26, మే 2011, గురువారం

అర్థం, అనర్థం

గోవిందం భజ - 7




అర్థ మనర్థం భావయ నిత్యం నాస్తి తత స్సుఖ లేశ స్సత్యం ,

పుత్రాదపి ధనభాజాం భీతి స్సర్వ త్రైషా విహితా రీతి:. 6




" అర్థాన్ని అనర్థంగా నిత్యం భావించు.

ఆ ధనంవలన సుఖం కొంచెం కూడా లేదు. నిజం.

ధనం దాచుకొన్నవారికి పుత్త్రుని వలన కూడా భయమే.

లోకమంతా ఇంతే. "


అర్థం అంటే సంపద.

అనర్థం అంటే ప్రయోజనం లేనిది. కీడు అని కూడా అర్థం.


నా(గ)స్వ(రం)వ్యాఖ్య :-


సంపద లోకి

డబ్బు, నగలు, భవంతులు, పొలాలు, వాహనాలు, వస్తువులు, వస్త్రాలు, పశువులు

మొదలైనవన్నీ వస్తాయి.

ఇవన్నీ ఉంటే సుఖం అని అందరి భావన.

కానీ ఇది భ్రాంతి మాత్రమే.

వాటివల్ల బాధలు ఎక్కువ. సుఖాలు తక్కువ.

సంపూర్ణ సుఖాన్నే సుఖం అనాలి.

డబ్బుతో సుఖాన్ని అనుభవిస్తున్నా, డబ్బు కర్చు అవుతున్నదనుకొంటూ అనుభవించేది ఎలాంటి సుఖం?

సరదాగా విహారయాత్రలు చెయ్యకపోతే జీవితం బోరు కొట్టెయ్యదూ! అని

విహరించి వచ్చాక , లెక్కలు చూసుకోవడం, బాగానే ఖర్చయ్యిందే! అనుకోవడం అసంపూర్ణ సుఖం .

ఇక నగలు, బీరువాలోంచి తీసి , ధరించి, దాని ప్రయోజనం నేరవేరాక , మరల బీరువాలో పెట్టేదాకా

కొంచెమైనా టెన్షన్ ఉండదంటారా?

పొలాలు, ఇండ్ల స్థలాలు , ఎవడు ఆక్రమిస్తాడో అని , సేకరణ, విస్తరణ ల్లోకి రాదు కదా ! అని

అప్పుడప్పుడైనా అనుకోని ఆ(భూ)సామి ఉండడు కదా!

అలాగే వస్తువులు, వస్త్రాలు, వాహనాలు అన్నీ పాడవుతాయనే అనుకొంటూ వాడడం మానవ నైజం.

(వాటి ఖరీదు ఎక్కువైన కొద్దీ భయం, బాధ కూడా ఎక్కువవుతూంటుంది.)


ఇలా మిగిలినవాటిని గ్రహించాలి.


పైగా పైవాటిని సంపాదించడం , దాచడం, ఈ రెండింటిలో బాధే కాక ఏది పోయినా రెట్టింపు బాధ.

ఇక సుఖం ఏమిటి ? చెప్పండి.

భార్య , సంతానం కూడా సంపదే.

వారి వల్ల కేవలం సుఖాలు మాత్రమే ఉండవు. అని అనుభవజ్ఞులు చెప్తారు.

ఇలా సంపద వల్ల సుఖాలు సమకూరతాయి అని అనుకొంటూ ఉండడమే తప్ప

(దీన్నే ఆభాససుఖం అంటారు.)

నిజమైన సంపూర్ణ సుఖం ఉండదన్నది ఆది శంకరుల ఉపదేశం.

దీన్నే ఆయన అనర్థం అన్నారు.

ఇక, అదే సంపద వల్ల హాని కూడా కలుగుతుంది.

లోకంలో జరిగే హత్యలకు  కాంతాకనకాలే కారణాలు - ఆ తర్వాతే మిగిలినవి.

ధనం దాచినవారికి పుత్త్రుని వల్ల కూడా బాధలేనట.

ఖర్చులకు అడుగుతాడని. డబ్బు మిగల్చడని.

లోకమంతా ఈ విధంగానే ఉంది అంటారు శంకరులు .

నిజానికి చలామణిలో ఉన్న డబ్బు ముందు తండ్రి, కొడుకు, భార్య, తమ్ముడు, అన్న, అమ్మ,

మొదలైన మానవ సంబంధాలన్నీ చెల్లనివి.

అయితే సంసారికి డబ్బు అక్కరలేదా అంటే కావాలి. సంసారం నడవడానికి కావాలి.


అయితే సంపాదనలో ఋజువర్తన ఉండాలి.
 

నీరు నిలువ ఉంటే తయారైన బురదలో ఉద్భవిస్తుంది కమలం. 

అందులో కొలువై ఉంటుంది లక్ష్మి.

అందుకే ఆపెను కమలాలయ అన్నారు.

ఇది పురాణోక్తి. 

భూమిపై ఎన్నో పూలచెట్లుండగా

కమల, కమలాన్నే నివాసంగా ఎంచుకోవడంలో ఉద్దేశ్యం ఏమిటి? అని ఆలోచిస్తే

ఇది ఒక ప్రతీకాత్మకమైన విషయం అని తెలుస్తుంది.

మనచుట్టూ బురద ఉన్నా,

మనలో ఎంత కళంకం ఉన్నా,

కమలం లాంటి ఒక్క గుణం ఉంటే

మనల్ని కమల ఆశ్రయించుకొని ఉంటుంది.

అయితే ఏ అత్యుత్తమ గుణం అన్ని గుణాలను కలిగి ఉంటుంది అని పరిశోధిస్తే 
 
సత్యగుణమే సకలగుణాలకు ఆలవాలం అని తెలుస్తుంది.

ఇక్కడ సత్యాన్ని కేవలం వాక్కులో మాత్రమే కాదు

అన్నిటా అంటే దైహిక మానసికమైన అన్ని వర్తనల్లోనూ అన్వయింపజేయాలి.

ఋజువర్తన అంటారు దీన్ని.

అపుడు లక్ష్మీప్రసన్నత లభిస్తుంది.

పంకాన్ని కమలం ప్రకాశింపజేసినట్లు,

సంసారపంకాన్ని కమలానుగ్రహంతో పరిమళింపజేయొచ్చు.

అందువల్ల ఋజువర్తన ఉంటేనే ఆ ధనం యోగమవుతుంది. భోగానికి అనుకూలమవుతుంది.

అటువంటి ధనం మోహాన్ని కలిగించదు.

ఇలా లేకుండా


డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చినంత కాలం అనర్థాలు తప్పవు .

అనురాగం, ఆప్యాయత, అభిమానం , ఇవి నిజమైన అర్థాలు .

వీటితో కూడిన "ఈ" అర్థం సదర్థం (సత్ + అర్థం ) అని,

"ఆ" అర్థం, అనర్థం అని, నిత్యం, సదా,ఎల్లప్పుడూ, నిచ్చలు, సతతం భావన చేస్తూండాలి .




అని భావన చేస్తూంటే, అప్పుడు మనసు తేలిక పడుతుంది.

భగవానుని మీదకు మళ్లుతుంది.


ఇంగ్లీషు అనువాదం. Sivananda Ashram వారి సౌజన్యంతో.

‘Wealth is calamitous’, thus reflect constantly:
the truth is that there is no happiness at all to be got from it.
To the rich, there is fear even from his own son.
This is the way with wealth everywhere.


శుభం భూయాత్

కామెంట్‌లు లేవు: