31, మే 2011, మంగళవారం

జీవన్ముక్తి

గోవిందం భజ - 10


సత్సంగత్వే నిస్సంగత్వం

నిస్సంగత్వే నిర్మోహత్వం,

నిర్మోహత్వే నిశ్చలతత్త్వం

నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః . - 9



"సత్" తో సహవాసం కలుగుతూంటే, - సత్సంగత్వం


దేనియందూ ఆసక్తి కలుగని,

ఎవరితోనూ ( పుత్త్రులు, భార్య, మిత్రులు మొదలైనవారితో )

సంబంధం ( Attachment ) కోరని / వద్దనుకొనే స్థితి ఏర్పడుతుంది.

(వారిమీద ప్రీతి వీడుతుంది.) - అదే నిస్సంగత్వం

ఆ ఆసక్తి / బంధం వీడిందా, మోహం ( అజ్ఞానం ) వదలిపోతుంది. - నిర్మోహత్వం

మోహం తొలగిపోతే, నిశ్చలమైన తత్త్వం ( శుధ్ధజ్ఞానం ) లభిస్తుంది. - నిశ్చలతత్త్వం

అది దొరకెనా, బ్రహ్మైక్యం సిద్ధిస్తుంది. - జీవన్ముక్తి



జీవన్ముక్తి అంటే - ఈ శరీరంతో ఉంటూనే బ్రహ్మతో తాదాత్మ్యం పొందటం. /

జీవించి ఉండగానే బంధాలనుండి విడివడటం.

బంధాలనుండి విడివడిన వాడికే బ్రహ్మైక్యం లభిస్తుంది.




నా(గ)స్వ(రం)వ్యాఖ్య: -



ముక్తి అంటే అన్ని బంధాలనుండి విడివడటం.

విముక్తి అన్నమాట.

మనసే అన్ని బంధాలకు కారణం. ఆ విషయాన్ని గ్రహించి, మనసును లొంగదీసి,

ఈ ముక్తిని, జీవించి ఉండగానే సాధించవచ్చంటున్నారు శంకరాచార్యులవారు.

ఎప్పుడు?

స్థిరమైన పరతత్త్వభావంతో మనసును నింపినప్పుడు.

అంటే శ్రేష్ఠమైన పరబ్రహ్మం/పరమాత్మను గురించిన స్థిరమైన చింతనలు మనసు చేస్తున్నప్పుడు.

అటువంటి స్థితి ఎప్పుడు కలుగుతుంది?

అజ్ఞానమూలమైన మోహం పోయిననాడు. ( మోక్షవిషయక బుద్ధిని జ్ఞానం అంటారు.

అది లేకపోవడమే అజ్ఞానం. ఈ అజ్ఞాన స్థితే మోహం.)

అదెప్పుడు పోతుంది?

నిస్సంగత్వం కలిగిననాడు. ( నిస్సంగత్వం అంటే భావంలో వివరించడమైనది.)

నిస్సంగత్వం ఎలా సాధ్యం.?

సత్ సంగత్వంతోనే సాధ్యం.

సత్ అంటే మంచి అని ఒక అర్థం.

మంచి అన్నది ప్రవర్తన ( క్రియాశీలకం ) ద్వారానే తెలుస్తుంది.

జంతువుల్లోనూ కూడా, క్రూరప్రవర్తనను చూపించని వాటిని మంచిజంతువులంటాం కదా!.

అందువలన

సత్+సంగత్వం అంటే " మంచి " అన్నది కలవారితో = సజ్జనులతో కూడిక, కలయిక,

స్నేహం, సహవాసం, మైత్రి వల్ల నిస్సంగత్వం ఏర్పడుతుంది.

సహవాసం చేస్తేనే నిస్సంగులైపోతారా?

ఆ ! వారు సజ్జనులు మాత్రమే కారు.

సత్ = పరబ్రహ్మం ( వేదపరంగా సత్ అంటే పరమాత్మ)తో సంగం, సహవాసం కలవాళ్ళు.

అంటే జ్ఞానులన్నమాట.

అటువంటి వారితో సాహచర్యం చేస్తే,

క్రమక్రమంగా శ్లోకంలో చెప్పబడిన స్థితులను కలుగజేసి,

జీవన్ముక్తులను చేస్తారు.

అటువంటివారిని వెతుక్కొని ఆశ్రయించమని శంకరుల వాక్కు.





ఇంగ్లీషు అనువాదం Sivananda Ashram వారి సౌజన్యంతో.


Through the company of the good, there arises non-attachment;
through non-attachment there arises freedom from delusion;
when there is freedom from delusion, there is the Immutable Reality;
on experiencing the Immutable Reality, there comes the state of ‘liberated-in-life’.




శుభం భూయాత్

కామెంట్‌లు లేవు: