అన్నది " నిజకర్మోపాత్తం " అంటున్నారు శంకరులు.

దానికి అర్థం - పూర్వం సంపాదించుకొన్న కర్మ అనీ చెప్పవచ్చు.

ఇప్పటి ధనసంపాదనకర్మ అనీ చెప్పవచ్చు.

ఈ రెండింటిని బట్టే మనకు సంప్రాప్తించవలసిన ధనం దొరుకుతుంది కాని అధికం రాదు.

తృష్ణ ఉన్నా అనవసరం. అది దుఃఖానికే దారి తీస్తుంది.

ప్రాప్తిని బట్టి ధనం అన్నదానికి ఏనుగు లక్ష్మణకవి ఈ క్రింది చక్కని పద్యం చూడండి.



" వనజభవుండు, నెన్నొసట వ్రాసిన సొమ్ము ఘనంబొ కొంచెమో

విను, మరుభూమి కేగిన లభించును మేరువు జేరబోయినన్

ధనమధికంబు రాదు. కడు దైన్యము మాను, ధనాఢ్యులందున

వ్వననిధి నూత దుల్యముగ వారి గ్రహించు ఘటంబు సూడుమా!"



బ్రహ్మ, నుదుట వ్రాసినంత ధనం ఎక్కువో తక్కువో బరియల్ గ్రౌండ్ కు వెళ్లినా లభిస్తుంది.

బంగారుపర్వతమైన మేరువును చేరినా, డబ్బు ఎక్కువ రాదు.

కాబట్టి ధనవంతులను చూచి, ఏడవకు.

సముద్రంలోముంచినా నూతిలో ముంచినా, కుండ సమానంగా నీటిని గ్రహిస్తుంది.

అని పై పద్యానికి భావం.




" ఎంత విభవము కలిగె నంతయును నాపదని

చింతించినది కదా! చెడని జీవనము - అని వ్రాస్తూ అన్నమయ్య


పరివోని ఆస తను బట్టుకొను భూతమని

వెరచినది యది కదా! విజ్ఞాన మహిమ " అంటాడు.




ఇంగ్లీషు అనువాదం. Sivananda Ashram వారి సౌజన్యంతో.

O Fool! Give up the thirst to possess wealth.
Create in your mind, devoid of passions,
thoughts of the Reality.
With whatever you get, entertain your mind, be content.



శుభం భూయాత్

కామెంట్‌లు లేవు: