6, మే 2011, శుక్రవారం

మల్లాది vs ఓ తెలుగు..సా..ఇంజనీరు

కౌముది.నెట్ లో మల్లాది వెంకటకృష్ణమూర్తిగారి అనుభవాల గురించి,

ఓ తెలుగు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సోదరుడు తన బ్లాగ్ లో వెలువరించిన అభిప్రాయాలు

సబబుగానే ఉన్నాయి.

అయితే ఒక పాఠకునిమీద రచయిత ప్రభావం పడుతుందా?

రచయిత సృష్టించిన పాత్రల ప్రభావం పడుతుందా?

ఏది ఎక్కువ.?

రచయితను ప్రక్కన పెడదాం.

ఒక రచనలోని పాత్రలను తీసుకొంటే ,

నవల లాంటి పెద్ద ఇతివృత్తంలో ఎక్కువ పాత్రలు ఉంటాయి.

మరి అన్ని పాత్రల ఇన్ఫ్లుయన్స్ చదివినవారిమీద ఉంటుందంటారా?

మన అభిప్రాయాలకు అభిరుచులకు స్వభావానికి సరిపోలిన పాత్రలు

మనల్ని ఆకర్షిస్తాయి. వారి ప్రభావం మనమీద పడుతుంది.

పాజిటివ్ నెగిటివ్ దృక్పథాలు కలిగిన పాత్రలుంటాయి.

పాజిటివ్ పాత్రలతో గొడవ లేదు. నెగిటివ్ కారెక్టర్స్ తోనే చిక్కు.

సగటు మనిషి మంచి కంటె చెడుకే ప్రభావితుడవుతాడు.

రచయిత అన్నవాడు ఈ రెండురకాల పాత్రలను సృష్టిస్తాడు.

లేకపోతే డ్రామా ఏముంటుంది?

వాల్మీకి రామాయణంలో రామునితో పాటు రావణుడూ ఉన్నాడు.

వ్యాసుని భారతంలో దుర్యోధనునితో పాటు ధర్మరాజూ ఉన్నాడు.

రాముని ధర్మరాజును వదిలేసి, రావణ దుర్యోధనులను అనుసరిస్తామంటే

వ్యాస వాల్మీకులు ఏమి చేయగలరు? తమ పాత్రలను వెనక్కు తీసుకొంటారా?

నిజమే. నిజానికి రావణ దుర్యోధనులే ఎక్కువ సంఘంలో.

కాని లోకాన్ని భయపెట్టిన రావణుడు రాముడంటే భయపడ్డాడు.

దుర్యోధనుని సంగతి తెలుసుగా. విలన్లు ఎంతమంది ఉన్నా వాళ్లను

తలదన్నే హీరో ఉంటాడు.

సారాంశం ఏంటంటే, రచయితలు సృజనకర్తలు. మంచి చెడూ సృష్టిస్తారు.

మనబట్టే వారి రచనలప్రభావం ఉంటుంది.

నవలలని ఏముంది?

పూర్వం కావ్యాలు సృష్టించబడ్డాయి. అప్పటి సాంఘిక పరిస్థితులను బట్టి,

అవి అన్ని ఎక్కువ భాగం శృంగారప్రధానంగా రచించబడ్డాయి.

ఆ రచనలు ఎంతవరకు వెళ్లాయంటే " కావ్యాలాపాంశ్చ వర్జ్యయేత్ "

అనేంతవరకు. అంటే కావ్యాలను వినడం విడిచిపెట్టండి. అని పై ఉక్తికి అర్థం.

మరి ఆ కవులను ఏమనాలి?

నవలల వల్ల మన చదువు

పాడయిందంటే, దానికి కారణం వారేనంటారా? మన తప్పిదం ఏమీ లేదంటారా?

మనం దేనికి ప్రాధాన్యమిచ్చినట్లు? చదువుకా? లేక???????

రచయితల రచనల్లోని ఆదర్శాలు సమాజంలో కనబడకపోతే

సంఘవిద్రోహులుగా మారతారంటారా?

ఒక ఉపాధ్యాయునే తీసుకొందాం.

ఎంతో కొంత సరియైన బోధన చేయకుండా ఉండడు కదా!

మరి ఎంతమంది స్టూడెంట్స్ ఆయన నీతిబోధనను ఒంటబట్టించుకొంటున్నారు.?

శ్రీగరికిపాటివారు మొన్న ఓ ఛానెల్లో తన తెలుగు ఉపాధ్యాయుడు చెప్పిన

ఓ పద్యం వల్ల అవధాని అయ్యానన్నారు.

ఆ పద్యాన్ని తన నలుగురు క్లాస్మేట్స్ తో పంచుకొన్నానన్నారు కూడా.

అయితే ఈయన అవధాని అయారు కానీ మిగిలినవాళ్లు అవ్వలేదు.! ఎందుకని?

ఏవో నాలుగు రాళ్లు సంపాదించుకోవాలని అందరూ చూస్తారు.

రచయితలు అంతే.

అయితే " విశ్వశ్రేయః కావ్యం " అని నన్నయ నుడివినట్లు,

రచయితలకు విశిష్టపవిత్ర జీవనం ఉండాల్సిందే.

సామాజికబాధ్యత కలిగిఉండాల్సిన రచయితలు , ఉపాధ్యాయులు

వీరిద్దరూ త్రికరణశుద్ధిగా ఉండాలి.

అప్పుడు సమాజం వారివల్ల శుద్ధమవుతుంది.

అప్పుడు ఆ రచయితల రచనలు

రామాయణ భారతాల్లా పవిత్రమై శాశ్వతమౌతాయి.

ఆంధ్రసారస్వత పరిషత్తు ఒకప్పటి రథసారథి ( సెక్రటరీ ) అయిన

శ్రీ దేవులపల్లి రామానుజరావుగారు, తమ ఉద్యోగజీవితం ఇచ్చిన

ప్రత్యేక అవకాశాన్ని ఉపయోగించుకొని, రచయితల్ని చదివిపడేశారు.

ఓ సభలో నిర్మొహమాటంగా రచయితల గురించి తన అభిప్రాయాన్ని,

ఇలా చెప్పేశారు కూడా. " రచయితల రచనలకూ వారి నిజ జీవితాలకు పెద్ద

వ్యత్యాసం ఉంది. వారు వ్రాసేదొకటి. చేసేదొకటి. ఇది తగదు." అని.

ఓ తెలుగు ..... ఇంజనీరు సోదరుని అభిప్రాయమూ ఇదే.

ఏకీభవించాల్సిందే. అయితే నేతిబీరకాయలో నెయ్యి వెతకడం అనవసరం. అలాగే

రచనల్లో నీతి మాత్రమే గ్రహించాలి.

ఆ రచనతో ఆ రచయితను పోల్చడం అనవసరం.

ఇది కేవలం నా అభిప్రాయం.

ఎవర్నీ నొప్పించడానికి కాదు. ఒకవేళ నొప్పి కలిగితే క్షంతవ్యుణ్ణి.

చిత్తగించవలెను.

నాగస్వరం.

1 కామెంట్‌:

Rao S Lakkaraju చెప్పారు...

అయితే ఈయన అవధాని అయారు కానీ మిగిలినవాళ్లు అవ్వలేదు.! ఎందుకని?
-------------
విన్నవాళ్ళ/చిదివిన వాళ్ళ అందరి గ్రహింపు శక్తీ ఒక విధంగా ఉండవని అనుకుంటాను. కొందరికి క్లిక్ అవుతుంది కొందరికి కాదు. చదివినంత మాత్రాన పాఠాలు బుర్రకెక్కాలని లేదు కదా. అలాగే అందరూ ప్రభావిత మవ్వరు.