2, జూన్ 2011, గురువారం

బ్రహ్మపదం

గోవిందం భజ - 12


మా కురు ధనజనయౌవనగర్వం

హరతి నిమేషా త్కాల స్సర్వం,

మాయామయ మిద మఖిలం హిత్వా

బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. 11




" ధనం, పరిజనం, యౌవనం ( వీనివల్ల ఐన గర్వాన్ని చేయకు.) ఉన్నాయని గర్వించకు.

కాలం, రెప్పపాటులో సర్వాన్నీ హరిస్తుంది.

మాయతో నిండిన ఈ సమస్తాన్ని ( సర్వ విషయ సమూహాన్ని ) పరిత్యజించి,

పరమాత్మపదాన్ని ( స్థానాన్ని ) తెలిసి, ఆ బ్రహ్మంతో ఐక్యమొందు. "




నా(గ)స్వ(రం)వ్యాఖ్య: -



శంకరులు, ధనం జనం యౌవనం - ఈ మూడింటిలో గర్వం వద్దంటున్నారు.

అనగా ధనగర్వం, జనగర్వం, యౌవనగర్వం కూడదంటున్నారు.

గర్వం అంటే అహంకారం, అహంభావం, అహం, ఉద్ధతి, ఉబ్బు, ఔద్ధత్యం, కండకావరం,

క్రొవ్వు, గబ్బు, గీర, టెక్కు, దర్పం, పొంగు, పొగరు, బిరుసు, మదం, మిడిసిపాటు.

ఇన్ని పర్యాయపదాలు చెప్పడం ఎందుకు అంటే,

దాని ఔద్ధత్యం బాగా అర్థం అవుతుందని.

విచిత్రం ఏమిటంటే, గర్వానికి కౌరవసంతతి లాగ 101 సమానార్థక పదాలున్నాయి.

గర్వంతో విర్రవీగితే, దుర్యోధనాదుల్లా అవుతారని పై సంఖ్య సూచిస్తోంది కదా!

సరే, విషయంలోకి వస్తే,

" నేను అందరికంటే ఉత్కృష్టుణ్ణి,/,గొప్పవాడిని. తక్కినవారు నాకంటె తక్కువ."

అని తన్ను తాను పూజించుకొని, ఇతరులను అవహేళన చేసే,

చిత్తౌద్ధత్యానికే గర్వం అని పేరు.

పుష్కలంగా ధనం ఉందనో,

( అందువల్లే చేరారని తెలుసుకోలేక ) తన చుట్టూ నిత్యం మూగే జనాన్ని చూసి,

తనకు జనబలం ఉందనో,

( యుక్తాయుక్తవిచక్షణాజ్ఞానం, అనుభవజ్ఞానం తక్కువగా ఉండే వయసని తెలియక )

గొప్పయౌవనం/మంచి ప్రాయం తనకుందనో,

ఇక తిరుగేమిటని విర్రవీగితే, భంగపడక తప్పదు. తర్వాత పతనమవ్వక తప్పదు.

అలాగే కులగర్వం, రూపగర్వం, విద్యాగర్వం, బలగర్వం, మొదలైన గర్వాలు కూడా పనికిరానివని గ్రహించాలి.

ఈ ధనజనయౌవనకులరూపవిద్యాబలాదుల్ని, వాటితో ఏర్పడిన గర్వాల్ని,

చరాల్ని, అచరాల్ని, సర్వప్రపంచాన్ని,

కాలం, నిమిషంలో హరిస్తుంది. మింగేస్తుంది. నాశనం చేస్తుంది.

కాలం కడుపులోకి అన్నీ చేరవలసిందే. ఆపగలిగేవారెవరూ లేరు.

ఈ ప్రపంచం మాయతో నిండినది.

మాయ అంటే, అవిద్య , మోసం, అసత్యం, ఇంద్రజాలం.

విద్య లేకపోవడం అవిద్య. విద్య అంటే జ్ఞానం. అవిద్య = అజ్ఞానం. / తెలియకపోవడం.

ప్రకృతిలో కనబడేదంతా సత్యం, శాశ్వతం అనుకోవడమే మాయ.

ఈ ప్రపంచమంతా మాయగా గుర్తించి, విషయసమూహాన్నివిడిచిపెట్టాలి.

విషయాలు అంటే, పదకొండు ఇంద్రియాలచేత పొందబడేవి.

చర్మం, కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు, - ( 5 జ్ఞానేంద్రియాలు )

వాక్కు, పాణి, ( మనికట్టు మొదలుకొని వ్రేళ్లతో కూడిన చెయ్యి. ) పాదం,

పాయువు, ఉపస్థం ( జననవిసర్జకావయవాలు ) - ( 5 కర్మేంద్రియాలు ) + మనస్సు.

మనస్సు, జ్ఞానేంద్రియాలు కలసి, శబ్ద స్పర్శ రూప రస గంధాలనే విషయాలను,

కర్మేంద్రియాలు ఆయా కర్మలద్వారా ( పేర్లను బట్టి ) ఏర్పడిన విషయాలను

జీవునకు అందిస్తూంటాయి.

ఈ విషయాలే అనేక వాంఛలకు కారణమౌతూంటాయి.

ప్రపంచమంతా ఈ విషయాలతోనే నిండి ఉంది.

ఇంద్రియాలు గుఱ్ఱాలైతే , మనసు వాటిని నడిపించే సారథి. ( డ్రైవర్. )

ప్రయాణం అన్నది డ్రైవర్ ఇష్టమా ? యజమాని ఇష్టమా ?

కాని ఇక్కడ డ్రైవర్ ఇష్టం ప్రకారం జరుగుతోంది.

వినాలంటుంది. చూడాలంటుంది. తాకాలంటుంది. రకరకాల రుచులు కావాలంటుంది.

(సు)వాసనలు ఆఘ్రాణించాలంటుంది. ఇంకా ఏవేవో కావాలి కావాలి అంటుంది మనసు.

మరి ఇది ఎంత విచిత్రం.? దాని మాట వింటే అంతే.

ఇదే తెలుసుకోవాలి.

అందువల్ల అనంతమైన కాలగర్భంలో కలసిపోయే

మాయామయమైన ఈ సమస్త విషయజాలాన్నంతా విడిచిపెట్టి,

శాశ్వతమైన పరబ్రహ్మస్థానమేదో తెలుసుకొని, దాన్ని చేరమని, గురూపదేశం.




ఎంతో రసికుడు దేవుడు అంటూ లోకంలో ప్రతి వస్తువులోనూ,

ప్రియురాల్ని చూసిన రాజారమేశ్, చివరికి,




అన్నాడంటే అదంతా కాలమహిమ.


ఇంగ్లీషు అనువాదం Sivananda Ashram వారి సౌజన్యంతో.

Take no pride in your possession, in the people at your command, in the youthfulness that you have.
Time loots away all these in a moment.
Leaving aside all these, after knowing their illusory nature,
realize the state of Brahman and enter into it.


శుభం భూయాత్

కామెంట్‌లు లేవు: