1, జూన్ 2011, బుధవారం

" సం " సారం

గోవిందం భజ - 11


వయసి గతే కః కామవికార

శ్శుష్కే నీరే కః కాసారః,

క్షీణే విత్తే కః పరివారో,

జ్ఞాతే తత్త్వే క స్సంసారః . 10



" వయసు గతించిపోగా, కామవికారం ఎక్కడిది ?

నీళ్లు ఎండిపోగా, కొలను ఎక్కడిది ?

ధనం తగ్గిపోగా, పరివారం ఎక్కడిది ?

తత్త్వం ( అసలు విషయం, నిజం, సత్యం = పరమాత్మ) తెలియబడుతూండగా,

(ఇక) సంసారం ఎక్కడిది ?"




నా(గ)స్వ(రం)వ్యాఖ్య: -



" తరుణ స్తావ త్తరుణీసక్తః " అని, ఇంతకుముందు చెప్పినట్లు,

వయసు/యౌవనం ఉన్నంతవరకే కామవికారం ఉంటుంది.

ముసలితనంలో ఉండదు.

అంటే యౌవనం పోగానే స్త్రీలంటే ఆసక్తి కూడా పోతుంది.

అయితే సూర్యుడు అస్తమించగానే చీకటి రానట్లు,

యౌవనం పోయిన వెంటనే కామాసక్తి పోదు.

అందువల్ల ఇక్కడ యౌవనం అంటే శరీర పటుత్వం అని చెప్పాలి.

శరీర పటుత్వం పోయినప్పుడే మదనవికారం మాయమౌతుంది.

అప్పుడు కూడా శారీరకంగానే పోతుందనాలి.

మానసికంగా ఉరకలెత్తుతూనే ఉంటుంది.

కాబట్టి, కంట్రోల్ చేయాల్సింది దేన్నో, నియంత్రించాల్సిందేదో ఇక వేరే చెప్పనక్కరలేదు.

అధికస్య అధికం ఫలం అన్నట్లు,

మానసిక దోషం, శారీరక దోషం కంటే అధికం.

దానికే అధిక ఫలితం.

కాబట్టి మనసును పరిశుద్ధంగా ఉంచుకోవాలి.

శరీరాన్ని అక్కరలేదా అంటే, అదీ అవసరమే. మానసికశుద్ధికి అదీ తోడ్పడుతుంది.

శరీరం చెరువు అయితే, వయసు అందులోని నీరు.

నీరు ఎండిన చెరువుకు ఉనికి లేదు. ఉనికి ఉందనుకొన్నా ఉపయోగం లేదు.

అయితే ఎండిన చెరువులోకి నీరు, మళ్లీ వచ్చే అవకాశం ఉంది.

కానీ ఒకసారి శరీరం నుండి యౌవనం గతించాక, తిరిగి వచ్చే అవకాశమే లేదు.

ఒకవేళ వస్తే, అన్నవాళ్లకు సమాధానం యయాతి చరిత్ర.

యయాతి చంద్రవంశపు రాజు.

ఒకసారి, మాట తప్పి ప్రవర్తించినందుకు, మామగారైన శుక్రుడు,

వనితాజనహేయంబైన ముసలితనాన్ని పొందమని, యయాతికి శాపమిచ్చాడు.

పోనీలే, రామ, కృష్ణ అనుకొంటాను అనలేదు యయాతి.

ఇంకా కామవాంఛలు తీరలేదు. అన్నాడు.

తెలివైనవాడు కాబట్టి, "మీ కూతురియందు తీరలేదు "అన్నాడు.

అని, ఆయన అనుజ్ఞపొంది, కుమారుల్ని పిలిచి,

నా ముదిమి తీసుకొని, మీలో ఎవరైన మీ యౌవనం నాకు ఇస్తారా? అని అడిగాడు.

పెద్దకుమారులెవరూ అంగీకరించలేదు.

చివరి కుమారుడు, పూరుడు మాత్రం పిత్రాజ్ఞగా అంగీకరించాడు.

ఇద్దరూ, పరస్పరం వయసులు మార్చుకొన్నారు.

యయాతి కొన్ని వేల సంవత్సరాలు, ఇంద్రియభోగాల్లో మునిగి,

ఒకరోజు, ఆయనంతట ఆయనకే ఆత్మజ్ఞానం కలిగి, తేలాడు.

కామవాంఛ ఎలాంటి పనైనా చేయిస్తుందని,

ఎంత అనుభవించినా తృష్ణ తీరటంలేదని, వాపోయాడు.

తాను చేసిన పనికి రోసి, పూరునకు యౌవనం తిరిగి ఇచ్చేసి,

కుమారులకు రాజ్యాన్ని పంచి, తపస్సున తరించాడు.

కామవాంఛలు తీర్చినకొద్దీ విజృంభిస్తూంటాయని, దీనివల్ల తెలుస్తుంది.

ఇంకా వయసుంటే బాగుండనిపించే వారికోసం యయాతి చరిత్రను చెప్పారు.

ఇక ధనం.

ధనం ఉన్నంతవరకే సేవకాదులు ఉంటారు.

అది కోల్పోయాక , వాళ్లూ ఉండరు. దూరమవుతారు.

( అంతే కానీ పోరు. ధనమున్నదని తెలిశాక మళ్లీ ఎలాగోలా దగ్గరవుతారు.)

ఈ విధంగానే, ఏది నిత్యం ? (పరమాత్మ )

ఏది అనిత్యం ? ( పరమాత్మ కంటె ఇతరమైనవన్నీ )

అనే వివేకం కలిగి, ( ఇదే తత్త్వం )

భగవంతుడే నిజం అని తెలుసుకొన్నాక, ఇక సంసారబంధం ఉండదు.

ఉండదంటే ఉండకుండా పోదు.

దానివల్ల కలిగే బాధలు ఉండవు. ఉన్నా, బాధల్లా ఉండవు.

కర్తవ్యాన్ని గుర్తు చేసే ఆజ్ఞల్లా కనిపిస్తాయి. అనిపిస్తాయి.

ఆ ఆజ్ఞలు, నిత్యుడు, శాశ్వతుడూ అయిన పరమాత్మవి అని జ్ఞాపకం చేస్తూంటాయి.

ఆయనను చేరే దారి గురించి తెలుసుకోమంటాయి.

కాలం / ఋతువులు తెచ్చే మార్పులు అంగీకరించవలసిందే అని,

ఆ కాలం పరమాత్మ అధీనం అని కూడా తెలుసుకొన్నదే తత్త్వం.

పుట్టుక వచ్చినట్లే బాల్యం వస్తుంది. కాలగతిలో యౌవనం వస్తుంది.

అంతే సహజంగా వృద్ధాప్యమూ వస్తుంది. ఒప్పుకోకపోయినా తప్పదు.

ఎండాకాలం వస్తే చెరువు ఎండుతుంది. ఉనికిని పోగొట్టుకొంటుంది.

నారికేళ సలిలంలా వచ్చిన ధనం, కరి మ్రింగిన వెలగపండులా పోయి,

పరివారాన్నీ దూరం చేస్తుంది.

కాబట్టి సర్వమూ భగవంతుడే. యౌవనమూ ఆయనే. కామవికారమూ ఆయనే.

నీరూ, కాసారమూ, ధనమూ, పరివారమూ, సంసారమూ, తత్త్వమూ, తీసుకొనేదీ, ఇచ్చేదీ

ఇలా అన్నీ ఆయన స్వరూపంగానే భావించి,

సర్వేశ్వరునిగా ఆయనను ధ్యానిస్తే, భవభయం పోతుంది.

ఇదీ తత్త్వం తెలుసుకో, అని శంకర భగవత్పాదులవారి సదుపదేశం.



ఈ తత్త్వం గురించే " ఎన్నడు విజ్ఞానమిక నాకు " అన్నాడు అన్నమయ్య ఒక దశలో.

వినండి.



ఇంగ్లీషు అనువాదం Sivananda Ashram వారి సౌజన్యంతో.

When youthfulness has passed, where is lust and its play?
When water is evaporated, where is the lake?
When the wealth is reduced, where is the retinue?
When the Truth is realised, where is samsara?



శుభం భూయాత్

3 కామెంట్‌లు:

నాగేస్రావ్ చెప్పారు...

ఈరోజే చూసాను, మీ బ్లాగులు బాగున్నాయి, వాటితోటి ఇచ్చిన పాటల లింకులు కూడా! రాస్తూండండి.

Raj చెప్పారు...

చాలా బాగా చెప్పారండీ..
మీ ప్రయత్నం చాలా బాగుందండీ!
చాలా బాగా వ్రాస్తున్నారు.
విశ్లేషణ చాలా తేటగా, తెనిగింపు చేస్తున్నారు.
మీ ప్రయత్నం అభినందనీయం.

నాగస్వరం చెప్పారు...

నాగేస్రావ్ గారికి,

రాజ్ గారికి

కృతజ్ఞతలు.