18, మే 2011, బుధవారం

తల్లిదండ్రులంటే భక్తి కలవారికోసం

గోవిందం భజ - 5


యావ ద్విత్తోపార్జనసక్త స్తావన్నిజపరివారో రక్తః,

పశ్చాజ్జీవతి జర్ఝరదేహే వార్తాం కో౭పి న పృచ్ఛతి గేహే. 4



( వ్యక్తి )

ఎంతవరకు ధనాన్ని సంపాదించడానికి ( ఆ ) సక్తుడై ఉంటాడో,

అంతవరకు అతని కుటుంబంలోని పరివారం, అతనిమీద ( అను ) రక్తులై ఉంటారు.

తర్వాత వయసు మీద పడి, ( ముసలివాడై, ) సంపాదించలేనినాడు,

తన ఇంట్లో ఒక్కడు కూడా కనీసం " ఎలా ఉన్నావు ? " అని అడగడు.



సక్తుడు అంటే తగులుకొన్న మనసు కలవాడు. దేనిమీద ? ధనసంపాదనమీద.

రక్తులు అంటే అనురాగం అనగా ప్రేమ కలవాళ్లు.

ధనికకుటుంబంలో సేవకులు, డ్రైవర్లు ఇత్యాదులు కూడా పరివారంలోకే వస్తారు.

పైన చెప్పిన సేవకాదులు యజమానివద్ద ధనం లేదని తెలిసిననాడు దూరమవుతారు.

కుక్క తప్ప. కుక్క విశ్వాసం గల జంతువు. దానికి యజమాని సంపాదనతో పనిలేదు.


నా(గ)స్వ(రం)వ్యాఖ్య :-



పరమసత్యం కదూ! ఆదిశంకరుల వాక్కులు.

పూర్వపు సాంఘిక పరిస్థితులనుబట్టి సంపాదించేవాడు మగవాడు.

కాబట్టి అతడి పరంగా చెప్పబడింది. స్త్రీకి ఇంట్లో చాకిరీ.

సంపాదిస్తున్నంతకాలం భర్తను, భార్య గౌరవిస్తుంది.

ఎనలేని ప్రేమ కురిపిస్తుంది.

ఆర్జించలేడని తెలిసిన తరువాత ఆ గౌరవం ఆ ప్రేమ కాగడా పెట్టి వెతికినా

ఆమె మొహంలో కానీ చేతల్లో కానీ కనిపించవు.

భర్తా అంతే. ఆమెనుండి, చాకిరీకి ఓపిక అనే సంపాదన ఉన్ననాళ్లు ప్రేమ నటిస్తాడు.

కొడుకులూ కూతుళ్లూ తండ్రినుండి సంపాదన కోరతారు.

తల్లినుండి సేవలు కోరతారు.

సంపాదించి ఇస్తేనే సంతానం తండ్రిని, గౌరవించేది.

ఇలా కుటుంబంలో పరస్పరం ఏదో ఒకటి ఆశిస్తూనే కలసి ఉంటారు కానీ

పరస్పరాప్యాయతతో కాదు. (90%) ఇది సత్యం.

చిన్నప్పటినుండి, దానిని కడిగించుకోవడంతో సహా

తల్లితో అన్ని సేవలూ చేయించుకొన్న కొడుకు,

ఆమె ముదుసలి అయ్యాక, తల్లికి తప్పక చేసినా ఋణం తీరని సేవల్ని

తాను చేయడు. పెండ్లాం చేత చేయించడు. ( చేయించలేడు ).

" అన్నంలోకి కూర వండి పెట్టలేదని ఓ ప్రబుద్ధుడు , కన్నతల్లిని కడతేర్చాడు. "

ఇది ఓ వార్తాపత్రికలో కొన్నిరోజుల క్రితం వచ్చిన ఓ వార్త .

కడతేర్చనక్కరలేదు. తల్లికి గౌరవం ఇవ్వకపోతే,

ఆ విషయం ఆమె గుర్తిస్తే, అది ఆమెకు చావులాంటిదే.

