27, మే 2011, శుక్రవారం

క్రీడ , తరుణి , చింత

గోవిందం భజ - 8


బాల స్తావ త్క్రీడా సక్త:

స్తరుణ స్తావ త్తరుణీసక్త:,

వృద్ధ స్తావ చ్చింతాసక్త:

పరమే బ్రహ్మణి కో౭పి న సక్త:. 7



" ( వ్యక్తి ),

బాలునిగా ఉన్నంత వరకు ఆటలందు ,

వయసులో ఉన్నప్పుడు యువతులయందు,

వయసుడిగినప్పుడు సంసారవిషయ చింతలందు (ఆ) సక్తుడై ఉంటాడు.

(కానీ) పరాత్పరమైన పరమాత్మయందు జిజ్ఞాస కలవాడు ఎవడూ లేడు".



జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనే ఆసక్తి.



నా(గ)స్వ(రం)వ్యాఖ్య :-



మనిషి ,

బాల్యంలో ఆటపాటల్లో మునిగిపోయి ఉంటాడు.

పరమాత్మను గురించిన ఆలోచనే రాదు.

వయసు వచ్చే నాటికి కొంత తెలుస్తుంది కానీ ,

కండ్లకెదురు పడిన ఆడపిల్లలు , తోచనివ్వరు తొణగనివ్వరు.

పెండ్లి మీదకు, పెండ్లాం మీదకు మనసు పోతుంది.

అయితే, ఏ వయస్సులో జరగవలసిన ముచ్చట ఆ వయసులో జరగాలంటారా !

నిజమే.

ప్రతిఒక్కరూ తమ సంతానం ద్వారా వంశాభివృద్ధి కలగాలని కోరుకుంటారు .

సహజం . తద్ద్వారా లోకానికి కూడా ఉనికి ఏర్పడుతుంది.

అయితే సంసారమనే ఊబిలోకి దిగబడిపోయాక ,

పిల్లల ఉద్యోగాలు , వివాహాలు వగైరాలతో సతమవుతారు.

మరి బాధ్యతలను నిర్వహించావద్దా? అంటారా !

సరే ,

అయితే ఆ తపన, సంతానం ప్రయోజకులయ్యేవరకే ఉండాలి.

ఆ తరవాత కూడా తాపత్రయపడడం ఎంతవరకు సబబు.?

ముసలితనం వచ్చిన తర్వాతైనా ఊరుకోక ,

మనవళ్ళ మురిపాలు ముచ్చట్లు గొడవలు గోష్ఠులు కూడా తమకే కావాలని ,

తమ సలహాలు తీసుకోవాలని , తీసుకోవటం లేదనీ, అదనీ, ఇదనీ ....

ఇదెంతవరకు సమంజసం?

ఇలాంటి చింతల్లో మునిగిపోయి, ఊపిరాడక, ఉక్కిరిబిక్కిరి అయ్యి , ఉసూరుమంటూ,

అదిలేదు ఇదిలేదు అనే బాదరబందితో బ్రతుకుతుంటారే కానీ,

బ్రహ్మ గురించిన ఆలోచనలు చేయరు. నాలుగవ పురుషార్థాన్ని గురించి ఆలోచించరు.


ధర్మ అర్థ కామ మోక్షాలు చతుర్విధ పురుషార్థాలు.

ప్రతి వ్యక్తీ తప్పనిసరిగా సంపాదించవలసినవి.

అర్థాన్నీ, కామాన్నీ ధర్మయుక్తంగా సంపాదించాలి.

మోక్షాన్నీ అంతే. ధర్మయుతంగానే పొందాలి.

కానీ అందరూ ప్రయత్నించి, పొంది , ఆగిపోయేది అర్థకామాలవరకే.

మొదటిదాన్ని, చివరిదాన్ని పట్టించుకొనేవారు అరుదు.

ప్రతిదీ ధర్మం ప్రకారం అని తెలియచేయడానికే ధర్మానికి మొదటి స్థానం ఇచ్చారు.


ధర్మం

ధర్మ అర్థం

ధర్మ కామం

ధర్మ మోక్షం

వరుసగా మనిషి సాధించాలి .


ఆయా వయస్సులయొక్క అవస్థలనుబట్టి, విషయలోలురై ఉంటారే

కానీ ఒకడైనా బ్రహ్మవిచారం చేసేవాడు లేడని శంకరుల చింత.( బాధ )


కానీ,


కనీసం ముసలితనంలోనైనా పరమాత్మచింత , మోక్షచింత ,

ఎవరూ కూడా చేయటం లేదని, నా(గ)స్వ(రం) చింత( ఆలోచన ).






ఇంగ్లీషు అనువాదం. Sivananda Ashram వారి సౌజన్యంతో.


So long as one is in one’s boyhood, one is attached to play,
so long as one is in youth, one is attached to one’s own young woman;
so long as one is in old age, one is attached to anxiety,
yet no one, alas to the Supreme Brahman, is ever seen attached.


శుభం భూయాత్

కామెంట్‌లు లేవు: