3, జూన్ 2011, శుక్రవారం

కాలచక్రం

గోవిందం భజ - 13


దినయామిన్యౌ సాయంప్రాత

శ్శిశిరవసంతౌ పున రాయాతః ,

కాలః క్రీడతి గచ్ఛ త్యాయు

స్తదపి న ముంచ త్యాశావాయుః . 12


" రేయింబవళ్లు, మాపువేకువలు, శిశిరవసంతర్తువులు, మళ్లీ మళ్లీ వస్తున్నవి.

(ఈ రీతిగా) కాల( చక్ర )o పరిభ్రమిస్తున్నది. ఆయుస్సు గతిస్తున్నది.

అయినప్పటికీ, ( ఇట్లు ఎన్ని గతిస్తున్నా ),

ఆశ అనే వాయువు మాత్రం విడువలేదు.

( కొంచెం కూడా చలించక ( నిన్ను) ఆశ్రయించుకొనే ఉంది.) "


నా(గ)స్వ(రం)వ్యాఖ్య: -


కాలం పరుగెడుతోంది.

రాత్రి వస్తోంది. పగలవుతోంది.

సాయంకాలం వస్తోంది. ప్రభాతమౌతోంది.

శిశిరం వస్తోంది. వసంతాన్నిచ్చి వెళ్తోంది.

బండిచక్రంలా ఒకదానివెంట ఒకటి వస్తున్నాయి. పోతున్నాయి.

రెప్పపాటుకాలం (నిమిషం) నుంచి,

కాష్ఠ ( 18 రెప్పపాట్లకాలం ) కల ( 30 కాష్ఠలు )

రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, ఋతువులు, సంవత్సరాల దాకా ,

ఇంకా, తెలియనంత అనంతకాలం, చక్రంలా తిరుగుతూంటుంది.

ఈ సందట్లో ఆయువు తగ్గిపోతూంటుంది.

కానీ

నిజమే.

ఆయువు క్షణం క్షణం తరిగిపోతూ, వీడిపోతున్నా,

ఆశ / తృష్ణ అనే వాయువు వదలక, అంటిపెట్టుకొనే ఉంటుంది.

ఈ ఆశ అనేది చాల చెడ్డది.

ఏ విషయం గురించి, ఆశ పట్టుపడుతుందో తెలియదు.

అంటే ఎప్పుడు ఏ విషయం మీద ఆశ జనిస్తుందో తెలియదు.

మోక్షమార్గాభిముఖుడైనవాడిని,

దాట శక్యం కాని ఘోరమైన సంసారం అనే అరణ్యం యొక్క మధ్యభాగంలోకి

త్రోసివెయ్యగల శక్తి ఆశావాయువుకు ఉంది.

అలాంటి ఆశను కోసే శక్తి గోవిందునికి ఉంది.

గోవిందునికే ఉంది.

కాన గోవిందుని భజించు.

అని జగద్గురు శ్రీపరమహంసపరివ్రాజకాచార్య శ్రీమచ్ఛంకరభగవత్పాదులవారి

దివ్యోపదేశం.


ఇంగ్లీషు అనువాదం Sivananda Ashram వారి సౌజన్యంతో.

Day and night, dawn and dusk, winter and spring,
again and again come and depart.
Time sports and life ebbs away.
And yet, one leaves not the gusts of desires.


ద్వాదశమంజరికాభిరశేషః కథితో వైయాకరణస్యైషః,

ఉపదేశో౭భూద్విద్యానిపుణైః శ్రీమచ్ఛంకరభగవచ్చరణైః .


" విద్యానిపుణులైన శ్రీశంకరాచార్యులవారు,

వ్యాకరణశాస్త్రం వల్లె వేస్తున్న వైయాకరణునికి,

ద్వాదశశ్లోకాలనే పూగుత్తులతో ఈ ఉపదేశం చేశారు."


ఇతి శ్రీగురుశంకరవిజయే శ్రీమచ్ఛంకరభగవత్పాద వైయాకరణసంవాదే పరమహంసపరివ్రాజకాచార్యవర్యశ్రీమచ్ఛంకరాచార్యోపదిష్టద్వాదశమంజరికాస్తోత్రం.


మొత్తం 12 శ్లోకాలతో మానవాళిని తరింపజేసిన,

శంకరుల ద్వాదశమంజరికాస్తోత్రం ఇంతటితో సంపూర్ణం.


మీకు గుర్తుందా!

ఆశను వదలమంటూ మొదటిశ్లోకం మొదలుపెట్టిన శంకరులు,

ఆశ వదలదు కాన జాగ్రత్త. గోవింద స్మరణతో ఆశను జయించు. అంటూ ముగించారు.



కేవలం శంకరుల వారి శ్లోకాలు కొన్ని సుబ్బులక్ష్మిగారి మధురగళంలో వినండి.



సర్వేశ్వరుడు ఇతడు. ఒకడే. అన్న అన్నమయ్యసంకీర్తనను విని, సర్వేశ్వరుని భజించండి.

భక్తిసుధారసంలో ఈదులాడండి.




శుభం భూయాత్

1 కామెంట్‌:

Nanduri చెప్పారు...

naagaswaram lo post chestunna slokalu vatiki sulabhmina bhasha lo bhavamu oka ettu ayithe postki taginatluga unna patalu maroka ettu. Thnks to the blogger.