కొడుకు మానసికంగా చంపినా,

మనవళ్లు మనవరాళ్ల మీద ప్రేమ చంపుకోలేక ఏదో బ్రతుకుతుందంతే ఆ తల్లి.

రిటైరై, పెన్షన్ వస్తున్నవాళ్లు నయమేమో గాని,

వయసుడిగిపోయి, సంపాదించలేక, చాకిరీ చేయలేక,

ఇంట్లో వాళ్ల సూటిపోటి ఈటెల్లాంటి మాటలు భరించలేక,

చావురాక, చావలేక, దీనంగా, కొడుకైనప్పటికీ పరాయిపంచన బ్రతుకుతున్నట్లుగా

బ్రతికుండి బ్రతకలేక ప్రాణమున్నశవాల్లా సొంతదైనా తమది కాని తమ ఇంట్లో

స్వేచ్ఛలేక ఓ మూలన పడి ఉండే ముసలి తల్లిదండ్రులు ఎంతమందో?

నిజంగా ఆలోచిస్తే, కళ్లు చెమరిస్తాయి.

మళ్లీ, తల్లిదండ్రుల పట్ల తమలా, తమ సంతానం తమ పట్ల తయారైనప్పుడు,




అని పాడాలి. గుండె బరువెక్కిందా? రిలాక్స్ అవుతారా?

ఎలాగూ తల్లిదండ్రుల ప్రసక్తి వచ్చింది కాబట్టి వారి మీద కొన్ని చక్కని అనురాగ భక్తి గీతాలు.















కొన్ని విషయాలు.

సంధ్యావందన పూజాదులు నిర్వహించే, సాంప్రదాయికులు

మొదట తండ్రికి తల్లికి నమస్కరించి, గణేశప్రార్థన చేస్తారు.


తల్లిదండ్రులంటే భక్తి కలవారికోసం

ఆ శ్లోకాలు.

ఏతత్పార్థివదేహః ప్రాదురభూద్యేన భగవతా గురుణా,

సంతునమాంసి సహస్రం తస్మై సర్వజ్ఞ మూర్తయే పిత్రే.. 1



తనురిద మభివృద్ధిం సమవాప్యాస్తే సర్వదేవతా శక్త్యా,

దేవ్యాయయా వికలయా మాత్రే తస్యై నమో౭స్తు భగవత్యై. 2


ఇలా తల్లిదండ్రులను సేవించి, పూజించి,

ఇంతవరకు తల్లినుండి తండ్రినుండి తీసుకొన్నది చాలని

ఇక వారినుండి ఏమీ ఆశించని వాళ్లు,

వారి గొప్ప గుణాలను గ్రహించాలి తప్ప

ఇంకా ఇంకా వారిని దోచేయడం సరి కాదని గ్రహించిన వాళ్లు నిజమైన సంతానం.


మానవసంబంధాలకు విలువ ఇవ్వక,

ధనమూల మిదం జగత్ అని నమ్మినందువల్ల

డబ్బుకు లోకం దాసో౭హం అంటోంది.

శివుడే లోకం శివో౭హం అన్ననాడు మనిషి మనిషవుతాడు.

ఈ భావన ఉన్ననాడు ప్రతి వ్యక్తి తన కుటుంబాన్నే కాదు,

విశ్వాన్నే తన కుటుంబంగా ప్రేమిస్తాడు. గౌరవిస్తాడు. అని శంకరభగవత్పాదులవారి బోధ.


ఇంగ్లీషు అనువాదం. Sivananda Ashram వారి సౌజన్యంతో.


As long as there is the ability to earn and save,
so long are all your dependants attached to you.
Later on, when you come tolive with an old, infirm body,
no one at home cares to speak even a word with you!!






శుభం భూయాత్

1 కామెంట్‌:

Nanduri చెప్పారు...

tallidandrulanna daiva sannibhulara
lalitha sugunajala telugu bala